Revised Common Lectionary (Semicontinuous)
ఇశ్రాయేలు దేవుని సొత్తు
19 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: 2 “ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు: నేను మీ దేవుడైన యెహోవాను నేను పవిత్రుణ్ణి కనుక మీరునూ పవిత్రంగా ఉండాలి!
9 “కోతకాలంలో మీరు మీ పంటకోసేప్పుడు, మొత్తం మీ పొలాల మూలవరకు కోసెయ్యకండి. ఒకవేళ గింజలు ఏమైనా నేలమీద పడితే ఆ గింజలు మీరు ఏరుకోగూడదు. 10 మీ ద్రాక్షా తోటల్లో ద్రాక్షాపండ్లన్నీ ఏరుకోవద్దు. నేలమీద పడిన ద్రాక్షపండ్లను ఏరుకోవద్దు. ఎందుచేతనంటే, పేదవాళ్ళ కోసం, మీ దేశంగుండా ప్రయాణం చేసే వాళ్ళకోసమూ మీరు వాటిని విడిచిపెట్టాలి. నేను మీ దేవుడైన యెహోవాను.
11 “మీరు దొంగతనం చేయకూడదు. మీరు ప్రజల్ని మోసం చేయకూడదు. మీరు ఒకరితో ఒకరు అబద్ధం చెప్పకూడదు. 12 నా నామాన్ని ప్రయోగించి దొంగ వాగ్దానాలు చేయకూడదు. మీరు అలా చేస్తే, మీ దేవుని పేరుమీద మీకు భక్తి లేదని మీరు వ్యక్తంచేస్తారు. నేను యెహోవాను.
13 “మీ పొరుగువారికి మీరు కీడు చేయకూడదు. మీరు అతని దగ్గర దోచు కోగూడదు. కూలివాని కూలి మర్నాటి ఉదయం వరకు మీరు బిగబట్టి ఉంచకూడదు.
14 “మీరు చెవిటివారిని శపించకూడదు. గుడ్డివారి యెదుట ఏదీ అడ్డముంచి వారిని పడిపోయే విధంగా చేయకూడదు. కాని నీవు దేవునికి భయపడాలి. నేను యెహోవాను.
15 “తీర్పు విషయంలో మీరు న్యాయంగా ఉండాలి. పేదవాళ్ళకి ప్రత్యేకంగా పక్షపాతం చూపెట్టకూడదు. ప్రముఖులనీ పక్షపాతం చూపెట్ట కూడదు. మీ పొరుగు వారికి తీర్పు చెప్పేటప్పుడు మీరు న్యాయంగా ఉండాలి. 16 మీరు ఇతరులను గూర్చి తప్పడు కథలు వ్యాపింపజేస్తూ తిరగకూడదు. నీ పొరుగువాని ప్రాణానికి అపాయం కలిగించేది ఏదీ చేయవద్దు. నేను యెహోవాను.
17 “నీ సోదరుణ్ణి నీ హృదయంలో కూడా నీవు ద్యేషించకూడదు. ఒకవేళ నీ పొరుగువాడు ఏదైనా తప్పు చేస్తే దాన్ని గూర్చి అతనితో మాట్లాడు. అయితే అతణ్ణి క్షమించు. 18 మనుష్యులు నీకు చేసిన కీడును మరచిపో. వారికి తిరిగి కీడు చేయాలని ప్రయత్నించకు. నిన్ను నీవు ప్రేమించుకొన్నట్టే నీ పొరుగువాణ్ణి ప్రేమించు. నేను యెహోవాను.
హే
33 యెహోవా, నీ న్యాయచట్టాలు నాకు నేర్పించుము.
నేను ఎల్లప్పుడూ వాటికి విధేయుడనౌతాను.
34 గ్రహించుటకు నాకు సహాయం చేయుము.
నేను నీ ఉపదేశాలకు విధేయుడనవుతాను.
నేను వాటికి పూర్తిగా విధేయుడనవుతాను.
35 యెహోవా, నీ ఆజ్ఞల మార్గంలో నన్ను నడిపించు.
నేను నీ ఆజ్ఞలను నిజంగా ప్రేమిస్తున్నాను.
36 నేను ఏ విధంగా ధనికుడను కాగలనో అని తలచుటకు బదులు
నీ ఒడంబడికను గూర్చి తలచుటకు నాకు సహాయం చేయుము.
37 యెహోవా, అయోగ్యమైన విషయాలనుండి నా కళ్లను మరలించుము.
నీ మార్గంలో జీవించుటకు నాకు సహాయం చేయుము.
38 యెహోవా, నేను నీ సేవకుడను కనుక నీవు వాగ్దానం చేసిన వాటిని జరిగించుము.
నిన్ను ఆరాధించే ప్రజలకు నీవు వాటిని వాగ్దానం చేశావు.
39 యెహోవా, నేను భయపడుతున్న అవమానాన్ని తొలగించు.
జ్ఞానం గల నీ నిర్ణయాలు మంచివి.
40 చూడుము, నీ ఆజ్ఞలను నేను ప్రేమిస్తున్నాను.
నా యెడల మంచితనం చూపించి నన్ను బ్రతుకనిమ్ము.
10 దేవుని అనుగ్రహం వల్ల నేను నేర్పుగల నిర్మాణకుడుగా పునాదులు వేసాను. ఇతరులు ఆ పునాదిపై కడుతున్నారు. ప్రతి ఒక్కడూ తానేవిధంగా కడుతున్నాడో గమనిస్తూ జాగ్రత్తగా కట్టాలి. 11 ఆ “పునాది” యేసు క్రీస్తు కనుక ఇదివరకే వేసిన ఆ పునాది తప్ప వేరొక పునాదిని ఎవ్వరూ వేయలేరు.
16 మీరు దేవుని మందిరమని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీకు తెలియదా? 17 కనుక దేవుని మందిరాన్ని నాశనం చేసినవాణ్ణి దేవుడు నాశనం చేస్తాడు. దేవుని మందిరం పవిత్రమైనది. మీరే ఆ మందిరం.
18 మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. ప్రాపంచిక విషయాల్లో తెలివి ఉందని భావించేవాడు మొదట తనను తాను జ్ఞానహీనునిగా ఎంచుకొంటే తర్వాత జ్ఞాని కాగలడు. 19 ఎందుకంటే దేవుడు ఈ ప్రాపంచిక జ్ఞానాన్ని మూర్ఖమైనదానిగా పరిగణిస్తాడు. దీన్ని గురించి లేఖనాల్లో, “తమ చమత్కారము ఉపయోగించే జ్ఞానుల్ని దేవుడు పట్టేస్తాడు”(A) అని వ్రాయబడి ఉంది. 20 మరొకచోట, “జ్ఞానుల ఆలోచనలు పనికిరావని ప్రభువుకు తెలుసు”(B) అని వ్రాయబడి ఉంది. 21 కనుక మానవుల తెలివిని పొగడకండి. అవన్నీ మీవి. 22 పౌలు, అపొల్లో, కేఫా, ప్రపంచము, బ్రతుకు, చావు, ప్రస్తుతము, భవిష్యత్తు అన్నీ మీవి. 23 మీరు క్రీస్తుకు చెందినవారు. క్రీస్తు దేవునికి చెందినవాడు.
కంటికి కన్ను
(లూకా 6:29-30)
38 “‘కంటికి కన్ను, పంటికి పన్ను ఊడ దీయాలి’(A) అని అనటం మీరు విన్నారు. 39 కాని నేను చెప్పేదేమిటంటే దుష్టుల్ని ఆపటానికి ప్రయత్నించకండి. మిమ్మల్ని ఎవరైనా కుడి చెంపమీద కొడితే మీ రెండవ చెంప కూడా అతనికి చూపండి. 40 ఎవరైనా మీపై వ్యాజ్యము వేసి మీ చొక్కాను కూడా లాక్కోవాలని చూస్తే, మీ కండువా కూడా తీసుకు వెళ్ళనివ్వండి. 41 ఎవరైనా మిమ్మల్ని తమతో మైలు దూరం రమ్మని బలవంతం చేస్తే, అతనితో రెండు మైళ్ళు వెళ్ళండి. 42 అడిగిన వాళ్ళకు ఇవ్వండి. మీ దగ్గర అప్పుపుచ్చుకోవాలని అనుకొని వచ్చిన వాళ్ళతో లేదనకండి.
శత్రువులను ప్రేమించు
(లూకా 6:27-28, 32-36)
43 “‘పొరుగింటి వాణ్ణి ప్రేమించండి. శత్రువును ద్వేషించండి’(B) అని చెప్పటం మీరు విన్నారు. 44 కాని నేను చెప్పేదేమిటంటే ‘మీ శత్రువుల్ని ప్రేమించండి[a] మిమ్మల్ని హింసించిన వాళ్ళ కోసం దేవుణ్ణి ప్రార్థించండి.’ 45 అప్పుడు మీరు పరలోకంలో ఉన్న మీ తండ్రికి బిడ్డలౌతారు. ఎందుకంటే దేవుడు చెడ్డవాళ్ళ కోసం, మంచి వాళ్ళ కోసం సూర్యోదయం కలిగిస్తాడు. నీతిమంతుల కోసం, అనీతిమంతుల కోసం వర్షాలు కురిపిస్తాడు. 46 మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళను మీరు ప్రేమిస్తే మీకేం ప్రతిఫలం కలుగుతుంది? పాపులు కూడా అలాచెయ్యటం లేదా? 47 మీ సోదరులకు మాత్రమే మీరు అభివందనాలు చేస్తే యితర్ల కన్నా మీరు ఏం గొప్ప? యూదులుకాని వాళ్ళు కూడా అలా చేస్తారే! 48 పరలోకంలో ఉన్న మీ తండ్రి పరిపూర్ణుడు. మీరును ఆయనలా ఉండాలి.
© 1997 Bible League International