Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
యెషయా 5:1-7

యూదా, దేవుని ద్రాక్షాతోట

ఇప్పుడు నేను నా స్నేహితునికి (దేవుడు) ఒక పాట పాడుతాను. నా స్నేహితునికి తన ద్రాక్షావనం మీద (ఇశ్రాయేలు) ఉన్న ప్రేమను గూర్చిన పాట ఇది.

మంచి సారవంతమైన భూమిలో
    నా స్నేహితునికి ఒక ద్రాక్షతోట ఉంది.
నా స్నేహితుడు పొలం దున్ని, చదును చేశాడు.
    అక్కడ మంచి ద్రాక్ష మొక్కల్ని అతడు నాటాడు.
ఆ పొలం మధ్యలో అతడు ఒక గోపురం కట్టాడు.
    అక్కడ మంచి ద్రాక్షలు పండుతాయని
నా స్నేహితుడు ఎదురు చూశాడు.
    కాని అక్కడ కారు ద్రాక్షలే పండాయి.

కనుక దేవుడు చెప్పాడు: “యెరూషలేములో నివసిస్తున్న ప్రజలారా, ఓ యూదా మనిషి,
    నన్ను గూర్చి, నా ద్రాక్షాతోట గూర్చి ఆలోచించు.
నా ద్రాక్షా తోటకు సహాయపడుటకు ఇంతకంటె ఎక్కువ నేనేం చేయాలి?
    నేను చేయగలిగింది అంతా చేశాను.
మంచి ద్రాక్షలు పండుతాయని నేను ఎదురు చూశాను.
    కానీ కారు ద్రాక్షాలే ఉన్నాయి
    ఎందుకు అలా జరిగింది?

“నా ద్రాక్షాతోటకు నేను ఏమి చేస్తానో ఇప్పుడు నేను మీతో చెబుతాను.
తోటను కాపాడుతోన్న ముళ్ల కంచెను
    నేను లాగివేసి, దాన్ని కాల్చేస్తాను.
దాని రాతి గోడను నేను కూలగొట్టేస్తాను.
    ఆ రాళ్లు కాళ్ల క్రింద తొక్కబడతాయి.
నా ద్రాక్షా తోటను నేను బీడు భూమిగా చేస్తాను.
    దాని మొక్కల్ని ఎవరూ లెక్క చేయరు. ఆ పొలంలో ఎవ్వరూ పని చేయరు.
    కలుపు మొక్కలు, ముళ్లపొదలు అక్కడ పెరుగుతాయి.
ఆ పొలం మీద వర్షించ వద్దని మేఘాలకు నేను ఆజ్ఞాపిస్తాను.”

సర్వశక్తిమంతుడైన యెహోవాకు చెందిన ద్రాక్షాతోట ఇశ్రాయేలు రాజ్యం. యెహోవాకు ప్రియమైన ద్రాక్షావల్లి యూదా మనిషి.[a]

యెహోవా న్యాయం కోసం నిరీక్షించాడు.
    కాని అక్కడ చంపటం మాత్రమే ఉంది.
అంతా లక్షణంగా ఉంటుంది అని యెహోవా నిరీక్షించాడు.
    కానీ అక్కడ బాధించబడిన ప్రజల ఆర్త ధ్వనులే ఉన్నాయి.

కీర్తనలు. 80:7-15

సర్వశక్తిమంతుడవైన దేవా, మరల మమ్మల్ని అంగీకరించుము.
    నీ ముఖము మామీద ప్రకాశించునట్లు మమ్మల్ని రక్షించుము.

గతకాలంలో నీవు మమ్మల్ని ప్రాముఖ్యమైన మొక్కలా చూశావు.
    ఈజిప్టు నుండి నీవు నీ “ద్రాక్షాలత” తీసుకొని వచ్చావు.
ఇతర ప్రజలను ఈ దేశం నుండి నీవు వెళ్లగొట్టావు.
    నీ “ద్రాక్షావల్లిని” నీవు నాటుకొన్నావు.
“ద్రాక్షావల్లి” ఎదుగుటకు నేలను నీవు సిద్ధం చేశావు.
    దాని వేర్లు బలంగా ఎదుగుటకు నీవు సహాయం చేశావు త్వరలోనే “ద్రాక్షావల్లి” దేశం అంతా వ్యాపించింది.
10 అది పర్వతాలను కప్పివేసింది.
    దాని ఆకులు మహాదేవదారు వృక్షాలను సహా కప్పివేసాయి.
11     దాని తీగెలు మధ్యధరా సముద్రం వరకు విస్తరించాయి. దాని కొమ్మలు యూఫ్రటీసు నది వరకూ విస్తరించాయి.
12 దేవా, నీ “ద్రాక్షావల్లిని” కాపాడుతున్న గోడను నీవెందుకు పడగొట్టావు?
    ఇప్పుడు దారిన పోయే ప్రతిమనిషీ దాని ద్రాక్షాపండ్లను కోసుకొంటున్నాడు.
13 అడవి పందులు వచ్చి నీ “ద్రాక్షావల్లి” మీద నడుస్తాయి.
    అడవి మృగాలు వచ్చి ఆకులు తింటాయి.
14 సర్వశక్తిగల దేవా, తిరిగి రమ్ము.
    పరలోకం నుండి నీ “ద్రాక్షావల్లిని” చూడుము. దానిని కాపాడుము.
15 దేవా, నీ స్వంత చేతులతో నీవు నాటుకొన్న నీ “ద్రాక్షావల్లిని” చూడుము.
    నీవు పెంచిన ఆ లేత మొక్కలను[a] చూడుము.

ఫిలిప్పీయులకు 3:4-14

కాని అలాంటి ఆచారాలను విశ్వసించటానికి నాకు కారణాలు ఉన్నాయి. బాహ్యమైన ఈ ఆచారాలను నమ్మటం ముఖ్యమని యితరులు అనుకొంటున్నట్లయితే వాటిని నమ్మటానికి వాళ్ళకన్నా నాకు ఎక్కువ కారణాలు ఉన్నాయి. నేను పుట్టిన ఎనిమిదవ రోజు నాకు సున్నతి చేసారు. నేను బెన్యామీను తెగకు చెందిన వాణ్ణి. పుట్టుకతో ఇశ్రాయేలు దేశస్థుణ్ణి. హెబ్రీయులకు జన్మించిన హెబ్రీయుణ్ణి. ధర్మశాస్త్రాన్ని అనుసరించే పరిసయ్యుణ్ణి. ఉత్సాహంతో సంఘాన్ని హింసించిన వాణ్ణి. ధర్మశాస్త్రాల్లోని నియమాలను పాటించటంలో నేను ఒక్క తప్పు కూడా చేయలేదు.

నేను క్రీస్తు విశ్వాసిని అయినందుకు, ఇదివరలో లాభంగా పరిగణించిన వాటిని నేను ప్రస్తుతం నష్టంగా పరిగణిస్తున్నాను. అంతేకాక, నా ప్రభువైన యేసు క్రీస్తును తెలుసుకోవటం చాలా గొప్ప విషయం. ఆయనతో పోల్చి చూస్తే అన్నీ వృథా అనిపిస్తుంది. ఆయన కొరకు నేను అన్నీ వదిలి వచ్చాను. క్రీస్తును పొందాలని వాటిని చెత్తగా పరిగణిస్తున్నాను. ఆయనలో ఐక్యత పొంది ఉండటమే నా ఉద్దేశ్యము. ధర్మశాస్త్రాన్ని అనుసరించి పొందే నీతి నాకు అనవసరం. క్రీస్తులో విశ్వాసం ఉండటంవల్ల లభించే నీతి నాకు కావాలి. 10 నాకు క్రీస్తును తెలుసుకోవాలని ఉంది. చావునుండి బ్రతికి రాగల శక్తిని గురించి తెలుసుకోవాలని ఉంది. ఆయన పొందిన కష్టాల్లో పాలుపంచుకొని ఆయనతో స్నేహం పొందాలని ఉంది. ఆయనతో మరణించి ఆయనలా అయిపోవాలని ఉంది. 11 ఇవన్నీ చేసి తిరిగి బ్రతికి రావాలని ఉంది. దీన్ని ఏదో ఒక విధంగా సాధించాలని ఉంది.

గమ్యం వైపు పరుగెత్తటం

12 వీటన్నిటిని నేను యింకా సాధించలేదు. నాలో పరిపూర్ణత యింకా కలుగలేదు. కాని క్రీస్తు దేనికోసం నన్ను ఎన్నుకొన్నాడో దాన్ని నేను చేజిక్కించుకోవాలని పట్టుదలతో సాగిపోతున్నాను. 13 సోదరులారా! అది నాకు చిక్కిందని నేను అనుకోవటం లేదు. కాని ఒకటి మాత్రం నేను చేస్తున్నాను. గతాన్ని మరచిపోయి భవిష్యత్తులో ఉన్న దానికోసం కష్టపడుతున్నాను. 14 గమ్యాన్ని చేరుకొని బహుమతి పొందాలని ముందుకు పరుగెత్తుతున్నాను. దేవుడు నేను ఈ గమ్యాన్ని చేరుకోవాలని యేసు క్రీస్తు ద్వారా నన్ను పరలోకం కొరకు పిలిచాడు.

మత్తయి 21:33-46

రైతుల ఉపమానం

(మార్కు 12:1-12; లూకా 20:9-19)

33 “ఇంకొక ఉపమానాన్ని వినండి. ఒక ఆసామి ఉండేవాడు. అతడు ఒక ద్రాక్షతోట నాటాడు. చుట్టూ ఒక గోడ కట్టించి ద్రాక్షరసాన్ని తీయటానికి ఒక గానుగను, తొట్టిని కట్టించాడు. కావలి కాయటానికి ఒక కంచె వేయించాడు. ఆ తర్వాత ఆ ద్రాక్షతోటను కొంతమంది రైతులకు కౌలుకిచ్చి ప్రయాణమై వెళ్ళిపోయాడు. 34 కోతకాలం కాగానే తన సేవకుల్ని ఆ రైతుల దగ్గరకు పంపి తన భాగం తీసుకు రమ్మన్నాడు.

35 “ఆ రైతులు, ఆ సేవకుల్ని పట్టుకొని వాళ్ళలో ఒకణ్ణి కొట్టారు. మరొకణ్ణి చంపారు. మూడవవాణ్ణి రాళ్ళతో కొట్టి చంపారు. 36 ఆ ఆసామి ఈ సారి మొదటి కన్నా యింకా ఎక్కువ మంది సేవకుల్ని పంపాడు. కాని ఆ రైతులు వాళ్ళ పట్ల కూడా అదే విధంగా ప్రవర్తించారు. 37 ఆ ఆసామి ‘నా కుమారుణ్ణి వాళ్ళు గౌరవించవచ్చు!’ అని అనుకొని చివరకు తన కుమారుణ్ణి వాళ్ళ దగ్గరకు పంపాడు.

38 “కాని ఆ రైతులు అతని కుమారుణ్ణి చూసి, ‘ఇతడు వంశోద్ధారకుడు. రండి! ఇతణ్ణి చంపేసి అతని ఆస్థిని తీసుకొందాం’ అని పరస్పరం మాట్లాడుకొన్నారు. 39 ఆ తర్వాత కుమారుణ్ణి పట్టుకొని చంపి ద్రాక్షతోటకవతల పారవేసారు.

40 “మరి ఆ ద్రాక్షతోట యజమాని తిరిగి వచ్చాక ఆ రైతుల్ని ఏమి చేస్తాడంటారు?”

41 వాళ్ళు, “ఆ దుష్టుల్ని ఘోరంగా చంపేస్తాడు. ఆ తదుపరి పంట కాలంలో తన భాగాన్ని తనకిచ్చే రైతులకు ఆ ద్రాక్షతోటను కౌలుకిస్తాడు” అని సమాధానం చెప్పారు.

42 యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “లేఖనాల్లో మీరీ విషయం ఎన్నడూ చదువలేదా?

‘ఇల్లు కట్టువాళ్ళు తృణీకరించిన రాయి ముఖ్యమైన రాయి అయింది.
ఇది ప్రభువు చేసాడు. ఆ రాయి మన కండ్లకు ఆశ్చర్యంగా కనబడుతుంది!’(A)

43 “అందువల్ల నేను చెప్పేదేమిటంటే దేవుడు తన రాజ్యాన్ని మీ నుండి తీసికొని, ఆ రాజ్యానికి తగిన విధంగా ప్రవర్తించే వాళ్ళకు యిస్తాడు. 44 ఈ బండ మీద పడ్డవాడు ముక్కలై పోతాడు. ఎవని మీద ఈ బండ పడ్తుందో అతడు నలిగి పోతాడు.”

45 ప్రధాన యాజకులు, పరిసయ్యులు యేసు చెప్పిన ఉపమానం విని ఆయన తమను గురించి మాట్లాడుతున్నట్టుగా గ్రహించారు. 46 వాళ్ళు ఆయన్ని బంధించటానికి మార్గాన్ని వెతికారు. కాని ప్రజలు ఆయన్ని ఒక ప్రవక్త అని అనుకొనే వాళ్ళు కనుక వాళ్ళు ప్రజల్ని చూసి భయపడి పోయారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International