Old/New Testament
జంతువులను చంపి తినటాన్ని గూర్చిన నియమాలు
17 మోషేతో యెహోవా చెప్పాడు: 2 “అహరోనుతో, అతని కుమారులతో, ప్రజలందరితో ఇలా చెప్పు. 3 ఇదే యెహోవా ఆజ్ఞ అని వారితో చెప్పు: ఇశ్రాయేలు మనిషి ఒకడు ఒక కోడెదూడను లేక గొర్రెపిల్లను, లేక ఒక మేకను బసలోగాని బస వెలుపలగానీ చంపవచ్చును. 4 ఆ వ్యక్తి ఆ జంతువును సన్నిధి గుడార ద్వారం దగ్గరకు తీసుకొని రావాలి. ఆ జంతువుయొక్క ఒక భాగాన్ని యెహోవాకు కానుకగా అతడు అర్పించాలి. ఆ వ్యక్తి దాని రక్తాన్ని చిందించాడు. కనుక అతడు తన కానుకను యెహోవా పవిత్ర గుడారానికి తీసుకొని వెళ్లాలి. ఆ జంతువులో ఒక భాగాన్ని యెహోవాకు కానుకగా అతడు తీసుకొని వెళ్లకపోతే, ఆ వ్యక్తి తన ప్రజల్లోనుండి వేరు చేయబడాలి. 5 ప్రజలు వారి సమాధాన బలిని యెహోవాకు అర్పించేందుకే ఈ నియమం. ఇశ్రాయేలు ప్రజలు పొలాల్లో చంపే జంతువులను కూడా తీసుకొని రావాలి. ఆ జంతువులను సన్నిధి గుడార ద్వారం దగ్గర వారు యెహోవాకు అర్పించాలి. ఆ జంతువులను వారు యాజకుని దగ్గరకు తీసుకొని రావాలి. 6 అప్పుడు ఆ జంతువుల రక్తాన్ని సన్నిధి గుడారం దగ్గర యెహోవా బలిపీఠం మీద యాజకుడు చల్లుతాడు. మరియు ఆ జంతువుల కొవ్వును బలిపీఠం మీద యాజకుడు దహించాలి. ఇది యెహోవాకు ఇష్టమైన సువాసన. 7 వారు వారి ‘మేక పోతు విగ్రహాలకు’ ఇంక ఎలాంటి బలులూ అర్పించకూడదు. ఆ ఇతర దేవుళ్ళను వారు వెంబడిస్తూ వచ్చారు. అలా వారు వ్యభిచారిణుల్లా ప్రవర్తించారు. ఈ నియమాలు ఎప్పటికీ కొనసాగుతాయి.
8 “ప్రజలతో చెప్పు: ఒక ఇశ్రాయేలు పౌరుడు లేక ఒక యాత్రికుడు, లేక మీ మధ్య నివసిస్తున్న ఒక విదేశీయుడు దహన బలిగాని ప్రాయశ్చిత్త బలిగాని అర్పించవచ్చు. 9 ఆ వ్యక్తి తన బలిని సన్నిధి గుడార ద్వారం దగ్గరకు తీసుకొని వెళ్లి అక్కడ దానిని యెహోవాకు అర్పించాలి. ఆ వ్యక్తి యిలా చేయకపోతే, అతడు తన ప్రజల్లోనుండి వేరు చేయబడాలి.
10 “రక్తాన్ని తినే వాళ్లకు నేను విరోధిని. ఆ వ్యక్తి ఇశ్రాయేలు పౌరుడు కావచ్చు లేక మీ మధ్య నివసించే విదేశీయుడు కావచ్చు. ఆ వ్యక్తిని తన ప్రజల్లోనుంచి నేను వేరు చేస్తాను. 11 ఎందుచేతనంటే దేహానికి ప్రాణం రక్తంలోనే ఉంది. ఆ రక్తాన్ని బలిపీఠం మీద ప్రోక్షించే నియమాలు నేను మీకు ఇచ్చాను. మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకొనేందుకు మీరిలా చేయాలి. మీరు తీసిన ప్రాణానికి విలువ చెల్లింపుగా ఆ రక్తాన్ని మీరు నాకు యివ్వాలి. 12 కనుక ఇశ్రాయేలు ప్రజలకు నేను చెప్పేది ఇదే: మీలో ఎవ్వరూ రక్తం తినవద్దు. మీ మధ్య నివసించే ఏ విదేశీయుడూ రక్తం తినకూడదు.
13 “తినదగిన జంతువును లేక పక్షిని ఎవరైనా పట్టుకొంటే, ఆ వ్యక్తి దాని రక్తాన్ని నేలమీద పోసి మట్టితో కప్పివేయాలి. ఆ వ్యక్తి ఇశ్రాయేలు పౌరుడు కావచ్చు లేక మీ మధ్య నివసించే విదేశీయుడు కావచ్చు. 14 మీరెందుకు ఇలా చేయాలి? ఎందుచేతనంటే దాని మాంసంలో ఇంకా రక్తం గనుక ఉంటే, ఆ జంతువు ప్రాణం దాని మాంసంలో ఉంటుంది. కనుక ఇశ్రాయేలు ప్రజలకు నేను ఈ ఆజ్ఞ ఇస్తున్నాను. ఇంకా రక్తంతో ఉన్న మాంసం తినవద్దు. రక్తం తినే ఏవ్యక్తి అయినాసరే తన ప్రజలనుండి వేరు చేయబడాల్సిందే.
15 “మరియు దానంతట అదే చచ్చిన జంతువును తిన్నవాడుగాని, లేక మరో జంతువుచే చంపబడ్డ జంతువును తిన్నవాడుగాని ఆ సాయంత్రం వరకు అపవిత్రుడుగా వుంటాడు. ఆవ్యక్తి తన బట్టలు ఉతుక్కోవాలి. నీళ్లతో పూర్తి స్నానం చేయాలి. ఆ వ్యక్తి ఇశ్రాయేలు పౌరుడు కావచ్చును, లేక మీ మధ్య నివసిస్తున్న విదేశీయుడు కావచ్చును. 16 ఆ వ్యక్తి తన బట్టలు ఉతుక్కోక పోయినా, స్నానం చేయకపోయినా అతడు పాపం చేత దోషిగా ఉంటాడు.”
లైంగిక సంబంధాల నియమాలు
18 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు 2 “ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు: నేను యెహోవాను, మీ దేవుణ్ణి. 3 గతంలో మీరు ఈజిప్టులో జీవించారు. ఆ దేశంలో జరిగించిన వాటిని మీరు ఇప్పుడు చేయకూడదు. నేను మిమ్మల్ని కనానుకు నడిపిస్తున్నాను. ఆ ప్రజల ఆచారాలను పాటించవద్దు. 4 మీరు నా నియమాలకు విధేయులై, నా ఆజ్ఞలను పాటించాలి. ఎందుచేతనంటే నేను మీ దేవుడైన యెహోవాను గనుక. 5 అందుచేతనే మీరు నా ఆజ్ఞలను నియమాలను పాటించాలి. నా ఆజ్ఞలకు నియమాలకు విధేయుడయ్యే వ్యక్తి జీవిస్తాడు! నేనే యెహోవాను.
6 “నీ రక్తసంబంధులతో నీవు ఎన్నడూ లైంగిక సంబంధం కలిగి ఉండకూడదు. నేను యెహోవాను.
7 “నీ తండ్రితో, నీ తల్లితో నీవు ఎన్నడూ లైంగిక సంబంధం కలిగి ఉండకూడదు. ఆమె నీ తల్లి, ఆమెతో నీవు లైంగిక సంబంధము కలిగి ఉండకూడదు. 8 నీ తండ్రి యొక్క ఏ భార్యతో (ఆమె నీ తల్లి కానప్పటికీ) నీవు లైంగిక సంబంధం కలిగి ఉండకూడదు. నీ తండ్రి యొక్క ఏ భార్యతోనైనా నీ తండ్రికి మాత్రమే లైంగిక సంబంధాలు ఉండాలి.
9 “నీ తండ్రి కుమార్తె లేక నీ తల్లి కుమార్తె నీకు సోదరి, ఆమెతో నీకు లైంగిక సంబంధాలు ఉండ కూడదు. నీ సోదరి నీ యింట పుట్టినా, లేక మరోచోట పుట్టినా సరే.
10 “నీ మనుమరాలితో నీకు లైంగిక సంబంధాలు ఉండకూడదు. ఆ పిల్లలు నీలో ఒక భాగం.
11 “నీ తండ్రికి తల్లికి ఒక కుమార్తె ఉంటే, ఆమె నీ సోదరి. ఆమెతో నీకు లైంగిక సంబంధాలు ఉండకూడదు.
12 “నీ తండ్రి సోదరితో నీకు లైంగిక సంబంధాలు ఉండకూడదు. ఆమె నీ తండ్రి రక్త సంబంధీకురాలు. 13 నీ తల్లి సోదరితో నీకు లైంగిక సంబంధాలు ఉండకూడదు. ఆమె నీ తల్లి రక్తసంబంధీకురాలు. 14 నీ తండ్రి సోదరుని భార్యతో నీకు లైంగిక సంబంధాలు ఉండకూడదు. అనగా నీ పినతండ్రి భార్యతో నీకు లైంగిక సంబంధాలు ఉండకూడదు. ఆమె నీ పినతల్లి.
15 “నీ కోడలితో నీకు లైంగిక సంబంధాలు ఉండకూడదు. ఆమె నీ కుమారుని భార్య. ఆమెతో నీకు లైంగిక సంబంధాలు ఉండకూడదు.
16 “నీ సోదరుని భార్యతో నీకు లైంగిక సంబంధాలు ఉండకూడదు. నీ సోదరుడు మాత్రమే తన భార్యతో లైంగిక సంబంధాలు కలిగి ఉండాలి.
17 “తల్లి, కూతుళ్లతో నీకు లైంగిక సంబంధాలు ఉండకూడదు. ఆ తల్లి మనుమరాలితో నీకు లైంగిక సంబంధాలు ఉండకూడదు. ఈ మనుమరాలు ఆ తల్లి కుమారుని బిడ్డ కావచ్చు, కుమార్తె బిడ్డ కావచ్చు. ఆమె మనుమరాళ్లు ఆమె రక్తసంబంధీకులు. వారితో లైంగిక సంబంధాలు కలిగి ఉండటం తప్పు.
18 “నీ భార్య బతికి ఉండగా, ఆమె సోదరిని నీకు మరో భార్యగా చేసుకోకూడదు. దీని మూలంగా అక్క చెల్లెళ్లు విరోధులవుతారు. నీ భార్య సోదరితో నీకు లైంగిక సంబంధాలు ఉండకూడదు.
19 “మరియు ఒక స్త్రీకి నెలసరి రక్తస్రావం అవుతున్నప్పుడు, లైంగిక సంబంధాలకోసం నీవు ఆమె చెంతకు పోకూడదు. ఈ సమయంలో ఆమె అపవిత్రంగా ఉంటుంది.
20 “నీ పొరుగువాని భార్యతో నీకు లైంగిక సంబంధాలు ఉండకూడదు. దీని మూలంగా నీవు అపవిత్రం అవుతావు.
21 “మోలెకు[a] కోసం నీ పిల్లల్లో ఎవరినీ అగ్నిగుండం దాటనియ్యకూడదు. ఒకవేళ నీవు అలా చేస్తే, నీ దేవుని నామం అంటే నీకు గౌరవం లేదని నీవు చూపించినట్టే, నేనే యెహోవాను.
22 “ఒక స్త్రీతో ఉన్నట్టు పురుషునితో నీకు లైంగిక సంబంధాలు ఉండకూడదు. అది భయంకర పాపం!
23 “ఏ జంతువుతోను నీకు లైంగిక సంబంధాలు ఉండకూడదు. దీని మూలంగా నీవు అపవిత్రం అవుతావు. అలాగే స్త్రీ జంతువుతో లైంగిక సంబంధాలు కలిగి ఉండకూడదు. అది సృష్టి విరుద్ధం!
24 “అలాంటి వాటిలో దేనిమూలంగాను మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకోవద్దు. నేను జనాలను వారి దేశాలనుండి వెళ్లగొట్టి, వారి దేశాలను నేను మీకు యిస్తున్నాను. ఎందుచేతనంటే ఆ ప్రజలు ఆ చెడుకార్యాలు చేసారు. 25 కనుక దేశం మైలపడిపోయింది. అలాంటి కార్యాలతో ఇప్పుడు దేశం రోగభూయిష్టమయింది. మరియు అక్కడ నివసించిన ప్రజలను ఆ దేశం ఇప్పుడు వెళ్లగొడుతుంది!
26 “కనుక మీరు నా ఆజ్ఞలకు, నియమాలకు విధేయులు కావాలి. ఆ భయంకర పాపాలు ఏవీ మీరు చేయకూడదు. ఇశ్రాయేలు పౌరులకు, మీ మధ్య నివసించే ప్రజలకు నియమాలు యివి. 27 ఆ దేశంలో మీకు ముందు నివసించిన ప్రజలు ఆ భయంకర సంగతులన్నీ జరిగించారు. అందుచేత దేశం మైలపడింది. 28 మీరూ ఈ పనులు చేస్తే, మీరూ ఆ దేశాన్ని మైల చేస్తారు. మరియు మీకంటె ముందు అక్కడ ఉన్న వాళ్ళను వెళ్ళగొట్టినట్లు అది మిమ్మల్ని కూడ వెళ్ళగొడుతుంది. 29 ఏ వ్యక్తి గాని ఈ దారుణ పాపాలలో దేనినైనా జరిగిస్తే, ఆ వ్యక్తి తన ప్రజల్లోనుండి వేరు చేయబడాలి. 30 ఇతరులు ఆ భయంకర పాపాలు చేశారు. కాని మీరు మాత్రం నా ఆజ్ఞలకు విధేయులు కావాలి. ఆ భయంకర పాపాలేవీ మీరు చేయకూడదు. ఆ భయంకర పాపాలతో మిమ్మల్ని మీరు మైల చేసుకోవద్దు. నేను యెహోవాను, మీ దేవుణ్ణి.”
భటులు యేసును ఎగతాళి చెయ్యటం
(మార్కు 15:16-20; యోహాను 19:2-3)
27 ఆ తర్వాత రాష్ట్రపాలకుని సైనికులు యేసును కోటకు తీసుకు వెళ్ళారు. దళానికి చెందిన సైనికులందరూ ఆయన చుట్టూ చేరారు. 28 ఆయన దుస్తుల్ని విప్పి, ఎఱ్ఱ రంగుగల ఒక పొడుగాటి వస్త్రాన్ని ఆయనకు తొడిగించారు. 29 ముళ్ళతో ఒక కిరీటాన్ని అల్లి ఆయన తలపై పెట్టారు. ఆయన కుడి చేతికి ఒక బెత్తాన్నిచ్చారు. ఆయన ముందు మోకరిల్లి నమస్కరిస్తూ, “యూదుల రాజా! జయము” అని హేళన చేసారు. 30 ఆయన మీద ఉమ్మివేసారు. బెత్తాన్ని తీసుకొని దాంతో ఆయన తలపై కొట్టారు. 31 ఆయన్ని హేళన చేసాక ఆ పొడుగాటి వస్త్రాన్ని తీసేసి ఆయన దుస్తుల్ని ఆయనకు తొడిగించారు. ఆ తదుపరి ఆయన్ని సిలువకు వెయ్యటానికి తీసుకెళ్ళారు.
యేసుని సిలువకు వేయటం
(మార్కు 15:21-32; లూకా 23:26-39; యోహాను 19:17-19)
32 వాళ్ళు బయటికి వెళ్తూండగా కురేనే పట్టణానికి చెందిన సీమోను అనేవాడు కనిపించాడు. అతణ్ణి బలవంతం చేసి యేసు సిలువను మొయ్యమన్నారు. 33 వాళ్ళు గొల్గొతా అనే స్థలాన్ని చేరుకున్నారు. (గొల్గొతా అంటే “పుర్రెలాంటి స్థలం” అని అర్థం.) 34 అక్కడ చేదుకలిపిన ద్రాక్షరసాన్ని యేసుకు త్రాగటానికి యిచ్చారు. కాని రుచి చూసాక దాన్ని త్రాగటానికి ఆయన నిరాకరించాడు.
35 ఆయన్ని సిలువకు వేసాక ఆయన దుస్తుల్ని చీట్లువేసి పంచుకున్నారు.[a] 36 సైనికులు కూర్చొని ఆయనకు కాపలా కాశారు. 37 ఆయనపై ఆరోపించిన, “ఇతడు యూదుల రాజు” అన్న నేరాన్ని వ్రాసి ఆయన తలపై భాగాన ఉంచారు.
38 ఆ తదుపరి ఆయనతో పాటు దోపిడి దొంగలిద్దర్ని ఒకణ్ణి కుడివైపు, మరొకణ్ణి ఎడమ వైపు సిలువకు వేసారు. 39 ఆ దారిన వెళ్ళిన వాళ్ళు తమ తలలాడిస్తూ ఆయన్ని దూషిస్తూ 40 “దేవాలయాన్ని నాశనం చేసి మూడు రోజుల్లో పునర్నిర్మాణం చేయగల వాడివి! నిన్ను నీవు రక్షించుకో. నీవు దేవుని కుమారుడవైతే ఆ సిలువ నుండి దిగిరా!” అని అన్నారు.
41 ప్రధానయాజకులు శాస్త్రులతో, పెద్దలతో కలసి ఆయన్ని అదే విధంగా హేళన చేస్తూ, 42 “అతడు యితరులను రక్షిస్తాడు. కాని తనను తాను రక్షించుకోలేడు. అతడు ఇశ్రాయేలు ప్రజలకు రాజైనట్లయితే ఆ సిలువ నుండి క్రిందికి దిగిరానీ. అప్పుడతణ్ణి విశ్వసిస్తాము. 43 అతడు దేవుణ్ణి విశ్వసిస్తాడు, ‘నేను దేవుని కుమారుణ్ణి’ అని అన్నాడు. దేవునికి కావలసివస్తే అతణ్ణి రక్షించుకోమనండి” అని అన్నారు. 44 ఆయనతో సహా సిలువకు వేయబడిన దోపిడి దొంగలు కూడా ఆయన్ని అదేవిధంగా అవమానించారు.
యేసు మరణం
(మార్కు 15:33-41; లూకా 23:44-49; యోహాను 19:28-30)
45 మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటలదాకా ఆ దేశమంతా చీకటి వ్యాపించింది. 46 సుమారు మూడు గంటలప్పుడు యేసు బిగ్గరగా, “ఏలీ! ఏలీ! లామా సబక్తానీ?” అని కేక వేసాడు. అంటే, “నా దైవమా! నా దైవమా! నన్నెందుకు ఒంటరిగా ఒదిలివేసావు?”(A) అని అర్థం.
47 అక్కడ నిల్చున్న వాళ్ళు కొందరు ఇది విని, “అతడు ఏలీయాను పిలుస్తున్నాడు” అని అన్నారు.
48 ఒకడు వెంటనే పరుగెత్తుకొంటూ వెళ్ళి ఒక స్పాంజి తెచ్చాడు. దాన్ని పులిసిన ద్రాక్షారసంలో ముంచి ఒక బెత్తానికి పెట్టి యేసుకు త్రాగటానికి యిచ్చాడు. 49 కాని యితర్లు, “ఆగండి! అతణ్ణి రక్షించటానికి ఏలీయా వస్తాడేమో చూద్దాం!” అని అన్నారు.
50 యేసు మళ్ళీ ఒక మారు పెద్ద కేక వేసి తన ప్రాణం వదిలి వేసాడు.
© 1997 Bible League International