Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
యెషయా 30-31

ఇశ్రాయేలు దేవుణ్ణి నమ్మాలి, కాని ఈజిప్టును కాదు

30 యెహోవా చెప్పాడు, “ఈ పిల్లల్ని చూడండి. వాళ్లు నాకు లోబడరు. వాళ్లు పథకాలు వేస్తారు గాని సహాయం చేయమని నన్ను అడగరు. ఇతర దేశాలతో వారు ఒడంబడికలు చేసుకుంటారు. కానీ నా ఆత్మ ఆ ఒడంబడికలను కోరటంలేదు. ఈ ప్రజలు ఇంకా మరిన్ని పాపాలు వారికి చేర్చుకొంటున్నారు. ఈ ప్రజలు సహాయం కోసం ఈజిప్టుకు దిగివెళ్తున్నారు కానీ చేయాల్సిన సరైన పని అదేనా అని వారు నన్ను అడగలేదు. ఫరోచేత తాము రక్షించబడతామని వారు నిరీక్షిస్తున్నారు. వాళ్లను ఈజిప్టు కాపాడాలని వారి కోరిక.

“అయితే నేను మీకు చెబుతున్నాను, ఈజిప్టులో దాగుకోవటం మీకేం సహాయపడదు. ఈజిప్టు మిమ్మల్ని కాపాడజాలదు. మీ నాయకులు సోయనుకు వెళ్లారు, మీ రాయబారులు హానేసుకు వెళ్లారు. కానీ వారు నిరాశ చెందుతారు. వారికి సహాయం చేయలేని దేశం మీద వారు ఆధారపడ్తున్నారు. ఈజిప్టు నిష్ప్రయోజనమయింది. ఈజిప్టు ఏ సహాయం చేయలేదు. ఈజిప్టు కేవలం సిగ్గు, అవమానం కలిగిస్తుంది.”

యూదాకు దేవుని సందేశం

నెగెవ్‌లో జంతువులను గూర్చి విచారకరమైన సందేశం:

నెగెవ్ ప్రమాదకరమైన స్థలం. ఈ దేశంనిండా సింహాలు, సివంగులు, తాపకరమైన త్రాచుపాములు ఉంటాయి. కానీ కొంతమంది ప్రజలు నెగెవ్‌గుండా ప్రయాణం చేస్తున్నారు. వారు ఈజిప్టు వెళ్తున్నారు. ఆ మనుష్యులు వారి ధనాన్ని గాడిదల మీద వేశారు. ఆ మనుష్యులు వారి సంపదలను ఒంటెల మీదవేశారు. అంటే ఆ ప్రజలు సహాయం చేయలేని రాజ్యంమీద ఆధారపడుతున్నారని దీని అర్థం. ఈజిప్టు పనికిమాలిన దేశం, సహాయం శూన్యం. కనుక ఈజిప్టును, “ఏమీ చేయలేని మహా సర్పం” అని నేను పిలుస్తాను.

ఇప్పుడు, ప్రజలందరూ చూడగలిగేట్టు దీనిని ఒక పలక మీద వ్రాయి. దీనిని ఒక గ్రంథంలో వ్రాయి. చివరి దినాలకోసం దీనిని వ్రాయి. అది ఎప్పుడో భవిష్యత్తులో చాలాకాలం తర్వాత.

తల్లిదండ్రులకు విధేయులు కాని పిల్లల్లా ఉన్నారు ఈ ప్రజలు. వారు అబద్ధాలు చెప్పి, యెహోవా ఉపదేశాలు ఆలకించేందుకు నిరాకరిస్తారు. 10 వారు ప్రవక్తలతో చెబుతారు: “మేము చేయాల్సిన వాటిని గూర్చి దర్శనాలు చూడకండి. మాతో సత్యం చెప్పకండి. మాకు చక్కని విషయాలు చెప్పి, మాకు హాయి కలిగించండి. మాకోసం మంచి వాటినే చూడండి. 11 నిజంగానే జరిగే వాటిని చూడటం మానేయండి. మా దారిలోంచి తప్పుకోండి. ఇశ్రాయేలీయుల పరిశుద్ధుని గూర్చి మాకు చెప్పటం చాలించండి.”

యూదా సహాయం కేవలం దేవుని నుంచి వస్తుంది

12 ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు (దేవుడు) చెబుతున్నాడు: “యెహోవా నుండి వచ్చిన ఈ సందేశాన్ని అంగీకరించటానికి మీరు నిరాకరించారు. మీ సహాయం కోసం మీరు పోరాటం మీద, అబద్ధాల మీద ఆధారపడాలని కోరుకొంటున్నారు. 13 ఈ విషయాల్లో మీరు దోషులు గనుక మీరు బీటలు వారిన గోడల్లా ఉన్నారు. ఆ గోడ పడిపోయి చిన్న చిన్న ముక్కలైపోతుంది. 14 ఆ ముక్కలు పనికిమాలినవి. ఆ ముక్కలు మంటల్లోంచి ఒక నిప్పుకణం తెచ్చేందుకు పనికిరావు, చెరువులోంచి నీళ్లు తెచ్చేందుకు పనికిరావు.”

15 “మీరు తిరిగి నా దగ్గరకు వస్తే మీరు రక్షించబడుతారు. మీరు నన్ను విశ్వసిస్తే, మీకు ఉన్న ఒకే బలం మీకు వస్తుంది. అయితే మీరు మౌనంగా ఉండాలి” అంటున్నాడు ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు, యెహోవా, నా ప్రభువు.

కానీ అలా చేయటం మీకు ఇష్టం లేదు. 16 మీరు “మేము ఎక్కి పారిపోయేందుకు మాకు గుర్రాలు అవసరం” అంటారు. అది నిజమే, మీరు గుర్రాల మీద పారిపోతారు. కానీ శత్రువు మిమ్మల్ని తరుముతాడు. మరియు మీ గుర్రాలకంటె మీ శత్రువు వేగం ఎక్కువ. 17 ఒక శత్రువు బెదిరిస్తే, మీ వాళ్లు వేయిమంది పారిపోతారు. శత్రువులు అయిదుగురు బెదిరిస్తే, మీరు మొత్తం వారినుండి పారిపోతారు. మీ సైన్యంలో మిగిలేదల్లా, ఏదో ఒక కొండమీద జెండా కర్ర మాత్రమే.

దేవుడు తన ప్రజలకు సహాయం చేస్తాడు

18 యెహోవా మీకు తన దయ చూపించాలని కోరుతున్నాడు. యెహోవా కనిపెడ్తున్నాడు. యెహోవా లేచి, మిమ్మల్ని ఆదరించాలని కోరుతున్నాడు. యెహోవా దేవుడు న్యాయవంతుడు, యెహోవా సహాయం కోసం వేచి ఉండే ప్రతి వ్యక్తి ఆశీర్వదించబడతాడు.

19 యెహోవా ప్రజలు సీయోను కొండమీద యెరూషలేములో నివసిస్తారు. మీరు ఏడుస్తూనే ఉండరు. యెహోవా మీ ఏడ్పువింటాడు, ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు. యెహోవా మీ మొర వింటాడు. ఆయన మీకు సహాయం చేస్తాడు.

20 గతంలో నా ప్రభువు (దేవుడు) మీకు దుఃఖం, విచారం ఇచ్చాడు. అది మీరు ప్రతిరోజూ రొట్టెతిన్నట్లు నీళ్లు తాగినట్టుగా ఉండేది. అయితే, దేవుడు మీ ఉపదేశకుడు, ఆయన ఇకమీదట మీనుండి దాగు కొని ఉండడు. మీ ఉపదేశకుని మీరు మీ కళ్లారా చూస్తారు. 21 అప్పుడు మీరు తప్పుచేసి, తప్పు మార్గంలో పోతే (కుడికి కావచ్చు, ఎడమకు కావచ్చు) “ఇదే సరైన మార్గం, మీరు ఇలా వెళ్లాలి” అని ఒక స్వరం మీ వెనుకనుండి చెప్పటం మీరు వింటారు.

22 వెండి బంగారాల పూత విగ్రహాలు మీకు ఉన్నాయి. ఆ తప్పుడు దేవుళ్లు మిమ్మల్ని మైల (పాప భూయిష్టం) చేశారు. కానీ ఆ తప్పుడు దేవుళ్లను కొలవటం మీరు చాలిస్తారు. పనికిమాలిన మైలగుడ్డల్లా ఆ దేవుళ్లను మీరు పారవేస్తారు.

23 ఆ కాలంలో యెహోవా మీకు వర్షం పంపిస్తాడు. భూమిలో మీరు విత్తనాలు నాటుతారు, భూమి మీకు పంట పండిస్తుంది. మీకు విస్తారమైన పంట లభిస్తుంది. మీ పశువులకు మీ పొలాల్లో విస్తారమైన మేత ఉంటుంది. మీ గొర్రెలకు విశాలమైన బీళ్లు ఉంటాయి. 24 మీ పశువులకు, గాడిదలకు కావలసినంత ఆహారం ఉంటుంది. ఆహారం సమృద్ధిగా ఉంటుంది. మీ పశువులు తినే మేతను పరచేందుకు మీరు చేటను, జల్లెడను ఉపయోగించాల్సి వస్తుంది. 25 ప్రతి పర్వతం, కొండపైన నీటి వాగులు నిండుగా ప్రవహిస్తాయి. అనేక మంది ప్రజలు మరణించిన తర్వాత గోపురాలు కూలగొట్టబడిన తర్వాత ఈ సంగతులు జరుగుతాయి.

26 ఆ సమయంలో చంద్రకాంతి సూర్యకాంతిలా ప్రకాశిస్తుంది. సూర్యకాంతి ఇప్పటికంటె ఏడు రెట్లు ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటుంది. ఒక్కరోజు సూర్య కాంతి నిండు వారపు కాంతిలా ఉంటుంది. యెహోవా తన ప్రజల గాయాలను కట్టి, వారు తిన్న దెబ్బల బాధను స్వస్థపరచిన తరువాత ఈ సంగతులు జరుగుతాయి.

27 చూడండి! చాలా దూరం నుండి యెహోవా పేరు వస్తోంది. ఆయన కోపం దట్టమైన పొగ మేఘాలతో కూడిన అగ్నిలా ఉంది. యెహోవా నోరు కోపంతో నిండి ఉంది, ఆయన నాలుక మండుతోన్న మంటలా ఉంది. 28 యెహోవా ఊపిరి (ఆత్మ) గొంతు వరకు పొంగిన మహా నదిలా ఉంది. యెహోవా రాజ్యాలకు తీర్పు తీరుస్తాడు. “నాశనం చేసే జల్లెడలో” ఆయన వారిని జల్లించినట్లు ఉంటుంది. యెహోవా వారిని అదుపులో ఉంచుతాడు. ఒక జంతువును అదుపులో ఉంచే కళ్లెం, మనుష్యుల దవడల్లో ఉంచినట్టుగా అది ఉంటుంది.

29 ఆ సమయంలో మీరు ఆనందగీతాలు పాడుతారు. ఆ సమయంలో మీరు ఒక పండుగ ప్రారంభించిన రాత్రిలా ఉంటుంది. యెహోవా పర్వతానికి నడిచేటప్పుడు మీరు ఎంతో సంతోషిస్తారు. ఇశ్రాయేలీయుల బండ యెహోవాను ఆరాధించేందుకు వెళ్లే మార్గంలో పిల్లనగ్రోవి వినేటప్పుడు మీరు ఎంతగానో సంతోషిస్తారు.

30 యెహోవా ప్రజలంతా తన మహా స్వరం ఆలకించేట్టు చేస్తాడు. యెహోవా తన శక్తిగల హస్తం కోపంగా దిగి రావటం ప్రజలంతా చూచేట్టుగా చేస్తాడు. ఆ హస్తం సమస్తం కాల్చివేసే మహా మంటలా ఉంటుంది, విస్తారమైన వడగండ్లు, వర్షంతో నిండిన గొప్ప తుఫానులా ఉంటుంది యెహోవా శక్తి. 31 అష్షూరు యెహోవా స్వరం విన్నప్పుడు భయపడుతాడు. యెహోవా అష్షూరును దండంతో కొడతాడు. 32 యెహోవా అష్షూరును కొడతాడు, అది డప్పుల మీద, సితార మీద సంగీతం వాయించినట్టుగా ఉంటుంది. యెహోవా తన గొప్ప హస్తంతో అష్షూరును ఓడిస్తాడు.

33 తోపెతు చాలాకాలంగా సిద్ధం చేయబడి ఉంది. అది రాజుకోసం సిద్ధంగా ఉంది. అది చాలా లోతుగా వెడల్పుగా చేయబడింది. అక్కడ చాలా పెద్దగా కట్టెలు పేర్చి ఉన్నాయి. అగ్ని ఉంది. మరియు యెహోవా ఊపిరి (ఆత్మ) అగ్ని గంధక ప్రవాహంలా వచ్చి, దానిని కాల్చివేస్తుంది.

ఇశ్రాయేలు దేవుని శక్తిమీద ఆధార పడాలి

31 సహాయం కోసం ఈజిప్టుకు దిగి వెళ్తున్న ఆ ప్రజలను చూడండి. ప్రజలు గుర్రాల కోసం అడుగుతున్నారు. గుర్రాలు వారిని రక్షిస్తాయని వారనుకొంటున్నారు. ఈజిప్టు రథాలు, గుర్రాలపై సైనికులు వారిని కాపాడుతారని ఆ ప్రజలు నిరీక్షిస్తున్నారు. ఆ సైన్యం చాలా పెద్దది. కనుక వారు క్షేమంగా ఉన్నాం అని ప్రజలు అనుకొంటున్నారు. ఇశ్రాయేలీయుల పరిశుద్ధుని (దేవుడు) ప్రజలు విశ్వసించటం లేదు. ప్రజలు సహాయం కోసం యెహోవాను అడుగుట లేదు. అయితే జ్ఞానం గలవాడు యెహోవాయే. మరియు వారికి కష్టం రప్పించేవాడూ యెహోవాయే. యెహోవా ఆదేశాన్ని ప్రజలు మార్చజాలరు. యెహోవా లేచి దుష్టుల (యూదా) మీద పోరాడుతాడు. వారికి సహాయం చేయాలని ప్రయత్నించే వారి (ఈజిప్టు) మీద యెహోవా పోరాడుతాడు.

ఈజిప్టు ప్రజలు కేవలం మానవమాత్రులే, దేవుడు కారు. ఈజిప్టు గుర్రాలు కేవలం జంతువులే, ఆత్మలు కావు. యెహోవా తన హస్తం చాపగా, సహాయకుడు (ఈజిప్టు) ఓడించబడతాడు. సహాయం కోరిన ప్రజలు (యూదా) పతనం అవుతారు. ఆ మనుష్యులంతా ఒక్కుమ్మడిగా నాశనం చేయబడతారు.

“ఒక సింహంగాని, సింహపు పిల్లగాని తినటానికి ఒక జంతువును పట్టుకొంటే, ఆ సింహం, చచ్చిన జంతువు మీద నిలబడి గర్జిస్తుంది. ఆ సమయంలో ఆ గొప్ప సింహాన్ని ఏదీ భయపెట్టలేదు. మనుష్యులు వచ్చి, సింహం మీద కేకలు వేస్తే, సింహం భయపడదు. మనుష్యులు పెద్ద ధ్వని చేయవచ్చు కానీ సింహం మాత్రం పారిపోదు” అని యెహోవా నాతో చెప్పాడు.

అదే విధంగా సర్వశక్తిమంతుడైన యెహోవా సీయోను కొండమీద దిగివస్తాడు. ఆ కొండ మీద యెహోవా పోరాడతాడు. పక్షులు వాటి గూళ్ల చుట్టూ ఎగిరినట్టు, సర్వశక్తిమంతుడైన యెహోవా యెరూషలేమును కాపాడుతాడు. యెహోవా దానిని రక్షిస్తాడు. యెహోవా “దానిపై దాటి”, యెరూషలేమును రక్షిస్తాడు.

ఇశ్రాయేలీయులారా, మీరు దేవుని మీద తిరుగుబాటు చేశారు. మీరు తిరిగి దేవుని దగ్గరకు రావాలి. మీరు తయారు చేసిన వెండి, బంగారు విగ్రహాలను ప్రజలు పూజించటం అప్పుడు మాని వేస్తారు. మీరు ఆ విగ్రహాలను తయారు చేసినప్పుడు మీరు నిజంగా పాపం చేసారు.

నిజమే, అష్షూరు ఖడ్గం చేత ఓడించబడుతుంది, కానీ ఆ ఖడ్గం మానవ ఖడ్గం కాదు. అష్షూరు ఓడించబడుతుంది. కానీ ఆ నాశనం మనిషి ఖడ్గం ద్వారా జరగదు. అష్షూరు దేవుని ఖడ్గం నుండి పారిపోతుంది. కానీ యువకులు పట్టుబడి, బానిసలవుతారు. వారి భద్రతా స్థలం నాశనం చేయబడుతుంది. వారి నాయకులు ఓడించబడి, వారి పతాకాన్ని విడిచిపెడ్తారు.

ఆ విషయాలన్నీ యెహోవా చెప్పాడు. యెహోవా అగ్ని (బలిపీఠం) సీయోను మీద ఉంది. యెహోవా కొలిమి (బలిపీఠం) యెరూషలేములో ఉంది.

ఫిలిప్పీయులకు 4

చివరి సలహా

నా ప్రియమైన సోదరులారా! మిమ్మల్ని చూడాలని నాకు ఎంతో ఆత్రుతగా ఉంది. మీరు నాకు చాలా ఆనందం కలిగించారు. మీ విషయంలో నేను చాలా గర్విస్తుంటాను. ప్రియ మిత్రులారా! ప్రభువును అనుసరించటం మానుకోకండి.

యువొదియ, సుంటుకే అనేవాళ్ళు ప్రభువు విశ్వాసులు కనుక వాళ్ళు పరస్పరం ఒక అంగీకారానికి రావాలని అర్థిస్తున్నాను. నిజమైన జత పనివాడా! నీవు నాతో కలిసి పని చేసావు. నీవు నమ్మకంగా పని చేసేవాడవని నాకు తెలుసు. ఈ స్త్రీలకు సహాయం చేయి. దైవసందేశాన్ని ప్రకటించటంలో వీళ్ళు క్లెమెంతుతోను, మరియు మిగతావాళ్ళతోను కలిసి నా పక్షాన నిలిచారు. ఈ మిగతావాళ్ళ పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి.

అన్ని వేళలందును మీరు ప్రభువునందు ఆనందించండి, మళ్ళీ చెపుతున్నాను. ప్రభువునందు ఆనందించండి.

మీరు దయగలవాళ్ళనే పేరు పొందాలి. ప్రభువు త్వరలో రానున్నాడు. ఏ విషయంలో చింతలు పెట్టుకోకండి. ప్రతిసారి ప్రార్థించి మీ కోరికల్ని దేవునికి తెలుపుకోండి. కృతజ్ఞతా హృదయంతో అడగండి. దేవుడు యిచ్చే శాంతిని ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. అది మీ హృదయాలను, మీ బుద్ధిని, యేసు క్రీస్తులో ఉంచి కాపలాకాస్తుంది.

కనుక సోదరులారా! నేను చివరకు చెప్పేదేమిటంటే, సత్యమైనవాటిని, మంచివాటిని, ధర్మమైనవాటిని, పవిత్రమైనవాటిని, ఆనందమైనవాటిని, మెచ్చుకోతగ్గవాటిని, అంటే ఉత్తమంగా ఉన్నవాటిని గురించి, ప్రశాంతమైనవాటిని గురించి మీ మనస్సులో ఆలోచించండి. మీరు నా ద్వారా నేర్చుకొన్నవాటిని, నా నుండి పొందినవాటిని, నా నుండి విన్నవాటిని, నాలో చూసినవాటిని ఆచరణలో పెట్టండి. అప్పుడు శాంతిని కలిగించే దేవుడు మీతో ఉంటాడు.

కానుకలకు కృతజ్ఞత

10 మీకు నా పట్ల ఉన్న అభిమానం మళ్ళీ మొలకెత్తినందుకు నేను ప్రభువు పేరిట చాలా ఆనందిస్తున్నాను. ఔను, మీకు నా పట్ల అభిమానం ఉంది కాని, దాన్ని చూపించుకొనే అవకాశం మీకు చిక్కలేదు. 11 నాకు మీ అవసరముందని ఈ విధంగా మాట్లాడటం లేదు. ఏ పరిస్థితుల్లోనైనా తృప్తిగా ఉండేందుకు నేను నేర్చుకొన్నాను. 12 అవసరంలో ఉండటం అంటే ఏమిటో, అధికంగా కలిగి ఉండటం అంటే ఏమిటో నాకు తెలుసు. అన్ని పరిస్థితుల్లో, అంటే కడుపు నిండి ఉన్నప్పుడును ఆకలితో ఉన్నప్పుడును, అవసరాలలో ఉన్నప్పుడును అధికంగా కలిగి ఉన్నప్పుడును సంతృప్తికరంగా ఎలా ఉండాలో, దాని రహస్యమేమిటో నేను తెలుసుకున్నాను. 13 నాకు శక్తినిచ్చే క్రీస్తు ద్వారా నేను ఏ పనినైనా చేయగలను.

14 అయినా మీరు నా కష్టాలు పంచుకొని మంచి పని చేసారు. 15 పైగా దైవసందేశాన్ని గురించి మీరు క్రొత్తగా విన్నప్పుడు, ఫిలిప్పీలో ఉన్న మీరు తప్ప ఎవ్వరూ నాకు సహాయం చెయ్యలేదు. నేను మాసిదోనియ నుండి ప్రయాణం సాగించినప్పుడు ఒక్క సంఘం కూడా నాకు సహాయం చెయ్యలేదు. నాకు వాళ్ళు ఏమీ యివ్వలేదు. నానుండి ఏమీ పుచ్చుకోలేదు. 16 నేను థెస్సలొనీకలో ఉన్నప్పుడు కూడా నా అవసరాన్ని బట్టి మీరు నాకు ఎన్నోసార్లు సహాయం చేసారు. 17 నేను మీ నుండి విరాళాలు పొందాలని యిలా మాట్లాడటం లేదు. మీ జీవితం యొక్క లెక్కలకు కొంత లాభం చేకూర్చాలని నా అభిప్రాయం. 18 నాకు కావలసినదానికన్నా ఎక్కవే చెల్లించారు. మీరు ఎపఫ్రొదితు ద్వారా నాకు పంపిన విరాళాలు నాకు ముట్టాయి. దానితో నా అవసరాలు పూర్తిగా తీరిపోయాయి. సుగంధ పరిమళాల వలే ఉన్న మీ విరాళాలను దేవుడు ఆనందంగా అంగీకరిస్తాడు. 19 నా దేవుడు యేసు క్రీస్తులో ఉన్న గొప్ప ఐశ్వర్యంతో మీ అవసరాలన్నీ తీరుస్తాడు. 20 మన తండ్రియైన దేవునికి చిరకాలపు కీర్తి కలుగుగాక! ఆమేన్.

21 యేసు క్రీస్తులో ఐక్యత పొందిన ప్రతి పవిత్రునికి నా వందనాలు తెలుపండి. నాతోవున్న సోదరులందరూ మీకు వందనాలు తెలుపుతున్నారు. 22 పవిత్రులందరు, ముఖ్యంగా చక్రవర్తి భవనంలో నివసించేవాళ్ళు, మీకు వందనాలు తెలుపుతున్నారు.

23 యేసు క్రీస్తు ప్రభువుయొక్క అనుగ్రహము మీ ఆత్మకు తోడుగా ఉండుగాక!

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International