New Testament in a Year
యోహాను బోధించటం
(మత్తయి 3:1-12; లూకా 3:1-9, 15-17; యోహాను 1:19-28)
1 దేవుని కుమారుడైన[a] యేసు క్రీస్తును గురించి సువార్త ప్రారంభం. 2 యెషయా ప్రవక్త వ్రాసిన గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది:
“ఇతడు నా దూత. ఇతణ్ణి నీకన్నా ముందు పంపుతాను,
ఇతడు నీ కోసం దారి సిద్ధం చేస్తాడు.”(A)
3 “‘ప్రభువు మార్గాన్ని సిద్ధం చేయుము,
అతని కోసం చక్కటిదారుల్ని, వేయుము’
అని అరణ్య ప్రాంతంలో ఒక వ్యక్తి కేక వేయుచున్నాడు.”(B)
4 కనుక యోహాను ప్రజలకు ఎడారి ప్రాంతంలో బాప్తిస్మమిచ్చాడు. పాపపరిహారార్థం మారుమనస్సు పొందటం, బాప్తిస్మము పొందటం అవసరమని వాళ్ళకు ప్రకటించాడు. 5 యూదయ దేశంలోని ప్రజలు, యెరూషలేములోని ప్రజలు అతని దగ్గరకు వెళ్ళారు. తాము చేసిన పాపాలను చెప్పుకొన్నారు. అతడు వాళ్ళకు యొర్దాను నదిలో బాప్తిస్మం[b] ఇచ్చాడు.
6 యోహాను ఒంటె వెంట్రుకలతో చేసిన దుస్తుల్ని వేసుకొనేవాడు. నడుముకు తోలుదట్టి కట్టుకొనేవాడు. మిడుతల్ని, అడవి తేనెను తింటూ జీవించేవాడు.
7 అతడు ప్రకటించిన సందేశం ఇది, “నా తర్వాత నాకన్నా శక్తివంతుడైన వాడు వస్తాడు. నేను వంగి అతని చెప్పులు విప్పే అర్హత కూడా నాకు లేదు. 8 నేను మీకు నీళ్ళతో బాప్తిస్మము యిస్తున్నాను. కాని ఆయన మీకు పవిత్రాత్మతో బాప్తిస్మమిస్తాడు.”
యోహాను చేత యేసు బాప్తిస్మం పొందటం
(మత్తయి 3:13-17; లూకా 3:21-22)
9 ఆ రోజుల్లో, గలిలయలోని నజరేతు పట్టణానికి చెందిన యేసు వచ్చాడు. యోహాను ఆయనకు యొర్దాను నదిలో బాప్తిస్మము యిచ్చాడు. 10 యేసు నీటి నుండి బయటికి వస్తుండగా ఆకాశం తెరుచుకొని అందులో నుండి పవిత్రాత్మ ఒక పావురంలా తన మీదికి దిగిరావడం ఆయన గమనించాడు. 11 పరలోకం నుండి ఒక స్వరము, “నీవు నా ప్రియ కుమారుడవు. నీవంటే నాకెంతో ఆనందం!” అని అన్నది.
యేసు శోధించపడటం
(మత్తయి 4:1-11; లూకా 4:1-13)
12 వెంటనే దేవుని ఆత్మ యేసును ఎడారి ప్రాంతానికి తీసుకు వెళ్ళాడు. 13 ఆయన అక్కడ నలభై రోజులున్నాడు. సైతాను ఆయన్ని పరీక్షించాడు. ఆయన మృగాల మధ్య జీవించాడు. దేవదూతలు ఆయనకు పరిచర్యలు చేసారు.
గలిలయలో యేసుని సేవా ప్రారంభం
(మత్తయి 4:12-17; లూకా 4:14-15)
14 యోహాను చెరసాలలో వేయబడ్డాడు. యేసు గలిలయకు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించాడు. 15 ఆయన, “దేవుని రాజ్యం వస్తుంది. ఆ సమయం దగ్గరకు వచ్చింది. మారుమనస్సు పొంది సువార్తను విశ్వసించండి” అని ప్రకటించాడు.
యేసు కొందరు శిష్యులను ఎన్నుకొనటం
(మత్తయి 4:18-22; లూకా 5:1-11)
16 యేసు గలిలయ సముద్రం ఒడ్డున నడుస్తూ ఉన్నాడు. ఆయన చేపలు పట్టేవాళ్ళైన సీమోను మరియు అతని సోదరుడు అంద్రెయ వల వేయటం చూసాడు. 17 యేసు వాళ్ళతో, “నన్ను అనుసరించండి. మీరు మనుష్యులను పట్టుకొనేటట్లు చేస్తాను” అని అన్నాడు. 18 వాళ్ళు వెంటనే తమ వలల్ని వదిలి ఆయన్ని అనుసరించారు.
19 ఆయన కొంతదూరం వెళ్ళాక జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సోదరుడు యోహాను పడవలో ఉండటం చూసాడు. వాళ్ళు వల సిద్ధం చేసుకొంటూ ఉన్నారు. 20 యేసు వాళ్ళను పిలిచాడు. వాళ్ళు తమ తండ్రి జెబెదయిని పనివాళ్ళతో అక్కడే పడవలో వదిలివేసి యేసును అనుసరించారు.
యేసు ఒక మనుష్యుని దయ్యంనుండి విడిపించటం
(లూకా 4:31-37)
21 అంతా కలిసి కపెర్నహూము అనే పట్టణానికి వెళ్ళారు. విశ్రాంతి రోజు వచ్చింది. యేసు సమాజ మందిరానికి వెళ్ళి బోధించటం మొదలు పెట్టాడు. 22 శాస్త్రులవలే కాకుండా అధికారమున్న వానిలా బోధించాడు. కనుక ప్రజలు ఆయన బోధన విని ఆశ్చర్యపడ్డారు.
© 1997 Bible League International