Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
న్యాయాధిపతులు 2

బోకీము దగ్గర యెహోవాదూత

యెహోవాదూత గిల్గాలు పట్టణం నుండి బోకీము పట్టణానికి వెళ్లాడు. యెహోవా నుండి వచ్చిన ఒక సందేశాన్ని ఆ దూత ఇశ్రాయేలు ప్రజలకు అందించాడు. ఇదే ఆ సందేశం: “నేను మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకుని వచ్చాను. నేను మీ పూర్వీకులకు ఇస్తానని వాగ్దానం చేసిన దేశానికి నేను మిమ్మల్ని నడిపించాను. మీతో నేను చేసిన నా ఒడంబడికను నేను ఎన్నడూ ఉల్లంఘించను. ఈ దేశంలో నివసించే వారితో మీరు ఏ ఒడంబడిక చేసుకోకూడదు. వారి బలిపీఠాలను మీరు నాశనం చేయాలి అని నేను చెప్పాను. కాని మీరు నాకు విధేయులు కాలేదు.

“నేను మీకు చెబుతాను: ‘ఇతరులను ఇక మీదట ఈ దేశం నుండి బలవంతంగా నేను వెళ్లగొట్టను. ఈ ప్రజలు మీకు ఒక సమస్య అవుతారు. వారు మీకు ఉరిగా ఉంటారు. వారి దేవతలు మీకు ఉరిలాగా ఉంటారు.’”

యెహోవా నుండి వచ్చిన ఈ సందేశాన్ని ఇశ్రాయేలు ప్రజలకు దేవదూత చెప్పగానే ప్రజలు గట్టిగా ఏడ్చారు. కనుక ఇశ్రాయేలీయులు ఏడ్చిన ఆ స్థలానికి బోకీము[a] అని పేరు పెట్టారు. బోకీములో ఇశ్రాయేలీయులు యెహోవాకు బలులు అర్పించారు.

అవిధేయతవలన అపజయం

అప్పుడు యెహోషువ ప్రజలను ఇంటికి పొమ్మని చెప్పాడు. అందుచేత ప్రతి వంశంవారు నివసించుటకు వారికి యివ్వబడిన భూమిని తీసుకొనుటకు వెళ్లారు. యెహోషువ బ్రతికి ఉన్నంతవరకు ఇశ్రాయేలీయులు యెహోవాను సేవించారు. యెహోవాషువ మరణించిన తరువాత జీవించిన నాయకుల (పెద్దలు) జీవిత కాలంలో వారు యెహోవాను సేవించారు. ఇశ్రాయేలు ప్రజలకోసం యెహోవా చేసిన గొప్ప కార్యాలన్నింటినీ ఈ వృద్ధులు చూశారు. నూను కుమారుడు, యెహోవా సేవకుడునగు యెహోవాషువ 110 సంవత్సరాల వయస్సులో మరణించాడు. ఇశ్రాయేలు ప్రజలు, యెహోవాషువకు ఇవ్వబడిన స్థలంలో వారు అతనిని సమాధి చేసారు. అది ఎఫ్రాయిము కొండ దేశంలో గాయషు పర్వతానికి ఉత్తరాన తిమ్నాతుహెరెసు దగ్గర ఉంది.

10 ఆ తరం వారంతా చనిపోయాక తరువాత తరం పెరిగింది. యెహోవాను గూర్చిగాని, ఇశ్రాయేలీయులకు యెహోవా చేసిన వాటిని గూర్చిగాని ఈ కొత్త తరం వారికి తెలియదు. 11 అందుచేత ఇశ్రాయేలు ప్రజలు కీడు చేస్తూ తప్పుడు దేవత బయలును సేవించారు. ప్రజలు ఈ కీడు చేయటం యెహోవా చూశాడు. 12 ఇశ్రాయేలు ప్రజలను ఈజిప్టు నుండి యెహోవా బయటకు తీసుకుని వచ్చాడు. ఈ ప్రజల పూర్వీకులు యెహోవాను ఆరాధించారు. కాని ఇశ్రాయేలు ప్రజలు యెహోవాను అనుసరించటం మానుకొన్నారు. ఇశ్రాయేలీయులు వారి చుట్టూరా నివసించిన ప్రజలయొక్క తప్పుడు దేవుళ్లను[b] పూజించటం మొదలు పెట్టారు. అది యెహోవాకు కోపం కలిగించింది. 13 ఇశ్రాయేలీయులు యెహోవాను అనుసరించటం మానివేసి బయలు, అష్తారోతులను పూజించటం మొదలు పెట్టారు.

14 ఇశ్రాయేలు ప్రజలమీద యెహోవాకు కోపం వచ్చింది. కనుక శత్రువులు ఇశ్రాయేలీయుల మీద దాడిచేసి వారి ఆస్తులను తీసుకునేట్టుగా యెహోవా చేశాడు. యెహోవా వారి చుట్టూరా ఉన్న వారి శత్రువుల ద్వారా వారు ఓడిపోయేట్టు చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు వారి శత్రువులనుండి వారిని వారు కాపాడుకోలేక పోయారు. 15 ఇశ్రాయేలు ప్రజలు యుద్ధానికి బయటకు వెళ్లినప్పుడల్లా ఓడిపోయారు. యెహోవా వారి పక్షంగా లేని కారణంచేత వారు ఓడిపోయారు. ఇశ్రాయేలీయులు వారి చుట్టూరా నివసిస్తున్న ప్రజల దేవతలను సేవిస్తే, వారు ఓడిపోతారని యెహోవా ముందుగానే వారిని హెచ్చరించాడు. ఇశ్రాయేలు ప్రజలు చాలా శ్రమ అనుభవించారు.

16 అప్పుడు యెహోవా న్యాయాధిపతులు అనే నాయకులను ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలు ప్రజల ఆస్తులను తీసుకున్న శత్రువులనుండి వారిని ఈ నాయకులు రక్షించారు. 17 కాని ఇశ్రాయేలు ప్రజలు వారి న్యాయాధిపతుల మాట వినలేదు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి నమ్మకంగా ఉండక ఇతర దేవుళ్లను అనుసరించారు.[c] పూర్వం ఇశ్రాయేలీయుల పూర్వీకులు యెహోవా ఆజ్ఞలకు విధేయులయ్యారు. కానీ ఇశ్రాయేలీయులు ఇప్పుడు మారిపోయి, యెహోవాకు విధేయులు కావటం లేదు.

18 ఇశ్రాయేలీయుల శత్రువులు ఇశ్రాయేలు ప్రజలకు అనేకసార్లు చెడు సంగతులు జరిగించారు. అందుచేత ఇశ్రాయేలీయులు సహాయం కోసం ఏడ్చేవారు. ప్రతీసారీ, ప్రజల విషయమై యెహోవా సంతాప పడ్డాడు. ప్రతీసారీ ప్రజలను వారి శత్రువుల నుండి రక్షించేందుకు ఆయన ఒక న్యాయమూర్తిని పంపించాడు. యెహోవా ఎల్లప్పుడూ ఆ న్యాయమూర్తులతో ఉండేవాడు. కనుక ప్రతిసారీ ఇశ్రాయేలు ప్రజలు వారి శత్రువుల నుండి రక్షించబడ్డారు. 19 అయితే ప్రతీ న్యాయమూర్తి చనిపోయినప్పుడూ, ఇశ్రాయేలీయులు మరల పాపం చేసి, బూటకపు దేవుళ్లను పూజించటం మొదలుపెట్టారు. ఇశ్రాయేలీయులు చాలా మొండి వాళ్లు వారు తమ చెడు మార్గాలు విడిచి పెట్టేందుకు నిరాకరించారు.

20 అందుచేత ఇశ్రాయేలీయుల మీద యెహోవా కోపగించి, ఆయన చెప్పాడు: “ఈ ప్రజలు నేను వారి పూర్వీకులతో చేసిన ఒడంబడికనే ఉల్లంఘించారు. వారు నా మాట వినలేదు. 21 కనుక నేను ఇంకెంత మాత్రం ఇతర రాజ్యాలను జయించి, ఇశ్రాయేలీయుల కోసం దారి సులభం చేయను. యెహోషువ చనిపోయినప్పుడు ఆ రాజ్యాలు ఇంకా ఈ దేశంలోనే ఉన్నాయి. మరియు ఆ రాజ్యాలను నేను ఈ దేశంలోనే ఉండనిస్తాను. 22 ఇశ్రాయేలు ప్రజలను పరీక్షించేందుకు నేను ఆ రాజ్యాలను ప్రయోగిస్తాను. ఇశ్రాయేలు ప్రజలు, వారి పూర్వీకులు యెహోవా ఆజ్ఞలను పాటించినట్టుగా, పాటించగలరేమో నేను చూస్తాను.” 23 యెహోవా ఆ రాజ్యాలను దేశంలో ఉండనిచ్చాడు. ఆ రాజ్యాలు వెంటనే దేశం విడిచిపోయేట్టు యెహోవా బలవంతం చేయలేదు. వారిని ఓడించేందుకు ఆయన యెహోషువ సైన్యానికి సహాయం చేయలేదు.

అపొస్తలుల కార్యములు 6

ఏడుగురిని ఎన్నుకోవటం

యేసు అనుచరుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఆ రోజుల్లో గ్రీకు భాషలో మాట్లాడే యూదులు హీబ్రూ భాష మాట్లాడే యూదులతో, “మా వితంతువుల్ని ప్రతి రోజు చేసే దానాల విషయంలో సరిగ్గా చూడటం లేదు” అని తగువు పెట్టుకొన్నారు.

అందువల్ల ఆ పన్నెండుమంది అపొస్తలులు అనుచరులందర్ని సమావేశ పరిచి ఈ విధంగా అన్నారు: “అన్నదానాల విషయం చూడటానికోసం మేము దేవుని సందేశం యొక్క బోధ విషయంలో అశ్రద్ధ వహించటం మంచిది కాదు. సోదరులారా! పవిత్రాత్మ సంపూర్ణంగా గలవాళ్ళను, పూర్ణ జ్ఞానం కలవాళ్ళను ఏడుగురిని మీలోనుండి ఎన్నుకోండి. ఈ బాధ్యత వాళ్ళకప్పగిస్తాం. మేము మా కాలాన్ని ప్రార్థనలకు, దేవుని సందేశాన్ని ఉపదేశించటానికి వినియోగిస్తాము.”

అపొస్తలులు చెప్పింది వాళ్ళకందరికీ బాగా నచ్చింది. వాళ్ళు స్తెఫనును ఎన్నుకొన్నారు. స్తెఫను దేవుని పట్ల గొప్ప విశ్వాసం గలవాడు. అతనిలో పవిత్రాత్మ సంపూర్ణంగా ఉంది. అతణ్ణే కాక ఫిలిప్పును, ప్రొకొరును, నీకానోరును, తీమోనును, పర్మెనాసును, నీకొలాసును కూడా ఎన్నుకొన్నారు. ఈ నీకొలాసు అంతియొకయకు చెందినవాడు. పూర్వం యూదుల మతంలో చేరినవాడు. ప్రజలు వీళ్ళను అపొస్తలుల ముందుకు పిలుచుకొని వచ్చారు. అపొస్తలులు ప్రార్థించి తమ చేతుల్ని వాళ్ళపై ఉంచారు.

దేవుని సందేశం ప్రచారమైంది. యెరూషలేములో శిష్యుల సంఖ్య బాగా పెరిగిపోయింది. చాలా మంది యాజకులు విశ్వసించారు.

స్తెఫనును బంధించటం

దేవునినుండి సంపూర్ణమైన శక్తిని, అనుగ్రహాన్ని పొందిన స్తెఫను ప్రజల సమక్షంలో గొప్ప అద్భుతాలు చేసాడు. అద్భుతమైన చిహ్నాలు చూపాడు. కాని స్వతంత్రుల సమాజమని పిలువబడే సమాజానికి చెందిన కొందరు యూదులు స్తెఫనుతో వాదన పెట్టుకొన్నారు. వీళ్ళలో కురేనీ, అలెక్సంద్రియ పట్టణాలకు చెందిన యూదులు, కిలికియ, ఆసియ ప్రాంతాలకు చెందిన యూదులు కూడా ఉన్నారు. 10 కాని మాట్లాడటానికి పవిత్రాత్మ అతనికి తెలివినిచ్చాడు. కనుక అతని మాటలకు వాళ్ళు ఎదురు చెప్పలేకపోయారు.

11 ఆ తర్వాత యూదులు కొందరిని పురికొలిపి, “ఈ స్తెఫను మోషేను, దేవుణ్ణి దూషిస్తూ మాట్లాడటం మేము విన్నాము” అని చెప్పమన్నారు. 12 అదే విధంగా ప్రజల్ని, పెద్దల్ని, పండితుల్నికూడా పురికొలిపి పంపారు. ఆ తదుపరి స్తెఫన్ను బంధించి మహాసభ ముందుకు తెచ్చారు.

13-14 తప్పుడు సాక్ష్యాలు తెచ్చి, “యితడు ఈ పవిత్ర స్థానాన్ని గురించి, ధర్మశాస్త్రాన్ని గురించి ఎదిరిస్తూ మాట్లాడటం మానుకోడు. ఎందుకంటే, నజరేతు నివాసి యేసు ఈ ప్రాంతాన్ని నాశనం చేస్తాడని, మోషే మనకందించిన ఆచారాన్ని మారుస్తాడని చెప్పటం మేము విన్నాము” అని వాళ్ళతో చెప్పించారు. 15 సభలో కూర్చొన్నవాళ్ళంతా స్తెఫను వైపు శ్రద్ధగా చూసారు. వాళ్ళకు అతని ముఖం ఒక దేవదూత ముఖంలా కనిపించింది.

యిర్మీయా 15

15 యెహోవా నాతో ఇలా అన్నాడు: “యిర్మీయా, చివరకు మోషే మరియు సమూయేలు ఇక్కడికి వచ్చి యూదా కొరకు ప్రార్థన చేసినా, ఈ ప్రజలకై నేను విచారపడను. నానుండి యూదా ప్రజలను దూరంగా పంపివేయి! పొమ్మని వారికి చెప్పు! ‘మేమెక్కడికి వెళతాము, అని వారడుగవచ్చు. అప్పుడు వారితో యెహోవా ఇలా అంటున్నాడని చెప్పు:

“‘నేను వారిలో కొంతమంది అసహజంగా చనిపోవటానికి ఉద్దేశించాను.
    వారు మృత్యువు వాతబడతారు.
కొంతమందిని కత్తికి బలిచేయటానికి ఉద్దేశించాను.
    వారు కత్తులతో యుద్దానికి పోయి చనిపోతారు.
కొందరిని ఆకలి చావులకు ఉద్దేశించాను.
    వారు కరువుకు గురవుతారు.
మరి కొందరిని అన్యదేశాలలో బందీలు కావటానికి ఉద్దేశించాను.
    వారు బందీలై పరదేశానికి తీసుకుపోబడతారు.
నేను నాలుగు రకాల విధ్వంసకారులను వారిపైకి పంపుతాను.’
ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది
‘నేను ఖడ్గధారులైన శత్రువులను సంహారానికి పంపుతాను.
చనిపోయినవారి శరీరాలను లాగివేయటానికి కుక్కలను పంపుతాను.
వారి శవాలను తినివేయటానికి, నాశనం చేయటానికి పక్షులను, అడవి జంతువులను పంపుతాను.
ప్రపంచ ప్రజలందరికీ భీతావహంగా ఉండేలా
    యూదా ప్రజలను భయంకరమైనదానికి ఒక ఉదాహరణగా చూపిస్తాను.
మనష్షే[a] రాజు యెరూషలేములో చేసిన దానిని బట్టి
    యూదా ప్రజలకు నేనీ విధంగా చేస్తాను.
    మనష్షే యూదా రాజైన హిజ్కియా కుమారుడు.
    మనష్షే యూదా రాజ్యానికి ఒక రాజు.’

“యెరూషలేము నగరమా, నీకొరకు ఒక్కడు కూడా విచారించడు.
    ఎవ్వడూ నిన్ను గూర్చి విలపించడు.
    నీ యోగ క్షేమాలు తెలుసుకొనేందుకు కూడా ఎవ్వరూ దగ్గరకు రారు.
యెరూషలేమా, నీవు నన్ను వదిలిపెట్టావు.”
ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది.
“అనేక పర్యాయములు నీవు నన్ను చేరలేదు!
    కావున నిన్ను నేను శిక్షించి నాశనం చేస్తాను.
    మీ శిక్షను మీ మీదకు రాకుండా పట్టుకొని నేను అలసి పోయాను.
యూదా ప్రజలను నా కొంకె కర్రతో[b] వేరు చేస్తాను.
    వారిని రాజ్యంలోగల నగర ద్వారాలవద్ద నిరుపయోగంగా పారవేస్తాను.
నా ప్రజలలో మార్పు రాలేదు.
    అందుచే నేను వారిని నాశనం చేస్తాను.
    వారి పిల్లలను నేను తీసుకొని పోతాను.
అనేకమంది స్త్రీలు తమ భర్తలను కోల్పోతారు.
    సముద్రతీరాన ఉన్న ఇసుకకంటె ఎక్కువగా విధవ స్త్రీలు వుంటారు.
మధ్యాహ్న సమయంలో నేను నాశన కారులను తీసుకొని వస్తాను.
    యూదా యువకుల తల్లులపై వారు దాడి చేస్తారు.
యూదా ప్రజలకు బాధను, భయాన్ని కలుగ జేస్తాను.
    ఇదంతా అతి త్వరలో సంభవించేలా చేస్తాను.
శత్రువు కత్తులతో దాడిచేసి ప్రజలను చంపుతాడు.
    మిగిలిన యూదా వారిని వారు చంపుతారు.
ఒక స్త్రీకి ఏడుగురు కుమారులుండవచ్చు, కాని వారంతా హత్య చేయబడతారు.
    ఆమె ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోతుంది.
ఆమె కలవరపడి, తబ్బిబ్బై పోతుంది.
    దుఃఖంవల్ల పట్టపగలే ఆమెకు చీకటి కలుగుతుంది.”

దేవునికి మరల యిర్మీయా తెలియజేయుట

10 తల్లీ, నీవు నాకు జన్మ ఇవ్వనట్లయితే బాగుండేది.
    నేను దుఃఖపడుతున్నాను.
నేను దురదృష్టవంతుడను.
    ఈ సమస్త రాజ్యాన్నీ నేను (యిర్మీయా) నిందిస్తూ, విమర్శిస్తూ ఉన్నాను.
నేనెవరికీ ఏదీ అప్పు యివ్వలేదు; అరువు తీసుకోలేదు.
    కాని ప్రతివాడూ నన్ను శపిస్తున్నాడు!
11 యెహోవా, నేను నిన్ను భక్తితో సేవించాను.
    ఆపదకాలం వచ్చినప్పుడు నా శత్రువుల గురించి నేను నిన్ను వేడుకున్నాను.

యెహోవానుండి యిర్మీయాకు జవాబు

12 “యిర్మీయా, ఇనుప ముక్కను నుగ్గుచేయటం
    ఎవరితరమూ కాదని నీకు తెలుసు.
అంటే నా ఉద్దేశ్యం ఉత్తరాన్నుంచి వచ్చేది ఇనుమువలె ఉంటుంది[c]
    అలాగే ఇనుప ముక్కను చిదుకగొట్టే వారెవరు?
13 యూదా ప్రజలకు ధనము, ఐశ్వర్యం ఉన్నాయి.
    ఆ సంపదను పరులకు ఇస్తాను.
అన్యులు ఆ సంపదను ఖరీదు చేయనక్కరలేదు.
    నేనే వారికి స్వయంగా ఇచ్చివేస్తాను.
    ఎందువల్లనంటే యూదా చాలా పాపాలు చేసింది.
    యూదా దేశంలో ప్రతిచోటా పాపాలు జరిగాయి.
14 యూదా ప్రజలారా, మీ శత్రువులకు మిమ్మల్ని బానిసలుగా చేస్తాను.
    ముందెన్నడూ ఎరుగని రాజ్యంలో మీరు బానిసలవుతారు.
నేను మిక్కిలి కోపంతో ఉన్నాను.
    నా కోపం రగులుతున్న అగ్నిలా ఉంది.
    అందులో మీరు కాలిపోతారు.”

యిర్మీయా ఈ విధంగా చెప్పాడు:
15 యెహోవా, నీవు నన్ను అర్థంచేసుకో.
    నన్ను గుర్తుంచుకొని, నా గురించి శ్రద్ధ తీసుకో.
ప్రజలు నన్ను గాయపర్చుతున్నారు.
    వారికి తగిన శిక్ష విధించుము.
ఆ ప్రజలపట్ల నీవు చాలా ఓపిక పట్టినావు.
    వారి పట్ల ఓపికపడుతూ, నన్ను నాశనం కానీయకు.
నా గురించి ఆలోచించుము.
    యెహోవా, నీ గురించి నేననుభవిస్తున్న నొప్పిని గురించి నీవు జ్ఞాపకం చేసుకో.
16 నీ వర్తమానం నాకు అందినప్పుడు, నీ మాటలు నేను పొందుతున్నాను.
    నీ వాక్కు నన్ను మిక్కిలి సంతోషపర్చింది.
నా సంతోషానికి కారణమేమంటే నీ పేరు మీద నేను పిలువబడ్డాను. నీ పేరు సర్వశక్తిమంతుడు.
17 నేను ప్రజలతో కలసి ఎన్నడూ కూర్చోలేదు.
    కారణమేమనగా వారు నన్ను చూచి నవ్వి, ఎగతాళి చేశారు.
నామీద నీ ప్రభావం పడుటవలన నాకు నేను ఒంటరిగా కూర్చున్నాను.
నాచుట్టూ ఉన్న చెడు వాతావరణంపట్ల నేను కోపగించుకొనేలా చేశావు.
18 నేనింకా ఎందుకు బాధపడుతున్నానో నాకు అర్థం కావటంలేదు.
    నా గాయం ఎందుకు నయంకాలేదో, ఎందుకు తగ్గడంలేదో నాకు అర్థంకావటం లేదు.
యెహోవా, నీవు మారి పోయావేమోనని అనుకుంటున్నాను.
    నీవు ఎండిపోయిన సెలయేటిలా ఉన్నావు.
    నీవు ఇంకిపోయిన నీటిబుగ్గలా ఉన్నావు.
19 అప్పుడు యెహోవా ఇలా అన్నాడు: “యిర్మీయా, నీలో మార్పు వచ్చి తిరిగి నావద్దకు వస్తే
    నిన్ను నేను శిక్షించను.
నీవు మారి నావద్దకు వస్తే
    నీవు నన్ను వెంబడించగలవు.
వ్యర్థ ప్రసంగాలు మాని, నీవు అనుకూలంగా మాట్లాడితే
    నాగురించి నీవు మాట్లాడగలవు.
యూదా ప్రజలు మార్పు చెంది నీవద్దకు తిరిగిరావాలి.
    అంతేగాని నీవు మారి, వారిలా వుండకూడదు.
20 నిన్ను శక్తిమంతునిగా చేస్తాను.
నిన్ను చూచి వారంతా
    కంచుగోడలాంటి వాడని అనుకుంటారు.
యూదావారు నీతో పోట్లాడుతారు.
    కాని వారు నిన్ను ఓడించలేరు.
ఎందువల్లనంటే నేను నీతో వున్నాను.
    నేను నీకు సహాయ పడతాను; నిన్ను రక్షిస్తాను.”

ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది.
21 “ఆ దుష్టులనుండి నేను నిన్ను రక్షిస్తాను.
    వారు నిన్ను బెదరగొడతారు. కాని వారి బారినుండి నిన్ను నేను రక్షిస్తాను.”

మార్కు 1

యోహాను బోధించటం

(మత్తయి 3:1-12; లూకా 3:1-9, 15-17; యోహాను 1:19-28)

దేవుని కుమారుడైన[a] యేసు క్రీస్తును గురించి సువార్త ప్రారంభం. యెషయా ప్రవక్త వ్రాసిన గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది:

“ఇతడు నా దూత. ఇతణ్ణి నీకన్నా ముందు పంపుతాను,
    ఇతడు నీ కోసం దారి సిద్ధం చేస్తాడు.”(A)

“‘ప్రభువు మార్గాన్ని సిద్ధం చేయుము,
అతని కోసం చక్కటిదారుల్ని, వేయుము’
    అని అరణ్య ప్రాంతంలో ఒక వ్యక్తి కేక వేయుచున్నాడు.”(B)

కనుక యోహాను ప్రజలకు ఎడారి ప్రాంతంలో బాప్తిస్మమిచ్చాడు. పాపపరిహారార్థం మారుమనస్సు పొందటం, బాప్తిస్మము పొందటం అవసరమని వాళ్ళకు ప్రకటించాడు. యూదయ దేశంలోని ప్రజలు, యెరూషలేములోని ప్రజలు అతని దగ్గరకు వెళ్ళారు. తాము చేసిన పాపాలను చెప్పుకొన్నారు. అతడు వాళ్ళకు యొర్దాను నదిలో బాప్తిస్మం[b] ఇచ్చాడు.

యోహాను ఒంటె వెంట్రుకలతో చేసిన దుస్తుల్ని వేసుకొనేవాడు. నడుముకు తోలుదట్టి కట్టుకొనేవాడు. మిడుతల్ని, అడవి తేనెను తింటూ జీవించేవాడు.

అతడు ప్రకటించిన సందేశం ఇది, “నా తర్వాత నాకన్నా శక్తివంతుడైన వాడు వస్తాడు. నేను వంగి అతని చెప్పులు విప్పే అర్హత కూడా నాకు లేదు. నేను మీకు నీళ్ళతో బాప్తిస్మము యిస్తున్నాను. కాని ఆయన మీకు పవిత్రాత్మతో బాప్తిస్మమిస్తాడు.”

యోహాను చేత యేసు బాప్తిస్మం పొందటం

(మత్తయి 3:13-17; లూకా 3:21-22)

ఆ రోజుల్లో, గలిలయలోని నజరేతు పట్టణానికి చెందిన యేసు వచ్చాడు. యోహాను ఆయనకు యొర్దాను నదిలో బాప్తిస్మము యిచ్చాడు. 10 యేసు నీటి నుండి బయటికి వస్తుండగా ఆకాశం తెరుచుకొని అందులో నుండి పవిత్రాత్మ ఒక పావురంలా తన మీదికి దిగిరావడం ఆయన గమనించాడు. 11 పరలోకం నుండి ఒక స్వరము, “నీవు నా ప్రియ కుమారుడవు. నీవంటే నాకెంతో ఆనందం!” అని అన్నది.

యేసు శోధించపడటం

(మత్తయి 4:1-11; లూకా 4:1-13)

12 వెంటనే దేవుని ఆత్మ యేసును ఎడారి ప్రాంతానికి తీసుకు వెళ్ళాడు. 13 ఆయన అక్కడ నలభై రోజులున్నాడు. సైతాను ఆయన్ని పరీక్షించాడు. ఆయన మృగాల మధ్య జీవించాడు. దేవదూతలు ఆయనకు పరిచర్యలు చేసారు.

గలిలయలో యేసుని సేవా ప్రారంభం

(మత్తయి 4:12-17; లూకా 4:14-15)

14 యోహాను చెరసాలలో వేయబడ్డాడు. యేసు గలిలయకు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించాడు. 15 ఆయన, “దేవుని రాజ్యం వస్తుంది. ఆ సమయం దగ్గరకు వచ్చింది. మారుమనస్సు పొంది సువార్తను విశ్వసించండి” అని ప్రకటించాడు.

యేసు కొందరు శిష్యులను ఎన్నుకొనటం

(మత్తయి 4:18-22; లూకా 5:1-11)

16 యేసు గలిలయ సముద్రం ఒడ్డున నడుస్తూ ఉన్నాడు. ఆయన చేపలు పట్టేవాళ్ళైన సీమోను మరియు అతని సోదరుడు అంద్రెయ వల వేయటం చూసాడు. 17 యేసు వాళ్ళతో, “నన్ను అనుసరించండి. మీరు మనుష్యులను పట్టుకొనేటట్లు చేస్తాను” అని అన్నాడు. 18 వాళ్ళు వెంటనే తమ వలల్ని వదిలి ఆయన్ని అనుసరించారు.

19 ఆయన కొంతదూరం వెళ్ళాక జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సోదరుడు యోహాను పడవలో ఉండటం చూసాడు. వాళ్ళు వల సిద్ధం చేసుకొంటూ ఉన్నారు. 20 యేసు వాళ్ళను పిలిచాడు. వాళ్ళు తమ తండ్రి జెబెదయిని పనివాళ్ళతో అక్కడే పడవలో వదిలివేసి యేసును అనుసరించారు.

యేసు ఒక మనుష్యుని దయ్యంనుండి విడిపించటం

(లూకా 4:31-37)

21 అంతా కలిసి కపెర్నహూము అనే పట్టణానికి వెళ్ళారు. విశ్రాంతి రోజు వచ్చింది. యేసు సమాజ మందిరానికి వెళ్ళి బోధించటం మొదలు పెట్టాడు. 22 శాస్త్రులవలే కాకుండా అధికారమున్న వానిలా బోధించాడు. కనుక ప్రజలు ఆయన బోధన విని ఆశ్చర్యపడ్డారు. 23 అదే సమయంలో దయ్యం పట్టిన వాడొకడు ఆ సమాజమందిరానికి వచ్చాడు. 24 వాడు, “నజరేయుడవైన యేసూ! మాతో నీకేం పని? మమ్మల్ని నాశనం చెయ్యటానికి వచ్చావా? నీవెవరవో నాకు తెలుసు. నీవు దేవుని పరిశుద్ధుడవు” అని అన్నాడు.

25 యేసు, “నోరుమూసుకో వాని నుండి బయటకు రా!” అని గద్దిస్తూ అన్నాడు. 26 ఆ దయ్యం వాణ్ణి వణికించి పెద్దకేక పెడుతూ వానినుండి బయటికి వచ్చింది.

27 ప్రజలందరూ చాలా ఆశ్చర్యపడ్డారు. వాళ్ళు, “ఇదేమిటి? కొత్తబోధనా? పైగా అధికారంతో బోధిస్తున్నాడే! దయ్యాలను ఆజ్ఞాపిస్తే అవికూడా విధేయతతో ఆయనకు లోబడుతున్నవి!” అని పరస్పరం మాట్లాడుకున్నారు. 28 గలిలయ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకందరికి ఆయన గురించి తెలిసిపోయింది.

యేసు అనేకులను నయం చేయటం

(మత్తయి 8:14-17; లూకా 4:38-41)

29 వాళ్ళు సమాజమందిరం వదిలి నేరుగా యాకోబు మరియు యోహానులతో కలిసి సీమోను మరియు అంద్రెయల ఇంటికి వెళ్ళారు. 30 సీమోను అత్త జ్వరంతో మంచం పట్టివుంది. ఆమెను గురించి వాళ్ళు యేసుతో చెప్పారు. 31 ఆయన ఆమెను సమీపించి చేయి పట్టుకొని లేపి కూర్చోబెట్టాడు. జ్వరం ఆమెను వదిలిపోయింది. ఆమె వెంటనే వాళ్ళకు పరిచర్యలు చెయ్యటం మొదలు పెట్టింది.

32 ఆ రోజు సాయంత్రం సూర్యాస్తమయం కాగానే ప్రజలు వ్యాధిగ్రస్తుల్ని, దయ్యంపట్టిన వాళ్ళను, యేసు దగ్గరకు పిలుచుకు వచ్చారు. 33 ఆ ఊరంతా ఆయనవున్న యింటిముందు చేరుకుంది. 34 రకరకాల వ్యాధులున్న వాళ్ళకు యేసు నయం చేసాడు. ఎన్నో దయ్యాలను విడిపించాడు. ఆ దయ్యాలకు తానెవరో తెలుసు కనుక ఆయన వాటిని మాట్లాడనివ్వలేదు.

యేసు ఇతర పట్టణాలకు వెళ్ళటం

(లూకా 4:42-44)

35 యేసు తెల్లవారుఝామున ఇంకా చీకటియుండగానే లేచి యిల్లు వదిలి ఎడారి ప్రదేశానికి వెళ్ళి, అక్కడ ప్రార్థించాడు. 36 సీమోను మరియు అతని సహచరులు యేసును వెతకటానికి వెళ్ళారు. 37 ఆయన్ని చూసి వాళ్ళు, “అంతా మీకోసం వెతుకుతున్నారు” అని అన్నారు.

38 యేసు సమాధానం చెబుతూ, “ఇతర గ్రామాలకు వెళ్దాం రండి. అక్కడ కూడా ప్రకటించాలని నా అభిలాష, నేను వచ్చింది కూడా అందుకే కదా!” అని అన్నాడు. 39 ఆయన గలిలయ ప్రాంతమంతా పర్యటన చేసి అక్కడి సమాజమందిరాల్లో ప్రకటించాడు. దయ్యాలను వదిలించాడు.

యేసు రోగిని నయం చేయటం

(మత్తయి 8:1-4; లూకా 5:12-16)

40 ఒక కుష్టురోగి ఆయన దగ్గరకు వచ్చి మోకరిల్లి, “మీరు దయతలిస్తే నయం చెయ్యగలరు” అని వేడుకున్నాడు.

41 యేసుకు జాలివేసింది. తన చేయి జాపి, “సరే దయ చూపుతాను!” అని అంటూ అతణ్ణి తాకాడు. 42 వెంటనే కుష్టురోగం అతన్ని వదిలిపోయింది. అతనికి నయమైంది.

43 అతణ్ణి పంపివేస్తూ, “ఈ విషయం ఎవ్వరికి చెప్పకుండా జాగ్రత్తపడు. 44 కాని వెళ్ళి మీ యాజకునికి చూపు. మోషే ఆజ్ఞాపించిన బలి యిచ్చి నీవు శుద్ధి అయినట్లు రుజువు చేసుకొ” అని గట్టిగా చెప్పాడు. 45 కాని అతడు వెళ్ళి అందరికి చెప్పాడు. ఆ కారణంగా యేసు ఆ గ్రామాన్ని బహిరంగంగా ప్రవేశించ లేక పొయ్యాడు. గ్రామాల వెలుపల అరణ్య ప్రదేశాల్లో బస చేసాడు. అయినా ప్రజలు అన్ని ప్రాంతాలనుండి ఆయన దగ్గరకు వచ్చారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International