M’Cheyne Bible Reading Plan
14 యాజకుడైన ఎలియాజరు, నూను కూమారుడైన యెహోషువ, ఇశ్రాయేలు వంశాలు అన్నింటీ నాయకులు కలిసి ప్రజలకు ఏ భూమి ఇవ్వాలి అనే విషయం నిర్ణయం చేసారు. 2 ప్రజలు ఏ విధంగా వారి భూమిని నిర్ణయించుకోవాల్సిందీ చాలకాలం క్రితమే మోషేకు యెహోవా ఆజ్ఞాపించాడు. తొమ్మిదిన్నర వంశాల వారు ఎవరికి ఏ భూమి అనే విషయం నిర్ణయించేందుకు చీట్లు వేసారు. 3 రెండున్నర వంశాల వారికి యొర్దాను నదికి తూర్పున వారి భూమి వారికి మోషే ఇదివరకే ఇచ్చాడు. అయితే మిగతా ప్రజల్లా లేవీ వంశానికి మాత్రం భూమి ఏమీ ఇవ్వబడలేడు. 4 (పన్నెండు వంశాలకు వారి స్వంత భూమి ఇవ్వబడింది) యోసేపు కుమారులు మనష్షే, ఎఫ్రాయిము రెండు వంశాలుగా విభజించబడ్డారు. (మరియు ఒక్కో వంశానికి కొంత భూమి దొరికింది) కానీ లేవీ వంశపు ప్రజలకు భూమి ఏమీ ఇవ్వబడలేదు. వారు నివసించేందుకు కొన్ని పట్టణాలు మాత్రం ఇవ్వబడ్డాయి. (ఈ పట్టణాలు ప్రతి వంశంవారి భూమిలోనూ ఉన్నాయి.) వారి జంతువులకోసం వారికి పొలాలు కూడ ఇవ్వబడ్డాయి. 5 ఇశ్రాయేలు వంశాలకు భూమిని ఇచ్చే విధానం మోషేకు యెహోవా చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలు యెహోవా ఆజ్ఞాపించినట్టే భూమిని పంచుకొన్నారు.
కాలేబు తన భూమిని పొందటం
6 ఒకరోజు యూదా వంశపు మనుష్యులు కొందరు గిల్గాలులో యెహోషువ దగ్గరకు వెళ్లారు. కెనెజీవాడైన యెపున్నె కుమారుడు కాలేబు వారిలో ఒకడు. కాలేబు యెహోషువతో చెప్పాడు, “కాదేషు బర్నేయలో యెహోవా చెప్పిన సంగతులు నీకు జ్ఞాపకమే. యెహోవా తన సేవకుడు[a] మోషేతో మాట్లాడుతూ నిన్ను, నన్ను గూర్చి చెప్పాడు. 7 మనం వెళ్లబోతున్న దేశాన్ని చూచి రమ్మని యెహోవా సేవకుడు మోషే నన్ను పంపాడు. అప్పుడు నా వయస్సు 40 సంవత్సరాలు. నేను తిరిగి వచ్చినప్పుడు ఆ దేశాన్ని గూర్చిన నా అభిప్రాయం నేను మోషేతో చెప్పాను. 8 అయితే నాతోబాటు వెళ్లిన ఇతర ప్రజలు భయపెట్టే విషయాలను వారితో చెప్పారు. కానీ నేను మాత్రం ఆ దేశాన్ని యెహోవా మన స్వాధీనం చేస్తాడని నిజంగా నమ్మాను. 9 కనుక ఆ రోజున మోషే నాకు వాగ్దానం చేసాడు: ‘నీవు వెళ్లిన ఆ భూమి నీదే అవుతుంది. శాశ్వతంగా ఆ భూమి నీ పిల్లలకు స్వంతం అవుతుంది. నా దేవుడైన యెహోవాను నీవు నిజంగా విశ్వసించావు గనుక ఆ భూమిని నేను నీకు ఇస్తాను.’
10 “ఇదిగో చూడు, యెహోవా చేస్తానని చెప్పినట్టే, అప్పటినుండి 45 సంవత్సరాలు ఆయన నన్ను బతికించి ఉంచాడు. ఆ సమయంలో మనం అంతా అరణ్యంలో సంచారం చేసాము. ఇదిగో, ఇప్పుడు నా వయస్సు 85 సంవత్సరాలు. 11 మోషే నన్ను బయటకు పంపించిన నాడు నేను ఎంత బలంగా ఉన్నానో ఇప్పుడూ అంతే బలంగా ఉన్నాను. అప్పటిలాగే పోరాడేందుకు ఇప్పుడూ నేను సిద్ధంగా ఉన్నాను. 12 కనుక చాలకాలం క్రిందట యెహోవా నాకు వాగ్దానం చేసిన ఆ కొండ చరియను ఇప్పుడు నాకు ఇవ్వు. బలాఢ్యులైన అనాకీ ప్రజలు అక్కడ నివసించినట్టు అప్పట్లో నీవు విన్నావు. మరియు ఆ పట్టణాలు చాల పెద్దవి, మంచి కాపుదలలో ఉన్నవి. కానీ ఇప్పుడు, ఒకవేళ యెహోవా నాతో ఉన్నాడేమో, యెహోవా చెప్పినట్టు నేను ఆ భూమిని తీసుకుంటాను.”
13 యెపున్నె కుమారుడైన కాలేబును యెహోషువ ఆశీర్వదించాడు. యెహోషువ అతనికి హెబ్రోను పట్టణాన్ని స్వంతంగా ఇచ్చాడు. 14 ఇప్పటికీ ఆ హెబ్రోను పట్టణం కెనెజీవాడగు యెపున్నె కుమారుడు కాలేబుకు చెంది ఉంది. ఇశ్రాయేలీయుల యెహోవా దేవుణ్ణి అతడు నమ్ముకొని విధేయుడైనందువల్ల ఇప్పటికీ ఆ భూమి అతని ప్రజలకే చెంది ఉంది. 15 గతంలో ఆ పట్టణం కిర్యత్ అర్బ అని పిలువబడింది. అనాకీ ప్రజల్లోకెల్లా మహా గొప్పవాడైన అర్బ పేరు ఆ పట్టణానికి పెట్టబడింది.
ఆ తర్వాత దేశంలో శాంతి నెలకొంది.
యూదా వంశీయులకు భూమి
15 యూదాకు ఇవ్వబడిన భూమి ఒక్కో కుటుంబానికి పంచబడింది. ఆ భూమి ఎదోము సరిహద్దు వరకు, దక్షిణాన తేమాను చివర సీను అరణ్యం వరకు ఉంది. 2 యూదా భూమికి దక్షిణ సరిహద్దు, మృత సముద్రం దక్షిణ కొనలో మొదలవుతుంది. 3 దాని సరిహద్దు దక్షిణాన తేలు కనుమ వరకు పోయి సీనువరకు కొనసాగింది. దక్షిణాన కాదేషు బర్నేయ వరకు సరిహద్దు విస్తరించింది. హెస్రోను దాటి అద్దారు వరకు సరిహద్దు విస్తరించింది. అద్దారునుండి సరిహద్దు మలుపు తిరిగి కర్క వరకు విస్తరించింది. 4 అస్మోను, ఈజిప్టు ఏరు, మధ్యధరా సముద్రం వరకు సరిహద్దు విస్తరించింది. ఆ భూమి అంతా వారి దక్షిణ సరిహద్దు.
5 ఉప్పు సముద్రం నుండి, యొర్దాను నది సముద్రంలో పడే ప్రాంతం వరకు తూర్పు సరిహద్దు.
యొర్దాను నది ఉప్పు సముద్రంలో పడే ప్రాంతంలో ఉత్తర సరిహద్దు మొదలవుతుంది. 6 ఉత్తర సరిహద్దు బేత్‌హోగ్లా వరకు విస్తరించి, ఉత్తరాన బేత్ అరాబావరకు కొనసాగింది. ఆ సరిహద్దు బోహను బండవరకు వ్యాపించింది. (రూబేను కుమారుడు బోహను) 7 ఆ తర్వాత ఉత్తర సరిహద్దు ఆకోరు లోయలోనుండి దెబీరు వరకు కొనసాగింది. అక్కడ ఆ సరిహద్దు ఉత్తరానికి, తిరిగి గిల్గాలు వరకు వ్యాపించింది. అదుమ్మీము పర్వతాల మధ్యగా పోయే మార్గం మీద ఉంది గిల్గాలు. అది ఏటికి దక్షిణాన ఉంది. ఎన్‌షెమెషు నీళ్ల వరకు సరిహద్దు వ్యాపించింది. ఎన్‌రోగెలు దగ్గర సరిహద్దు నిలిచిపోయింది. 8 తర్వాత యెబూసు పట్టణానికి దక్షిణాన ఉన్న బెన్‌హిన్నోము లోయగుండా ఆ సరిహద్దు కొనసాగింది. (ఆ యెబూసు పట్టణం పేరు యెరూషలేము) అక్కడ సరిహద్దు కొండ శిఖరం మీదుగా హిన్నోము లోయకు పశ్చిమంగా వెళ్లింది. ఇది రెఫాయిము లోయకు ఉత్తరపు అంచున ఉంది. 9 అక్కడ నుండి ఆ సరిహద్దు నెప్తోయ నీళ్ల ఊటవరకు కొనసాగింది. తర్వాత ఆ సరిహద్దు ఎఫ్రోను కొండ సమీపంలో గల పట్టణాలకు పోయింది. ఆ స్థలంలో ఆ సరిహద్దు మళ్లుకొని బాలాకు పోయింది. (బాలా కిర్యత్ యారీం అనికూడ పిలువబడింది) 10 బాలావద్ద సరిహద్దు పశ్చిమంగా మళ్లుకొని శేయీరు కొండ దేశానికి పోయింది. ఆ సరిహద్దు యారీం కొండకు (కెసలోము అని కూడ పిలువబడింది) ఉత్తర దిశగా కొనసాగి బెత్‌షెమెషు వరకు కొనసాగింది. అక్కడ్నుండి ఆ సరిహద్దు తిమ్నాదాటిపోయింది. 11 అప్పుడు ఆ సరిహద్దు ఎక్రోనుకు ఉత్తరాన ఉన్న కొండకు చేరింది. ఆ చోటనుండి ఆ సరిహద్దు షికెరానుకు మరలి బాలా కొండను దాటిపోయింది. ఆ సరిహద్దు యబ్నేలువరకు కొనసాగి మధ్యధరా సముద్రం దగ్గర ముగిసింది. 12 యూదా దేశానికి పశ్చిమ సరిహద్దు మధ్యధరా సముద్రం. కనుక యూదా దేశం ఈ నాలుగు సరిహద్దుల లోపల ఉంది. యూదా కుటుంబాలు ఈ దేశంలో నివసించాయి.
13 యెపున్నె కుమారుడైన కాలేబుకు యూదా దేశంలో భాగం ఇవ్వాల్సిందిగా యెహోషువను యెహోవా ఆజ్ఞాపించాడు. కనుక దేవుడు ఆజ్ఞాపించిన భూమిని కాలేబుకు యెహోషువ ఇచ్చాడు. హెబ్రోను అనికూడ పిలువబడిన కిర్యత్ అర్బ పట్టణాన్ని యెహోషువ అతనికి ఇచ్చాడు (అనాకు తండ్రి అర్బ) 14 హెబ్రోనులో నివాసం ఉన్న అనాకీ వంశాలు మూడింటిని కాలేబు వెళ్లగొట్టేసాడు. అవి శాషాయి, అహీమాను, తల్మయి వంశాలు. వారు అనాకు కుటుంబంవారు. 15 తర్వాత దెబీరులో నివసిస్తున్న ప్రజల మీద కాలేబు యుద్ధం చేసాడు. (గతంలో దెబీరును కిర్యత్ సెఫెర్ అనికూడ పిలిచేవాళ్లు) 16 “కిర్యత్ సెఫెర్ మీద దాడి చేసి, ఆ పట్టణాన్ని ఓడించే మగవాడెవడో అతడు నా కుమార్తె అక్సాను పెళ్లాడవచ్చు. అతనికి నా కూతుర్ని బహుమానంగా ఇస్తాను” అన్నాడు కాలేబు.
17 కాలేబు సహోదరుడైన కనజు కుమారుడు ఒత్నియేలు ఆ పట్టణాన్ని ఓడించాడు. కనుక కాలేబు తన కుమార్తె అక్సాను ఒత్నియేలుకు భార్యగా ఇచ్చాడు. 18 తన తండ్రి కాలేబు దగ్గర మరికొంత భూమి అడగాలని ఒత్నియేలు అక్సాను[b] కోరాడు. (అక్సా తన తండ్రి దగ్గరకు వెళ్లింది.) ఆమె తన గాడిద మీద నుండి దిగగానే “నీకేం కావాలి?” అని కాలేబు ఆమెను అడిగాడు.
19 “నాకు ఒక ఆశీర్వాదం కావాలి[c] (నీరుగల భూమి నాకు కావాలి). నీవు నాకు నెగెవులో[d] ఇచ్చిన భూమి ఎడారి భూమి. కనుక నీటి ఊటలు గల భూమి నాకు ఇవ్వాలి” అని అక్సా జవాబిచ్చింది. కనుక మెరకలోను పల్లంలోని నీటి ఊటలు గల భూమిని కాలేబు ఆమెకు ఇచ్చాడు.
20 యూదా వంశానికి దేవుడు వాగ్దానం చేసిన భూమి దొరికింది. ఒక్కో కుటుంబానికి ఆ భూమిలో భాగం దొరికింది.
21 నెగెవు దక్షిణాన గల పట్టణాలన్నీ యూదా వంశానికి వచ్చాయి. ఈ పట్టణాలు ఎదోము సరిహద్దు సమీపంగా ఉన్నాయి. ఆ పట్టణాల జాబితా ఇది;
కబ్జీలు, ఎదెరు, యగురు, 22 కీనా, దిమోనా, అదాదా: 23 కెదేషు, హసోరు, ఇత్నాను 24 జీపు, తెలెం, బెయలోత్ 25 హసొర్, హదత్తా, కెరియోతు, హెస్రొను (హసోరు అని కూడ పిలువబడుతుంది) 26 అమాము, షెమ, మొలాదా 27 హసర్‌గద్దా, హెష్మొను, బెత్‌పెలెతు, 28 హసర్‌షువలు, బెయెర్‌షెబ, బిజ్యోత్యా 29 బాలా, ఇయం, ఎజెము, 30 ఎల్తోలద్, కెసిల్, హోర్మ, 31 సిక్లగు, మద్మన్నా, సన్సన్నా, 32 లెబయొతు, ష్హిలిం, అయిన్ మరియు రిమ్మోన్. మొత్తం మీద 29 పట్టణాలు, వాటి పొలాలు ఉన్నాయి. పడమటి కొండ దిగువల్లోకూడ యూదా వంశం వారికి పట్టణాలు వచ్చాయి.
ఆ పట్టణాల జాబితా ఇది:
33 ఎష్తాయోలు, జొర్యా, అష్నా 34 జానోహ, ఎన్‌గన్నీము, తప్పుయ, ఎనాం 35 యార్ముత్, అదుల్లాము శోకో, అజెకా, 36 షరాయిం, అదితాయిము, మరియు గెదెరా (గెదెరోతాయిము అనికూడ పిలువబడింది) మొత్తం మీద 14 పట్టణాలు, వాటి పొలాలు.
37 యూదా వంశంవారికి ఇవ్వబడిన పట్టణాలు
సెనాము, హదష, మిగ్దల్‌గాదు, 38 దిలాన్, మిస్సే, యొక్తయెలు 39 లాకీషు, బొస్కతు, ఎగ్లోను 40 కబ్బోన్, లహ్మను, కిత్లషు 41 గెదెరొతు, బెత్‌దాగొను నయమా, మరియు మక్కెదా. మొత్తంమీద 16 పట్టణాలు మరియు వాటి పొలాలు.
42 యూదా ప్రజలకు లభించిన ఇతర పట్టణాలు:
లిబ్నా, ఎతెరు, అషను, 43 ఇప్తా, అష్న, నెజిబు 44 కెయిలా, అక్జీబు, మారేషా. మొత్తంమీద 9 పట్టణాలు మరియు వాటి పొలాలు. 45 ఎక్రోను పట్టణం, దాని సమీపంలో గల అన్ని చిన్న పట్టణాలు, పొలాలు యూదా ప్రజలకే దొరికాయి. 46 ఎక్రోనుకు పశ్చిమాన గల ప్రాంతం, అష్డోదుకు సమీపంలో ఉన్న పట్టణాలు, పొలాలు అన్నీ కూడా వారికి లభించాయి. 47 అష్డోదు చుట్టూ ఉన్న ప్రాంతం అంతాను, అక్కడి చిన్న పట్టణాలు యూదా దేశంలో భాగమే. గాజా చుట్టూ ఉన్న ప్రాంతం, పొలాలు, పట్టణాలు కూడా యూదా ప్రజలకే వచ్చాయి. ఈజిప్టు నదివరకు వారి దేశం విస్తరించింది. మరియు వారిదేశం మధ్యధరా సముద్ర తీరం వెంబడి విస్తరించింది.
48 కొండ దేశంలోకూడా యూదా ప్రజలకు పట్టణాలు ఇవ్వబడ్డాయి. ఆ పట్టణాల జాబితా ఇది:
షామిరు, యత్తిరు, శాకొ, 49 దన్నా, కిర్యత్ సన్నా, (దెబిర్ అనికూడ పిలువబడింది) 50 అనబు, ఎష్తెమో, అనీం 51 గోషెను, హలొను, మరియు గిలో. మొత్తం మీద 11 పట్టణాలు మరియు వాటి పొలాలు.
52 యూదా ప్రజలకు ఈ పట్టణాలు కూడ ఇవ్వబడ్డాయి:
అరబు, దూమా, ఎషాను, 53 యనీము, బెత్ తప్పుయా, అఫెకా, 54 హుమతా, కిర్యత్ అర్బ (హెబ్రోను అని కూడ పిలువబడింది) మరియు సీయోరు. 9 పట్టణాలు, వాటి పొలాలు ఉన్నాయి.
55 ప్రజలకు ఈ పట్టణాలు కూడా ఇవ్వబడ్డాయి:
మయోను, కర్మెలు, జీపు, యుట్ట, 56 యెజ్రెయేలు, యొకెదియము, జనోవా 57 కయిను, గిబియ మరియు తిమ్నా మొత్తం మీద 10 పట్టణాలు మరియు వాటి పొలాలు.
58 యూదా ప్రజలకు ఈ పట్టణాలు కూడా ఇవ్వ బడ్డాయి:
హల్‌హులు, బెత్‌జూరు, గెదొరు, 59 మారాతు, బెత్‌అనొతు మరియు ఎల్‌తెకొను. మొత్తం మీద అవి 6 పట్టణాలు మరియు వాటి పొలాలు.
60 రబ్బ, కిర్యత్‌బెతు (కిర్యత్యారీం అనికూడా పిలువ బడుతుంది) రెండు పట్టణాలు కూడ యూద ప్రజలకు ఇవ్వబడ్డాయి.
61 యూదా ప్రజలకు ఎడారి పట్టణాలు యివ్వబడ్డాయి. ఆ పట్టణాల జాబితా ఇది:
బెత్ అరాబా, మిద్దిను, సెకాకా 62 నిబ్షాను, ఉప్పు పట్టణం, మరియు ఎన్‌గేది. మొత్తం మీద 6 పట్టణాలు మరియు వాటి పొలాలు.
63 యెరుషలేములో నివసిస్తున్న యెబూసీ ప్రజలను యూదా సైన్యం బయటకు వెళ్లగొట్ట లేక పోయింది. కనుక యెరుషలేములోని యూదా ప్రజల మధ్య యెబూసీ ప్రజలు నేటికీ ఇంకా నివసిస్తూనే ఉన్నారు.
146 యెహోవాను స్తుతించండి!
నా ప్రాణమా! యెహోవాను స్తుతించు!
2 నా జీవిత కాలమంతా నేను యెహోవాను స్తుతిస్తాను.
నా జీవిత కాలమంతా నేను ఆయనకు స్తుతులు పాడుతాను.
3 సహాయం కోసం మీ నాయకుల మీద ఆధారపడవద్దు.
మనుష్యులు నిన్ను రక్షించలేరు గనుక మనుష్యులను నమ్ముకోవద్దు.
4 మనుష్యులు చనిపోయి, పాతిపెట్టబడతారు.
అప్పుడు నీకు సహాయం చేసేందుకు వారు వేసిన పథకాలన్నీ పోయినట్టే.
5 సహాయం కోసం దేవుణ్ణి అడిగేవారు చాలా సంతోషంగా ఉంటారు.
ఆ మనుష్యులు వారి దేవుడైన యెహోవా మీద ఆధారపడతారు.
6 భూమిని, ఆకాశాన్ని యెహోవా చేశాడు.
సముద్రాన్నీ, అందులో ఉన్న సమస్తాన్నీ యెహోవా చేశాడు.
యెహోవా వాటిని శాశ్వతంగా కాపాడుతాడు.
7 అణచివేయబడిన ప్రజలకు యెహోవా సరియైన సహాయం చేస్తాడు.
ఆకలితో ఉన్న ప్రజలకు దేవుడు ఆహారం ఇస్తాడు.
చెరలోవున్న ప్రజలను యెహోవా విడుదల చేస్తాడు.
8 గుడ్డివారు మరల చూచుటకు యెహోవా సహాయం చేస్తాడు.
కష్టంలో ఉన్న ప్రజలకు యెహోవా సహాయం చేస్తాడు.
మంచి మనుష్యులను యెహోవా ప్రేమిస్తాడు.
9 మన దేశంలో నివసిస్తున్న పరాయి వాళ్లను యెహోవా కాపాడుతాడు.
విధవరాండ్రు, అనాథల విషయమై యెహోవా శ్రద్ధ తీసికొంటాడు.
అయితే దుర్మార్గుల పథకాలను యెహోవా నాశనం చేస్తాడు.
10 యెహోవా శాశ్వతంగా పాలిస్తాడని నేను ఆశిస్తున్నాను.
సీయోనూ, నీ దేవుడు శాశ్వతంగా పాలిస్తాడని నేను ఆశిస్తున్నాను.
యెహోవాను స్తుతించండి!
147 యెహోవా మంచివాడు గనుక ఆయనను స్తుతించండి.
మన దేవునికి స్తుతులు పాడండి.
ఆయనను స్తుతించుట మంచిది, అది ఎంతో ఆనందం.
2 యెహోవా యెరూషలేమును నిర్మించాడు.
బందీలుగా తీసికొనిపోబడిన ఇశ్రాయేలు ప్రజలను దేవుడు వెనుకకు తీసికొనివచ్చాడు.
3 పగిలిన వారి హృదయాలను దేవుడు స్వస్థపరచి,
వారి గాయాలకు కట్లు కడతాడు.
4 దేవుడు నక్షత్రాలను లెక్కిస్తాడు.
వాటి పేర్లనుబట్టి వాటన్నిటినీ ఆయన పిలుస్తాడు.
5 మన ప్రభువు చాలా గొప్పవాడు. ఆయన చాలా శక్తిగలవాడు.
ఆయన పరిజ్ఞానానికి పరిమితి లేదు.
6 పేదలను యెహోవా బలపరుస్తాడు.
కాని చెడ్డ ప్రజలను ఆయన ఇబ్బంది పెడతాడు.
7 యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి.
స్వరమండలాలతో మన దేవుణ్ణి స్తుతించండి.
8 దేవుడు ఆకాశాన్ని మేఘాలతో నింపుతాడు.
భూమి కోసం దేవుడు వర్షాన్ని సృష్టిస్తాడు.
పర్వతాల మీద దేవుడు గడ్డిని మొలిపిస్తాడు.
9 జంతువులకు దేవుడు ఆహారం యిస్తాడు.
పక్షి పిల్లల్ని దేవుడు పోషిస్తాడు.
10 యుద్ధాశ్వాలు, బలంగల సైనికులు ఆయనకు ఇష్టం లేదు.
11 యెహోవాను ఆరాధించే ప్రజలు ఆయనకు సంతోషాన్ని కలిగిస్తారు.
ఆయన నిజమైన ప్రేమను నమ్ముకొనే ప్రజలు యెహోవాకు సంతోషం కలిగిస్తారు.
12 యెరూషలేమా, యెహోవాను స్తుతించుము.
సీయోనూ, నీ దేవుని స్తుతించుము!
13 యెరూషలేమా, దేవుడు నీద్వారబంధాలను బలపరుస్తాడు.
నీ పట్టణంలోని ప్రజలను దేవుడు ఆశీర్వదిస్తాడు.
14 నీ దేశానికి దేవుడు శాంతి కలిగించాడు. కనుక యుద్ధంలో నీ శత్రువులు నీ ధాన్యం తీసుకొని పోలేదు.
ఆహారం కోసం నీకు ధాన్యం సమృద్ధిగా ఉంది.
15 దేవుడు భూమికి ఒక ఆజ్ఞ ఇస్తాడు.
దానికి వెంటనే అది లోబడుతుంది.
16 నేల ఉన్నిలా తెల్లగా అయ్యేంతవరకు మంచు కురిసేటట్టు దేవుడు చేస్తాడు.
ధూళిలా గాలిలో మంచు విసిరేటట్టు చేస్తాడు.
17 దేవుడు ఆకాశం నుండి బండలవలె వడగండ్లు పడేలా చేస్తాడు.
ఆయన పంపే చలికి ఎవడూ నిలువ జాలడు.
18 అప్పుడు, దేవుడు మరో ఆజ్ఞ ఇస్తాడు. వెచ్చటి గాలి మరల వీస్తుంది.
మంచు కరిగిపోతుంది. నీళ్లు ప్రవహించటం మొదలవుతుంది.
19 దేవుడు యాకోబుకు (ఇశ్రాయేలు) తన ఆజ్ఞ ఇచ్చాడు.
దేవుడు ఇశ్రాయేలుకు తన న్యాయచట్టాలు, ఆదేశాలు ఇచ్చాడు.
20 దేవుడు యిలా మరి ఏ దేశానికీ చెయ్యలేదు.
ఇతర మనుష్యులకు దేవుడు తన న్యాయ చట్టం ఉపదేశించలేదు.
యెహోవాను స్తుతించండి!
యిర్మీయా దేవాలయ ప్రసంగం
7 యిర్మీయాకు యెహోవా నుండి ఇలా వర్తమానం వచ్చింది: 2 “యిర్మీయా, నీవు దేవాలయ ద్వారం వద్ద నిలబడి, ఈ వర్తమానం ప్రజలకు బోధించుము:
“‘ఓ యూదా ప్రజలారా యెహోవా వాక్కు ఆలకించండి! యెహోవాను ఆరాధించటానికి ఈ ఆలయ ద్వారం ద్వారా వచ్చే ప్రజాలారా ఈ వర్తమానం వినండి! 3 సర్వశక్తిమంతుడైన యెహోవా ఇశ్రాయేలీయుల దేవుడు ఇలా చెపుతున్నాడు, మీ జీవన విధానం మార్చుకోండి. సత్కార్యములు చేయండి! మీరలా చేస్తే, ఈ స్థలంలో మిమ్మల్ని నివసించేలాగు చేస్తాను[a] 4 కొందరు వ్యక్తులు చెప్పే అబద్ధాలను మీరు నమ్మకండి “ఇదే యెహోవా ఆలయం;[b] ఇదే దేవాలయం ఇదే దేవాలయం!” అని వల్లిస్తారు. 5 మీరు మీ జీవితాలను మార్చుకొని మంచి పనులు చేస్తే, మిమ్మల్ని ఈ ప్రదేశంలో నివసించేలా చేస్తాను. మీరు ఒకరికొకరు సత్యవర్తనులై మెలగాలి. 6 క్రొత్తవారి పట్ల న్యాయం పాటించండి. అనాధ శిశువులకు, విధవ స్త్రీల సంక్షేమానికి మంచి పనులు చేయండి. అమాయకులను చంపవద్దు! ఇతర దేవుళ్లను అనుసరించ వద్దు! ఎందువల్లనంటే ఆ దేవతలు మీ జీవితాలను నాశనం చేస్తాయి. 7 మీరు నా మాట మన్నిస్తే, నేను మిమ్మల్ని ఈ రాజ్యంలో నివసించేలా చేస్తాను. ఈ రాజ్యాన్ని నేను మీ పూర్వీకులకు శాశ్వతంగా ఇచ్చాను.
8 “‘కాని మీరు అబద్ధాలనే నమ్ముతున్నారు. అబద్ధాలు అప్రయోజనకరమైనవి. 9 మీరు దొంగతనాలు, హత్యలు చేస్తారా? వ్యభిచార పాపానికి ఒడిగడతారా? మీరు ఇతరులపై అకారణంగా నేరారోపణ చేస్తారా? బూటకపు బయలు దేవుణ్ణి ఆరాధిస్తారా? మీకు తెలియని ఇతర దేవుళ్లను అనుసరిస్తారా? 10 మీరీ పాపాలు చేసి, నా పేరుతో పిలవబడే ఈ ఆలయంలో నా ముందు మీరు నిలవగలమని అనుకొంటున్నారా? ఈ చోటులో నాముందు నిలబడి “మేము సురక్షితం” అని ఎలా అనుకోగలరు? మీరీ చెడుకార్యాలు చేయటానికి మీకు రక్షణ వుందని అనుకొంటున్నారా? 11 ఈ ఆలయం నా పేరుతో పిలవబడుతూ ఉంది! అయితే మీకు ఈ స్థలం ఒక దొంగల గుడారముకంటె భిన్నంగా కన్పించటం లేదా? నేను మిమ్మల్ని కనిపెడుతూనే ఉన్నాను!’” ఈ వాక్కు యెహోవా నుండి వచ్చినది!
12 “‘యూదా ప్రజలారా, ఇప్పుడు మీరు షిలోహు నగరానికి వెళ్లండి. అక్కడ నేను మొదటిసారిగా ఎక్కడైతే నా నామం కోసం ఒక ఇంటిని నిర్మించానో ఆ చోటుకు వెళ్లండి. ఇశ్రాయేలీయులు కూడ దుష్టకార్యాలు చేశారు. వారు చేసిన పాపకార్యాలకు ప్రతిగా ఆ స్థలానికి నేను ఏమి చేసియున్నానో వెళ్లి చూడండి[c] 13 ఇశ్రాయేలీయులారా, మీరీ చెడుకార్యాలు చేస్తూ ఉన్నారు. ఈ వాక్కు యెహోవా నుండి వచ్చినది! నేను మీతో అనేక పర్యాయాలు మాట్లాడి యున్నాను. కాని మీరు వినటానికి నిరాకరించారు. నేను మిమ్మల్ని పిలిచాను. అయినా మీరు పలకలేదు. 14 అందుచే యెరూషలేములో నాపేరు మీద పిలవబడే ఈ ఆలయాన్ని నాశనం చేస్తాను. షిలోహును నాశనం చేసినట్లు ఆ ఆలయాన్ని నాశనం చేస్తాను! ఆ ఆలయంలో మీరు విశ్వాసముంచారు. నేనా స్థలాన్ని మీకు, మీ పూర్వీకులకు ఇచ్చియున్నాను. 15 మీ సోదరులనందరినీ నేను ఎఫ్రాయిమునుండి వెడల గొట్టినట్లు, నానుండి మిమ్మల్ని దూరంగా వెడలగొడతాను.’
16 “యిర్మీయా, నీవు మాత్రం యూదా ప్రజల కొరకు ప్రార్థన చేయవద్దు. వారి కొరకు నీవు అడుగవద్దు; వారి కొరకు నీవు చేసే ప్రార్థన నేను ఆలకించను. 17 యూదా పట్టణాలలో ఆ ప్రజలు ఏమి చేస్తున్నారో నీవు గమనిస్తున్నావని నాకు తెలుసు. యెరూషలేము నగర వీధుల్లో వారేమి చేస్తున్నారో నీవు చూడవచ్చు. 18 యూదా ప్రజలు ఏమి చేస్తున్నారనగా: పిల్లలు కట్టెలను పోగుచేయటం; తండ్రులు వాటితో నిప్పు రాజేయటం; స్త్రీలు పిండి కలిపి, ఆకాశ రాణికి[d] నివేదించటానికి రొట్టెలు చేయటం, యూదా ప్రజలు ఇతర దేవతారాధనలో పానీయార్పణలను కుమ్మరిస్తున్నారు. నాకు కోపం తెప్పించటానికే ఇవన్నీ చేస్తున్నారు. 19 కాని వాస్తవానికి యూదా ప్రజలు బాధపర్చేది నన్నుగాదు వారిని వారే బాధపర్చుకుంటున్నారు. వారిని వారే అవమానపర్చుకుంటున్నారు” ఇది యెహోవా వాక్కు,
20 కావున యెహోవా ఇంకా ఇలా అంటున్నాడు: “నా కోపాన్ని ఈ ప్రదేశంపై చూపిస్తాను. నేను మనుష్యులను, జంతువులను శిక్షిస్తాను. పొలాల్లో చెట్లను, భూమి మీద పంటను నాశనం చేస్తాను. నా కోపం ప్రళయాగ్నిలా వుంటుంది. దానిని ఆర్పగల శక్తి ఎవ్వరికీ లేదు.”
యెహోవా కోరేది బలులు కాదు, విధేయత
21 సర్వ శక్తిమంతుడైన ఇశ్రాయేలు దేవుడు ఇలా అంటున్నాడు: “మీరు వెళ్లి మీరు కోరినన్ని దహన బలులు, సాధారణ బలులు అర్పించండి. తద్వారా వచ్చిన మాంసాన్ని మీరే తినండి. 22 మీ పూర్వీకులను నేను ఈజిప్టునుండి తీసుకొని వచ్చాను. నేను వారితో మాట్లాడాను. కాని దహన బలుల గురించి, సాధరణ బలుల గురించి నేను వారికి ఏ రకమైన ఆజ్ఞలూ ఇవ్వలేదు. 23 వారికి ఈ ఆజ్ఞ మాత్రమే ఇచ్చియున్నాను, ‘నాకు విధేయులై వుండండి. అప్పుడు నేను మీ దేవుడనై యుంటాను. మీరు నా ప్రజలైయుంటారు. నేను చెప్పినదంతా చేయండి. మీకు శుభం కలుగుతుంది.’
24 “కాని మీ పూర్వీకులు నా మాట వినలేదు. నన్ను లెక్కచేయలేదు. మొండిగా, వారు చేయదలచుకున్నదంతా చేశారు. వారు సన్మార్గులు కాలేదు. వారు మరింత దుష్టులయ్యారు. ముందుకు సాగక వెనుకకు తిరిగారు. 25 మీ పూర్వీకులు ఈజిప్టును వదలిన నాటినుండి ఈనాటి వరకు నా సేవకులను మీవద్దకు పంపియున్నాను. వారే ప్రవక్తలు. వారిని మీ వద్దకు అనేకసార్లు పంపాను. 26 కాని మీ పూర్వికులు వారి మాట వినలేదు. వారు నన్ను లెక్కచేయలేదు. వారు మిక్కిలి మొండివారు. వారి తండ్రుల కంటె వారు ఎక్కువ చెడుకార్యాలు చేశారు.
27 “యిర్మీయా, నీవు ఇవన్నీ యూదా ప్రజలకు చెపుతావు. అయినా వారు నీమాట వినరు! నీవు వారిని పిలుస్తావు. కాని వారు పలుకరు. 28 అందువల్ల వారికి నీవీ మాటలు చెప్పాలి: తన యెహోవా దేవునికి విధేయతగా లేని దేశం ఇదే. దేవుని ఉపదేశములను ఈ ప్రజలు వినలేదు. సత్య ప్రవచనాలు ఈ ప్రజలు ఎరుగరు.
వధ లోయ
29 “యిర్మీయా, నీ జుట్టు కత్తిరించి పారవేయి[e] కొండమీదికి వెళ్లి దుఃఖించుము. ఎందుకంటావా? యెహోవా ఈ తరం ప్రజలను తిరస్కరించినాడు. ఈ ప్రజలకు యెహోవా విముఖుడైనాడు. కోపంతో ఆయన వారిని శిక్షిస్తాడు. 30 ఏడ్వండి, ఎందుకంటే యూదా ప్రజలు చెడుకార్యాలు చేయటం నేను చూసియున్నాను.” ఇది యెహోవా వాక్కు. “వారు విగ్రహాలను ప్రతిష్టించారు. నేనా విగ్రహాలను అసహ్యించుకుంటున్నాను! నా పేరుతో పిలువబడే ఆలయంలో వారు విగ్రహాలను పెట్టినారు. నా నివాసాన్ని వారు అపవిత్రపర్చారు. 31 యూదా ప్రజలు బెన్ హిన్నోము లోయలో తోఫెతు అనబడే ఉన్నత స్థలాలు[f] నిర్మించారు. వారక్కడ తమ కుమారులను, కమార్తెలను చంపి వారిని బలులుగా సమర్పించారు. ఇటువంటిది నేనెన్నడూ ఆజ్ఞాపించలేదు. ముందెన్నడూ ఈ రకమైన ఆలోచనే నా మనస్సుకు రాలేదు! 32 కావున నిన్ను హెచ్చరిస్తున్నాను. ప్రజలు ఈ స్థలాన్ని తోఫెతు అనిగాని, బెన్ హిన్నోములోయ అనిగాని పిలవకుండా వుండే రోజులు వస్తున్నాయి” ఇది యెహోవా వాక్కు. పైగా వారు దీనిని కసాయి లోయ[g] అని పిలుస్తారు. “వారు ఈ పేరు పెడతారు కారణమేమంటే తోఫెతులో ఏమాత్రం ఇంకెవ్వరినీ పాతిపెట్టేందుకు ఖాళీ లేకుండా చనిపోయిన వారిని పాతిపెడతారు. 33 తరువాత శవాలను వట్టి నేలపై పడవేస్తారు. అవి పక్షులకు ఆహారమవుతాయి. ఆ శవాలను అడవి జంతువులు పీక్కొని తింటాయి. శవాలను తినే పక్షులను, జంతువులను తోలి వేయటానికి అక్కడ బ్రతికి వున్న మనుష్యుడొక్కడూ మిగలడు. 34 యూదా పట్టణాలలోను, యెరూషలేము నగర వీధులలోను ఆనందోత్సాహాలు లేకుండా చేస్తాను. యూదాలోను, యెరూషలేములోను పెండ్లి సందడులు, వేడుకలు ఇక వుండవు. ఈ రాజ్యం పనికిరాని ఎడారిలా మారిపోతుంది.”
యేసు యెరూషలేము ప్రవేశించటం
(మార్కు 11:1-11; లూకా 19:28-38; యోహాను 12:12-19)
21 యేసు, ఆయన శిష్యులు యెరూషలేమునకు వెళ్తూ బేత్పగే అనే గ్రామాన్ని చేరుకున్నారు. యేసు తన శిష్యుల్లో యిద్దర్ని ఆ గ్రామానికి పంపుతూ వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: 2 “గ్రామంలోకి వెళ్ళండి అక్కడ వాకిలిలో కట్టబడిన ఒక గాడిద, దాని పిల్ల కనబడుతాయి. వాటిని విప్పి నా దగ్గరకు తీసుకురండి. 3 ఎవరైనా అడిగితే, ‘ప్రభువుకు అవి కావాలి; వాటి అవసరం తీరిన వెంటనే తిరిగి పంపుతాడు’ అని చెప్పండి.”
4 దేవుడు ప్రవక్త ద్వారా పలికిన ఈ వాక్యాలు నిజం కావటానికి ఇలా జరిగింది:
5 “‘గాడిదనెక్కి వినయంగా
నీ రాజు వస్తున్నాడు చూడు!
బరువు మోసే గాడిద పిల్లనెక్కి వస్తున్నాడు చూడు!’
అని సీయోను కుమారితో చెప్పండి.”(A)
6 శిష్యులు వెళ్ళి యేసు ఆజ్ఞాపించినట్లు చేసారు. 7 గాడిదను, గాడిద పిల్లను తీసుకు వచ్చి వాటిపై తమ వస్త్రాలను పరిచారు. యేసు వస్త్రాలపై నెక్కి కూర్చున్నాడు. 8 అక్కడున్న వాళ్ళలో చాలామంది తమ వస్త్రాల్ని దారిపై పరిచారు. మరికొందరు చెట్ల కొమ్మల్ని విరిచి దారిపై పరిచారు. 9 ఆయనకు ముందు, వెనుక నడుస్తున్న ప్రజలు ఇలా కేకలు వేసారు.
“దావీదు కుమారునికి హోసన్నా!
‘ప్రభువు పేరిట వస్తున్నవాడు ధన్యుడు!’(B)
మహోన్నతమైన స్థలములో హోసన్నా!”
10 యేసు యెరూషలేమునకు వెళ్ళాడు. ఆ పట్టణమంతా ఆందోళన చెలరేగింది, “ఈయనెవరు?” అని ప్రజలు ప్రశ్నించారు.
11 “ఈయన యేసు, గలిలయలోని నజరేతు గ్రామానికి చెందిన ప్రవక్త!” అని ఆయన వెంటనున్న వాళ్ళే సమాధానం చెప్పారు.
యేసు ఆలయంలోనికి వెళ్ళటం
(మార్కు 11:15-19; లూకా 19:45-48; యోహాను 2:13-22)
12 యేసు ఆలయంలోకి వెళ్ళి, అక్కడ అమ్ముతున్న వాళ్ళను, కొంటున్న వాళ్ళను బయటికి వెళ్ళగొట్టాడు. డబ్బు మారకం చేస్తున్న వర్తకుల బల్లలను, పావురాలు అమ్ముతున్న వర్తకుల పీఠల్ని క్రింద పడవేసాడు. 13 ఆయన వాళ్ళతో, “‘నా ఆలయం ప్రార్థనాలయం అనిపించుకుంటుంది’(C) అని వ్రాసారు. కాని దాన్ని మీరు దోపిడి దొంగల గుహగా మార్చారు” అని అన్నాడు.
14 గ్రుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు ఆలయంలో ఉన్న ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన వాళ్ళకును నయం చేసాడు. 15 ప్రధాన యాజకులు, శాస్త్రులు ఆయన చేసిన అద్భుతాలను చూసారు. మందిరావరణంలో ఉన్న పిల్లలు, “దావీదు కుమారునికి హోసన్నా!” అని కేకలు వేయటం విన్నారు. వాళ్ళకు కోపం వచ్చింది.
16 “చిన్న పిల్లలేమంటున్నారో నీవు విన్నావా?” అని వాళ్ళు యేసును ప్రశ్నించారు.
యేసు, “విన్నాను. ‘చిన్న పిల్లలు, పసిపాపలు కూడా నిన్ను స్తుతించేటట్లు చేసావు!’(D) అని వ్రాసారు. ఇది మీరు ఎన్నడూ చదువలేదా?” అని అన్నాడు.
17 ఆయన వాళ్ళను వదిలి, పట్టణం బయట ఉన్న బేతనియ గ్రామానికి వెళ్ళి ఆ రాత్రి అక్కడ గడిపాడు.
యేసు విశ్వాస శక్తిని చూపటం
(మార్కు 11:12-14, 20-24)
18 ఉదయం ఆయన పట్టణానికి తిరిగి వెళ్తుండగా ఆయనకు ఆకలి వేసింది. 19 యేసు దారిప్రక్కనున్న ఒక అంజూరపు చెట్టును చూసి దాని దగ్గరకు వెళ్ళాడు. కాని ఆయనకు దానిపై ఆకులు తప్ప మరి ఏమియూ కనిపించలేదు. ఆయన ఆ చెట్టుతో, “ఇక మీదట నీకు ఫలం కలుగకుండా వుండుగాక!” అని అన్నాడు. వెంటనే ఆ చెట్టు ఎండిపోయింది.
20 శిష్యులు ఇది చూసి చాలా ఆశ్చర్యపడి, “అంజూరపు చెట్టు ఇంత త్వరగా ఎట్లా ఎండిపోయింది?” అని అడిగారు.
21 యేసు, “ఇది సత్యం. మీరు అనుమానం చెందకుండా విశ్వశిస్తే నేను అంజూరపు చెట్టుకు చేసినట్టు మీరు కూడా చేయగలరు. అంతే కాకుండా మీరీ పర్వతంతో ‘వెళ్ళి సముద్రంలో పడు’ అని అంటే అది అలాగే చేస్తుంది. 22 దేవుడు మీరడిగినవి యిస్తాడని విశ్వసించి ప్రార్థించండి. అప్పుడు మీరేవి అడిగితే అవి లభిస్తాయి” అని అన్నాడు.
యూదా నాయకులు యేసు అధికారాన్ని సందేహించటం
(మార్కు 11:27-33; లూకా 20:1-8)
23 యేసు మందిరానికి వెళ్ళి బోధిస్తుండగా ప్రధాన యాజకులు, పెద్దలు వచ్చి, “ఏ అధికారంతో నీవు ఈ పనులు చేస్తున్నావు? నీకి అధికారం ఎవరిచ్చారు?” అని అడిగారు.
24 యేసు సమాధానం చెబుతూ, “నేను కూడా మిమ్మల్నొక ప్రశ్న అడుగుతాను. మీరు దానికి సమాధానం చెబితే నేను ఇది ఎవరిచ్చిన అధికారంతో చేస్తున్నానో చెబుతాను. 25-26 బాప్తిస్మమివ్వమని యోహానును ఎవరు పంపారు? దేవుడా? మానవులా?” అని అడిగాడు.
వాళ్ళు, “‘దేవుడు’ అని సమాధానం చెబితే మరి అలాగైతే అతణ్ణి ఎందుకు నమ్మలేదు? అని అంటాడు ‘మానవులు’ అని సమాధానం ఇస్తే ప్రజలందరూ యోహాను ఒక ప్రవక్త అని నమ్మేవాళ్ళు కనుక వాళ్ళు ఏం చేస్తారో” అనే భయంతో పరస్పరం మాట్లాడుకొన్నారు.
27 అందువల్ల వాళ్ళు, “మాకు తెలియదు” అని సమాధానం చెప్పారు.
ఆయన, “నేను కూడా ఎవరిచ్చిన అధికారంతో యివి చేస్తున్నానో మీకు చెప్పను” అని అన్నాడు.
తండ్రి మాట పాలించిన కుమారుని ఉపమానం
28 “ఆలోచించి సమాధానం చెప్పండి. ఒకనికి యిద్దరు కుమారులుండేవాళ్ళు. అతడు మొదటి కుమారుని దగ్గరకు వెళ్ళి, ‘నాయనా! వెళ్ళి ఈ రోజు ద్రాక్షతోటలో పనిచెయ్యి!’ అని అన్నాడు.
29 “కుమారుడు, ‘నాకిష్టంలేదు’ అని సమాధానం చెప్పాడు. కాని తదుపరి తన మనస్సు మార్చుకొని పని చెయ్యటానికి వెళ్ళాడు.
30 “తండ్రి రెండవ కుమారునికి అదే విషయం చెప్పాడు. రెండవ కుమారుడు ‘వెళ్తానండి’ అని అన్నాడు. కాని వెళ్ళలేదు.
31 “ఆ యిద్దరిలో తండ్రి మాటను ఎవరు పాటించారు? అని యేసు అడిగాడు.”
“మొదటి వాడు” అని వాళ్ళు సమాధానం చెప్పారు.
యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు, “నేను మీకు సత్యం చెబుతున్నాను. సుంకరులు, వేశ్యలు మీకన్నా ముందు దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తారు. 32 మీకు నీతిమార్గాన్ని చూపటానికి యోహాను వచ్చాడు. మీరతణ్ణి నమ్మలేదు. కాని సుంకరులు, వేశ్యలు ఆయన్ని విశ్వసించారు. ఇది చూసాక కూడా మీరు మారుమనస్సు పొందలేదు, విశ్వసించలేదు.
రైతుల ఉపమానం
(మార్కు 12:1-12; లూకా 20:9-19)
33 “ఇంకొక ఉపమానాన్ని వినండి. ఒక ఆసామి ఉండేవాడు. అతడు ఒక ద్రాక్షతోట నాటాడు. చుట్టూ ఒక గోడ కట్టించి ద్రాక్షరసాన్ని తీయటానికి ఒక గానుగను, తొట్టిని కట్టించాడు. కావలి కాయటానికి ఒక కంచె వేయించాడు. ఆ తర్వాత ఆ ద్రాక్షతోటను కొంతమంది రైతులకు కౌలుకిచ్చి ప్రయాణమై వెళ్ళిపోయాడు. 34 కోతకాలం కాగానే తన సేవకుల్ని ఆ రైతుల దగ్గరకు పంపి తన భాగం తీసుకు రమ్మన్నాడు.
35 “ఆ రైతులు, ఆ సేవకుల్ని పట్టుకొని వాళ్ళలో ఒకణ్ణి కొట్టారు. మరొకణ్ణి చంపారు. మూడవవాణ్ణి రాళ్ళతో కొట్టి చంపారు. 36 ఆ ఆసామి ఈ సారి మొదటి కన్నా యింకా ఎక్కువ మంది సేవకుల్ని పంపాడు. కాని ఆ రైతులు వాళ్ళ పట్ల కూడా అదే విధంగా ప్రవర్తించారు. 37 ఆ ఆసామి ‘నా కుమారుణ్ణి వాళ్ళు గౌరవించవచ్చు!’ అని అనుకొని చివరకు తన కుమారుణ్ణి వాళ్ళ దగ్గరకు పంపాడు.
38 “కాని ఆ రైతులు అతని కుమారుణ్ణి చూసి, ‘ఇతడు వంశోద్ధారకుడు. రండి! ఇతణ్ణి చంపేసి అతని ఆస్థిని తీసుకొందాం’ అని పరస్పరం మాట్లాడుకొన్నారు. 39 ఆ తర్వాత కుమారుణ్ణి పట్టుకొని చంపి ద్రాక్షతోటకవతల పారవేసారు.
40 “మరి ఆ ద్రాక్షతోట యజమాని తిరిగి వచ్చాక ఆ రైతుల్ని ఏమి చేస్తాడంటారు?”
41 వాళ్ళు, “ఆ దుష్టుల్ని ఘోరంగా చంపేస్తాడు. ఆ తదుపరి పంట కాలంలో తన భాగాన్ని తనకిచ్చే రైతులకు ఆ ద్రాక్షతోటను కౌలుకిస్తాడు” అని సమాధానం చెప్పారు.
42 యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “లేఖనాల్లో మీరీ విషయం ఎన్నడూ చదువలేదా?
‘ఇల్లు కట్టువాళ్ళు తృణీకరించిన రాయి ముఖ్యమైన రాయి అయింది.
ఇది ప్రభువు చేసాడు. ఆ రాయి మన కండ్లకు ఆశ్చర్యంగా కనబడుతుంది!’(E)
43 “అందువల్ల నేను చెప్పేదేమిటంటే దేవుడు తన రాజ్యాన్ని మీ నుండి తీసికొని, ఆ రాజ్యానికి తగిన విధంగా ప్రవర్తించే వాళ్ళకు యిస్తాడు. 44 ఈ బండ మీద పడ్డవాడు ముక్కలై పోతాడు. ఎవని మీద ఈ బండ పడ్తుందో అతడు నలిగి పోతాడు.”
45 ప్రధాన యాజకులు, పరిసయ్యులు యేసు చెప్పిన ఉపమానం విని ఆయన తమను గురించి మాట్లాడుతున్నట్టుగా గ్రహించారు. 46 వాళ్ళు ఆయన్ని బంధించటానికి మార్గాన్ని వెతికారు. కాని ప్రజలు ఆయన్ని ఒక ప్రవక్త అని అనుకొనే వాళ్ళు కనుక వాళ్ళు ప్రజల్ని చూసి భయపడి పోయారు.
© 1997 Bible League International