Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
నిర్గమకాండము 1

ఈజిప్టులో యాకోబు కుటుంబం

యాకోబు (ఇశ్రాయేలు) తన కుమారులతో పాటు ఈజిప్టు వెళ్లాడు. ఇశ్రాయేలు కుమారుల పేర్లు ఏవంటే: రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను, బెన్యామీను, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. ప్రతియొక్కరూ కుటుంబ సమేతంగా వచ్చారు. యాకోబు సంతానం మొత్తం డెబ్బయి మంది. (12 మంది కుమారుల్లో మరొకడు యోసేపు. అతను అప్పటికే ఈజిప్టులో వున్నాడు.)

తర్వాత యోసేపు, అతని సోదరులు, వారి తరం వారు అందరూ చనిపోయారు. అయితే, ఇశ్రాయేలు ప్రజలకు పిల్లలు చాలామంది ఉన్నారు. వారి సంఖ్య చాలా పెరిగిపోయింది. ఆ ప్రజలు చాలా బలవంతులు కాగా ఈజిప్టు దేశం వాళ్లతోనే నిండిపోయింది.

ఇశ్రాయేలు ప్రజలకు కష్టాలు

అప్పుడు ఒక కొత్తరాజు ఈజిప్టును పాలించడం మొదలు పెట్టాడు. ఈ రాజుకు యోసేపు తెలియదు. ఈ రాజు తన ప్రజలతో ఇలా అన్నాడు, “ఇశ్రాయేలు జనాన్ని చూడండి. వాళ్లు చాలామంది ఉన్నారు! పైగా వాళ్లు మనకంటె చాలా బలంగా ఉన్నారు! 10 వాళ్లపైన మనం ఏదైనా పథకం వేయాలి. లేకపోతే ఏదైనా యుద్ధం వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మన శత్రువులతో ఏకం కావచ్చు. అల్లాంటప్పుడు వాళ్లు మనల్ని ఓడించి, మన దగ్గర్నుండి తప్పించుకొని పారిపోవచ్చు.”

11 ఈజిప్టు ప్రజలు ఇశ్రాయేలు ప్రజలకు జీవితాన్ని కష్టతరం చేయాలనుకొన్నారు. అందుచేత బానిసలపైన ఉండే అధికారులను ఇశ్రాయేలీయుల మీద నియమించారు. ఆ యజమానులు ఇశ్రాయేలు ప్రజలను బలవంతం చేసి ఫరోకోసం ధాన్యాదులను నిలువ చేయు పీతోము, రామసేసు పట్టణాలను కట్టించారు. (ధాన్యం మొదలైన వాటిని వాళ్లు ఈ పట్టణాల్లో నిల్వ చేసేవాళ్లు[a])

12 ఇశ్రాయేలీయులు ప్రయాసపడి పనిచేయునట్లు ఈజిప్టు వాళ్లు వారిని బలవంతపెట్టారు. కాని పనిలో ఇశ్రాయేలు ప్రజలు ఎంతగా బలవంతం చేయబడితే, అంతగా వాళ్లు పెరిగి విస్తరించిపోయారు. కనుక ఇశ్రాయేలు ప్రజలను చూస్తోంటే, ఈజిప్టు వాళ్లు మరింత ఎక్కువగా భయపడిపోయారు. 13 అందుచేత ఈజిప్టు వారు ఇశ్రాయేలు ప్రజల శరీర శ్రమను మునుపటికన్నా ఎక్కువగా కష్టతరం చేసి బలవంత పెట్టారు.

14 ఇశ్రాయేలీయుల జీవితాన్ని చాలా కష్టతరం చేశారు ఈజిప్టువారు. అడుసు[b] తొక్కి ఇటుకలు చేయడంలో వాళ్లు ఇశ్రాయేలు ప్రజల్ని బలవంతం చేశారు. అలాగే పొలాల్లో పనిచేయడానికి కూడా వాళ్లను చాల బలవంత పెట్టారు. వాళ్లు చేసిన ప్రతి పనిలోనూ వాళ్లను చాల బలవంత పెట్టి ఒత్తిడి చేసారు.

దేవుడ్ని వెంబడించిన మంత్రసానులు

15 షిఫ్రా, పూయా అను ఇద్దరు మంత్రసానులుండే వారు. వీరు ఇశ్రాయేలు స్త్రీల కాన్పు సమయాల్లో సహాయ పడేవారు. ఈజిప్టు రాజు ఈ మంత్రసానులను పిలిచి, 16 “ఈ హీబ్రూ స్త్రీలు పిల్లల్ని కనడంలో మీరు ఇలానే సహాయం చేస్తూ ఉండండి. ఒకవేళ ఆడపిల్ల పుడితే ఆ పిల్లను బ్రతకనివ్వండి, కాని శిశువు మగవాడైతే మాత్రం తప్పక చంపేయండి” అని చెప్పాడు.

17 ఆ మంత్రసానులు దైవ భక్తిగలవాళ్లు గనుక వారు రాజుగారి ఆజ్ఞకు లోబడలేదు. మగ పిల్లలందర్నీ వాళ్లు బ్రతకనిచ్చారు.

18 ఈజిప్టు రాజు ఆ మంత్రసానులను పిలిచి, “మీరు ఎందుకిలా చేసారు? ఆ మగపిల్లల్ని ఎందుకు బ్రతకనిచ్చారు?” అంటూ ప్రశ్నించాడు.

19 “ఈజిప్టు స్త్రీలకంటె హీబ్రూ స్త్రీలకు చాల బలం ఉంది. సహాయం చేసేందుకు మేము వెళ్లేలోపుగానే వాళ్లు పిల్లల్ని కనేసారు.” అంటూ మంత్రసానులు ఫరోతో చెప్పారు. 20-21 ఆ మంత్రసానుల విషయమై దేవుడు సంతోషించాడు కనుక వాళ్లకూ వారి స్వంత కుటుంబాలు ఉండేటట్టు దేవుడు వారికి మేలు చేశాడు.

హీబ్రూ ప్రజలు[c] ఇంకా పిల్లల్ని కంటూనే ఉండేవారు. వాళ్లు చాలా బలవంతులయ్యారు. 22 కనుక ఫరో, “మగశిశువు పుట్టినప్పుడల్లా, మీరు వాడ్ని నైలు నదిలో పడవేయండి. కాని ఆడపిల్లల్ని అందరినీ బ్రతకనియ్యండి” అని తన ప్రజలకు ఆజ్ఞాపించాడు.

లూకా 4

సైతాను యేసును శోధించటం

(మత్తయి 4:1-11; మార్కు 1:12-13)

యేసు యొర్దాను నది ప్రాంతం నుండి తిరిగి వచ్చాడు. ఆయన పవిత్రాత్మపూర్ణుడై యుండి ఎడారి ప్రాంతానికి ఆత్మ చేత నడిపించబడ్డాడు. అక్కడ సైతాను ఆయన్ని నలభై దినాలు శోధించాడు. ఆ నలభై రోజులు యేసు ఉపవాసం చేశాడు. ఆ తర్వాత ఆయనకు ఆకలి వేసింది.

సైతాను ఆయనతో, “నీవు దేవుని కుమారుడవైతే ఈ రాయిని రొట్టెగా మారుమని ఆజ్ఞాపించు!” అని అన్నాడు.

యేసు,

“‘మనిషి జీవించటానికి ఆహారం మాత్రమే చాలదు’ అని వ్రాయబడింది” అని సమాధానం చెప్పాడు.(A)

ఆ సైతాను ఆయన్ని ఎత్తైన స్థలానికి తీసుకు వెళ్ళాడు. ఒక్క క్షణంలో ప్రపంచంలోని రాజ్యాలన్ని ఆయనకు చూపించాడు. ఆయనతో, “వీటిపై అధికారము, వాటివల్ల లభించే గౌరవము నీకిస్తాను. అవి నావి. నా కిష్టం వచ్చిన వానికివ్వగలను. నా కాళ్ళ మీద పడితే వీటిని నీకిస్తాను.” అని అన్నాడు.

యేసు,

“‘నీ ప్రభువైన దేవుని ముందు మాత్రమే మోకరిల్లి,
    ఆయన సేవ మాత్రమే చెయ్యి’(B)

అని వ్రాయబడింది” అని సమాధానం చెప్పాడు.

సైతాను ఆయన్ని యెరూషలేములో ఉన్న ఆలయానికి తీసుకెళ్ళి ఎత్తైన స్థలంలో నిలుచోబెట్టి “నీవు దేవుని కుమారుడవైతే యిక్కడి నుండి క్రిందికి దూకు.

10 ‘దేవుడు తన దూతలతో నిన్ను కాపాడుమని ఆజ్ఞాపిస్తాడు.’(C)

11 అంతేకాక:

‘ఆ దూతులు నీ కాళ్ళు రాతికి తగలకుండా
    నిన్నుతమ చేతుల్తో ఎత్తి పట్టుకుంటారు’(D)

అని వ్రాయబడింది” అని అన్నాడు.

12 యేసు,

“‘నీ ప్రభువైన దేవుణ్ణి పరీక్షించరాదు.’(E)

అని కూడా వ్రాయబడింది” అని సమాధానం చెప్పాడు. 13 ఆ సైతాను యేసును పరీక్షించటం మానేసి అప్పటికి ఆయన్ని వదిలి పొయ్యాడు.

గలిలయలో యేసుని సేవా ప్రారంభం

(మత్తయి 4:12-17; మార్కు 1:14-15)

14 యేసు పవిత్రాత్మ శక్తితో గలిలయకు తిరిగి వచ్చాడు. ఆయన్ని గురించి ఆ చుట్టూ ఉన్న ప్రాంతాల్లోని ప్రజలకు తెలిసింది. 15 ఆయన ఆ ప్రాంతాల్లో ఉన్న సమాజ మందిరాల్లో బోధించాడు. ప్రతి ఒక్కరూ ఆయన్ని స్తుతించారు.

యేసు తన స్వగ్రామానికి వెళ్ళటం

(మత్తయి 13:53-58; మార్కు 6:1-6)

16 ఆ తర్వాత తాను పెరిగిన నజరేతు గ్రామానికి వెళ్ళాడు. ఒక విశ్రాంతి రోజున అలవాటు ప్రకారం సమాజమందిరానికి వెళ్ళి, చదవటానికి నిలుచున్నాడు. 17 అక్కడున్న వాళ్ళు, ప్రవక్త యెషయా గ్రంథాన్ని ఆయన చేతికి ఇచ్చారు. ఆయన ఆ గ్రంథములో ఈ వాక్యాలున్న పుటను తెరిచి చదవటం మొదలు పెట్టాడు:

18 “ప్రభువు నన్నభిషేకించి పేదవాళ్ళకు
    నన్ను సువార్త ప్రకటించుమన్నాడు.
అందుకే ప్రభువు ఆత్మ నాలో ఉన్నాడు.
బంధితులకు స్వేచ్ఛ ప్రకటించుమని,
    గుడ్డివారికి చూపు కలిగించాలని,
హింసింపబడే వారికి విడుదల కలిగించాలని, నన్ను పంపాడు.
19     ప్రభువు ‘తాను దయ చూపే సంవత్సరం’ ప్రకటించుమని నన్ను పంపాడు.”(F)

20 ఆ తదుపరి యేసు గ్రంథం మూసేసి దాన్ని తెచ్చిన వానికి యిచ్చి కూర్చున్నాడు. సమాజ మందిరంలో ఉన్నవాళ్ళందరి కళ్ళు ఆయనపై ఉన్నాయి. 21 ఆయన వాళ్ళతో, “ఈ రోజు గ్రంథములో వ్రాయబడిన ఈ వాక్యాలు మీరు వింటుండగానే నెరవేరాయి” అని అన్నాడు.

22 అంతా ఆయన్ని మెచ్చుకున్నారు. అంతే కాక ఆయన నోటినుండి వచ్చిన ఆ చక్కటి మాటలు విని అందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళు, “ఈయన యోసేపు కుమారుడు కదా!” అని అన్నారు.

23 యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “‘వైద్యుడా! నిన్ను నీవు నయం చేసుకో!’ అన్న సామెత మీరు నాకు చెబుతారని తెలుసు. పైగా మీరు, ‘కపెర్నహూములో చేసిన మహాత్యాల్ని గురించి మేము విన్నాము. వాటిని యిక్కడ నీ స్వగ్రామంలో కూడా చెయ్యి!’ అని అంటారని నాకు తెలుసు. 24 ఇది నిజం. ఏ ప్రవక్తనూ అతని స్వగ్రామపు ప్రజలు అంగీకరించలేదు.

25 “ఏలీయా కాలంలో ఇశ్రాయేలు దేశంలో చాలామంది వితంతువులుండినారని ఖచ్చితంగా చెప్పగలను. ఆ కాలంలో మూడున్నర సంవత్సరాలు వర్షాలు కురియలేదు. దేశమంతటా తీవ్రమైన కరువు వ్యాపించి ఉంది. 26 సీదోను రాష్ట్రంలోని సారెపతు అనే గ్రామంలో ఒక వితంతువు ఉండేది. దేవుడు ఏలీయాను ఆమె దగ్గరకు తప్పమరెవ్వరి దగ్గరకు పంపలేదు.

27 “ప్రవక్త ఎలీషా[a] కాలంలో ఇశ్రాయేలు దేశంలో చాలా మంది కుష్టురోగులుండే[b] వాళ్ళు. కాని సిరియ దేశానికి చెందిన నయమాను అనేవాణ్ణి తప్ప దేవుడు వీళ్ళలో ఒక్కరిని కూడా నయం చేయలేదు.”

28 సమాజ మందిరములో వున్న వాళ్ళందరికి యిది విని ఆయనపై చాలా కోపం వచ్చింది. 29 వాళ్ళు లేచి ఆయన్ని గ్రామం నుండి వెళ్ళగొట్టారు. ఆ గ్రామం కొండ మీద ఉంది. వాళ్ళు ఆయన్ని క్రిందికి త్రోయాలని కొండ చివరకు తీసుకు వెళ్ళారు. 30 కాని ఆయన వాళ్ళ మధ్యనుండి నడిచి తన దారిన తాను వెళ్ళి పోయాడు.

యేసు ఒక మనుష్యుని దయ్యంనుండి విడిపించటం

(మార్కు 1:21-28)

31 అక్కడి నుండి ఆయన గలిలయలోని కపెర్నహూము అనే పట్టణానికి వెళ్ళాడు. అక్కడ విశ్రాంతి రోజున బోధించటం మొదలు పెట్టాడు. 32 ఆయన అధికారమున్న వానిలా బోధించటం వల్ల వాళ్ళు ఆశ్చర్యపోయారు.

33 అదే సమయంలో దయ్యం పట్టిన వాడొకడు ఆ సమాజ మందిరంలోకి వచ్చాడు. ఆ దయ్యం బిగ్గరగా, 34 “ఓ నజరేయుడైన యేసూ! మాతో నీకేంపని? మమ్మల్ని నాశనం చెయ్యటానికి వచ్చావా? నీవెవరో నాకు తెలుసు. నీవు దేవుని పరిశుద్ధుడవు” అని అన్నది. 35 యేసు, “నోరు మూసుకొని అతని నుండి బయటకు రా!” అని గద్దించాడు. ఆ దయ్యం తాను పట్టిన వాణ్ణి క్రింద పడవేసి ఏ హానీ చెయ్యకుండా ఆ దయ్యం వెలుపలికి వచ్చింది.

36 అక్కడున్న ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళు పరస్పరం, “ఏమిటిది? దయ్యాలను కూడా ఆయన అధికారంతో ఆజ్ఞాపిస్తున్నాడే? అవి బయటికి రావటానికి ఈయన మాటల్లో ఎంత శక్తి ఉందో కదా?” అని మాట్లాడుకున్నారు. 37 ఆ చుట్టు ఉన్న ప్రాంతాల్లో ఈయన్ని గురించి అందరికి తెలిసింది.

యేసు పేతురు అత్తను నయం చేయటం

(మత్తయి 8:14-17; మార్కు 1:29-34)

38 యేసు సమాజమందిరాన్ని వదిలి సీమోను యింటికి వెళ్ళాడు. సీమోను అత్తకు జ్వరం తీవ్రంగా ఉంది. వాళ్ళు ఆమె జ్వరాన్ని గురించి యేసుకు చెప్పారు. 39 యేసు, ఆమె దగ్గరకు వచ్చి జ్వరాన్ని వదిలి పొమ్మని గద్దించాడు. జ్వరం ఆమెను వదిలి వెళ్ళిపోయింది. వెంటనే ఆమె లేచి అందరిని ఆదరించటం మొదలు పెట్టింది.

యేసు అనేకులను నయం చేయటం

40 సూర్యాస్తమయమౌతుండగా ప్రజలు రక రకాల రోగాలున్న వాళ్ళను ఆయన దగ్గరకు తీసుకు వచ్చారు. ఆయన ప్రతి ఒక్కరి మీద తన చేతుల్ని ఉంచి అందరిని నయం చేశాడు. 41 “నీవు దేవుని కుమారుడవు” అని బిగ్గరగా కేకలు వేస్తూ చాలా మంది నుండి దయ్యాలు బయటకు వచ్చాయి. వాటికి తాను క్రీస్తు అని తెలియటం వల్ల యేసు వాటిని మాట్లాడవద్దని గద్దించాడు.

యేసు ఇతర పట్టణాలకు వెళ్ళటం

(మార్కు 1:35-39)

42 తెల్లవారుతుండగా యేసు గ్రామం వదిలి ఎడారిలో ఒంటరిగా ఒక ప్రత్యేక స్థలానికి వెళ్ళాడు. ప్రజలాయన కోసం వెతుకుతూ ఆయనున్న చోటికి వచ్చారు. ఆయన తమను మళ్ళీ వదిలి వెళ్ళకుండా చెయ్యాలని ప్రయత్నించారు. 43 కాని యేసు, “దేవుని రాజ్యం యొక్క సువార్త నేను యితర పట్టణాల్లో కూడా ప్రకటించాలి. దేవుడు నన్ను అందుకే పంపాడు” అని అన్నాడు.

44 ఆయన యూదయ ప్రాంతాల్లోని సమాజ మందిరాల్లో బోధించాడు.

యోబు 18

యోబుకు బిల్దదు జవాబు

18 అప్పుడు షూహీ దేశస్తుడైన బిల్దదు యోబుకు ఇలా జవాబు చెప్పాడు:

“యోబూ! ఈ మాటలన్నీ ఎప్పుడు చాలిస్తావు?
    నీవు మౌనంగా ఉండి వినాలి. అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు
మేము పశువుల్లా బుద్ధిహీనులం అని నీవు ఎందుకు తలస్తావు?
యోబూ! నీ కోపంతో నీకు నీవే హాని చేసుకొంటున్నావు.
    కేవలం నీ కోసం మనుష్యులు ఈ భూమిని విడిచిపోవాలా?
    కేవలం నిన్ను తృప్తి పరచటం కోసం దేవుడు పర్వతాలను కదిపిస్తాడని నీవు తలస్తున్నావా?

“అవును నిజమే, దుర్మార్గుని దీపం ఆరిపోతుంది.
    అతని అగ్ని కాలకుండా ఆగిపోతుంది.
అతని ఇంటిలోని వెలుగు చీకటి అవుతుంది.
    అతని ప్రక్కగా ఉన్న దీపం ఆరిపోతుంది.
ఆ మనిషి అడుగులు మరల గట్టిగా, వేగంగా ఉండవు. కానీ అతడు నిధానంగా నడుస్తాడు, బలహీనంగా ఉంటాడు.
    అతని స్వంత దుర్మార్గపు ఆలోచనలే అతడు పడిపోయేట్టు చేస్తాయి.
అతని స్వంత పాదాలే అతనిని వలలో పడదోస్తాయి.
    అతడు బోనులోనికి నడచి, అందులో చిక్కుకొంటాడు.
ఒక బోను అతని మడిమెను పట్టేస్తుంది.
    ఒక బోను అతన్ని గట్టిగా బంధిస్తుంది.
10 అతని కోసం నేలమీద ఒక తాడు దాచబడి ఉంటుంది.
    అతని తోవలో ఒక బోను సిద్ధంగా ఉంది.
11 అతని చుట్టూరా భయం పొంచి ఉంది.
    అతడు వేసే ప్రతి అడుగు వెనుక భయం ఉంటుంది.
12 చెడ్డ కష్టాలు అతని కోసం ఆకలితో వున్నాయి.
    అతడు పడిపోయినప్పుడు పతనం, నాశనం అతని కోసం సిద్ధంగా ఉన్నాయి.
13 భయంకర రోగం అతని చర్మంలో కొన్ని భాగాలను తినివేస్తుంది.
    అది అతని చేతులను, కాళ్లను కుళ్లిపోచేస్తుంది.
14 దుర్మార్గుడు క్షేమంగా ఉన్న తన ఇంటిలో నుండి తీసుకొని పోబడతాడు.
    భయాన రాజును ఎదుర్కొనేందుకు అతడు నడిపించబడతాడు.
15 అతనికి తన ఇంటిలో ఏమీ విడిచిపెట్టబడదు.
    ఎందుకంటే అతని ఇంటినిండా, మండుతున్న గంధకం చల్లబడుతుంది.
16 క్రింద అతని వేర్లు ఎండిపోతాయి.
    పైన అతని కొమ్మలు చస్తాయి.
17 భూమి మీద మనుష్యులు అతనిని జ్ఞాపకం చేసుకోరు.
    ఏ వ్యక్తికూడ అతన్ని ఇంకెంత మాత్రం జ్ఞాపకం చేసుకోడు.
18 మనుష్యులు అతనిని వెలుతురు నుండి నెట్టివేస్తారు.
    అతడు చీకటిలోనికి శిక్షించబడతాడు.
    వారు అతన్నిలోకంలో నుండి తరిమివేస్తారు.
19 అతనికి పిల్లలు లేక మనుమలు ఎవ్వరూ ఉండరు.
    అతని కుమారుల నుండి వారసులు ఉండరు.
    అతనియింట యింకా సజీవంగా ఉండే మనుష్యులు ఎవ్వరూ ఉండరు.
20 దుర్మార్గునికి సంభవించిన దానిని గూర్చి విన్నప్పుడు పడమట ఉన్న ప్రజలు అదిరిపోతారు.
    తూర్పున ఉన్న ప్రజలు భయంతో మెత్తబడి పోతారు.
21 ఇది నిజం, దుర్మార్గునికి, అతని ఇంటికి ఇలాగే జరుగుతుంది.
    దేవుని గూర్చి లక్ష్యపెట్టని వానికి ఇలాగే జరుగుతుంది!”

1 కొరింథీయులకు 5

నీతిలేని సోదరుణ్ణి బహిష్కరించండి

మీలో లైంగిక అవినీతి బాగా వ్యాపించి పోయిందని నాకు సృష్టంగా తెలిసింది. అలాంటి అవినీతి, క్రైస్తవులు కానివాళ్ళలో కూడా లేదు. ఒకడు తన సవతి తల్లితో సంబంధం పెట్టుకొన్నాడని విన్నాను. ఇది గర్వించతగిన విషయమా? ఇది చాలా దుఃఖించవలసిన విషయము. ఈ పని చేసినవాణ్ణి మీరు సంఘం నుండి బహిష్కరించవలసి ఉంది. నేను శరీరముతో మీ దగ్గర లేకున్నా నా ఆత్మలో మీతో ఉన్నాను. నేను మీతో ఉన్నట్లు భావించి ఈ అపరాధము చేసిన వానిపై తీర్పు చెపుతున్నాను. మీరు యేసు ప్రభువు పేరిట సమావేశమైనప్పుడు నా ఆత్మలో మీతో ఉంటాను. యేసు ప్రభువు శక్తి మీలో ఉంటుంది. అప్పుడు అతణ్ణి సాతానుకు అప్పగించండి. తద్వారా వాని పాపనైజం నశించి అతని ఆత్మ మన ప్రభువు వచ్చిన రోజున రక్షింపబడుతుంది.

“పులుపు కొంచెమైనా, పిండినంతా పులుపు చేస్తుందని తెలియదా? మీరు గర్వించటం మంచిది కాదు.” పులిసిన పాత పిండిని పారవేయండి. క్రీస్తు మన పస్కా గొఱ్ఱెపిల్లగా బలి ఇవ్వబడ్డాడు. అప్పుడు మీరు క్రొత్త పిండిలా ఉంటారు. నిజానికి మీరు పులియని క్రొత్త పిండివంటివాళ్ళు. కనుక పులియని రొట్టెతో పండుగ చేసుకొందాము. ద్వేషంతో, పాపంతో కూడుకొన్న పాత పులిసిన పిండితో కాక నిష్కపటంతోనూ, సత్యంతోనూ కూడుకొన్న పులియని రొట్టెతో పండుగ ఆచరిద్దాము.

నేను నా లేఖల్లో లైంగిక అవినీతి కలవాళ్ళతో సాంగత్యం చేయవద్దని వ్రాసాను. 10 అంటే, సంఘానికి చెందని అవినీతిపరులతో, లోభులతో, మోసగాళ్ళతో, విగ్రహారాధకులతో సాంగత్యం చేయవద్దని నేను చెప్పటం లేదు. అలా చేస్తే మీరు ఈ ప్రపంచాన్నే వదిలివేయవలసి వస్తుంది. 11 నేను ప్రస్తుతం వ్రాసేది ఏమిటంటే తాను సోదరుణ్ణని చెప్పుకొంటూ, లైంగిక అవినీతితో జీవించేవానితో, లోభత్వం చేసేవానితో, విగ్రహారాధన చేసేవానితో, ఇతరులను దూషించేవానితో, త్రాగుబోతుతో, మోసం చేసేవానితో, సహవాసం చేయవద్దని చెపుతున్నాను. అలాంటి వానితో కలిసి భోజనం కూడా చేయవద్దు.

12 సంఘానికి చెందనివానిపై తీర్పు చెప్పే అధికారం నాకు లేదు. కాని సంఘంలో ఉన్నవానిపై తీర్పు చెప్పవలసిన అవసరం ఉంది. 13 “ఆ దోషిని మీ సంఘం నుండి వెలివేయండి.”(A) కాని సంఘానికి చెందనివాళ్ళపై దేవుడు తీర్పు చెపుతాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International