Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
ఆదికాండము 42

కలలు నిజం అగుట

42 ఈ సమయంలో కనాను దేశంలోను కరవు ప్రబలుతోంది. అయితే ఈజిప్టులో ధాన్యం ఉన్నట్లు యాకోబు తెలుసుకొన్నాడు. కనుక యాకోబు తన కుమారులతో ఇలా చెప్పాడు: “ఏమీ చేయకుండా ఇక్కడ ఎందుకు మనం కూర్చోవటం? ఈజిప్టులో అమ్మకానికి ధాన్యం ఉన్నట్లు నేను విన్నాను. అందుచేత మనం అక్కడికి వెళ్లి, మనం తినేందుకు ధాన్యం కొనుక్కోవాలి. అప్పుడు మనం చావకుండా బ్రతుకుతాం.”

కనుక యోసేపు సోదరులు పదిమంది ధాన్యం కొనేందుకు ఈజిప్టుకు వెళ్లారు. బెన్యామీనును యాకోబు పంపలేదు. (బెన్యామీను ఒక్కడే యోసేపుకు స్వంత తమ్ముడు). బెన్యామీనుకు ఏదైనా కీడు సంభవిస్తుందేమోనని యాకోబు భయపడ్డాడు.

కనానులో కరువు కాలం చాలా దారుణంగా ఉంది. ధాన్యం కొనుగోలు చేసేందుకు ఎంతోమంది ప్రజలు కనానునుండి ఈజిప్టు వెళ్లారు. వారిలో ఇశ్రాయేలు కుమారులు కూడ ఉన్నారు.

ఆ సమయంలో ఈజిప్టు అంతటి మీద యోసేపు పాలకుడు. ఈజిప్టుకు వచ్చిన ప్రజలకు ధాన్యం అమ్మకం చేసేందుకు గాను నియమింపబడిన అధికారి యోసేపు. అయితే యోసేపు సోదరులు అతని దగ్గరకు వచ్చి అతని ఎదుట సాష్టాంగపడ్డారు. యోసేపు తన సోదరులను చూశాడు, వారెవరయిందీ అతనికి తెలుసు, కానీ యోసేపు వారిని ఎరుగనట్టే వారితో మాట్లాడాడు. అతడు వారితో కఠినంగా మాట్లాడాడు. “ఎక్కడనుండి వచ్చారు మీరు?” అని అతడు అడిగాడు.

ఆ సోదరులు “మేము కనాను దేశంనుండి వచ్చాం. ఆహారం కొనేందుకు మేము వచ్చాం” అని జవాబిచ్చారు.

ఈ మనుష్యులు తన సోదరులని యోసేపుకు తెలుసును. కానీ అతను ఎవరయిందీ వారికి తెలియదు. అతని అన్నల విషయంలో అతనికి వచ్చిన కలలను యోసేపు జ్ఞాపకం చేసుకొన్నాడు.

యోసేపు తన అన్నలతో, “మీరు ఆహారం కొనేందుకు రాలేదు. మీరు గూఢచారులు. మా బలహీనతలు తెలుసుకొనేందుకే మీరు వచ్చారు” అన్నాడు.

10 అయితే ఆ సోదరులు, “లేదండి అయ్యా, మీ సేవకులంగా మేము వచ్చాం. ఆహారం కొనేందుకు మాత్రమే మేము వచ్చాం. 11 మేమంతా అన్నదమ్ములం. మా అందరి తండ్రి ఒక్కడే. మేము నిజాయితీగల మనుష్యులం, మేము గూఢచారలం కాము. ఆహారం కొనేందుకు మాత్రమే మేము వచ్చాం” అని అతనితో చెప్పారు.

12 అప్పుడు యోసేపు, “లేదు, లేదు, ఏ విషయంలో మేము బలహీనులమో తెలుసుకొనేందుకే మీరు వచ్చారు” అన్నాడు వారితో.

13 ఆ సోదరులు అన్నారు: “లేదు, మేమంతా అన్నదమ్ములం. మా కుటుంబంలో మొత్తం పన్నెండుమంది సోదరులం. మా అందరికీ తండ్రి ఒక్కడే. మా అందరిలో చిన్న తమ్ముడు ఇంకా ఇంటి దగ్గర మా తండ్రితోనే ఉన్నాడు. మరో తమ్ముడు చాలకాలం క్రిందటే చనిపోయాడు. మీ ముందర మేము సేవకుల్లాంటి వాళ్లం. మేము కనాను దేశం వాళ్లం.”

14 అయితే యోసేపు వారితో ఇలా అన్నాడు: “లేదు, నేను అన్నదే సరియైనట్లు నాకు తెలుస్తోంది. మీరు గూఢచారులు. 15 అయితే మీరు సత్యమే చెబుతున్నట్లు మిమ్మల్ని రుజువు చేయనిస్తాను. మీ చిన్నతమ్ముడు ఇక్కడికి వచ్చేంతవరకు మిమ్మల్ని వదలిపెట్టనని ఫరో పేరు మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. 16 కనుక మీలో ఒకరు తిరిగి వెళ్లి మీ చిన్న తమ్ముడిని ఇక్కడికి తీసుకొని రావాలి. అంతవరకు మిగిలినవారు ఇక్కడే చెరసాలలో ఉండాలి. మీరు సత్యం చెబుతున్నారో లేదో మేము చూస్తాం. అయితే మీరు గూఢచారులనే నా నమ్మకం.” 17 తర్వాత యోసేపు వాళ్లందర్నీ మూడు రోజులపాటు చెరసాలలో పెట్టాడు.

షిమ్యోను బందీగా ఉంచబడుట

18 మూడు రోజుల తర్వాత వారితో యోసేపు ఇలా అన్నాడు, “నేను దేవునికి భయపడేవాణ్ణి. అందుచేత మీరు సత్యమే చెబుతున్నారని రుజువు చేసేందుకు మీకు ఒక అవకాశం ఇస్తాను. ఇలా మీరు చేస్తే నేను మిమ్మల్ని బ్రతకనిస్తాను. 19 మీరు నమ్మకమైన మనుష్యులైతే, మీ సోదరులలో ఒకరు ఇక్కడ చెరసాలలో ఉండాలి. మిగిలినవారు మీ వాళ్లకోసం ధాన్యం తీసుకొని వెళ్లవచ్చు. 20 అప్పుడు మీ చిన్న తమ్ముడిని ఇక్కడికి తీసుకొని రండి. ఈ విధంగా, మీరు సత్యం చెబుతున్నారేమో నేను తెలుసుకొంటాను.”

ఆ సోదరులు దీనికి ఒప్పుకొన్నారు. 21 “మన చిన్న తమ్ముడికి మనం చేసిన కీడు మూలంగా శిక్ష అనుభవిస్తున్నాం. అతడు కష్టంతో ఉండటం మనం కళ్లారా చూశాం. రక్షించమని అతడు మనల్ని బ్రతిమలాడాడు. కానీ వినటానికి కూడ మనం నిరాకరించాం. అందుకే ఇప్పుడు మనం కష్టపడుతున్నాం” అని వాళ్లలో వారు చెప్పుకొన్నారు.

22 అప్పుడు రూబేను, “ఆ పిల్లవానికి మీరేమి కీడు చేయకండి అని నేను మీతో చెప్పాను కాని మీరు నా మాట వినకపోయారు. కనుక అతని మరణం మూలంగానే ఇప్పుడు మనం శిక్ష పొందుతున్నాం,” అని వాళ్లతో చెప్పాడు.

23 యోసేపు తన సోదరులతో మాట్లాడేందుకు ఒక అనువాదకుడ్ని వాడుకొన్నాడు. అందుచేత వారి భాష యోసేపు గ్రహించినట్లు ఆ సోదరులకు తెలియదు. కానీ వారు చెప్పిన ప్రతి మాటా యోసేపు విని, గ్రహించాడు. 24 వారి మాటలు యోసేపుకు చాలా దుఃఖం కలిగించాయి. అందుచేత యోసేపు వాళ్లను విడిచి వెళ్లి ఏడ్చేశాడు. కొంచెం సేపయ్యాక యోసేపు మళ్లీ వాళ్ల దగ్గరకు వెళ్లాడు. అతడు ఆ సోదరులలో ఒకడైన షిమ్యోనును పట్టుకొని మిగిలిన సోదరులు చూస్తుండగానే కట్టివేశాడు. 25 వారి సంచులను ధాన్యంతో నింపమని కొందరు సేవకులతో యోసేపు చెప్పాడు. ఈ ధాన్యం కోసం ఆ సోదరులు యోసేపుకు సొమ్ము చెల్లించారు. కానీ యోసేపు ఆ డబ్బు ఉంచుకోలేదు. ఆ డబ్బును తిరిగి వారి సంచుల్లోనే పెట్టేశాడు యోసేపు. అప్పుడు వారి ప్రయాణానికి అవసరమైన వాటన్నింటిని యోసేపు వారికి ఇచ్చాడు.

26 కనుక ఆ సోదరులు ఆ ధాన్యం గాడిదలమీద వేసుకొని వెళ్లిపోయారు. 27 ఆ సోదరులు ఆ రాత్రి ఒకచోట బస చేశారు. ఆ సోదరులలో ఒకడు తన గాడిద కొరకు కొంచెం ధాన్యం తన సంచి తెరిచాడు. అతని డబ్బు అతని సంచిలోనే కనబడింది. 28 అతడు, “చూడండి, ధాన్యంకోసం నేను చెల్లించిన డబ్బు ఇదిగో. ఈ డబ్బును ఎవరో మళ్లీ నా సంచిలో పెట్టేశారు” అని మిగతా సోదరులతో చెప్పాడు. ఆ సోదరులకు చాలా భయం వేసింది, “దేవుడు మనకు ఏం చేస్తున్నాడు?” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.

సోదరులు యాకోబుతో చెప్పుట

29 సోదరులు కనాను దేశంలో ఉన్న తమ తండ్రి యాకోబు దగ్గరకు వెళ్లారు. జరిగిన విషయాలన్నీ యాకోబుతో చెప్పారు. 30 వాళ్లు ఇలా చెప్పారు: “ఆ దేశ పాలకుడు మాతో కఠినంగా మాట్లాడాడు. మేము అక్కడి ప్రజల్ని నాశనం చేయాలనుకొనే గూఢచారులమని అనుకొన్నాడు అతడు. 31 కానీ మేము నిజాయితీపరులం అని, గూఢచారులకు చెందినవాళ్లం కాదని మేము చెప్పాం. 32 మేము పన్నెండుమంది సోదరులం అని చెప్పాం. కనానులో ఇంటి దగ్గర మా తండ్రితో మా చిన్న తమ్ముడు ఒకడు ఉన్నాడని మరియు మా మరియొక చిన్న తమ్ముడు ఒకడు చనిపోయాడని మేము అతనితో చెప్పాం.

33 “అప్పుడు, ఆ దేశపాలకుడు మాతో ఇలా అన్నాడు: ‘మీరు నమ్మకమైనవాళ్లని రుజువు చేయటానికి ఇదొక మార్గం. మీ సోదరులలో ఒకడ్ని నా దగ్గర ఉంచండి. మీ ధాన్యం మీ కుటుంబాలకు తీసుకొని వెళ్లండి. 34 తర్వాత మీ చిన్న సోదరుడ్ని నా దగ్గరకు తీసుకొని రండి. అప్పుడు నిజంగా మీరు నిజాయితీపరులో, లేక మమ్మల్ని నాశనం చేసేందుకు పంపబడిన గూఢచారులో నాకు తెలుస్తుంది. మీరు చెప్పేది నిజమైతే మీ సోదరుడ్ని మళ్లీ మీకు అప్పగిస్తాను. అతణ్ణి మీకు అప్పగిస్తాను, మా దేశంలో మీరు స్వేచ్ఛగా ధాన్యం కొనుక్కోవచ్చు.’”

35 అప్పుడు ఆ సోదరులు వారి సంచుల్లో నుండి ధాన్యం తీయటానికి వెళ్లగా వారిలో ప్రతి సోదరునికి తన ధాన్యపు సంచిలో తన డబ్బుసంచి కనిపించింది. ఆ సోదరులు, వారి తండ్రి కూడ ఆ డబ్బును చూచి చాలా భయపడిపోయారు.

36 యాకోబు, “నేను నా పిల్లలందర్నీ పోగొట్టుకోవాలని మీరు అనుకొంటున్నారా? యోసేపు పోయాడు. షిమ్యోను పోయాడు. ఇప్పుడు బెన్యామీనును గూడ మీరు తీసుకొని పోవాలనుకొంటున్నారు” అని వాళ్లతో అన్నాడు,

37 అప్పుడు రూబేను, “నాయనా, బెన్యామీనును గనుక నేను తిరిగి నీ దగ్గరకు తీసుకొని రాకపోతే, నా ఇద్దరు కుమారులను నీవు చంపేసేయ్. నన్ను నమ్ము. బెన్యామీనును నేను మళ్లీ నీ దగ్గరకు తీసుకొని వస్తాను” అని తన తండ్రితో చెప్పాడు.

38 అయితే యాకోబు చెప్పాడు: “బెన్యామీనును మీతో నేను వెళ్లనివ్వను. అతని సోదరుడు మరణించాడు, నా భార్య రాహేలు కుమారులలో ఇతను ఒక్కడే మిగిలాడు. ఈజిప్టు ప్రయాణంలో ఇతనికి ఏమైనా సంభవిస్తే నేను చచ్చిపోతాను. నా వృద్ధాప్యంలో దుఃఖంతోనే మీరు నన్ను సమాధికి పంపిస్తారు.”

మార్కు 12

రైతుల ఉపమానం

(మత్తయి 21:33-46; లూకా 20:9-19)

12 ఆ తర్వాత ఆయన వాళ్ళతో దృష్టాంతాలు చెబుతూ ఇలా మాట్లాడటం మొదలు పెట్టాడు: “ఒకడు ద్రాక్షాతోట వేసి, చుట్టూ ఒక గోడ కట్టాడు. ద్రాక్షపళ్ళు త్రొక్కటానికి ఒక తొట్టి కట్టించాడు. అక్కడే ఒక గోపురం కట్టించాడు. ఆ తర్వాత ఆ ద్రాక్షతోటను కొంతమంది రైతులకు కౌలుకిచ్చి ప్రయాణమై వెళ్ళిపోయాడు.

“పంటకాలం రాగానే పంటలో తనకు రావలసిన భాగం తీసుకు రమ్మని ఒక సేవకుణ్ణి వాళ్ళ దగ్గరకు పంపాడు. కాని ఆ రైతులతణ్ణి పట్టుకొని కొట్టి వట్టిచేతులతో పంపివేసారు. ఆ తర్వాత అతడు యింకొక సేవకుణ్ణి పంపాడు. వాళ్ళతణ్ణి తలపై బాది అవమానపరిచారు. అతడు యింకొక సేవకుణ్ణి కూడా పంపాడు. వాళ్ళతణ్ణి చంపివేసారు. అతడింకా చాలామందిని పంపాడు. కాని ఆ రైతులు వారిలో కొందరిని చంపారు. మరి కొందరిని కొట్టారు.

“తన ప్రియమైన కుమారుడు తప్ప పంపటానికి యింకెవ్వరూ మిగల్లేదు. వాళ్ళు తన కుమారుణ్ణి గౌరవిస్తారనుకొని చివరకు తన కుమారుణ్ణి పంపాడు.

“కాని ఆ రైతులు, ‘ఇతడు వారసుడు! యితణ్ణి చంపుదాం; అప్పుడు ఆ వారసత్వం మనకు దక్కుతుంది’ అని పరస్పరం మాట్లాడుకొన్నారు. ఆ కారణంగా వాళ్ళతణ్ణి పట్టుకొని చంపి ఆ ద్రాక్షతోటకు అవతల పడవేసారు.

“అప్పుడు ఆ ద్రాక్షతోట యజమాని ఏం చేస్తాడు? వచ్చి ఆ రైతుల్ని చంపేసి ఆ ద్రాక్షతోటను యితరులకు కౌలుకిస్తాడు. 10 లేఖనాల్లో ఈ విధంగా వ్రాసారు: ఇది మీరు చదువలేదా?

‘ఇల్లు కట్టువాళ్ళు పనికిరాదని పారవేసిన రాయి తలరాయిగా మారింది.
11 ఇది ప్రభువు చేసాడు. ఆ అద్భుతాన్ని మనం కండ్లారా చూసాము.’”(A)

12 ఈ దృష్టాంతం తమనుగూర్చి చెప్పాడని యూదులు గ్రహించారు. కనుక ఆయన్ని బంధించటానికి మార్గం ఆలోచించారు. కాని ప్రజల గుంపును చూసి భయపడిపొయ్యారు. అందువల్ల ఆయన్ని వదిలి వెళ్ళిపొయ్యారు.

యూదా నాయకులు యేసును మోసగించుటకు ప్రయత్నించటం

(మత్తయి 22:15-22; లూకా 20:20-26)

13 ఆ తర్వాత యేసును ఆయన మాటల్లో పట్టేయాలని కొంతమంది పరిసయ్యుల్ని[a] హేరోదు రాజు పక్షముననున్న వాళ్ళను ఆయన దగ్గరకు పంపారు. 14 వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చి, “అయ్యా! మీరు సత్యవంతులని మాకు తెలుసు. మీరు మానవుల మాటలకు లొంగిపోరు. వాళ్ళెవరనే విషయం మీకు అవసరం లేదు. సత్యమార్గాన్ని మీరు ఉన్నది ఉన్నట్లు బోధిస్తారు. మరి చక్రవర్తికి పన్నులు కట్టటం న్యాయమా? కాదా? మేము పన్నులు కట్టాలా మానాలా?” అని అడిగారు.

15 యేసుకు వాళ్ళ కుట్ర తెలిసి పోయింది. “నన్నెందుకు మోసం చేయాలని అనుకుంటున్నారు? ఒక దేనారా[b] యివ్వండి. నన్ను దాన్ని చూడనివ్వండి” అని అన్నాడు. 16 వాళ్ళు ఒక నాణాన్ని తీసుకు వచ్చారు. యేసు, “దీని మీద ఎవరి బొమ్మ ఉంది? ఎవరి శాసనం ఉంది?” అని అడిగాడు. “చక్రవర్తిది” అని వాళ్ళు సమాధానం చెప్పారు.

17 అప్పుడు యేసు వారితో, “చక్రవర్తికి చెందింది చక్రవర్తికి యివ్వండి, దేవునికి చెందింది దేవునికి యివ్వండి” అని అన్నాడు. ఆయన సమాధానం విని వాళ్ళు ఆశ్చర్యపొయ్యారు.

కొందరు సద్దూకయ్యులు యేసును మోసగించుటకు ప్రయత్నించటం

(మత్తయి 22:23-33; లూకా 20:27-40)

18 చనిపోయిన వాళ్ళు మళ్ళీ బ్రతకరని వాదించే సద్దూకయ్యులు ఆయన దగ్గరకు వచ్చి ఒక ప్రశ్న వేసారు. 19 “అయ్యా, ఒకని సోదరుడు చనిపోతే, ఆ చనిపోయిన సోదరునికి సంతానం లేకపోయినట్టయితే, ఆ చనిపోయిన సోదరుని భార్యను బ్రతికివున్న సోదరుడు వివాహమాడి, చనిపోయిన సోదరునికి సంతానం కలిగేటట్లు చెయ్యాలని మోషే మనకోసం ధర్మశాస్త్రంలో వ్రాసాడు. 20 ఒకప్పుడు ఏడుగురు సోదరులుండే వాళ్ళు. మొదటివాడు వివాహం చేసుకొని సంతానం లేకుండా చనిపొయ్యాడు. 21 రెండవ వాడు అతని వితంతువును వివాహమాడాడు. కాని అతడు కూడా సంతానం లేకుండా చనిపొయ్యాడు. మూడవ వానికి కూడా అదే సంభవించింది. 22 ఆ ఏడుగురిలో ఎవ్వరికి సంతానం కలగలేదు. చివరకు ఆ స్త్రీకూడా చనిపోయింది. 23 చనిపోయిన వాళ్ళు బ్రతికి వచ్చినప్పుడు ఆమె ఎవరి భార్యగా పరిగణింపబడుతుంది? ఆమెను ఆ ఏడగురు పెండ్లి చేసుకొన్నారు కదా?” అని అడిగారు.

24 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “మీకు లేఖనాలు, దేవుని శక్తి తెలియవు. కనుక పొరబడుతున్నారు. 25 చనిపోయిన వాళ్ళు బ్రతికివచ్చాక వివాహం చేసుకోరు. వాళ్ళు ఆడ, మగ అని ఉండరు. వాళ్ళు పరలోకంలో ఉన్న దేవదూతల్లా ఉంటారు. 26 ఇక చనిపోయిన వాళ్ళు బ్రతకటం విషయంలో మోషే తాను వ్రాసిన గ్రంథంలో ‘పొదను’ గురించి వ్రాసినప్పుడు, దేవుడు అతనితో ‘నేను అబ్రాహాముకు దేవుణ్ణి, ఇస్సాక్కు దేవుణ్ణి, యాకోబుకు దేవుణ్ణి’(B) అని అతనితో చెప్పాడు. 27 ‘నేను వాళ్ళ దేవుణ్ణి’ అని ఆయన అన్నప్పుడు, వాళ్ళు నిజంగా చనిపోలేదన్న మాట. అంటే ఆయన బ్రతికివున్న వాళ్ళకు మాత్రమే దేవుడు. మీరు చాలా పొరబడుతున్నారు.”[c]

అతి ముఖ్యమైన ఆజ్ఞ ఏది?

(మత్తయి 22:34-40; లూకా 10:25-28)

28 శాస్త్రుల్లో ఒకడు వచ్చి వాదన విన్నాడు. యేసు చక్కటి సమాధానం చెప్పాడని గ్రహించి, “ఆజ్ఞలన్నిటిలో ఏ ఆజ్ఞ ముఖ్య మైనది?” అని యేసును అడిగాడు.

29 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “ఓ ఇశ్రాయేలు జనాంగమా విను. మొదటిది ఇది: మన ప్రభువైన దేవుడు మాత్రమే ప్రభువు. 30 నీ శక్తి, బుద్ధి, సంపూర్ణంగా ఉపయోగిస్తూ నీ ప్రభువైన దేవుణ్ణి నీ సంపూర్ణమైన ఆత్మతో మనస్ఫూర్తిగా ప్రేమించు,(C) 31 రెండవది ఇది: నిన్ను నీవు ప్రేమించుకున్నంతగా నీ పొరుగు వాణ్ణి ప్రేమించు.(D) వీటిని మించిన ఆజ్ఞ మరొకటి లేదు.”

32 ఆ శాస్త్రి, “అయ్యా! చక్కగా చెప్పారు. దేవుడు ఒక్కడేనని, ఆయన తప్ప మరెవ్వరూ లేరని సరిగ్గా చెప్పారు. 33 ఆ దేవుణ్ణి సంపూర్ణమైన బుద్ధితో, సంపూర్ణమైన మనస్సుతో శక్తినంతా ఉపయోగిస్తూ ప్రేమించాలని, మరియు తనను ప్రేమించుకొన్నంతగా, తన పొరుగువాణ్ణి ప్రేమించాలని చక్కగా చెప్పారు. ఈ రెండు ఆజ్ఞలు, బలులకన్నా, దహన బలులకన్నా ముఖ్యమైనవి” అని అన్నాడు.

34 అతడు తెలివిగా చెప్పాడని యేసు గ్రహించి అతనితో, “నీవు దేవుని రాజ్యానికి దూరంగా లేవు!” అని అన్నాడు. ఆ తర్వాత ఆయన్ని ప్రశ్నలు అడగటానికి ఎవ్వరికి ధైర్యం చాలలేదు.

క్రీస్తు దావీదు కుమారుడా లేక దావీదుకు ప్రభువా?

(మత్తయి 22:41-46; లూకా 20:41-44)

35 యేసు మందిరంలో బోధిస్తూ ఈ విధంగా అన్నాడు: “క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు ఎందుకంటున్నారు? 36 దావీదే స్వయంగా పవిత్రాత్మ ద్వారా మాట్లాడుతూ ఈ విధంగా అన్నాడు:

‘ప్రభువు, నా ప్రభువుతో ఈ విధంగా అన్నాడు:
నీ శత్రువుల్ని నీ కాళ్ళ ముందు పడవేసేవరకు
    నా కుడిచేతి వైపు కూర్చొనుము.’(E)

37 దావీదు స్వయంగా ఆయన్ని, ‘ప్రభూ!’ అని పిలిచాడు కదా! మరి అలాంటప్పుడు క్రీస్తు దావీదు కుమారుడెట్లా ఔతాడు?” అక్కడున్న ప్రజలగుంపు అత్యానందంగా ఆయన మాటలు విన్నారు.

యేసు శాస్త్రులను విమర్శించటం

(మత్తయి 23:6-7; లూకా 11:43; 20:45-47)

38 యేసు యింకా ఎన్నో విషయాలు బోధిస్తూ ఈ విధంగా అన్నాడు: “శాస్త్రుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు పొడుగాటి దుస్తులు ధరించి నడవాలని, సంతల్లో ప్రజలు తమకు నమస్కరించాలని కోరుతూ ఉంటారు. 39 వాళ్ళు సమాజాల్లో ముఖ్య స్థానాలను, విందుల్లో గౌరవప్రదమైన స్థానాలను ఆక్రమించాలని ఆశిస్తూ ఉంటారు. 40 వాళ్ళు వితంతువుల యిండ్లను దోచుకుంటూ, పైకి మాత్రం గంటల తరబడి ప్రార్థిస్తూవుంటారు. అలాంటి వాళ్ళను దేవుడు అతితీవ్రంగా శిక్షిస్తాడు.”

నిజమైన కానుక

(లూకా 21:1-4)

41 ఒక రోజు యేసు, మందిరంలో కానుకలు వేసే పెట్టెకు ఎదురుగా కూర్చొని ఉన్నాడు. ప్రజలు ఆ పెట్టెలో డబ్బును వేయటం ఆయన గమనించాడు. ధనవంతులు చాలామంది పెద్ద పెద్ద మొత్తాల్ని ఆ పెట్టెలో వేసారు. 42 కాని ఒక పేద వితంతువు వచ్చి రెండు రాగి నాణెములను ఆ పెట్టెలో వేసింది.

43 యేసు తన శిష్యులను దగ్గరకు పిలిచి, “ఇది నిజం. ఈ పేద వితంతువు ఆ పెట్టెలో అందరికన్నా ఎక్కువ డబ్బు వేసింది. 44 మిగతా వాళ్ళు తాము దాచుకొన్న ధనంలో కొంత భాగం మాత్రమే వేసారు. కాని ఆమె పేదదైనా తన దగ్గరున్నదంతా వేసింది” అని అన్నాడు.

యోబు 8

బిల్దదు యోబుతో మాట్లాడటం

అప్పుడు షూహీ వాడైన బిల్దదు జవాబిచ్చాడు:

“ఎన్నాళ్ల వరకు నీవు అలా మాట్లాడతావు?
    నీ మాటలు బలంగా వీచే గాలిలా ఉన్నాయి.
దేవుడు ఎల్లప్పుడూ న్యాయంగా ఉంటాడు.
    సక్రమంగా ఉన్నవాటిని, న్యాయాన్ని లేక నీతిని, సర్వశక్తిమంతుడైన దేవుడు ఎన్నటికీ చెరపడు.
నీ పిల్లలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి ఉంటే, ఆయన వారిని శిక్షించాడు.
    వారు వారి పాపాలకు వెల చెల్లించారు.
అయితే యోబూ, ఇప్పుడు దేవుని వైపు చూడు.
    ఆ సర్వశక్తిమంతునికి ప్రార్థించు.
నీవు పరిశుద్ధంగా, మంచివానిగా ఉంటే ఆయన వచ్చి నీకు సహాయం చేస్తాడు.
    మరియు నీ కుటుంబాన్ని, నీ వస్తువులను అయన తిరిగి నీకు ఇస్తాడు.
నీకు మొదట ఉన్నదానికంటె
    ఎక్కువగా వస్తుంది.

“యోబూ, వృద్ధులను అడిగి వారు తమ పూర్వీకుల నుండి
    ఏమి నేర్చుకొన్నారో తెలుసుకో.
ఎందుకంటే మనం నిన్ననే జన్మించినట్టు ఉంటుంది గనుక.
    మనకు ఏమీ తెలియదు.
    భూమి మీద మన జీవితాలు, ఒక నీడలా ఉన్నవి.
10 చాలాకాలం క్రిందట జీవించిన మనుష్యులు నీకు నేర్పిస్తారు.
    వారి అవగాహనతో వారు నీకు ఒక జ్ఞాన సందేశం ఇస్తారు.

11 “బిల్దదు చెప్పాడు, ఎండిన నేలమీద జమ్ము ఎత్తుగా పెరుగుతుందా?
    నీళ్లు లేకుండా రెల్లు పెరుగుతుందా?
12 లేదు, నీళ్లు గనుక ఎండిపోతే అవి వెంటనే ఎండి పోతాయి.
    వాటిని కోసి, ఉపయోగించలేనంత చిన్నవిగా అవి ఉంటాయి.
13 దేవుణ్ణి మరచిపోయే ఏ మనిషైనా సరే ఆ రెల్లులాగానే ఉంటాడు.
    దేవుణ్ణి మరచిపోయే మనిషికి భవిష్యత్తు ఉండదు.
14 ఆ మనిషి నమ్మకం బలహీనంగా ఉంటుంది.
    ఆ మనిషి నమ్మకం సాలెగూడును పోలివుంటుంది.
15 ఆ మనిషి సాలెగూటిమీద ఆనుకోగా
    ఆ గూడు తెగిపోతుంది.
అతడు సాలెగూటిని పట్టుకొని ఉంటాడు
    కాని అది అతనికి ఆధారాన్ని ఇవ్వదు.
16 సమృద్ధిగా నీళ్లు, సమృద్ధిగా సూర్యరశ్మి ఉన్న మొక్కల్లా అతడు ఉంటాడు.
    ఆ మొక్క కొమ్మలు తోట అంతటా వ్యాపిస్తాయి.
17 అది దాని వేళ్లను బండల చుట్టూరా అల్లి
    ఆ బండల్లో ఎదిగేందుకు చోటుకోసం చూస్తూ ఉంటుంది.
18 కాని మొక్క దాని చోటునుండి పెరికివేయబడినప్పుడు అది అక్కడే ఉండేదని ఎవరికీ తెలియదు.
    ‘నేను ఇంతకు ముందు ఎన్నడూ నిన్ను చూడలేదు’ అని ఆ తోట అంటుంది.
19 కనుక ఆ మొక్కను ఉన్న సంతోషం అంతా అంతే.
    తర్వాత బురదలోనుంచి ఇతర మొక్కలు పెరుగుతాయి.
20 నిర్దోషియైన మనిషిని దేవుడు విడువడు.
    చెడ్డ మనుష్యులకు ఆయన సహాయం చేయడు.
21 అప్పటికీ దేవుడు నీ నోటిని నవ్వుతోను,
    నీ పెదవులను సంతోష ధ్వనులతోను నింపుతాడు.
22 కానీ నీ శత్రువులను దేవుడు సిగ్గుపరుస్తాడు.
    దుష్టుల గృహాలను ఆయన నాశనం చేస్తాడు.”

రోమీయులకు 12

క్రొత్త జీవితము

12 అందువల్ల నా సోదరులారా! నేను మీకీ విజ్ఞప్తి చేస్తున్నాను, దేవుడు తన అనుగ్రహం చూపించాడు కనుక మీ జీవితాల్ని ఆయనకు అర్పించుకోండి. ఆయనకు ఆనందం కలిగేటట్లు పవిత్రంగా జీవించండి. ఇదే మీరు చేయవలసిన నిజమైన సేవ! ఇక మీదట ఈ లోకం తీరును అనుసరిస్తూ జీవించకండి. మీ మనస్సు మార్చుకొని మీరు కూడా మార్పు చెందండి. అప్పుడు మీరు దైవేచ్ఛ ఏమిటో తెలుసుకొని, అది ఉత్తమమైనదనీ, ఆనందం కలిగిస్తుందనీ, పరిపూర్ణమైనదనీ గ్రహిస్తారు!

దేవుడు నాకిచ్చిన అనుగ్రహాన్ని ఆధారంగా తీసుకొని మీలో ప్రతి ఒక్కరికీ నేను చెప్పేదేమిటంటే, మిమ్మల్ని గురించి మీరు ఉన్నదాని కంటే గొప్పగా భావించకండి. సక్రమంగా ఉండి దేవుడిచ్చిన విశ్వాసంతో మిమ్మల్ని మీరు అంచనా వేసుకోండి. దేహానికి ఎన్నో అవయవాలుంటాయి. ఈ అవయవాలన్నిటికీ ఒకే పని ఉండదు. అదే విధంగా అధిక సంఖ్యలో ఉన్న మనమంతా క్రీస్తులో ఒకే దేహంగా రూపొందింపబడ్డాము. ప్రతి సభ్యునికి మిగతా సభ్యులతో సంబంధం ఉంది.

దేవుని అనుగ్రహం వల్ల మనందరికి రకరకాల కృపావరాలు లభించాయి. దైవసందేశాన్ని గురించి మాట్లాడే వరాన్ని పొందినవాళ్ళు ఆ పనిని విశ్వాసంతో చెయ్యాలి. సేవ చేసే వరం పొందినవాళ్ళు సేవ చెయ్యాలి. బోధించే వరం పొందినవాళ్ళు బోధించాలి. ప్రజలను ప్రోత్సాహపరచే వరం పొందినవాళ్ళు ప్రోత్సాహ పరచాలి. దానం చేసే వరం పొందినవాళ్ళు ధారాళంగా దానం చెయ్యాలి. నాయకత్వం వహించాలని వరం పొందినవాళ్ళు శ్రద్ధతో నాయకత్వం చెయ్యాలి. దయ చూపాలని వరం పొందినవాళ్ళు ఆనందంగా దయ చూపాలి.

ప్రేమలో నిజాయితీగా ఉండండి. దుర్మార్గాన్ని ద్వేషించండి. మంచిని అంటి పెట్టుకొని ఉండండి. 10 సోదర ప్రేమతో, మమతతో ఉండండి. మీ సోదరులను మీకన్నా అధికులుగా భావించి గౌరవిస్తూ ఉండండి. 11 ఉత్సాహాన్ని వదులుకోకుండా ఉత్తేజితమైన ఆత్మతో ప్రభువు సేవ చేయండి. 12 పరలోకం లభిస్తుందన్న ఆశతో ఆనందం పొందుతూ, కష్ట సమయాల్లో సహనం వహించి, అన్ని వేళలా విశ్వాసంతో ప్రార్థిస్తూ ఉండండి. 13 మీ సహాయం అవసరమున్న దేవుని ప్రజలతో మీకున్న వాటిని పంచుకోండి. ఆతిథ్యాన్ని మరువకండి.

14 మిమ్మల్ని హింసిస్తున్న వాళ్ళను ఆశీర్వదించండి. ఆశీర్వదించాలి కాని, దూషించకూడదు. 15 ఆనందంగా ఉన్నవాళ్ళతో వాళ్ళ ఆనందాన్ని, దుఃఖంగా ఉన్నవాళ్ళతో వాళ్ళ దుఃఖాన్ని పంచుకోండి. 16 అందరి విషయంలో ఒకే విధంగా ప్రవర్తించండి. గర్వించకండి. తక్కువ స్థాయిగలవాళ్ళతో సహవాసం చెయ్యండి. మీలో మాత్రమే జ్ఞానం ఉందని భావించకండి.

17 కీడు చేసినవాళ్ళకు కీడు చెయ్యకండి. ప్రతి ఒక్కరి దృష్టిలో మంచిదనిపించేదాన్ని చెయ్యటానికి జాగ్రత్త పడండి. 18 అందరితో శాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. 19 మిత్రులారా! పగ తీర్చకోకండి. ఆగ్రహం చూపటానికి దేవునికి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే లేఖనాల్లో,

“పగ తీర్చుకోవటం నా వంతు.
    నేను ప్రతీకారం తీసుకొంటాను”(A)

అని వ్రాయబడి ఉంది. 20 దానికి మారుగా,

“మీ శత్రువు ఆకలితో ఉంటే
    అతనికి ఆహారం ఇవ్వండి.
అతనికి దాహం వేస్తుంటే నీళ్ళివ్వండి.
    ఇలా చేయటం వల్ల కాలే నిప్పులు అతని
తలపై కుమ్మరించినట్లు అతనికి అనిపిస్తుంది”(B)

అని వ్రాయబడి ఉంది. 21 చెడు మీపై గెలుపు సాధించకుండా జాగ్రత్త పడండి. చెడ్డతనాన్ని మంచితనంతో గెలవండి.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International