M’Cheyne Bible Reading Plan
అబ్రాహామా, నీ కొడుకును బలి ఇవ్వు
22 ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రాహాము యొక్క విశ్వాసాన్ని పరీక్షించాలని దేవుడు అనుకొన్నాడు. “అబ్రాహామా” అని దేవుడు అతణ్ణి పిలిచాడు.
దానికి అబ్రాహాము “చిత్తం” అన్నాడు.
2 అప్పుడు దేవుడు చెప్పాడు, “నీ కుమారుని మోరీయా దేశం తీసుకొని వెళ్లు. మోరీయాలో నీ కుమారుణ్ణి నాకు బలిగా చంపు. నీ ఒకే కుమారుడు, నీవు ప్రేమిస్తున్న నీ కుమారుడైన ఇస్సాకును ఇలా చేయాలి. అక్కడ కొండల్లో ఒక దానిమీద అతణ్ణి దహనబలిగా ఉపయోగించు. ఏ కొండ అనేది నేను నీతో చెబుతాను.”
3 ఉదయాన అబ్రాహాము లేచి, తన గాడిదను సిద్ధం చేశాడు. ఇస్సాకును తన ఇద్దరు సేవకులను అబ్రాహాము తన వెంట తీసుకు వెళ్లాడు. బలి అర్పణ కోసం కట్టెలను అబ్రాహాము నరికాడు. తర్వాత వారు వెళ్లాలని దేవుడు అతనితో చెప్పిన చోటికి వారు వెళ్లారు. 4 వారు మూడు రోజులు ప్రయాణం చేసిన తర్వాత, అబ్రాహాము కన్నులెత్తి దూరంలో వారు వెళ్లవలసిన చోటును చూశాడు. 5 అప్పుడు అబ్రాహాము, “మీరు ఈ గాడిదతో ఇక్కడ ఉండండి. నేను, నా కుమారుడు అక్కడికి వెళ్లి, ఆరాధన చేస్తాం. ఆ తర్వాత మేము మీ దగ్గరకు తిరిగి వస్తాం” అని తన సేవకులతో చెప్పాడు.
6 అబ్రాహాము బలికోసం కట్టెలు తీసుకొని, తన కుమారుని భుజంమీద పెట్టాడు. ఒక ప్రత్యేక ఖడ్గం, నిప్పు అబ్రాహాము పట్టుకొన్నాడు. అప్పుడు అబ్రాహాము, అతని కుమారుడు యిద్దరు కలిసి ఆరాధనా స్థలానికి వెళ్లారు.
7 ఇస్సాకు “తండ్రీ!” అని తన తండ్రి అబ్రాహామును పిలిచాడు.
“ఏమిటి కొడుకా?” అని అడిగాడు అబ్రాహాము.
“కట్టెలు, నిప్పు నాకు కనబడుతున్నాయి. కాని మనం బలిగా దహించే గొర్రెపిల్ల ఏది?” అని ఇస్సాకు అడిగాడు. 8 “నా కుమారుడా, బలికోసం గొర్రెపిల్లను సరైన సమయంలో దేవుడు మనకు ఇస్తాడు” అని అబ్రాహాము జవాబిచ్చాడు.
కనుక అబ్రాహాము, అతని కుమారుడు ఇద్దరూ కలిసి ఆ చోటికి వెళ్లారు. 9 దేవుడు వారికి వెళ్లమని చెప్పిన చోటికి వారు వెళ్లారు. అక్కడ అబ్రాహాము ఒక బలిపీఠం కట్టాడు. కట్టెలను ఆ బలిపీఠం మీద పెట్టాడు. తర్వాత తన కుమారుడు ఇస్సాకును అబ్రాహాము కట్టివేశాడు. బలిపీఠం మీద కట్టెలపై ఇస్సాకును పరుండబెట్టాడు. 10 అప్పుడు అబ్రాహాము తన ఖడ్గం తీసుకొని, తన కుమారుని చంపడానికి సిద్ధమయ్యాడు.
11 కాని అప్పుడు యెహోవా దూత అబ్రాహామును ఆపు చేశాడు. దేవుని దూత ఆకాశం నుండి “అబ్రాహామా, అబ్రాహామా” అని పిలిచాడు.
“చిత్తం” అని అబ్రాహాము జవాబిచ్చాడు.
12 “నీ కుమారుని చంపవద్దు, అతనికి ఏ హానీ చేయవద్దు. నీకు దేవుని పట్ల భయం, ఆరాధనా భావం ఉన్నాయని నాకిప్పుడు తెలుసు. నా కోసం, నీ కుమారుణ్ణి, అదీ, నీ ఒకే ఒక్క కుమారుణ్ణి చంపడానికి కూడా నీవు సిద్ధమేనని నేను చూశాను” అన్నాడు దేవదూత.
13 అబ్రాహాము అటు ప్రక్క చూడగా ఒక పొట్టేలు కనబడింది. ఆ పొట్టేలు కొమ్ములు ఒక పొదలో చిక్కుకొన్నాయి. కనుక అబ్రాహాము వెళ్లి, పొట్టేలును పట్టుకొని దానిని చంపాడు. ఆ పొట్టేలును దేవునికి బలిగా అబ్రాహాము ఉపయోగించాడు. అబ్రాహాము కుమారుడు రక్షించబడ్డాడు. 14 అందుచేత ఆ స్థలానికి “యెహోవా ఈరె”[a] అని అబ్రాహాము పేరు పెట్టాడు. “పర్వతం మీద యెహోవా చూసుకుంటాడు” అని ఇప్పటికి ప్రజలు చెబుతారు.
15 ఆకాశంనుండి యెహోవా దూత అబ్రాహామును రెండవసారి పిల్చాడు. 16 యెహోవా దూత చెప్పాడు: “నా కోసం నీ కుమారుణ్ణి చంపడానికి నీవు సిద్ధపడ్డావు. అతడు నీకు ఒక్కడే కుమారుడు. నా కోసం నీవు ఇలా చేశావు గనుక నేను నీకు ఈ వాగ్దానం చేస్తున్నాను. యెహోవానైన నేను వాగ్దానం చేసేది ఏమిటంటే, 17 నిజంగా నిన్ను నేను ఆశీర్వదిస్తాను. ఆకాశంలో అసంఖ్యాక నక్షత్రాలలాగా సముద్ర తీరంలో ఇసుకలాగా నీ సంతానమును చేస్తాను. నీ ప్రజలు వారి శత్రువులనందరినీ ఓడిస్తారు. 18 నీ సంతానం ద్వారా భూమిమీద ప్రతిజనం ఆశీర్వదించబడతారు. నీవు నాకు విధేయుడవయ్యావు కనుక నేను దీన్ని చేస్తాను.”
19 అప్పుడు అబ్రాహాము మళ్లీ తన సేవకుల దగ్గరకు వెళ్లిపోయాడు. వాళ్లంతా బెయేర్షెబాకు ప్రయాణమై వెళ్లిపోయారు. అబ్రాహాము అక్కడ నివసించాడు.
20 ఈ సంగతులన్నీ జరిగాక, అబ్రాహాముకు ఒక సందేశం పంపబడింది. ఆ సందేశం ఇది, “నీ సోదరుడు నాహోరు, అతని భార్య మిల్కాకు ఇప్పుడు పిల్లలు ఉన్నారు. 21 మొదటి కుమారుడు ఊజు. రెండవ కుమారుడు బూజు, మూడవ కుమారుడు కెమూయేలు, అతడు అరాము తండ్రి. 22 ఆ తర్వాత కెసెదు, హజో, పిల్దాషు, యిద్లాపు, బెతూయేలు అనువారు ఉన్నారు.” 23 బెతూయేలు రిబ్కాయొక్క తండ్రి. ఈ ఎనిమిది మంది కుమారులకు తల్లి మిల్కా, తండ్రి నాహోరు. నాహోరు అబ్రాహాము సోదరుడు. 24 మరియు నాహోరు దాసియైన రయూమా ద్వారా అతనికి ఇంకా నలుగురు కుమారులు తెబహు, గహము, తహషు, మయకా కలిగారు.
యేసు యెరూషలేము ప్రవేశించటం
(మార్కు 11:1-11; లూకా 19:28-38; యోహాను 12:12-19)
21 యేసు, ఆయన శిష్యులు యెరూషలేమునకు వెళ్తూ బేత్పగే అనే గ్రామాన్ని చేరుకున్నారు. యేసు తన శిష్యుల్లో యిద్దర్ని ఆ గ్రామానికి పంపుతూ వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: 2 “గ్రామంలోకి వెళ్ళండి అక్కడ వాకిలిలో కట్టబడిన ఒక గాడిద, దాని పిల్ల కనబడుతాయి. వాటిని విప్పి నా దగ్గరకు తీసుకురండి. 3 ఎవరైనా అడిగితే, ‘ప్రభువుకు అవి కావాలి; వాటి అవసరం తీరిన వెంటనే తిరిగి పంపుతాడు’ అని చెప్పండి.”
4 దేవుడు ప్రవక్త ద్వారా పలికిన ఈ వాక్యాలు నిజం కావటానికి ఇలా జరిగింది:
5 “‘గాడిదనెక్కి వినయంగా
నీ రాజు వస్తున్నాడు చూడు!
బరువు మోసే గాడిద పిల్లనెక్కి వస్తున్నాడు చూడు!’
అని సీయోను కుమారితో చెప్పండి.”(A)
6 శిష్యులు వెళ్ళి యేసు ఆజ్ఞాపించినట్లు చేసారు. 7 గాడిదను, గాడిద పిల్లను తీసుకు వచ్చి వాటిపై తమ వస్త్రాలను పరిచారు. యేసు వస్త్రాలపై నెక్కి కూర్చున్నాడు. 8 అక్కడున్న వాళ్ళలో చాలామంది తమ వస్త్రాల్ని దారిపై పరిచారు. మరికొందరు చెట్ల కొమ్మల్ని విరిచి దారిపై పరిచారు. 9 ఆయనకు ముందు, వెనుక నడుస్తున్న ప్రజలు ఇలా కేకలు వేసారు.
“దావీదు కుమారునికి హోసన్నా!
‘ప్రభువు పేరిట వస్తున్నవాడు ధన్యుడు!’(B)
మహోన్నతమైన స్థలములో హోసన్నా!”
10 యేసు యెరూషలేమునకు వెళ్ళాడు. ఆ పట్టణమంతా ఆందోళన చెలరేగింది, “ఈయనెవరు?” అని ప్రజలు ప్రశ్నించారు.
11 “ఈయన యేసు, గలిలయలోని నజరేతు గ్రామానికి చెందిన ప్రవక్త!” అని ఆయన వెంటనున్న వాళ్ళే సమాధానం చెప్పారు.
యేసు ఆలయంలోనికి వెళ్ళటం
(మార్కు 11:15-19; లూకా 19:45-48; యోహాను 2:13-22)
12 యేసు ఆలయంలోకి వెళ్ళి, అక్కడ అమ్ముతున్న వాళ్ళను, కొంటున్న వాళ్ళను బయటికి వెళ్ళగొట్టాడు. డబ్బు మారకం చేస్తున్న వర్తకుల బల్లలను, పావురాలు అమ్ముతున్న వర్తకుల పీఠల్ని క్రింద పడవేసాడు. 13 ఆయన వాళ్ళతో, “‘నా ఆలయం ప్రార్థనాలయం అనిపించుకుంటుంది’(C) అని వ్రాసారు. కాని దాన్ని మీరు దోపిడి దొంగల గుహగా మార్చారు” అని అన్నాడు.
14 గ్రుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు ఆలయంలో ఉన్న ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన వాళ్ళకును నయం చేసాడు. 15 ప్రధాన యాజకులు, శాస్త్రులు ఆయన చేసిన అద్భుతాలను చూసారు. మందిరావరణంలో ఉన్న పిల్లలు, “దావీదు కుమారునికి హోసన్నా!” అని కేకలు వేయటం విన్నారు. వాళ్ళకు కోపం వచ్చింది.
16 “చిన్న పిల్లలేమంటున్నారో నీవు విన్నావా?” అని వాళ్ళు యేసును ప్రశ్నించారు.
యేసు, “విన్నాను. ‘చిన్న పిల్లలు, పసిపాపలు కూడా నిన్ను స్తుతించేటట్లు చేసావు!’(D) అని వ్రాసారు. ఇది మీరు ఎన్నడూ చదువలేదా?” అని అన్నాడు.
17 ఆయన వాళ్ళను వదిలి, పట్టణం బయట ఉన్న బేతనియ గ్రామానికి వెళ్ళి ఆ రాత్రి అక్కడ గడిపాడు.
యేసు విశ్వాస శక్తిని చూపటం
(మార్కు 11:12-14, 20-24)
18 ఉదయం ఆయన పట్టణానికి తిరిగి వెళ్తుండగా ఆయనకు ఆకలి వేసింది. 19 యేసు దారిప్రక్కనున్న ఒక అంజూరపు చెట్టును చూసి దాని దగ్గరకు వెళ్ళాడు. కాని ఆయనకు దానిపై ఆకులు తప్ప మరి ఏమియూ కనిపించలేదు. ఆయన ఆ చెట్టుతో, “ఇక మీదట నీకు ఫలం కలుగకుండా వుండుగాక!” అని అన్నాడు. వెంటనే ఆ చెట్టు ఎండిపోయింది.
20 శిష్యులు ఇది చూసి చాలా ఆశ్చర్యపడి, “అంజూరపు చెట్టు ఇంత త్వరగా ఎట్లా ఎండిపోయింది?” అని అడిగారు.
21 యేసు, “ఇది సత్యం. మీరు అనుమానం చెందకుండా విశ్వశిస్తే నేను అంజూరపు చెట్టుకు చేసినట్టు మీరు కూడా చేయగలరు. అంతే కాకుండా మీరీ పర్వతంతో ‘వెళ్ళి సముద్రంలో పడు’ అని అంటే అది అలాగే చేస్తుంది. 22 దేవుడు మీరడిగినవి యిస్తాడని విశ్వసించి ప్రార్థించండి. అప్పుడు మీరేవి అడిగితే అవి లభిస్తాయి” అని అన్నాడు.
యూదా నాయకులు యేసు అధికారాన్ని సందేహించటం
(మార్కు 11:27-33; లూకా 20:1-8)
23 యేసు మందిరానికి వెళ్ళి బోధిస్తుండగా ప్రధాన యాజకులు, పెద్దలు వచ్చి, “ఏ అధికారంతో నీవు ఈ పనులు చేస్తున్నావు? నీకి అధికారం ఎవరిచ్చారు?” అని అడిగారు.
24 యేసు సమాధానం చెబుతూ, “నేను కూడా మిమ్మల్నొక ప్రశ్న అడుగుతాను. మీరు దానికి సమాధానం చెబితే నేను ఇది ఎవరిచ్చిన అధికారంతో చేస్తున్నానో చెబుతాను. 25-26 బాప్తిస్మమివ్వమని యోహానును ఎవరు పంపారు? దేవుడా? మానవులా?” అని అడిగాడు.
వాళ్ళు, “‘దేవుడు’ అని సమాధానం చెబితే మరి అలాగైతే అతణ్ణి ఎందుకు నమ్మలేదు? అని అంటాడు ‘మానవులు’ అని సమాధానం ఇస్తే ప్రజలందరూ యోహాను ఒక ప్రవక్త అని నమ్మేవాళ్ళు కనుక వాళ్ళు ఏం చేస్తారో” అనే భయంతో పరస్పరం మాట్లాడుకొన్నారు.
27 అందువల్ల వాళ్ళు, “మాకు తెలియదు” అని సమాధానం చెప్పారు.
ఆయన, “నేను కూడా ఎవరిచ్చిన అధికారంతో యివి చేస్తున్నానో మీకు చెప్పను” అని అన్నాడు.
తండ్రి మాట పాలించిన కుమారుని ఉపమానం
28 “ఆలోచించి సమాధానం చెప్పండి. ఒకనికి యిద్దరు కుమారులుండేవాళ్ళు. అతడు మొదటి కుమారుని దగ్గరకు వెళ్ళి, ‘నాయనా! వెళ్ళి ఈ రోజు ద్రాక్షతోటలో పనిచెయ్యి!’ అని అన్నాడు.
29 “కుమారుడు, ‘నాకిష్టంలేదు’ అని సమాధానం చెప్పాడు. కాని తదుపరి తన మనస్సు మార్చుకొని పని చెయ్యటానికి వెళ్ళాడు.
30 “తండ్రి రెండవ కుమారునికి అదే విషయం చెప్పాడు. రెండవ కుమారుడు ‘వెళ్తానండి’ అని అన్నాడు. కాని వెళ్ళలేదు.
31 “ఆ యిద్దరిలో తండ్రి మాటను ఎవరు పాటించారు? అని యేసు అడిగాడు.”
“మొదటి వాడు” అని వాళ్ళు సమాధానం చెప్పారు.
యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు, “నేను మీకు సత్యం చెబుతున్నాను. సుంకరులు, వేశ్యలు మీకన్నా ముందు దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తారు. 32 మీకు నీతిమార్గాన్ని చూపటానికి యోహాను వచ్చాడు. మీరతణ్ణి నమ్మలేదు. కాని సుంకరులు, వేశ్యలు ఆయన్ని విశ్వసించారు. ఇది చూసాక కూడా మీరు మారుమనస్సు పొందలేదు, విశ్వసించలేదు.
రైతుల ఉపమానం
(మార్కు 12:1-12; లూకా 20:9-19)
33 “ఇంకొక ఉపమానాన్ని వినండి. ఒక ఆసామి ఉండేవాడు. అతడు ఒక ద్రాక్షతోట నాటాడు. చుట్టూ ఒక గోడ కట్టించి ద్రాక్షరసాన్ని తీయటానికి ఒక గానుగను, తొట్టిని కట్టించాడు. కావలి కాయటానికి ఒక కంచె వేయించాడు. ఆ తర్వాత ఆ ద్రాక్షతోటను కొంతమంది రైతులకు కౌలుకిచ్చి ప్రయాణమై వెళ్ళిపోయాడు. 34 కోతకాలం కాగానే తన సేవకుల్ని ఆ రైతుల దగ్గరకు పంపి తన భాగం తీసుకు రమ్మన్నాడు.
35 “ఆ రైతులు, ఆ సేవకుల్ని పట్టుకొని వాళ్ళలో ఒకణ్ణి కొట్టారు. మరొకణ్ణి చంపారు. మూడవవాణ్ణి రాళ్ళతో కొట్టి చంపారు. 36 ఆ ఆసామి ఈ సారి మొదటి కన్నా యింకా ఎక్కువ మంది సేవకుల్ని పంపాడు. కాని ఆ రైతులు వాళ్ళ పట్ల కూడా అదే విధంగా ప్రవర్తించారు. 37 ఆ ఆసామి ‘నా కుమారుణ్ణి వాళ్ళు గౌరవించవచ్చు!’ అని అనుకొని చివరకు తన కుమారుణ్ణి వాళ్ళ దగ్గరకు పంపాడు.
38 “కాని ఆ రైతులు అతని కుమారుణ్ణి చూసి, ‘ఇతడు వంశోద్ధారకుడు. రండి! ఇతణ్ణి చంపేసి అతని ఆస్థిని తీసుకొందాం’ అని పరస్పరం మాట్లాడుకొన్నారు. 39 ఆ తర్వాత కుమారుణ్ణి పట్టుకొని చంపి ద్రాక్షతోటకవతల పారవేసారు.
40 “మరి ఆ ద్రాక్షతోట యజమాని తిరిగి వచ్చాక ఆ రైతుల్ని ఏమి చేస్తాడంటారు?”
41 వాళ్ళు, “ఆ దుష్టుల్ని ఘోరంగా చంపేస్తాడు. ఆ తదుపరి పంట కాలంలో తన భాగాన్ని తనకిచ్చే రైతులకు ఆ ద్రాక్షతోటను కౌలుకిస్తాడు” అని సమాధానం చెప్పారు.
42 యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “లేఖనాల్లో మీరీ విషయం ఎన్నడూ చదువలేదా?
‘ఇల్లు కట్టువాళ్ళు తృణీకరించిన రాయి ముఖ్యమైన రాయి అయింది.
ఇది ప్రభువు చేసాడు. ఆ రాయి మన కండ్లకు ఆశ్చర్యంగా కనబడుతుంది!’(E)
43 “అందువల్ల నేను చెప్పేదేమిటంటే దేవుడు తన రాజ్యాన్ని మీ నుండి తీసికొని, ఆ రాజ్యానికి తగిన విధంగా ప్రవర్తించే వాళ్ళకు యిస్తాడు. 44 ఈ బండ మీద పడ్డవాడు ముక్కలై పోతాడు. ఎవని మీద ఈ బండ పడ్తుందో అతడు నలిగి పోతాడు.”
45 ప్రధాన యాజకులు, పరిసయ్యులు యేసు చెప్పిన ఉపమానం విని ఆయన తమను గురించి మాట్లాడుతున్నట్టుగా గ్రహించారు. 46 వాళ్ళు ఆయన్ని బంధించటానికి మార్గాన్ని వెతికారు. కాని ప్రజలు ఆయన్ని ఒక ప్రవక్త అని అనుకొనే వాళ్ళు కనుక వాళ్ళు ప్రజల్ని చూసి భయపడి పోయారు.
యెరూషలేములోనికి క్రొత్త ప్రజలు
11 ఇశ్రాయేలు ప్రజల నాయకులు అప్పుడు యెరూషలేము నగరంలోకి నివాసం మార్చారు. మిగిలిన ఇశ్రాయేలీయులు నగరంలోకి ఇంకెవరు రావాలో నిర్ణయించవలసి వచ్చింది. అందుకని వాళ్లు చీట్లు వేశారు. ఇశ్రాయేలీయులు పదిమందిలో ఒకరు పవిత్ర నగరమైన యెరూషలేములో నివసించాలన్నది నిర్ణయం. మిగిలిన తొమ్మండుగురూ తమతమ పట్టణాల్లో నివసించవచ్చు. 2 కొందరు యెరూషలేములో నివసించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. వాళ్లు అలా స్వచ్ఛందంగా ముందుకు వచ్చినందుకు మిగిలిన వాళ్లు వాళ్లకి కృతజ్ఞత తెలిపారు.
3 యెరూషలేములో నివసించిన నాయకులెవరనగా: (కొందరు ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు, దేవాలయ సేవకులు, సొలోమోను సేవకుల వంశీయులు యూదా పట్టణాల్లో నివసించారు. ఆయా పట్టణాల వాళ్లలో ప్రతి ఒక్కడూ తన స్వంత భూమిమీద ఉన్నారు. 4 యూదా, బెన్యామీను వంశాలకు చెందిన ఇతరులు యెరూషలేము నగరంలో నివసించారు.)
ఈ క్రింది యూదా వంశీయులు యెరూషలేముకి తరలి వెళ్లారు:
ఉజ్జీయా కొడుకు అతాయా (ఉజ్జీయా జెకర్యా కొడుకు. జెకర్యా అమర్యా కొడుకు. అమర్యా షెపట్యా కొడుకు. షెపట్యా మహలేలు కొడుకు. మహలేలు పెరెసు వంశీయుడు), 5 బారూకు కొడుకు మయశేయా (బారూకు కొల్హోజె కొడుకు, కొల్హోజె హజాయా కొడుకు. హజాయా అదాయా కొడుకు. అదాయా యోయారీబు కొడుకు. యోయారీబు జెకర్యా కొడుకు. జెకర్యా షెలా వంశీయుడు). 6 యెరూషలేములో కాపురమున్న పెరెసు వంశీయులు నాలుగు వందల అరవై మంది. వారందరూ ధైర్యశాలులు.
7 యెరూషలేముకి కాపురం మార్చిన బెన్యామీను వంశీయులు:
మెషుల్లాము కొడుకు సల్లు (మెషుల్లాము యోవేదు కొడుకు. యోవేదు పెదాయా కొడుకు. పెదాయా కోలాయా కొడుకు. కోలాయా మయశేయా కొడుకు. మయశేయా ఈతీయేలు కొడుకు. ఈతీయేలు యెషయా కొడుకు). 8 జెసయ్యను అనుసరించినవారు: గబ్బయి, సల్లయి, వాళ్లు మొత్తం తోమ్మిది వందల ఇరవై ఎనిమిదిమంది. 9 జిఖ్రీ కొడుకు యోవేలు వారికి పర్యవేక్షకుడు. హోసెనూయా కొడుకు యూదా యెరూషలేము నగరవు రెండవ ప్రాంతపు వర్యవేక్షకుడు.
10 యెరూషలేముకి తరలి వెళ్లిన యాజకులు:
యోయారీబు కొడుకు యెదాయా, యాకీను, 11 హిల్కీయా కొడుకు శెరాయా (హిల్కీయా మెషూల్లము కొడుకు, మెషూల్లము సాదోకు కొడుకు. సాదోకు మెరాయోతు కొడుకు. మెరాయోతు అహీటూబు కొడుకు. అహీటూబు ఆలయంలో పర్యవేక్షకుడు), 12 వీరి సోదరులు ఎనిమిది వందల ఇరవై రెండు మంది ఆలయ సేవకులు, యెరోహాము కొడుకు అదాయా (యెరోహాము పెలల్యా కొడుకు, పెలల్యా అమ్జీ కొడుకు, అమ్జీ జెకర్యా కొడుకు, జెకర్యా పషూరు కొడుకు, పషూరు మల్కియా కొడుకు), 13 మల్కియా సోదరులు రెండువందల నలభై రెండు మంది (వీళ్లు తమతమ కుటుంబాల పెద్దలు) అజరేలు కొడుకు అమష్షయి (అజరేలు అహాజయి కొడుకు, అహాజయిమెషిల్లేమోతు కొడుకు, మెషిల్లేమెతు ఇమ్మేరు కొడుకు), 14 ఇమ్మేరు సోదరులు నూట ఇరవై ఎనిమిది మంది (వీళ్లు సాహసికులైన సైనికులు) వీరిపై అధికారి హగెదోలీము కొడుకు జబ్దీయేలు.
15 లేవీయుల్లో ఈ కింది వారు యెరూషలేముకు చేరుకున్నారు:
షష్షూబు కొడుకు షెమాయా, (హష్షూబు అజ్రీకాము కొడుకు, అజ్రీకాము హషబియా కొడుకు, హషబియా బున్నీ కొడుకు), 16 షబ్బెతయి, యోజాబాదు (వీళ్లిద్దరూ లేవీయుల నాయకులు. వీళ్లు ఆలయం బయటి పనుల పర్యవేక్షకులు), 17 మత్తన్యా (మత్తన్యా మీకా కొడుకు, మీకా జబ్ది కొడుకు, జబ్ది ఆసాఫు కొడుకు. ఆసాఫు దైవ స్తోత్రాలు, ప్రార్థన గేయాలు పాడటంలో గాయకులకి నాయకత్వం వహించేవాడు), బక్బుక్యా (తన సోదరులపై అజమాయిషీలో బక్బుక్యాది రెండవ స్థానం), షమ్మూయ కొడుకు అబ్దా, (షమ్మూయ గాలాలు కొడుకు, గాలాలు యెదూతూను కొడుకు.) 18 ఈ విధంగా, పవిత్ర నగరం యెరూషలేముకి తరలి వచ్చిన లేవీయులు రెండు వందల ఎనభై నాలుగు మంది వున్నారు.
19 యెరూషలేముకి తరలి వచ్చిన ద్వార పాలకులు:
అక్కూబు, టల్మోను, వాళ్ల సోదరుల్లో నూటడెభ్భై రెండు మంది. వాళ్లు నగర ద్వారాలను శ్రద్ధగా కాపలా కాశారు.
20 ఇశ్రాయేలీయుల్లో ఇతరులు, ఇతర యాజకులు, లేవీయులు యూదాలోని అన్ని పట్టణాల్లోనూ నివసించారు. వాళ్లలో ప్రతి ఒక్కడూ తన పూర్వీకుల స్వంత భూమిలోనే నివసించారు. 21 ఆలయ సేవకులు ఓఫెలు కొండ మీద ఉన్నారు. ఆలయ సేవకుల నాయకులు జీహా, గిష్పా.
22 యెరూషలేములోని లేవీయుల నాయకుడు ఉజ్జీ. ఉజ్జీ బానీ కొడుకు (బానీ హషబియా కొడుకు, హషబియా మత్తనయా కొడుకు, మత్తనయా మీకా కొడుకు), ఉజ్జీ ఆసాపు వంశీయుడు. ఆసాపు వంశీయులు గాయకులు, ఆలయంలో జరిగే సేవకు వాళ్లు బాధ్యులు. 23 గాయకులు రాజు ఆజ్ఞలకు బద్ధులు. రాజు ఆజ్ఞలు ఏరోజుకారోజు గాయకులు చేయవలసిన పనులను పేర్కొన్నాయి. 24 రాజు నిర్దేశించిన పనులు యేమిటో జనులకు చెప్పినవాడు పెతహయా (పెతహయా మెషెబెయేలు కొడుకు. మెషెబెయేలు జెరహు వంశీయుడు. జెరహు యూదా కొడుకు).
25 యూదా ప్రజలు ఈ క్రింది పట్టణాల్లో నివసించారు: కిర్యతర్బా, దాని చుట్టూవున్న చిన్న పట్టణాలు, దీబోను, దాని చుట్టూవున్న చిన్న పట్టణాలు; యెకబ్సెయేలు దీని చుట్టూవున్న చిన్న పట్టణాలు, 26 యేషూవ, మెలాదా, బేత్పెలెతు, 27 హజర్‌షువలు, బెయేర్షెబా, దాని చుట్టూ వున్న చిన్న పట్టణాలు, 28 సిక్లగు, మెకోనా, దాని చుట్టూవున్న చిన్న పట్టణాలు, 29 ఏన్రిమ్మోను, జోరయా, యర్మూతు, జానోహ, అదుల్లాము, 30 వాటి చుట్టూ వున్న చిన్న పట్టణాలు; లాకీషు, దాని చుట్టూవున్న పొలాలు; అజేకా, దాని చుట్టూవున్న చిన్న పట్టణాలు. ఈ విధంగా యూదా ప్రజలు బెయేర్షెబానుంచి హిన్నోము లోయ వరకూ నివాసం వున్నారు.
31 గెబకి చెందిన బెన్యామీను వంశస్థులు మిక్మషు, హాయి, బేతేలు, దాని చుట్టూవున్న చిన్నపట్టణాల్లో, 32 అనాతోతు, నోబు, అనన్యాలలో, 33 హాసోరు, రామా, గిత్తంలలో, 34 హదీదు, జెబోయిము, నెబల్లాటుల్లో, 35 లోదు, ఓనో, చేతి వృత్తుల వాళ్ల లోయలో నివాసం వున్నారు. 36 లేవీయుల కొన్ని బృందాలు బెన్యామీను ప్రాంతానికి మారారు.
యెరూషలేముకు ప్రయాణం
21 మేము సెలవు పుచ్చుకొని నేరుగా “కోసు” కు ఓడలో ప్రయాణం చేసాము. మరుసటి రోజు “రొదు” చేరుకున్నాము. అక్కడినుండి బయలుదేరి “పతర” చేరుకున్నాము. 2 ఒక ఓడ ఫొనీషియ వెళ్ళటం గమనించి అందులో ప్రయాణం చేసాము.
3 సైప్రసు ద్వీపం కనపడ్డాక ఆ ద్వీపానికి దక్షిణంగా వెళ్ళి సిరియ దేశం చేరుకున్నాం. మా ఓడ సరుకు దింపవలసి ఉంది కనుక తూరు ద్వీపంలో ఆగాము. 4 అక్కడ భక్తులుండటం గమనించి వాళ్ళతో ఏడు రోజులున్నాము. వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా యెరూషలేము వెళ్ళవద్దని పౌలుతో చెప్పారు. కాని వెళ్ళవలసిన సమయం రాగానే ప్రయాణమై మా దారిన మేము వెళ్ళాము. 5 విశ్వాసులు, తమ భార్యాబిడ్డలతో కలిసి మా వెంట ఊరి అవతలి వరకు వచ్చారు. సముద్ర తీరం చేరుకున్నాక, అందరమూ మోకరిల్లి ప్రార్థించాము. 6 పరస్పరం వీడ్కోలు చెప్పుకున్నాక మేము ఓడనెక్కాము. వాళ్ళు తమ తమ యిండ్లకు తిరిగి వెళ్ళిపోయారు.
7 మేము తూరునుండి మా ప్రయాణం సాగించి తొలేమాయి తీరం చేరుకున్నాము. అక్కడున్న సోదరుల్ని కలుసుకొని వాళ్ళతో ఒక రోజు గడిపాము. 8 మరుసటి రోజు ప్రయాణమై కైసరియ చేరుకున్నాము. అక్కడ సువార్త ప్రచారం చేస్తున్న ఫిలిప్పు అనే వ్యక్తి యింట్లో బసచేసాము. అతడు యెరూషలేములో ఎన్నుకోబడ్డ ఏడుగురిలో ఒకడు. 9 అతనికి నలుగురు పెళ్ళికాని కూతుర్లు ఉన్నారు. వాళ్ళు దైవేచ్ఛను చెప్పటంలో ప్రతిభావంతులు.
10 అక్కడ మేము చాలా రోజులున్నాక, అగబు అనే ప్రవక్త యూదయనుండి వచ్చాడు. 11 అతడు మా దగ్గరకు వచ్చి, పౌలు నడికట్టు తీసుకొని దాంతో తన కాళ్ళు చేతులు కట్టివేసుకొని ఈ విధంగా అన్నాడు: “‘ఈ నడికట్టు ఎవరిదో, అతణ్ణి యెరూషలేములో యూదులు ఈ విధంగా కట్టేసి యూదులు కానివాళ్ళకు అప్పగిస్తారు’ అని పరిశుద్ధాత్మ చెపుతున్నాడు.”
12 ఇది విని అక్కడి ప్రజలు, మేము కలిసి పౌలును యెరూషలేము వెళ్ళవద్దని బ్రతిమలాడాము. 13 పౌలు, “మీరు దుఃఖించి నా గుండెలెందుకు పగులగొడ్తున్నారు? యేసు ప్రభువు పేరిట బంధింపబడటానికే కాదు, మరణించటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను!” అని సమాధానం చెప్పాడు.
14 మేము అతని మనస్సు మార్చలేమని తెలుసుకొన్నాక, “ప్రభువు ఇచ్ఛ ఏ విధంగా ఉంటే ఆ విధంగా జరుగుతుంది,” అనుకొని మేమేమీ మాట్లాడలేదు.
15 ఆ తర్వాత అంతా సిద్ధమై యెరూషలేము వెళ్ళాము. 16 కైసరియనుండి కొందరు శిష్యులు మా వెంట వచ్చి మమ్మల్ని “మ్నాసోను” అనే అతని యింటికి పిలుచుకు వెళ్ళారు. అక్కడ మా బస. మ్నాసోను సైప్రసు ద్వీపానికి చెందినవాడు. మొదట్లో విశ్వాసులైన వాళ్ళలో ఇతడు ఒకడు.
పెద్దల్ని కలుసుకోవటం
17 మేము యెరూషలేముకు వచ్చాము. అక్కడి సోదరులు మాకు మనసారా స్వాగతమిచ్చారు. 18 మరుసటి రోజు మేము పౌలుతో కలిసి యాకోబును చూడాలని వెళ్ళాము. అక్కడ సంఘ పెద్దలందరూ ఉన్నారు. 19 పౌలు వాళ్ళను కుశల ప్రశ్నలు అడిగి తాను చేసిన కార్యాల వల్ల దేవుడు యూదులు కానివాళ్ళతో చేసిన వాటినన్నిటిని ఒక్కొక్కటి విడమరిచి చెప్పాడు.
20 వాళ్ళా మాటలు విని దేవుణ్ణి స్తుతించారు. ఆ తర్వాత పౌలుతో, “సోదరుడా! వేలకొలది యూదులు విశ్వాసులవటం నీవు చూస్తున్నావు. మోషే ధర్మశాస్త్రాన్ని పాటించటం ముఖ్యమని వాళ్ళ అభిప్రాయం. 21 కాని నీవు మోషే ధర్మశాస్త్రాన్ని వదలమని, కుమారులకు సున్నతి చేయించటం తప్పని, యూదుల ఆచారాలను పాటించవద్దని యూదులు కానివాళ్ళ మధ్య నివసిస్తున్న యూదులకు బోధించినట్లు వీళ్ళకు ఎవరో చెప్పారు.
22 “ఏం చెయ్యాలి? నీవు వచ్చిన విషయం వాళ్ళకు తప్పక తెలుస్తుంది. 23 అందువల్ల మేము చెప్పినట్లు చెయ్యి. మా దగ్గర మ్రొక్కుబడి ఉన్నవాళ్ళు నలుగురున్నారు. 24 వీళ్ళను నీ వెంట పిలుచుకెళ్ళు. వాళ్ళతో కలిసి శుద్ధీకరణ చేయి. వాళ్ళు తల వెంట్రుకలు తీయించుకోవటానికి అయ్యే డబ్బు చెల్లించు. అలా చేస్తే నీ గురించి విన్నవి నిజం కాదని అందరికీ రుజువౌతుంది. మోషే ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ జీవిస్తున్నావని వాళ్ళకు తెలుస్తుంది.
25 “ఇక యూదులుకాని భక్తుల విషయంలో మేమిదివరకే మా అభిప్రాయం తెలియచేసాము. వాళ్ళు ఈ నియమాన్ని మాత్రం పాటిస్తే చాలని ఇదివరకే వాళ్ళకు వ్రాసి పంపాము:
‘విగ్రహాలకు పెట్టిన నైవేద్యం ముట్టరాదు.
రక్తాన్ని, గొంతు నులిపి చంపిన జంతువుల మాంసాన్ని తినరాదు.
లైంగిక పాపము చేయరాదు’” అని అన్నారు.
పౌలు బంధింపబడటం
26 మరుసటి రోజు పౌలు వాళ్ళను పిలుచుకెళ్ళి వాళ్ళతో సహా శుద్ధి చేసుకొన్నాడు. ఆ తదుపరి యెరూషలేము మందిరానికి వెళ్ళి పూర్తిగా శుద్ధి కావటానికి ఎన్ని రోజులు వేచివుండాలో ప్రకటించాడు. చివరి రోజున తనతో వచ్చిన ప్రతి ఒక్కరి పక్షాన బలి ఇవ్వవచ్చని చెప్పాడు.
27-28 ఏడు రోజులు పూర్తిగా గడవక ముందే ఆసియ ప్రాంతంనుండి వచ్చిన కొందరు యూదులు పౌలును మందిరంలో చూసారు. వాళ్ళు ప్రజల్ని పురికొలిపి పౌలును బంధించారు. ప్రజలతో, “ఇశ్రాయేలు ప్రజలారా! మాతో సహకరించండి. ఇతడు అన్ని ప్రాంతాలు తిరిగి ఇశ్రాయేలు ప్రజల్ని గురించి, మోషే ధర్మశాస్త్రాన్ని గురించి యెరూషలేములోని మందిరాన్ని గురించి విరుద్ధంగా అందరికీ బోధించాడు. ఇప్పుడు గ్రీకుల్ని కొందర్ని మందిరంలోకి పిలుచుకొని వెళ్ళి, ఈ పవిత్ర స్థానాన్ని అపవిత్రం చేసాడు” అని బిగ్గరగా అన్నారు. 29 ప్రజలు ఎఫెసుకు చెందిన త్రోఫిమును పౌలుతో కలిసి పట్టణంలో తిరగటం చూసారు. కనుక పౌలు అతణ్ణి మందిరంలోకి పిలుచుకెళ్ళాడనుకున్నారు.
30 పట్టణమంతా అల్లర్లు వ్యాపించాయి. ప్రజలు అన్ని వైపులనుండి పరుగెత్తికొంటూ వచ్చారు. పౌలును పట్టుకొని మందిరం అవతలికి లాగి వెంటనే మందిరం యొక్క తలుపులు మూసి వేసారు. 31 వాళ్ళు, అతణ్ణి చంపే ప్రయత్నంలో ఉన్నారు. యెరూషలేమంతా అల్లర్లతో నిండిపోయిందనే వార్త సైన్యాధిపతికి పంపబడింది. 32 ఆ సైన్యాధిపతి వెంటనే కొందరు సైనికుల్ని, సైన్యాధిపతుల్ని తన వెంట బెట్టుకొని ప్రజలు గుమి కూడిన చోటికి వెళ్ళాడు. వాళ్ళు సైన్యాధిపతిని, సైనికుల్ని చూసి, పౌలును కొట్టడం మానివేసారు.
33 సైన్యాధిపతి అతని దగ్గరకు వెళ్ళి, అతణ్ణి పట్టుకొని యినుప గొలుసులతో కట్టి వేయమని ఆజ్ఞాపిస్తూ సైనికులకు అప్పగించాడు. “అతడెవరు? ఏం చేసాడు?” అని తదుపరి ప్రజల్ని విచారించాడు. 34 ప్రజలు బిగ్గరగా కేకలు వేస్తూ, ఒకరొకటి, మరొకరు మరొకటి చెప్పారు. అల్లరిగా ఉండటం వల్ల సైన్యాధిపతికి జరిగిందేమిటో తెలియలేదు. పౌలును కోటలోకి తీసుకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు. 35 పౌలు మెట్లు ఎక్కుతుండగా ప్రజలు అల్లరి చేసారు. అందువల్ల సైనికులు పౌలును మోసికొని కోటలోకి తీసుకు వెళ్ళారు. 36 ప్రజలు అతణ్ణి వెంటాడుతూ, “అతణ్ణి చంపాలి!” అని బిగ్గరగా నినాదం చేసారు.
37 సైనికులు పౌలును కోటలోకి తీసుకు వెళ్ళే ముందు, అతడు సైన్యాధిపతితో, “నేను మీతో కొద్దిగా మాట్లాడవచ్చా?” అని అడిగాడు.
సైన్యాధిపతి, “నీవు గ్రీకు భాష మాట్లాడుతున్నావే! 38 క్రితంలో ప్రభుత్వాన్ని ధిక్కరించి నాలుగు వేల మంది హంతకుల్ని ఎడారుల్లోకి పిలుచుకు వెళ్ళిన ఈజిప్టు దేశపువాడవు నీవే కదూ?” అని అడిగాడు.
39 పౌలు, “నేను యూదుణ్ణి, కిలికియ దేశంలోని తార్సు అనే ముఖ్య పట్టణానికి చెందిన పౌరుణ్ణి. నన్ను ప్రజలతో మాట్లాడనివ్వండి!” అని అడిగాడు.
40 సైన్యాధిపతి సరేనన్నాడు. పౌలు మెట్ల మీద నిలబడి చేతులెత్తి శాంతించమని ప్రజల్ని కోరాడు. అందరూ శాంతించాక “హెబ్రీ” భాషలో ఈ విధంగా మాట్లాడాడు:
© 1997 Bible League International