M’Cheyne Bible Reading Plan
లోతు బంధించబడ్డాడు
14 షీనారు రాజు అమ్రాపేలు, ఎల్లాసరు రాజు అర్యోకు, ఏలాం రాజు కదొర్లాయోమెరు, మరియు గోయీయుల రాజు తిదాలు. 2 ఈ రాజులంతా కలసి సొదొమ రాజైన బెరాతోను, గొమొర్రా రాజైన బిర్షా, అద్మా రాజైన షినాబు, సెబోయీయుల రాజైన షెమేబెరు, బెల (సోయరు అని కూడ బెల పిలవబడింది) రాజుతోను యుద్ధము చేశారు.
3 ఈ రాజులంతా సిద్దీము లోయలో వారి సైన్యాలతో కలుసుకున్నారు. (సిద్దీము లోయ యిప్పుడు ఉప్పు సముద్రం). 4 ఈ రాజులు పన్నెండు సంవత్సరాల పాటు కదొర్లాయోమెరుకు సేవ చేశారు. అయితే 13వ సంవత్సరంలో వారంతా అతని మీద తిరుగుబాటు చేశారు. 5 కనుక 14వ సంవత్సరంలో కదొర్లాయోమెరు రాజు, అతనితో ఉన్న రాజులు వీరిమీద యుద్ధం చేయటానికి వచ్చారు. కదొర్లొయోమెరు, అతనితో ఉన్న రాజులు అష్తారోతు కర్నాయిములో రఫాయి ప్రజలను ఓడించారు. హాములో జూజీయులను కూడా వారు ఓడించారు. షావే కిర్యతాయిములో ఏమీయులను వారు ఓడించారు. 6 శేయీరు[a] కొండ ప్రదేశం నుండి ఏల్పారాను వరకు హోరీయులను వారు ఓడించారు. (ఏల్పారాను ఎడారి దగ్గరగా ఉంది.) 7 తర్వాత కదొర్లాయోమెరు రాజు ఉత్తర దిశగా తిరిగి ఏన్మిష్పతు (అంటే కాదేషు)కు వెళ్లి, అమాలేకీ ప్రజలందర్నీ ఓడించాడు. అమోరీ ప్రజలను కూడా అతడు ఓడించాడు. హససోన్ తామారులో ఈ ప్రజలు నివసిస్తారు.
8 ఆ సమయంలో సొదొమ రాజు, గొమొర్రా రాజు, అద్మా రాజు, సెబోయీము రాజు, బెల రాజు (బెల అంటె సోయరు) కలసి వారి శత్రువుల మీద సిద్దీము లోయలో యుద్ధం చేయటానికి వెళ్లారు. 9 ఏలాము రాజు కదొర్లాయోమెరు, గోయీయుల రాజు తిదాలు, షీనారు రాజు అమ్రాపేలు, ఎల్లాసరు రాజు అర్యోకు మీద వారు యుద్ధము చేశారు. అందుచేత ఈ నలుగురు రాజులు ఆ ఐదుగురితో యుద్ధం చేశారు.
10 సిద్దీం లోయలో తారుతో నింపబడ్డ గుంటలు చాలా ఉన్నాయి. సొదొమ, గొమొర్రాల రాజులు వారి సైన్యాలు పారిపోయారు. చాలా మంది సైనికులు ఆ గుంటల్లో పడిపోయారు. అయితే మిగిలినవాళ్లు కొండల్లోకి పారిపోయారు.
11 కనుక సొదొమ, గొమొర్రా ప్రజల ఆస్తినంతా వారి శత్రువులు తీసుకుపోయారు. వారి బట్టలు, భోజనం అంతా తీసుకొని వారు వెళ్లిపోయారు. 12 అబ్రాము సోదరుని కుమారుడు లోతు సొదొమలో నివసిస్తుండగా శత్రువు అతణ్ణి బంధించాడు. అతని ఆస్తి మొత్తం తీసుకొని శత్రువు వెళ్లిపోయాడు. 13 పట్టుబడని లోతుయొక్క మనుష్యులలో ఒకడు అబ్రాము దగ్గరకు వెళ్లి జరిగినదాన్ని చెప్పాడు. అమ్మోరీవాడగు మమ్రే చెట్లదగ్గర అబ్రాము నివాసం చేస్తున్నాడు. మమ్రే, ఎష్కోలు, అనేరు ఒకరికి ఒకరు సహాయ ఒడంబడిక చేసుకొన్నారు. అబ్రాముకు సహాయం చేసేందుకు కూడ వారు ఒక ఒడంబడిక చేసుకొన్నారు.
అబ్రాము లోతును రక్షించుట
14 లోతు బంధించబడ్డాడని అబ్రాముకు తెలిసింది. కనుక అబ్రాము తన కుటుంబం అంతటిని సమావేశ పర్చాడు. వారిలో 318 మంది శిక్షణ పొందిన సైనికులు ఉన్నారు. అబ్రాము తన మనుష్యులకు నాయకత్వం వహించి, దాను పట్టణం వరకు శత్రువును పూర్తిగా తరిమివేశాడు. 15 ఆ రాత్రి అతడు, అతని మనుష్యులు శత్రువు మీద అకస్మాత్తుగా దాడి జరిపారు. వారు శత్రువును ఓడించి దమస్కుకు ఉత్తరాన హోబ వరకు వారిని తరిమివేశారు. 16 అప్పుడు అబ్రాము శత్రువు దొంగిలించిన వస్తువులన్నింటిని మరల వెనుకకు తీసుకొని వచ్చాడు. స్త్రీలను, సేవకులను, లోతును, అతని ఆస్తి అంతటిని అబ్రాము వెనుకకు తీసుకొని వచ్చాడు.
17 కదొర్లాయోమెరును, అతనితో ఉన్న రాజులను ఓడించిన తర్వాత అబ్రాము తన యింటికి తిరిగి వెళ్లాడు. అతడు యింటికి వచ్చుచున్నప్పుడు షావే లోయలో అతణ్ణి కలుసుకొనేందుకు సొదొమ రాజు వెళ్లాడు. (ఇప్పుడు దీనిని రాజు లోయ అంటారు.)
మెల్కీసెదెకు
18 షాలేము రాజు మెల్కీసెదెకు కూడా అబ్రామును కలుసుకొనేందుకు వెళ్లాడు. మెల్కీసెదెకు సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు. రొట్టెను, ద్రాక్షారసాన్ని మెల్కీసెదెకు తెచ్చాడు. 19 మెల్కీసెదెకు అబ్రామును ఆశీర్వదించి ఇలా అన్నాడు:
“అబ్రామా, మహోన్నతుడైన దేవుడు నీకు దీవెనలు ప్రసాదించుగాక,
దేవుడు భూమ్యాకాశాలను చేసినవాడు.
20 సర్వోన్నతుడైన దేవుణ్ణి మనం స్తుతిస్తున్నాం
నీ శత్రువుల్ని ఓడించటానికి ఆయనే నీకు సహాయం చేశాడు.”
యుద్ధ సమయంలో అబ్రాము తెచ్చుకొన్న దానంతటిలో నుండి పదోవంతు మెల్కీసెదెకునకు అతడు ఇచ్చాడు. 21 అప్పుడు సొదొమ రాజు, “వీటన్నింటిని నీ కోసమే ఉంచుకో. శత్రువుచేత బాధించబడి, తీసుకొనిపోబడ్డ నా మనుష్యులను మాత్రం నాకు ఇచ్చేయి” అని అబ్రాముతో చెప్పాడు.
22 అయితే సొదొమ రాజుతో అబ్రాము ఇలా చెప్పాడు: “భూమిని, ఆకాశాన్ని చేసిన మహోన్నతుడైన యెహోవాదేవుని పేర నేను వాగ్దానం చేస్తున్నాను. 23 నీకు చెందినది ఏదీ నేను ఉంచుకోను. ఒక నూలుపోగైనా లేక జోళ్ల దారాలయినా, ఏదీ ఉంచుకోనని నేను వాగ్దానం చేస్తున్నాను. ‘అబ్రామును నేనే ధనికునిగా చేశానని నీవు చెప్పడం నాకిష్టం లేదు.’ 24 నా యువకులు భుజించిన ఆహారం ఒక్కటి మాత్రము నేను స్వీకరిస్తాను. అయితే మిగిలినవారికి వారి వంతు నీవు ఇవ్వాలి. యుద్ధములో మేము గెలుచుకొన్న వాటిని తీసుకొని, ఆనేరు, ఎష్కోలు, మమ్రేలకు రావలసిన భాగాలు వారికి ఇవ్వు. వీళ్లు నాకు యుద్ధంలో సహాయపడ్డారు.”
రైతు విత్తనాలు చల్లుటను గురించిన ఉపమానం
(మార్కు 4:1-9; లూకా 8:4-8)
13 అదే రోజు యేసు ఇంటి నుండి వెళ్ళి సరస్సు ప్రక్కన కూర్చున్నాడు. 2 ఆయన చుట్టు పెద్ద ప్రజల గుంపు సమావేశమైంది. అందువల్ల ఆయన పడవనెక్కి కూర్చున్నాడు. ప్రజలు సరస్సు ఒడ్డున నిలుచున్నారు. 3 ఆయన వాళ్ళకు ఎన్నో విషయాలు ఉపమానాలు చెబుతూ బోధించాడు,
“ఒక రైతు విత్తనాలు చల్లటానికి వెళ్ళాడు. 4 అతడు విత్తనాలు చల్లుతుండగా కొన్ని విత్తనాలు దారి ప్రక్కన పడ్డాయి. పక్షులు వచ్చి వాటిని తినివేసాయి. 5 మరి కొన్ని విత్తనాలు మట్టి ఎక్కువగా లేని రాతి నేలపై పడ్డాయి. మట్టి ఎక్కువగా లేనందున అవి త్వరగా మొలకెత్తాయి. 6 కాని సూర్యోదయమయ్యాక ఆ మొక్కలు వాడి పొయ్యాయి. వాటివేర్లు పెరగనందువల్ల అవి ఎండిపొయ్యాయి. 7 మరి కొన్ని విత్తనాలు ముండ్ల మొక్కల మధ్య పడ్డాయి. ఈ ముళ్ళ మొక్కలు పెరిగి ధాన్యపు మొక్కల్ని అణిచి వేసాయి. 8 మరి కొన్ని విత్తనాలు సారవంతమైన నేలపై బడ్డాయి. వాటిలో కొన్ని నూరు రెట్ల పంటను, కొన్ని అరవై రెట్ల పంటను, కొన్ని ముప్పైరెట్ల పంటనిచ్చాయి. 9 వినేవాళ్లు వినండి!”
యేసు బోధించుటకు ఉపమానములను ఎందుకు ఉపయోగించాడు
(మార్కు 4:10-12; లూకా 8:9-10)
10 శిష్యులు వచ్చి యేసును, “మీరు ప్రజలతో ఉపమానాలు ఉపయోగించి ఎందుకు మాట్లాడుతారు?” అని అడిగారు.
11 ఆయన ఈ విధంగా సమాధానం చెప్పాడు: “దేవుని రాజ్యం యొక్క రహస్యాలను తెలుసుకొనే జ్ఞానాన్ని మీరు పొందారు. వాళ్ళుకాదు. 12 దేవుడు గ్రహింపు ఉన్న వాళ్ళకు ఇంకా ఎక్కువగా ఇస్తాడు. లేని వాళ్ళ దగ్గరనుండి ఉన్నది కూడా తీసివేస్తాడు. 13 నేను వాళ్ళతో ఉపమానాల ద్వారా ఎందుకు మాట్లాడుతున్నానంటే, చూసినా వాళ్ళు అర్థం చేసుకోలేరు. విన్నా అర్దంచేసుకోరు, గ్రహించరు. 14 తద్వారా యెషయా ప్రవక్త ద్వారా చెప్పిన ఈ ప్రవచనం వాళ్ళ విషయంలో నిజమైంది:
‘మీరు తప్పక వింటారు,
కాని అర్థంచేసుకోలేరు.
మీరు తప్పక చూస్తారు
కాని గ్రహించలేరు.
15 వాళ్ళు కళ్ళతో చూసి, చెవుల్తో విని,
హృదయాలతో అర్థం చేసుకొని నావైపు మళ్ళితే
నేను వాళ్ళను నయం చేస్తాను.
కాని అలా జరుగరాదని
ఈ ప్రజల హృదయాలు మొద్దుబారాయి.
వాళ్ళకు బాగా వినిపించదు.
వాళ్ళు తమ కళ్ళు మూసికొన్నారు.’(A)
16 కాని మీ కళ్ళు చూడకలుగుతున్నాయి. కనుక అవి ధన్యమైనవి. మీ చెవులు వినకలుగుతున్నాయి. కనుక అవి ధన్యమైనవి. 17 ఎందుకంటే ఎందరో ప్రవక్తలు, నీతిమంతులు మీరుచూస్తున్నవి చూడాలని ఆశించారు. కాని చూడలేక పోయారు. మీరు వింటున్నవి వినాలని ఆశించారు. కాని వినలేక పోయారు. ఇది సత్యం.
యేసు విత్తనము యొక్క ఉపమానమును వివరించటం
(మార్కు 4:13-20; లూకా 8:11-15)
18 “మరి విత్తనాన్ని చల్లే రైతు ఉపమానాన్ని గురించి వినండి.
19 “కొందరు దేవుని రాజ్యాన్ని గురించి వింటారు. కాని అర్థం చేసుకోరు. అలాంటి హృదయాల్లో నాటబడిన దైవ సందేశాన్ని సైతాను తీసుకు వెళ్తాడు. వీళ్ళను రహదారి ప్రక్కనపడిన విత్తనాలతో పోల్చవచ్చు.
20 “దైవ సందేశాన్ని విని వెంటనే ఆనందంగా అంగీకరించే వాళ్ళను రాతి నేలపైబడ్డ విత్తనాలతో పోల్చవచ్చు. 21 అలాంటి విత్తనాలకు వేర్లు ఉండవు. కనుక అవి చాలాకాలం బ్రతుకవు. సందేశం వలన కష్టాలుకాని హింసలు కాని సంభవించినప్పుడు వాళ్ళు వెంటనే దాన్ని వదలి వేస్తారు.
22 “దైవ సందేశాన్ని విని జీవితంలోని కష్టాలకు, ధనంవలన కలిగే మోసానికి ఉక్కిరి బిక్కిరై, నిష్పలులై పోయే వాళ్ళను ముళ్ళ మొక్కల్లో పడిన విత్తనాలతో పోల్చవచ్చు.
23 “దైవ సందేశాన్ని విని దాన్ని అర్ధం చేసుకొనే వాళ్ళను సారవంతమైన భూమిలో పడ్డ విత్తనాలతో పోల్చవచ్చు. వాటిలో కొన్ని నూరురెట్లు పంటను, కొన్ని అరవై రెట్లు పంటను, కొన్ని ముప్పైరెట్లు పంటను యిస్తాయి.”
కలుపు మొక్కలు
24 యేసు వాళ్ళకింకొక ఉపమానం చెప్పాడు: “దేవుని రాజ్యాన్ని మంచి విత్తనాల్ని తన పొలంలో నాటిన మనిషితో పోల్చవచ్చు. 25 అందరూ నిద్రపోతుండగా అతని శత్రువు వచ్చి గోధుమ విత్తనాల మధ్య కలుపు విత్తనాలను చల్లిపోయాడు. 26 గోధుమ మొలకెత్తి విత్తనం వేసింది. వాటితో సహా కలుపుమొక్కలు కూడ కనిపించాయి. 27 పని వాళ్ళు, తమ యజమాని దగ్గరకు వచ్చి ‘అయ్యా! మీరు మీ పొలంలో మంచి విత్తనాలను నాటలేదా? మరి కలపు మొక్కలు ఎట్లా మొలిచాయి?’ అని అడిగారు.
28 “‘ఇది శత్రువు చేసిన పని’ అని ఆ యజమాని సమాధానం చెప్పాడు.
“పని వాళ్ళు, ‘మమ్మల్ని వెళ్ళి కలుపు తీయమంటారా?’ అని అడిగారు.
29 “అతడు, ‘వద్దు! మీరిప్పుడు కలుపు తీస్తే గోధుమ మొక్కల్ని కూడా పెరికి వేసే అవకాశం ఉంది. 30 కోతకొచ్చేవరకు రెండింటినీ పెరగనివ్వండి. అప్పుడు నేను కోత కోసే వాళ్ళతో, మొదట కలుపు మొక్కలు కోసి, కాల్చివేయటానికి వాటిని మోపులుగా కట్టి కాల్చివేయండి. ఆ తర్వాత గోధుమ గింజల్ని ప్రోగు చేసి నా ధాన్యపు కొట్టులోకి తీసుకు వెళ్ళమంటాను’ అని అంటాడు.”
దేవుని రాజ్యం దేనీతో పోల్చపడింది?
(మార్కు 4:30-34; లూకా 13:18-21)
31 ఆయన వాళ్ళకింకొక ఉపమానం చెప్పాడు: “దేవుని రాజ్యాన్ని ఒక ఆవగింజతో పోల్చవచ్చు. ఒక వ్యక్తి ఒక ఆవగింజను తన తోటలో నాటాడు. 32 అది విత్తనాలన్నిటికన్నా చిన్నదైనా, పెరిగినప్పుడది మొక్కలన్నిటి కన్నా పెద్దగా పెరిగి ఒక చెట్టవుతుంది. గాలిలో ఎగిరే పక్షులు దాని కొమ్మలపై గూళ్ళు కట్టుకొంటాయి.”
33 యేసు వాళ్లకింకొక ఉపమానం చెప్పాడు: “దేవుని రాజ్యం పులుపు పిండి లాంటిది. ఒక స్త్రీ పులిసినపిండిని తీసికొని మూడు సేర్ల పిండిలో కలిపింది. అలా చెయ్యటం వల్ల ఆ పిండంతా పులుపుగా మారింది.”
34 యేసు ప్రజలకు ఇవన్నీ ఉపమానాల ద్వారా చెప్పాడు. ఉపమానం ఉపయోగించకుండా వాళ్ళకేదీ చెప్పలేదు. 35 దాంతో ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన వాక్యాలు నిజమయ్యాయి:
“నేను ఉపమానాల ద్వారా మాట్లాడి,
ప్రపంచం సృష్టింపబడిన నాటినుండి దాచబడిన వాటిని చెబుతాను.”(B)
కలుపు ఉపమానానికి అర్థం
36 ఆ తర్వాత ఆయన ప్రజల్ని వదలి యింట్లోకి వెళ్ళాడు. ఆయన శిష్యులు వచ్చి ఆయన్ని, “పొలంలోని కలుపు మొక్కల ఉపమానాన్ని గురించి మాకు వివరంగా చెప్పండి” అని అడిగారు.
37 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “మంచి విత్తనాన్ని నాటుతున్న వాడు మనుష్య కుమారుడు. 38 ఈ ప్రపంచం పొలంతో పోల్చబడింది. మంచి విత్తనాలు దేవుని రాజ్యంలోవున్న ప్రజలతో పోల్చబడ్డాయి. పొలంలోని కలుపు మొక్కలు సైతాను కుమారులతో పోల్చబడ్డాయి. 39 వాటిని నాటిన శత్రువు సైతానుతో పోల్చబడ్డాడు. కోతకాలం యుగాంతంతో పోల్చబడింది. కోతకోసేవాళ్ళు దేవదూతలతో పోల్చబడ్డారు.
40 “కలుపు మొక్కల్ని పెరికి మంటల్లో వేసి కాల్చి వేసినట్లే యుగాంతంలో కూడా మనుష్య కుమారుడు తన దూతల్ని పంపుతాడు. 41 వాళ్ళు వచ్చి ఆయన రాజ్యంలో ఉన్న పాపుల్ని, పాపాలను కలుగజేసే వాళ్ళను ప్రోగు చేస్తారు. అలా ప్రోగు చేసి వాళ్ళను అగ్ని గుండంలో పారవేస్తారు. 42 వాళ్ళు ఏడుస్తారు. బాధననుభవిస్తారు. 43 ఆ తర్వాత నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యునిలా ప్రకాశిస్తారు. విన్నవాళ్ళు అర్థం చేసుకోండి!
దాచిన నిధి
44 “దేవుని రాజ్యం పొలంలో దాచబడిన నిధి లాంటిది. ఒక వ్యక్తి ఆ నిధిని కనుగొన్నాడు. కాని వెంటనే దాన్ని దాచేసాడు. ఆ తర్వాత ఆనందంగా వెళ్ళి తన దగ్గరున్నవన్నీ అమ్మివేసి ఆ పొలాన్ని కొన్నాడు.
45 “దేవుని రాజ్యం మంచి ముత్యాల కోసం వెతికే వర్తకుని లాంటిది. 46 ఒక వర్తకుడు మంచి విలువైన ఒక ముత్యాన్ని కనుగొన్నాడు. ఆ తర్వాత వెళ్ళి తనకున్నదంతా అమ్మేసి దాన్ని కొన్నాడు.
చేపలనుపట్టు వల యొక్క ఉపమానం
47 “దేవుని రాజ్యం సరస్సులోకి వేసి అన్ని రకాల చేపల్ని పట్టుకొనే ఒక వలలాంటిది. 48 వల చేపల్తో నిండిపొయ్యాక బెస్తవాళ్ళు దాన్ని ఒడ్డుకు లాగి మంచి చేపల్ని బుట్టలో వేసికొని పనికిరాని చేపల్ని పారవేస్తారు. 49 అదేవిధంగా యుగాంతంలో కూడా దేవ దూతలు వచ్చి నీతిమంతులనుండి దుర్మార్గుల్ని వేరు చేసి, భయానకమైన మంటల్లో పారవేస్తారు. 50 వాళ్ళు దుఃఖిస్తారు, బాధననుభవిస్తారు, పళ్ళు కొరుకుతారు.”
51 “మీకివన్నీ అర్థమయ్యాయా?” అని యేసు అడిగాడు.
అవునని వాళ్ళు సమాధానం చెప్పారు.
52 యేసు వాళ్ళతో, “దేవుని రాజ్యాన్ని గురించి బోధన పొందిన శాస్త్రుల్ని తన ధనాగారం నుండి క్రొత్త నిధుల్ని, పాతనిధుల్ని తీసుకొని వచ్చే ఆసామితో పోల్చవచ్చు” అని అన్నాడు.
యేసు తన స్వగ్రామానికి వెళ్ళటం
(మార్కు 6:1-6; లూకా 4:16-30)
53 యేసు ఈ ఉపమానాలన్నిటిని చెప్పటం ముగించాక అక్కడి నుండి ప్రయాణమై తన స్వగ్రామం వెళ్ళాడు. అక్కడ సమాజ మందిరంలో ప్రజలకు బోధించటం మొదలు పెట్టాడు. 54 వాళ్ళు ఆ బోధనలు విని చాలా ఆశ్చర్యపడి, “ఈ జ్ఞానం, ఈ శక్తి ఈయనకు ఎక్కడ నుండి లభించాయి? 55 ఈయన వడ్రంగి కుమారుడే కదూ! ఈయన తల్లి పేరు మరియ కదూ! ఇతని సోదరులు యాకోబు, యోసేవు, సీమోను, యూదా కదూ! 56 ఇతని అక్క చెల్లెండ్రందరూ మన గ్రామంలోనే నివసిస్తున్నారు కదూ! మరి ఈయనకు యివన్నీ ఎక్కడనుండి లభించాయి?” అని అన్నారు. 57 ఆయనపై వాళ్ళకు కోపం వచ్చింది.
యేసు వాళ్ళతో, “స్వగ్రామం వాళ్ళు, యింటి వాళ్ళు తప్ప ప్రవక్తను అందరూ గౌరవిస్తారు” అని అన్నాడు. 58 వాళ్ళు విశ్వసించలేదు. కనుక ఆయన అక్కడ ఎక్కువ అద్భుతాలు చేయలేదు.
ప్రాకార నిర్మాతలు
3 ప్రధాన యాజకుని పేరు ఎల్యాషీబు. ఎల్యాషీబూ, యాజకులైన అతని సోదరులూ పనిలోకి పోయి, గొర్రెల ద్వారాన్ని నిర్మించారు. వాళ్లు ప్రార్థనలు జరిపి యెహోవా పేరిట ఆ ద్వారమును ప్రతిష్ఠ చేశారు. దాని ద్వారాలను ప్రాకారంలో సరైన చోట వుంచారు. ఆ యాజకులు యెరూషలేము ప్రాకారాన్ని హమ్మేయా గోపురం దాకా, హనన్యే గోపురుం దాకా నిర్మించి, అక్కడ ప్రార్థనలు జరిపి, ప్రతిష్ఠించారు.
2 యాజకులు కట్టిన గోడ భాగానికి ప్రక్కనే యెరికోవాసులు గోడను కట్టారు. ఇమ్రీ కుమారుడైన జక్కూరు యెరికోవాసులు కట్టినదానికి ప్రక్కగా గోడ భాగమును కట్టాడు.
3 హస్సెనాయా కుమారులు మత్స్య ద్వారాన్ని నిర్మించారు. వాళ్లు కొయ్య దూలాలను సరిగ్గా అమర్చి, కట్టడానికి తలుపులు పెట్టి, తర్వాత ఆ తలుపులకు గడియలు, తాళాలు అమర్చారు.
4 ఊరియా కుమారుడు మెరేమోతు గోడలో తర్వాత భాగాన్ని నిర్మించాడు. (ఊరియా హక్కోజు కుమారుడు).
బెరెక్య కుమారుడు మెషుల్లాము గోడలో తర్వాత భాగాన్ని కట్టాడు. (బెరెక్యా మెషేజబెయేలు కుమారుడు.)
బయనా కొడుకు సాదోకు గోడలో తర్వాత భాగము కట్టాడు.
5 తెకోవీయులు గోడలో తర్వాతి భాగాన్ని కట్టారు. అయితే, తెకోవా నాయకులు తమ పాలనాధికారి నెహెమ్యా కోసం పని చేసేందుకు అంగీకరించలేదు.
6 పాసెయ కుమారుడు యెహోయాదా, బెసోద్యా కుమారుడు మెషుల్లాము పాతద్వారం మరమ్మతు చేశారు. వాళ్లు దూలాలను సరిగ్గా ఉంచి, తలుపులను కీలు గుడిదెల మీద నిలిపి, తలుపులకు గడియలు, తాళాలు అమర్చారు. 7 గిబ్యోను వాళ్లూ, మిస్పా వాళ్లూ గోడలో తర్వాత భాగాన్ని నిర్మించారు. గిబ్యోనుకు చెందిన మెలట్యా, మేరోనోతుకు చెందిన యాదోనూ పనిచేశారు. గిబ్యోను, మేరోనోతులు యూఫ్రటిసు నది వశ్చిమ ప్రాంత పాలనాధికారుల అజమాయిషీలో వున్నాయి.
8 హర్శయా కుమారుడు ఉజ్జీయేలు గోడలో తర్వాత భాగాన్ని మరమ్మతు చేశాడు. ఉజ్జీయేలు బంగారపుపని చేసేవాడు. హనన్యా అత్తర్ల తయారీదారు. వీళ్లు వెడల్పు గోడవరకు యెరూషలేమును కట్టి, నిలిపారు.
9 వీరి ప్రక్కన హూరు కుమారుడు రెఫాయా గోడలో తదుపరి భాగాన్ని నిర్మించాడు. రెఫాయా యెరూషలేములో సగం భాగానికి పాలనాధికారి.
10 హరూమఫు కొడుకు యెదాయా గోడలో తర్వాత భాగాన్ని నిలిపాడు. యెదాయా నిలిపిన గోడ భాగం అతని యింటి ప్రక్కనే వుంది. హషన్నేయా కొడుకు హట్టూషు తర్వాత గోడ భాగాన్ని మరమ్మతు చేశాడు. 11 హారీము కొడుకు మల్కీయా, పహత్మోయాబు కొడుకు హష్షూబు తర్వాత భాగాన్నీ, అగ్ని గుండపు గోపురాన్నీ మరమ్మతు చేశారు.
12 గోడలో తర్వాత భాగాన్ని హల్లోహెషు కొడుకు షల్లూము తన కుమార్తెల సాయంతో మరమ్మతు చేశాడు. షల్లూము యెరూషలేము రెండవ భాగానికి పాలనాధికారి.
13 హానూను అనేవాడు, జానోవా పట్టణ వాసులూ కలిసి లోయద్వారాన్ని పునర్నిర్మించారు. వాళ్లు దాని తలుపులను కీలుల మీద నిలిపారు. తర్వాత ఆ తలుపులకు వాళ్లు గడియలు, తాళాలు బిగించారు. అంతేకాక, వాళ్లు 500 గజాల గోడను కూడా బాగుచేశారు. వాళ్లు బూడిద రాశి ద్వారందాకా ఉన్న గోడను బాగు చేశారు.
14 రేకాబు కొడుకు మల్కీయా పెంట గుమ్మాన్ని సరిచేశాడు. మల్కీయా, బేత్ హక్కెరెము ప్రాంతానికి అధిపతి. అతను ఆ ద్వారాన్ని నిలిపి, దాని తలుపులను కీలులమీద తగిలించి, వాటికి గడియలను, తాళాలను అమర్చాడు.
15 కొల్హోజె కొడుకు షల్లూము ఇంటి ద్వార గుమ్మాన్ని బాగుచేశాడు. ఇతను మిస్పా ప్రాంతపు అధిపతి. అతను ఆ ద్వారాన్ని బాగుచేసి, దానికి పైకప్పు వేయించాడు. అతను కీలుల మీద తలుపులు నిలిపి, వాటికి గడియలు, తాళాలు అమర్చాడు. రాజు తోట ప్రక్కన వున్న సిలోయము కోనేరువరకు వున్న గోడ భాగాన్ని కూడా షల్లూము బాగుచేశాడు. దావీదు నగరం నుంచి క్రిందికి పోయే మెట్లవరకు వున్న గోడను కూడా అతనే బాగుచేశాడు.
16 అజ్జూకు కొడుకు నెహెమ్యా గోడలో తర్వాత భాగాన్ని బాగుచేసాడు. ఈ నెహెమ్య బేత్‌సూరు సగం ప్రాంతానికి అధిపతి. అతను దావీదు సమాధికి ఎదుట పున్న స్థలంలోని కోనేరును, యుద్ధ వీరుల భవనాన్నీ బాగుచేశాడు.
17 తర్వాత భాగాన్ని లేవి వంశీములు బాగు చేశారు. ఆ లేవీయులు బానీ కుమారుడు రెహూము అజమాయిషీలో పనిచేశారు. కెయిలా ప్రాంతంలో సగం భాగానికి అధిపతి అయిన హషబ్యా తర్వాత భాగాన్ని బాగుచేశాడు. అతను తన సొంత ప్రాంతానికి చెందిన వాటినే బాగుచేశాడు.
18 వాళ్ల సోదరులు తర్వాత భాగాన్ని బాగుచేశారు. వాళ్లు హేనాదాదు కుమారుడు బవ్వై పర్యవేక్షణలో పని చేశారు. కెయిలా ప్రాంతపు సగంభాగానికి ఈ బవ్వై అధిపతి.
19 యేషూవ కుమారుడు ఏజెరు తర్వాత భాగాన్ని బాగుచేశాడు. ఏజెరు మిస్పా అధిపతి. అతను ఆయుధాగారం నుంచి ప్రాకారం మూలదాకా వున్న భాగాన్ని బాగుచేశాడు. 20 జబ్బయి కుమారుడు బారూకు గోడలో తదుపరి భాగాన్ని బాగుచేశాడు. బారూకు విశేషంగా శ్రమించి, ప్రాకారం మూలనుంచి ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు ఇంటిదాకా వున్న గోడ భాగాన్ని బాగుచేశాడు. 21 హక్కోజు మనుమడు, ఊరియా కుమారుడు అయిన మెరేమోతు ఎల్యాషీబు ఇంటి ముఖ ద్వారం నుంచి, ఆ ఇంటి చివరిదాకా వున్న గోడ భాగాన్ని బాగుచేశాడు. 22 ప్రాకారపు తదుపరి భాగాన్ని ఆ ప్రాంతంలో[a] నివసించే యాజకులు బాగుచేశారు.
23 బెన్యామీను, హష్షూబులు తమ ఇంటి ముందర గోడ భాగాన్ని బాగుచేశారు. అనన్యా కుమారుడు, మయశేయా కొడుకు అయిన అజర్యా తన ఇంటి ప్రక్కన వున్న గోడ భాగాన్ని బాగుచేశాడు.
24 హేనాదాదు కొడుకు బిన్నూయి అజర్యా ఇంటి దగ్గర్నుంచి ప్రాకారపు మలుపుదాకా, అక్కణ్నుంచి మూలదాకా గోడభాగాన్ని బాగుచేశాడు.
25 ఊజై కుమారుడు పాలాలు ప్రాకారపు మలుపు నుంచి గోపురం దాకా పనిచేశాడు. రాజు పై అంతస్తు దగ్గర, అది రాజుగారి రక్షకభటుల ఆవరణానికి దగ్గర వున్న గోవురం. పరోషు కొడుకు పెదాయా పొలాలు పక్కన పని చేశాడు.
26 ఆలయ సేవకులు ఓపెలు కొండమీద నివసించేవారు. వాళ్లు జలద్వారం దాకా, దాని దగ్గరవున్న గోపురం దాకా ఉన్న గోడ తదుపరి భాగాన్ని బాగు చేశారు.
27 పెద్ద గోపురం దగ్గర్నుంచి ఓపెలు గోడదాకా ఉన్న ప్రాకార భాగమంతటినీ తెకోవీయులు బాగు చేశారు.
28 తమ ఇండ్లకి ఎదురుగా గుర్రపు గుమ్మానికి పైనున్న ప్రాకార భాగాన్ని యాజకులు బాగుచేశారు. ప్రతి ఒక్క యాజకుడూ తన స్వగృహానికి ఎదుట ఉన్న గోడ భాగాన్ని బాగుచేశాడు. 29 ఇమ్మేరు కొడుకైన సాదోకు తన ఇంటి ముందరి గోడ భాగాన్ని బాగు చేశాడు. షెకన్యా కొడుకైన షెమయా గోడలో అటు తర్వాత భాగాన్ని బాగుచేశాడు. షెమయా తూర్పు ద్వార రక్షకుడు.
30 షలెమ్యా కొడుకు హనన్యా, జాలాఫు కొడుకు హానూనూ గోడలో మిగిలిన భాగాన్ని బాగుచేశారు. (హానూను జాలాపు ఆరవ కొడుకు).
బెరెక్యా కొడుకు మెషుల్లాము తన ఇంటి ముందరి గోడ భాగాన్ని బాగుచేశాడు. 31 ఆలయ సేవకుల, వ్యాపారస్తుల ఇళ్లదాకా ఉన్న తదుపరి గోడ భాగాన్ని మల్కీయా బాగుచేశాడు. అంటే, తనిఖీ ద్వారం దగ్గర్నుంచి అన్నమాట. ప్రాకారపు మూలలో ఉన్న గదిదాకా ఉన్న గోడ భాగమంతటినీ మల్కీయా బాగు చేశాడు. మల్కీయా బంగారంపని చేసేవాడు. 32 స్వర్ణకారులూ, వ్యాపారస్థలూ మూలనున్న గదినుంచి గొర్రెల ద్వారం దాకా ఉన్న గోడ భాగాన్ని బాగుచేశారు.
బర్నబాను, సౌలును ఎన్నుకొని పంపటం
13 అంతియొకయలోని సంఘంలో ఉన్న ప్రవక్తలు, పండితులు ఎవరనగా: బర్నబా, “నీగెరు” అని పిలువబడే “సుమెయోను”, కురేనీ గ్రామానికి చెందిన లూకియ, మనయేను, (ఇతడు, సామంత రాజైన హేరోదు, యిద్దరూ కలిసి పెరిగారు), మరియు సౌలు. 2 వీళ్ళు ఉపవాసాలు చేసి ప్రభువును ప్రార్థిస్తుండగా పరిశుద్ధాత్మ, “బర్నబాను, సౌలును నా కోసం వేరుచేయండి. వాళ్ళను ఒక ప్రత్యేకమైన పని కోసం పిలిచాను” అని అన్నాడు.
3 అక్కడున్నవాళ్ళు వీళ్ళిద్దర్ని పంపే ముందు ప్రార్థనలు, ఉపవాసాలు చేసి, వాళ్ళపై తమ చేతులుంచి పంపారు.
సైప్రసులో
4 పవిత్రాత్మ వాళ్ళను పంపాడు. వాళ్ళు “సెలూకయ” అనే పట్టణానికి వెళ్ళి అక్కడినుండి ఓడలో ప్రయాణం చేసి సైప్రసు (కుప్ర) అనే ద్వీపాన్ని చేరుకున్నారు. 5 అక్కడినుండి సలామి అనే పట్టణానికి వెళ్ళారు. అక్కడున్న యూదుల సమాజ మందిరాల్లో దైవసందేశాన్ని ప్రకటించారు. వాళ్ళకు సహాయంగా యోహాను వాళ్ళ వెంటే ఉన్నాడు.
6 వాళ్ళు ఆ ద్వీపాన్నంతా పర్యటించి “పాఫు” అనే పట్టణం చేరుకున్నారు. మాయాజాలం చేస్తూ తానొక ప్రవక్తనని చెప్పుకుంటున్న వ్యక్తిని అక్కడ కలుసుకున్నారు. అతడు యూదుడు. పేరు “బర్ యేసు,” 7 అతడు “సెర్గి పౌలు” అనే రాష్ట్రపాలకునికి సన్నిహితంగా ఉండేవాడు. సెర్గి పౌలు తెలివిగలవాడు. దైవసందేశాన్ని వినాలని బర్నబాను, సౌలును ఆహ్వానించాడు. 8 ఎలుమ రాష్ట్రపాలకుణ్ణి ఈ విశ్వాసానికి దూరంగా ఉంచాలని ప్రయత్నించాడు. “ఎలుమ” అనగా గ్రీకు భాషలో మాయాజాలకుడు. 9 అప్పుడు సౌలు (ఇతణ్ణి పౌలు అని కూడా పిలిచే వారు) పరిశుద్ధాత్మతో నిండిపోయి ఎలుమను సూటిగా చూస్తూ, 10 “నీవు సాతానుకు పుట్టావు! మంచిదన్న ప్రతిదీ నీకు శత్రువు! నీలో అన్ని రకాల మోసాలు, కుట్రలు ఉన్నాయి! ప్రభువు యొక్క సక్రమ మార్గాల్ని వక్రంగా మార్చటం ఎప్పుడు మానుకొంటావు? 11 ఇదిగో చూడు, ప్రభువు ఇప్పుడు నిన్ను శిక్షిస్తాడు. కొంతకాలం దాకా నీవు సూర్యుని వెలుగు చూడలేవు! గ్రుడ్డివాడివై పోతావు!” అని అన్నాడు.
తక్షణమే పొగమంచు, చీకట్లు అతణ్ణి చుట్టివేసాయి. తన చేయి పట్టుకొని నడిపేందుకు ఎవరైనా దొరుకుతారేమోనని తారాడుతూ చూసాడు. 12 ఆ రాష్ట్రపాలకుడు ప్రభువును గురించి చెప్పిన బోధలు విని ఆశ్చర్యపడి ప్రభువును నమ్మాడు.
పిసిదియ అంతియొకయలో
13 “పాఫు” నుండి పౌలు, అతని స్నేహితులు పంఫూలియాలోని “పెర్గే” అనే పట్టణానికి ఓడలో ప్రయాణం చేసి వెళ్ళారు. యోహాను వాళ్ళను అక్కడ వదిలి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిపోయాడు. 14 వాళ్ళు పెర్గేనుండి పిసిదియ ప్రక్కన ఉన్న అంతియొకయ అనే పట్టణాన్ని చేరుకున్నారు.
ఒక విశ్రాంతి రోజు యూదుల సమాజ మందిరములోకి వెళ్ళి కూర్చున్నారు. 15 ధర్మశాస్త్రంలోని విషయాలు, ప్రవక్తల గ్రంథాలు చదివారు. ఆ తదుపరి సమాజమందిరం యొక్క అధికారులు, “సోదరులారా! ప్రజలను ఉత్సాహపరిచే ఆధ్యాత్మిక విషయాలు ఏవైనా ఉంటే దయచేసి మాట్లాడండి” అని అడగనంపారు.
16 పౌలు లేచి నిలుచొని చేతులెత్తి, ఇలా అన్నాడు, “ఇశ్రాయేలు ప్రజలారా! యూదులవలె దైవభీతిగల ప్రజలారా! నా మాటలు వినండి. 17 ఇశ్రాయేలు ప్రజల దేవుడు మన పూర్వులను ఎన్నుకొని వాళ్ళు ఈజిప్టులో పరదేశీయులుగా ఉన్నప్పుడు వాళ్ళను గొప్పవాళ్ళుగా చేసాడు. తన అద్భుతమైన శక్తితో ఆ దేశంనుండి వాళ్ళను పిలుచుకెళ్ళి, 18 ఎడారుల్లో వాళ్ళ ప్రవర్తనను నలభై సంవత్సరాలు సహిస్తూ వాళ్ళను కాపాడాడు. 19 కనాను దేశంలో ఏడు జాతుల్ని పడగొట్టి తన ప్రజల్ని ఆ ప్రాంతానికి వారసులుగా చేసాడు. 20 ఇవి చేయటానికి సుమారు నాలుగు వందల ఏబది సంవత్సరాలు పట్టింది.
“ఆ తర్వాత దేవుడు సమూయేలు ప్రవక్త కాలందాకా, నాయకత్వం వహించగల న్యాయాధిపతుల్ని పంపాడు. 21 తమకు ‘రాజు’ కావాలని కోరగా కీషు కుమారుడైన ‘సౌలును’ వాళ్ళకు రాజుగా పంపాడు. ఇతడు బెన్యామీను వంశానికి చెందినవాడు. సౌలు నలభై సంవత్సరాలు పాలించాడు. 22 సౌలును తీసివేసాక దావీదును వాళ్ళ రాజుగా చేసాడు. దావీదు విషయంలో తన అంగీకారం చూపుతూ దేవుడు యిలా అన్నాడు: ‘యెష్షయి కుమారుడైన దావీదు నా మనస్సుకు నచ్చాడు. అతడు నేను చెప్పినట్లు చేస్తాడు.’
23 “దేవుడు తన వాగ్దానానుసారం ఇశ్రాయేలు ప్రజల కోసం రక్షకుడైనటువంటి యేసును ఇతని వంశంలో జన్మింపచేసాడు. 24 యేసు రాకముందు, యోహాను మారుమనస్సును గురించి బాప్తిస్మమును గురించి ఇశ్రాయేలు ప్రజలకు బోధించాడు. 25 తన కర్తవ్యం ముగిసే చివరి దశలో అతడు ఇలా అన్నాడు: ‘నేనెవర్ననుకొన్నారు? నేను మీరనుకొంటున్న వాణ్ణి కాదు! కాని నా తర్వాత ఆయన రాబోతున్నాడు. ఆయన చెప్పులు తాకే అర్హత కూడా నాకు లేదు.’
26 “సోదరులారా! అబ్రాహాము వంశీయులారా! దైవభీతిగల ఇతర ప్రజలారా! రక్షణ గురించి తెలియ చేసే సందేశాన్ని దేవుడు మనకు తెలియచేసాడు. 27 కాని యెరూషలేము ప్రజలు, వాళ్ళ పాలకులు ఈ యేసును గుర్తించలేదు. యేసుకు మరణదండన వేయించి ప్రతి విశ్రాంతి రోజున చదివే ప్రవక్తల మాటలు నిజం చేసారు. 28 ఆయనకు మరణదండన విధించటానికి వాళ్ళకు ఏ కారణం దొరక్కపోయినా ఆయనను చంపివేయించమని పిలాతును కోరారు.
29 “లేఖనాల్లో ఆయన్ని గురించి వ్రాసిన విధంగా వాళ్ళాయనను చంపారు. ఆ తర్వాత సిలువనుండి క్రిందికి దింపి సమాధి చేసారు. 30 కాని దేవుడాయన్ని బ్రతికించాడు. 31 ఇదివరలో ఆయనతో కలిసి గలిలయనుండి యెరూషలేమునకు ప్రయాణం చేసిన ప్రజలకు చాలా రోజుల దాకా కనిపించాడు.
32 “వాళ్ళు ఆయన కోసం ఇశ్రాయేలు ప్రజల ముందు సాక్ష్యం చెప్పటానికి సిద్ధంగా ఉన్నారు. 33 దేవుడు మన పూర్వులకు చేసిన వాగ్దానాన్ని యిప్పుడు వాళ్ళ సంతతియైన మన కోసం పూర్తి చేసాడు. యేసును బ్రతికించటంతో ఈ వాగ్దానం పూర్తి అయింది. ఇదే మేము చెప్పే సువార్త. దీన్ని గురించి కీర్తన గ్రంథంలో ఇలా వ్రాయబడివుంది:
‘నీవు నా కుమారుడవు!
నేడు నేను నీకు తండ్రినయ్యాను.’(A)
34 దేవుడు ఆయన్ని బ్రతికించాడు. ఆయన ఎన్నటికీ మట్టిలో కలిసిపోడు. అందువల్ల దేవుడు మరొక చోట,
‘నేను దావీదుకు తప్పక యిస్తానన్న పవిత్రమైన ఆశీస్సులను నీకిస్తాను’(B) అని అన్నాడు.
35 మరొక చోట యిలా చెప్పబడింది:
‘నీ పవిత్రుడి దేహాన్ని సమాధిలో నీవు క్రుళ్ళిపోనియ్యవు!’(C)
36 “దావీదు తన కాలంలో దేవుని ఆజ్ఞానుసారం నడుచుకొన్నాడు. అతడు చనిపోగానే అతణ్ణి అతని పూర్వికులతో సమాధి చేసారు. అతని దేహం మట్టిలో కలిసిపోయింది. 37 కాని దేవుడు బ్రతికించినవాడు మట్టిలో కలిసిపోలేదు. 38 మీరీ విషయం తెలుసుకోవాలి. యేసు ద్వారా మీ పాపాలు క్షమించబడుతాయని మేము ప్రకటిస్తున్నాము. మోషే ధర్మశాస్త్రం క్షమించలేని పాపాలనుండి, 39 యేసు తనను నమ్ముకొన్న ప్రతి ఒక్కణ్ణీ క్షమిస్తాడు. 40 ప్రవక్తలు చెప్పిన ఈ విషయాలు మీకు సంభవించకుండా జాగ్రత్తపడండి:
41 ‘పరిహాసం చేసే ప్రజలారా!
ఆశ్చర్యం పొందండి! నశించకండి!
ఎందుకనగా మీ కాలంలో మీరు నమ్మలేనిది
నేనొకటి చేయబోతున్నాను!
మరొకరు చెప్పినా మీరు నమ్మరు.’”(D)
42 పౌలు, బర్నబా యూదుల సమాజ మందిరాన్ని వదిలి వెళ్తుండగా వచ్చే విశ్రాంతి రోజు ఈ విషయాల్ని గురించి యింకా ఎక్కువగా మాట్లాడండని ప్రజలు అడిగారు. 43 ప్రజలు వెళ్ళిపోయాక చాలామంది యూదులు, యూదుల మతంలో భక్తిగలవాళ్ళు పౌలు, బర్నబా వెంట వెళ్ళారు. పౌలు, బర్నబా ప్రజలతో, “దేవుని అనుగ్రహాన్ని విశ్వసిస్తూ యిలాగే జీవిస్తూ ఉండండి!” అని చెప్పారు.
44 మరుసటి విశ్రాంతి రోజున పట్టణమంతా ప్రభువు సందేశాన్ని వినాలని సమావేశం అయ్యింది. 45 సమావేశమయిన ప్రజల్ని చూసి యూదుల్లో అసూయ నిండిపోయింది. వాళ్ళు పౌలుకు ఎదురు తిరిగి మాట్లాడి అతణ్ణి దూషించారు. 46 పౌలు, బర్నబా ధైర్యంగా సమాధానం చెబుతూ, “అందరికన్నా ముందు దైవసందేశాన్ని మీకు చెప్పటం మా కర్తవ్యం. కాని మీరు నిరాకరించటంవల్ల, నిత్యజీవానికి అనర్హులమని మీలో మీరు అనుకోవటం వల్ల మేము మిమ్మల్ని వదిలి యితరుల దగ్గరకు వెళ్తున్నాము. 47 ప్రభువు యిలా ఆజ్ఞాపించాడు అని అన్నాడు:
‘ప్రపంచానికి రక్షణ కలిగించాలని యితర దేశాలకు
నిన్నొక వెలుగుగా చేసాను!’”(E)
48 యూదులు కానివాళ్ళు ఇది విని ఆనందించారు. ప్రభువు సందేశాన్ని అంగీకరించారు. అనేకులు విశ్వాసులయ్యారు. శాశ్వతమైన క్రొత్త జీవితాన్నివ్వటానికి దేవుడు వీళ్ళను ఎన్నుకొన్నాడు.
49 దైవసందేశం ఆ ప్రాంతమంతా వ్యాపించింది. 50 కాని యూదులు పట్టణంలోని పెద్దలతో, దైవభక్తి గల గొప్పింటి స్త్రీలతో మాట్లాడి వాళ్ళకు పౌలుపట్ల, బర్నబాపట్ల కోపం కలిగేటట్లు చేసారు. అంతా కలిసి వాళ్ళను హింసించి ఆ తదుపరి వాళ్ళను తమ పట్టణంనుండి తరిమివేసారు. 51 పౌలు, బర్నబా తమ నిరసనకు చిహ్నంగా కాలి ధూళిని దులిపి “ఈకొనియ” అనే పట్టణానికి వెళ్ళిపోయారు. 52 కాని విశ్వాసులపై పవిత్రాత్మ ప్రభావం ఉండటంవల్ల వాళ్ళలో ఉన్న ఉత్సాహం తగ్గలేదు.
© 1997 Bible League International