M’Cheyne Bible Reading Plan
11 రెహబాము యెరూషలేముకు వచ్చిన పిమ్మట ఒక లక్షాఎనబై వేలమంది కాకలు తీరిన సైనికులను సమీకరించాడు. ఈ సైనికులను యూదా, బెన్యామీను వంశాల నుండే ఎంపిక చేశాడు. వీరందరినీ ఇశ్రాయేలుపై దాడి చేసి ఆ రాజ్యాన్ని తిరిగి తన ఏలుబడిలోకి తీసుకొని రావటానికి సమీకరించాడు. 2 కాని యెహోవా వాక్కు షెమయాకు వినవచ్చింది. షెమయా దైవజ్ఞుడు. యెహోవా యిలా చెప్పాడు: 3 “షెమయా, నీవు వెళ్లి సొలొమోను కుమారుడు, యూదా రాజు అయిన రెహబాముతో మాట్లాడుము. యూదాలోను, బెన్యామీను ప్రాంతంలోను నివసిస్తున్న ఇశ్రాయేలీయులందరితో కూడా మాట్లాడుము. వారికి యీలా చెప్పుము: 4 యెహోవా తెలియజేయునదేమనగా: ‘మీరు మీ సోదరులతో యుద్ధం చేయరాదు! ప్రతి ఒక్కడూ తన ఇంటికి తిరిగి వెళ్లిపోవాలి. ఇది యిలా జరిగేలా నేనే చేశాను’” కావున రాజైన రెహబాము, అతని సైన్యం యెహోవా మాట విని వెనుకకు వెళ్లి పోయారు. వారు యరొబాముపై దాడి చేయలేదు.
రెహబాము యూదాను బలపర్చటం
5 రెహబాము యెరూషలేములో నివసించాడు. పరాయి రాజుల దండయాత్రల నుండి రక్షణగా అతడు యూదాలో బలమైన నగరాలను నిర్మించాడు. 6 బేత్లెహేము, ఏతాము, తెకోవ, 7 బేత్సూరు, శోకో, అదుల్లాము, 8 గాతు, మారేషా, జీపు, 9 అదోరయీము, లాకీషు, అజేకా, 10 జొర్యా, అయ్యాలోను, మరియు హెబ్రోనులో గల నగరాలను బాగుచేయించాడు. యూదాలోను, బెన్యామీనులోనుగల ఈ నగరాలు బలమైనవిగా తీర్చిదిద్దబడ్డాయి. 11 రెహబాము ఈ నగరాలను బలపర్చిన తరువాత, వాటిలో అధిపతులను, నియమించాడు. ఆ నగరాలకు ఆహార పదార్థాలు, నూనె, ద్రాక్షారసం సరఫరాలను ఏర్పాటు చేశాడు. 12 రెహబాము ప్రతి నగరంలో డాళ్లను, ఈటెలను కూడ వుంచి వాటిని చాలా బలమైనవిగా చేశాడు. యూదా, బెన్యామీను ప్రజల, నగరాలను రెహబాము తన అధీనంలో వుంచుకున్నాడు.
13 ఇశ్రాయేలులో వున్న యాజకులు, లేవీయులు అంతా రెహబాముతో ఒక అవగాహనకు వచ్చి, అతనితో కలిశారు. 14 లేవీయులు తమ పచ్చిక బీళ్లను, వారి స్వంత పొలాలను వదిలి యూదాకు, యెరూషలేముకు వచ్చారు. లేవీయులు ఇది ఎందుకు చేశారనగా యరొబాము, అతని కుమారులు తమను యెహోవా సేవలో, యాజకులుగా పని చేయటానికి తిరస్కరించారు.
15 ఉన్నత స్థలాలలో ఆరాధనలకై యరొబాము తన స్వంత యాజకులను ఎంపిక చేసుకొన్నాడు. ఆ గుట్టల మీద అతడు తాను చేసిన మేక, గిత్త దూడల విగ్రహాలను ప్రతిష్ఠించాడు. 16 లేవీయులు ఇశ్రాయేలును వదిలి పెట్టడంతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాలో విశ్వాసమున్న ఇశ్రాయేలు గోత్రాలవారంతా యెరూషలేముకు వచ్చారు. వారు తమ పూర్వీకుల దేవునికి బలులు అర్పించటానికి వచ్చారు. 17 వారంతా యూదా రాజ్యాన్ని బలమైనదిగా చేశారు. వారు సొలొమోను కుమారుడు రెహబాముకు మూడు సంవత్సరాలపాటు మద్దతు యిచ్చారు. ఆ విధంగా చేయటానికి కారణమేమనగా ఆ సమయంలో వారు దావీదు సొలొమోను నడిచిన రీతిగా నడుచుకున్నారు.
రెహబాము కుటుంబం
18 రెహబాము మహలతు అనే స్త్రీని వివాహం చేసికొన్నాడు. ఆమె తండ్రి పేరు యెరీమోతు. ఆమె తల్లి పేరు అబీహాయిలు. యెరీమోతు తండ్రి పేరు దావీదు. అబీహాయిలు తండ్రిపేరు ఏలీయాబు. ఏలీయాబు తండ్రిపేరు యెష్షయి. 19 రెహబాముకు మహలతు ద్వారా యూషు, షెమర్యా, జహము అనే కుమారులు పుట్టారు. 20 పిమ్మట రెహబాము మయకాను వివాహం చేసికొన్నాడు. మయకా అబ్షాలోము మనుమరాలు.[a] రెహబాముకు మయకావల్ల అబీయా, అత్తయి, జీజా, షెలోమీతు అనువారు పుట్టారు. 21 తన ఇతర భార్యల కన్న, దాసీల కన్న, రెహబాము మయకాను ఎక్కువగా ప్రేమించాడు. మయకా అబ్షాలోము మనుమరాలు. రెహబాముకు పద్ధెనిమిది మంది భార్యలు, అరవై మంది దాసీలు వున్నారు. రెహబాముకు ఇరవై ఎనిమిది మంది కుమారులు, ఇరవై మంది కుమార్తెలు వున్నారు.
22 అబీయాను అతని సోదరులపై నాయకునిగా రెహబాము నియమించాడు. అబీయాను రాజుగా చేసే వుద్దేశంతోనే రెహబాము ఈ పని చేశాడు. 23 రెహబాము చాలా తెలివిగా ప్రవర్తించాడు. తన కుమారులందరినీ యూదా, బెన్యామీను ప్రాంతాలలో వున్న బలమైన నగారాలన్నిటికీ పంపాడు. రెహబాము తన కుమారులకు ఆహారాది వస్తువులను పుష్కలంగా సరఫరా చేశాడు. తన కుమారులకు భార్యలను కూడా అతడు ఎంపిక చేశాడు.
ఈజిప్టు రాజు షీషకు యెరూషలేముపై దండెత్తుట
12 రెహబాము చాలా శక్తివంతుడైన రాజయ్యాడు. అతడు తన రాజ్యాన్ని కూడ చాలా బలపర్చాడు. ఆ తరువాత రెహబాము, యూదా వంశంవారు యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించటం మాని వేశారు.
2 రెహబాము రాజయ్యాక ఐదవ సంవత్సరంలో షీషకు యెరూషలేముపై దండెత్తాడు. షీషకు ఈజిప్టుకు రాజు. రెహబాము, యూదా ప్రజలు యెహోవాకు విశ్వాసపాత్రంగా లేకపోవుటచే ఇది జరిగింది. 3 షీషకు వద్ద పన్నెండువేల రథాలు, అరవై వేల మంది గుర్రపు స్వారీ చేయగలవారు, మరియు ఎవ్వరూ లెక్క పెట్టలేనంత మంది సైనికులు వున్నారు. షీషకు యొక్క మహా సైన్యంలో లిబ్యా సైనికులు (లూబీయులు), సుక్కీయులు, ఇథియోఫియనులు (కూషీయులు) వున్నారు. 4 షీషకు యూదాలోని బలమైన నగరాలను ఓడించాడు. పిమ్మట షీషకు తన సైన్యాన్ని యెరూషలేముకు నడిపించాడు.
5 తరువాత ప్రవక్తయగు షెమయా రెహబాము వద్దకు, యూదా నాయకుల వద్దకు వచ్చాడు. ఆ యూదా నాయకులంతా షీషకుకి భయపడి యెరూషలేములో సమావేశమయ్యారు. షెమయా రెహబాముతోను, యూదా నాయకుల తోను యీలా చెప్పాడు, “యెహోవా ఈ విధంగా తెలియజేస్తున్నాడు: ‘రెహబామూ, నీవు మరియు యూదా ప్రజలు నన్ను వదిలి పెట్టారు. నా ధర్మశాస్త్రాన్ని పాటించటానికి నిరాకరించారు. ఇప్పుడు మిమ్మల్ని నా సహాయం లేకుండా షీషకును ఎదుర్కోటానికి వదిలి పెడుతున్నాను.’”
6 అది విన్న యూదా నాయకులు, రాజైన రెహబామును విచారించి, తమను తాము తగ్గించుకొని విధేయులయ్యారు. “యెహోవా న్యాయమైనవాడు” అని అన్నారు.
7 రాజు, యూదా పెద్దలు విధేయులైనట్లు యెహోవా గమనించాడు. పిమ్మట షెమయాకు యెహోవా వర్తమానం ఒకటి వినవచ్చింది. యెహోవా షెమయాతో యీలా చెప్పాడు: “రాజు, నాయకులు తమను తాము తగ్గించుకున్నారు. కావున వారిని నేను నాశనం చేయను. పైగా వారికి వెంటనే రక్షణ కల్పిస్తాను. యెరూషలేము మీద నా కోపాగ్నిని కురిపించటానికి నేను షీషకును వినియోగించను. 8 కాని యెరూషలేము ప్రజలు మాత్రం షీషకుయొక్క సేవకులౌతారు. నాకు సేవచేయటం ఇతర దేశాల రాజులను సేవించటంకంటె భిన్నమైనదని వారు తెలిసి కొనేటందుకే ఇది యీలా జరుగుతుంది.”
9 షీషకు యెరూషలేముపై దండెత్తి ఆలయాన్ని కొల్లగొట్టాడు. షీషకు ఈజిప్టు రాజు. అతడింకా రాజభవనంలో వున్న ఖజానాను కూడ కొల్లగొట్టాడు. షీషకు దొరికిన ప్రతి వస్తువును తీసుకొని, ధనరాశులను పట్టుకుపోయాడు. అతడింకా సొలొమోను చేయించిన బంగారు డాళ్లనుకూడా పట్టుకుపోయాడు. 10 రాజైన రెహబాము బంగారు డాళ్ల స్థానంలో కంచు డాళ్లను చేయించాడు. రాజభవన ప్రధాన ద్వారం వద్ద కాపలాదారుల అధిపతులకు రెహబాము కంచు డాళ్లను యిచ్చాడు. 11 రాజు ఆలయ ప్రవేశం చేసినప్పుడు ద్వారపాలకులు కంచు డాళ్లను వెలికితీసి వాడేవారు. పిమ్మట వారు మళ్ళీ ఆ కంచు డాళ్లను ఆయుధాగారంలో వుంచేవారు.
12 రెహబాము తనను తాను తగ్గించుకున్న తరువాత, యెహోవా అతని పట్ల తన కోపాన్ని ఉపసంహరించుకున్నాడు. అందువల్ల యెహోవా రెహబామును పూర్తిగా నాశనం చేయలేదు. యూదాలో ఇంకా కొంత మంచితనం మిగిలివుంది.
13 యెరూషలేములో రెహబాము చాలా శక్తివంతమైన రాజుగా రూపొందాడు. అతడు రాజయ్యేనాటికి నలబై ఒక్క సంవత్సరాలవాడు. రెహబాము రాజుగా యెరూషలేములో పదిహేడు సంవత్సరాలు వున్నాడు. ఇశ్రాయేలు తెగలన్నిటిలో యెహోవా తనపేరు ప్రతిష్ఠాపనకు యెరూషలేమునే ఎన్నుకున్నాడు. రెహబాము తల్లి పేరు నయమా. నయమా అమ్మోను దేశస్తురాలు. 14 దేవుడైన యెహోవాను అనుసరించటం మాని రెహబాము చెడుకార్యాలకు పాల్పడ్డాడు. ఎందుకంటే అతడు యెహోవాని అనుసరించాలని హృదయమందు తీర్మానించు కొనలేదు.
15 రెహబాము రాజైనప్పటి నుండి అతని పాలన అంతమయ్యేవరకు అతను చేసిన విషయాలన్నీ షెమయా రచనలలోను, ఇద్దో రచనలలోను పొందుపర్చబడ్డాయి. షెమయా ఒక ప్రవక్త. ఇద్దో ఒక దీర్ఘదర్శి వీరిద్దరూ కుటుంబ చరిత్రలు రాశారు. రెహబాము, యరొబాము రాజులిద్దరూ పాలించిన కాలంలో వారిద్దరి మధ్య యుద్ధాలు జరిగాయి, 16 రెహబాము చనిపోగా అతనిని దావీదు నగరంలో సమాధిచేశారు. పిమ్మట రెహబాము కుమారుడు అబీయా కొత్తగా రాజయ్యాడు.
ఎఫెసులోని సంఘానికి
2 “ఎఫెసులోని సంఘానికి చెందిన దూతకు ఈ విధంగా వ్రాయి:
“ఏడు నక్షత్రాలను తన కుడి చేతిలో పట్టుకొని, ఏడు బంగారు దీపస్తంభాల మధ్య నడిచేవాడు ఈ విధంగా అంటున్నాడు.
2 “నీవు చేసిన పనులు నాకు తెలుసు. నీవు పట్టుదలతో శ్రమించి పని చేసావు. నీవు దుష్టుల్ని సహించలేవని నాకు తెలుసు. అపొస్తలులమని చెప్పుకొంటున్నవాళ్ళను నీవు పరీక్షించి వాళ్ళు మోసగాళ్ళని తెలుసుకొన్నావు. 3 నీవు పట్టుదలతో అలసిపోకుండా నా పేరిట కష్టాలు ఓర్చుకొన్నావు.
4 “కాని నీ తొలి ప్రేమను నీవు పూర్తిగా మరిచిపోయావు. ఇది నాకు యిష్టము లేదు. 5 నీవు ఎంత దిగజారిపోయావో జ్ఞాపకం తెచ్చుకో. మారుమనస్సు పొందు. మొదట చేసిన విధంగా చేయి. నీవు మారుమనస్సు పొందకపోతే, నేను వచ్చి నీ దీపాన్ని దాని స్థలం నుండి తీసివేస్తాను. 6 నీకొలాయితులు[a] చేసే పనులు నీకు యిష్టం లేదు. నాకు కూడా యిష్టం లేదు. ఆ విషయంలో మనం ఏకీభవిస్తున్నాము.
7 “ఆత్మ సంఘాలకు చెబుతున్న వాటిని ప్రతివాడు వినాలి. గెలుపు సాధించినవానికి పరదైసులో ఉన్న జీవవృక్షం యొక్క ఫలం తినే అధికారం యిస్తాను.
స్ముర్నలోని సంఘానికి
8 “స్ముర్నలోని క్రీస్తు సంఘానికి చెందిన దూతకు ఈ విధంగా వ్రాయి:
“ఆదియు, అంతము అయిన వాడు, చనిపోయి తిరిగి బ్రతికి వచ్చినవాడు ఈ విధంగా చెబుతున్నాడు:
9 “మీ దుఃఖాలను గురించి, మీ దారిద్ర్యాన్ని గురించి నాకు తెలుసు. అయినా మీరు భాగ్యవంతులు. మిమ్మల్ని గురించి కొందరు చెడుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు తాము యూదులమని చెప్పుకొంటారు గాని నిజానికి వాళ్ళు యూదులు కారు. వాళ్ళు సాతాను సమాజానికి చెందినవాళ్ళు. 10 మీరు అనుభవించబోయే శ్రమలను గురించి భయపడకండి. సాతాను మీలో కొందరిని చెరసాలలో వేస్తాడు. మీరు పది రోజులు హింసను అనుభవిస్తారు. ఇది మీకొక పరీక్ష. మరణానికి కూడా భయపడకుండా విశ్వాసంతో ఉండండి. నేను మీకు జీవ కిరీటాన్ని యిస్తాను.
11 “ఆత్మ సంఘాలకు చెబుతున్న వాటిని ప్రతివాడు వినాలి. వీటిని జయించిన వాడు రెండవ మరణాన్నుండి తప్పించుకొంటాడు.
పెర్గములోని సంఘానికి
12 “పెర్గములోని సంఘానికి చెందిన దూతకు ఈ విధంగా వ్రాయి:
“రెండు వైపులా పదునైన కత్తిగలవాడు ఈ విధంగా చెబుతున్నాడు.
13 “సాతాను సింహాసనం ఎక్కడ ఉందో అక్కడే నీవు నివసిస్తున్నావని నాకు తెలుసు. అయినా నీకు నా పేరంటే విశ్వాసం ఉంది. విశ్వాసంతో నా విషయంలో అంతిప తన భక్తిని వ్యక్తపరిచిన కాలంలో కూడా నా పట్ల నీకున్న విశ్వాసాన్ని నీవు వదులుకోలేదు. సాతాను నివసించే పట్టణంలో అంతిప చంపబడ్డాడు.
14 “కాని కొన్ని విషయాల్లో నాకు నీవు నచ్చలేదు. బిలాము బోధలు[b] పఠించేవాళ్ళు కొందరు నీ సంఘంలో ఉన్నారు. ఈ బిలాము, ఇశ్రాయేలీయులను రేకెత్తించి వాళ్ళతో పాపపు పనులు చేయించమని బాలాకుకు బోధించాడు. బాలాకు వాళ్ళు విగ్రహాలకు[c] ఆరగింపు పెట్టిన ఆహారం తినేటట్లు అవినీతిగా బ్రతికేటట్లు చేసాడు. 15 నీకొలాయితులను అనుసరించేవాళ్ళు కూడా నీ దగ్గరున్నారు. 16 మారుమనస్సు పొందండి. అలా చేయకపోతే నేను త్వరలోనే మీ దగ్గరకు వచ్చి, నా నోటి నుండి బయలు వెడలు కత్తితో యుద్ధం చేస్తాను.
17 “ఆత్మ క్రీస్తు సంఘాలకు చెప్పిన వాటిని ప్రతివాడు వినాలి.
“విజయం సాధించిన వానికి నేను దాచి ఉంచిన ‘మన్నా’ను[d] తినుటకు యిస్తాను. ఒక తెల్ల రాయి మీద ఒక క్రొత్త పేరు వ్రాసి దాన్ని కూడా అతనికి యిస్తాను. నేను ఆ రాయి ఎవరికి యిస్తానో అతనికి మాత్రమే ఆ పేరు తెలుస్తుంది.
తుయతైరలోని సంఘానికి
18 “తుయతైరలోని సంఘానికి చెందిన దూతకు ఈ విధంగా వ్రాయి:
“అగ్ని జ్వాలల్లా మండుతున్న కళ్ళు కలవాడు, కొలిమిలో కాల్చి మెరుగు పెట్టబడిన యిత్తడిలా పాదాలు కలవాడు ఈ విధంగా చెబుతున్నాడు.
19 “నీవు చేస్తున్న పనులు, నీ ప్రేమ, విశ్వాసము, సేవ, పట్టుదల నాకు తెలుసు. నీవు మొదట చేసినదానికన్నా, యిప్పుడు ఎక్కువ చేస్తున్నావని నాకు తెలుసు. 20 తానొక ప్రవక్తనని చెప్పుకొంటున్న యెజెబెలు చేస్తున్న పనుల్ని నీవు సహిస్తున్నావు. ఇది నాకు యిష్టం లేదు. ఆ స్త్రీ తన బోధలతో నా సేవకులను తప్పు దారి పట్టిస్తోంది. దాని కారణంగా వాళ్ళు నీతి లేని కామ కృత్యాలు చేస్తున్నారు. విగ్రహాలకు ఆరగింపు పెట్టిన ఆహారం తింటున్నారు.[e] 21 అది చేసిన అవినీతికి మారుమనస్సు పొందమని నేను దానికి కొంత గడువునిచ్చాను. కాని అది దానికి అంగీకరించలేదు.
22 “అందువల్ల దానికి కష్టాలు కలిగిస్తాను. అవినీతిగా దానితో కామకృత్యాలు చేసినవాళ్ళు తమ పాపానికి మారుమనస్సు పొందకపోతే, వాళ్ళను తీవ్రంగా శిక్షిస్తాను. 23 దాని బిడ్డల్ని చంపివేస్తాను. అప్పుడు హృదయాల్ని, బుద్ధుల్ని శోధించేవాణ్ణి నేనేనని అన్ని సంఘాలు తెలుసుకొంటాయి. చేసిన కార్యాలను బట్టి ప్రతి ఒక్కరికి ప్రతిఫలం యిస్తాను.
24 “తుయతైరలో ఉన్న మిగతా ప్రజలకు, అంటే, దాని బోధల్ని ఆచరించని వాళ్ళకు, మరియు సాతాను రహస్యాలను అభ్యసించని వాళ్ళకు నేను చెప్పేదేమిటంటే, నేను మీ మీద మరే భారము వెయ్యను. 25 నేను వచ్చేదాకా మీరు అనుసరిస్తున్న వాటినే అనుసరిస్తూ ఉండండి.
26 “విజయాన్ని సాధించి నా ఇచ్ఛానుసారం చివరిదాకా ఉన్నవానికి నేను జనములపై అధికారం యిస్తాను. 27 అతడు వాళ్ళను కఠిన శాసనాలతో పాలిస్తాడు. వాళ్ళను కుండల్ని పగులకొట్టినట్లు పగులగొడ్తాడు.[f]
28 “ఈ అధికారం నేను నా తండ్రినుండి పొందాను. అదే విధంగా వాళ్ళు నా నుండి అధికారం పొందుతారు. నేను అతనికి వేకువచుక్కను కూడా యిస్తాను. 29 ఆత్మ సంఘాలకు చెబుతున్న వాటిని ప్రతివాడు వినాలి.
యెరూషలేం భవిష్యత్తు
3 యెరూషలేమూ, నీ ప్రజలు దేవునికి విరోధంగా యుద్ధం చేశారు! నీ ప్రజలు ఇతరులను బాధించారు, నీవు పాపంతో అపవిత్రమయ్యావు. 2 నీ ప్రజలు నా మాట వినలేదు! వారు నా ప్రబోధాలు అంగీకరించలేదు. యెరూషలేము యెహోవాను నమ్మలేదు. యెరూషలేము తన దేవుని దగ్గరకు వెళ్ళలేదు. 3 యెరూషలేము నాయకులు గర్జించే సింహాల్లా ఉన్నారు. దాని న్యాయమూర్తులు గొర్రెలమీద దాడి చేసేందుకు రాత్రివేళ వచ్చి ఉదయానికి ఏమీ మిగల్చని ఆకలిగొన్న తోడేళ్లలా ఉన్నారు. 4 దాని ప్రవక్తలు ఇంకా, ఇంకా ఎక్కువ సంపాదించటం కోసం ఎల్లప్పుడూ వారి రహస్య పథకాలు వేస్తూనే ఉన్నారు. దాని యాజకులు పవిత్రమైన విషయాలను పవిత్రం కానట్టే చూశారు. దేవుని ప్రబోధాలను వారు అతిక్రమించారు. 5 కాని దేవుడు ఇంకా ఆ పట్టణంలో ఉన్నాడు. మరియు ఆయన మంచివాడుగానే కొనసాగుతున్నాడు. దేవుడు తప్పు ఏమీ చేయడు. ఆయన తన ప్రజలకు సహాయం చేస్తూనే ఉంటాడు. ఆయన ప్రజలు మంచి నిర్ణయాలు చేసేందుకు ఆయన వారికి ప్రతి ఉదయం సహాయం చేస్తాడు. కాని ఆ దుర్మార్గులు తాము చేసే చెడ్డ పనుల విషయంలో సిగ్గుపడరు.
6 దేవుడు చెపుతున్నాడు: “నేను మొత్తం జన సమూహాలను నాశనం చేశాను. నేను వారి సంరక్షణా దుర్గాలను నాశనం చేశాను. నేను వారి వీధులను నాశనం చేశాను, అక్కడకు ఇప్పుడు ఎవ్వరూ వెళ్ళరు. వారి పట్టణాలు ఖాళీ, అక్కడ ఇంకెంత మాత్రమూ ఎవ్వరూ నివసించరు. 7 నీవు ఒక పాఠం నేర్చుకోవాలని ఈ సంగతులు నీతో నేను చెబుతున్నాను. నీవు నాకు భయపడి, నన్ను గౌరవించాలని నేను కోరుతున్నాను. ఒకవేళ నీవు ఇలా చేస్తే, నీ ఇల్లు నాశనం చేయబడదు. నీవు ఇలా చేస్తే, నా పథకం ప్రకారం నిన్ను నేను శిక్షించాల్సి ఉండదు.” కాని ఆ చెడ్డ ప్రజలు ఇదివరకే చేసిన ఆ చెడుకార్యాలనే ఇంకా ఎక్కువగా చేయాలనుకొన్నారు!
8 యెహోవా చెప్పాడు: “కనుక కొంచెం వేచి ఉండండి! నేను నిలిచి మీకు తీర్పు చెప్పేంతవరకు వేచి ఉండండి. అనేక దేశాలనుండి మనుష్యులను రప్పించి, మిమ్మల్ని శిక్షించేందుకు వారిని వాడుకొనే హక్కు నాకు ఉంది. మీ మీద నా కోపం చూపించేందుకు నేను ఆ ప్రజలను వాడుకొంటాను. నాకు ఎంత చికాకు కలిగిందో చూపించేందుకు నేను వారిని వాడుకొంటాను. మరియు మొత్తం దేశం నాశనం చేయబడుతుంది! 9 అప్పుడు నేను ఇతర జనాంగములనుండి ప్రజలను మార్పు చేస్తాను. కాబట్టి వారు స్పష్టంగా మాట్లాడుతూ ప్రభువు నామాన్ని పేరుపెట్టి పిలువగలరు. వారందరూ ఒకే ప్రజగా కూడి నన్ను ఆరాధిస్తారు. 10 కూషు దేశంలోని నది ఆవలివైపున, అంత దూరంనుండి ప్రజలు వస్తారు. చెదరిపోయిన నా ప్రజలు నా దగ్గరకు వస్తారు. నా భక్తులు వస్తారు. మరియు నాకు వారు కానుకలు తెస్తారు.
11 “యెరూషలేమూ, అప్పుడు నీవు, నీ ప్రజలు నాకు విరోధంగా చేసే చెడు విషయాలనుగూర్చి ఇంకెంత మాత్రం సిగ్గుపడవు. ఎందుకంటే, ఆ దుర్మార్గులందరినీ యెరూషలేమునుండి నేను తొలగించి వేస్తాను. ఆ గర్విష్ఠులందరినీ నేను తొలగించివేస్తాను. నా పరిశుద్ధ పర్వతంమీద ఆ గర్విష్ఠులు ఎవ్వరూ ఉండరు. 12 దీనులను, సాత్వికులను మాత్రమే నేను నా పట్టణంలో (యెరూషలేము) ఉండనిస్తాను. మరియు వారు యెహోవా నామాన్ని నమ్ముకొంటారు. 13 ఇశ్రాయేలులో మిగిలినవారు చెడు పనులు చేయరు. వారు అబద్ధాలు చెప్పరు. వారు అబద్ధాలు చెప్పి, ప్రజలను మోసగించేందుకు ప్రయత్నించరు. వారు తిని, ప్రశాంతంగా పడుకొనే గొర్రెల్లా ఉంటారు-వారిని ఎవరూ ఇబ్బంది పెట్టరు.”
ఒక ఆనంద గానం
14 యెరూషలేమా! పాడుతూ సంతోషంగా ఉండు!
ఇశ్రాయేలూ, ఆనందంగా కేకలు వేయి!
యెరూషలేమా, సంతోషించి సరదాగా ఉండు!
15 ఎందుకంటే, నీ శిక్షను యెహోవా నిలిపివేశాడు గనుక!
నీ శత్రువుల బలమైన దుర్గాలను ఆయన నాశనం చేశాడు!
ఇశ్రాయేలు రాజా, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు.
ఏ చెడు విషయం జరుగుతున్నా దాన్నిగూర్చి నీవు దిగులు పడాల్సిన అవసరం లేదు.
16 ఆ సమయంలో యెరూషలేముతో ఇలా చెప్పబడుతుంది:
“బలంగా ఉండు, భయపడవద్దు!
17 నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు.
ఆయన శక్తిమంతుడైన సైనికునిలా ఉన్నాడు.
ఆయన నిన్ను రక్షిస్తాడు.
ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో అది ఆయన నీకు చూపిస్తాడు.
ఆయన నీగురించి సంతోషపడతాడు, నీవంటే ఆనందిస్తాడు.
విందులో పాల్గొన్నవారివలె ఆయన నీ విషయంలో నవ్వుతూ సంతోషిస్తాడు.
18 అది విందులో పాల్గొన్న ప్రజల్లా ఉంటుంది.”
యెహోవా చెప్పాడు: “నీ అవమానాన్ని నేను తొలగించివేస్తాను.
ఆ ప్రజలు నిన్ను బాధించకుండునట్లు నేను చేస్తాను.
19 ఆ సమయంలో, నిన్ను బాధించేవారిని నేను శిక్షిస్తాను.
బాధించబడిన నా ప్రజలను నేను రక్షిస్తాను.
పారిపోయేలా బలవంతం చేయబడిన ప్రజలను నేను తిరిగి వెనుకకు తీసుకొనివస్తాను.
మరియు నేను వారిని ప్రసిద్ధి చేస్తాను.
అన్ని చోట్లా ప్రజలు వారిని పొగడుతారు.
20 ఆ సమయంలో, నిన్ను నేను వెనుకకు తీసుకొని వస్తాను.
నేను నిన్ను సమకూర్చి తీసుకొని వస్తాను.
నిన్నునేను ప్రసిద్ధి చేస్తాను. అన్ని చోట్లా ప్రజలు నిన్ను పొగడుతారు.
నీ సొంత కళ్ళయెదుట బందీలను తిరిగి నేను వెనుకకు తీసుకొని వచ్చినప్పుడు అది జరుగుతుంది!”
ఆ సంగతులు యెహోవా చెప్పాడు.
వాక్యము మానవాతారం ఎత్తటం
1 సృష్టికి ముందు నుండి జీవంగల వాక్యము ఉండెను. ఆ వాక్యము దేవునితో ఉండెను. ఆ వాక్యమే దేవుడు. 2 ఆయన సృష్టికి ముందు దేవునితో ఉండేవాడు. 3 ఆయన ద్వారా అన్నీ సృష్టింపబడ్డాయి. సృష్టింపబడినదేదీ ఆయన లేకుండా సృష్టింపబడలేదు. 4 ఆయన జీవానికి మూలం. ఆ జీవం మానవ జాతికి వెలుగునిచ్చెను. 5 వెలుగు చీకట్లో వెలుగుతోంది, కాని చీకటి దాన్ని అర్థం చేసుకోలేదు.
6 దేవుడు ఒక వ్యక్తిని పంపాడు. అతని పేరు యోహాను. 7 తన ద్వారా మానవులు వెలుగును గురించి విని, విశ్వసించాలని అతడు ఆ వెలుగును గురించి చెప్పటానికి వచ్చాడు. 8 అతడు ఆ వెలుగు కాదు. ఆ వెలుగును గురించి చెప్పటానికి వచ్చిన సాక్షి మాత్రమే అతడు. 9 ప్రతి ఒక్కరికి వెలుగునిచ్చే ఆ నిజమైన వెలుగు ప్రపంచంలోకి వస్తూ వుండెను.
10 ఆయన ప్రపంచంలోకి వచ్చాడు. ఆయన ద్వారా ప్రపంచం సృష్టింపబడినా, ప్రపంచం ఆయన్ని గుర్తించలేదు. 11 ఆయన తన స్వంత వాళ్ళ దగ్గరకు వచ్చాడు. కాని వాళ్ళాయనను ఒప్పుకోలేదు. 12 అయినా, తనను ఒప్పుకొన్న వాళ్ళందరికి, అంటే తనను నమ్మిన వాళ్ళకందరికి, దేవుని సంతానమయ్యే హక్కును ఇచ్చాడు. 13 కాని వీళ్ళు మానవుల రక్తం వలనకాని, శారీరక వాంఛలవల్ల కాని, మనుష్యుని నిర్ణయంవల్ల కాని, జన్మించలేదు. వీళ్ళు దేవుని సంతానం.
14 ఆ జీవంగల వాక్యము మానవరూపం దాల్చి మానవుల మధ్య జీవించాడు. ఆయనలో కృప, సత్యము సంపూర్ణంగా ఉన్నాయి. ఆయన తండ్రికి ఏకైక పుత్రుడు. కనుక ఆయనలో ప్రత్యేకమైన తేజస్సు ఉంది. ఆ తేజస్సును మేము చూసాము. 15 యోహాను ఆయన్ని గురించి ఈ విధంగా నొక్కి చెప్పాడు: “ఈయన గురించి నేను యిదివరకే ఈ విధంగా చెప్పాను, ‘నా తర్వాత రానున్నవాడు నాకన్నా ముందునుండి ఉన్నావాడు. కనుక ఆయన నాకన్నా గొప్పవాడు.’”
16 ఆయన పరిపూర్ణతవల్ల మనమంతా అనుగ్రహం మీద అనుగ్రహం పొందాము. 17 దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. యేసు క్రీస్తు ద్వారా కృపను, సత్యాన్ని ఇచ్చాడు. 18 ఎవ్వరూ ఎన్నడూ దేవుణ్ణి చూడలేదు. దేవుని ప్రక్కనవున్న ఆయన ఏకైక పుత్రుడు దేవునితో సమానము. ఆయన మనకు దేవుణ్ణి గురించి తెలియచేసాడు.
బాప్తిస్మము నిచ్చిన యోహాను యొక్క సందేశము
(మత్తయి 3:1-12; మార్కు 1:1-8; లూకా 3:1-9, 15-17)
19 యోహానును అడిగి, అతడెవరన్న విషయం కనుక్కురావటానికి, యెరూషలేములోని యూదులు యాజకులను లేవీయులను[a] అతని దగ్గరకు పంపారు. 20 యోహాను సమాధానం చెప్పటానికి నిరాకరించలేదు. పైగా ఏదీ దాచకుండా స్పష్టంగా సమాధానం చెప్పాడు. యోహాను, “నేను క్రీస్తును[b] కాదు!” అని చెప్పాడు.
21 వాళ్ళు అతణ్ణి, “మరి నీవెవరు? ఏలీయావా?” అని అడిగారు.
అతడు, “కాదు” అని అన్నాడు.
వాళ్ళు, “ప్రవక్తవా?” అని అడిగారు.
అతడు, “కాదు” అని అన్నాడు.
22 చివరకు వాళ్ళు, “మరి నీవెవరవు? మమ్మల్ని పంపిన వాళ్ళకు చెప్పటానికి మాకో సమాధానం చెప్పండి. మమ్మల్ని పంపిన వాళ్ళకు చెప్పటానికి నీ గురించి నీవేమని చెప్పుచున్నావు?” అని అడిగారు.
23 యోహాను యిలా సమాధానం చెప్పాడు:
“ప్రభువు కోసం చక్కటి మార్గం వేయుమని ఎడారి ప్రాంతాల్లో
ఒక స్వరం ఎలుగెత్తి పలికింది.”(A)
ఇవి యెషయా ప్రవక్త అన్న మాటలు.
24 వీళ్ళను పంపింది పరిసయ్యులు. 25 వాళ్ళు మరొక ప్రశ్న వేస్తూ, “నీవు క్రీస్తువు కానంటున్నావు, ఏలీయావుకానంటున్నావు, ప్రవక్తవుకానంటున్నావు. అటువంటప్పుడు నీవు ప్రజలకు బాప్తిస్మము ఎందుకిస్తున్నావు?” అని అడిగారు.
26 యోహాను సమాధానం చెబుతూ, “నేను నీళ్ళ ద్వారా బాప్తిస్మము యిస్తున్నాను. కాని మీరెరుగని వాడొకాయన మీ మధ్య ఉన్నాడు. 27 నా తర్వాత రానున్నవాడు ఆయనే. ఆయన చెప్పులు విప్పటానికి కూడా నేను తగను” అని అన్నాడు.
28 ఈ సంఘటనలన్నీ బేతనియ గ్రామంలో జరిగాయి. అది యోహాను బాప్తిస్మము ఇచ్చిన యొర్దాను నదికి అవతల వైపున ఉంది.
దేవుని గొఱ్ఱె పిల్ల
29 మరుసటి రోజు యోహాను యేసు తన వైపురావటం చూసి, “అదిగో! దేవుని గొఱ్ఱెపిల్ల! ఆయన ప్రజల పాపాలను తన మీద వేసుకొంటాడు. 30 నేను యిదివరలో, ‘నా తర్వాత రానున్న వాడొకడున్నాడు. ఆయన నాకన్నా ముందు నుండి ఉన్నవాడు. అందువలన ఆయన నాకన్నా గొప్పవాడు’ అని నేను చెప్పింది ఈయన్ని గురించే! 31 అప్పుడాయన ఎవరో నాక్కూడా తెలియదు. కాని, ఆయన్ని ఇశ్రాయేలు ప్రజలకు తెలియ చేయటానికి బాప్తిస్మము నిస్తూ వచ్చాను” అని అన్నాడు.
32 ఆ తర్వాత యోహాను మళ్ళీ ఈ విధంగా చెప్పాడు: “ఆకాశం నుండి పవిత్రాత్మ ఒక పావురంలా వచ్చి ఆయనపై వాలటం చూసాను. 33 బాప్తిస్మము నివ్వటానికి దేవుడు నన్ను పంపాడు. ‘పవిత్రాత్మ క్రిందికి వచ్చి ఎవరి మీద వ్రాలుతాడో ఆ వ్యక్తి పవిత్రాత్మ ద్వారా బాప్తిస్మము యిస్తాడు’ అని దేవుడు నాకు ముందే చెప్పక పోయివుంటే ఆయనెవరో నాకు తెలిసేది కాదు. 34 నేను ఈ సంఘటనను చూసాను. ఈయన దేవుని కుమారుడని సాక్ష్యం చెబుతున్నాను.”
యేసు మొదటి శిష్యులు
35 మరుసటి రోజు యోహాను అక్కడ నిలబడి ఉన్నాడు. అతని శిష్య బృందానికి చెందిన యిద్దరు అతనితో ఉండినారు. 36 అదే సమయాన యేసు అలా వెళ్ళటం చూసి, “అదిగో దేవుని గొఱ్ఱెపిల్లను చూడండి!” అని అన్నాడు.
37 ఆ యిద్దరు శిష్యులు అతడీమాట అనటం విని, యేసును అనుసరించారు. 38 యేసు వాళ్ళ వైపు తిరిగి, వాళ్ళు రావటం చూసి, “మీకేం కావాలి?” అని అడిగాడు.
వాళ్ళు, “రబ్బీ! మీరెక్కడ ఉంటున్నారు?” అని అడిగారు. (రబ్బీ అంటే గురువు అని అర్థం.)
39 యేసు, “వచ్చి చూడండి” అని సమాధానం చెప్పాడు. వాళ్ళు వెళ్ళి ఆయనెక్కడ ఉంటున్నాడో చూసారు. ఆ రోజు ఆయనతో గడిపారు. అప్పుడు సుమారు సాయంకాలం నాలుగు గంటలు అయింది.
40 యోహాను చెప్పింది విని, యేసును అనుసరించిన యిద్దరిలో 41 అంద్రెయ ఒకడు. అంద్రెయ సీమోను పేతురు సోదరుడు. అంద్రెయ వెంటనే తన సోదరుడైన సీమోనును కనుగొని అతనితో, “మెస్సీయను కనుగొన్నాము” అని అన్నాడు.
42 తర్వాత సీమోనును యేసు దగ్గరకు పిలుచుకువచ్చాడు. యేసు అతణ్ణి చూసి, “నీ పేరు సీమోను! నీవు యోహాను కుమారుడవు. ఇప్పటి నుండి నీవు కేఫా[c] అని పిలువబడుతావు” అని అన్నాడు. కేఫా అంటే పేతురు అని అర్థం.
43 మరుసటి రోజు యేసు గలిలయకు వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. ఫిలిప్పు దగ్గరకు వెళ్ళి అతనితో, “నన్ను అనుసరించు” అని అన్నాడు. 44 అంద్రెయ, పేతురులాగే, ఫిలిప్పు కూడా బేత్సయిదా గ్రామస్థుడు. 45 ఫిలిప్పు నతనయేలు కోసం వెతికి అతనితో, “మేము మోషే ధర్మశాస్త్రంలో ఎవర్ని గురించి వ్రాయబడివుందో ఆయన్ని కనుగొన్నాము. ప్రవక్తలు వ్రాసింది ఈయన్ని గురించే. ఈయన పేరు యేసు. ఈయన యోసేపు కుమారుడు. నజరేతు గ్రామస్థుడు” అని చెప్పాడు.
46 నతనయేలు, “నజరేతు గ్రామం నుండి మంచి జరగటం సంభవమా!” అని అడిగాడు.
“వచ్చి చూడు!” అని ఫిలిప్పు అన్నాడు.
47 నతనయేలు తన వైపు రావటం యేసు చూసాడు. అతణ్ణి గురించి, “అదిగో! నిజమైన ఇశ్రాయేలీయుడు! అతనిలో ఏ కపటమూ లేదు” అని అన్నాడు.
48 “మీకు నేనెలా తెలుసు?” అని నతనయేలు అడిగాడు.
యేసు, “ఫిలిప్పు నిన్ను పిలువక ముందే, నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూసాను” అని అన్నాడు.
49 నతనయేలు, “రబ్బీ! మీరు నిజముగా దేవుని కుమారుడు. ఇశ్రాయేలు జనాంగానికి ప్రభువు” అని అన్నాడు.
50 యేసు, “నీవు అంజూరపు చెట్టు క్రింద ఉండటం చూసానని చెప్పినందుకు విశ్వసిస్తున్నావా? వీటికన్నా గొప్ప వాటిని చూస్తావు!” అని అన్నాడు. 51 ఆయన మళ్ళీ, “ఇది నిజం. ఆకాశం తెరచుకోవటం, దేవదూతలు మనుష్యకుమారుని యొద్దకు దిగటం, మరల ఎక్కిపోవటం చూస్తావు” అని అన్నాడు.
© 1997 Bible League International