Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
న్యాయాధిపతులు 13

సమ్సోను జననం

13 ఇశ్రాయేలు ప్రజలు చెడ్డ పనులు చేయడం మళ్లీ యెహోవా చూశాడు. అందువల్ల ఫిలిష్తీయులు వారిని 40 సంవత్సరాల పాటు పరిపాలించేందుకు యెహోవా అనుమతించాడు.

జొర్యాకి చెందిన ఒకతను ఉండేవాడు. అతని పేరు మానోహ. అతను దాను వంశానికి చెందినవాడు. మానోహకు ఒక భార్య ఉంది. ఆమె పిల్లలెవరినీ కనలేక పోయింది. యెహోవాదూత మానోహ భార్యకి ప్రత్యక్షమయ్యాడు. అతను ఇలా అన్నాడు: “నీవు పిల్లల్ని కనలేకపోయావు. కాని నీవు గర్భవతివవుతావు. ఒక కొడుకుని కంటావు. ఏ మద్యంగాని, ఘాటైన పానీయంగాని నీవు తాగవద్దు. అపరిశుభ్రమైన ఆహారం కూడా నీవు తినవద్దు. ఎందుకంటే నీవు గర్భవతివై, ఒక కొడుకుని కంటావు. ఒక ప్రత్యేకమైన విధంగా అతను దేవునికి సమర్పించబడతాడు. అతను నాజీరవుతాడు.[a] అందువల్ల ఎప్పుడూ అతని జుట్టు కత్తిరించకు. అతను జన్మించడానికి పూర్వమె అతను దేవుని ప్రత్యేకమైన వ్యక్తిగా వుంటాడు. అతను ఇశ్రాయేలు ప్రజల్ని ఫిలిష్తీయుల అధికారం నుంచి కాపాడతాడు.”

తర్వాత ఆమె తన భర్త వద్దకు వెళ్లి అతనితో జరిగిన విషయం చెప్పింది. ఆమె ఇలా చెప్పింది: “దేవుని వద్దనుండి ఒక మనిషి నా వద్దకు వచ్చాడు. అతను దేవదూతగా కనిపించాడు. అతను నన్ను భయపెట్టాడు. ఎక్కడినుంచి అతను వచ్చాడో, ఆ సంగతి నేను కనుక్కోలేదు. అతను తన పేరు చెప్పలేదు. కాని నాతో ఇలా అన్నాడు: ‘నీవు గర్భవతివి. నీకొక కుమారుడు కలుగుతాడు. మద్యంగాని, ఏ ఇతర ఘాటైన పానీయంగాని తాగవద్దు. అపరిశుభ్రంగా ఉండే ఆహారమూ తినవద్దు. ఎందుకంటే, ప్రత్యేకమైన విధంగా అతను దేవునికి సమర్పించబడతాడు. ఆ బాలుడు దేవుని ప్రత్యేక వ్యక్తి. పుట్టుకకు మునుపటినుంచి మరణించేంత వరకు అతను విలక్షణమైన[b] మనిషి.’”

ఆ తర్వాత మానోహ యెహోవాను ప్రార్థించాడు. అతను ఇలా అన్నాడు: “యెహోవా, దేవ దూతను మళ్లీ మా వద్దకు పంపవలసిందిగా నిన్ను ప్రార్థిస్తున్నాను. త్వరలోనే బాలుడుగా జన్మించనున్న అతనికి మేము ఏమి చేయాలో అది ఆ దేవదూత మాకు నేర్పాలి”

దేవుడు మానోహ ప్రార్థన ఆలకించాడు. దేవదూత మళ్లీ ఆ స్త్రీకి ప్రత్యక్షమయ్యాడు. ఆమె ఒక పొలంలో కూర్చునివుంది. ఆమె భర్త మానోహ ఆమె వద్ద లేడు. 10 అందువల్ల అది చెప్పాలని భర్త వద్దకు పరుగెత్తి, “ఆ మనిషి తిరిగి వచ్చాడు! మొన్న వచ్చిన అతను ఇక్కడే వున్నాడు.” అని తన భర్తతో చెప్పింది.

11 మానోహ లేచి తన భార్యను అనుసరించాడు. అతను ఆ మనిషి వద్దకు రాగానే, “ఇంతకు మునుపు నా భార్యతో మాటలాడిన వ్యక్తివి నీవేనా” అని అడిగాడు.

“నేనే” అన్నాడు దేవదూత.

12 అందువల్ల మానోహ, “నీవు చెప్పినట్లు జరుగుతుందని భావిస్తున్నాను. బాలుడు ఎలాంటి జీవితం గడుపుతాడో, అతడేమి చేస్తాడో చెప్పు” అని అడిగాడు.

13 యెహోవాదూత మానోహతో ఇలా చెప్పాడు: “నేను చెప్పినదంతా నీ భార్య చేయాలి. 14 ద్రాక్షాతీగ మీద పెరిగే దానిని ఆమె తినకూడదు. ఆమె మద్యము తాగకూడదు. అపరిశుభ్రమైన ఆహారం తినకూడదు. ఏమి చేయుమని ఆమెను ఆజ్ఞాపించానో, ఆమె అదంతా చేయాలి.”

15 అప్పుడు ఆ యెహోవాదూతతో మానోహ ఇలా చెప్పాడు: “దయచేసి నీవు మాతోపాటు కొంత సేపు ఉండు. నీవు తినేందుకుగాను ఒక లేత మేకను వండిపెట్టాలని అనుకుంటున్నాము.”

16 యెహోవాదూత మానోహతో ఇలా అన్నాడు: “నేను వెళ్లకుండా మీరు చేసినా, నేను మీరు పెట్టే ఆహారం తినను. కాని మీరేదైనా చెయ్యదలుచుకుంటే, అప్పుడు యెహోవాకు దహనబలిని సమర్పించండి.” (ఆ వ్యక్తి నిజంగా యెహోవాదూత అని మానోహ అర్థం చేసుకోలేక పోయాడు).

17 అప్పుడు యెహోవాదూతను, “నీ పేరేమిటి? నీవు చెప్పినదంతా నిజంగా జరిగినప్పుడు, నిన్ను గౌరవించాలని మేమనుకుంటున్నాము. అందువల్లనే నీ పేరు తెలుసుకోదలచాను.”

18 యెహోవాదూత ఇలా చెప్పాడు: “నా పేరు మీరెందుకు అడుగుతున్నారు? ఇది మీరు నమ్మడానికి చాలా ఆశ్చర్యకరము”

19 అప్పుడు మానోహ ఒక బండ మీద ఒక లేత మేకను బలి ఇచ్చాడు. మేకను, ధాన్యమును యెహోవాకు, మరియు అద్భుతాలు చేసే వ్యక్తికీ సమర్పించాడు. 20 మానోహ, అతని భార్య జరిగిన వాటిని గమనిస్తూ వచ్చారు. మధ్యస్థానము నుండి ఆకాశానికి పొగలు లేచినప్పుడు, యెహోవాదూత ఆ మంటలలో పరమునకు వెళ్లిపోయాడు!

ఎప్పుడైతే అది మానోహ, అతని భార్య చూసారో, నేలకు తాకేలా తమ ముఖాలు వంచి నమస్కరించారు. 21 ఆ వ్యక్తి నిజంగానే యెహోవాదూత అని చివరికి మానోహ గ్రహించాడు. ఆ తర్వాత యెహోవాదూత మళ్లీ మానోహ, మరియు ఆయన భార్య ముందు ప్రత్యక్షం కాలేదు. 22 మానోహ తన భార్యతో ఇలా అన్నాడు: “మనం దేవుణ్ణి చూశాము. అందువల్ల తప్పకుండా మనం మరణిస్తాము!”

23 కాని అతని భార్య అతనితో, “మనల్ని చంపాలని దేవుడు భావించడం లేదు. యెహోవా కనుక మనల్ని చంపదలచుకుంటే, మనం సమర్పించిన వండిన వస్తువుని, ధాన్యాన్ని ఆయన స్వీకరించి ఉండడు. మనకీ విషయాలను ఆయన చూపివుండడు. పైగా వీటిని మనకు చెప్పి ఉండడు.” అని చెప్పింది.

24 తరువాత ఆ స్త్రీకి బాలుడు జన్మించాడు. అతనికి సమ్సోను అని పేరు పెట్టింది. సమ్సోను పెరిగాడు. యెహోవా అతనిని ఆశీర్వదించాడు. 25 యెహోవా ఆత్మ సమ్సోనులో పనిచేయనారంభించింది. అతనప్పుడు మహెనుదాను నగరంలో ఉన్నాడు. ఆ నగరం జోర్యా, ఎష్తాయోలుకు మధ్య ఉంది.

అపొస్తలుల కార్యములు 17

థెస్సలొనీకలో

17 వాళ్ళు “అంఫిపొలి”, “అపోల్లోనియ” పట్టణాల ద్వారా ప్రయాణం చేసి థెస్సలొనీక అనే పట్టణం చేరుకొన్నారు. అక్కడ ఒక యూదుల సమాజమందిరం ఉంది. అలవాటు ప్రకారం పౌలు ఆ సమాజమందిరానికి వెళ్ళాడు. అక్కడ మూడు శనివారాలు గడిపాడు. వాళ్ళతో యూదుల లేఖనాలు చెప్పి, విషయాలు తర్కించాడు. క్రీస్తు చనిపోవలసిన అవసరం, బ్రతికి రావలసిన అవసరం ఉందని వాళ్ళకు అర్థమయ్యేటట్లు చెప్పాడు. ఈ విషయాన్ని లేఖనాలుపయోగించి రుజువు చేసాడు. “నేను చెబుతున్న ఈ యేసే క్రీస్తు!” అని వాళ్ళకు నచ్చచెప్పాడు. తద్వారా కొందరు సమ్మతించి పౌలు, సీల పక్షము చేరిపోయారు. దైవభీతిగల చాలా మంది గ్రీకులు, ముఖ్యమైన స్త్రీలు వీళ్ళ పక్షం చేరిపోయారు.

ఇది గమనించి యూదులు అసూయ పడ్డారు. సంతలో ఉన్న పనిలేనివాళ్ళను కొందర్ని నమావేశపరచి పట్టణంలో అల్లర్లు మొదలు పెట్టారు. పౌలు, సీలలను ప్రజల ముందుకు లాగాలనుకొని అంతా కలిసి యాసోను యింటి మీద పడ్డారు. వాళ్ళు అక్కడ కనిపించక పోయేసరికి యాసోన్ను, మరి కొందరు సోదరుల్ని పట్టణపు అధికారుల ముందుకు తీసుకొని వచ్చి, “ప్రపంచాన్నే కలవరపరచిన ఈ మనుష్యులు ఇప్పుడిక్కడికి వచ్చారు. వీళ్ళకు యాసోను తన యింట్లో ఆతిథ్యమిచ్చాడు. వీళ్ళంతా చక్రవర్తి నియమాల్ని అతిక్రమిస్తూ యేసు అనే మరొక రాజున్నాడంటున్నారు” అని కేకలు వేసారు.

ఈ మాటలు విని అక్కడున్న ప్రజలు, అధికారులు రేకెత్తిపోయారు. ఆ తర్వాత యాసోనుతో, మిగతా వాళ్ళందరితో పత్రాన్ని వ్రాయించుకొని వాళ్ళను వదిలివేసారు.

బెరయలో

10 అర్థరాత్రి కాగానే సోదరులు పౌలును, సీలను బెరయ అనే పట్టణానికి పంపించారు. బెరయకు వచ్చినవాళ్ళు యూదుల సమాజమందిరానికి వెళ్ళారు. 11 థెస్సలోనీక వాళ్ళకన్నా బెరయవాళ్ళు మర్యాద కలవాళ్ళు. వాళ్ళు దైవసందేశాన్ని శ్రద్ధతో వినేవాళ్ళు. ప్రతిరోజు పవిత్ర గ్రంథం చదివి, ఆ సందేశంలోని నిజానిజాలు పరిశీలించేవాళ్ళు. 12 చాలా మంది యూదులు విశ్వాసులయ్యారు. వాళ్ళలాగే ముఖ్యమైన గ్రీకు స్త్రీలు, పురుషులు కూడా విశ్వాసులయ్యారు.

13 పౌలు దైవసందేశాన్ని బెరయలో కూడా ఉపదేశిస్తున్నాడని థెస్సలోనీకలోని యూదులకు తెలిసింది. వాళ్ళు అక్కడికి వెళ్ళి ప్రజలను పురికొలిపి, వాళ్ళలో అల్లర్లు రేకెత్తించారు. 14 వెంటనే సోదరులు పౌలును సముద్ర తీరానికి పంపారు. సీల, తిమోతి బెరయలోనే ఉండిపోయారు. 15 పౌలుతో వెళ్ళినవాళ్ళు అతనితో కలిసి ఏథెన్సుదాకా వెళ్ళారు. సీలను, తిమోతిని అయినంత త్వరలో రమ్మనమని పౌలు వాళ్ళ ద్వారా కబురు పంపాడు. ఈ వార్తతో వాళ్ళు తిరిగి బెరయకు వెళ్ళిపోయారు.

ఏథెన్సులో

16 పౌలు ఏథెన్సులో వాళ్ళకోసం ఎదురు చూస్తూ కొద్ది రోజులు ఆగిపొయ్యాడు. ఆ పట్టణం విగ్రహాలతో నిండి ఉండటం గమనించి అతని ఆత్మ దుఃఖించింది. 17 అందువల్ల సమాజమందిరంలో సమావేశమయ్యే యూదులతో, దైవభీతిగల యూదులుకాని ప్రజలతో, సంతకు వచ్చి పోయే ప్రజలతో ప్రతి రోజు మాట్లాడే వాడు. 18 ఎపికూరీయులు అని అనబడే కొందరు తత్వజ్ఞులు, స్తోయికులు అనబడే కొందరు తత్వజ్ఞులు అతనితో తర్కించారు.

“ఆ వదరుబోతు ఏమంటున్నాడు?” అని కొందరు అన్నారు. “ఇతర దేవుళ్ళను గురించి ప్రబోధిస్తున్నట్లుంది” అని మరి కొందరు అన్నారు. పౌలు యేసును గురించి, ఆయన బ్రతికి రావటాన్ని గురించి ప్రకటించటం వల్ల అతణ్ణి వాళ్ళిలా విమర్శించారు.

19 వాళ్ళు అతనిని పట్టుకొని అరేయొపగు సభకు పిలుచుకు వచ్చారు. “నీవు చెబుతున్న ఈ క్రొత్త బోధ ఏమిటో మేము తెలుసుకోవచ్చా?” అని కొందరు అడిగారు. 20 “నీవు చిత్రమైన విషయాలు మా చెవుల్లో వేసావు. వాటి అర్థం మాకు చెప్పు” అని మరి కొందరడిగారు. 21 ఏథెన్సు ప్రజలు, ఆ పట్టణంలో నివసించే పరదేశీయులు, తమ కాలాన్నంతా కొన్ని సిద్ధాంతాలను చెప్పటంలోనో లేక వినటంలోనో గడిపేవాళ్ళు. మరే పని చేసేవాళ్ళు కాదు.

22 పౌలు అరేయొపగు సభలో నిల్చొని, “ఏథెన్సు ప్రజలారా! మీరు అన్ని విషయాల్లో చాలా నిష్ఠగా ఉన్నారు. ఇది నేను గమనించాను. 23 నేను మీ పట్టణమంతా పర్యటించాను. మీరు పూజించే వాటిని చూసాను. అంతేకాదు సాంబ్రాణి వేసే ఒక బలిపీఠం మీద, ‘తెలియని దేవునికి’ అని వ్రాయబడి ఉండటం చూసాను. అందువల్ల మీకు తెలియకున్నా మీరు పూజించే ఆ దేవుణ్ణి గురించి ప్రకటించబోతున్నాను.

24 “ఈ ప్రపంచాన్ని, దానిలో ఉన్న ప్రతి వస్తువును సృష్టించిన దేవుడు, ఆకాశానికి, భూమికి ప్రభువైనటువంటి దేవుడు మానవులు కట్టిన మందిరాల్లో నివసించడు. 25 మానవులు దేవుని కోసం చేయగలిగిందేదీ లేదు. జీవి పీల్చుకొనే గాలిని, కావలసిన ప్రతి వస్తువును యిచ్చిన దేవునికి మానవుని సేవలు కావాలా? 26 ఆయన ఒక్క మనుష్యునితో మానవులందర్ని సృష్టించి వాళ్ళు ఈ ప్రపంచమంతా నివసించేటట్లు చేసాడు. వాళ్ళ కోసం ఒక కాలాన్ని నియమించాడు. ఏ దేశపు ప్రజలు ఎక్కడ నివసించాలో ఆ స్థలాన్ని, కాలాన్ని సరిగ్గా నియమించాడు.

27 “మానవులు తనను వెతకాలనీ, గ్రుడ్డివాడు తడిమినట్టు తడిమి తనను కనుగొనే అవకాశం వాళ్ళకు కలిగించాలనీ యిలా చేసాడు. కాని నిజానికి ఆయన ఎవ్వరికీ దూరంగా లేడు. 28 ‘మనం ఆయనలో జీవిస్తున్నాం, ఆయనలో కదులుతున్నాం, ఆయన కారణంగా మనం ఉన్నాం.’ మీలోని కొందరు కవులు చెప్పినట్లు: ‘మనం ఆయన సంతానం.’

29 “మనం దేవుని సంతానం కదా! అలాంటప్పుడు, దేవుడు బంగారంతో కాని, లేక వెండితో కాని, లేక రాతితో కాని చేయబడిన విగ్రహంలాంటివాడని మనం ఎట్లా అనగలం? ఆయన మానవుడు తన కల్పనతో, కళతో సృష్టించిన విగ్రహంలాంటివాడు కాడు. 30 గతంలో మానవుని అజ్ఞానం పట్ల ఆయన చూసీ చూడనట్లు ఉండినాడు. కాని యిప్పుడు ప్రతి ఒక్కణ్ణీ మారుమనస్సు పొందమని ఆజ్ఞాపిస్తున్నాడు. 31 ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తిపై న్యాయమైన తీర్పు చెప్పనున్న రోజును నిర్ణయించాడు. ఎవని ద్వారా తీర్పు చెప్పనున్నాడో ఆయన్ని నియమించాడు. ఆయన్ని బ్రతికించి, తాను చేయనున్నదాన్ని ప్రజలందరికీ రుజువు చేసాడు.”

32 చనిపోయిన వారు యేసువలె బ్రతికి వస్తారన్న విషయం విని కొందరు అతణ్ణి హేళన చేసారు. మరి కొందరు, “ఈ విషయాన్ని గురించి మాకింకా వినాలని ఉంది” అని అన్నారు. 33 పరిస్థితులు యిలా అవటం వల్ల పౌలు ఆ సభనుండి వెళ్ళిపొయ్యాడు. 34 కొందరు విశ్వాసులై పౌలును అనుసరించారు. వాళ్ళలో అరేయొపగు అను సభకు సభ్యత్వం ఉన్న దియొనూసి అనేవాడు, దమరి అనే స్త్రీ మొదలగువాళ్ళున్నారు.

యిర్మీయా 26

దేవాలయం వద్ద యిర్మీయా పాఠం

26 యూదా రాజ్యాన్ని యెహోయాకీము పాలిస్తున్న మొదటి సంవత్సరంలో[a] ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చింది. రాజైన యెహోయాకీము యోషీయా కుమారుడు. యెహోవా ఇలా అన్నాడు: “యిర్మీయా, నీవు దేవాలయ ప్రాంగణంలో నిలబడు. దేవుని ఆరాధించుటకై వచ్చే యూదా ప్రజలందరికి ఈ సందేశాన్ని అందజేయుము. నేను నిన్ను మాట్లాడమని చెప్పినదంతా వారికి చెప్పుము. నా సందేశంలో ఏ భాగాన్ని వదిలి పెట్టవద్దు. బహుశః వారు నా సందేశాన్ని విని ఆచరించవచ్చు. బహుశః వారా దుర్మార్గపు జీవితాన్ని విడనాడవచ్చు. వారు గనుక మారితే, నేను వారిని శిక్షించాలనే నా పథకాన్ని కూడా మార్చు కుంటాను. వారు చేసిన అనేక దుష్టకార్యాల దృష్ట్యా నేను వారిని శిక్షించే పథకాన్ని తయారు చేస్తున్నాను. నీ విధి వారికి చెప్పుము, ‘యెహోవా ఇలా అంటున్నాడు: నా ఉపదేశాలను మీకు అందించాను. మీరు నాకు విధేయులై నా సూక్తులను పాటించాలి! నా సేవకులు (నా ప్రవక్తలు) మీకు చెప్పే విషయాలను మీరు ఆలకించాలి. నా ప్రవక్తలను మీ వద్దకు మరల, పంపియున్నాను. కాని మీరు వారు చెప్పేది ఆలకించలేదు. మీరు నన్ను అనుసరించక పోతే యెరూషలేములో ఉన్న నా ఆలయాన్ని షిలోహులో వున్న నా పవిత్ర గుడారం[b] మాదిరిగా చేసివేస్తాను. ప్రపంచంలోని ప్రజలెవరైనా తమకు గిట్టని నగరాలకు కీడు జరగాలని తలిస్తే, యెరూషలేముకు జరిగినట్లు జరగాలని కోరుకుంటాను.’”

దేవాలయంలో యిర్మీయా ఈ మాటలు చెప్పటం యాజకులు, ప్రవక్తలు, దేవుని ఆలయానికి వచ్చిన ప్రజలందరూ విన్నారు. ప్రజలకు చెప్పమని యెహోవా ఆజ్ఞ యిచ్చినదంతా యిర్మీయా చెప్పటం ముగించాడు. పిమ్మట యాజకులు, ప్రవక్తలు, ప్రజలు అంతా యిర్మీయాను పట్టుకున్నారు. “ఈ భయంకరమైన విషయాలు చెప్పినందుకు నీవు చనిపోవలసినదే! యెహోవా పేరట అటువంటి విషయాలు చెప్పటానికి నీకు ఎంత ధైర్యం! షిలోహులోని పవిత్ర గుడారంలా ఈ దేవాలయం నాశనమవుతుందని చెప్పటానికి నీకు ఎంత ధైర్యం! యెరూషలేములో ఎవ్వరూ నివసించని రీతిలో అది ఎడారిలా మారిపోతుందని చెప్పటానికి నీకు ఎన్ని గుండెలు!” అని వారంతా యిర్మీయాను గద్దించారు. యెహోవా గుడిలో వారంతా యిర్మీయాను చుట్టు ముట్టారు.

10 ఇప్పుడు యూదా పాలకులు జరుగుతున్న విషయాలన్నీ విన్నారు. కావున వారు రాజభవనం నుండి బయటికి వచ్చారు. వారు దేవాలయానికి వెళ్లారు. అక్కడ దేవాలయానికి తిన్నగా వెళ్లే నూతన ద్వారం వద్ద తమ తమ స్థానాలను అలంకరించారు. 11 అప్పుడు యాజకులు, ప్రవక్తలు కలిసి పాలకులతోను, తదితర ప్రజలతోను మాట్లాడారు. “యిర్మీయా చంపబడాలి. యెరూషలేమును గురించి అతడు చాలా చెడ్డ విషయాలు చెప్పాడు. అతడా విషయాలు చెప్పటం మీరు కూడ విన్నారు” అని వారంతా చెప్పారు.

12 పిమ్మట యిర్మీయా యూదా పాలకులందరితోను, ఇతర ప్రజలతోను మాట్లాడాడు. అతనిలా చెప్పాడు: “ఈ ఆలయాన్ని గురించి, ఈ నగరాన్ని గురించి ఈ విషయాలు చెప్పమని యెహోవా నన్ను పంపాడు. మీరు వినియున్నదంతా యెహోవా తెలియజేసినదే. 13 ఓ ప్రజలారా, మీ జీవిత విధానం మార్చుకోండి! మీరు సత్కార్యాలు చేయుట మొదలుపెట్టండి! మీ దేవుడైన యెహోవాను మీరు అనుసరించాలి. మీరలా చేస్తే యెహోవా తన మనస్సు మార్చుకుంటాడు. యెహోవా మీకు వ్యతిరేకంగా తలపెట్టిన హానికరమైన పనులు చేయడు. 14 ఇక నా విషయానికి వస్తే, నేను మీ ఆధీనంలో ఉన్నాను. మీరు ఏది ఉచితమని, న్యాయమని తోస్తే, నాకు అది చేయండి. 15 కాని మీరు నన్ను చంపితే, ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి. మీరు ఖచ్చితంగా ఒక అమాయక వ్యక్తిని చంపిన నేరానికి పాల్పడిన వారవుతారు. అంతే కాదు. మీరీ నగరాన్ని, అందులోని ప్రతి పౌరుణ్ణి కూడ నేరస్థులుగా చేసిన వారవుతారు. యెహోవా నిజంగా నన్ను మీ వద్దకు పంపియున్నాడు. మీరు విన్న సందేశం వాస్తవంగా యెహోవా నుండే వచ్చినది.”

16 తరువాత పాలకులు, ప్రజలు అందరూ మాట్లాడారు. ఆ ప్రజలు యాజకులతోను “యిర్మీయా చంపబడకూడదు. యిర్మీయా మనకు చెప్పిన విషయాలు మన యెహోవా దేవుని నుండి వచ్చినవే” అని అన్నారు.

17 అప్పుడు నగర పెద్దలలో (నాయకులు) కొందరు లేచి ప్రజలతో ఇలా అన్నారు: 18 “ప్రవక్తయైన మీకా మోరష్తీ నగర వాసి. యూదా రాజైన హిజ్కియా పాలనా కాలంలో మీకా ప్రవక్తగా వున్నాడు. యూదా ప్రజలందరికీ మీకా(A) ఈ విషయాలు చెప్పియున్నాడు:

“సర్వశక్తిమంతుడైన యెహోవా చెప్పినదేమంటే:
    సీయోను దున్నబడిన పొలంలా అవుతుంది!
యెరూషలేము ఒక రాళ్ల గుట్టలా తయారవుతుంది!
    గుడివున్న పర్వతం, ఒక ఖాళీ కొండ[c] పొదలతో నిండినట్లవుతుంది.

19 “హిజ్కియా యూదాకు రాజుగా వున్నప్పుడు హిజ్కియా మీకాను చంపలేదు. యూదా ప్రజలెవ్వరూ మీకాను చంపలేదు. హిజ్కియా యెహోవా పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నాడని మీకు తెలుసు. అతడు దేవుని సంతోషపరచాలని కోరుకున్నాడు. యూదా రాజ్యానికి కీడు చేస్తానని యెహోవా అన్నాడు. కాని హిజ్కియా యెహోవాను ప్రార్థించాడు. అందువల్ల యెహోవా తన మనస్సు మార్చుకున్నాడు. యెహోవా ముందుగా అన్నట్లు ఏ కీడూ చేయలేదు. ఇప్పుడు మనం యిర్మీయాను గాయపర్చితే, మనం మన మీదికే అనేక కష్టాలు తెచ్చి పెట్టుకుంటాము. ఆ కష్టాలన్నీ మన స్వంత తప్పులు.”

20 గతంలో యెహోవా సందేశాన్ని ప్రవచించిన మరో వ్యక్తి వున్నాడు. అతని పేరు ఊరియా. అతడు షెమయా అనేవాని కుమారుడు. ఊరియా కిర్యత్యారీము నగరవాసి. యిర్మీయా చెప్పిన మాదిరిగానే ఈ నగరాన్ని గురించి, ఈ రాజ్యాన్ని గురించి ఊరియా కూడ చెప్పియున్నాడు. 21 రాజైన యెహోయాకీము, అతని సైన్యాధికారులు, మరియు యూదాలోని ప్రజా నాయకులు ఊరియా బోధించినదంతా విన్నారు. వారికి చాలా కోపం వచ్చింది. రాజైన యెహోయాకీము ఊరియాను చంపగోరాడు. కాని యోహోయాకీము తనను చంపగోరుతున్నట్లు ఊరియా విన్నాడు. ఊరియా భయపడ్డాడు. అందుచే అతడు ఈజిప్టుకు తప్పించుకు పోయాడు. 22 కాని ఎల్నాతాను అనే వ్యక్తిని, మరి కొందరు మనుష్యులను రాజైన యోహోయాకీము ఈజిప్టుకు పంపాడు. ఎల్నాతాను అనేవాడు. అక్బోరు అనేవాని కుమారుడు. 23 ఆ మనుష్యులు ఊరియాను ఈజిప్టు నుండి తీసికొని వచ్చారు. వారు ఊరియాను రాజైన యెహోయాకీము వద్దకు తీసికొని వెళ్లారు. ఊరియాను కత్తితో నరికి చంపమని యెహోయాకీము ఆజ్ఞ యిచ్చాడు. పేద ప్రజల స్మశాన వాటికలో అతని శవం పారవేయబడింది.

24 షాఫాను కుమారుడైన అహీకాము అనే ప్రముఖ వ్యక్తి ఒకడున్నాడు. అహీకాము యిర్మీయాకు అండగావున్నాడు. అందుచే అహీకాము యాజకుల బారి నుండి, ప్రవక్తల బారి నుండి చంపబడకుండా యిర్మీయాను రక్షించాడు.

మార్కు 12

రైతుల ఉపమానం

(మత్తయి 21:33-46; లూకా 20:9-19)

12 ఆ తర్వాత ఆయన వాళ్ళతో దృష్టాంతాలు చెబుతూ ఇలా మాట్లాడటం మొదలు పెట్టాడు: “ఒకడు ద్రాక్షాతోట వేసి, చుట్టూ ఒక గోడ కట్టాడు. ద్రాక్షపళ్ళు త్రొక్కటానికి ఒక తొట్టి కట్టించాడు. అక్కడే ఒక గోపురం కట్టించాడు. ఆ తర్వాత ఆ ద్రాక్షతోటను కొంతమంది రైతులకు కౌలుకిచ్చి ప్రయాణమై వెళ్ళిపోయాడు.

“పంటకాలం రాగానే పంటలో తనకు రావలసిన భాగం తీసుకు రమ్మని ఒక సేవకుణ్ణి వాళ్ళ దగ్గరకు పంపాడు. కాని ఆ రైతులతణ్ణి పట్టుకొని కొట్టి వట్టిచేతులతో పంపివేసారు. ఆ తర్వాత అతడు యింకొక సేవకుణ్ణి పంపాడు. వాళ్ళతణ్ణి తలపై బాది అవమానపరిచారు. అతడు యింకొక సేవకుణ్ణి కూడా పంపాడు. వాళ్ళతణ్ణి చంపివేసారు. అతడింకా చాలామందిని పంపాడు. కాని ఆ రైతులు వారిలో కొందరిని చంపారు. మరి కొందరిని కొట్టారు.

“తన ప్రియమైన కుమారుడు తప్ప పంపటానికి యింకెవ్వరూ మిగల్లేదు. వాళ్ళు తన కుమారుణ్ణి గౌరవిస్తారనుకొని చివరకు తన కుమారుణ్ణి పంపాడు.

“కాని ఆ రైతులు, ‘ఇతడు వారసుడు! యితణ్ణి చంపుదాం; అప్పుడు ఆ వారసత్వం మనకు దక్కుతుంది’ అని పరస్పరం మాట్లాడుకొన్నారు. ఆ కారణంగా వాళ్ళతణ్ణి పట్టుకొని చంపి ఆ ద్రాక్షతోటకు అవతల పడవేసారు.

“అప్పుడు ఆ ద్రాక్షతోట యజమాని ఏం చేస్తాడు? వచ్చి ఆ రైతుల్ని చంపేసి ఆ ద్రాక్షతోటను యితరులకు కౌలుకిస్తాడు. 10 లేఖనాల్లో ఈ విధంగా వ్రాసారు: ఇది మీరు చదువలేదా?

‘ఇల్లు కట్టువాళ్ళు పనికిరాదని పారవేసిన రాయి తలరాయిగా మారింది.
11 ఇది ప్రభువు చేసాడు. ఆ అద్భుతాన్ని మనం కండ్లారా చూసాము.’”(A)

12 ఈ దృష్టాంతం తమనుగూర్చి చెప్పాడని యూదులు గ్రహించారు. కనుక ఆయన్ని బంధించటానికి మార్గం ఆలోచించారు. కాని ప్రజల గుంపును చూసి భయపడిపొయ్యారు. అందువల్ల ఆయన్ని వదిలి వెళ్ళిపొయ్యారు.

యూదా నాయకులు యేసును మోసగించుటకు ప్రయత్నించటం

(మత్తయి 22:15-22; లూకా 20:20-26)

13 ఆ తర్వాత యేసును ఆయన మాటల్లో పట్టేయాలని కొంతమంది పరిసయ్యుల్ని[a] హేరోదు రాజు పక్షముననున్న వాళ్ళను ఆయన దగ్గరకు పంపారు. 14 వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చి, “అయ్యా! మీరు సత్యవంతులని మాకు తెలుసు. మీరు మానవుల మాటలకు లొంగిపోరు. వాళ్ళెవరనే విషయం మీకు అవసరం లేదు. సత్యమార్గాన్ని మీరు ఉన్నది ఉన్నట్లు బోధిస్తారు. మరి చక్రవర్తికి పన్నులు కట్టటం న్యాయమా? కాదా? మేము పన్నులు కట్టాలా మానాలా?” అని అడిగారు.

15 యేసుకు వాళ్ళ కుట్ర తెలిసి పోయింది. “నన్నెందుకు మోసం చేయాలని అనుకుంటున్నారు? ఒక దేనారా[b] యివ్వండి. నన్ను దాన్ని చూడనివ్వండి” అని అన్నాడు. 16 వాళ్ళు ఒక నాణాన్ని తీసుకు వచ్చారు. యేసు, “దీని మీద ఎవరి బొమ్మ ఉంది? ఎవరి శాసనం ఉంది?” అని అడిగాడు. “చక్రవర్తిది” అని వాళ్ళు సమాధానం చెప్పారు.

17 అప్పుడు యేసు వారితో, “చక్రవర్తికి చెందింది చక్రవర్తికి యివ్వండి, దేవునికి చెందింది దేవునికి యివ్వండి” అని అన్నాడు. ఆయన సమాధానం విని వాళ్ళు ఆశ్చర్యపొయ్యారు.

కొందరు సద్దూకయ్యులు యేసును మోసగించుటకు ప్రయత్నించటం

(మత్తయి 22:23-33; లూకా 20:27-40)

18 చనిపోయిన వాళ్ళు మళ్ళీ బ్రతకరని వాదించే సద్దూకయ్యులు ఆయన దగ్గరకు వచ్చి ఒక ప్రశ్న వేసారు. 19 “అయ్యా, ఒకని సోదరుడు చనిపోతే, ఆ చనిపోయిన సోదరునికి సంతానం లేకపోయినట్టయితే, ఆ చనిపోయిన సోదరుని భార్యను బ్రతికివున్న సోదరుడు వివాహమాడి, చనిపోయిన సోదరునికి సంతానం కలిగేటట్లు చెయ్యాలని మోషే మనకోసం ధర్మశాస్త్రంలో వ్రాసాడు. 20 ఒకప్పుడు ఏడుగురు సోదరులుండే వాళ్ళు. మొదటివాడు వివాహం చేసుకొని సంతానం లేకుండా చనిపొయ్యాడు. 21 రెండవ వాడు అతని వితంతువును వివాహమాడాడు. కాని అతడు కూడా సంతానం లేకుండా చనిపొయ్యాడు. మూడవ వానికి కూడా అదే సంభవించింది. 22 ఆ ఏడుగురిలో ఎవ్వరికి సంతానం కలగలేదు. చివరకు ఆ స్త్రీకూడా చనిపోయింది. 23 చనిపోయిన వాళ్ళు బ్రతికి వచ్చినప్పుడు ఆమె ఎవరి భార్యగా పరిగణింపబడుతుంది? ఆమెను ఆ ఏడగురు పెండ్లి చేసుకొన్నారు కదా?” అని అడిగారు.

24 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “మీకు లేఖనాలు, దేవుని శక్తి తెలియవు. కనుక పొరబడుతున్నారు. 25 చనిపోయిన వాళ్ళు బ్రతికివచ్చాక వివాహం చేసుకోరు. వాళ్ళు ఆడ, మగ అని ఉండరు. వాళ్ళు పరలోకంలో ఉన్న దేవదూతల్లా ఉంటారు. 26 ఇక చనిపోయిన వాళ్ళు బ్రతకటం విషయంలో మోషే తాను వ్రాసిన గ్రంథంలో ‘పొదను’ గురించి వ్రాసినప్పుడు, దేవుడు అతనితో ‘నేను అబ్రాహాముకు దేవుణ్ణి, ఇస్సాక్కు దేవుణ్ణి, యాకోబుకు దేవుణ్ణి’(B) అని అతనితో చెప్పాడు. 27 ‘నేను వాళ్ళ దేవుణ్ణి’ అని ఆయన అన్నప్పుడు, వాళ్ళు నిజంగా చనిపోలేదన్న మాట. అంటే ఆయన బ్రతికివున్న వాళ్ళకు మాత్రమే దేవుడు. మీరు చాలా పొరబడుతున్నారు.”[c]

అతి ముఖ్యమైన ఆజ్ఞ ఏది?

(మత్తయి 22:34-40; లూకా 10:25-28)

28 శాస్త్రుల్లో ఒకడు వచ్చి వాదన విన్నాడు. యేసు చక్కటి సమాధానం చెప్పాడని గ్రహించి, “ఆజ్ఞలన్నిటిలో ఏ ఆజ్ఞ ముఖ్య మైనది?” అని యేసును అడిగాడు.

29 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “ఓ ఇశ్రాయేలు జనాంగమా విను. మొదటిది ఇది: మన ప్రభువైన దేవుడు మాత్రమే ప్రభువు. 30 నీ శక్తి, బుద్ధి, సంపూర్ణంగా ఉపయోగిస్తూ నీ ప్రభువైన దేవుణ్ణి నీ సంపూర్ణమైన ఆత్మతో మనస్ఫూర్తిగా ప్రేమించు,(C) 31 రెండవది ఇది: నిన్ను నీవు ప్రేమించుకున్నంతగా నీ పొరుగు వాణ్ణి ప్రేమించు.(D) వీటిని మించిన ఆజ్ఞ మరొకటి లేదు.”

32 ఆ శాస్త్రి, “అయ్యా! చక్కగా చెప్పారు. దేవుడు ఒక్కడేనని, ఆయన తప్ప మరెవ్వరూ లేరని సరిగ్గా చెప్పారు. 33 ఆ దేవుణ్ణి సంపూర్ణమైన బుద్ధితో, సంపూర్ణమైన మనస్సుతో శక్తినంతా ఉపయోగిస్తూ ప్రేమించాలని, మరియు తనను ప్రేమించుకొన్నంతగా, తన పొరుగువాణ్ణి ప్రేమించాలని చక్కగా చెప్పారు. ఈ రెండు ఆజ్ఞలు, బలులకన్నా, దహన బలులకన్నా ముఖ్యమైనవి” అని అన్నాడు.

34 అతడు తెలివిగా చెప్పాడని యేసు గ్రహించి అతనితో, “నీవు దేవుని రాజ్యానికి దూరంగా లేవు!” అని అన్నాడు. ఆ తర్వాత ఆయన్ని ప్రశ్నలు అడగటానికి ఎవ్వరికి ధైర్యం చాలలేదు.

క్రీస్తు దావీదు కుమారుడా లేక దావీదుకు ప్రభువా?

(మత్తయి 22:41-46; లూకా 20:41-44)

35 యేసు మందిరంలో బోధిస్తూ ఈ విధంగా అన్నాడు: “క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు ఎందుకంటున్నారు? 36 దావీదే స్వయంగా పవిత్రాత్మ ద్వారా మాట్లాడుతూ ఈ విధంగా అన్నాడు:

‘ప్రభువు, నా ప్రభువుతో ఈ విధంగా అన్నాడు:
నీ శత్రువుల్ని నీ కాళ్ళ ముందు పడవేసేవరకు
    నా కుడిచేతి వైపు కూర్చొనుము.’(E)

37 దావీదు స్వయంగా ఆయన్ని, ‘ప్రభూ!’ అని పిలిచాడు కదా! మరి అలాంటప్పుడు క్రీస్తు దావీదు కుమారుడెట్లా ఔతాడు?” అక్కడున్న ప్రజలగుంపు అత్యానందంగా ఆయన మాటలు విన్నారు.

యేసు శాస్త్రులను విమర్శించటం

(మత్తయి 23:6-7; లూకా 11:43; 20:45-47)

38 యేసు యింకా ఎన్నో విషయాలు బోధిస్తూ ఈ విధంగా అన్నాడు: “శాస్త్రుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు పొడుగాటి దుస్తులు ధరించి నడవాలని, సంతల్లో ప్రజలు తమకు నమస్కరించాలని కోరుతూ ఉంటారు. 39 వాళ్ళు సమాజాల్లో ముఖ్య స్థానాలను, విందుల్లో గౌరవప్రదమైన స్థానాలను ఆక్రమించాలని ఆశిస్తూ ఉంటారు. 40 వాళ్ళు వితంతువుల యిండ్లను దోచుకుంటూ, పైకి మాత్రం గంటల తరబడి ప్రార్థిస్తూవుంటారు. అలాంటి వాళ్ళను దేవుడు అతితీవ్రంగా శిక్షిస్తాడు.”

నిజమైన కానుక

(లూకా 21:1-4)

41 ఒక రోజు యేసు, మందిరంలో కానుకలు వేసే పెట్టెకు ఎదురుగా కూర్చొని ఉన్నాడు. ప్రజలు ఆ పెట్టెలో డబ్బును వేయటం ఆయన గమనించాడు. ధనవంతులు చాలామంది పెద్ద పెద్ద మొత్తాల్ని ఆ పెట్టెలో వేసారు. 42 కాని ఒక పేద వితంతువు వచ్చి రెండు రాగి నాణెములను ఆ పెట్టెలో వేసింది.

43 యేసు తన శిష్యులను దగ్గరకు పిలిచి, “ఇది నిజం. ఈ పేద వితంతువు ఆ పెట్టెలో అందరికన్నా ఎక్కువ డబ్బు వేసింది. 44 మిగతా వాళ్ళు తాము దాచుకొన్న ధనంలో కొంత భాగం మాత్రమే వేసారు. కాని ఆమె పేదదైనా తన దగ్గరున్నదంతా వేసింది” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International