Print Page Options
Previous Prev Day Next DayNext

Read the Gospels in 40 Days

Read through the four Gospels--Matthew, Mark, Luke, and John--in 40 days.
Duration: 40 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
లూకా 4-6

సైతాను యేసును శోధించటం

(మత్తయి 4:1-11; మార్కు 1:12-13)

యేసు యొర్దాను నది ప్రాంతం నుండి తిరిగి వచ్చాడు. ఆయన పవిత్రాత్మపూర్ణుడై యుండి ఎడారి ప్రాంతానికి ఆత్మ చేత నడిపించబడ్డాడు. అక్కడ సైతాను ఆయన్ని నలభై దినాలు శోధించాడు. ఆ నలభై రోజులు యేసు ఉపవాసం చేశాడు. ఆ తర్వాత ఆయనకు ఆకలి వేసింది.

సైతాను ఆయనతో, “నీవు దేవుని కుమారుడవైతే ఈ రాయిని రొట్టెగా మారుమని ఆజ్ఞాపించు!” అని అన్నాడు.

యేసు,

“‘మనిషి జీవించటానికి ఆహారం మాత్రమే చాలదు’ అని వ్రాయబడింది” అని సమాధానం చెప్పాడు.(A)

ఆ సైతాను ఆయన్ని ఎత్తైన స్థలానికి తీసుకు వెళ్ళాడు. ఒక్క క్షణంలో ప్రపంచంలోని రాజ్యాలన్ని ఆయనకు చూపించాడు. ఆయనతో, “వీటిపై అధికారము, వాటివల్ల లభించే గౌరవము నీకిస్తాను. అవి నావి. నా కిష్టం వచ్చిన వానికివ్వగలను. నా కాళ్ళ మీద పడితే వీటిని నీకిస్తాను.” అని అన్నాడు.

యేసు,

“‘నీ ప్రభువైన దేవుని ముందు మాత్రమే మోకరిల్లి,
    ఆయన సేవ మాత్రమే చెయ్యి’(B)

అని వ్రాయబడింది” అని సమాధానం చెప్పాడు.

సైతాను ఆయన్ని యెరూషలేములో ఉన్న ఆలయానికి తీసుకెళ్ళి ఎత్తైన స్థలంలో నిలుచోబెట్టి “నీవు దేవుని కుమారుడవైతే యిక్కడి నుండి క్రిందికి దూకు.

10 ‘దేవుడు తన దూతలతో నిన్ను కాపాడుమని ఆజ్ఞాపిస్తాడు.’(C)

11 అంతేకాక:

‘ఆ దూతులు నీ కాళ్ళు రాతికి తగలకుండా
    నిన్నుతమ చేతుల్తో ఎత్తి పట్టుకుంటారు’(D)

అని వ్రాయబడింది” అని అన్నాడు.

12 యేసు,

“‘నీ ప్రభువైన దేవుణ్ణి పరీక్షించరాదు.’(E)

అని కూడా వ్రాయబడింది” అని సమాధానం చెప్పాడు. 13 ఆ సైతాను యేసును పరీక్షించటం మానేసి అప్పటికి ఆయన్ని వదిలి పొయ్యాడు.

గలిలయలో యేసుని సేవా ప్రారంభం

(మత్తయి 4:12-17; మార్కు 1:14-15)

14 యేసు పవిత్రాత్మ శక్తితో గలిలయకు తిరిగి వచ్చాడు. ఆయన్ని గురించి ఆ చుట్టూ ఉన్న ప్రాంతాల్లోని ప్రజలకు తెలిసింది. 15 ఆయన ఆ ప్రాంతాల్లో ఉన్న సమాజ మందిరాల్లో బోధించాడు. ప్రతి ఒక్కరూ ఆయన్ని స్తుతించారు.

యేసు తన స్వగ్రామానికి వెళ్ళటం

(మత్తయి 13:53-58; మార్కు 6:1-6)

16 ఆ తర్వాత తాను పెరిగిన నజరేతు గ్రామానికి వెళ్ళాడు. ఒక విశ్రాంతి రోజున అలవాటు ప్రకారం సమాజమందిరానికి వెళ్ళి, చదవటానికి నిలుచున్నాడు. 17 అక్కడున్న వాళ్ళు, ప్రవక్త యెషయా గ్రంథాన్ని ఆయన చేతికి ఇచ్చారు. ఆయన ఆ గ్రంథములో ఈ వాక్యాలున్న పుటను తెరిచి చదవటం మొదలు పెట్టాడు:

18 “ప్రభువు నన్నభిషేకించి పేదవాళ్ళకు
    నన్ను సువార్త ప్రకటించుమన్నాడు.
అందుకే ప్రభువు ఆత్మ నాలో ఉన్నాడు.
బంధితులకు స్వేచ్ఛ ప్రకటించుమని,
    గుడ్డివారికి చూపు కలిగించాలని,
హింసింపబడే వారికి విడుదల కలిగించాలని, నన్ను పంపాడు.
19     ప్రభువు ‘తాను దయ చూపే సంవత్సరం’ ప్రకటించుమని నన్ను పంపాడు.”(F)

20 ఆ తదుపరి యేసు గ్రంథం మూసేసి దాన్ని తెచ్చిన వానికి యిచ్చి కూర్చున్నాడు. సమాజ మందిరంలో ఉన్నవాళ్ళందరి కళ్ళు ఆయనపై ఉన్నాయి. 21 ఆయన వాళ్ళతో, “ఈ రోజు గ్రంథములో వ్రాయబడిన ఈ వాక్యాలు మీరు వింటుండగానే నెరవేరాయి” అని అన్నాడు.

22 అంతా ఆయన్ని మెచ్చుకున్నారు. అంతే కాక ఆయన నోటినుండి వచ్చిన ఆ చక్కటి మాటలు విని అందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళు, “ఈయన యోసేపు కుమారుడు కదా!” అని అన్నారు.

23 యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “‘వైద్యుడా! నిన్ను నీవు నయం చేసుకో!’ అన్న సామెత మీరు నాకు చెబుతారని తెలుసు. పైగా మీరు, ‘కపెర్నహూములో చేసిన మహాత్యాల్ని గురించి మేము విన్నాము. వాటిని యిక్కడ నీ స్వగ్రామంలో కూడా చెయ్యి!’ అని అంటారని నాకు తెలుసు. 24 ఇది నిజం. ఏ ప్రవక్తనూ అతని స్వగ్రామపు ప్రజలు అంగీకరించలేదు.

25 “ఏలీయా కాలంలో ఇశ్రాయేలు దేశంలో చాలామంది వితంతువులుండినారని ఖచ్చితంగా చెప్పగలను. ఆ కాలంలో మూడున్నర సంవత్సరాలు వర్షాలు కురియలేదు. దేశమంతటా తీవ్రమైన కరువు వ్యాపించి ఉంది. 26 సీదోను రాష్ట్రంలోని సారెపతు అనే గ్రామంలో ఒక వితంతువు ఉండేది. దేవుడు ఏలీయాను ఆమె దగ్గరకు తప్పమరెవ్వరి దగ్గరకు పంపలేదు.

27 “ప్రవక్త ఎలీషా[a] కాలంలో ఇశ్రాయేలు దేశంలో చాలా మంది కుష్టురోగులుండే[b] వాళ్ళు. కాని సిరియ దేశానికి చెందిన నయమాను అనేవాణ్ణి తప్ప దేవుడు వీళ్ళలో ఒక్కరిని కూడా నయం చేయలేదు.”

28 సమాజ మందిరములో వున్న వాళ్ళందరికి యిది విని ఆయనపై చాలా కోపం వచ్చింది. 29 వాళ్ళు లేచి ఆయన్ని గ్రామం నుండి వెళ్ళగొట్టారు. ఆ గ్రామం కొండ మీద ఉంది. వాళ్ళు ఆయన్ని క్రిందికి త్రోయాలని కొండ చివరకు తీసుకు వెళ్ళారు. 30 కాని ఆయన వాళ్ళ మధ్యనుండి నడిచి తన దారిన తాను వెళ్ళి పోయాడు.

యేసు ఒక మనుష్యుని దయ్యంనుండి విడిపించటం

(మార్కు 1:21-28)

31 అక్కడి నుండి ఆయన గలిలయలోని కపెర్నహూము అనే పట్టణానికి వెళ్ళాడు. అక్కడ విశ్రాంతి రోజున బోధించటం మొదలు పెట్టాడు. 32 ఆయన అధికారమున్న వానిలా బోధించటం వల్ల వాళ్ళు ఆశ్చర్యపోయారు.

33 అదే సమయంలో దయ్యం పట్టిన వాడొకడు ఆ సమాజ మందిరంలోకి వచ్చాడు. ఆ దయ్యం బిగ్గరగా, 34 “ఓ నజరేయుడైన యేసూ! మాతో నీకేంపని? మమ్మల్ని నాశనం చెయ్యటానికి వచ్చావా? నీవెవరో నాకు తెలుసు. నీవు దేవుని పరిశుద్ధుడవు” అని అన్నది. 35 యేసు, “నోరు మూసుకొని అతని నుండి బయటకు రా!” అని గద్దించాడు. ఆ దయ్యం తాను పట్టిన వాణ్ణి క్రింద పడవేసి ఏ హానీ చెయ్యకుండా ఆ దయ్యం వెలుపలికి వచ్చింది.

36 అక్కడున్న ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళు పరస్పరం, “ఏమిటిది? దయ్యాలను కూడా ఆయన అధికారంతో ఆజ్ఞాపిస్తున్నాడే? అవి బయటికి రావటానికి ఈయన మాటల్లో ఎంత శక్తి ఉందో కదా?” అని మాట్లాడుకున్నారు. 37 ఆ చుట్టు ఉన్న ప్రాంతాల్లో ఈయన్ని గురించి అందరికి తెలిసింది.

యేసు పేతురు అత్తను నయం చేయటం

(మత్తయి 8:14-17; మార్కు 1:29-34)

38 యేసు సమాజమందిరాన్ని వదిలి సీమోను యింటికి వెళ్ళాడు. సీమోను అత్తకు జ్వరం తీవ్రంగా ఉంది. వాళ్ళు ఆమె జ్వరాన్ని గురించి యేసుకు చెప్పారు. 39 యేసు, ఆమె దగ్గరకు వచ్చి జ్వరాన్ని వదిలి పొమ్మని గద్దించాడు. జ్వరం ఆమెను వదిలి వెళ్ళిపోయింది. వెంటనే ఆమె లేచి అందరిని ఆదరించటం మొదలు పెట్టింది.

యేసు అనేకులను నయం చేయటం

40 సూర్యాస్తమయమౌతుండగా ప్రజలు రక రకాల రోగాలున్న వాళ్ళను ఆయన దగ్గరకు తీసుకు వచ్చారు. ఆయన ప్రతి ఒక్కరి మీద తన చేతుల్ని ఉంచి అందరిని నయం చేశాడు. 41 “నీవు దేవుని కుమారుడవు” అని బిగ్గరగా కేకలు వేస్తూ చాలా మంది నుండి దయ్యాలు బయటకు వచ్చాయి. వాటికి తాను క్రీస్తు అని తెలియటం వల్ల యేసు వాటిని మాట్లాడవద్దని గద్దించాడు.

యేసు ఇతర పట్టణాలకు వెళ్ళటం

(మార్కు 1:35-39)

42 తెల్లవారుతుండగా యేసు గ్రామం వదిలి ఎడారిలో ఒంటరిగా ఒక ప్రత్యేక స్థలానికి వెళ్ళాడు. ప్రజలాయన కోసం వెతుకుతూ ఆయనున్న చోటికి వచ్చారు. ఆయన తమను మళ్ళీ వదిలి వెళ్ళకుండా చెయ్యాలని ప్రయత్నించారు. 43 కాని యేసు, “దేవుని రాజ్యం యొక్క సువార్త నేను యితర పట్టణాల్లో కూడా ప్రకటించాలి. దేవుడు నన్ను అందుకే పంపాడు” అని అన్నాడు.

44 ఆయన యూదయ ప్రాంతాల్లోని సమాజ మందిరాల్లో బోధించాడు.

యేసు కొందరు శిష్యులను ఎన్నుకొనటం

(మత్తయి 4:18-22; మార్కు 1:16-20)

ఒక రోజు యేసు గెన్నేసరెతు సరస్సు ప్రక్కన నిలబడి దైవసందేశం ఉపదేశిస్తున్నాడు. ప్రజలు ఆయన ఉపదేశం వినటానికి త్రోసుకుంటూ ఆయన చుట్టూ చేరారు. యేసు సరస్సు ప్రక్కన రెండు పడవలుండటం చూశాడు. బెస్తవాళ్ళు పడవలు దిగి ఆ ప్రక్కనే తమ వలలు కడుక్కుంటున్నారు. యేసు సీమోను అనే వ్యక్తికి చెందిన పడవనెక్కి పడవను ఒడ్డునుండి కొంతదూరం తీసుకొని వెళ్ళమన్నాడు. ఆ తర్వాత ఆయన ఆ పడవలో కూర్చొని ప్రజలకు బోధించటం మొదలు పెట్టాడు.

ఆయన మాట్లాడటం ముగించాక సీమోనుతో, “పడవను నీళ్ళు లోతుగా ఉన్న చోటికి పోనిచ్చి వలవేయండి. మీకు చేపలు దొరకుతాయి” అని అన్నాడు.

సీమోను, “అయ్యా! మేము రాత్రంతా చాలా కష్టపడి పనిచేసినా చేపలు పట్టలేక పోయాము. అయినా మీరు చెబుతున్నారు కాబట్టి మేము వేస్తాము” అని అన్నాడు. వాళ్ళు, ఆయన చెప్పినట్లు చేసి ఎన్నో చేపలు పట్టారు. ఆ బరువుకు వలలు చినగటం మొదలు పెట్టాయి. కాబట్టి ప్రక్క పడవలో ఉన్న తమతోటి పని వాళ్ళను వచ్చి తమకు సహాయం చెయ్యమని అడిగారు. వాళ్ళు వచ్చి ఆ రెండు పడవల్ని పూర్తిగా చేపల్తో నింపారు. ఆ బరువుకు వాళ్ళ పడవలు మునగసాగాయి.

సీమోను పేతురు యిది చూసి యేసు కాళ్ళపైపడి, “నేనొక పాపిని. వెళ్ళిపొండి ప్రభూ!” అని అన్నాడు. అతడు, అతనితో ఉన్న వాళ్ళు తాము పట్టిన చేపలు చూసి ఆశ్చర్యపోయారు. 10 వీళ్ళే కాక జెబెదయ కుమారులు యాకోబు, యోహానులు కూడా ఆశ్చర్యపోయారు. వీళ్లు సీమోను భాగస్థులు.

యేసు సీమోనుతో, “చింతించకు. ఇప్పటి నుండి నువ్వు మనుష్యుల్ని పడ్తావు!” అని అన్నాడు.

11 వాళ్ళు పడవలు ఒడ్డుకు చేర్చి అన్నీ వదిలేసి ఆయన్ని అనుసరించారు.

యేసు రోగిని నయం చేయటం

(మత్తయి 8:1-4; మార్కు 1:40-45)

12 యేసు ఒక గ్రామంలో ఉండగా ఒళ్ళంతా కుష్టురోగం ఉన్న వాడు ఆయన్ని చూడాలని వచ్చాడు. యేసును చూడగానే ఆయన కాళ్ల ముందు సాష్టాంగ పడి, “ప్రభూ! మీరు దయ తలిస్తే నాకు నయం చెయ్యగలరు!” అని వేడుకొన్నాడు.

13 యేసు, “నీకు నయం చేస్తాను!” అని అంటూ తన చేయి జాపి అతణ్ణి తాకాడు. వెంటనే కుష్టురోగం అతణ్ణి వదిలి పోయింది. 14 ఆ తర్వాత యేసు, “ఈ విషయం ఎవ్వరికీ చెప్పవద్దు. కాని వెళ్ళి యాజకునికి చూపు! మోషే ఆజ్ఞాపించిన కానుకను అర్పించు. నీకు నయమైపోయిందని నిరూపించుకో!” అని ఆజ్ఞాపించాడు.

15 కాని యేసును గురించి యింకా చాలా మందికి తెలిసిపోయింది. ఆయన బోధనలు వినటానికి, తమరోగాలు నయం చేసుకోవటానికి ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చారు. 16 కాని యేసు ప్రార్థించటానికి అరణ్య ప్రాంతానికి వెళ్ళాడు.

యేసు పక్షవాత రోగిని నయం చేయటం

(మత్తయి 9:1-8; మార్కు 2:1-12)

17 ఒక రోజు ఆయన బోధిస్తుండగా పరిసయ్యులు,[c] శాస్త్రులు అక్కడ కూర్చొని ఉన్నారు. వీళ్ళు గలిలయలోని పల్లెల నుండి, యూదయ, యెరూషలేము పట్టణాల నుండి వచ్చిన వాళ్ళు. రోగులకు నయం చేసే శక్తి యేసులో ఉంది. 18 కొంతమంది ఒక పక్షవాత రోగిని ఒక మంచం మీద మోసుకొని వచ్చారు. అతణ్ణి యేసు ముందు ఉంచాలని, యేసు ఉన్న యింట్లోకి తీసుకువెళ్ళటానికి ప్రయత్నించారు. 19 కాని ప్రజాసమూహం అధికముగా ఉండటం వల్ల అలా చెయ్యటం వీలుకాలేదు. వాళ్ళు ఇంటి మీదికి వెళ్ళి పైకప్పు ద్వారా ఆ రోగిని మంచంతో సహా యేసు ముందు దించారు. యేసు ప్రజల మధ్య ఉన్నాడు. 20 ఆయన వాళ్ళ విశ్వాసం చూసి, “మిత్రమా, నీ పాపాలు క్షమించాను!” అని అన్నాడు.

21 పరిసయ్యులు, శాస్త్రులు మనస్సులో, “భక్తి హీనునిగా మాట్లాడుతున్నాడే? వీడెవడు? దేవుడు తప్ప యితరులెవరు పాపాలు క్షమించగలరు?” అని అనుకున్నారు.

22 వాళ్ళేమనుకుంటున్నారో యేసుకు తెలిసి పోయింది. ఆయన, “మీరు మీ మనస్సులో అలా ఎందుకాలోచిస్తున్నారు? 23 ‘నీ పాపాలు క్షమించాను’ అని అనటం తేలికా? లేదా ‘లేచి నడు’ అని అనటం తేలికా? 24 కాని మనుష్యకుమారునికి ఈ భూమ్మీద పాపాలు క్షమించటానికి అధికారముందని మీరు గ్రహించాలి” అని అంటూ ఆ పక్షవాత రోగితో, “నేను చెబుతున్నాను; లేచి నీ మంచం తీసుకొని యింటికి వెళ్ళు!” అని అన్నాడు.

25 ఆ పక్షవాత రోగి వెంటనే అందరి ముందు లేచి తానిదివరకు పడుకున్న మంచమును తీసుకొని దేవుణ్ణి స్తుతిస్తూ యింటికి వెళ్ళిపోయాడు. 26 అక్కడున్న వాళ్ళంతా దిగ్భ్రాంతి చెంది దేవుణ్ణి స్తుతించటం మొదలు పెట్టారు. వాళ్ళు భయంతో, “ఈ రోజు మనం అనుకోని గొప్ప సంఘటన చూసాము” అని అన్నారు.

లేవి (మత్తయి) యేసును వెంబడించటం

(మత్తయి 9:9-13; మార్కు 2:13-17)

27 తర్వాత యేసు అక్కడి నుండి వెళ్ళి పోయాడు. లేవి[d] అనే ఒక పన్నులు సేకరించే గుమాస్తా, పన్నులు సేకరిస్తూ ఒక గదిలో కూర్చొని ఉన్నాడు. యేసు అతణ్ణి చూసి, “నా వెంటరా!” అని అతనితో అన్నాడు. 28 లేవి లేచి అన్నీవదిలి యేసును అనుసరించాడు.

29 ఆ తర్వాత లేవి తన యింట్లో యేసు కోసం ఒక పెద్ద విందు చేశాడు. చాలా మంది పన్నులు వసూలు చేసేవాళ్ళు, ఇతర్లు ఆయనతో కలసి భోజనం చేస్తూఉన్నారు. 30 పరిసయ్యులు, వాళ్ళ గుంపుకు చెందిన శాస్త్రులు యేసు అనుచరులతో, “మీరు పన్నులు సేకరించే వాళ్ళతో, పాపులతో కలిసి ఎందుకు తింటారు?” అని విమర్శిస్తూ అడిగారు.

31 యేసు, “ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకు వైద్యుని అవసరం ఉండదు. అనారోగ్యంగా ఉన్న వాళ్ళకు వైద్యుని అవసరం ఉంటుంది. 32 నేను నీతిమంతుల్ని పిలిచి, వాళ్ళకు మారుమనస్సు పొందుమని చెప్పటానికి రాలేదు. పాపుల కోసం వచ్చాను” అని సమాధానం చెప్పాడు.

యేసు ఇతర మతనాయకులవలె కాదు

(మత్తయి 9:14-17; మార్కు 2:18-22)

33 వాళ్ళు, “యోహాను శిష్యులు ఎప్పుడూ ఉపవాసాలు, ప్రార్థనలు చేస్తూ ఉంటారు. పరిసయ్యులు కూడా అదేవిధంగా చేస్తూ ఉంటారు. కాని మీ వాళ్ళు తింటూ త్రాగుతూ ఉంటారు” అని యేసుతో అన్నారు.

34 యేసు, “పెళ్ళి కుమారుని అతిథులు పెళ్ళి కుమారునితో ఉన్నప్పుడు ఉపవాసం చేస్తారా? 35 కాని పెళ్ళి కుమారుణ్ణి వాళ్ళనుండి తీసుకు వెళ్ళే సమయం వస్తుంది. అప్పుడు వాళ్ళు ఉపవాసం చేస్తారు” అని అన్నాడు.

36 యేసు వాళ్ళకు ఈ ఉపమానం కూడా చెప్పాడు: “క్రొత్త బట్టను చింపి పాత బట్టకు ఎవ్వరూ అతుకులు వెయ్యరు. అలా వేస్తే క్రొత్త బట్ట పాత బట్టను చింపివేస్తుంది. పైగా క్రొత్తబట్ట నుండి చింపిన గుడ్డ పాతబట్టకు సరిగ్గా అతకదు. 37 అదేవిధంగా క్రొత్త ద్రాక్షారసాన్ని పాత తిత్తిలో ఎవ్వరూ నింపరు. అలా చేస్తే క్రొత్త రసం తిత్తిని చింపుతుంది. ద్రాక్షారసం కారి పోతుంది. తిత్తి కూడా నాశనమౌతుంది. 38 అలా చెయ్యరాదు. క్రొత్త ద్రాక్షారసం క్రొత్త తిత్తిలోనే పొయ్యాలి. 39 పాత ద్రాక్షారసం త్రాగిన వాడు క్రొత్త ద్రాక్షారసాన్ని కోరడు. అతడు, ‘పాతది బాగుంది’ అని అంటాడు.”

యేసు విశ్రాంతి రోజుకు ప్రభువు

(మత్తయి 12:1-8; మార్కు 2:23-28)

ఒక విశ్రాంతి రోజు యేసు ధాన్యపు పొలాల్లో నడుస్తూ ఉన్నాడు. ఆయన శిష్యులు కంకులు త్రుంచి వాటిని నలిపి తినటం మొదలుపెట్టారు. కొందరు పరిసయ్యులు, “విశ్రాంతి రోజున చెయ్యరాని పనులు ఎందుకు చేస్తున్నారు?” అని అడిగారు.

యేసు, “దావీదు తనకు, తనతో ఉన్న వాళ్ళకు ఆకలి వేసినప్పుడు ఏమిచేసాడో మీరు చదవలేదా? అతడు దేవుని ఆలయంలోకి వెళ్ళాడు. అక్కడ దేవుని సన్నిధిని పెట్టిన రొట్టెలు ఉండినవి. వాటిని యాజకులు తప్ప యితర్లు తిన కూడదు. అతడు వాటిని తీసుకొని తాను తిని, తనతో ఉన్న వాళ్ళకు కూడా ఇచ్చాడు” అని సమాధానం చెప్పాడు. యేసు మళ్ళీ, “మనుష్యకుమారుడు విశ్రాంతి రోజుకు ప్రభువు!” అని అన్నాడు.

విశ్రాంతి రోజు యేసు నయం చేయటం

(మత్తయి 12:9-14; మార్కు 3:1-6)

మరొక విశ్రాంతి రోజు యేసు సమాజ మందిరానికి వెళ్ళి బోధిస్తూ ఉన్నాడు. అక్కడ కుడి చేయి పడిపోయిన వాడొకడున్నాడు. పరిసయ్యులు, శాస్త్రులు యేసును ఏదో ఒక కారణంతో నిందించాలని ఎదురు చూస్తూ ఉన్నారు. కనుక వాళ్ళు విశ్రాంతి రోజు ఆయన ఆ చేయి పడిపోయిన వానిని నయం చేస్తాడేమోనని ఆయన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు. యేసుకు వాళ్ళేమాలోచిస్తున్నారో తెలుసు. ఆయన ఆ చేయి పడిపోయిన వానితో, “లేచి అందరి ముందు నిలుచో!” అని అన్నాడు. ఆ చేయి పడిపోయిన వాడు లేచి నిలుచున్నాడు. ఆ తదుపరి యేసు వాళ్ళతో, “విశ్రాంతి రోజు ఏది చెయ్యటం న్యాయమని మిమ్మల్ని అడుగుతున్నాను? ఒకరికి మేలు చేయటమా? లేక కీడు చేయటమా? ప్రాణాన్ని రక్షించటమా? లేక నాశనం చేయటమా?” అని అన్నాడు.

10 యేసు వాళ్ళ వైపు ఒకసారి చూసి, చేయి పడిపోయిన వానితో, “నీ చేయి చాపు!” అని అన్నాడు. ఆచేయి పడిపోయినవాడు యేసు చెప్పినట్లు చేశాడు. అతని చేయి పూర్తిగా నయమై పోయింది. 11 ఇది చూసి అక్కడున్నవాళ్ళకు చాలా కోపం వచ్చింది. వాళ్ళు యేసును ఏమి చెయ్యాలో తమలో తాము ఆలోచించుకొన్నారు.

యేసు పన్నెండు మంది అపోస్తలుల్ని ఎన్నుకొనటం

(మత్తయి 10:1-4; మార్కు 3:13-19)

12 ఆ తర్వాత యేసు ఒక రోజు ప్రార్థించటానికి కొండ మీదికి వెళ్ళాడు. రాత్రంతా దేవుణ్ణి ప్రార్థిస్తూ గడిపాడు. 13 ఉదయం కాగానే తన శిష్యులందర్ని దగ్గరకు పిలిచి వాళ్ళలో పన్నెండు మందిని ఎన్నుకొని వాళ్ళను తన అపొస్తలులుగా నియమించాడు. వారెవరనగా,

14 సీమోను, యేసు ఇతనికి “పేతురు” అని పేరు పెట్టాడు,

అతని తమ్ముడు అంద్రెయ.

యాకోబు,

యోహాను,

ఫిలిప్పు,

బర్తొలొమయి,

15 మత్తయి,

తోమా,

అల్ఫయి కుమారుడు యాకోబు,

జెలోతె[e] అని పిలువబడే సీమోను

16 యాకోబు కుమారుడు యూదా,

యూదా ఇస్కరియోతు. (ఈ యూదా ఇస్కరియోతు మున్ముందు ద్రోహిఔతాడు).

యేసు బోధించి రోగులను నయం చేయటం

(మత్తయి 4:23-25; 5:1-12)

17 యేసు వాళ్ళతో సహా కొండ దిగి సమంగా ఉన్న స్థలంలో నిలుచున్నాడు. చాలా మంది శిష్యులు ఆయనతో ఉన్నారు. ఆయన శిష్యులే కాక యూదయ నుండి, యెరూషలేం నుండి చాలా మంది ప్రజలు వచ్చారు. సముద్ర తీరంలో ఉన్న తూరు, సీదోను పట్టణాల నుండి కూడా చాలా మంది ప్రజలు వచ్చారు. 18 ఆయన బోధనలు వినాలని ఆయన ద్వారా తమ రోగాలు బాగు చేయించుకోవాలని వాళ్ళ ఉద్దేశ్యం. దయ్యాలు పట్టి బాధపడ్తున్న వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళకు కూడా నయమైపోయింది. 19 ఆయన నుండి శక్తి ప్రవహించి అందరికి నయం చేస్తూవుండటం వల్ల అందరూ ఆయన్ని తాకటానికి ప్రయత్నించారు.

20 యేసు తన శిష్యుల వైపు చూసి ఈ విధంగా అన్నాడు:

“దీనులైన మీరు ధన్యులు.
    దేవుని రాజ్యం మీది.
21 ఇప్పుడు ఆకలితో ఉన్న మీరు ధన్యులు.
    మీ ఆకలి తీరుతుంది.
ఇప్పుడు దుఃఖిస్తున్న మీరు ధన్యులు.
    భవిష్యత్తులో మీరు నవ్వుతారు.

22 “మనుష్యకుమారుని కారణంగా ప్రజలు మిమ్ముల్ని ద్వేషించినప్పుడు, మిమ్మల్ని దూరం చేసి అవమానించినప్పుడు, మీ పేరే హానికరమైనదని వారు భావించినప్పుడు మీరు ధన్యులౌతారు! 23 మీకు పరలోకంలో గొప్ప బహుమతి లభిస్తుంది. కనుక యిది జరిగిన రోజు ఆనందంతో గంతులు వెయ్యండి! వీళ్ళ పూర్వీకులు కూడా ఆనాడు ప్రవక్తల పట్ల యిదే విధంగా ప్రవర్తించారు.

24 “ఓ ధనికులారా! మీకు శ్రమ తప్పదు!
    మీరు అనుభవించవలసిన సుఖాన్ని యిదివరకే అనుభవించారు!
25 కడుపులు నిండిన ప్రజలారా మీకు శ్రమ తప్పదు.
    మీకు ఆహారం దొరకదు!
నవ్వుతున్న ప్రజలారా! మీకు శ్రమ తప్పదు!
    మీరు దుఃఖిస్తారు, శోకిస్తారు!

26 “పొగడ్తులుపొందే ప్రజలారా! మీకు శిక్ష తప్పదు! వాళ్ళ పూర్వులు యిదే విధంగా అబద్ధ ప్రవక్తల్ని పొగిడారు.

శత్రువులను ప్రేమించు

(మత్తయి 5:38-48; 7:12)

27 “కాని, నా మాటలు వినే వాళ్ళకు యిది నేను చెబుతున్నాను: మీ శత్రువుల్ని ప్రేమించండి. మిమ్మల్ని ద్వేషించే వాళ్ళకు మంచి చెయ్యండి. 28 మిమ్మల్ని దూషించే వాళ్ళను దీవించండి. మీకు కీడు చేసిన వాళ్ళకు మంచి కలగాలని ప్రార్థించండి. 29 ఒక చెంప మీద కొట్టిన వానికి రెండవ చెంప కూడా చూపండి. నీ పైకండువాను తీసికొనే వానిని నీ చొక్కాను కూడ తీసికోనివ్వు. 30 అడిగిన వాళ్ళకు యివ్వండి. మీ వస్తువుల్ని ఎవరైనా తీసుకుంటే వాటిని తిరిగి అడక్కండి. 31 ఇతర్లు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తించాలని మీరు ఆశిస్తారో అదేవిధంగా మీరు యితర్ల పట్ల ప్రవర్తించండి.

32 “మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళను ప్రేమిస్తే అందులో గొప్పేముంది? పాపులు కూడా తమను ప్రేమించిన వాళ్ళను ప్రేమిస్తారు. 33 మీకు మంచి చేసిన వాళ్ళకు మీరు మంచి చేస్తే అందులో గొప్పేముంది? పాపులుకూడా అదే విధంగా చేస్తారు. 34 అప్పు తిరిగి చెల్లిస్తారని ఆశించి అప్పిస్తే అందులో గొప్పేముంది? తమ అప్పు పూర్తిగా చెల్లిస్తారని పాపులు కూడా తమలో తాము యిచ్చి పుచ్చుకుంటారు.

35 “మీ శత్రువుల్ని ప్రేమించండి. వాళ్ళకు మంచి చెయ్యండి. తిరిగి చెల్లిస్తారని ఆశించకుండా అప్పివ్వండి. విశ్వాస ఘాతుకుల మీద, దుర్మార్గుల మీద కూడా దేవుడు దయ చూపుతాడు. మీరు నేను చెప్పినట్లు చేస్తే సర్వోన్నతుడైన దేవుడు మిమ్మల్ని తన కుమారులుగా పరిగణిస్తాడు. మీకు గొప్ప బహుమతి లభిస్తుంది. 36 మీ తండ్రివలె మీరు కూడా దయ, ప్రేమ చూపుతూ జీవించండి.

ఇతరులను విమర్షించటంలో జాగ్రతపడుము

(మత్తయి 7:1-5)

37 “ఇతర్లపై తీర్పు చెప్పకండి. అప్పుడు ఇతర్లు మీపై తీర్పు చెప్పరు. ఇతర్లను నిందించకండి. అప్పుడు యితర్లు మిమ్మల్ని నిందించరు. ఇతరులను క్షమించండి. అప్పుడు యితర్లు మిమ్మల్ని క్షమిస్తారు. 38 ఇతర్లకు యివ్వండి, మీకివ్వబడుతుంది. అప్పుడు మీకు కొలతలు నింపి, అదిమి, కుదిల్చి ఒలికిపోతుండగా మీ ఒడిలో పోస్తారు. మీరు ఏ కొలతతో యిస్తే ఆ కొలతతో మీకు లభిస్తుంది.”

39 ఆయన ఈ ఉపమానం కూడా చెప్పాడు: “ఒక గ్రుడ్డివాడు మరొక గ్రుడ్డివానికి దారి చూపగలడా? అలా చేస్తే యిద్దరూ గోతిలో పడ్తారు కదా! 40 శిష్యుడు తన గురువుకన్నా గొప్ప కాదు. కాని శిక్ష సంపూర్ణంగా పొందిన తర్వాత అతని గురువుతో సమానమౌతాడు.

41 “నీ కంట్లోవున్న పెద్ద దూలంను నీవు చూడక నీ సోదరుని కంట్లోవున్న చిన్న నలుసును ఎందుకు చూస్తావు? 42 నీ కంట్లో దూలం పెట్టుకొని, ‘నీ కంట్లో ఉన్న నలుసును నన్ను తియ్యనివ్వు’ అని అతనితో ఏలాగు అనగలుగుతున్నావు? ఓ కపటీ! నీ కంట్లో దూలాన్ని ముందు తీసేయి. అప్పుడు నీవు బాగా చూడ కలిగి సోదరుని కంట్లో ఉన్న నలుసును ఏ విధంగా తియ్యాలో తెలుసుకుంటావు.

చెట్టు, దాని ఫలము

(మత్తయి 7:17-20; 12:34-35)

43 “మంచి చెట్టుకు చెడు పండ్లు కాయవు. అదే విధంగా చెడ్డ చెట్టుకు మంచి పండ్లు కాయవు. 44 పండ్లను బట్టి చెట్టు జాతి తెలుస్తుంది. ముండ్ల పొదల నుండి అంజూరపు పండ్లు, గోరింట పొదల నుండి ద్రాక్షాపండ్లు లభించవు. 45 మంచి వాని హృదయం మంచి గుణాలతో నిండి ఉంటుంది. కాబట్టి అతని నుండి మంచి తనమే బయటకు వస్తుంది. చెడ్డవాని హృదయం చెడు గుణాలతో నిండి ఉంటుంది. కాబట్టి అతనినుండి చెడే బయటకు వస్తుంది. మనిషి తన హృదయములో ఉన్న గుణాలను బట్టి మాట్లాడుతాడు.

తెలివిగలవాడు, తెలివిలేనివాడు

(మత్తయి 7:24-27)

46 “నేను చెప్పింది చెయ్యకుండా నన్ను ‘ప్రభూ! ప్రభూ!’ అని పిలవటం ఎందుకు? 47 నా దగ్గరకు వచ్చి నా మాటలు విని వాటిని అనుసరించే వాడు ఎలాంటి వాడో చెబుతాను వినండి. 48 అలాంటి వాణ్ణి భూమి లోతుగా త్రవ్వి రాళ్ళ పునాది వేసి యిల్లు కట్టుకున్న వానితో పోల్చవచ్చు. ఇతడు తన యింటిని సక్రమమైన పద్దతిలో కట్టాడు కనుక వరదలు వచ్చి నీటి ప్రవాహం ఆ యింటిని కొట్టినా ఆ యిల్లు కూలి పోలేదు.

49 “నా మాటలు విని వాటిని అనుసరించని వాడు పునాది వేయకుండా, నేలపై ఇల్లు కట్టుకొన్న వానితో సమానము. వరదలు వచ్చాయి. ఆ నీటి ప్రవాహానికి ఆ యిల్లు కూలి నేల మట్టమైపోయింది.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International