Print Page Options Listen to Reading
Previous Prev Day Next DayNext

The Daily Audio Bible

This reading plan is provided by Brian Hardin from Daily Audio Bible.
Duration: 731 days

Today's audio is from the ESV. Switch to the ESV to read along with the audio.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
న్యాయాధిపతులు 2:10-3:31

10 ఆ తరం వారంతా చనిపోయాక తరువాత తరం పెరిగింది. యెహోవాను గూర్చిగాని, ఇశ్రాయేలీయులకు యెహోవా చేసిన వాటిని గూర్చిగాని ఈ కొత్త తరం వారికి తెలియదు. 11 అందుచేత ఇశ్రాయేలు ప్రజలు కీడు చేస్తూ తప్పుడు దేవత బయలును సేవించారు. ప్రజలు ఈ కీడు చేయటం యెహోవా చూశాడు. 12 ఇశ్రాయేలు ప్రజలను ఈజిప్టు నుండి యెహోవా బయటకు తీసుకుని వచ్చాడు. ఈ ప్రజల పూర్వీకులు యెహోవాను ఆరాధించారు. కాని ఇశ్రాయేలు ప్రజలు యెహోవాను అనుసరించటం మానుకొన్నారు. ఇశ్రాయేలీయులు వారి చుట్టూరా నివసించిన ప్రజలయొక్క తప్పుడు దేవుళ్లను[a] పూజించటం మొదలు పెట్టారు. అది యెహోవాకు కోపం కలిగించింది. 13 ఇశ్రాయేలీయులు యెహోవాను అనుసరించటం మానివేసి బయలు, అష్తారోతులను పూజించటం మొదలు పెట్టారు.

14 ఇశ్రాయేలు ప్రజలమీద యెహోవాకు కోపం వచ్చింది. కనుక శత్రువులు ఇశ్రాయేలీయుల మీద దాడిచేసి వారి ఆస్తులను తీసుకునేట్టుగా యెహోవా చేశాడు. యెహోవా వారి చుట్టూరా ఉన్న వారి శత్రువుల ద్వారా వారు ఓడిపోయేట్టు చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు వారి శత్రువులనుండి వారిని వారు కాపాడుకోలేక పోయారు. 15 ఇశ్రాయేలు ప్రజలు యుద్ధానికి బయటకు వెళ్లినప్పుడల్లా ఓడిపోయారు. యెహోవా వారి పక్షంగా లేని కారణంచేత వారు ఓడిపోయారు. ఇశ్రాయేలీయులు వారి చుట్టూరా నివసిస్తున్న ప్రజల దేవతలను సేవిస్తే, వారు ఓడిపోతారని యెహోవా ముందుగానే వారిని హెచ్చరించాడు. ఇశ్రాయేలు ప్రజలు చాలా శ్రమ అనుభవించారు.

16 అప్పుడు యెహోవా న్యాయాధిపతులు అనే నాయకులను ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలు ప్రజల ఆస్తులను తీసుకున్న శత్రువులనుండి వారిని ఈ నాయకులు రక్షించారు. 17 కాని ఇశ్రాయేలు ప్రజలు వారి న్యాయాధిపతుల మాట వినలేదు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి నమ్మకంగా ఉండక ఇతర దేవుళ్లను అనుసరించారు.[b] పూర్వం ఇశ్రాయేలీయుల పూర్వీకులు యెహోవా ఆజ్ఞలకు విధేయులయ్యారు. కానీ ఇశ్రాయేలీయులు ఇప్పుడు మారిపోయి, యెహోవాకు విధేయులు కావటం లేదు.

18 ఇశ్రాయేలీయుల శత్రువులు ఇశ్రాయేలు ప్రజలకు అనేకసార్లు చెడు సంగతులు జరిగించారు. అందుచేత ఇశ్రాయేలీయులు సహాయం కోసం ఏడ్చేవారు. ప్రతీసారీ, ప్రజల విషయమై యెహోవా సంతాప పడ్డాడు. ప్రతీసారీ ప్రజలను వారి శత్రువుల నుండి రక్షించేందుకు ఆయన ఒక న్యాయమూర్తిని పంపించాడు. యెహోవా ఎల్లప్పుడూ ఆ న్యాయమూర్తులతో ఉండేవాడు. కనుక ప్రతిసారీ ఇశ్రాయేలు ప్రజలు వారి శత్రువుల నుండి రక్షించబడ్డారు. 19 అయితే ప్రతీ న్యాయమూర్తి చనిపోయినప్పుడూ, ఇశ్రాయేలీయులు మరల పాపం చేసి, బూటకపు దేవుళ్లను పూజించటం మొదలుపెట్టారు. ఇశ్రాయేలీయులు చాలా మొండి వాళ్లు వారు తమ చెడు మార్గాలు విడిచి పెట్టేందుకు నిరాకరించారు.

20 అందుచేత ఇశ్రాయేలీయుల మీద యెహోవా కోపగించి, ఆయన చెప్పాడు: “ఈ ప్రజలు నేను వారి పూర్వీకులతో చేసిన ఒడంబడికనే ఉల్లంఘించారు. వారు నా మాట వినలేదు. 21 కనుక నేను ఇంకెంత మాత్రం ఇతర రాజ్యాలను జయించి, ఇశ్రాయేలీయుల కోసం దారి సులభం చేయను. యెహోషువ చనిపోయినప్పుడు ఆ రాజ్యాలు ఇంకా ఈ దేశంలోనే ఉన్నాయి. మరియు ఆ రాజ్యాలను నేను ఈ దేశంలోనే ఉండనిస్తాను. 22 ఇశ్రాయేలు ప్రజలను పరీక్షించేందుకు నేను ఆ రాజ్యాలను ప్రయోగిస్తాను. ఇశ్రాయేలు ప్రజలు, వారి పూర్వీకులు యెహోవా ఆజ్ఞలను పాటించినట్టుగా, పాటించగలరేమో నేను చూస్తాను.” 23 యెహోవా ఆ రాజ్యాలను దేశంలో ఉండనిచ్చాడు. ఆ రాజ్యాలు వెంటనే దేశం విడిచిపోయేట్టు యెహోవా బలవంతం చేయలేదు. వారిని ఓడించేందుకు ఆయన యెహోషువ సైన్యానికి సహాయం చేయలేదు.

1-2 ఇతర రాజ్యాల ప్రజలంతా ఇశ్రాయేలీయుల దేశం విడిచిపెట్టేటట్టు యెహోవా బలవంతం చేయలేదు. ఇశ్రాయేలీయులను యెహోవా పరీక్షించాలనుకున్నాడు. ఈ సమయంలో జీవిస్తూ ఉన్న ఇశ్రాయేలు ప్రజలు ఒక్కరు కూడ కనాను దేశాన్ని స్వాధీనం చేసుకునేందుకు జరిగిన యుద్ధాల్లో పాల్గొనలేదు. అందుచేత ఆ ఇతర రాజ్యాలను యెహోవా వారి దేశంలో ఉండనిచ్చాడు. (ఆ యుద్ధాలలో పాల్గొనని ఇశ్రాయేలు ప్రజలకు నేర్పించాలని యెహోవా ఇలా చేసాడు). ఆ దేశంలో యెహోవా ఉండనిచ్చిన రాజ్యాల పేర్లు ఇవి: ఫిలిష్తీయుల అయిదుగురు పరిపాలకులు, కనానీయులు అందరూను, సీదోను ప్రజలు, గయెలు హెర్మోను నుండి లెబోహమాతు వరకు గల లెబానోను కొండల్లో జీవించిన హివ్వీ ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలను పరీక్షించటానికి యెహోవా ఆ రాజ్యాలను దేశంలో ఉండనిచ్చాడు. వారి పూర్వీకులకు మోషే ద్వారా యెహోవా ఇచ్చిన ఆదేశాలకు ఇశ్రాయేలు ప్రజలు విధేయులవుతారేమోనని ఆయన చూడాలనుకున్నాడు.

కనానీయులతో, హిత్తీ ప్రజలతో, అమోరీ ప్రజలతో, పెరిజ్జీ ప్రజలతో, హివ్వీ ప్రజలతో, యెబూసీ ప్రజలతో కలిసి ఇశ్రాయేలు ప్రజలు జీవించారు. ఇశ్రాయేలు ప్రజలు, ఆ ప్రజల కుమార్తెలను వివాహము చేసుకోవటం మొదలు పెట్టారు. ఇశ్రాయేలు ప్రజలు తమ కుమార్తెలను ఆ మనుష్యుల కుమారులు వివాహము చేసుకోనిచ్చారు. మరియు ఇశ్రాయేలు ప్రజలు ఆ మనుష్యుల దేవుళ్లను పూజించటం మొదలు పెట్టారు.

మొదటి న్యాయమూర్తి, ఒత్నీయేలు

ఇశ్రాయేలు ప్రజలు చెడు పనులు చేసినట్టు యెహోవా చూశాడు. ఇశ్రాయేలు ప్రజలు వారి దేవుడు యెహోవాను మరచిపోయి, బయలు మరియు అషేరా[c] అను బూటకపు దేవుళ్లను సేవించారు. ఇశ్రాయేలీయుల మీద యెహోవాకు కోపం వచ్చింది. యెహోవా అరామునహరాయిము[d] రాజు కూషన్రిషాతాయిము ఇశ్రాయేలు ప్రజలను ఓడించి, వారిని పాలించనిచ్చాడు. ఇశ్రాయేలీయులు ఎనిమిది సంవత్సరాల పాటు ఆ రాజు పాలనలో ఉన్నారు. కానీ ఇశ్రాయేలీయులు సహాయం కోసం యెహోవాకు మొరపెట్టారు. వారిని రక్షించేందుకు యెహోవా ఒక మనిషిని పంపించాడు. ఆ మనిషి పేరు ఒత్నీయేలు. అతడు కనజు అనే వ్యక్తి కుమారుడు. కనజు కాలేబుకు చిన్న తమ్ముడు. ఒత్నీయేలు ఇశ్రాయేలీయులను రక్షించాడు. 10 యెహోవా ఆత్మ ఒత్నీయేలు మీదికి వచ్చినప్పుడు అతడు ఇశ్రాయేలీయులకు న్యాయమూర్తి అయ్యాడు. ఇశ్రాయేలీయులను ఒత్నీయేలు యుద్ధానికి నడిపించాడు. అరాము రాజు కూషన్రిషాతాయిమును ఓడించేందుకు యెహోవా ఒత్నీయేలుకు సహాయం చేసాడు. 11 అందుచేత కనజు కుమారుడు ఒత్నీయేలు చనిపోయేంతవరకు నలభై సంవత్సరాలు దేశం శాంతితో ఉండెను.

న్యాయమూర్తి ఏహూదు

12 ఇశ్రాయేలు ప్రజలు మరల చెడుకార్యాలు చేయటం యెహోవా చూశాడు. కనుక ఇశ్రాయేలు ప్రజలను ఓడించేందుకు మోయాబు రాజు ఎగ్లోనుకు యెహోవా శక్తి ఇచ్చాడు. 13 అమ్మోనీ ప్రజలు, అమాలేకు ప్రజల దగ్గర నుండి ఎగ్లోను సహాయం పొందాడు. వారు అతనితో కలిసి, ఇశ్రాయేలు ప్రజల మీద దాడి చేశారు. ఎగ్లోను, అతని సైన్యం ఇశ్రాయేలు ప్రజలను ఓడించి, ఖర్జూరపు చెట్ల పట్టణం నుండి (యెరికో) వారిని బలవంతంగా వెళ్లగొట్టారు. 14 ఎగ్లోను ఇశ్రాయేలు ప్రజలను పద్దెనిమిది సంవత్సరాలు పాలించాడు.

15 ప్రజలు యెహోవాకు మొరపెట్టారు. ఇశ్రాయేలు ప్రజలను రక్షించేందుకు యెహోవా ఒక మనిషిని పంపించాడు. ఆ మనిషి పేరు ఏహూదు. ఏహూదు ఎడమచేతి వాటంగలవాడు. ఏహూదు బెన్యామీను వంశానికి చెందిన గెరా అనే పేరుగల వాని కుమారుడు. మోయాబు రాజు ఎగ్లోనుకు కొంత పన్ను డబ్బు చెల్లించేందుకు ఇశ్రాయేలు ప్రజలు ఏహూదును పంపించారు. 16 ఏహూదు అతనికోసం ఒక ఖడ్గం చేసుకున్నాడు. ఆ ఖడ్గానికి రెండంచులున్నాయి, దాని పొడవు పద్ధెనిమిది అంగుళాలు. ఏహూదు ఆ ఖడ్గాన్ని తన కుడి తొడకు కట్టుకొని తన బట్టల క్రింద దానిని కప్పిపెట్టాడు.

17 ఏహూదు మోయాబు రాజైన ఎగ్లోను దగ్గరకు వచ్చి పన్ను డబ్బు చెల్లించాడు. (ఎగ్లోను చాలా లావు పాటి మనిషి) 18 ఏహూదు ఆ డబ్బును ఎగ్లోనుకు చెల్లించిన తర్వాత, ఆ డబ్బును మోసుకుని వచ్చిన ఆ మనుష్యులను తిరిగి ఇంటికి పంపించివేసాడు. 19 ఏహూదు వెళ్లేందుకు బయలుదేరాడు. గిల్గాలు పట్టణంలో విగ్రహాలను అతడు సమీపించినప్పుడు అతడు వెనుకకు తిరిగాడు. అప్పుడు ఏహూదు, “ఓ రాజా, నీకు చెప్పాల్సిన ఒక రహస్య సందేశం నా దగ్గర ఉంది” అని ఎగ్లోనుతో చెప్పాడు.

ఊరకవుండు అన్నాడు రాజు. తర్వాత అతడు సేవకులందరినీ ఆ గదిలోనుండి బయటకు పంపివేసాడు. 20 ఏహూదు ఎగ్లోను రాజు దగ్గరకు వెళ్లాడు. ఎగ్లోను తన వేసవి కాలపు రాజ భవనంలో ఒంటరిగా కూర్చునియున్నాడు.

అప్పుడు ఏహూదు, “దేవుని దగ్గరనుండి నీ కోసము ఒక సందేశం నా వద్ద వుంది” అని చెప్పాడు. రాజు తన సింహాసనం నుండి లేచి ఏహూదుకు చాలా దగ్గరగా వచ్చాడు. 21 రాజు తన సింహాసనం నుండి లేచి నిలబడగా, ఏహూదు తన కుడి తొడకు కట్టబడిన ఖడ్గాన్ని తన ఎడమ చేతితో అందుకొని బయటకు తీసాడు. అప్పుడు ఏహూదు ఆ ఖడ్గాన్ని రాజు పొట్టలో పొడిచి వేసాడు. 22 ఆ ఖడ్గం పిడికూడ లోపలకు దిగిపోవునంతగా రాజు కడుపులోనికి దిగిపోయింది. రాజు కొవ్వు ఖడ్గము నిండా అతుక్కుపోయింది. కనుక ఏహూదు ఆ ఖడ్గాన్ని ఎగ్లోను పొట్టలోనే విడిచిపెట్టేసాడు.

23 ఏహూదు గదిలో నుండి బయటకు వెళ్లి దాని తలుపులు మూసి తాళం వేసాడు. 24 ఏహూదు వెళ్లిపోగానే సేవకులు తిరిగి వచ్చారు. ఆ గది తలుపులు తాళము వేసి ఉండటం ఆ సేవకులు చూశారు. కనుక ఆ సేవకులు, “రాజు తన విశ్రాంతి గదిలో మూత్ర విసర్జనకు వెళ్లి ఉంటాడు” అని చెప్పుకున్నారు. 25 అందుచేత ఆ సేవకులు చాలా సేపు వేచి ఉన్నారు. చివరికి వారు దిగులు చెందారు. వారు తాళం చెవి తెచ్చి తలుపులు తెరిచారు. ఆ సేవకులు ప్రవేశించినప్పుడు, వారి రాజు నేల మీద చచ్చిపడి ఉండటం చూశారు.

26 ఆ సేవకులు రాజు కొరకు వేచి ఉండగా, ఏహూదు పారిపోయేందుకు సమయం దొరికింది. ఏహూదు విగ్రహాలను దాటి శెయీరా అను స్థలంవైపు వెళ్లాడు. 27 ఏహూదు శెయీరా అను స్థలం చేరాడు. అప్పుడు అతడు అక్కడ ఎఫ్రాయిమీయుల కొండ దేశంలో బూర ఊదాడు. ఇశ్రాయేలు ప్రజలు బూర శబ్దం విని, ఏహూదు వారిని నడిపిస్తుండగా వారు కొండలు దిగివెళ్లారు. 28 ఏహూదు, “నన్ను వెంబడించండి! మన శత్రువులైన మోయాబు ప్రజలను ఓడించేందుకు యెహోవా మనకు సహాయం చేస్తాడు” అని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాడు.

కనుక ఇశ్రాయేలు ప్రజలు ఏహూదును వెంబడించారు. ఎక్కడైతే యోర్దాను నదిని తేలికగా దాటి, మోయాబు దేశంలోనికి వెళ్లవచ్చునో ఆ స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు వారు ఏహూదు వెంట వెళ్లారు. ఇశ్రాయేలు ప్రజలు ఏ ఒక్కరినీ కూడా యోర్దాను నదిని దాటనివ్వలేదు. 29 మోయాబు ప్రజలలో ధైర్యం, బలంగల పదివేల మందిని ఇశ్రాయేలు ప్రజలు చంపివేసారు. మోయాబు వాడు ఒక్కడు కూడా తప్పించుకోలేదు. 30 కనుక ఆ రోజు నుండి ఇశ్రాయేలు ప్రజలు మోయాబు ప్రజలను పాలించటం మొదలు పెట్టారు. మరియు ఆ దేశంలో ఎనభై సంవత్సరాల వరకు శాంతి ప్రబలింది.

న్యాయమూర్తి షమ్గరు

31 ఏహూదు ఇశ్రాయేలు ప్రజలను రక్షించిన తర్వాత మరో మనిషి ఇశ్రాయేలీయులను రక్షించాడు. ఆ మనిషి పేరు షమ్గరు. అతడు అనాతు కుమారుడు. ఫిలిష్తీ మనుష్యులు ఆరువందల మందిని చంపేందుకు షమ్గరు ఒక ములుకోల (ఎద్దులను తోలే ముల్లుగల కర్ర)ను ప్రయోగించాడు.

లూకా 22:14-34

ప్రభు రాత్రి భోజనము

(మత్తయి 26:26-30; మార్కు 14:22-26; 1 కొరింథీ. 11:23-25)

14 భోజనం చేసే సమయం దగ్గరకు వచ్చింది. యేసు, ఆయన అపొస్తలులు భోజనానికి కూర్చున్నారు. 15 ఆయన వాళ్ళతో, “నేను చనిపోకముందే మీతో కలిసి ఈ పస్కా భోజనము చెయ్యాలని ఎంతో ఆశ పడ్డాను. 16 ఎందుకంటే దేవుని రాజ్యంలో ఈ పస్కా భోజనమునకు ఉన్న నిజమైన అర్థం నెరవేరుతుంది. అంతవరకు ఈ భోజనం మళ్ళీ చెయ్యను” అని అన్నాడు.

17 ఆయన గిన్నె తీసుకొని దేవునికి కృతజ్ఞతలు చెప్పి, “ఇది తీసుకొని మీ మధ్య పంచుకొండి. 18 ఎందుకంటే దేవుని రాజ్యం వచ్చేవరకు నేను ద్రాక్షతో చేసిన ఈ పానీయం మళ్ళీ త్రాగనని మీతో చెబుతున్నాను” అని అన్నాడు.

19 ఆ తర్వాత ఒక రొట్టె తీసుకొని దేవునికి కృతజ్ఞతలు చెప్పి దాన్ని త్రుంచి వాళ్ళకిస్తూ, “ఇది నా శరీరం. మీకోసం యివ్వబడింది. నా జ్ఞాపకార్థం యిది చెయ్యండి” అని అన్నాడు. 20 అదే విధంగా భోజనం అయ్యాక ఆయన పాత్రను తీసుకొని, “ఇది నా రక్తంతో చేసిన క్రొత్త నిబంధన. నేను ఈ రక్తాన్ని మీకోసం చిందిస్తున్నాను.

యేసుకు ఎవరు విరోధికాగలరు?

21 “నాకు ద్రోహం చేయబోతున్నవాడు నాతో యిక్కడ భోజనానికి కూర్చొని ఉన్నాడు. 22 దేవుడు నిర్ణయించినట్లు మనుష్యకుమారుడు మరణించబోతున్నాడు. ఆయనకు ద్రోహం చేసిన వానికి శిక్ష తప్పదు” అని అన్నాడు.

23 వాళ్ళు తమలో, “ఎవరీపని చేస్తారా?” అని పరస్పరం ప్రశ్నించుకొన్నారు.

ఎవరు గొప్ప

24 ఆ తర్వాత వాళ్ళలో, “ఎవరు గొప్ప” అన్న విషయంపై వాదన మొదలైంది. 25 యేసు వాళ్ళతో, “యూదులుకాని వాళ్ళను, వాళ్ళ రాజులు క్రూరంగా పాలిస్తారు. అధికారంలో ఉన్నవాళ్ళు తమను పొగడమని ప్రజల్ని ఒత్తిడి చేస్తారు. 26 కాని మీరు అలా ఉండకూడదు. మీలో అందరికన్నా గొప్పవాడు అందరికన్నా చిన్నవానిలా మెలగాలి. నాయకుడు సేవకునిలా ఉండాలి. 27 ఎవరు గొప్ప? భోజనానికి కూర్చొన్నవాడా లేక భోజనం వడ్డించేవాడా? భోజనానికి కూర్చొన్న వాడేకదా! కాని నేను మీ సేవకునిలా ఉంటున్నాను.

28 “మీరు నా కష్టసమయాల్లో నా వెంట ఉన్నవాళ్ళు. 29 కనుక నా తండ్రి నాకు రాజ్యాన్ని అప్పగించి నట్లు నేను మీకు రాజ్యాన్ని అప్పగిస్తాను. 30 అప్పుడు మీరు నా రాజ్యంలో నాతో కలిసి కూర్చొని తింటారు. సింహాసనాలపై కూర్చుని పండ్రెండు వంశాల వారిపై తీర్పు చేస్తారు.

పేతురు తనను నిరాకరిస్తాడని యేసు చెప్పటం

(మత్తయి 26:31-35; మార్కు 14:27-31; యోహాను 13:36-38)

31 “సీమోనూ! సీమోనూ! మిమ్మల్ని గోధుమలు చెరిగినట్లు చెరిగి పరీక్షించటానికి సైతాను అనుమతి పొందాడు. 32 కాని సీమోనూ! నీలో ఉన్న విశ్వాసం సన్నగిల్లరాదని నేను ప్రార్థించాను. నీ విశ్వాసం మళ్ళీ బలపడినప్పుడు నీ సోదరుల విశ్వాసాన్ని గట్టిపరుచు” అని అన్నాడు.

33 కాని సీమోను, “ప్రభూ! మీ వెంట కారాగారానికి రమ్మన్నా, చనిపొమ్మన్నా సిద్ధమే!” అని సమాధానం చెప్పాడు.

34 యేసు, “పేతురూ! నేను చెప్పేది విను. ఈ రోజు కోడి కూయక ముందే నేనెవరినో నీకు తెలియదని మూడు సార్లంటావు” అని అన్నాడు.

కీర్తనలు. 92-93

సబ్బాతుకోసం స్తుతి కీర్తన.

92 యెహోవాను స్తుతించుట మంచిది.
    సర్వోన్నతుడైన దేవా, నీ నామాన్ని కీర్తించుట మంచిది.
ఉదయం నీ ప్రేమను గూర్చి పాడటం,
    రాత్రివేళ నీ నమ్మకత్వాన్ని గూర్చి పాడటం మంచిది.
దేవా, పదితంత్రుల వాయిద్యాలను స్వరమండల ములను నీ కోసం వాయించటం మంచిది.
    సితారా మీద నీ కోసం సంగీతనాదం చేయటం మంచిది.
యెహోవా, నీవు చేసిన పనుల మూలంగా నిజంగా నీవు మమ్మల్ని సంతోషింపచేస్తావు.
    నీవు చేసిన వాటిని గూర్చి మేము సంతోషంగా పాడుకొంటాం.
యెహోవా, నీవు గొప్ప కార్యాలు చేశావు.
    నీ తలంపులు మేము గ్రహించటం మాకు ఎంతో కష్టతరం.
నీతో పోల్చినట్లయితే మనుష్యులు బుద్ధిలేని జంతువుల్లాంటి వారు.
    మేము ఏదీ గ్రహించలేని బుద్ధిలేని వాళ్లలా ఉన్నాము.
దుర్మార్గులు గడ్డిలా మొలిచినా,
    చెడ్డవాళ్లు అభివృద్ధి చెందినా వారు శాశ్వతంగా నాశనం అవుతారు.
కాని యెహోవా, నీవు శాశ్వతంగా గౌరవించబడతావు.
యెహోవా, నీ శత్రువులు అందరూ నాశనం చేయబడతారు.
    చెడు కార్యాలు చేసే ప్రజలందరూ నాశనం చేయబడతారు.
10 కాని నీవు నన్ను బలపరుస్తావు. బలమైన కొమ్ములుగల పొట్టేలువలె నీవు నన్ను చేస్తావు.
    సేదదీర్చే నీ తైలాన్ని నీవు నా మీద పోశావు.
11 నా శత్రువుల పతనాన్ని నా కండ్లారా చూచాను.
    నా శత్రువుల నాశనాన్ని నా చెవులారా విన్నాను.

12 నీతిమంతులు ఖర్జూరపు చెట్టులా అభివృద్ధి చెందుతారు.
    వారు లెబానోనులోని దేవదారు వృక్షంలా పెరుగుతారు.
13 మంచి మనుష్యులు యెహోవా ఆలయంలో నాటబడిన మొక్కలవలె బలంగా ఉంటారు.
    వారు మన దేవుని ఆలయంలో బలంగా ఎదుగుతారు.
14 వారు వృద్ధులైన తరువాత కూడా ఫలిస్తూనే ఉంటారు.
    వారు ఆరోగ్యంగా ఉన్న పచ్చని మొక్కల్లా వుంటారు.
15 యెహోవా మంచివాడని నేను చెబుతున్నాను.
ఆయనే నా బండ.
    ఆయనలో అవినీతి లేదు.

93 యెహోవాయే రాజు!
    ప్రభావము, బలము ఆయన వస్త్రములవలె ధరించాడు.
కనుక ప్రపంచం నాశనం చేయబడదు.
దేవా, నీవూ, నీ రాజ్యమూ శాశ్వతంగా కొనసాగుతాయి.
యెహోవా, నదుల ధ్వని చాలా పెద్దగా ఉంది.
    ఎగిరిపడే అలలు చాలా పెద్దగా ధ్వనిస్తున్నాయి,
పెద్దగా లేస్తున్న సముద్రపు అలలు హోరెత్తుతున్నాయి, శక్తివంతంగా ఉన్నాయి.
    కాని పైన ఉన్న యెహోవా అంతకంటే శక్తిగలవాడు.
యెహోవా, నీ న్యాయవిధులు శాశ్వతంగా కొనసాగుతాయి.
    నీ పవిత్ర ఆలయం ఎల్లకాలం నిలిచి ఉంటుంది.

సామెతలు 14:1-2

14 జ్ఞానముగల స్త్రీ తన ఇల్లు ఎలా ఉండాలో అలా చేసుకొనేందుకు జ్ఞానము ప్రయోగిస్తుంది. కాని బుద్ధిహీనురాలు ఆమె చేసే బుద్ధిహీనమైన పనుల మూలంగా తన ఇల్లు నాశనం చేసుకొంటుంది.

సరిగ్గా జీవించే మనిషి యెహోవాను గౌరవిస్తాడు. కాని నిజాయితీ లేని మనిషి యెహోవాను ద్వేషిస్తాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International