Chronological
అష్షూరువారు షోమ్రోనును పట్టుకొనుట
9 అష్షూరు రాజైన షల్మనేసెరు షోమ్రోనుకు విరుద్ధంగా యుద్ధం చేయడానికి వెళ్లాడు. అతని సైన్యము నగరాన్ని చుట్టుముట్టింది. హిజ్కియా యూదా రాజుగా ఉన్న నాల్గవ సంవత్సరంలో ఇది జరిగింది. (ఏలా కుమారుడైన హోషేయా ఇశ్రాయేలు రాజుగా ఉన్న ఏడవ సంవత్సరములో ఇది జరిగింది). 10 మూడవ సంవత్సరము చివరను షల్మనేసెరు షోమ్రోనుని పట్టుకున్నాడు. హిజ్కియా యూదా రాజుగా ఉన్న ఆరవ సంవత్సరమున, అతను షోమ్రోనుని వశము చేసుకున్నాడు. (ఇశ్రాయేలు రాజుగా హోషేయా వున్న తొమ్మిదో సంవత్సరమున ఇది జరిగింది). 11 అష్షూరు రాజు ఇశ్రాయేలు వారిని బందీలుగా అష్షూరుకు తీసుకుని వెళ్లాడు. వారిని హాలహు లేక హాబోరు (గోజాను నది), మాదీయుల నగరాలలో నివసింపజేశాడు. 12 ఇశ్రాయేలువారు తమ దేవుడైన యెహోవాను పాటించక పోవడంవల్ల ఇలా జరిగింది. వారు యెహోవా ఒడంబడికను విచ్ఛిన్నం చేశారు. యెహోవా సేవకుడైన మోషే చెప్పిన అన్ని విషయాలను వారు పాటించలేదు. యెహోవా ఒడంబడికను ఇశ్రాయేలు ప్రజలు పెడ చెవిని పెట్టారు. మరియు ఆయన చేయమని చెప్పిన పనులు వారు చేయలేదు.
అష్షూరు యూదాని తీసుకొనుటకు సిద్ధపడుట
13 హిజ్కియా రాజుగా వున్న 14వ సంవత్సరములో అష్షూరు రాజయిన సన్హెరీబు యూదాలోని అన్ని బలిష్ఠ నగరాల మీద దండెత్తి వెళ్లాడు. సన్హెరీబు ఆ నగరాలన్నిటిని ఓడించాడు. 14 అప్పుడు యూదా రాజయిన హిజ్కియా అష్షూరు రాజుకి లాకీషు వద్ద ఒక సందేశం పంపాడు. “నేను తప్పు చేశాను. నన్ను ఒంటరిగా వదలండి. అప్పుడు మీరు ఏమి కోరినా అది నేనిస్తాను” అని హిజ్కియా చెప్పాడు.
తర్వాత అష్షూరు రాజు యూదా రాజయిన హిజ్కియాని 11 టన్నుల వెండి, 1 టన్ను బంగారం ఇమ్మని అడిగాడు. 15 హిజ్కియా యెహోవా ఆలయం నుండి, రాజుగారి నిధుల నుండీ వెండి అంతా తీసి ఇచ్చాడు. 16 ఆ సమయంలో హిజ్కియా యెహోవా మందిరానికి ద్వారము మెట్లకి గల బంగారమంతా తీయించి వేశాడు. హిజ్కియా రాజు ఆ తలుపుల మీద మెట్లమీద బంగారం ఉంచాడు. హిజ్కియా అష్షూరు రాజుకు ఈ బంగారమంతా ఇచ్చివేశాడు.
అష్షూరు రాజు యెరూషలేముకు మనుష్యులను పంపుట
17 అష్షూరు రాజు అతి ముఖ్యులైన తర్తానును, రబ్బారీసు, రబ్బాకేను అను తన ముగ్గురు సైన్యాధిపతులను పెద్ద సైన్యముతో యెరూషలేములోని హిజ్కియా రాజు వద్దకు పంపాడు. ఆ మనుష్యులు లాకీషు నుంచి యెరూషలేము వెళ్లారు. వారు చేరి “చాకిరేవు” వెళ్లే దారిలోవున్న యెరక కొలను కాలువ దగ్గర నిలబడ్డారు. 18 వారు రాజుని పిలిచారు. హిల్కీయా కుమారుడైన ఎల్యాకీము (ఎల్యాకీము రాజభవన అధికారి), షెబ్నా (కార్యదర్శి), అసాపు కొడుకైన యోవాహును (దస్తావేజులు సంరక్షించేవాడు) వారిని కలుసుకోడానికి వచ్చారు. 19 ఒక సైన్యాధిపతి ఇలా చెప్పాడు, “అష్షూరు మహా రాజు చెప్పుచున్నది:
‘హిజ్కియాతో చెప్పు. నీవు దేనిని విశ్వసిస్తున్నావు? 20 నీ మాటలు విలువలేనివి. యుద్ధంలో “నాకు సహాయంగా వుండదగినంత. సలహా, శక్తివున్నాయి” అని నీవు చెప్పుచున్నావు. కాని నీవు నా పరిపాలన నుండి వేరుపడిన తర్వాత నీవెవరిని నమ్ముతున్నావు? 21 విరిగిపోయిన రెల్లుతో చేయబడిన చేతికర్రను ఊని ఉన్నావు! ఈ చేతికర్ర ఈజిప్టు. ఈ చేతికర్రను ఊని నడిస్తే అది విరిగిపోయి, చేతిలో గుచ్చుకొని గాయపరుస్తుంది. తనను విశ్వసించే వారికందరికీ ఈజిప్టు రాజు అటువంటివాడు. 22 “మీ దేవుడైన యెహోవాని నమ్ముతున్నట్లు” నీవు చెప్పవచ్చు. కాని ఉన్నత స్థలాలను బలిపీఠాలను హిజ్కియా తొలగించి యెరూషలేములోని బలిపీఠం ఎదురుగా మాత్రమే ఆరాధించాలని యూదా, యెరూషలేము ప్రజలకు చెప్పినట్లు నాకు తెలుసు.
23 ‘నా యాజమాని అయిన అష్షూరు రాజుతో ఇప్పుడు నీవు ఈ ఒడంబడిక చేసుకో. స్వారీ చేయగల మనుష్యులుంటే, నీకు రెండు వేల గుర్రాలు ఇస్తానని నేను వాగ్దానం చేస్తాను. 24 నా యజమానికి గల చాలా తక్కువ అధిపతిని కూడా నీవు ఓడించలేవు. రథాలకు, అశ్విక వీరులకు నీవు ఈజిప్టు మీద ఆధారపడి వున్నావు.
25 ‘యెహోవా ఆజ్ఞ లేకుండ యెరూషలేమును నాశనం చేయుటకు నేను రాలేదు. “ఈ దేశానికి విరుద్ధంగా వెళ్లి దానిని నాశనము చేయుము” అని యెహోవా నాకు చెప్పాడు.’
26 అప్పుడు హిల్కీయా కుమారుడైన ఎల్యాకీము, షెబ్నా యెవాహు ఆ సైన్యాధిపతితో, “దయచేసి మాతో సిరియా బాషలో మాట్లాడండి. ఆ బాషను మేము అర్థం చేసుకుంటాము. యూదా భాషలో మాతో సంభాషించవద్దు. ఎందుకంటే, గోడమీద ఉన్న వారు ఈ మాటలు వింటారు.” అని చెప్పారు.
27 కాని రబ్షాకే వారితోను ఇట్లనెను: “నా యాజమాని నీతోను, మీ రాజుతోను మాత్రమే మాటలాడుటకు నన్ను పంపలేదు. గోడమీద కూర్చున్న వారితో కూడా మాటలాడెదను. వారు నీతోపాటు తమ మలమూత్రములను సేవిస్తారు.”
28 తర్వాత యూదా భాషలో సిరియా సైన్యాధిపతి బిగ్గరగా అరిచాడు.
“అష్షూరు మహారాజు పంపిన ఈ సందేశం వినండి. 29 హిజ్కియా మిమ్మును మోసము చేయడానికి సమ్మతింపకుడి. నా అధికారం నుండి అతను మిమ్మును కాపాడలేడు. 30 యెహోవాను మీరు నమ్మునట్లుగా హిజ్కియాని సేవించవద్దు. యెహోవా మనల్ని కాపాడును, అష్షూరు రాజు ఈ నగరాన్ని ఓడించలేడు” అని హిజ్కియా చెప్పాడు. 31 కాని హిజ్కియా మాటలు వినవద్దు. “అష్షూరు రాజు ఇది చెప్పుచున్నాడు:
‘నాతో సంధి చేసుకోండి. నా దగ్గరికి రండి. అప్పుడు ఒక్కొక్కరు తన సొంత ద్రాక్షలు, తన సొంత అరటి పండ్లు తినవచ్చు, తన సొంత బావినుండి నీరు త్రాగవచ్చు. 32 నేను వచ్చి మిమ్మును దూరంగా మీ సొంత ప్రదేశము వలె ఒక పచ్చిక ప్రదేశానికి తీసుకు వెళ్లేంత వరకు మీరిది చేయవచ్చు. అది ధాన్యం గల ప్రదేశము. క్రొత్త ద్రాక్షారసం గలది. ద్రాక్షా పొలాలు, రొట్టె గలది. ఒలీవ తేనెగల ప్రదేశమది. అప్పుడు మీరు బ్రతకవచ్చు, చనిపోరు. కాని హిజ్కియా మాటలు వినకండి. అతను మీ బుద్ధి మార్చాలని ప్రయత్నిస్తున్నాడు. యెహోవా మనలను కాపాడ్తాడు. అని అతను చెప్పుచున్నాడు. 33 అష్షూరు రాజునుండి ఇతర దేశాల దేవత లెవరైనా అతని దేశాన్ని రక్షించారా? లేదు. 34 హమాతు, అర్పాదు దేవుళ్లు ఎక్కడున్నారు? సెపర్వాయీము, హేన, ఇవ్వా దేవుళ్లెక్కడున్నారు? నానుండి వారు షోమ్రోనును కాపాడగలిగినారా? లేదు. 35 ఇతర దేశాలలో వున్న ఏ దేవుళ్ళయినా నానుండి తమ భూమిని కాపాడుతారా? లేదు. యెరూషలేముని యెహోవా నానుండి కాపాడుతాడా? లేదు’”
36 కాని ప్రజలు మౌనం వహించారు. వారు ఆ సైన్యాధిపతితో ఒక్కమాట కూడా చెప్పలేదు. కారణం, హిజ్కియా రాజు, “అతనితో ఏమీ మాటలాడ వద్దు” అని వారికి ఆజ్ఞాపించాడు.
37 హిల్కీయా కొడుకైన ఎల్యాకీము (ఎల్యాకీము రాజభవనం అధికారి), షెబ్నా (కార్యదర్శి), ఆసాపు కొడుకైన యోవాహు (దస్తావేజుల సంరక్షకుడు) హిజ్కియా వద్దకు వచ్చారు. తాము తలక్రిందులైనామని తెలపడానికై వారి వస్త్రాలు చింపివేయబడ్డవి. అష్షూరు సైన్యాధిపతి చెప్పిన విషయాలను వారు హిజ్కియాకు చెప్పారు.
హిజ్కియా యెషయా ప్రవక్తతో మాటలాడుట
19 ేహిజ్కియా రాజు ఆ విషయములు అన్నియు విన్నాడు. అతను తన వస్త్రాలు చింపుకుని గోనెపట్ట ధరించాడు. (అతను విచారంగాను తలక్రిందులైనట్లుగాను అది తెలుపుతుంది.) తర్వాత అతను యెహోవా ఆలయానికి వెళ్లెను.
2 హిజ్కియా, ఎల్యాకీము (రాజభవన అధికారి) షెబ్నా (కార్యదర్శి) మరియు యాజకులలో పెద్ద వారిని అమోజు కుమారుడైన యెషయాప్రవక్త వద్దకు పంపాడు. తాము విచారంగాను తలక్రిందులైనట్లుగాను తెలుపడానికి గోనెపట్ట ధరించారు. 3 వారు యెషయాతో ఇలా అన్నారు: “ఇది యిబ్బంది రోజనీ, మేము తప్పు చేసినట్లుగా తెలిపే రోజనీ హిజ్కియా చెప్పుచున్నాడు. పిల్లలు పుట్టుటకు ఇది సమయము, అయితే వారికి పుట్టుక ఇచ్చేందుకు తగిన బలము లేదు. 4 అష్షూరు రాజుయొక్క సైన్యాధిపతి సజీవుడైన దేవుని గురించి చెడు విషయాలు చెప్పాడానికి ఇక్కడికి పంపబడియున్నాడు. మీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆ విషయములు వినవచ్చు. యెహోవా ఆ విరోధిని శిక్షించవచ్చు. కనుక ఇంకా మిగిలివున్న వారికోసము ప్రార్థన చేయండి.”
5 హిజ్కియా రాజుయొక్క అధికారులు యెషయా వద్దకు వెళ్లారు. 6 “మీ యాజమాని అయిన హిజ్కియాకి ఈ విషయము చెప్పండి. యెహోవా ఇలా చెప్పుచున్నాడు అష్షూరు రాజు, అధికారులు నన్ను ఎగతాళి చేయడానికి మీకు చెప్పిన విషయాలు విని మీరు భయపడవద్దు. 7 నేనతనిలో ఒక ఆత్మను ప్రవేశపెడుతున్నాను. అతను ఒక వందతి వింటాడు. అప్పుడతను తన దేశానికి తిరిగి పారిపోతాడు. అతని దేశంలోనే ఒక ఖడ్గంతో అతను చంపబడేలా నేను చేస్తాను” అని యెషయా వారితో చెప్పాడు.
అష్షూరు రాజు మరల హిజ్కియాని హెచ్చరించుట
8 అష్షూరు రాజు లాకీషు విడిచి వెళ్లినట్లు ఆ సైన్యాధిపతి తెలుసుకున్నాడు. అందువల్ల అతను తన రాజు లిబ్నాకి విరుద్ధముగా పోరు సలుపుతున్నట్లు చూశాడు. 9 అష్షూరు రాజు కూషు రాజైన తిర్హకా గురించి ఒక వదంతి విన్నాడు. “తిర్హకా నీతో యుద్ధము చేయడానికి వచ్చాడు” అన్నదే ఆ వదంతి.
అందువల్ల అష్షూరు రాజు మరల హిజ్కియా వద్దకు దూతలను పంపించాడు. ఆ దూతలకు ఈ సందేశం ఇచ్చాడు. ఈ విషయాలు తెలియజేశాడు. 10 “యూదా రాజయిన హిజ్కియాకి ఈ విషయము చెప్పండి.
‘నీవు విశ్వసించే దేవుడు నిన్ను అవివేకిగా చేసే విధంగా చేయకు. అష్షూరు రాజు యెరూషలేముని ఓడించలేడు; అని అతడు చెప్పుచున్నాడు గదా. 11 అష్షూరు రాజులు ఇతర దేశాలకు వ్యతిరేకంగా చేసిన పనులు నీవు వినియుంటావు. మేము వారిని సర్వ నాశనం చేశాము. నీవు కాపాడుదువా? లేదు. 12 ఆ దేశాల దేవుళ్లు ఆ ప్రజలను కాపాడలేదు. నా పూర్వికులు వారిని సర్వనాశనము చేశారు. వారు గోజాను, హారాను, రెజెపులు తెలశ్శారులోని ఏదోను ప్రజలను నాశనం చేశారు. 13 హమాతు రాజు ఎక్కడ? అర్పాదు రాజు ఎక్కడ? సెపర్వయీము రాజు? హేనా, ఇవ్వా రాజులు? అందురూ ముగింపబడ్డారు.’”
హిజ్కియా యెహోవాని ప్రార్థించుట
14 అష్షూరు రాజు దూతలనుండి వచ్చిన ఉత్తరాలు హిజ్కియా చదివాడు. అప్పుడు హిజ్కియా యెహోవా ఆలయము వద్దకు వెళ్లి, యెహోవా ముందు ఆ ఉత్తరాలు వుంచాడు. 15 హిజ్కియా యెహోవాని ప్రార్థించాడు: “ఇశ్రాయేలు దేవుడవైన యెహోవా, కెరూబుల నడుమ రాజుగా ఆసీనుడవై వున్నావు. దేవుడివి నీవే, ప్రపంచంలోని అన్ని రాజ్యాలకూ నీవే దేవుడివి. నీవు పరలోకము, భూమిని చేశావు. 16 ప్రభువా, నా మొర విను, ప్రభువా, కళ్లు తెరువు, ఈ ఉత్తరాలు చూడు. సన్హరీబు సజీవుడైన దేవుని అవమానిస్తూ చెప్పిన మాటలు విను. 17 అది నిజము, ప్రభూ. ఆ దేశాలను అష్షూరు రాజులు నాశనం చేశారు. 18 ఆ జనాంగాల దేవుళ్లను వారు అగ్నిలోకి కాల్చివేశారు. కాని వారు నిజమైన దేవుళ్లు కారు. వారు కేవలము రాయి, కర్రలతో, మనుష్యులు చేసిన ప్రతిమలు. 19 కనుక ఇప్పుడు, మా దేవుడువైన యెహోవా, మమ్ము అష్షూరు రాజునుండి కాపాడుము. అప్పుడు భూమిమీది అన్ని రాజ్యములు యెహోవావైన నీవే దేవుడవని తెలుసుకుంటాయి.”
దేవుడు హిజ్కియాకు సమాధానమిచ్చుట
20 ఆమోజు కొడుకైన యెషయా హిజ్కియాకి ఈ సందేశము పంపించాడు: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యిది చెప్పుచున్నాడు, అష్షూరు రాజు సన్హెరీబుకి విరుద్ధంగా నీవు నన్ను ప్రార్థించావు. అది నేను విన్నాను.
21 “యెహోవా సన్హెరీబును గూర్చి ఇచ్చిన సందేశము: ఈ విధంగా ఉంది:
‘సీయోను (యెరూషలేము) కుమార్తె అయిన ఆ కన్య నీవు ముఖ్యుడవుకాదని భావిస్తున్నది.
ఆమె నిన్ను ఎగతాళి చేస్తున్నది.
యెరూషలేము కుమార్తె నీ వెనుక తన తల ఆడిస్తున్నది.
22 కాని నువ్వెవరిని అవమానించి యెగతాళి చేసావు?
నీవు ఎవరికి విరుద్ధంగా మాట్లాడినావు?
నీవు ఇశ్రాయేలు పవిత్రునికి ప్రతికూలుడిగా వచ్చావు
నీవు ఆయన కంటె మంచివాడివిగా ప్రవర్తించావు.
23 నీ దూతల ద్వారా యెహోవాను అవమానించి నీవు ఇలా చెప్పావు:
“ఉన్నత పర్వతాలకు నేను వచ్చాను నా పెక్కు రథాలతో నేను లెబానోను లోపలికి వచ్చాను
నేను ఉన్నత దేవదారుల వృక్షాలు మరియు లెబానోనులోని ఉత్తమ సరళ వృక్షాలను చేధించాను.
పచ్చని అడవికి నేను వెళ్లాను. అదియె లెబానోనులోని ఉన్నత భాగము.
24 నూతన ప్రదేశాలలో నేను బావులు తవ్వాను
మంచినీళ్లు తాగితిని ఈజిప్టు నదులను ఎండించాను.”
25 ఆ దేశము మీదుగా నడిచాను అదే నీవు చెప్పింది, కాని నీవు దేవుడు చెప్పింది వినలేదా?
నేను (దేవుడు) పూర్వమే పథకము వేశాను
ప్రాచీన కాలం నుండి పథకం వేశాను
ఇప్పుడది జరుగునట్లు చేశాను
బలిష్ఠమైన ఆ నగరాలు నాశనము చేయుటకును
రాతి కుప్పలుగా మార్చుటకును నిన్ను అనుమతించాను.
26 నగరాలలో ఉన్నవారు శక్తివిహీనులు వారు
భీతావహులు గందరగోళంలో ఉన్నావారు
క్ష్రేత్రంలోని పచ్చికలా మొక్కలవలె వారు ఛేదింపదగిన వారు.
వాడుటకు పూర్వము పెరగని విధంగా ఇండ్ల
కప్పుల మీద పెరిగే పచ్చికవారు.
27 నీవు ఎప్పుడు క్రింద కూర్చుంటావో నాకు తెలియును.
నీవు యుద్ధానికి వెళ్లడం నాకు తెలుసు
నీవు ఇంటి దగ్గర ఉండినప్పుడు
నా పట్ల విసుగు చెందినది తెలుసును.
28 అవును. నీవు నాపట్ల విసుగు చెందితివి
నీ గర్వపు నిందా వాక్యాలు నేను విన్నాను
అందువల్ల నీ ముక్కుకు గాలం వేస్తున్నాను
నీ నోటికి నా కళ్లెము తగిలిస్తున్నాను ఆ
తర్వాత నిన్ను వెనుకకు మరల్చి
నీవు వచ్చిన తోవనే నడిపిస్తాను.’”
హిజ్కియాకు యెహోవా సందేశము
29 తర్వాత యెషయా హిజ్కియాతో ఈలాగు చెప్పెను. “నీకు సహాయము చేయనున్నందుకు ఇది ఒక గుర్తు. ఈ సంవత్సరము తనంతట తానే పెరిగే ధాన్యము నీవు భుజిస్తావు. ఆ మరు సంవత్సరము గింజనుండి పెరిగే ధాన్యము నీవు భుజిస్తావు. కాని ఆ మూడో సంవత్సరము నీవు నాటిన గింజలనుండి లభించే ధాన్యము నీవు భుజిస్తావు. నీవు ద్రాక్షా పొలాలు సాగుచేసి, లభించే ఆ ద్రాక్షలు భుజిస్తావు. 30 తప్పించుకున్న ప్రజలు, యూదా వంశంలో మిగిలిన వారు మరల పండించడము మొదలు పెడతారు. 31 కొద్దిమంది సజీవులై వుంటారు, కనుక వారు యెరూషలేమును విడిచి వెళతారు. తప్పించుకున్న ప్రజలు సీయోను కొండలో నుండి వెలుపలికి వెళతారు. యెహోవా యొక్క గాఢాభిప్రాయం అలా చేస్తుంది.
32 “అందువల్ల అష్షూరు రాజుని గురించి యెహోవా చెప్పేదేమనగా:
‘అతడీ నగరంలోకి రాడు.
అతడీ నగరంలో అస్త్రప్రయోగం చెయ్యలేడు.
అతడు తన కవచాలు ఈ నగరానికి తీసుకురాడు.
నగరములను దాడి చేసేందుకు ముట్టడి దిబ్బను నిర్మించలేడు.
33 అతడు వచ్చిన త్రోవనే తిరిగి వెళ్తాడు.
అతడీ నగరంలోకి రాలేడు
అని యెహోవా చెప్పుచున్నాడు!
34 నేనీ నగరాన్ని రక్షిస్తాను.
నేను నా కొరకు ఇది చేస్తాను నా సేవకుడు దావీదు కొరకు కూడా, ఇది చేస్తాను.’”
అష్షూరు సైన్యం నాశనం చేయబడుట
35 రాత్రి, యెహోవా దూత వెలుపలికి పోయి అష్షూరు శిబిరములోని 1,85,000 మందిని చంపాడు. ప్రజలు ఉదయాన మేల్కొనగా, వారు శవాలు చూశారు.
36 అందువల్ల అష్షూరు రాజయిన సన్హెరీబు తిరిగివెళ్లి నీనెవెకి మరలిపోయాడు. అక్కడే అతడు నిలిచాడు. 37 ఒకరోజు సన్హెరీబు తన దేవుడైన నిస్రోకు ఆలయంలో పూజ చేయిస్తూ ఉన్నాడు. అతని కుమారులు అద్రెమ్మెలెకు మరియు షరెజెరు కత్తితో అతనిని చంపారు. అప్పుడు అద్రెమ్మెలెకు మరియు షరెజెరు అరారాతు దేశములోకి తప్పించుకు పోయారు. మరియు సన్హెరీబు కుమారుడు ఎసర్హద్దోను, అతని తర్వాత క్రొత్తగా రాజయ్యాడు.
సంగీత నాయకునికి: కోరహు కుమారుల అలామోతు రాగ గీతం.
46 దేవుడు మా ఆశ్రయం, మా శక్తి.
ఆయన యందు, మాకు కష్ట కాలంలో ఎల్లప్పుడూ సహాయం దొరుకుతుంది.
2 అందుచేత భూమి కంపించినప్పుడు,
మరియు పర్వతాలు సముద్రంలో పడినప్పుడు మేము భయపడము.
3 సముద్రాలు పొంగినను, చీకటితో నిండినను,
భూమి, మరియు పర్వతాలు కంపించినను మేము భయపడము.
4 ఒక నది ఉంది. దాని కాలువలు దేవుని నివాసానికి,
మహోన్నత దేవుని పరిశుద్ధ పట్టణానికి సంతోషం తెచ్చి పెడ్తాయి.
5 ఆ పట్టణంలో దేవుడు ఉన్నాడు. కనుక అది ఎన్నటికీ నాశనం చేయబడదు.
సూర్యోదయానికి ముందే దేవుడు సహాయం చేస్తాడు.
6 రాజ్యాలు భయంతో వణకుతాయి.
యెహోవా గద్దించగా ఆ రాజ్యాలు కూలిపోతాయి. భూమి పగిలిపోతుంది.
7 సర్వశక్తిమంతుడైన యెహోవా మనతో ఉన్నాడు.
యాకోబు దేవుడు మనకు ఆశ్రయం.
8 యెహోవా చేసే మహత్తర కార్యాలు చూడండి.
ఆ కార్యాలు భూమి మీద యెహోవాను ప్రసిద్ధి చేస్తాయి.
9 భూమి మీద ఎక్కడైనా సరే యుద్ధాలను యెహోవా ఆపివేయగలడు.
సైనికుల విల్లులను, వారి ఈటెలను ఆయన విరుగగొట్టగలడు. రథాలను ఆయన అగ్నితో కాల్చివేయగలడు.
10 దేవుడు చెబుతున్నాడు, “మౌనంగా ఉండి, నేను దేవుణ్ణి అని తెలుసుకొనండి.
రాజ్యాలతో నేను స్తుతించబడతాను.
భూమిమీద మహిమపర్చబడతాను.”
11 సర్వశక్తిమంతుడైన యెహోవా మనతో ఉన్నాడు.
యాకోబు దేవుడు మనకు ఆశ్రయం.
సంగీత నాయకునికి: “ఒప్పందం పుష్పాలు” రాగం. ఆసాపు స్తుతి కీర్తన.
80 ఇశ్రాయేలీయుల కాపరీ, నా మాట వినుము.
యోసేపు గొర్రెలను (ప్రజలను) నీవు నడిపించుము.
కెరూబులపై నీవు రాజుగా కూర్చున్నావు. ప్రకాశించుము.
2 ఇశ్రాయేలీయుల కాపరీ, ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షేలకు నీ మహాత్యం చూపించుము.
వచ్చి మమ్మల్ని రక్షించుము.
3 దేవా, మరల మమ్మల్ని స్వీకరించుము.
మేము రక్షించబడునట్లు నీ ముఖాన్ని మా మీద ప్రకాశింపచేయుము.
4 సర్వశక్తిగల యెహోవా దేవా, నీవు మా మీద ఎప్పటికి కోపంగానే ఉంటావా?
మా ప్రార్థనలు నీవు ఎప్పుడు వింటావు?
5 నీవు నీ ప్రజలకు కన్నీళ్లే ఆహారంగా ఇచ్చావు.
నీ ప్రజల కన్నీళ్లతో నిండిన పాత్రలే నీవు నీ ప్రజలకు ఇచ్చావు. అవే వారు తాగుటకు నీళ్లు.
6 మా పొరుగువారు పోరాడుటకు నీవు మమ్మల్ని హేతువుగా ఉండనిచ్చావు.
మా శత్రువులు మమ్మల్ని చూచి నవ్వుచున్నారు.
7 సర్వశక్తిమంతుడవైన దేవా, మరల మమ్మల్ని అంగీకరించుము.
నీ ముఖము మామీద ప్రకాశించునట్లు మమ్మల్ని రక్షించుము.
8 గతకాలంలో నీవు మమ్మల్ని ప్రాముఖ్యమైన మొక్కలా చూశావు.
ఈజిప్టు నుండి నీవు నీ “ద్రాక్షాలత” తీసుకొని వచ్చావు.
ఇతర ప్రజలను ఈ దేశం నుండి నీవు వెళ్లగొట్టావు.
నీ “ద్రాక్షావల్లిని” నీవు నాటుకొన్నావు.
9 “ద్రాక్షావల్లి” ఎదుగుటకు నేలను నీవు సిద్ధం చేశావు.
దాని వేర్లు బలంగా ఎదుగుటకు నీవు సహాయం చేశావు త్వరలోనే “ద్రాక్షావల్లి” దేశం అంతా వ్యాపించింది.
10 అది పర్వతాలను కప్పివేసింది.
దాని ఆకులు మహాదేవదారు వృక్షాలను సహా కప్పివేసాయి.
11 దాని తీగెలు మధ్యధరా సముద్రం వరకు విస్తరించాయి. దాని కొమ్మలు యూఫ్రటీసు నది వరకూ విస్తరించాయి.
12 దేవా, నీ “ద్రాక్షావల్లిని” కాపాడుతున్న గోడను నీవెందుకు పడగొట్టావు?
ఇప్పుడు దారిన పోయే ప్రతిమనిషీ దాని ద్రాక్షాపండ్లను కోసుకొంటున్నాడు.
13 అడవి పందులు వచ్చి నీ “ద్రాక్షావల్లి” మీద నడుస్తాయి.
అడవి మృగాలు వచ్చి ఆకులు తింటాయి.
14 సర్వశక్తిగల దేవా, తిరిగి రమ్ము.
పరలోకం నుండి నీ “ద్రాక్షావల్లిని” చూడుము. దానిని కాపాడుము.
15 దేవా, నీ స్వంత చేతులతో నీవు నాటుకొన్న నీ “ద్రాక్షావల్లిని” చూడుము.
నీవు పెంచిన ఆ లేత మొక్కలను[a] చూడుము.
16 అగ్నితో నీ “ద్రాక్షావల్లి” కాల్చివేయబడింది.
నీవు దానిమీద కోపగించి నీవు దాన్ని నాశనం చేశావు.
17 దేవా, నీ కుడి ప్రక్క నిలిచి ఉన్న నీ కుమారుని ఆదుకొనుము.
నీవు పెంచిన నీ కుమారుని ఆదుకొనుము.
18 అతడు మరల నిన్ను విడువడు.
అతన్ని బ్రదుక నీయుము. అతడు నీ నామాన్ని ఆరాధిస్తాడు.
19 సర్వశక్తిమంతుడవైన యెహోవా, దేవా, తిరిగి మా దగ్గరకు రమ్ము.
నీ ముఖ మహిమను మామీద ప్రకాశించనీయుము. మమ్మల్ని రక్షించుము.
135 యెహోవాను స్తుతించండి.
యెహోవా సేవకులారా, యెహోవా నామాన్ని స్తుతించండి.
2 యెహోవా ఆలయంలో నిలిచి ఉండే ప్రజలారా, ఆయన నామాన్ని స్తుతించండి!
ఆలయ ప్రాంగణంలో నిలబడే ప్రజలారా, ఆయన నామాన్ని స్తుతించండి!
3 యెహోవా మంచివాడు గనుక ఆయనను స్తుతించండి.
యెహోవాను స్తుతించుట ఆనందదాయకం గనుక ఆయన నామాన్ని స్తుతించండి.
4 యెహోవా యాకోబును కోరుతున్నాడు.
యెహోవా ఇశ్రాయేలును తన విశేషమైన సొత్తుగా ఎన్నుకొన్నాడు.
5 యెహోవా గొప్పవాడని నాకు తెలుసు.
మన ప్రభువు ఇతర దేవుళ్లందరికంటె గొప్పవాడు!
6 ఆకాశంలో, భూమి మీద, సముద్రాల్లో,
అగాధపు మహా సముద్రాల్లో యెహోవా ఏది చేయాలనుకొంటే అది చేస్తాడు.
7 భూమికి పైగా మేఘాలను దేవుడు చేస్తాడు.
మెరుపులను, వర్షాన్ని దేవుడు చేస్తాడు.
దేవుడు గాలిని తన నిధిలోనుండి రప్పిస్తాడు.
8 ఈజిప్టు మనుష్యులలో జ్యేష్ఠులందరినీ, జంతువులలో మొదట పుట్టినవాటన్నిటినీ దేవుడు నాశనం చేసాడు.
9 దేవుడు ఈజిప్టులో అనేకమైన ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు చేసాడు.
ఫరోకు, అతని అధికారులకు ఆ సంగతులు సంభవించేలా దేవుడు చేశాడు.
10 దేవుడు అనేక రాజ్యాలను ఓడించాడు.
బలమైన రాజులను దేవుడు చంపేసాడు.
11 అమోరీయుల రాజైన సీహోనును దేవుడు ఓడించాడు.
బాషాను రాజైన ఓగును దేవుడు ఓడించాడు.
కనానులోని జనాంగాలన్నింటినీ దేవుడు ఓడించాడు.
12 వారి దేశాన్ని దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు.
దేవుడు ఆ దేశాన్ని తన ప్రజలకు ఇచ్చాడు.
13 యెహోవా, నీ పేరు శాశ్వతంగా ఖ్యాతి కలిగియుంటుంది.
యెహోవా, ప్రజలు నిన్ను ఎప్పటికీ జ్ఞాపకం చేసుకొంటారు.
14 యెహోవా జనాంగాల్ని శిక్షించాడు.
కాని తన సేవకుల యెడల దయ చూపించాడు.
15 ఇతర మనుష్యుల దేవుళ్లు కేవలం వెండి, బంగారు విగ్రహాలే.
వారి దేవుళ్లు కేవలం మనుష్యులు చేసిన విగ్రహాలే.
16 ఆ విగ్రహాలకు నోళ్లు ఉన్నాయి. కాని అవి మాట్లాడలేవు.
కళ్లు వున్నాయి కాని అవి చూడలేవు.
17 ఆ విగ్రహాలకు చెవులు ఉన్నాయి కాని అవి వినలేవు.
ముక్కులు ఉన్నాయి కాని అవి వాసన చూడలేవు.
18 మరియు ఆ విగ్రహాలను తయారు చేసిన మనుష్యులు సరిగ్గా ఆ విగ్రహాల్లాగానే అవుతారు.
ఎందుకంటే వారికి సహాయం చేయాలని వారు ఆ విగ్రహాల మీదనే నమ్మకముంచారు.
19 ఇశ్రాయేలు వంశమా, యెహోవాను స్తుతించు!
అహరోను వంశమా, యెహోవాను స్తుతించు.
20 లేవీ వంశమా, యెహోవాను స్తుతించు!
యెహోవాను ఆరాధించే ప్రజలారా, యెహోవాను స్తుతించండి.
21 సీయోనులో నుండి, తన నివాసమైన యెరూషలేములో నుండి,
యెహోవా స్తుతించబడును గాక!
యెహోవాను స్తుతించండి!
© 1997 Bible League International