Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
1 రాజులు 5-6

సొలొమోను, హీరాము

హీరాము అనునతను తూరు దేశానికి రాజు. అతను దావీదుకు చిరకాల స్నేహితుడు. దావీదు స్థానంలో సొలొమోను రాజ్యానికి వచ్చాడని విన్న హీరాము తన సేవకులను సొలొమోను వద్దకు పంపాడు. సొలొమోను వారిద్వారా రాజైన హీరాముకు ఇలా చెప్పి పంపాడు:

“నా తండ్రియగు రాజైన దావీదు చుట్టుప్రక్కల రాజ్యాల వారితో అనేక యుద్ధాలు చేసినట్లు నీకు తెలుసు. అందువల్ల యెహోవాయగు తన దేవుని ఘనపరిచేలా ఒక దేవాలయం నిర్మించ లేకపోయాడు. తన శత్రువులందరినీ యెహోవా తాను ఓడించేలా చేసే వరకు రాజైన దావీదు వేచివున్నాడు. కాని ఇప్పుడు యెహోవా దేవుడు నా రాజ్యం నలుమూలలా శాంతి నెలకొనేలా చేశాడు. ప్రస్తుతం నాకు శత్రువులు లేరు. నా ప్రజలు నిర్భయంగా వున్నారు.

“యెహోవా నా తండ్రియగు దావీదుకు ఒక మాట ఇచ్చాడు. యెహోవా ఇలా అన్నాడు, ‘నీ తరువాత నీ కుమారుని రాజును చేస్తాను. నీ కుమారుడు నా పట్ల గౌరవ సూచకంగా ఒక దేవాలయం నిర్మిస్తాడు.’ కావున ఇప్పుడు నా యెహోవా దేవునికి ఘనంగా ఒక దేవాలయం నిర్మింపజేస్తున్నాను. అందువల్ల ఈ విషయంలో నీ సహాయం కోరుతున్నాను. నీ మనుష్యులను లెబానోనుకు పంపించు. వారక్కడ నా కొరకు దేవదారు వృక్షాలను పడగొట్టాలి. నా పనివాళ్లు నీ పనివారితో కలిసి పని చేస్తారు. నీ పనివాళ్లకు వేతనంగా నీవు ఎంత నిర్ణయిస్తే అది నేను చెల్లిస్తాను. కాని నీ సహాయం మాత్రం నాకు కావాలి. మా వడ్రంగులు[a] సీదోను వడ్రంగులకు సాటిరారు.”

సొలొమోను అడిగినదంతా విన్న హీరాము చాలా సంతోషపడ్డాడు. “ఆ మహా సామ్రాజ్యానికి రాజుగా వ్యవహరించటానికి దావీదుకు ప్రజ్ఞాశాలియైన కుమారుని ప్రసాదించినందుకు దేవునికి ఈ రోజు నమస్కరిస్తున్నాను!” అని రాజైన హీరాము అన్నాడు. అప్పుడు హీరాము ఒక సమాచారాన్ని సొలొమోనుకు యిలా పంపాడు:

“నీవు అడిగిన విషయాలన్నీ నేను విన్నాను. నీవు కోరినన్ని దేవదారు వృక్షాలను, సరళపు చెట్లను నీకు యిస్తాను. నా పనివాళ్లు ఆ దూలాలన్నిటినీ లెబానోను నుండి సముద్రతీరానికి చేరవేస్తారు. వాటిని నేను తెప్పలుగా కట్టించి సముద్రంలో వేయించి నీవు కోరిన స్థలానికి చేరేలా చేస్తాను. అక్కడ ఆ దూలాలను విడివిడిగా తీస్తాను. వాటిని నీవు తీసుకోవచ్చు. ఈ సందర్భంగా నీవు నా మాట మన్నించి నా రాజకుటుంబ పోషణకు తగిన ఆహార పదార్థాలను సమకూర్చుతావని ఆశిస్తున్నాను.”

10 ఆ విధంగా హీరాము దేవదారు, సరళపు చెట్ల కలపను సొలొమోనుకు సరఫరా చేయసాగాడు.

11 సొలొమోను కూడ హీరాముకు అతని ఇంటి వారి పోషణకు రెండు లక్షల తూముల గోధుమలు, మూడు వేల ఎనిమిది వందల[b] పడుల స్వచ్ఛమైన ఒలీవ నూనెను ప్రతియేటా పంపాడు.

12 యెహోవా చేసిన వాగ్దానం ప్రకారం ఆయన సొలొమోనుకు గొప్ప జ్ఞానాన్ని కలుగజేశాడు. హీరాము, సొలొమోనుల మధ్య శాంతి, సామరస్యాలు నెలకొన్నాయి. ఆ ఇద్దరు రాజులు ఒక ఒడంబడిక చేసుకున్నారు.

13 రాజైన సొలొమోను ముప్పదివేల మంది ఇశ్రాయేలీయులను ఈ పనిలో సహాయపడటానికి బలవంతంగా కూలిపనికి చేర్చుకున్నాడు. 14 వీరిపై అధికారిగా అదోనీరాము అను వానిని రాజైన సొలొమోను నియమించాడు. సొలొమోను వారిని మూడు జట్లుగా విభజించాడు. ప్రతి జట్టులోను పదివేల మంది వున్నారు. ప్రతి జట్టు లెబానోనులో ఒక నెలపాటు పనిచేసి, రెండు నెలలు ఇంటివద్ద ఉండేవారు. 15 సొలొమోను ఎనుబది వేల మందిని కొండ ప్రాంతంలో పనిచేయటానికి బలవంతపర్చాడు. వీరు రాళ్లు కొట్టి చెక్కాలి. కొట్టిన రాళ్లను చేరవేయటానికి డెబ్బది వేల మంది వున్నారు. 16 ఈ పని చేసే వారిపై పర్యవేక్షణకై మూడు వేల మూడు వందల మంది నియమితులయ్యారు. 17 రాజైన సొలొమోను దేవాలయ పునాదులకు పనికి వచ్చే విలువైన పెద్ద బండలు చెక్కమని పనివారికి ఆజ్ఞ ఇచ్చాడు. ఈ రాళ్లు అతి నేర్పుగా కొట్టబడేవి. 18 సొలొమోను యొక్క, హీరాము యొక్క శిల్పులు, మరియు బిబ్లోసు[c] నుండి వచ్చన వారును రాళ్లను చెక్కారు. ఈ కట్టడపు పనివారంతా రాళ్లను, దూలాలను, దేవాలయ నిర్మాణానికి తయారు చేశారు.

సొలొమోనుచే దేవాలయ నిర్మాణం

ఆ విధంగా సొలొమోను దేవాలయ నిర్మాణం మొదలుపెట్టాడు. ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టులో నుండి వచ్చిన నాలుగు వందల ఎనభై సంవత్సరాల తరువాత ఇది జరిగింది. అంతేగాకుండా ఇది రాజైన సొలొమోను ఇశ్రాయేలుపై రాజ్యాధిపత్యం వహించిన నాలుగవ సంవత్సరం. ఆ సంవత్సరంలో అది జీవ్ అను రెండవ నెల. దేవాలయం పొడవు తొమ్మిది అడుగులు[d] వెడల్పు ముప్పై అడుగులు[e] దాని ఎత్తు నలుబది ఐదు అడుగులు.[f] దేవాలయపు ముఖమండపం పొడవు ముప్పై అడుగులు; వెడల్పు పదిహేను అడుగులు. ఈ మండపం ప్రధాన దేవాలయానికి ముంగిటనే వున్నది. దీని పొడవు దేవాలయం యొక్క వెడల్పుకు సమానంగా వుంది. దేవాలయంలో ఇరుకైన కిటికీలు వున్నాయి. ఈ కిటికీలు చూడటానికి బయటి నుండి ఇరుకుగాను, లోపలి వైపు విశాలంగాను[g] వున్నాయి. పిమ్మట ప్రధాన దేవాలయం గోడల నానుకొని కొన్ని గదులను సొలొమోను కట్టించాడు. ఈ గదులు ఒకదాని మీద ఒకటిగా నిర్మింపబడ్డాయి. కింది అంతస్తులో ఉన్న గదుల వెడల్పు ఏడున్నర అడుగులు[h] మధ్య అంతస్తులో గదుల వెడల్పు తొమ్మిది అడుగులు[i] దాని పైగదుల వెడల్పు పదిన్నర అడుగులు[j] గదులకు ఒక పక్క గోడగా వున్న దేవాలయం గోడ, కింద గదుల గోడకన్న మందము తక్కవ. గదులన్నీ ఆ గోడకు ఆనుకొని కట్టబడినా, వాటి ముఖ్య దూలాలు గోడలోకి చొచ్చుకొని పోకుండా ఆధార శిలలపై పెట్టబడ్డాయి. ఈ దేవాలయ నిర్మాణానికి ఉపయోగించిన రాళ్లన్నీ అవి తీయబడిన గనుల వద్దనే కావలసిన రీతిలో శిల్పులచే చెక్కబడి, మలచబడినందున నిర్మాణ స్థలంలో సుత్తులు, గొడ్డళ్లు, తదితర పనిముట్లు వాడిన శబ్దం వినరాలేదు.

దేవాలయం పక్కగా కట్టిన కింది గదులకు ప్రవేశ మార్గం దక్షిణ భాగాన వున్నది. రెండవ అంతస్తుకు వెళ్లటానికి, అక్కడి నుండి మూడవ అంతస్తు గదులకు వెళ్లటానికి మెట్ల మార్గాలు ఏర్పాటు చేయబడ్డాయి.

దేవాలయపు పైకప్పును దూలాలతోను, దేవదారు చెక్కలతోను సొలొమోను నిర్మింపజేశాడు. ఆ విధంగా సొలొమోను దేవాలయ నిర్మాణం పూర్తి చేశాడు. 10 దేవాలయం పక్కనున్న కింది అంతస్తు పని కూడా పూర్తి చేశాడు. అది ఏడున్నర అడుగుల ఎత్తు వుంది. అది దేవదారు దూలాలతో దేవాలయానికి జత చేర్చ బడివుంది.

11 సొలొమోనుతో యెహోవా ఇలా అన్నాడు: 12 “నీవు నా న్యాయ సూత్రాలను, ఆజ్ఞలను పాటించి నట్లయితే నీ తండ్రియగు దావీదుకు నీ గురించి నేను చేసిన వాగ్దానం నెరవేర్చుతాను. 13 నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మధ్య నీవు నిర్మించే ఈ దేవాలయంలో నేను నివసిస్తాను. నేను ఇశ్రాయేలు ప్రజలను ఎన్నటికి విడనాడను.”

14 సొలొమోను దేవాలయ నిర్మాణం పూర్తి చేశాడు. 15 దేవాలయపు లోపలి పక్క గోడలకు దేవదారు బల్లలు అమర్చబడ్డాయి. కింది నేల భాగం సరళపు మ్రాను చెక్కలతో కప్పబడింది. 16 ముప్పై అడుగుల పొడవు గల ఒక గది దేవాలయానికి వెనుకగా కట్టబడింది. కింది నుంచి కప్పు వరకు అమర్చబడిన దేవదారు చెక్కల పనితనంతో ఈ గది దేవాలయం నుండి వేరు చేయబడింది. ఈ గదికి అతి పవిత్ర స్థలమని పేరు. 17 ఈ మిక్కిలి పరిశుద్ధ స్థలం ముందున్నగది అరువది అడుగుల పొడవు గలిగివున్నది. 18 ఆ దేవదారు చెక్కలపై వికసించిన పువ్వులు, సొర తీగలు[k] మనోహరంగా చెక్కబడ్డాయి. ఆ గది లోపలి భాగమంతా దేవదారు పలకలతో కప్పబడింది. అందువల్ల ఎవ్వరూ గోడ రాళ్లను చూడలేరు.

19 ఆలయ ప్రాంగణానికి వెనుక వున్న ఈ అతి పరిశుద్ధ స్థలము దేవుని ఒడంబడిక పెట్టె వుంచటానికి నిర్మింపబడింది. 20 ఈ అతి పరిశుద్ధ స్థలము ముప్పై అడుగుల పొడవు, ముప్పై అడుగుల వెడల్పు ముప్పై అడుగుల ఎత్తు కలిగివుంది. 21 సొలొమోను ఈ అతి పరిశుద్ధ స్థలము లోపలి భాగమంతా శుద్ధ బంగారంతో పొదిగించాడు. ఈ గదికి ముందు బంగారంతో పొదగబడిన ఒక బలిపీఠం నిర్మించబడింది. దాని చుట్టూ బంగారు గొలుసులు చుట్టబడ్డాయి. కెరూబులు రెండూ బంగారు రేకులతో కప్పబడ్డాయి. 22 దేవాలయం మొత్తం బంగారంతో పొదగబడింది. అతి పరిశుద్ధ స్థలము వద్దగల పీఠం కూడా బంగారంతో పొదగబడింది.

23 పనివారు కెరూబులను రెక్కలతో తయారు చేశారు. అవి ఒలీవ కర్రతో చేయబడ్డాయి. ఈ కెరూబులను అతి పరిశుద్ధ స్థలములో వుంచారు. ప్రతి ఒక్క దేవదూత పదిహేను అడుగుల పొడవు వున్నది. 24-26 రెండు కెరూబులు ఒకే పరిమాణంలో, ఒకే రకంగా నిర్మించబడ్డాయి. ప్రతి కెరూబుకీ రెండు రెక్కలున్నాయి. ప్రతి రెక్క ఏడున్నర అడుగుల పొడవుంది. ఒక రెక్క చివరి నుండి మరో రెక్క చివరి వరకు గల మధ్య దూరం పదిహేను అడుగులు. ప్రతి కెరూబు పదిహేను అడుగుల పొడవులో మలచబడింది. 27 ఈ కెరూబులు అతి పరిశుద్ధ స్థలములో పక్కపక్కన నిలబెట్టబడ్డాయి. గది మధ్యలో వారి రెక్కలు ఒక దానితో ఒకటి కలిశాయి. మిగిలిన రెండు రెక్కలు ఆ పక్కగోడ నొకటి ఈ పక్క గోడ నొకటి ఆనుకొని వున్నాయి. 28 రెండు కెరూబులు బంగారంతో పొదగబడ్డాయి.

29 అతి పరిశుద్ధ స్థలము చుట్టూవున్న గోడల మీద, లోపల గదుల గొడల మీద కెరూబులు, తమాల వృక్షాలు, పువ్వులు చిత్రీకరింపబడ్డాయి. 30 అతి పరిశుద్ధ స్థలము, దేవాలయ ప్రాంగణ గది నేలలు బంగారు రేకులతో కప్పబడ్డాయి.

31 అతి పరిశుద్ధ స్థలానికి తలుపులు ఏర్పరచ బడ్డాయి. ఆ తలుపులు ఒలీవ కర్రతో చేయబడ్డాయి. తలుపు ఐదు రకాలుగా[l] తిరిగే విధంగా ఐదు ముఖముల నిలువు కమ్మికి అమర్చబడింది. 32 రెండు తలుపులూ ఒలీవ కర్రతో చేయబడినవే. తలుపుల మీద కెరూబుల, తమల వృక్షాల, పువ్వుల చిత్రాలు మలచబడ్డాయి. తలుపులు బంగారంతో పొదగబడ్డాయి.

33 ప్రధాన గది ద్వారానికి ఒలీవ కర్రతో చేయబడిన చదరపు తలుపు అమర్చబడింది. 34 దాని రెండు తలుపులు సరళపు చెక్కలతో చేయబడ్డాయి. 35 ప్రతి తలుపూ రెండు భాగాలుగా చేయబడింది. దానివల్ల రెండేసి భాగాలు మూయటానికి వీలవుతుంది. తలుపుల మీద కెరూబులు, తమాల వృక్షాలు, పూవులు చెక్క బడ్డాయి. ఈ చెక్కడాలన్నిటి పైన బంగారు పూత వేయబడింది.

36 తరువాత లోపలి ఆవరణం సిద్ధం చేయబడింది. పెరడు చుట్టూ గోడ నిర్మాణం జరిగింది. ఈ గోడలు చెక్కిన మూడు రాళ్ల వరుసతో నిర్మింపబడి, వాటికి ఒక వరుసలో దేవదారు చెక్క అమర్చబడింది.

37 ఆ సంవత్సరంలో దేవాలయ నిర్మాణం పని రెండవ నెలలో ప్రారంభించబడింది. ఆ నెల పేరు జీవ్. అది సొలొమోను ఇశ్రాయేలును పాలించటం మొదలు పెట్టిన పిమ్మట నాలుగవ సంవత్సరం. 38 సొలొమోను పాలన పదకొండు సంవత్సరాలు సాగేనాటికి దేవాలయ నిర్మాణం పూర్తయింది. పూర్తి అయ్యేనాటికి ఆ సంవత్సరంలో బూలు అనే ఎనిమిదవ నెల జరుగుతూ వుంది. దేవాలయ నిర్మాణం పథకం ప్రకారం పూర్తయింది. దేవాలయ నిర్మాణ పరిసమాప్తికి సొలొమోను ఏడు సంత్సరాలు కృషి చేశాడు.

2 దినవృత్తాంతములు 2-3

ఆలయ, రాజగృహ నిర్మాణానికి సొలొమోను యత్నం

యెహోవా పేరు ఘనపర్చబడేలా ఆలయ నిర్మాణానికి సొలొమోను సన్నాహం చేశాడు. తన కొరకై ఒక రాజభవనాన్ని కూడ నిర్మించుకోవాలని సొలొమోను తలంచాడు. సొలొమోను డెబ్బైవేల మందిని సరుకు చేరవేయటానికి నియమించాడు. ఎనబైవేల మందిని కొండల్లో రాళ్లు కొట్టడానికి అతడు నియమించాడు. పనివాళ్ల మీద నిఘావుంచడానికి మూడువేల ఆరువందల మందిని నియమించాడు.

తరువాత సొలొమోను హీరాముకు ఒక వర్తమానం పంపాడు. హీరాము తూరు నగరపు రాజు. సొలొమోను హీరాముకు యిలా చెప్పి పంపాడు:

“నీవు నా తండ్రి దావీదుకు సహాయపడినట్లు నాకు కూడ సహాయం చెయ్యి. తను నివసించే భవన నిర్మాణానికి నీవాయనకు సరళ వృక్షాల కలపను పంపావు. నా దేవుడైన యెహోవా గౌరవార్థం నేనొక ఆలయం నిర్మింపదలిచాను. నా ప్రజలు ఆరాధించుకొనటానికి వీలుగా దానిని నా దేవునికి అంకితం చేస్తాను. యెహోవా ముందు ధూపం వేసి, ఆయన సన్నిధిని ప్రతినిత్యం పవిత్రమైన రొట్టెను నైవేద్యంగా వుంచి, బలిపీఠంపై ఉదయం, సాయంత్రం దహనబలులు అర్పిస్తూ, మేము మా దేవుని ఆరాధిస్తాము. సబ్బాతు దినాలలోను, అమావాస్య రోజులందును, మరి ఇతర ప్రత్యేక ఉత్సవ దినాలలోను, తనను ఆరాధించుమని మా దేవుడైన యెహోవా మాకు ఆజ్ఞ యిచ్చాడు. ఇది ఇశ్రాయేలు ప్రజలు శాశ్వతంగా పాటించే ఒక నియమం.

“మా దేవుడు మిగిలిన దైవాలకంటె మహోన్నతుడు గనుక, ఆయనకు నేను నిర్మించే ఆలయం కూడా ఉన్నతంగా ఉంటుంది. నిజానికి మానవ మాత్రుడెవ్వడూ మా దేవునికి ఆలయం నిర్మించలేడు. పరలోక భూలోకాలే మా దేవునికి నిలయాలు కాలేనప్పుడు, నేను ఆయనకు ఆలయం నిర్మాణం చేయలేను. నేను కేవలం ఆయన సన్నిధిని ధూపం వేయటానికి ఒక పీఠం మాత్రమే నిర్మించగలను.

“కావున వెండి బంగారు పనులలోను; కంచు, ఇనుము పనులలోను నేర్పరియైన ఒక పనివానిని ఇప్పుడు నా వద్దకు పంపించు. అతడు ఊదా, నీలిరంగు తెరల పనిలో కూడా నేర్పరియై ఉండాలి. నావద్ద వున్న యూదా, యెరూషలేము శిల్పులతో కలిసి అతడు చెక్కడపు పనులు చేయగలిగి ఉండాలి. నా తండ్రియగు దావీదు ఇక్కడ ఈ మనుష్యులను ఎంపిక చేశాడు. సరళ వృక్షాల, దేవదారు వృక్షాల, చందనపు చెట్ల కలపను లెబానోను అడవుల నుండి పంపించు. లెబానోనులో చెట్లను కొట్టడంలో నీ మనుష్యులు అనుభవం కలవారని నాకు తెలుసు. నా సేవకులు నీ మనుష్యులకు సహాయపడతారు. సాధ్యమైనంత ఎక్కువ కలపను నాకు పంపించు. నేను నిర్మించబోయే ఆలయం చాల గొప్పదై, అద్భుతమైనదిగా వుంటుంది. 10 కలప నరికే పనివారికి ఆహారం నిమిత్తం నేను నాలుగు వందల గరిసెల[a] గోధుములు, నాలుగు వందల గరిసెల యవలు, ఒక లక్షా పదిహేను వేల గేలనుల (మూడు వేల ఎనిమిది వందల పడులు లేక ఇరువది వేల బాదులు) ద్రాక్షారసమును, అదే పరిమాణములో నూనెను కేటాయిస్తున్నాను.”

11 సొలొమోనుకు సమాధానమిస్తూ, హీరాము ఒక వర్తమానాన్ని పంపాడు. ఆ వర్తమానం ఇలా వుంది:

“సొలొమోనూ, యెహోవా తన ప్రజలను ప్రేమిస్తున్నాడు. అందువల్లనే ఆయన నిన్ను వారికి రాజుగా నియమించాడు.” 12 హీరాము తన సందేశంలో ఇంకా యిలా అన్నాడు: “ఇశ్రాయేలు దేవుడగు యెహోవాకు స్తోత్రం చేయండి! ఆయన ఆకాశాన్ని, భూమిని సృష్టించాడు. ఆయన రాజైన దావీదుకు ఒక తెలివైన కుమారుని ప్రసాదించాడు. సొలొమోనూ, నీకు తెలివి, అవగాహన వున్నాయి. నీవు యెహోవా కోసం ఒక ఆలయాన్ని నిర్మిస్తున్నావు. నీకొరకు నీవొక రాజభవనాన్ని కూడా నిర్మింప తలపెట్టావు. 13 నేను నీ వద్దకు ఒక నైపుణ్యంగల పనివానిని పంపుతాను. అతడు రకరకాల కళలలో అభిరుచి, అనుభవం వున్నవాడు. అతని పేరు హూరాము అబీ. 14 అతని తల్లి దాను వంశస్థురాలు. అతని తండ్రి తూరు నగరవాసి. హూరాము – అబీ బంగారం, వెండి, కంచు, ఇనుము, రాతి, కలప పనులలో బహు నేర్పరి. హూరాము – అబీ ఊదా, నీలి, ఎర్రపు రంగుల వస్తువుల, ఖరీదైన వస్త్రాల పనులలో కూడ మంచి నేర్పరి. పైగా హూరాము – అబీ చెక్కడపు పనులలో కూడా నిపుణుడు. నీవు చూపిన ఏ నమూనానైనా అతడు అర్థం చేసికొని దాని ప్రకారం పనిచేయగల నేర్పరి. అతడు నీ వద్ద వున్న శిల్పులకు, కళాకారులకు సహాయకారిగా వుంటాడు. దావీదు ఏర్పరచిన కళాకారులకు కూడ సహాయపడతాడు. నీ తండ్రియగు దావీదు మాటను నేను అనుసరిస్తాను.

15 “నీవు గోధుమలు, యవలు, నూనె, ద్రాక్షారసం నాకు పంపుతానని వ్రాశావు. వాటిని నా పనివాళ్ల నిమిత్తం పంపించు. 16 లెబానోను దేశంలో మేము కలప నరుకుతాము. నీకు ఎంత కలప కావాలో అంత కలప నరుకుతాము. ఆ కలపనంతా తెప్పలుగా కట్టి యొప్పె పట్టణం మీదుగా సముద్రం మీద పంపుతాము. తరువాత ఆ కలపను నీవు యెరూషలేముకు బండ్లమీద మోయించవచ్చు.”

17 అప్పుడు సొలొమోను ఇశ్రాయేలులో నివసిస్తున్న విదేశీయులందరినీ లెక్కించాడు. ఇది దావీదు జనాభా లెక్కలు తీయించిన తరువాత జరిగింది. దావీదు సొలొమోను తండ్రి. దేశంలో ఒక లక్షా ఏబై మూడువేల ఆరువందల మంది పరదేశీయులున్నట్లు వారు కనుగొన్నారు. 18 బరువులు మోయటానికి డెబ్బై వేలమంది విదేశీయులను సొలొమోను నియమించాడు. కొండల్లో రాళ్లు చెక్కటానికి ఎనబై వేల మంది విదేశీయులను దావీదు నియమించాడు. పనివారిపై విచారణ చేయడానికి మరి మూడువేల ఆరువందల విదేశీయులను సొలొమోను ఎంపిక చేశాడు.

సొలొమోను ఆలయాన్ని నిర్మించటం

యెరూషలేములో మోరీయా పర్వతం మీద సొలొమోను ఆలయ నిర్మాణం మొదలు పెట్టాడు. ఈ మోరీయా పర్వతం మీదే సొలొమోను తండ్రియైన దావీదుకు యెహోవా ప్రత్యక్షమయ్యాడు. దావీదు సిద్ధపర్చిన స్థలంలోనే సొలొమోను ఆలయాన్ని నిర్మించాడు. ఈ స్థలం ఒర్నానుకు చెందిన నూర్పిడి కళ్లంవద్ద వుంది. ఒర్నాను యెబూసీయుడు. తన పాలన ఇశ్రాయేలులో నాల్గవ సంవత్సరం రెండవ నెల జరుగుతూ వుండగా సొలొమోను ఆలయ నిర్మాణం చేపట్టాడు.

ఆలయ నిర్మాణ విషయంలో సొలొమోనుకు కొలతలు యివ్వబడ్డాయి: దాని పునాది తొంబై అడుగుల (అరవై మూరలు) పొడవు: ముప్పై అడుగుల (ఇరవై మూరలు) వెడల్పు. ఆలయ కొలతలు తీసుకొన్నుప్పుడు. సొలొమోను పాత మూర కొలతనే అనుసరించాడు. ఆలయ మండపం పొడవు ముప్పై అడుగులు; ఎత్తు ముప్పై అడుగులు. అతడు మండపము యొక్క లోపలి భాగమంతా మేలిమి బంగారంతో పొదిగించాడు. పెద్దగది గోడల మీద తమాల వృక్షముల (ఖర్జూరపు చెట్లు) చెక్కలు అమర్చాడు. ఆ తమాల వృక్షపు చెక్కలమీద మేలిమి బంగారపు రేకులు తాపించాడు. ఈ బంగారపు రేకుల మీద ఖర్జూరపు చెట్ల బొమ్మలు చెక్కించి గొలుసుల నగిషీ పని చేయించాడు. ఆలయంలో అందం ఇనుమడించే విధంగా విలువైన రత్నాలు పొదిగించాడు. పర్వయీము నుండి తెచ్చిన బంగారాన్ని ఈ పనికి వినియోగించాడు. (అక్కడ బంగారం విస్తారంగా లభించేది. బహుశః ఆ ప్రదేశం ఓఫీరు దేశంలో ఉండి వుండవచ్చు). ఆలయపు లోపలి భాగాన్నంతా బంగారు రేకులతో కప్పించాడు. పై కప్పు దూలాలకు దర్వాజాలకు, గోడలకు, తలుపులకు సొలొమోను బంగారు పూత వేయించాడు. గోడల మీద దేవదూతల (కెరూబులు) చిత్రాలు చెక్కించాడు.

తరువాత సొలొమోను అతి పవిత్ర స్థలం[b] ఏర్పాటు చేశాడు. అతి పవిత్ర స్థలం పొడవు ముప్పై అడుగులు; వెడల్పు ముప్పై అడుగులు. ఆలయం వెడల్పంత వెడల్పు దీనికి కూడ వుంది. అతి పవిత్ర స్థలం గోడల నిండా మేలిమి బంగారు రేకులు వేయించాడు. ఈ బంగారపు బరువు ఇరవై మూడు టన్నులు (ఆరువందల తలాంతులు). బంగారపు మేకుల తూకము ఏబై తులాలు. (ఇంచుమించు ఒకటింపావు పౌనులు). పై గదులకు బంగారు పూత వేయించాడు. 10 రెండు కెరూబుల బొమ్మలు అతి పరిశుద్ధ స్థలంలో పెట్టించటానికి చేయించాడు. పనివారు ఆ కెరూబుల బొమ్మలకు బంగారు తొడుగు వేశారు. 11 ఆ కెరూబుల ప్రతిదాని రెక్క పొడవు ఏడున్నర అడుగులు ఉంది. ఆ రెండు కెరూబుల నాలుగు రెక్కల పొడవు ముప్పై అడుగులు. మొదటి కెరూబు ఒక రెక్క ఒక పక్క గోడకు ఆనుకొని వుంటుంది. రెండవ రెక్క రెండవ కెరూబు రెక్కకు తగులుతూ వుంటుంది. 12 రెండవ కెరూబు ఒక రెక్క గది గోడకు రెండవ వైపున ఆనుతుంది. 13 రెండు కెరూబుల రెక్కలు మొత్తం ముప్పై అడగుల దూరం వ్యాపించి వుంటాయి. దేవదూతల బొమ్మలు అతి పరిశుద్ధ స్థలంలోకి చూస్తున్నట్లు నిలబడి వుంటాయి.

14 నీలం, ఊదా, ఎరుపు బట్టలతోను, ఖరీదైన పట్టుతోను సొలొమోను తెరలు[c] చేయించాడు. ఈ తెరల మీద కూడ కెరూబుల చిత్రాలు చిత్రించాడు.

15 ఆలయం ముందు రెండు స్తంభాలను ఏర్పాటు చేయించాడు. ఒక్కొక్క స్తంభం ఏబై రెండున్నర అడుగుల (ముప్పైయైదు మూరలు) ఎత్తు వుంటుంది. ఒక్కొక్క స్తంభం యొక్క శిఖరంమీది పీట యెత్తు ఏడున్నర అడుగులు. 16 కంఠాహారం లాంటి గొలుసులను సొలొమోను చేయించాడు. ఆ గొలుసులను స్తంభాల మీద పీటలకు అలంకరించాడు. వంద దానిమ్మ కాయల బొమ్మలు చేయించి గొలుసులకు తగిలించాడు. 17 ఇలా అలంకరించిన స్తంభాలను సొలొమోను ఆలయం ముందు నిలిపాడు. ఒక స్తంభం కుడి ప్రక్క, రెండవ స్తంభం ఎడమ ప్రక్కన నిలిపారు. సొలొమోను కుడి ప్రక్క స్తంభానికి “యాకీను”[d] అని పేరు పెట్టాడు. ఎడమ ప్రక్క స్తంభానికి “బోయజు”[e] అని పేరు పెట్టాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International