Chronological
స్త్రీ, ఘటసర్పం
12 పరలోకంలో ఒక గొప్ప అద్భుతమైన దృశ్యం కనిపించింది. సూర్యుణ్ణి తన వస్త్రంగా, చంద్రుణ్ణి తన పాదాల క్రింద, పన్నెండు నక్షత్రాల కిరీటాన్ని తలపై పెట్టుకొన్న ఒక స్త్రీ కనిపించింది. 2 ఆమె గర్భంతో ఉంది. ప్రసవించే సమయం రావటంవల్ల ఆమె నొప్పులతో బిగ్గరగా కేక వేసింది.
3 అప్పుడు పరలోకంలో ఇంకొక దృశ్యం కనిపించింది. ఒక పెద్ద ఘటసర్పం, ఏడు తలలతో, పది కొమ్ములతో కనిపించింది. అది ఎర్రగా ఉంది. ఆ ఏడు తలలమీద ఏడు కిరీటాలు ఉన్నాయి. 4 ఆ ఘటసర్పం తన తోకతో ఆకాశం నుండి నక్షత్రాలలో మూడవభాగాన్ని ఊడ్చి, వాటిని భూమ్మీదికి పారవేసింది. ఆ స్త్రీ ప్రసవించిన వెంటనే ఆ శిశువును మ్రింగి వేద్దామని, ఆ ఘటసర్పం ప్రసవించబోయే ఆ స్త్రీ ముందు నిలబడివుంది.
5 ఆమె ఒక మగ శిశువును ప్రసవించింది. ఆ బాలుడు దేశాలను గొప్ప అధికారంతో పాలిస్తాడు. ఆ శిశువు ఎత్తబడి దేవుని సింహాసనం దగ్గరకు తీసుకు వెళ్ళబడ్డాడు. 6 ఆ స్త్రీ ఎడారి ప్రాంతానికి పారిపోయింది. ఆమెను పన్నెండువందల అరువది రోజుల దాకా జాగ్రత్తగా చూసుకోవటానికి దేవుడు ఒక స్థలం ఏర్పాటు చేశాడు.
7 పరలోకంలో ఒక యుద్ధం జరిగింది. మిఖాయేలు, అతని దూతలు ఘటసర్పంతో యుద్ధం చేసారు. ఘటసర్పం తన దూతలతో తిరిగి యుద్ధం చేసింది. 8 ఆ ఘటసర్పానికి తగినంత శక్తి ఉండనందువల్ల ఓడిపోయి పరలోకంలో వాటి స్థానాన్ని పోగొట్టుకొన్నాయి. 9 వాళ్ళు ఆ ఘటసర్పాన్ని భూమ్మీదికి త్రోసి వేశారు. ఇది ప్రపంచాన్ని తప్పుదారి పట్టించే ఆది సర్పం. చాలాకాలం నుండి ఉన్న ఈ ఘటసర్పానికి దయ్యమని, సాతాను అని పేరు. ఆ ఘటసర్పాన్ని, దాని దూతల్ని వాళ్ళు క్రిందికి త్రోసివేశారు.
10 పరలోకం నుండి ఒక పెద్ద స్వరం బిగ్గరగా యిలా అనటం విన్నాను: “మనదేవుని ముందు మన సోదరుల్ని రాత్రింబగళ్ళు నిందించే వాడు క్రిందికి త్రోసివేయబడ్డాడు. అందుకే మన దేవుని రాజ్యం వచ్చింది. రక్షణ శక్తి లభించింది. ఆయన క్రీస్తుకు అధికారం వచ్చింది. 11 గొఱ్ఱెపిల్ల రక్తంతో, తాము బోధించిన సత్యంతో మన సోదరులు వాణ్ణి ఓడించారు. వాళ్ళు తమ జీవితాల్ని, చావుకు భయపడేటంతగా ప్రేమించ లేదు. 12 కనుక పరలోకమా! ఆనందించు. పరలోకంలో ఉన్నవారలారా! ఆనందించండి. ప్రపంచమా! నీలో సాతాను ప్రవేశించాడు కనుక నీకు శాపం కలుగుతుంది! సముద్రమా! నీకు శాపం కలుగుతుంది! సాతానుకు తన కాలం తీరిందని తెలుసు. కనుక వాడు చాలా కోపంతో ఉన్నాడు.”
13 ఘటసర్పం తాను భూమ్మీదకు విసిరివేయబడటం గమనించి మగ శిశువును ప్రసవించిన స్త్రీని వెంటాడింది. 14 ఆమెకోసం ఎడారి ప్రాంతంలో ఏర్పాటు చేయబడిన స్థలానికి ఆమె ఎగిరి పోవటానికి, దేవుడు ఆమెకు రెండు పక్షిరాజు రెక్కల్ని యిచ్చాడు. అక్కడ ఆ ఘటసర్పానికి దూరంగా ఆమె మూడున్నర సంవత్సరాలు జాగ్రత్తగా పోషించబడుతుంది. 15 ఆ సర్పం తన నోటినుండి నీళ్ళను వదిలింది. ఆ నీళ్ళు ఒక నదిలా ప్రవహించాయి. ఆ నీళ్ళు ఆమెను కొట్టుకు పోయేటట్లు చేయాలని ఆ ఘటసర్పం ప్రయత్నించింది. 16 కాని భూమి తన నోరు తెరిచి ఘటసర్పం కక్కిన నీటిని త్రాగి ఆ స్త్రీని రక్షించింది. 17 ఆ స్త్రీని చూసి ఘటసర్పానికి చాలా కోపం వచ్చింది. అది ఆమె యొక్క మిగతా సంతానంతో యుద్ధం చేయాలని వెళ్ళింది. దేవుని ఆజ్ఞలను పాటిస్తూ యేసును గురించి సాక్ష్యం చెప్పింది ఈమె మిగతా సంతానమే.
18 వారితో యుద్ధం చేయటానికి ఆ ఘట సర్పం సముద్రతీరం దగ్గర నిలబడి ఉంది.
సముద్రం నుండి మృగం పైకి రావటం
13 సముద్రం నుండి ఒక మృగం రావటం నేను చూసాను. దానికి పది కొమ్ములు, ఏడు తలలు ఉన్నాయి. ఆ పది కొమ్ములమీద పది కిరీటాలు ఉన్నాయి. ప్రతి తలపై ఒక దేవదూషణ పేరు వ్రాయబడి ఉంది. 2 నేను చూసిన ఆ మృగం ఒక చిరుతపులిలా ఉంది. కాని దాని కాళ్ళు ఎలుగుబంటి కాళ్ళలా ఉన్నాయి. దాని నోరు సింహం నోరులా ఉంది. ఆ ఘటసర్పం ఆ మృగానికి తన శక్తిని, తన సింహాసనాన్ని, గొప్ప అధికారాన్ని యిచ్చింది.
3 ఆ మృగానికి ఉన్న తలల్లో ఒక తలకు ప్రమాదకరమైన గాయం ఉన్నట్లు కనిపించింది. కాని ఆ ప్రమాదకరమైన గాయం మానిపోయింది. ప్రపంచమంతా ఆశ్చర్యపడి ఆ మృగాన్ని అనుసరించింది. 4 ఘటసర్పం ఆ మృగానికి అధికారమిచ్చినందువల్ల మానవులు ఆ ఘటసర్పాన్ని పూజించారు. వాళ్ళు మృగాన్ని కూడా పూజిస్తూ, “ఈ మృగం వలె ఎవరున్నారు? ఈ మృగంతో ఎవరు యుద్ధం చేయగలరు?” అని అన్నారు.
5 గర్వంగా మాట్లాడటానికి, దైవదూషణ చేయటానికి, తన అధికారాన్ని నలుబది రెండు నెలలు చెలాయించడానికి ఆ మృగానికి నోరు యివ్వబడింది. 6 ఆ మృగం తన నోరు తెరచి దేవుణ్ణి దూషించింది. ఆయన నామాన్ని, ఆయన నివసించే స్థానాన్ని, పరలోకంలో నివసించే వాళ్ళను దూషణ చేసింది. 7 భక్తులతో యుద్ధం చేసి జయించటానికి దానికి శక్తి యివ్వబడింది. అంతేకాక, అన్ని జాతుల మీద, అన్ని గుంపుల మీద, అన్ని భాషల మీద, అన్ని దేశాల మీద ఆ మృగానికి అధికారమివ్వబడింది. 8 ఈ భూమ్మీద నివసించే వాళ్ళంతా, అంటే ప్రపంచం సృష్టింపబడిన నాటినుండి ఎవరి పేర్లు వధింపబడిన గొఱ్ఱెపిల్ల జీవగ్రంథంలో వ్రాయబడలేదో, వాళ్ళు ఈ మృగాన్ని పూజిస్తారు.
9 చెవులున్న వాళ్ళు వినండి:
10 బంధింపబడవలసినవాడు
బంధింపబడతాడు.
కత్తితో వధింపబడవలసినవాడు
వధింపబడతాడు.
కనుక భక్తుల్లో శాంతము, విశ్వాసము ఉండాల్సి వస్తుంది.
భూమిలోనుండి మృగం రావటం
11 తదుపరి మరొక మృగం భూమిలోపలి నుండి రావటం చూసాను. ఆ మృగానికి గొఱ్ఱెకు ఉన్నట్లు రెండు కొమ్ములు ఉన్నాయి. కాని అది ఘటసర్పం మాట్లాడినట్లు మాట్లాడింది. 12 అది ప్రమాదకరమైన గాయం నయమైన మొదటి మృగం పక్షాన, దాని అధికారమంతా ఉపయోగించి భూమిని, దానిపై నివసించే వాళ్ళను, మొదటి మృగాన్ని పూజించేటట్లు చేసింది. 13 అది అద్భుతమైన సూచనలు చూపింది. ప్రజలు చూస్తుండగా ఆకాశం నుండి మంటల్ని కూడా భూమ్మీదికి రప్పించింది.
14 మొదటి మృగం పక్షాన సూచనలు చూపటానికి దానికి అధికారమివ్వబడింది. ఈ అధికారంతో అది భూమ్మీద నివసించే వాళ్ళను మోసం చేస్తోంది. కత్తితో గాయపడి కూడా జీవించిన మృగానికి గౌరవార్థంగా ఒక విగ్రహాన్ని స్థాపించమని ప్రజల్ని ఆజ్ఞాపించింది. 15 మొదటి మృగం యొక్క విగ్రహానికి ప్రాణం పోసే శక్తి యివ్వబడింది. ఆ విగ్రహం మాట్లాడి, తనను పూజించటానికి నిరాకరించిన వాళ్ళను చంపేటట్లు చేసింది. 16 అంతేకాక చిన్నా, పెద్దా, ధనికుడూ, పేదవాడు, బానిస, స్వతంత్రుడు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కడూ తన కుడి చేతి మీదగాని, నుదుటిమీదగాని, ఒక ముద్ర వేసుకోవాలని నిర్బంధం చేసింది. 17 ఈ ముద్ర లేకుండా ఎవ్వరూ అమ్మటం కాని, కొనటం కాని, చేయరాదని యిలా చేసింది. ఈ ముద్రలలో ఆ మృగం పేరు, లేక దాని పేరుతో సంఖ్య వ్రాయబడి ఉంది.
18 ఇక్కడే తెలివి కావాలి. ఆ పరిజ్ఞానం ఉన్నవాడు ఆ మృగం యొక్క సంఖ్య ఏదో చెప్పనీ! ఎందుకంటే అది ఒక మనుష్యుని సంఖ్య. వాని సంఖ్య ఆరువందల అరువదియారు.
గొఱ్ఱెపిల్ల మరియు లక్షా నలుబది నాలుగు వేల మంది
14 అప్పుడు నేను చూశాను. నా ముందు ఆ గొఱ్ఱెపిల్ల కనబడినాడు. ఆయన సీయోను పర్వతంపై నిలబడి ఉన్నాడు. ఆయనతో ఒక లక్షా నలుబది నాలుగు వేల మంది ఉన్నారు. వాళ్ళ నొసళ్ళపై ఆయన పేరు, ఆయన తండ్రి పేరు వ్రాయబడి ఉంది.
2 పరలోకం నుండి నాకొక శబ్దం వినిపించింది. ఆ ధ్వని జలపాతపు ధ్వనిలా, పెద్ద ఉరుము ధ్వనిలా ఉంది. నేను విన్న ఆ ధ్వని వీణను మీటినప్పుడు కలిగే ధ్వనిలా ఉంది. 3 వాళ్ళు సింహాసనం ముందు, ఆ నాలుగు ప్రాణుల ముందు, పెద్దల ముందు నిలబడి ఒక క్రొత్త పాట పాడారు. భూలోకం నుండి విమోచించబడ్డ ఒక లక్షా నలుబది నాలుగు వేల మంది తప్ప యితరులు ఆ పాట నేర్చుకోరు.
4 వీళ్ళు స్త్రీ సంపర్కంతో మలినం కాకుండా పవిత్రంగా ఉన్నవాళ్ళు. వీళ్ళు గొఱ్ఱెపిల్ల ఎక్కడికి వెళ్ళినా ఆయన్ని అనుసరించేవాళ్ళు. వీళ్ళు మానవులనుండి కొనుక్కోబడి ప్రథమ ఫలంగా దేవునికి, గొఱ్ఱెపిల్లకు ప్రత్యేకింపబడినవాళ్ళు. 5 వీళ్ళ మాటల్లో అసత్యం లేదు. వీళ్ళు నిర్దోషులు.
ముగ్గురు దూతలు
6 ఆ తర్వాత మరొక దూత మధ్యాకాశంలో ఎగరటం చూసాను. ప్రపంచంలో నివసించే ప్రజలందరికీ, అంటే ప్రతి దేశానికి, ప్రతి జాతికి, ప్రతి భాషకు, ప్రతి గుంపుకు చెందిన ప్రజలకు ప్రకటించటానికి అతని దగ్గర “అనంత జీవితాన్ని” గురించిన సువార్త ఉంది. 7 అతడు బిగ్గరగా, “దేవునికి భయపడండి. ఆయన మహిమను స్తుతించండి. ఆయన తీర్పు చెప్పే గడియ దగ్గరకు వచ్చింది. ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, నీటి ఊటలను సృష్టించిన వాణ్ణి పూజించండి” అని అన్నాడు.
8 రెండవ దూత మొదటి దూతను అనుసరిస్తూ, “బాబిలోను పతనమైపోయింది. బాబిలోను మహానగరం పతనమైపోయింది. ‘వ్యభిచారం’ అనబడే మద్యాన్ని దేశాలకు త్రాగించింది ఇదే” అని అన్నాడు.
9 మూడవ దూత మొదటి యిద్దరిని అనుసరిస్తూ బిగ్గరగా, “మృగాన్ని గాని, దాని విగ్రహాన్ని గాని పూజించి, దాని ముద్రను నుదుటి మీద గాని, చేతిమీద గాని వేయించుకొన్నవాడు దేవుని కోపమనే మద్యాన్ని త్రాగక తప్పదు. 10 ఈ మద్యం దేవుని ఆగ్రహం అనబడే గిన్నెలో పూర్తి ఘాటుతో చేయబడింది. అంతేకాక పరిశుద్ధమైన దూతల ముందు, గొఱ్ఱెపిల్ల ముందు మండుతున్న గంధకంతో వానిని హింసిస్తారు. 11 వాళ్ళు కాలటంవల్ల రగులుతున్న పొగ చిరకాలం లేస్తూనే ఉంటుంది. మృగాన్ని గాని, దాని విగ్రహాన్ని గాని పూజించే వాళ్ళకు, లేక దాని పేరును ముద్రగా పొందిన వాళ్ళకు పగలు, రాత్రి విరామం ఉండదు” అని అన్నాడు. 12 అంటే దేవుని ఆజ్ఞలను పాటించే పవిత్రులు యేసుపట్ల విశ్వాసం ఉన్నవాళ్ళు సహనంగా ఉండాలి.
13 ఆ తదుపరి పరలోకం నుండి ఒక స్వరం, “ఇది వ్రాయి. ఇప్పటి నుండి ప్రభువులో చనిపోయినవాళ్ళు ధన్యులు” అని అన్నది.
“అది నిజం. వాళ్ళకిక విశ్రాంతి ఉంటుంది. ఇది వరకు వాళ్ళు చేసిన మంచిపనులు వాళ్ళ వెంట ఉంటాయి” అని పరిశుద్ధాత్మ అన్నాడు.
భూమ్మీద పంట కోత
14 ఒక తెల్లటి మేఘం నా ముందు కనిపించింది. దానిమీద “మనుష్యకుమారుని”[a] లాంటివాడు కూర్చొనివుండటం చూశాను. ఆయన తలపై బంగారు కిరీటం ఉంది. ఆయన చేతిలో పదునైన కొడవలి ఉంది. 15 ఆ తర్వాత మందిరం నుండి మరొక దూత వచ్చాడు. అతడు బిగ్గరగా మేఘం మీద కూర్చొన్నవాణ్ణి పిలిచి, “భూమ్మీద పంట పండింది. పంటను కోసే సమయం వచ్చింది. నీ కొడవలి తీసుకొని పంటను కోయి!” అని అన్నాడు. 16 మేఘంమీద కూర్చొన్నవాడు తన కొడవలిని భూమ్మీదికి విసిరాడు. వెంటనే ఆ కొడవలి పంటను కోసింది.
17 పరలోకంలో ఉన్న మందిరం నుండి యింకొక దూత వచ్చాడు. అతని దగ్గర కూడా ఒక పదునైన కొడవలి ఉంది. 18 మరొక దూత బలిపీఠం నుండి వచ్చాడు. అగ్నికి అధికారియైన యితడు బిగ్గరగా పదునైన కొడవలి ఉన్నవాణ్ణి పిలుస్తూ, “ద్రాక్ష పండింది. నీ పదునైన కొడవలి తీసుకెళ్ళి భూమ్మీద వున్న ద్రాక్షా తోటనుండి ద్రాక్షాగుత్తుల్ని కోయి” అని అన్నాడు. 19 ఆ దూత కొడవలిని భూమ్మీదికి విసిరి ద్రాక్షా పండ్లు కోసి వాటిని దేవుని కోపం అనబడే పెద్ద తొట్టిలో వేసాడు. 20 ఊరికి అవతలవున్న ద్రాక్షా తొట్టిలో ద్రాక్షా పళ్ళను వేసి వాటిని త్రొక్కారు. దాన్నుండి రక్తం ప్రవహించింది. ఆ రక్తం గుఱ్ఱం నోటి కళ్ళెం అంత ఎత్తు లేచి, సుమారు రెండు వందల మైళ్ళ దూరందాకా ప్రవహించింది.
ఏడు తెగుళ్ళతో ఏడుగురు దూతలు
15 నేను పరలోకంలో యింకొక అద్భుతమైన దృశ్యం చూశాను. ఏడుగురు దూతలు ఏడు చివరి తెగుళ్ళు పట్టుకొని ఉండటం చూశాను. వీటితో దేవుని కోపం సమాప్తమౌతుంది. కనుక యివి చివరివి.
2 నిప్పుతో కలిసిన గాజు సముద్రం లాంటి ఒక సముద్రం నాకు కనిపించింది. మృగాన్ని, దాని విగ్రహాన్ని జయించినవాళ్ళు, దాని నామానికున్న సంఖ్యను జయించినవాళ్ళు సముద్రతీరం మీద నిలబడి ఉండటం చూసాను. వాళ్ళు తమ చేతుల్లో దేవుడుంచిన వీణల్ని పట్టుకొని ఉన్నారు. 3 దేవుని సేవకుడైన మోషే గీతాన్ని, గొఱ్ఱెపిల్ల గీతాన్ని వాళ్ళు ఈ విధంగా పాడుతూ ఉన్నారు:
“ప్రభూ! సర్వశక్తి సంపన్నుడవైన దైవమా!
నీ కార్యాలు గొప్పవి. అద్భుతమైనవి.
యుగయుగాలకు రాజువు నీవు.
నీ మార్గాలు సత్యసమ్మతమైనవి. న్యాయసమ్మతమైనవి.
4 ఓ ప్రభూ! నీకెవరు భయపడరు?
నీ నామాన్ని స్తుతించనివారెవరున్నారు?
నీ వొక్కడివే పరిశుద్ధుడవు.
నీ నీతికార్యాలు ప్రత్యక్షమైనవి.
కనుక ప్రజలందరూ వచ్చి నిన్ను ఆరాధిస్తారు.”
5 దీని తర్వాత పరలోకంలో ఉన్న మందిరాన్ని చూసాను. అంటే సాక్ష్యపు గుడారము తెరుచుకోవటం చూసాను. 6 ఆ మందిరం నుండి ఏడుగురు దేవదూతలు ఏడు తెగుళ్ళతో బయటకు వచ్చారు. వాళ్ళు తెల్లటి మెరిసే నార బట్టలు వేసుకొని ఉన్నారు. రొమ్ముల మీద బంగారు దట్టి కట్టుకొని ఉన్నారు. 7 ఆ తర్వాత ఆ నాలుగు ప్రాణుల్లో ఒకటి ఆ ఏడుగురు దూతలకు చిరంజీవి అయిన దేవుని ఆగ్రహంతో నిండిన ఏడు బంగారు పాత్రల్ని యిచ్చింది. 8 ఆ మందిరమంతా దైవశక్తి వల్ల మరియు ఆయన తేజస్సు వల్ల కలిగిన పొగలతో నిండిపోయింది. ఏడుగురు దూతలు తెచ్చిన ఏడు తెగుళ్ళు పూర్తి అయ్యేవరకు ఆ మందిరంలో ఎవ్వరూ ప్రవేశించలేకపోయారు.
కోపంతో నిండుకొన్న ఏడు పాత్రలు
16 మందిరం నుండి ఒక స్వరం బిగ్గరగా ఆ ఏడుగురు దూతలతో, “వెళ్ళండి, దేవుని కోపంతో నిండిపోయిన ఆ ఏడు పాత్రల్ని భూమ్మీద కుమ్మరించండి” అని అనటం నాకు వినిపించింది.
2 మొదటి దూత వెళ్ళి తన పాత్రను భూమ్మీద కుమ్మరించాడు. మృగం ముద్రవున్నవాళ్ళ దేహాల మీద, మృగం విగ్రహాన్ని పూజించినవాళ్ళ దేహాలమీద బాధ కలిగించే వికారమైన కురుపులు లేచాయి.
3 రెండవ దూత వెళ్ళి, తన పాత్రను సముద్రం మీద కుమ్మరించాడు. ఆ సముద్రం శవంలోని రక్తంలా మారిపోయింది. సముద్రంలో ఉన్న సమస్త జీవరాసులు మరణించాయి.
4 మూడవ దూత తన పాత్రను నదులమీద, నీటి ఊటలమీద కుమ్మరించాడు. వాటి నీళ్ళు రక్తంగా మారాయి. 5 నీటి మీద అధికారమున్న దూత ఈ విధంగా అనటం విన్నాను:
“నీవు న్యాయంగా తీర్పు చెప్పావు. నీవు ప్రస్తుతం ఉన్నావు.
గతంలో ఉండిన వాడవు.
నీవు పవిత్రమైన వాడవు, ఎందుకంటే నీవు ఆ విధంగా తీర్పు తీర్చావు.
6 వాళ్ళు నీ భక్తుల రక్తాన్ని, నీ ప్రవక్తల రక్తాన్ని కార్చారు.
దానికి తగిన విధంగా
నీవు వాళ్ళకు త్రాగటానికి రక్తాన్నిచ్చావు.”
7 బలిపీఠం ఈ విధంగా సమాధానం చెప్పటం నేను విన్నాను:
“ఔను ప్రభూ! సర్వశక్తి సంపన్నుడవైన ఓ దైవమా!
నీ తీర్పులు సత్యసమ్మతమైనవి. న్యాయసమ్మతమైనవి.”
8 నాల్గవ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరించాడు. ప్రజల్ని వేడితో మాడ్చివేయటానికి సూర్యునికి అధికారమివ్వబడింది. 9 తీవ్రమైన వేడివల్ల ప్రజలు మాడిపోయారు. వాళ్ళు ఈ తెగుళ్ళ మీద అధికారమున్న దేవుని నామాన్ని దూషించారు. వాళ్ళు పశ్చాత్తాపం చెందటానికి నిరాకరించారు. ఆయన్ని స్తుతించటానికి నిరాకరించారు.
10 ఐదవ దూత తన పాత్రను మృగం యొక్క సింహాసనం మీద క్రుమ్మరించాడు. వెంటనే వాని రాజ్యం చీకటిలో మునిగి పోయింది. ప్రజలు నొప్పితో తమ నాలుకలు కొరుక్కున్నారు. 11 తమ బాధలకు, తమ కురుపులకు పరలోకంలోవున్న దేవుణ్ణి దూషించారు. కాని తాము చేసిన చెడ్డ పనులను మాని మారుమనస్సు పొందటానికి నిరాకరించారు.
12 ఆరవ దూత, తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద క్రుమ్మరించాడు. తూర్పున ఉన్న రాజులకు మార్గం సిద్ధం కావాలని ఆ నది ఎండిపోయింది. 13 ఆ తర్వాత కప్పల్లా కనిపించే అసహ్యకరమైన మూడు దయ్యాలు కనిపించాయి. అవి ఘటసర్పం నోటినుండి, మృగం నోటినుండి, దొంగ ప్రవక్త నోటినుండి బయటికి వచ్చాయి. 14 అవి భూతాత్మలు. వాటికి మహత్కార్యాలు చేసే శక్తి ఉంది. అవి సర్వశక్తి సంపన్నుడైన దేవుని “మహాదినం” నాడు జరిగే యుద్ధాని కోసం రాజుల్ని సిద్ధం చేయటానికి ప్రపంచంలోని రాజులందరి దగ్గరకి వెళ్తాయి.
15 “జాగ్రత్త! నేను దొంగలా వస్తాను. తన దుస్తులు తన దగ్గర ఉంచుకొని, మేలుకొని ఉన్నవాడు ధన్యుడు. అలా చేయకపోతే అతడు నగ్నంగా వెళ్ళి తన నగ్నతకు అవమానపడవలసి వస్తుంది.”
16 ఆ భూతాత్మలు హీబ్రూ భాషలో “హార్‌మెగిద్దోను” అనే ప్రదేశంలో రాజుల్ని సమావేశ పరిచాయి.
17 ఏడవ దూత తన పాత్రను గాలిలో క్రుమ్మరించాడు. మందిరంలో ఉన్న సింహాసనం మీదినుండి ఒక స్వరం బిగ్గరగా “సమాప్తం” అని అన్నది. 18 వెంటనే మెరుపులు మెరిసాయి. ఉరుములు, గర్జనలు వినిపించాయి. తీవ్రమైన భూకంపం వచ్చింది. మానవుడు భూమ్మీద పుట్టిననాటి నుండి అటువంటి భూకంపం ఎన్నడూ జరుగలేదు. ఆ భూకంపం అంత తీవ్రంగా ఉంది. 19 మహానగరం మూడు భాగాలుగా చీలిపోయింది. దేశాల్లో ఉన్న పట్టణాలు కూలిపోయాయి. దేవుడు బాబిలోను మహానగరాన్ని శిక్షించటం మరచిపోలేదు. దాని పాత్రలో “తీవ్రమైన ఉగ్రత” అనబడే మద్యాన్ని పోసాడు. 20 ద్వీపాలు, పర్వతాలు మాయమైపోయాయి. 21 ఆకాశం నుండి పెద్ద వడగండ్లు వచ్చి ప్రజలమీద పడ్డాయి. అవి ఒక్కొక్కటి అయిదేసి మణుగుల బరువు ఉన్నాయి. ఈ వడగండ్ల వాన కలిగించినందుకు ప్రజలు దేవుణ్ణి దూషించారు. ఈ వడగండ్ల వల్ల ప్రజలకు చాలా బాధ కలిగింది.
మృగముపైనున్న స్త్రీ
17 ఏడు పాత్రలున్న ఏడుగురి దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో ఈ విధంగా అన్నాడు: “అది పేరుగాంచిన వేశ్య. బహు జనముల మీద కూర్చున్న ఆ వేశ్యకు యివ్వబడే శిక్షను నీకు చూపిస్తాను. నా వెంట రా. 2 దానితో భూపతులు వ్యభిచరించారు. ఈ భూమ్మీద నివసించే ప్రజలు అది అందించే వ్యభిచారమనే మద్యంతో మత్తెక్కిపోయారు.”
3 ఆ తర్వాత ఆ దేవదూత నన్ను ఆత్మద్వారా ఒక ఎడారి ప్రాంతానికి తీసుకు వెళ్ళాడు. అక్కడ ఒక స్త్రీ ఎరుపు, ఊదా రంగుగల మృగం మీద కూర్చొని ఉండటం చూసాను. ఆ మృగం మీద దూషణలు వ్రాయబడి ఉన్నాయి. ఆ మృగానికి ఏడు తలలు, పది కొమ్ములు ఉన్నాయి. 4 ఆ స్త్రీ ఊదా, ఎరుపు రంగుగల వస్త్రాల్ని కట్టుకొని ఉంది. బంగారుతో, రత్నాలతో, ముత్యాలతో చేసిన మెరిసే ఆభరణాలను వేసుకొని ఉంది. అది తన చేతిలో ఒక బంగారు పాత్రను పట్టుకొని ఉంది. ఆ పాత్ర అసహ్యమైన వాటితో, అది చేసిన వ్యభిచార కల్మషంతో నిండి ఉంది. 5 ఈ పేరు దాని నుదుటి మీద వ్రాయబడి ఉన్నది:
మర్మము, మహా బాబిలోను
వేశ్యలకు తల్లి!
ప్రపంచంలోని కల్మషాలకు తల్లి!
6 ఆ స్త్రీ భక్తుల రక్తాన్ని త్రాగి, మత్తుగా ఉండటం చూసాను. ఆ రక్తం యేసును గురించి సాక్ష్యం చెప్పిన వాళ్ళది.
నేనా స్త్రీని చూసి ఆశ్చర్యపడ్డాను. 7 అప్పుడు ఆ దేవదూత నాతో ఈ విధంగా అన్నాడు: “నీవెందుకు అంత ఆశ్చర్యపడుతున్నావు? ఆ స్త్రీ యొక్క రహస్యం నీకు చెబుతాను. ఆమె స్వారీ చేసే ఏడుతలల, పది కొమ్ముల మృగాన్ని గురించి చెపుతాను. 8 నీవు చూసిన మృగం ప్రస్తుతం లేదు. ఒకప్పుడు ఉండింది. పాతాళం నుండి లేచి వచ్చి అది నాశనమౌతుంది. ఆ మృగం ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు లేదు. భవిష్యత్తులో వస్తుంది. కనుక ప్రపంచంలో ఉన్నవాళ్ళు ఆ మృగాన్ని చూసి దిగ్ర్భాంతి చెందుతారు. సృష్టి మొదలైనప్పటి నుండి వీళ్ళ పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడలేదు.
9 “దీన్ని అర్థం చేసుకోవటానికి బుద్ధి అవసరం.” ఆ ఏడుతలలు ఆ స్త్రీ కూర్చొన్న ఏడుకొండలు. ఆ ఏడు తలలు ఏడుగురు రాజులతో పోల్చబడ్డాయి. 10 ఐదుగురు పడిపోయారు. ఒకడు ఉన్నాడు. ఇంకొకడు యింకా రాలేదు. అతడొచ్చాక కొద్దికాలం ఉంటాడు. 11 ఒకప్పుడు ఉండి ప్రస్తుతము లేని మృగము ఎనిమిదవ రాజు. అతడు ఏడుగురిలో ఒకడు. అతడు కూడా నాశనమౌతాడు.
12 “నీవు చూసిన ఆ పది కొమ్ములు పదిమంది రాజులు. వాళ్ళకు యింకా రాజ్యము లభించలేదు. కాని వాళ్ళకు రాజులకున్న అధికారము, మృగంతో పాటు ఒక గంట సమయం మాత్రమే లభిస్తుంది. 13 వాళ్ళందరి ఉద్దేశ్యం ఒకటి. దాని కోసం తమ శక్తిని, అధికారాన్ని ఆ మృగానికిచ్చారు. 14 వాళ్ళు గొఱ్ఱెపిల్లతో యుద్ధం చేస్తారు. కాని గొఱ్ఱెపిల్ల ప్రభువులకు ప్రభువు. రాజులకు రాజు. కనుక విజయం పొందుతాడు. ఆయన వెంట ఆయన పిలిచినవాళ్ళు, ఆయన ఎన్నుకొన్నవాళ్ళు, ఆయన్ని విశ్వసించేవాళ్ళు ఉంటారు.”
15 ఆ తర్వాత దూత నాతో ఈ విధంగా అన్నాడు: “నీవు ఆ వేశ్య కూర్చున్న నీళ్ళను చూసావు. ఆ నీళ్ళు ప్రజల గుంపుల్ని, జాతుల్ని, దేశాలను, భాషలను సూచిస్తోంది. 16 నీవు చూసిన మృగము, దాని పది కొమ్ములు ఆ వేశ్యను ద్వేషిస్తాయి. అవి ఆమె దగ్గర ఉన్నవన్నీ తీసుకొని ఆమెను నగ్నంగా వదిలేస్తాయి. ఆమె దేహాన్ని తిని, ఆమెను మంటల్లో కాల్చివేస్తాయి. 17 దేవుడు తన ఉద్దేశ్యం నెరవేర్చుమని వాటి హృదయాలకు చెప్పాడు. కనుక ఆ పది కొమ్ములు తమ రాజ్యాన్ని దేవుడు చెప్పిన మాట నెరవేరే వరకు ఆ మృగానికి యివ్వటానికి అంగీకరించాయి. 18 నీవు చూసిన ఆ స్త్రీ భూలోకంలోని రాజులను పాలించే మహానగరం.”
బాబిలోను పతనము
18 ఇది జరిగిన తర్వాత పరలోకం నుండి మరొక దూత దిగి రావటం చూసాను. అతని తేజస్సు భూమిని ప్రకాశింప చేసింది. 2 అతడు బిగ్గరగా యిలా అన్నాడు:
“బాబిలోను మహానగరం
కూలిపోయింది, కూలిపోయింది.
అది అక్కడ దయ్యాలకు నివాసమైంది.
ప్రతి దురాత్మకు అది తిరుగులాడు స్థలమైంది.
ప్రతి ఏవగింపు కలిగించే అపవిత్రమైన పక్షికి
అది సంచరించు స్థలమైంది.
3 దేశాలన్నీ దాని వ్యభిచారమనే మద్యాన్ని త్రాగాయి.
దేవుని ఆగ్రహమనే మద్యాన్ని త్రాగి మత్తెక్కి పోయాయి.
భూరాజులు దాంతో వ్యభిచరించారు. ప్రపంచంలోని వర్తకులు, దాని మితి మీరిన విలాసాలతో ధనవంతులయ్యారు.”
4 ఆ తదుపరి ఇంకొక స్వరం పరలోకంలో నుండి ఈ విధంగా అనటం విన్నాను:
“నా ప్రజలారా! దానిలో నుండి బయటకు రండి.
ఎందుకంటే దాని పాపాల్లో మీరు పాలుపంచుకోరు.
అప్పుడు దానికున్న తెగుళ్ళు మీకు రావు.
5 దాని పాపాలు ఆకాశం అంత ఎత్తుగా పేరుకుపోయాయి.
దేవునికి దాని నేరాలు జ్ఞాపకం ఉన్నాయి.
6 అది యిచ్చింది తిరిగి దానికే యివ్వండి.
అది చేసిన దానికి రెండింతలు దానికి చెల్లించండి.
దాని పాత్రలో రెండింతలు ఘాటుగా ఉన్న మద్యాన్ని పొయ్యండి.
7 ఆ పట్టణం అనుభవించిన పేరు ప్రతిష్ఠలకు సమానంగా
అది అనుభవించిన సుఖాలకు సమానంగా దానికి దుఃఖాలు కలిగించి హింసించండి.
అది తన మనస్సులో, ‘నేను రాణిలా సింహాసనంపై కూర్చుంటాను.
నేను ఎన్నటికీ వితంతువును కాను.
నేను ఎన్నటికీ దుఃఖించను’ అని తనలో గర్విస్తుంది.
8 అందువల్ల చావు, దుఃఖము, కరువు,
తెగులు ఒకేరోజు వచ్చి దాన్ని బాధిస్తాయి.
దానిపై తీర్పు చెప్పే మన ప్రభువైన దేవుడు శక్తివంతుడు
కనుక దాన్ని మంటల్లో కాల్చి వేస్తాడు.
9 “దానితో వ్యభిచరించి సుఖాలనుభవించిన భూరాజులు అది మండుతున్నప్పుడు వచ్చిన పొగలు చూసి దానికోసం గుండెలు బాదుకొని దుఃఖిస్తారు. 10 దానికి జరుగుతున్న హింసను చూసి భయపడి దూరంగా నిలబడి,
‘అయ్యో! అయ్యో! మహానగరమా!
శక్తివంతమైన బాబిలోను నగరమా!
ఒకే ఒక గంటలో నీకు నాశనం వచ్చింది’
అని విలపిస్తారు.
11 “ప్రపంచంలోని వర్తకులు తమ వస్తువులు యిక మీదట కొనేవారు ఎవ్వరూ ఉండరు కనుక తమ నష్టానికి దానిమీద విలపిస్తారు. 12 వీళ్ళు బంగారు, వెండి వస్తువులు, రత్నాలు, ముత్యాలు, సున్నితమైన నార బట్టలు, ఊదారంగు వస్త్రాలు, పట్టు వస్త్రలు, ఎర్రటి రంగుగల వస్త్రాలు, దబ్బచెట్ల పలకలు, దంతంతో, మంచి చెక్కతో, కంచుతో, ఇనుముతో, చలువరాతితో చేసిన అన్ని రకాల వస్తువులు, 13 దాల్చిన చెక్క, ఓమము, అగరుబత్తులు, మంచి అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షారసం, ఒలీవ నూనె, మెత్తని పిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు, గుర్రాలు, బండ్లు, బానిసలు, మనుష్యుల శరీరాలు, ప్రాణాలు అమ్మేవాళ్ళు. 14 వాళ్ళు,
‘నీవు కోరిన ఫలము దొరకలేదు.
నీ ఐశ్వర్యము, నీ భోగము నశించిపొయ్యాయి.
అవి మళ్ళీ రావు’
అని అన్నారు.
15 “వస్తువులు అమ్మి ధనం గడించిన వర్తకులు ఆమె అనుభవిస్తున్న హింసను చూసి భయపడి దూరంగా నిలుచుంటారు. వాళ్ళు దుఃఖంతో విలపిస్తారు. 16 వాళ్ళు,
‘అయ్యో! అయ్యో! సున్నితమైన వస్త్రాల్ని,
ఊదారంగు వస్త్రాల్ని, ఎర్రటి రంగు వస్త్రాల్ని ధరించిన మహానగరమా!
బంగారుతో, రత్నాలతో, ముత్యాలతో చేసిన
నగలు ధరించిన మహానగరమా!
17 ఒకే ఒక గంటలో నీ ఐశ్వర్యమంతా నశించిపోయిందే!’
అని విలపిస్తారు.
“ప్రతి నావికాధికారి, ఓడలో ప్రయాణం చేసే ప్రతి యాత్రికుడు, నావికులు, సముద్రం ద్వారా తమ జీతం గడించి జీవించే వాళ్ళు అందరూ దూరంగా నిలబడి ఉన్నారు. 18 ఆ పట్టణం కాలుతున్నప్పుడు వచ్చే పొగలను చూసి వాళ్ళు ఆశ్చర్యంతో, ‘ఈ మహానగరమంత గొప్పగా ఏ పట్టణమైనా ఉందా?’ అని అంటారు. 19 వాళ్ళు దుఃఖంతో విలపిస్తూ, దుమ్మును నెత్తిన వేసుకొంటూ,
‘అయ్యో! అయ్యో! మహానగరమా!
సముద్రంలో ఓడ ఉన్న ప్రతి ఒక్కడూ దాని ధనంవల్ల ధనికులయ్యారే!
ఒకే ఒక గంటలో ఆమె నాశనమయ్యిందే! అని ఏడుస్తారు.
20 పరలోకమా! దాని పతనానికి ఆనందించు!
విశ్వాసులారా! అపొస్తలులారా! ప్రవక్తలారా! ఆనందించండి.
అది మీతో ప్రవర్తించిన విధానానికి దేవుడు దానికి తగిన శిక్ష విధించాడు’”
అని అంటారు.
21 అప్పుడు ఒక శక్తివంతుడైన దూత తిరుగటిరాయి వంటి పెద్దరాయిని ఎత్తి సముద్రంలో పారవేసి ఈ విధంగా అన్నాడు:
“గొప్ప శక్తితో బాబిలోను మహానగరం క్రిందికి పారవేయబడుతుంది.
అది మళ్ళీ కనిపించదు.
22 వీణను వాయించేవాళ్ళ సంగీతం, యితర వాయిద్యాలు వాయించేవాళ్ళ సంగీతం, పిల్లనగ్రోవి ఊదేవాళ్ళ సంగీతం, బూర ఊదేవాళ్ళ సంగీతం, నీలో మళ్ళీ వినిపించదు.
పని చేయగలవాడు నీలో మళ్ళీ కనిపించడు.
తిరుగటి రాయి శబ్దం మళ్ళీ నీలో వినిపించదు.
23 దీపపు కాంతి నీలో మళ్ళీ ప్రకాశించదు.
కొత్త దంపతుల మాటలు నీలో మళ్ళీ వినిపించవు.
నీ వర్తకులు ప్రపంచంలో గొప్పగా ఉన్నారు.
నీ గారడీలతో దేశాలు తప్పుదారి పట్టాయి.
24 ఆ పట్టణంలో ప్రవక్తల రక్తం, పవిత్రుల రక్తం కనిపించింది.
ప్రపంచంలో వధింపబడిన వాళ్ళందరి రక్తం, ఆ పట్టణంలో కనిపించింది.”
© 1997 Bible League International