Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
హెబ్రీయులకు 1-6

దేవుడు గతంలో ప్రవక్తల ద్వారా ఎన్నోసార్లు, ఎన్నోవిధాలుగా మన పూర్వికులతో మాట్లాడాడు. అన్నిటిపై తన కుమారుణ్ణి వారసునిగా నియమించాడు. ఆయన ద్వారా ఈ విశ్వాన్ని సృష్టించాడు. ఈ చివరి రోజుల్లో ఆయన ద్వారా మనతో మాట్లాడాడు. కుమారుడు దేవుని మహిమ యొక్క ప్రకాశం. తండ్రి యొక్క ఉనికిలో పరిపూర్ణ ఉనికిగలవాడు. కుమారుడు శక్తివంతమైన తన మాటతో అన్నిటినీ పోషించి సంరక్షిస్తున్నాడు. పాపపరిహారం చేసాక ఈయన పరలోకంలోకి వెళ్ళాడు. అక్కడ, మహా తేజస్వియైన దేవుని కుడివైపు కూర్చున్నాడు. ఆయన దేవదూతలకన్నా గొప్పవాడు. దానికి తగ్గట్టుగా ఆయన గొప్ప పేరు కూడా వారసత్వంగా పొందాడు. దేవదూతలకన్నా కుమారుడు గొప్పవాడు.

ఎందుకంటే దేవుడు ఏ దేవదూతతో కూడా ఈ విధంగా అనలేదు:

“నీవు నా కుమారుడవు,
    నేడు నేను నీ తండ్రినయ్యాను.”(A)

మరొక చోట:

“నేనతనికి తండ్రి నౌతాను.
    అతడు నా కుమారుడౌతాడు.”(B)

మరొకచోట, దేవుడు తన మొదటి సంతానాన్ని ఈ ప్రపంచంలోకి తీసుకొని వచ్చినప్పుడు ఈ విధంగా అన్నాడు:

“దేవదూతలు ఆయన్ని ఆరాధించాలి!”(C)

దేవదూతల గురించి దేవుడు మాట్లాడుతూ:

“దేవుడు తన దూతల్ని ఆత్నలుగాను
    తన సేవకుల్ని అగ్ని జ్వాలల్లా చేస్తాడు!”(D)

కాని కుమారుణ్ణి గురించి ఈ విధంగా అన్నాడు:

“ఓ దేవా! నీ సింహాసనం చిరకాలం ఉంటుంది.
    నీతి నీ రాజ్యానికి రాజదండంగా ఉంటుంది.
నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించావు.
    అందువల్ల దేవుడు, నీ దేవుడు ఆనందమనే నూనెతో నిన్ను
    అభిషేకించి నీ స్నేహితులందరి కన్నా నిన్ను అధికంగా గౌరవించాడు.”(E)

10 ఆయనింకా ఈ విధంగా అన్నాడు:

“ఓ ప్రభూ! ఆదిలో ఈ ప్రపంచానికి నీవు పునాదులు వేశావు.
    ఆకాశాలను నీ చేతుల్తో సృష్టించావు.
11 అవి నశించి పోతాయి ఒక వస్త్రంలా పాత బడతాయి.
    కాని, నీవు చిరకాలం ఉంటావు.
12 వాటిని నీవు ఒక వస్త్రంలా మడుస్తావు.
    వాటిని నీవు దుస్తులు మార్చినట్లు మారుస్తావు.
కాని నీవు మాత్రం అలాగే ఉంటావు!
    నీ సంవత్సరములకు అంతంలేదు!”(F)

13 దేవుడు ఏ దేవదూతతోనైనా:

“నీ శత్రువుల్ని నీ పాద పీఠంగా చేసేవరకు
    నా కుడివైపు కూర్చో,”(G)

అని ఎన్నడైనా అన్నాడా? 14 ఈ దేవదూతలందరూ సేవ చేయటానికి వచ్చిన ఆత్మలే కదా! రక్షణ పొందే వ్యక్తుల సేవ చేయటానికే గదా దేవుడు వీళ్ళను పంపింది?

జాగ్రత్తపడమని హెచ్చరిక

అందువల్ల, మనం విన్న సత్యాలను మనం ముందు కన్నా యింకా ఎక్కువ జాగ్రత్తగా పరిశీలించాలి. అప్పుడే మనం వాటికి దూరమైపోము. దేవదూతలు చెప్పిన సందేశంలో సత్యం ఉందని రుజువైంది.[a] ఆ సందేశాన్ని అనుసరించనివానికి, దాన్ని విననివానికి తగిన శిక్ష లభించింది. మరి, అటువంటి మహత్తరమైన రక్షణను మనం గమనించకపోతే శిక్షనుండి ఏ విధంగా తప్పించుకోగలం? ఈ రక్షణను గురించి మొట్ట మొదట మన ప్రభువు ప్రకటించాడు. ఆ సందేశాన్ని విన్నవాళ్ళు అందులోవున్న సత్యాన్ని మనకు వెల్లడిచేసారు. దేవుడు ఎన్నో సూచనల్ని, అద్భుతాల్ని, మహిమల్ని చూపాడు. తన యిష్టానుసారం పరిశుద్ధాత్మ యొక్క వరాల్ని పంచి పెట్టాడు. తద్వారా ఆ సందేశంలో ఉన్న సత్యాన్ని మనకు రుజువు చేసాడు.

యేసు మానవజన్మనెత్తటం

మనం మాట్లాడుతున్న ప్రపంచాన్ని, అంటే రాబోవు ప్రపంచాన్ని దేవుడు తన దూతలకు లోపర్చ లేదు. ధర్మశాస్త్రంలో ఒకచోట ఈ విధంగా వ్రాయబడింది:

“మానవుణ్ణి గురించి నీవాలోచించటానికి అతడెంతటివాడు?
    మానవ కుమారుణ్ణి నీవు చూడడానికి అతడెంతటివాడు?
నీవతనికి దేవదూతలకన్నా కొద్దిగా తక్కువ స్థానాన్ని యిచ్చావు!
    మహిమ, గౌరవమనే కిరీటాన్ని నీవతనికి తొడిగించి,
అన్నిటినీ అతని పాదాల క్రింద ఉంచావు.”(H)

దేవుడు అన్నిటినీ ఆయన పాదాల క్రింద ఉంచాడు అంటే, ప్రతి ఒక్కటి ఆయన అధికారానికి లోబడి ఉండాలన్నమాట. కాని ప్రస్తుతం, అన్నీ ఆయన ఆధీనంలో ఉన్నట్లు మనకు కనిపించటం లేదు. యేసు, దేవదూతల కన్నా కొంత తక్కువవానిగా చేయబడ్డాడు. అంటే ఆయన మానవులందరి కోసం మరణించాలని, దేవుడాయన్ని అనుగ్రహించి ఈ తక్కువ స్థానం ఆయనకు యిచ్చాడు. యేసు కష్టాలను అనుభవించి మరణించటంవలన “మహిమ, గౌరవము” అనే కిరీటాన్ని ధరించగలిగాడు.

10 దేవుడు తన కుమారుల్లో చాలామంది తన మహిమలో భాగం పంచుకొనేటట్లు చెయ్యాలని, వాళ్ళ రక్షణకు కారకుడైనటువంటి యేసును కష్టాలనుభవింపజేసి, ఆయనలో పరిపూర్ణత కలుగ చేసాడు. ఎవరికోసం, ఎవరిద్వారా, ఈ ప్రపంచం సృష్టింపబడిందో ఆ దేవుడు ఈ విధంగా చేయటం ధర్మమే! యేసు మానవుల్ని పవిత్రం చేస్తాడు.

11 ఆయన పవిత్రం చేసిన ప్రజలు, పవిత్రం చేసే ఆయన ఒకే కుటుంబానికి చెందినవాళ్ళు. అందువలనే, వాళ్ళు తన సోదరులని చెప్పుకోవటానికి యేసు సిగ్గుపడటంలేదు. 12 ఆయన ఈ విధంగా అన్నాడు:

“నిన్ను గురించి నా సోదరులకు తెలియ చేస్తాను.
    సభలో, నిన్ను స్తుతిస్తూ పాటలు పాడతాను!”(I)

13 మరొక చోట

“నేను దేవుణ్ణి నమ్ముతున్నాను!”(J)

అంతేకాక ఇలా కూడా అన్నాడు:

“నేను, దేవుడు నాకిచ్చిన సంతానం యిక్కడ ఉన్నాము!”(K)

14 ఆయన “సంతానమని” పిలువబడినవాళ్ళు రక్తమాంసాలుగల ప్రజలు. యేసు వాళ్ళలా అయిపోయి వాళ్ళ మానవనైజాన్ని పంచుకొన్నాడు. ఆయన తన మరణం ద్వారా మరణంపై అధికారమున్న సాతాన్ను నాశనం చేయాలని ఇలా చేశాడు. 15 తద్వారా జీవితాంతం మరణానికి భయపడి జీవించే వాళ్ళకు స్వేచ్ఛకలిగించాడు. 16 నిజానికి, ఆయన దేవదూతలకు సహయం చెయ్యాలని రాలేదు. అబ్రాహాము సంతానానికి సహయం చెయ్యాలని వచ్చాడు. 17 ఈ కారణంగా ఆయన అన్ని విధాల తన సోదరులను పోలి జన్మించవలసి వచ్చింది. ఆయన మహాయాజకుడై తన ప్రజలపై దయ చూపటానికి మానవ జన్మనెత్తాడు. ఆయన ప్రజల పాపాలకు ప్రాయశ్చిత్తం చెయ్యాలని వారిలో ఒకడయ్యాడు. 18 శోధన సమయాల్లో యేసు కష్టాలను అనుభవించాడు. కనుక యిప్పుడు శోధనలకు గురౌతున్న వాళ్ళకు ఆయన సహాయం చేయగలడు.

యేసు మోషే కన్నా గొప్పవాడు

పరలోక దేవుని పిలుపులో పాలివారైన సోదరులారా! మీరు పవిత్రత గలవాళ్ళు. మనం బహిరంగంగా విశ్వసిస్తున్న ప్రధాన యాజకుడు, దేవుని అపొస్తలుడు అయినటువంటి యేసు పట్ల మీ మనస్సు లగ్నం చెయ్యండి. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు. అలాగే యేసు కూడా తనను నియమించిన దేవునియందు నమ్మకస్తుడుగా ఉండెను. ఇంటికంటే, ఇల్లు కట్టిన వానికి ఎక్కువ గౌరవముంటుంది. అలాగే మోషే కన్నా యేసు ఎక్కువ గౌరవవానికి అర్హుడనిపించుకొన్నాడు. ఎందుకంటే, ప్రతి ఇంటిని ఎవరో ఒకడు కడతాడు, కాని దేవుడు అన్నిటినీ నిర్మించాడు. దేవుని ఇల్లంతటిలో మోషే సేవకునిగా విశ్వాసంతో పని చేసాడు. ఆ కారణంగా, చాలా కాలం తర్వాత మోషే జరుగబోవువాటికి సాక్షిగా ఉండెను. కాని క్రీస్తు దేవుని ఇల్లంతటికి నమ్మకస్తుడైన కుమారుడు. మనం అతిశయించే నిరీక్షణ, ధైర్యంను గట్టిగా పట్టుకొన్నవారమైతే మనం ఆయన ఇల్లౌతాం. అందువల్ల మనం అశిస్తున్న దానికోసం, విశ్వాసంతో ధైర్యంగా ఉంటే ఆ యింటికి చెందినవాళ్ళమౌతాము.

దేవుని ప్రజలకు విశ్రాంతి

7-8 అందువల్ల పరిశుద్ధాత్మ ఈ విధంగా అంటున్నాడు:

“ఆనాడు ఎడారిలో మూర్ఖులై మీరాయనకు ఎదురు తిరిగారు.
    ఆయన సహనాన్ని పరీక్షించారు.
    కాని నేడు మీరాయన మాట వింటే మీ హృదయాలు కఠిన పర్చుకోవద్దు.
నేను నలభై సంవత్సరాలు చేసినదంతా చూసి కూడా
    మీ పూర్వికులు నన్నూ, నా సహనాన్ని పరీక్షించారు.
10 ఆ కారణంగానే, ఆ ప్రజలంటే నాకు కోపం వచ్చింది,
    ‘వాళ్ళ హృదయాలు పెడదారులు పట్టాయి,
    నేను చూపిన దారుల్ని వాళ్ళు చూడ లేదు’ అని అన్నాను.
11 అందుకే, ‘నా విశ్రాంతిలోనికి వాళ్ళను రానివ్వనని
    కోపంతో ప్రమాణం చేశాను.’”(L)

12 సోదరులారా! సజీవంగా ఉన్న దేవునికి దూరమైపోయే హృదయంకాని, విశ్వాసంలేని హృదయంకాని, మీలో ఉండకుండా జాగ్రత్త పడండి. 13 ఆ “నేడు” అనేది యింకా ఉంది గనుక, పరస్పరం ప్రతి రోజు ప్రోత్సాహపరచుకొంటూ ఉండండి. అప్పుడు పాపం మిమ్మల్ని మోసం చెయ్యలేదు. మీలో మూర్ఖత్వం ఉండదు. 14 మనలో మొదటినుండి ఉన్న విశ్వాసాన్ని చివరిదాకా గట్టిగా పట్టుకొనివుంటే, మనం క్రీస్తుతో కలిసి భాగం పంచుకొంటాం. 15 ఇంతకు ముందు చెప్పబడినట్లు:

“ఆనాడు మూర్ఖులై మీరాయనకు ఎదురు తిరిగారు
    కాని, నేడు మీరాయన మాట వింటే అలా చెయ్యకండి.”(M)

16 వీళ్ళందరూ ఈజిప్టు దేశంనుండి మోషే పిలిచుకొని వచ్చిన ప్రజలే కదా! దేవుని స్వరం విని ఎదురు తిరిగింది వీళ్ళే కదా! 17 నలభై సంవత్సరాలు దేవుడు కోపగించుకొన్నది ఎవరిమీద? పాపం చేసి ఎడారిలో పడి చనిపోయినవాళ్ళమీదనే కదా! 18 “నా విశ్రాంతిలోనికి వాళ్ళను రానివ్వను” అని, అవిధేయతగా ప్రవర్తించినవాళ్ళ విషయంలో దేవుడు ప్రమాణం చేయలేదా? 19 వాళ్ళు విశ్వసించలేదు గనుక ఆ విశ్రాంతిలో ప్రవేశించలేకపొయ్యారు. ఇది మనం గమనిస్తూనే ఉన్నాము.

దేవుని విశ్రాంతిలో ప్రవేశించుదుమన్న వాగ్దానం యింకా అలాగే ఉంది. అందువలన అక్కడికి వెళ్ళగలిగే అవకాశాన్ని ఎవ్వరూ జారవిడుచుకోకుండా జాగ్రత్త పడదాం. ఎందుకంటే, వాళ్ళకు ప్రకటింపబడినట్లే మనకు కూడా సువార్త ప్రకటింపబడింది. కాని, వాళ్ళు ఆ సువార్తను విశ్వాసంతో వినలేదు గనుక అది వాళ్ళకు నిష్ర్పయోజనమైపోయింది. సువార్తను విశ్వసించే మనం దేవుని విశ్రాంతిలో ప్రవేశిస్తాము.

“నా కోపంతో ప్రమాణం చేసి చెప్పుచున్నాను:
    ‘నా విశ్రాంతిలోనికి వాళ్ళను రానివ్వను’”(N)

అని దేవుడు అన్నాడు. ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత ఆయన కార్యం ముగిసింది. కాని, “దేవుడు ప్రపంచాన్ని సృష్టించటం ముగించిన తర్వాత విశ్రాంతి తీసుకొనెను”(O) అని ఏడవ రోజును గురించి ఒక చోట వ్రాయబడి ఉంది. దేవుడు ఈ విషయాన్ని గురించి మళ్ళీ చెబుతూ, “నా విశ్రాంతిలోనికి వాళ్ళను రానివ్వను” అని అన్నాడు.

ఆ విశ్రాంతిలో ప్రవేశించటానికి అవకాశం ఇంకావుంది. ఇదివరలో శుభసందేశాన్ని విన్నవాళ్ళు, వాళ్ళ అవిధేయతవల్ల లోపలికి వెళ్ళలేకపొయ్యారు. అందువల్ల దేవుడు మరొక దినాన్ని నిర్ణయించాడు. దాన్ని “ఈ రోజు” అని అన్నాడు. నేను ముందు వ్రాసినట్లు చాలాకాలం తర్వాత దేవుడు దావీదు ద్వారా ఈ విధంగా మాట్లాడాడు:

“ఈ రోజు మీరాయన స్వరం వింటే,
    మూర్ఖంగా ప్రవర్తించకండి.”(P)

యెహోషువ వాళ్ళకు విశ్రాంతి ఇచ్చినట్లయితే దేవుడు ఆ తర్వాత మరొక రోజును గురించి మాట్లాడి ఉండేవాడు కాదు. అందువల్ల, దేవుని ప్రజల కోసం “విశ్రాంతి” కాచుకొని ఉంది. 10 దేవుడు తన పని ముగించి విశ్రమించాడు. అలాగే, దేవుని విశ్రాంతిలో ప్రవేశించే ప్రతి ఒక్కడూ తన పనినుండి విశ్రాంతి పొందుతాడు. 11 అందువల్ల ఆ విశ్రాంతిని పొందటానికి మనం అన్ని విధాలా ప్రయత్నంచేద్దాం. వాళ్ళలా అవిధేయతగా ప్రవర్తించి క్రింద పడకుండా జాగ్రత్తపడదాం.

12 దైవసందేశం సజీవమైంది. దానిలో చురుకుదనం ఉంది. అది రెండు వైపులా పదునుగానున్న కత్తికన్నా పదునైంది. అది చొచ్చుకొని పోయి ఆత్మను, ప్రాణాన్ని, కీళ్ళను, ఎముకలో ఉన్న మూలుగను విభాగించగలదు. అది మనస్సు యొక్క భావాలమీద, ఆలోచనల మీద తీర్పు చెప్పగలదు. 13 సృష్టిలో ఉన్న ఏ వస్తువూ దేవుని దృష్టినుండి తప్పించుకోలేదు. కళ్ళ ముందు పరచబడినట్లు ఆయనకు అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. అలాంటి దేవునికి మనం మనకు సంబంధించిన లెక్కల్ని చూపవలసి వుంటుంది.

యేసు గొప్ప ప్రధాన యాజకుడు

14 పరలోకానికి వెళ్ళిన యేసు దేవుని కుమారుడు. ఆయనే మన ప్రధాన యాజకుడు. మనం బహిరంగంగా అంగీకరించిన విశ్వాసాన్ని విడువకుండా దృఢంగా ఉండాలి. 15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతలను చూసి సానుభూతి చెందుతూ ఉంటాడు. ఎందుకంటే ఆయన మనలాగే అన్ని రకాల పరీక్షలకు గురి అయ్యాడు. కాని, ఆయన ఏ పాపమూ చెయ్యలేదు. 16 అందువలన మనకు అనుగ్రహం ప్రసాదించే దేవుని సింహాసనం దగ్గరకు విశ్వాసంతో వెళ్ళుదాం. అలా చేస్తే మనకు అవసరమున్నప్పుడు, ఆయన దయ, అనుగ్రహము మనకు లభిస్తాయి.

ఆధ్యాత్మిక విషయాల్లో, తమ పక్షాన పని చెయ్యటానికి ప్రజలు తమ నుండి ప్రధాన యాజకుని ఎన్నుకొంటారు. పాప పరిహారార్థం అర్పించే కానుకల్ని, బలుల్ని దేవునికి యితడు సమర్పిస్తాడు. ఇతనిలో కూడా ఎన్నో రకాల బలహీనతలు ఉంటాయి కనుక, అజ్ఞానంతో తప్పులు చేస్తున్న ప్రజల పట్ల యితడు సానుభూతి కనుబరుస్తాడు. ఈ కారణంగానే, ప్రజల పాపాలకు బలిని అర్పించినట్లే తన పాపాలకు కూడా బలిని అర్పించవలసి వుంటుంది.

ప్రధాన యాజకుని స్థానం గౌరవనీయమైంది. ఆ స్థానాన్ని ఎవ్వరూ, స్వయంగా ఆక్రమించలేరు. దేవుడు అహరోనును పిలిచినట్లే ఈ స్థానాన్ని ఆక్రమించటానికి అర్హత గలవాణ్ణి పిలుస్తాడు. క్రీస్తు ప్రధాన యాజకుని యొక్క గౌరవ స్థానాన్ని స్వయంగా ఆక్రమించలేదు. దేవుడాయనతో,

“నీవు నా కుమారుడవు.
    నేడు నేను నీకు తండ్రినయ్యాను”(Q)

అని చెప్పి మహిమ పరచాడు. మరొక చోట, ఇలా అన్నాడు:

“నీవు మెల్కీసెదెకు వలె చిరకాలం
    యాజకుడవై ఉంటావు.”(R)

యేసు తాను భూమ్మీద జీవించినప్పుడు తనను చావునుండి రక్షించగల దేవుణ్ణి కళ్ళనిండా నీళ్ళు పెట్టుకొని పెద్ద స్వరంతో ప్రార్థించి వేడుకొన్నాడు. ఆయనలో భక్తి, వినయం ఉండటంవల్ల దేవుడాయన విన్నపం విన్నాడు. యేసు దేవుని కుమారుడైనా, తాననుభవించిన కష్టాల మూలంగా విధేయతతో ఉండటం నేర్చుకొన్నాడు. పరిపూర్ణత పొందాక, తన పట్ల విధేయతగా ఉన్నవాళ్ళందరికీ శాశ్వతమైన రక్షణ ప్రసాదించ గలవాడయ్యాడు. 10 దేవుడు మెల్కీసెదెకు యొక్క క్రమంలో యేసును ప్రధాన యాజకునిగా నియమించాడు.

మీరింకా పసికందులు

11 ఈ విషయాన్ని గురించి మేము చెప్పవలసింది ఎంతో ఉంది. కాని మీలో గ్రహించే శక్తి తక్కువగా ఉండటంవల్ల, విడమర్చి చెప్పటానికి చాలా కష్టమౌతుంది. 12 నిజం చెప్పాలంటే, మీకిదివరకే భోధించి ఉండవలసింది. కాని దైవసందేశంలోని ప్రాథమిక సత్యాలను మీకు మళ్ళీ నేర్పించవలసిన అవసరం కలుగుతోంది. అంటే, మీరు పాలు త్రాగగలరు కాని, ఆహారం తినగల శక్తి మీకింకా కలుగలేదు. 13 పాలతో జీవించేవాళ్ళు యింకా పసికందులే కనుక వాళ్ళకు మంచి చెడులను గురించి తెలియదు. 14 కాని, ఆహారం ఎదిగినవాళ్ళు తినగలుగుతారు. అంటే, వాళ్ళు జీవితానికి అలవాటు పడి మంచి చెడులను గుర్తించటంలో నేర్పు సంపాదించారన్న మాట.

అందువల్ల క్రీస్తును గురించి బోధింపబడిన ప్రాథమిక పాఠాలను చర్చించటం మాని ముందుకు వెళ్తూ పరిపూర్ణత చెందుదాం. ఘోరమైన తప్పులు చేసి మారుమనస్సు పొందటం, దేవుని పట్ల విశ్వాసం, బాప్తిస్మమును[b] గురించి బోధించటం, చేతులు తల మీద ఉంచి అభిషేకించటం, చనిపోయినవాళ్ళు తిరిగి బ్రతికి రావటం, శాశ్వతమైన తీర్పు, యివి మన పునాదులు. ఈ పునాదుల్ని మళ్ళీ మళ్ళీ వేయకుండా ఉందాం. దేవుడు సమ్మతిస్తే అలాగే జరుగుతుంది.

ఒకసారి వెలిగింపబడినవాళ్ళు, పరలోకం నుండి పొందిన వరాన్ని రుచి చూసినవాళ్ళు, ప్రవిత్రాత్మలో భాగం పంచుకున్నవాళ్ళు, దైవసందేశం యొక్క మంచితనాన్ని రుచి చూసినవాళ్ళు, రానున్న కాలం యొక్క శక్తిని రుచి చూచినవాళ్ళు పడిపోతే మారుమనస్సు పొందేటట్లు చేయటం అసంభవం. ఎందుకంటే, వాళ్ళు ఈ విధంగా చేసి దేవుని కుమారుణ్ణి మళ్ళీ సిలువవేసి చంపుతున్నారు. ఆయన్ని నలుగురిలో అవమానపరుస్తున్నారు.

తన మీద తరుచుగా పడ్తున్న వర్షాన్ని పీల్చుకొనే భూమి, తనను దున్నిన రైతులకు పంటనిచ్చిన భూమి దేవుని ఆశీస్సులు పొందుతుంది. కాని, ముళ్ళ మొక్కలు, కలుపుమొక్కలతో పెరిగే భూమి నిరుపయోగమైనది. అలాంటి భూమిని దేవుడు శపిస్తాడు. చివరకు దాన్ని కాల్చి వేస్తాడు.

ప్రియమైన సోదరులారా! మేము మాట్లాడుతున్న ఈ రక్షణ సంబంధమైన విషయాల ద్వారా మీకు మంచి కలుగుతుందనే విశ్వాసం మాకుంది. 10 దేవుడు అన్యాయం చెయ్యడు. మీరు దేవుని ప్రజలకు సహాయం చేసారు. ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు. మీరు చేసిన కార్యాలను మీరాయన పట్ల చూపిన ప్రేమను ఆయన మరిచిపోడు. 11 మీ నిరీక్షణ సంపూర్ణమగునట్లుగా మీలో ప్రతి ఒక్కడు మీరిదివరకు చూపిన ఆసక్తి చివరివరకు చూపాలి. 12 మీరు సోమరులుగా నుండకూడదు. కాని వాగ్దానము చేయబడినదానిని విశ్వాసము ద్వారా, సహనము ద్వారా పొందినవారిని అనుసరించండి.

13 దేవుడు అబ్రాహాముతో వాగ్దానం చేసినప్పుడు తనకంటే గొప్పవాడెవ్వడూ లేనందు వలన స్వయంగా తన మీదే ప్రమాణం తీసుకొంటూ, 14 ఇలా అన్నాడు: “నేను నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాను. నీ సంతతిని అభివృద్ధి పరుస్తాను.” 15 అబ్రాహాము ఓర్పుతో కాచుకొన్నాడు. దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చాడు.

16 ప్రజలు తమకన్నా గొప్పవాళ్ళ మీద ప్రమాణం చేస్తారు. ఈ ప్రమాణాలు వివాదాలు సాగనీయకుండా చేసి మాటల్లో మీ సత్యాన్ని దృఢ పరుస్తాయి. 17 దేవుడు తన వాగ్దానం విషయంలో తన ఉద్దేశ్యాన్ని మార్చుకోనని వాగ్దానం పొందిన వారసులకు స్పష్టం చేయాలనుకున్నాడు. అందువల్ల ఆ వాగ్దానాన్ని తన మీద ప్రమాణం చేసి దృఢపరిచాడు. 18 అందువల్ల ఈ “రెండూ” మార్పు చెందలేవు. వీటివిషయంలో దేవుడు అసత్యమాడలేడు.

తానివ్వబోయేవాటికోసం ఆశాభావంతో పరుగెత్తుతున్నవాళ్ళకు ప్రోత్సాహం కలగాలని ఈ ప్రమాణం చేశాడు. 19 భద్రతను, దృఢత్వాన్ని కలిగించే ఈ నిరీక్షణ మన ఆత్మలకు లంగరు లాంటిది. ఈ నిరీక్షణ తెరవెనుక లోపలి భాగంలో స్థిరముగా ప్రవేశించగలదు. 20 యేసు మన కోసం, మనకన్నా ముందు ఆ తెరలోపలికి వెళ్ళాడు. మెల్కీసెదెకు క్రమంలో యేసు కూడా శాశ్వతంగా ప్రధాన యాజకుడుగా ఉంటాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International