Beginning
యెరూషలేముకు ప్రయాణం
21 మేము సెలవు పుచ్చుకొని నేరుగా “కోసు” కు ఓడలో ప్రయాణం చేసాము. మరుసటి రోజు “రొదు” చేరుకున్నాము. అక్కడినుండి బయలుదేరి “పతర” చేరుకున్నాము. 2 ఒక ఓడ ఫొనీషియ వెళ్ళటం గమనించి అందులో ప్రయాణం చేసాము.
3 సైప్రసు ద్వీపం కనపడ్డాక ఆ ద్వీపానికి దక్షిణంగా వెళ్ళి సిరియ దేశం చేరుకున్నాం. మా ఓడ సరుకు దింపవలసి ఉంది కనుక తూరు ద్వీపంలో ఆగాము. 4 అక్కడ భక్తులుండటం గమనించి వాళ్ళతో ఏడు రోజులున్నాము. వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా యెరూషలేము వెళ్ళవద్దని పౌలుతో చెప్పారు. కాని వెళ్ళవలసిన సమయం రాగానే ప్రయాణమై మా దారిన మేము వెళ్ళాము. 5 విశ్వాసులు, తమ భార్యాబిడ్డలతో కలిసి మా వెంట ఊరి అవతలి వరకు వచ్చారు. సముద్ర తీరం చేరుకున్నాక, అందరమూ మోకరిల్లి ప్రార్థించాము. 6 పరస్పరం వీడ్కోలు చెప్పుకున్నాక మేము ఓడనెక్కాము. వాళ్ళు తమ తమ యిండ్లకు తిరిగి వెళ్ళిపోయారు.
7 మేము తూరునుండి మా ప్రయాణం సాగించి తొలేమాయి తీరం చేరుకున్నాము. అక్కడున్న సోదరుల్ని కలుసుకొని వాళ్ళతో ఒక రోజు గడిపాము. 8 మరుసటి రోజు ప్రయాణమై కైసరియ చేరుకున్నాము. అక్కడ సువార్త ప్రచారం చేస్తున్న ఫిలిప్పు అనే వ్యక్తి యింట్లో బసచేసాము. అతడు యెరూషలేములో ఎన్నుకోబడ్డ ఏడుగురిలో ఒకడు. 9 అతనికి నలుగురు పెళ్ళికాని కూతుర్లు ఉన్నారు. వాళ్ళు దైవేచ్ఛను చెప్పటంలో ప్రతిభావంతులు.
10 అక్కడ మేము చాలా రోజులున్నాక, అగబు అనే ప్రవక్త యూదయనుండి వచ్చాడు. 11 అతడు మా దగ్గరకు వచ్చి, పౌలు నడికట్టు తీసుకొని దాంతో తన కాళ్ళు చేతులు కట్టివేసుకొని ఈ విధంగా అన్నాడు: “‘ఈ నడికట్టు ఎవరిదో, అతణ్ణి యెరూషలేములో యూదులు ఈ విధంగా కట్టేసి యూదులు కానివాళ్ళకు అప్పగిస్తారు’ అని పరిశుద్ధాత్మ చెపుతున్నాడు.”
12 ఇది విని అక్కడి ప్రజలు, మేము కలిసి పౌలును యెరూషలేము వెళ్ళవద్దని బ్రతిమలాడాము. 13 పౌలు, “మీరు దుఃఖించి నా గుండెలెందుకు పగులగొడ్తున్నారు? యేసు ప్రభువు పేరిట బంధింపబడటానికే కాదు, మరణించటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను!” అని సమాధానం చెప్పాడు.
14 మేము అతని మనస్సు మార్చలేమని తెలుసుకొన్నాక, “ప్రభువు ఇచ్ఛ ఏ విధంగా ఉంటే ఆ విధంగా జరుగుతుంది,” అనుకొని మేమేమీ మాట్లాడలేదు.
15 ఆ తర్వాత అంతా సిద్ధమై యెరూషలేము వెళ్ళాము. 16 కైసరియనుండి కొందరు శిష్యులు మా వెంట వచ్చి మమ్మల్ని “మ్నాసోను” అనే అతని యింటికి పిలుచుకు వెళ్ళారు. అక్కడ మా బస. మ్నాసోను సైప్రసు ద్వీపానికి చెందినవాడు. మొదట్లో విశ్వాసులైన వాళ్ళలో ఇతడు ఒకడు.
పెద్దల్ని కలుసుకోవటం
17 మేము యెరూషలేముకు వచ్చాము. అక్కడి సోదరులు మాకు మనసారా స్వాగతమిచ్చారు. 18 మరుసటి రోజు మేము పౌలుతో కలిసి యాకోబును చూడాలని వెళ్ళాము. అక్కడ సంఘ పెద్దలందరూ ఉన్నారు. 19 పౌలు వాళ్ళను కుశల ప్రశ్నలు అడిగి తాను చేసిన కార్యాల వల్ల దేవుడు యూదులు కానివాళ్ళతో చేసిన వాటినన్నిటిని ఒక్కొక్కటి విడమరిచి చెప్పాడు.
20 వాళ్ళా మాటలు విని దేవుణ్ణి స్తుతించారు. ఆ తర్వాత పౌలుతో, “సోదరుడా! వేలకొలది యూదులు విశ్వాసులవటం నీవు చూస్తున్నావు. మోషే ధర్మశాస్త్రాన్ని పాటించటం ముఖ్యమని వాళ్ళ అభిప్రాయం. 21 కాని నీవు మోషే ధర్మశాస్త్రాన్ని వదలమని, కుమారులకు సున్నతి చేయించటం తప్పని, యూదుల ఆచారాలను పాటించవద్దని యూదులు కానివాళ్ళ మధ్య నివసిస్తున్న యూదులకు బోధించినట్లు వీళ్ళకు ఎవరో చెప్పారు.
22 “ఏం చెయ్యాలి? నీవు వచ్చిన విషయం వాళ్ళకు తప్పక తెలుస్తుంది. 23 అందువల్ల మేము చెప్పినట్లు చెయ్యి. మా దగ్గర మ్రొక్కుబడి ఉన్నవాళ్ళు నలుగురున్నారు. 24 వీళ్ళను నీ వెంట పిలుచుకెళ్ళు. వాళ్ళతో కలిసి శుద్ధీకరణ చేయి. వాళ్ళు తల వెంట్రుకలు తీయించుకోవటానికి అయ్యే డబ్బు చెల్లించు. అలా చేస్తే నీ గురించి విన్నవి నిజం కాదని అందరికీ రుజువౌతుంది. మోషే ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ జీవిస్తున్నావని వాళ్ళకు తెలుస్తుంది.
25 “ఇక యూదులుకాని భక్తుల విషయంలో మేమిదివరకే మా అభిప్రాయం తెలియచేసాము. వాళ్ళు ఈ నియమాన్ని మాత్రం పాటిస్తే చాలని ఇదివరకే వాళ్ళకు వ్రాసి పంపాము:
‘విగ్రహాలకు పెట్టిన నైవేద్యం ముట్టరాదు.
రక్తాన్ని, గొంతు నులిపి చంపిన జంతువుల మాంసాన్ని తినరాదు.
లైంగిక పాపము చేయరాదు’” అని అన్నారు.
పౌలు బంధింపబడటం
26 మరుసటి రోజు పౌలు వాళ్ళను పిలుచుకెళ్ళి వాళ్ళతో సహా శుద్ధి చేసుకొన్నాడు. ఆ తదుపరి యెరూషలేము మందిరానికి వెళ్ళి పూర్తిగా శుద్ధి కావటానికి ఎన్ని రోజులు వేచివుండాలో ప్రకటించాడు. చివరి రోజున తనతో వచ్చిన ప్రతి ఒక్కరి పక్షాన బలి ఇవ్వవచ్చని చెప్పాడు.
27-28 ఏడు రోజులు పూర్తిగా గడవక ముందే ఆసియ ప్రాంతంనుండి వచ్చిన కొందరు యూదులు పౌలును మందిరంలో చూసారు. వాళ్ళు ప్రజల్ని పురికొలిపి పౌలును బంధించారు. ప్రజలతో, “ఇశ్రాయేలు ప్రజలారా! మాతో సహకరించండి. ఇతడు అన్ని ప్రాంతాలు తిరిగి ఇశ్రాయేలు ప్రజల్ని గురించి, మోషే ధర్మశాస్త్రాన్ని గురించి యెరూషలేములోని మందిరాన్ని గురించి విరుద్ధంగా అందరికీ బోధించాడు. ఇప్పుడు గ్రీకుల్ని కొందర్ని మందిరంలోకి పిలుచుకొని వెళ్ళి, ఈ పవిత్ర స్థానాన్ని అపవిత్రం చేసాడు” అని బిగ్గరగా అన్నారు. 29 ప్రజలు ఎఫెసుకు చెందిన త్రోఫిమును పౌలుతో కలిసి పట్టణంలో తిరగటం చూసారు. కనుక పౌలు అతణ్ణి మందిరంలోకి పిలుచుకెళ్ళాడనుకున్నారు.
30 పట్టణమంతా అల్లర్లు వ్యాపించాయి. ప్రజలు అన్ని వైపులనుండి పరుగెత్తికొంటూ వచ్చారు. పౌలును పట్టుకొని మందిరం అవతలికి లాగి వెంటనే మందిరం యొక్క తలుపులు మూసి వేసారు. 31 వాళ్ళు, అతణ్ణి చంపే ప్రయత్నంలో ఉన్నారు. యెరూషలేమంతా అల్లర్లతో నిండిపోయిందనే వార్త సైన్యాధిపతికి పంపబడింది. 32 ఆ సైన్యాధిపతి వెంటనే కొందరు సైనికుల్ని, సైన్యాధిపతుల్ని తన వెంట బెట్టుకొని ప్రజలు గుమి కూడిన చోటికి వెళ్ళాడు. వాళ్ళు సైన్యాధిపతిని, సైనికుల్ని చూసి, పౌలును కొట్టడం మానివేసారు.
33 సైన్యాధిపతి అతని దగ్గరకు వెళ్ళి, అతణ్ణి పట్టుకొని యినుప గొలుసులతో కట్టి వేయమని ఆజ్ఞాపిస్తూ సైనికులకు అప్పగించాడు. “అతడెవరు? ఏం చేసాడు?” అని తదుపరి ప్రజల్ని విచారించాడు. 34 ప్రజలు బిగ్గరగా కేకలు వేస్తూ, ఒకరొకటి, మరొకరు మరొకటి చెప్పారు. అల్లరిగా ఉండటం వల్ల సైన్యాధిపతికి జరిగిందేమిటో తెలియలేదు. పౌలును కోటలోకి తీసుకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు. 35 పౌలు మెట్లు ఎక్కుతుండగా ప్రజలు అల్లరి చేసారు. అందువల్ల సైనికులు పౌలును మోసికొని కోటలోకి తీసుకు వెళ్ళారు. 36 ప్రజలు అతణ్ణి వెంటాడుతూ, “అతణ్ణి చంపాలి!” అని బిగ్గరగా నినాదం చేసారు.
37 సైనికులు పౌలును కోటలోకి తీసుకు వెళ్ళే ముందు, అతడు సైన్యాధిపతితో, “నేను మీతో కొద్దిగా మాట్లాడవచ్చా?” అని అడిగాడు.
సైన్యాధిపతి, “నీవు గ్రీకు భాష మాట్లాడుతున్నావే! 38 క్రితంలో ప్రభుత్వాన్ని ధిక్కరించి నాలుగు వేల మంది హంతకుల్ని ఎడారుల్లోకి పిలుచుకు వెళ్ళిన ఈజిప్టు దేశపువాడవు నీవే కదూ?” అని అడిగాడు.
39 పౌలు, “నేను యూదుణ్ణి, కిలికియ దేశంలోని తార్సు అనే ముఖ్య పట్టణానికి చెందిన పౌరుణ్ణి. నన్ను ప్రజలతో మాట్లాడనివ్వండి!” అని అడిగాడు.
40 సైన్యాధిపతి సరేనన్నాడు. పౌలు మెట్ల మీద నిలబడి చేతులెత్తి శాంతించమని ప్రజల్ని కోరాడు. అందరూ శాంతించాక “హెబ్రీ” భాషలో ఈ విధంగా మాట్లాడాడు:
పౌలు ప్రజలతో మాట్లాడటం
22 “పెద్దలారా! సోదరులారా! నా సమాధానం వినండి.”
2 అతడు హెబ్రీ భాషలో మాట్లాడటం విని వాళ్ళు మరింత నిశ్శబ్దం వహించారు.
3 పౌలు ఈ విధంగా చెప్పుకొంటూ పొయ్యాడు: “నేను యూదుణ్ణి, కిలికియ దేశంలోని తార్సు అనే పట్టణంలో జన్మించాను. ఈ పట్టణంలో పెరిగాను. మన పూర్వులు అప్పగించిన ధర్మశాస్త్రంలో గమలీయేలు వద్ద సంపూర్ణంగా శిక్షణ పొందాను. మీరు ఈనాడు దేవుని పట్ల ఏ పద్ధతిననుసరించి మీ భక్తిని ప్రదర్శిస్తున్నారో అదే పద్ధతిలో నేనూ ప్రదర్శిస్తూ ఉండేవాణ్ణి. 4 నేను యేసు మార్గాన్ని అనుసరించినవాళ్ళను ఎన్నో హింసలు పెట్టాను. తద్వారా కొందరికి మరణం కూడా సంభవించింది. ఆడా, మగా అనే భేదం లేకుండా అందర్ని బంధించి కారాగారంలో వేసేవాణ్ణి.
5 “ప్రధానయాజకుడు, మహాసభకు చెందిన పెద్దలు దీనికి సాక్ష్యం. వాళ్ళను, డెమాస్కసులోని వాళ్ళ సోదరులకు ఉత్తరాలు వ్రాసి ఇవ్వమని అడిగి తీసుకొన్నాను. అక్కడికి వెళ్ళి యేసు మార్గాన్ని అనుసరిస్తున్నవాళ్ళను బంధించి యెరూషలేమునకు పట్టుకు వచ్చి వాళ్ళకు శిక్ష ఇవ్వాలనేదే నా ఉద్దేశ్యం.
పౌలు తన మార్పునుగూర్చి చెప్పటం
6 “నేను డెమాస్కసుకు వెళ్తూ, ఆ పట్టణపు పొలిమేరలకు చేరగానే అకస్మాత్తుగా ఆకాశంనుండి తేజోవంతమైన వెలుగు నా చుట్టూ ప్రకాశించింది. అప్పుడు మధ్యాహ్నం సుమారు పన్నెండు గంటలు. 7 నేను నేలకూలిపొయ్యాను. నాతో ఒక స్వరం, ‘సౌలా! సౌలా! నన్నెందుకు హింసిస్తున్నావు!’ అని అడిగింది.
8 “‘మీరెవరు ప్రభూ!’ అని నేనడిగాను. ‘నేను నజరేతుకు చెందిన యేసును. నీవు హింసిస్తున్నది నన్నే!’ అని ఆ స్వరం జవాబు చెప్పింది. 9 నాతో ఉన్నవాళ్ళు ఆ వెలుగును చూసారు. కాని ఆ స్వరం ఏం మాట్లాడుతోందో వాళ్ళకు అర్థం కాలేదు.
10 “‘నన్నేం చేయమంటారు ప్రభూ!’ అని నేనడిగాను. ‘లేచి డెమాస్కసుకు వెళ్ళు. అక్కడికి వెళ్ళాక నీవు చేయవలసిన పనులు చెప్పబడతాయి’ అని ప్రభువు అన్నాడు. 11 ఆ వెలుగు నన్ను గ్రుడ్డివానిగా చెయ్యటం వల్ల నాతో ఉన్నవాళ్ళు నన్ను నా చేయి పట్టుకొని డెమాస్కసుకు నడిపించుకు వెళ్ళారు.
12 “అననీయ అనే పేరుగల వ్యక్తి నన్ను చూడటానికి వచ్చాడు. అతడు మోషే ధర్మశాస్త్రాన్ని శ్రద్ధతో పాటించే విశ్వాసి. అక్కడ నివసిస్తున్న యూదులందరు అతణ్ణి గౌరవించేవాళ్ళు. అననీయ నా ప్రక్కన నిల్చొని 13 ‘సౌలా! నా సోదరా! నీకు దృష్టి కలుగుగాక!’ అని అన్నాడు. తక్షణం నేను చూడగలిగాను.
14 “ఆ తదుపరి అతడు, ‘మన పూర్వికులు పూజించిన దేవుడు, తాను చేయదలచిన విషయం తెలుపటానికి, నీతిమంతుడైనటువంటి తన సేవకుణ్ణి చూడటానికి, ఆయన నోటిమాటలు వినటానికి నిన్ను ఎన్నుకొన్నాడు. 15 నీవు చూసినవాటిని గురించి, విన్నవాటిని గురించి ఆయన పక్షాన అందరి ముందు సాక్ష్యం చెబుతావు. 16 ఇంకా ఎందుకు చూస్తున్నావు? లే! బాప్తిస్మము పొందు. ఆయన పేరున ప్రార్థించి నీ పాపాలు కడుక్కో!’ అని అన్నాడు.
17 “నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి మందిరంలో ప్రార్థనలు చేస్తుండగా నాకు దర్శనం కలిగింది. 18 ఆ దర్శనంలో ప్రభువు, ‘త్వరగా లే! వెంటనే యెరూషలేము వదిలి వెళ్ళిపో! నా గురించి నీవు చెప్పే సత్యాన్ని వాళ్ళు అంగీకరించరు’ అని అనటం విన్నాను.
19 “నేను, ‘ప్రభూ! నేను యూదుల ప్రతి సమాజమందిరంలోకి వెళ్ళి భక్తుల్ని బంధించి శిక్షించిన విషయం అందరికీ తెలుసు. 20 నీ సాక్షి స్తెఫను తన రక్తాన్ని చిందించినప్పుడు నేను నా అంగీకారం చూపుతూ, అతణ్ణి చంపుతున్నవాళ్ళ దుస్తుల్ని కాపలా కాస్తూ అక్కడే నిలుచొని ఉన్నాను’ అని అన్నాను.
21 “అప్పుడు ప్రభువు నాతో, ‘వెళ్ళు! నిన్ను దూరంగా యూదులు కానివాళ్ళ దగ్గరకు పంపుతాను’ అని అన్నాడు.”
22 ప్రజలు పౌలు చెప్పింది అంతదాకా విన్నారు. కాని అతడు ఈ మాట అనగానే, బిగ్గరగా, “అతడు బ్రతకటానికి వీల్లేదు, చంపి పారవేయండి!” అని కేకలు వేసారు. 23 వాళ్ళు తమ దుస్తుల్ని చింపి పారవేస్తూ, దుమ్ము రేపుతూ కేకలు వేసారు. 24 సేనాధిపతి పౌలును కోట లోపలికి తీసుకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు. ప్రజలు అతణ్ణి చూసి ఎందుకిలా కేకలు వేస్తున్నారో తెలుసుకోవటానికి పౌలును కొరడాలతో కొట్టమని ఆజ్ఞాపించాడు. 25 అతణ్ణి కొట్టటానికి కట్టి వేస్తుండగా పౌలు అక్కడున్న శతాధిపతితో, “నేరస్తుడని నిర్ణయం కాకముందే రోమా పౌరుణ్ణి కొరడా దెబ్బలు కొట్టటం న్యాయమేనా?” అని అడిగాడు.
26 ఇది విన్నాక ఆ సేనాధిపతి, సహస్రాధిపతి దగ్గరకు వెళ్ళి పౌలు అన్నది చెబుతూ, “మీరేమి చేస్తున్నారో మీకు తెలుసా? అతడు రోమా పౌరుడట!” అని అన్నాడు.
27 ఆ సహస్రాధిపతి పౌలు దగ్గరకు వెళ్ళి, “ఇప్పుడు చెప్పు! నీవు రోమా పౌరుడివా?” అని అడిగాడు.
“ఔను!” పౌలు సమాధానం చెప్పాడు.
28 సహస్రాధిపతి, “నేను రోమా పౌరుడవటానికి చాలా డబ్బు యివ్వవలసి వచ్చింది” అని అన్నాడు.
పౌలు, “నేను పుట్టినప్పటినుండి రోమా పౌరుణ్ణి!” అని అన్నాడు.
29 అతణ్ణి ప్రశ్నలడగాలనుకొన్నవాళ్ళు తక్షణమే వెనుకంజ వేసారు. ఆ సహస్రాధిపతి కూడా తాను రోమా పౌరుణ్ణి బంధించిన విషయం గమనించి భయపడిపోయాడు.
పౌలు యూదుల నాయకులతో మాట్లాడటం
30 అతడు పౌలుపై యూదులు మోపిన నిందకు సరియైన కారణం తెలుసుకోవాలనుకొన్నాడు. కనుక మరుసటి రోజు ప్రధానయాజకుల్ని, మిగతా సభ్యుల్ని సమావేశం కమ్మని ఆజ్ఞాపించాడు. పౌలును విడుదల చేసి వాళ్ళ ఎదుటకు పిలుచుకు వెళ్ళాడు.
23 పౌలు మహాసభ వైపు సూటిగా చూసి, “సోదరులారా! నేను ఈనాటి వరకు నిష్కల్మషంగా జీవించాను. దీనికి దేవుడే సాక్షి” అని అన్నాడు. 2 ఈ మాటలు అనగానే ప్రధాన యాజకుడైన అననీయ, పౌలు ప్రక్కన నిలుచున్నవాళ్ళతో, “అతని మూతి మీద కొట్టి నోరు మూయించండి” అని ఆజ్ఞాపించాడు. 3 అప్పుడు పౌలు అతనితో, “దేవుడు నీ నోరు మూయిస్తాడు. నీవు సున్నం కొట్టిన గోడవి. ధర్మశాస్త్రం ప్రకారం నా మీద తీర్పు చెప్పటానికి నీవక్కడ కూర్చున్నావు. కాని నన్ను కొట్టమని ఆజ్ఞాపించి నీవా ధర్మశాస్త్రాన్నే ఉల్లంఘిస్తున్నావు” అని అన్నాడు.
4 పౌలు ప్రక్కన నిలుచున్నవాళ్ళు, “దేవుని ప్రధానయాజకుని అవమానించటానికి నీకెంత ధైర్యం?” అని అన్నారు.
5 అందుకు పౌలు, “సోదరులారా! ప్రధానయాజకుడని నాకు తెలియదు. మన లేఖనాల్లో యిలా వ్రాయబడివుంది, ‘ప్రజానాయకుల్ని గురించి చెడుగా మాట్లాడరాదు.’”(A)
6 పౌలుకు వాళ్ళలో కొందరు సద్దూకయ్యులని, మరి కొందరు పరిసయ్యులని తెలుసు. అందువల్ల అతడు ఆ మహాసభలో బిగ్గరగా, “సోదరులారా! నేను పరిసయ్యుణ్ణి. నా తండ్రి పరిసయ్యుడు. నేను యిక్కడ నిందితునిగా నిలుచోవటానికి కారణం చనిపోయినవాళ్ళు బ్రతికి వస్తారన్నదే నాలోని ఆశ” అని అన్నాడు.
7 అతడీ మాట అనగానే, సద్దూకయ్యులకు, పరిసయ్యులకు సంఘర్షణ జరిగి వాళ్ళు రెండు భాగాలుగా చీలిపోయారు. 8 సద్దూకయ్యులు మనుష్యులు బ్రతికి రారని, దేవదూతలు, ఆత్మలు అనేవి లేవని వాదిస్తారు. కాని పరిసయ్యులు యివి ఉన్నాయి అంటారు. 9 సభలో పెద్ద అలజడి మొదలైంది. పరిసయ్యులకు సంబంధించిన కొందరు పండితులు లేచి బిగ్గరగా వాదిస్తూ, “యితనిలో మాకే తప్పు కనిపించలేదు. దేవదూతో లేక ఆత్మో అతనితో మాట్లాడి ఉండవచ్చు!” అని అన్నారు.
10 సంఘర్షణ చాలా తీవ్రంగా మారిపోయింది. ఆ రెండు గుంపులు కలిసి, పౌలును చీల్చివేస్తారేమోనని సహస్రాధిపతి భయపడిపొయ్యాడు. అతడు తన సైనికులతో, “వెళ్ళండి! అతణ్ణి వాళ్ళనుండి విడిపించుకొచ్చి కోట లోపలికి తీసుకెళ్ళండి” అని ఆజ్ఞాపించాడు.
11 ఆ రాత్రి ప్రభువు పౌలు ప్రక్కన నిలుచొని, “ధైర్యంగా ఉండి, నా గురించి నీవు యెరూషలేములో బోధించిన విధంగా రోమాలో కూడా బోధించాలి” అని అన్నాడు.
పౌలును చంపటానికి కుట్ర
12 మరుసటి రోజు యూదులు ఒక కుట్ర పన్నారు. పౌలును చంపేవరకు అన్నపానాలు ముట్టరాదని వాళ్ళందరూ ఒక ప్రమాణం తీసుకున్నారు. 13 నలభై మంది కంటే ఎక్కువే ఈ కుట్రలో పాల్గొన్నారు. 14 వాళ్ళు ప్రధానయాజకుల దగ్గరకు, పెద్దల దగ్గరకు వెళ్ళి, “మేము పౌలును చంపే వరకు అన్నపానాలు ముట్టరాదని ప్రమాణం తీసుకున్నాం. 15 కనుక మీరు మహాసభ పక్షాన ‘అతణ్ణి గురించి మేము యింకా విశదంగా తెలుసుకోవాలనుకొంటున్నాము’ అని అబద్ధాలు చెప్పి, ఆ సాకుతో పౌలును పంపమని సహస్రాధిపతిని అడగండి. అతడు ఇక్కడికి చేరకముందే అతణ్ణి చంపటానికి మేము సిద్ధంగా ఉంటాము” అని అన్నారు.
16 పౌలు మేనల్లుడు ఈ కుట్రను గూర్చి విని కోటలోకి వెళ్ళి పౌలుతో చెప్పాడు. 17 పౌలు శతాధిపతిని పిలిచి, “ఈ యువకుణ్ణి సహస్రాధిపతి దగ్గరకు పిలుచుకెళ్ళు. అతనికి యితడు చెప్పవలసిన విషయం ఒకటుంది” అని అన్నాడు. 18 శతాధిపతి ఆ యువకుణ్ణి సహస్రాధిపతి దగ్గరకు పిలుచుకెళ్ళి, “చెరసాలలో ఉన్న పౌలు నన్ను పిలిచి ఈ యువకుణ్ణి మీ దగ్గరకు పిలుచుకెళ్ళమన్నాడు. ఇతడు మీకొక విషయం చెప్పదలిచాడు!” అని అన్నాడు.
19 సహస్రాధిపతి ఆ యువకుని చేయి పట్టుకొని ప్రక్కకు తీసుకెళ్ళి, “నాకేం చెప్పాలనుకొన్నావు?” అని అడిగాడు.
20 ఆ యువకుడు, “పౌలును గురించి యింకా విశదంగా తెలుసుకోవాలనే సాకుతో యూదులందరూ కలిసి, పౌలును రేపు మహాసభకు పిలుచుకు రమ్మని మీకు విజ్ఞాపన చెయ్యాలనుకొంటున్నారు. 21 వాళ్ళ విజ్ఞాపనను అంగీకరించకండి. నలభై కంటే ఎక్కువ మంది పౌలును పట్టుకోవటానికి కాచుకొని ఉన్నారు. అతణ్ణి చంపే దాకా అన్నపానీయాలు ముట్టమని ప్రమాణం తీసుకున్నారు” అని అన్నాడు.
22 సహస్రాధిపతి యువకుణ్ణి వెళ్ళమని చెబుతూ, తనకీవిషయం చెప్పినట్టు ఎవ్వరికీ చెప్పవద్దని జాగ్రత్త పరిచాడు.
పౌలును కైసరియకు పంపటం
23 తదుపరి తన శతాధిపతుల్ని యిద్దర్ని పిలిచి, “రెండు వందల సైనికుల్ని, డెబ్బైమంది గుఱ్ఱపు రౌతుల్ని, బళ్ళేలు ఉపయోగించే రెండు వందల సైనికుల్ని మీ వెంట తీసుకొని ఈ రాత్రి తొమ్మిది గంటలకు కైసరియకు వెళ్ళండి. 24 పౌలుకు గుర్రాన్నిచ్చి రాష్ట్రాధిపతియైన ఫేలిక్సు దగ్గరకు క్షేమంగా పంపండి” అని ఆజ్ఞాపించాడు. 25 సహస్రాధిపతి యిలా ఒక ఉత్తరం వ్రాసి ఇచ్చాడు:
26 గౌరవనీయులైన ఫేలిక్సు రాష్ట్రాధిపతికి,
క్లౌదియ లూసియ అభివందనాలు చెప్పి వ్రాయునది,
27 ఇతణ్ణి యూదులు పట్టుకొని చంపబొయ్యారు. కాని, నేను యితడు రోమా పౌరుడు అని తెలుసుకొని నా దళాలతో వెళ్ళి అతణ్ణి రక్షించాను. 28 వాళ్ళెందుకు అతణ్ణి అపరాధి అంటున్నారో తెలుసుకోవాలని అతణ్ణి వాళ్ళ మహాసభకు పిలుచుకు వెళ్ళాను. 29 వాళ్ళు, తమ ధర్మశాస్త్రం విషయంలో యితణ్ణి అపరాధి అంటున్నారని నాకు తెలిసింది. కారాగారంలో ఉంచవలసిన నేరం కాని, మరణదండన వేయవలసిన నేరం కాని ఇతడు చేయలేదు. 30 వాళ్ళు ఇతణ్ణి చంపటానికి కుట్ర పన్నుతున్నారని తెలిసింది. అందువలన వెంటనే మీ దగ్గరకు పంపుతున్నాను. ఇతనిపై నేరారోపణ చేసినవాళ్ళతో ఆ నేరారోపణ మీ సమక్షంలో చెయ్యవచ్చని చెప్పాను.
31 సహస్రాధిపతి ఆజ్ఞాపించినట్లు సైనికులు పౌలును రాత్రి వేళ తమతో పిలుచుకు వెళ్ళి అంతిపత్రికి చేరుకున్నారు. 32 మరుసటి రోజు రౌతుల్ని పౌలు వెంట పంపి, సైనికులు కోటకు తిరిగి వచ్చారు. 33 పౌలుతో వెళ్ళినవాళ్ళు కైసరియ చేరుకొని ఆ ఉత్తరాన్ని, పౌలును, రాష్ట్రాధిపతికి అప్పగించారు.
34 రాష్ట్రాధిపతి ఆ ఉత్తరాన్ని చదివి, “నీవు ఏ ప్రాంతం వాడవు?” అని పౌలును అడిగాడు. అతడు కిలికియ వాడని తెలుసుకొని, 35 “నీపై నేరారోపణ చేసినవాళ్ళు యిక్కడికి వచ్చాక నీ విషయం విచారిస్తాను” అని అన్నాడు. ఆ తర్వాత పౌలును హేరోదు భవనంలో ఉంచి కాపలా కాయమని భటులతో చెప్పాడు.
© 1997 Bible League International