Beginning
ఇశ్రాయేలును విమోచించటానికి దేవుడు కోరెషును ఎన్నుకొంటాడు
45 యెహోవా ఏర్పాటు చేసుకొన్న తన రాజు కోరెషుతో ఆయన చెప్పిన సంగతులు ఇవి:
“కోరషు కుడిచేయి నేను పట్టుకొంటాను.
రాజుల దగ్గర నుండి అధికారం తీసివేసుకొనేందుకు
నేను అతనికి సహాయం చేస్తాను.
పట్టణ ద్వారాలు కోరెషును ఆపుజేయలేవు. పట్టణ ద్వారాలు నేను తెరుస్తాను, కోరెషు లోనికి ప్రవేశిస్తాడు.
2 కోరెషూ, నీ సైన్యాలు ముందడుగు వేస్తాయి. నేను నీకు ముందుగా వెళ్తాను.
పర్వతాలను నేను చదును చేస్తాను.
పట్టణం ఇత్తడి తలుపులు నేను పగులగొడ్తాను.
తలుపుల మీది ఇనుప గడియలను నేను విరుగగొడ్తాను.
3 చీకట్లో దాచిపెట్టబడిన ధనం నేను నీకు ఇస్తాను.
దాచబడిన ఐశ్వర్యాలను నేను నీకు ఇస్తాను.
నేను యెహోవాను అని నీవు తెలుసుకొనేందుకు నేను దీనిని చేస్తాను.
ఇశ్రాయేలీయుల దేవుడను నేనే, నిన్ను పేరుపెట్టి పిలుస్తున్నాను.
4 నా సేవకుడు యాకోబు కోసం నేను వీటిని చేస్తున్నాను.
ఏర్పాటు చేయబడిన నా ప్రజలు ఇశ్రాయేలీయుల కోసం నేను వీటిని చేస్తున్నాను.
కోరెషూ, నేను నిన్ను పేరుపెట్టి పిలుస్తున్నాను.
నీవు నన్ను ఎరుగవు, కానీ నేను నిన్ను పేరుపెట్టి పిలుస్తున్నాను.
5 నేను యెహోవాను. నేను ఒక్కడినే దేవుడను.
ఇంక ఏ దేవుడూ లేడు.
నేనే నీకు బట్టలు ధరింపజేసినవాడను.
అయినా నీవు ఇంకా నన్ను ఎరుగవు.
6 నేను ఒక్కడను మాత్రమే దేవుడనని ప్రజలంతా తెలుసుకోవాలని నేను ఈ సంగతులను చేస్తాను.
నేనే యెహోవాను అని, నేను తప్ప ఇంకో దేవుడు లేడని తూర్పు నుండి పడమటి వరకు ప్రజలు తెలుసుకొంటారు.
7 నేనే వెలుగును కలిగించాను. మరి నేనే చీకటిని చేశాను.
నేనే సమాధానం కలిగిస్తాను. నేనే కష్టాలు కల్గిస్తాను.
నేను యెహోవాను నేనే ఈ సంగతులన్నింటిని చేస్తాను.
8 “పైన ఆకాశంలోని మేఘాలు మంచితనాన్ని
భూమిమీద వర్షంగా కురిపించుగాక!
భూమి నెరలు విడిచి రక్షణను
ఫలింపజేయును గాక!
దానితోబాటు మంచితనం పెరుగును గాక!
యెహోవాను నేనే అతణ్ణి[a] సృజించాను.”
దేవుడు తన సృష్టిని అదుపులో ఉంచుతాడు
9 “ఈ ప్రజలను చూడు! వాళ్లు వారిని సృజించిన వానితో వాదిస్తున్నారు. వాళ్లు నాతో వాదించటం చూడు. వాళ్లు పగిలిపోయిన కుండ పెంకులా ఉన్నారు. ఒకడు కుండ చేయటానికి జిగట మన్ను ఉపయోగిస్తాడు. మరి ఆ మట్టి, ‘ఓ మనిషీ, ఏం చేస్తున్నావు?’ అని అడగదు. తయారు చేయబడిన వస్తువులకు వాటిని తయారుచేసిన వానిని ప్రశ్నించే అధికారం లేదు. మనుష్యులు ఈ మట్టిలాగే ఉన్నారు. 10 ఒక తండ్రి తన పిల్లలకు ప్రాణం పోస్తాడు. మరి పిల్లలు, ‘నీవెందుకు నాకు ప్రాణం పోస్తున్నావు?’ అని అడిగేందుకు అధికారం లేదు. పిల్లలు తల్లిని పట్టుకొని, ‘నీవెందుకు నాకు జన్మనిస్తున్నావు?’ అని ప్రశ్నించేందుకు వీల్లేదు.”
11 యెహోవా దేవుడు ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు. ఆయనే ఇశ్రాయేలీయులను సృజించాడు. మరియు యెహోవా అంటున్నాడు:
“నా కుమారులారా, మీకు ఒక సంకేతం చూపించమని నన్ను అడిగారు.
నేను చేసిన వాటిని మీకు చూపించమని మీరు నాకు ఆదేశించారు.
12 కనుక చూడండి! భూమిని నేనే సృజించాను.
దానిమీద జీవించే మనుష్యులందరినీ నేనే సృజించాను.
నా స్వంత చేతులు ఉపయోగించి ఆకాశాలను సృజించాను.
ఆకాశ సమూహాలన్నింటినీ నేనే ఆజ్ఞాపించాను.
13 కోరెషు మంచి పనులు చేసేందుకు అతని శక్తిని నేనే అతనికి ఇచ్చాను.
అతని పని నేను సులభం చేస్తాను.
కోరెషు నా పట్టణాన్ని మరల నిర్మిస్తాడు.
అతడు నా ప్రజలను స్వతంత్రులను చేస్తాడు. కోరెషు నా ప్రజలను నాకు అమ్మడు.
అతడు ఈ పనులు చేసేందుకు అతనికి నేనేమీ చెల్లించాల్సిన అవసరంలేదు.
ప్రజలు విమోచించబడతారు. దానికి నాకేమీ ఖర్చుకాదు.”
సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ సంగతులు చెప్పాడు.
14 యెహోవా చెబుతున్నాడు, “ఈజిప్టులో, ఇథియోపియాలో ఎన్నో సంగతులు చేయబడ్డాయి.
అయితే ఇశ్రాయేలు ప్రజలారా, మీరు వాటిని పొందుతారు.
ఆజానుబాహులైన సెబా ప్రజలు మీ వాళ్లవుతారు.
వారు మెడలలో సంకెళ్లతో మీ వెనుక నడుస్తారు.
వాళ్లు మీ ఎదుట సాష్టంగపడతారు.
వాళ్లు మీకు విన్నపం చేసుకొంటారు.”
ఇశ్రాయేలూ, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు.
మరి ఇంకే దేవుడూ లేడు.
15 దేవా, నీవు ప్రజలు చూడలేని దేవుడవు.
నీవు ఇశ్రాయేలు రక్షకుడవు.
16 చాలామంది ప్రజలు తప్పుడు దేవుళ్లను చేసుకొంటారు.
కానీ ఆ ప్రజలు నిరాశ చెందుతారు.
ఆ ప్రజలంతా సిగ్గుతో తిరిగి వెళ్లిపోతారు.
17 కానీ ఇశ్రాయేలు యెహోవా చేత రక్షించబడును.
ఆ రక్షణ శాశ్వతంగా కొనసాగుతుంది.
మరల ఎన్నటెన్నటికి ఇశ్రాయేలు సిగ్గుపడడు.
18 యెహోవాయే దేవుడు.
ఆయనే భూమిని, ఆకాశాలను సృజించాడు.
భూమిని యెహోవా దాని స్థానంలో ఉంచాడు.
యెహోవా భూమిని చేసినప్పుడు, అది ఖాళీగా ఉండాలని ఆయన కోరలేదు.
భూమి మీద జీవం ఉండాలని యెహోవా కోరాడు.
యెహోవా చెబుతున్నాడు: “నేనే యెహోవాను.
నేను తప్ప ఇంకో దేవుడు లేడు.
19 నేను రహస్యంగా మాట్లాడలేదు. నేను స్వేచ్చగా మాట్లాడాను.
ప్రపంచపు చీకటి స్థలాల్లో నేను నా మాటలను దాచిపెట్టలేదు.
ఖాళీ ప్రదేశాల్లో నన్ను వెదకమని
యాకోబు ప్రజలకు నేను చెప్పలేదు.
నేనే యెహోవాను, నేను సత్యం మాట్లాడుతాను.
నేను మాట్లాడినప్పుడు సరైనవే నేను చెబుతాను.
యెహోవా తానొక్కడే దేవుడని ఋజువు చేస్తాడు
20 “ప్రజలారా మీరు ఇతర దేశాలనుండి తప్పించుకొని పోయారు. కనుక మీరు సమావేశమై నా ఎదుటికిరండి. (ఈ మనుష్యులు తప్పుడు దేవుళ్ల విగ్రహాలను మోసుకొని వెళ్తారు. ఈ ప్రజలు పనికిమాలిన ఆ దేవుళ్లకు ప్రార్థన చేస్తారు. కానీ వాళ్లు చేస్తోంది ఏమిటో ప్రజలకు తెలియదు. 21 ఈ ప్రజలను నా దగ్గరకు రమ్మని వారికి చెప్పండి. వారు వచ్చి ఈ సంగతులను నాతో మాట్లాడమని చెప్పండి.)
“చాలా కాలం క్రిందట జరిగిన వాటిని గూర్చి మీకు ఎవరు చెప్పారు? చాలాకాలం నుండి ఈ సంగతులను విడువక మీకు ఎవరు చెప్పారు? యెహోవాను నేనే, ఈ సంగతులు మీకు చెప్పాను. నేను ఒక్కడను మాత్రమే దేవుడను. నావంటి దేవుడు ఇంకొకడు ఉన్నాడా? ఇంకో మంచి దేవుడు ఉన్నాడా? తన ప్రజలను రక్షించే ఇంకో దేవుడూ ఉన్నాడా? లేడు మరి ఏ దేవుడు లేడు. 22 దూర దేశాల్లో ఉన్న ప్రజలారా, మీరంతా ఆ తప్పుడు దేవుళ్లను వెంబడించటం మానివేయాలి. మీరు నన్ను వెంబడించి, రక్షణ పొందాలి. నేను దేవుణ్ణి. వేరొక దేవుడు ఎవ్వడూ లేడు. నేను ఒక్కణ్ణి మాత్రమే దేవుడను.
23 “నేను నా స్వంత శక్తితో ఒక వాగ్దానం చేస్తాను. నేను ఏదైన ఒకటి చేస్తానని వాగ్దానం చేస్తే, ఆ వాగ్దానం ఒక ఆదేశం అవుతుంది. ఏదైనా జరగాలని నేను ఆదేశిస్తే, అది జరుగుతుంది. ప్రతి మనిషి నా (దేవుడు) ఎదుట సాగిలపడతాడని నన్ను వెంబడిస్తాడని ప్రమాణం చేస్తున్నాను. ప్రతి మనిషి నన్ను వెంబడిస్తాడని ప్రమాణం చేస్తాడు. 24 ‘మంచితనం, అధికారం యెహోవా నుండి మాత్రమే లభిస్తాయి’” అని ప్రజలు చెబుతారు.
కొంత మంది మనుష్యులు యెహోవా మీద కోపగిస్తారు. అయితే యెహోవా జనులు వచ్చి, యెహోవా చేసిన వాటిని గూర్చి సాక్ష్యం చెబుతారు. అందుచేత కోపగించిన ఆ మనుష్యులు సిగ్గుపడతారు. 25 ఇశ్రాయేలు ప్రజలు మంచిని జరిగించటానికి యెహోవా సహాయం చేస్తాడు, మరియు ప్రజలు వారి దేవుని గూర్చి ఎంతో గర్విస్తారు.
అసత్య దేవతలు నిష్ప్రయోజనం
46 బేలు, నెబో నా ఎదుట సాగిలపడతారు.
తప్పుడు దేవుళ్లు వట్టి విగ్రహాలే. మనుష్యులే ఆ విగ్రహాలను జంతువులమీద పెడతారు. మోయాల్సిన బరువులు మాత్రమే ఆ విగ్రహాలు. తప్పుడు దేవుళ్లు ప్రజలను విసిగించటం తప్ప ఇంకేం చేయవు. 2 ఆ తప్పుడు దేవుళ్లన్నీ సాగిలబడతాయి, అవన్నీ పడిపోతాయి. ఆ తప్పుడు దేవుళ్లు తప్పించుకోలేవు. అవన్నీ బందీలవలె తీసుకొనిపోబడుతాయి.
3 “యాకోబు వంశమా, నా మాట విను. ఇంకా బ్రతికే ఉన్న ఇశ్రాయేలు ప్రజలారా, మీరంతా నా మాటవినండి. నేను మిమ్మల్ని మోశాను. మీరు మీ తల్లి ఒడిలో ఉన్నప్పటి నుండి నేను మిమ్మల్ని ఎత్తుకొన్నాను. 4 మీరు పుట్టినప్పుడు నేను మిమ్మల్ని ఎత్తుకొన్నాను, మీరు ముసలి వాళ్లయినప్పుడు నేను మిమ్మల్ని మోస్తాను. నేను మిమ్మల్ని సృజించాను. కనుక మీ తల వెండ్రుకలు నెరసిపోయినప్పుడు కూడా నేను మిమ్మల్ని మోస్తాను. నేను మిమ్మల్ని మోస్తూనే ఉంటాను, నేను మిమ్మల్ని రక్షిస్తాను.
5 “మీరు నన్ను ఇంకెవరితోనైనా పోల్చగలరా? లేదు. ఎవ్వరూ నాకు సమానులు కారు. నన్ను గూర్చి మీరు పూర్తిగా గ్రహించలేరు. నావంటిది ఇంకేమీ లేదు. 6 కొంత మంది వెండి, బంగారం ఉండి ఐశ్వర్యవంతులు. వారి చేతి సంచుల్లోంచి బంగారం రాలుతుంది, వారు వారి వెండిని త్రాసులో తూకం వేస్తారు. వారు ఒక కళాకారునికి డబ్బిచ్చి, చెక్కతో ఒక తప్పుడు దేవుణ్ణి చేయించుకొంటారు. అప్పుడు ఆ ప్రజలు ఆ తప్పుడు దేవుడికి సాగిలపడి, దానికి పూజ చేస్తారు. 7 ఆ మనుష్యులు ఆ తప్పుడు దేవుణ్ణి తమ భుజాల మీద పెట్టుకొని మోస్తారు. ఆ తప్పుడు దేవుడు నిష్ప్రయోజనం, ప్రజలు వానిని మోయాల్సి ఉంటుంది. ప్రజలు ఆ విగ్రహాన్ని నేలమీద పెడ్తారు, ఆ తప్పుడు దేవుడు కదల్లేడు. ఆ తప్పుడు దేవుడు, వాని స్థానం నుండి ఎన్నడూ నడిచిపోడు. ప్రజలు వానిమీద కేకలు వేయవచ్చు, కాని అది జవాబు ఇవ్వదు. ఆ తప్పుడు దేవుడు వట్టి విగ్రహం మాత్రమే. అది ప్రజలను వారి కష్టాల్లోంచి రక్షించజాలదు.
8 “ప్రజలారా, మీరు పాపం చేశారు. ఈ సంగతులను గూర్చి మీరు మరల ఆలోచన చేయాలి. ఈ సంగతులను జ్ఞాపకం చేసుకొని బలవంతంగా ఉండండి. 9 చాలాకాలం క్రిందట జరిగిన సంగతులను జ్ఞాపకం చేసుకోండి. నేనే దేవుడను అని జ్ఞాపకం ఉంచుకోండి. నేనే అని జ్ఞాపకం ఉంచుకోండి. మరో దేవుడంటూ లేడు. ఆ తప్పుడు దేవుళ్లు నావంటివారు కారు.
10 “అంతంలో జరిగే సంగతులను గూర్చి మొదట్లోనే నేను మీకు చెప్పాను. ఇంకా సంభవించని సంగతులను గూర్చి చాలాకాలం క్రిందట నేను మీకు చెప్పాను. నేను ఒకటి తలపెట్టాను. అది జరిగి తీరుతుంది. నేను చేయాలనుకొన్నవి చేస్తాను. 11 తూర్పునుండి నేను ఒక మనిషిని పిలుస్తున్నాను. ఆ మనిషి గద్దలా ఉంటాడు. అతడు చాలా దూర దేశం నుండి వస్తాడు, నేను చేయాలని నిర్ణయించిన వాటిని అతడు చేస్తాడు. నేను ఇలా చేస్తానని నేను మీతో చెబుతున్నాను, నేను తప్పక దీనిని చేస్తాను. నేనే అతన్ని చేశాను. నేనే అతడ్ని తీసుకొని వస్తాను.
12 “మీకు గొప్ప శక్తి ఉందని మీలో కొందరు తలుస్తారు. కానీ మీరు మంచి పనులు చేయరు. నా మాట వినండి! 13 నేను మంచి పనులు చేస్తాను. త్వరలో నేను నా ప్రజలను రక్షిస్తాను. సీయోనుకు, అద్భుతమైన నా ఇశ్రాయేలుకు నేను రక్షణ తీసుకొని వస్తాను.”
బబులోనుకు దేవుని సందేశం
47 “కల్దీయుల కుమారీ, కన్యకా
మట్టిలో పడి, అక్కడే కూర్చో. నేల మీద కూర్చో.
ఇప్పుడు నీవు పరిపాలించటం లేదు.
ప్రజలు ఇంక నిన్ను చక్కనిదానా అని, అందగత్తె అని పిలువరు.
2 ఇప్పుడు నీవు కష్టపడి పనిచేయాలి. అందమైన నీపై వస్త్రాలు తీసివేయి. తిరుగటి రాళ్లు తీసుకొని పిండి విసురు. మనుష్యులకు నీ కాళ్లు కనబడేంతమట్టుకు నీ పైవస్త్రం లేపి నదులు దాటు. నీ దేశాన్ని విడిచిపెట్టు.
3 మనుష్యులు నీ శరీరాన్ని చూస్తారు.
మనుష్యులు నిన్ను లైంగికంగా వాడుకొంటారు. నీవు చేసిన చెడ్డ పనులకు నీచేత నేను విలువ కట్టిస్తాను. మరియు ఎవ్వడూ వచ్చి నీకు సహాయం చేయడు.
4 “‘దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు.
ఆయన పేరు సర్వశక్తిమంతుడైన యెహోవా, ఇశ్రాయేలీయుల పరిశుద్దుడు’” అని నా ప్రజలు అంటారు.
5 “అందుచేత బబులోనూ, నీవు మౌనంగా కూర్చోవాలి.
కల్దీయుల కుమారీ[b] చీకట్లోనికి వెళ్లు
ఎందుకంటే నీవు ఇక మీదట ‘రాజ్యాలకు యజమానురాలివి’ కావు.
6 “నేను నా ప్రజల మీద కోపగించాను.
ఈ ప్రజలు నావాళ్లే కానీ నేను కోపగించాను, అందుచేత నేను వాళ్లకు ప్రాముఖ్యం లేకుండా చేశాను.
నేను వాళ్లను నీకు అప్పగించాను. నీవు వారిని శిక్షించావు.
నీవు వారికి ఎలాంటి దయా చూపించలేదు.
వాళ్లు ముసలి వాళ్ల కోసం
చాలా కష్టపడి పనిచేసేట్టు నీవు చేశావు.
7 ‘నేను శాశ్వతంగా జీవిస్తాను.
శాశ్వతంగా నేను రాణిగానే ఉంటాను’ అని నీవు చెప్పావు.
నీవు ఆ ప్రజలకు చేసిన చెడు కార్యాలను నీవు గమనించలేదు.
ఏమి జరుగుతుందో అని నీవు గమనించలేదు.
8 కనుక ‘అందమైన అమ్మాయీ’, ఇప్పుడు నా మాట విను.
నీవు క్షేమంగానే ఉన్నావు అనుకొంటున్నావు.
‘నేను ఒక్కదాన్నే ప్రాముఖ్యమైన దాన్ని, ఇంకెవ్వరూ నా అంతటి ప్రముఖులు కారు.
నేను ఎప్పటికీ విధవనుకాను. నాకు ఎల్లప్పుడూ పిల్లలు ఉంటారు’ అని నీలోనీవు అనుకొంటున్నావు.
9 నీకు ఈ రెండు సంగతులు జరుగుతాయి:
మొట్టమొదట నీవు నీ పిల్లలను (ప్రజలు) పోగొట్టుకొంటావు. తర్వాత నీవు నీ భర్తను (రాజ్యం) పోగొట్టుకొంటావు.
ఈ సంగతులు నీకు నిజంగా జరుగుతాయి. నీ మంత్రాలన్నీ, శక్తివంతమైన నీ ఉపాయాలన్నీ నిన్ను రక్షించవు.
10 నీవు చెడ్డ పనులు చేసి కూడ క్షేమంగా ఉన్నానని అనుకొంటున్నావు.
‘నేను చేసే తప్పు పనులు ఎవరూ చూడటం లేదు’ అని నీవు అనుకొంటావు.
నీవు తప్పు చేస్తావు. కానీ నీ జ్ఞానం, నీ తెలివి నిన్ను రక్షిస్తాయి అనుకొంటావు.
‘నేను ఒక్క దాన్ని తప్ప నా అంతటి ప్రముఖులు ఇంకెవరూ లేరు’ అని నీవు అంటావు.
11 “అయితే నీకు కష్టాలు వస్తాయి.
అది ఎప్పుడు జరుగుతుందో నీకు తెలియదు. కాని నాశనం వచ్చేస్తుంది.
ఆ కష్టాలను ఆపుజేసేందుకు నీవు ఏమీ చేయలేవు. నీవు త్వరగా నాశనం చేయబడతావు.
నీకు ఏమి జరిగిపోయిందో కూడా నీకు తెలియదు.
12 నీ జీవితాంతం నీవు కష్టపడి పనిచేశావు.
ఉపాయాలు, మంత్రాలు నేర్చుకొన్నావు.
కనుక నీ ఉపాయాలు, మంత్రాలు ప్రయోగించటం ప్రారంభించు.
ఒకవేళ ఆ ఉపాయాలు నీకు సహాయపడతాయేమో!
ఒకవేళ నీవు ఎవరినైనా భయపెట్టగలుగుతావేమో.
13 నీకు ఎంతెంతో మంది సలహాదారులు
వాళ్లు నీకిచ్చే సలహాలతో నీవు విసిగిపోయావా?
నక్షత్ర శాస్త్రం తెలిసిన నీ మనుష్యులను వాళ్లు బయటకు పంపిస్తారు.
నెల ప్రారంభం ఎప్పుడో వాళ్లు చెప్పగలుగుతారు.
ఒకవేళ నీ కష్టాలు ఎప్పుడు మొదలవుతాయో వాళ్లు చెప్పగలుగుతారేమో.
14 అయితే ఆ మనుష్యులు కనీసం వాళ్లనే వాళ్లు రక్షించుకోలేరు.
వాళ్లు గడ్డిలా కాలిపోతారు.
వాళ్లు త్వరగా కాలిపోయినందుచేత రొట్టె కాల్చుకొనేందుకు గూడ నిప్పులు మిగులవు.
వెచ్చగా కాచుకొనేందుకు మంటగూడా మిగలదు.
15 నీవు కష్టపడి సంపాదించిన దానంతటికీ అలా జరుగుతుంది.
నీవు చిన్న పిల్లగా ఉన్నప్పట్నుంచీ నీతో వ్యాపారం చేసిన వారు నిన్ను వదిలివేస్తారు
ప్రతివాడూ వాని వాని దారిన పోతాడు.
నిన్ను రక్షించేందుకు ఒక్క మనిషి కూడా ఉండడు.”
దేవుడు తన ప్రపంచాన్ని పాలిస్తాడు
48 యెహోవా చెబుతున్నాడు: “యాకోబు వంశమా, నా మాట విను!
మిమ్మల్ని మీరు ‘ఇశ్రాయేలు’ అని చెప్పుకొంటారు.
మీరు యూదా వంశస్థులు.
ప్రమాణాలు చేయటానికి మీరు యెహోవా నామం ప్రయోగిస్తారు. ఇశ్రాయేలు దేవుణ్ణి మీరు స్తుతిస్తారు.
కానీ ఈ సంగతులను మీరు చేస్తున్నప్పుడు మీరు నమ్మకంగా ఉండరు.”
2 ప్రజలారా, పవిత్ర పట్టణంలో సభ్యులని మీరు పిలువబడుతున్నారు.
ఇశ్రాయేలు దేవుని మీద మీరు ఆధారపడుతున్నారు. సర్వశక్తిమంతుడైన యెహోవా ఆయన పేరు.
3 “జరుగబోయే సంగతులను గూర్చి చాలా కాలం క్రిందట నేను మీకు చెప్పాను.
వాటిని గూర్చి నేను మీకు చెప్పాను.
అకస్మాత్తుగా ఆ సంగతులు సంభవించేట్టు నేను చేశాను.
4 మీరు మొండివాళ్లని నాకు తెలుసు గనుక నేను అలా చేశాను.
నేను చెప్పిన ప్రతిది మీరు నమ్మటానికి నిరాకరించారు.
వంగని ఇనుములా మీరు చాలా మొండివాళ్లు. మీ తల ఇత్తడితో చేసినట్టుగా ఉంది.
5 కనుక జరుగబోయే సంగతులను గూర్చి నేను మీతో చెప్పాను.
ఆ సంగతులు జరుగకముందే చాలాకాలం క్రిందటనే నేను మీకు చెప్పాను.
‘మా స్వంత శక్తితో మేమే వీటిని చేశాము’ అని మీరు చెప్పకుండా నేనిలా చేశాను.
‘మా ప్రతిమలు-విగ్రహాలే వీటిని జరిగించాయి’
అని మీరు చెప్పకుండా ఉండాలనే నేను ఇలా చేసాను.”
ఇశ్రాయేలీయులను పవిత్రం చేసేందుకు దేవుడు వారిని శిక్షించటం
6 “జరిగిన సంగతులన్నింటినీ మీరు చూశారు, విన్నారు
గనుక మీరు ఇతరులకు ఈ వార్త చెప్పాలి.
మీకు ఇంకా తెలియని క్రొత్త సంగతులను
ఇప్పుడు నేను మీకు చెబుతాను.
7 ఇవి చాలాకాలం క్రిందట జరిగిపోయిన సంగతులు కావు. ఇవి ఇప్పుడు సంభవించటం మొదలైన సంగతులు.
ఈ సంగతులను గూర్చి ఈ వేళకు ముందు మీరు ఎన్నడూ వినలేదు.
అందుచేత ‘అది మాకు ముందే తెలుసు’ అని మీరు చెప్పజాలరు.
8 కానీ భవిష్యత్తులో ఏమి జరుగబోతుందో అది నేను మీకు చెప్పినప్పటికీ మీరు ఇంకా నా మాట వినేందుకు నిరాకరిస్తారు.
మీరు నేర్చు కొనేది శూన్యం.
నేను మీకు చెప్పింది ఎన్నడూ ఏదీ మీరు వినలేదు.
మీరు నాకు వ్యతిరేకంగా ఉంటారని మొదట్నుండి నాకు తెలుసు. మీరు
పుట్టినప్పట్నుండి తప్పుడు పనులే చేశారు.
9 “కానీ నేను ఓపిగ్గా ఉంటాను.
నా కోసమే నేను ఇలా చేస్తాను.
నేను కోపగించి మిమ్మల్ని నాశనం చేయనందుకు ప్రజలు నన్ను స్తుతిస్తారు.
సహించినందుకు మీరూ నన్ను స్తుతిస్తారు.
10 “చూడండి, నేను మిమ్మల్ని పవిత్రం చేస్తాను.
వెండిని పవిత్రం చేసేందుకు ప్రజలు వేడినిప్పును ప్రయోగిస్తారు.
కానీ నేను మీకు కష్టాలు కలిగించటం ద్వారా మిమ్మల్ని పవిత్రం చేస్తాను.
11 నా కోసం, నా కోసమే నేను ఇలా చేస్తాను.
ప్రాముఖ్యం లేనివానిగా మీరు నన్ను చేయలేరు.
నా మహిమ, స్తుతులను ఎవరో తప్పుడు దేవతలను నేను తీసుకోనివ్వను.
12 “యాకోబూ, నా మాట విను!
ఇశ్రాయేలు ప్రజలారా, మీరు నా ప్రజలుగా ఉండుటకు నేను మిమ్మల్ని పిలిచాను.
కనుక నా మాట వినండి.
నేనే ఆది, నేనే అంతం.
13 నా స్వహస్తాలతో (శక్తితో) నేనే భూమిని చేశాను.
ఆకాశాన్ని నా కుడి హస్తం చేసింది.
మరియు నేను గనుక వాటిని పిలిస్తే
అవి కలిసి నా ఎదుటికి వస్తాయి.
14 “కనుక మీరంతా సమావేశమై, నా మాట వినండి!
ఈ సంగతులు జరుగుతాయని తప్పుడు దేవుళ్లలో ఏదైనా చెప్పిందా? లేదు.
యెహోవా ఇశ్రాయేలును ప్రేమిస్తున్నాడు.
బబులోను, కల్దీయులకు యెహోవా ఏమి చేయాలనుకొంటే అది చేస్తాడు.
15 “యెహోవా చెబుతున్నాడు, నేను అతన్ని[c] పిలుస్తానని నేను మీతో చెప్పాను.
మరియు నేను అతణ్ణి తీసుకొని వస్తాను.
అతడు జయించేట్టు నేను చేస్తాను.
16 నా దగ్గరకు వచ్చి, నా మాట వినండి.
ప్రజలు నా మాట వినగలుగునట్లు
మొదటనుంచి నేను తేటగా మాట్లాడాను.
బబులోను ఒక దేశంగా ప్రారంభమయినప్పుడు నేను అక్కడ ఉన్నాను.”
అంతట యెషయా, “ఇప్పుడు ఈ సంగతులు, ఆయన ఆత్మను మీతో చెప్పేందుకు నా ప్రభువైన యెహోవా నన్ను పంపుతున్నాడు” అని అన్నాడు. 17 ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు, రక్షకుడు, యెహోవా చెబుతున్నాడు,
“నేనే మీ దేవుణ్ణి, యెహోవాను.
మంచి పనులు చేయమని నేను మీకు ఉపదేశిస్తాను.
మీరు నడవాల్సిన మార్గంలో నేను మిమ్మల్ని నడిపిస్తాను.
18 మీరు నాకు విధేయులై ఉంటే
అప్పుడు మీకు నిండుగా ప్రవహిస్తోన్న
నదివలె శాంతి లభించి ఉండేది.
సముద్ర తరంగాల్లా మంచివి మీ వద్దకు ప్రవహించి ఉండేవి.
19 మీరు నాకు విధేయులై ఉంటే,
అప్పుడు మీకు ఎంతోమంది పిల్లలు పుట్టి ఉండేవారు. వాళ్లు ఇసుక రేణువులంత మంది ఉండేవాళ్లు.
మీరు నాకు విధేయులై ఉంటే, అప్పుడు మీరు నాశనం చేయబడి ఉండేవాళ్లు కాదు.
మీరు నాతోనే కొనసాగి ఉండేవాళ్లు.”
20 నా ప్రజలారా, బబులోను విడిచిపెట్టండి.
నా ప్రజలారా, కల్దీయుల దగ్గర్నుండి పారిపొండి.
ఈ వార్త సంతోషంగా ప్రజలకు చెప్పండి.
భూమిమీద దూర ప్రాంతాల వరకు ఈ వార్త వ్యాపింపచేయండి. ప్రజలతో
ఇలా చెప్పండి: “యెహోవా తన సేవకుడు యాకోబును విమోచించాడు!
21 యెహోవా తన ప్రజలను అరణ్యంలో నడిపించాడు. ఆ ప్రజలు ఎన్నడూ దప్పిగొనలేదు.
ఎందుకంటే, ఆయన తన ప్రజలకోసం బండనుండి నీళ్లు ప్రవహింపజేశాడు గనుక.
ఆయన బండను చీల్చాడు.
నీళ్లు ప్రవహించాయి.”
22 కానీ “చెడ్డ వారికి శాంతి లేదు”
అని యెహోవా చెబుతున్నాడు.
© 1997 Bible League International