Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 18

సంగీత నాయకునికి: యెహోవా సేవకుడు దావీదు కీర్తన. సౌలు బారి నుండి, యితర శత్రువులందరినుండి యెహోవా దావీదును రక్షించినప్పుడు అతడు వ్రాసిన పాట.

18 “యెహోవా, నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను!”
    అతడీలాగన్నాడు.

యెహోవా నా బండ, నా కోట, నా రక్షకుడు.
    నా దేవుడే నా అండ. నేను ఆశ్రయంకోసం ఆయన యొద్దకు పరుగెత్తుతాను.
దేవుడు నా డాలు, ఆయనే తన శక్తితో నన్ను రక్షిస్తాడు.
    ఎత్తైన కొండలలో యెహోవా నా దాగుకొను స్థలము.

యెహోవాకు నేను మొరపెడ్తాను.
    యెహోవా స్తుతించబడుటకు అర్హుడు
    మరియు నా శత్రువుల బారినుండి నేను రక్షించబడుతాను.
4-5 నా శత్రువులు నా యెదుట ఎన్నో ఉచ్చులు పెట్టారు.
    మరణకరమైన ఉచ్చులు నా యెదుట ఉన్నాయి.
మరణపాశాలు నా చుట్టూరా చుట్టబడి ఉన్నాయి.
    నాశనకరమైన వరదనీళ్లు నన్ను భయపెడుతున్నాయి. మరణపాశాలు అన్నీ చుట్టూరా ఉన్నాయి.
చిక్కులో పడి, నేను సహాయం కోసం యెహోవాకు మొరపెట్టాను.
    నేను నా దేవుణ్ణి ప్రార్థించాను.
దేవుడు తన పవిత్ర స్థలం నుండి నా ప్రార్థన విన్నాడు.
    సహాయంకోసం నేను చేసిన ప్రార్థనలు ఆయన విన్నాడు.
యెహోవా నాకు సహాయం చేయటానికి వస్తున్నాడు.
    భూమి కంపించి వణికినది. పర్వతాలు కంపించాయి.
    ఎందుకంటే ప్రభువు కోపించాడు.
ఆయన ముక్కుల్లో నుండి పొగ లేచింది.
    యెహోవా నోటి నుండి మండుతున్న జ్వాలలు వచ్చాయి.
    నిప్పు కణాలు ఆయన నుండి రేగాయి.
యెహోవా గగనం చీల్చుకొని దిగి వచ్చాడు.
    ఆయన పాదాల క్రింద నల్లటి మేఘాలు ఉన్నాయి.
10 ఎగిరే కెరూబుల మీద ఆయన స్వారీ చేశాడు.
    ఆయన గాలుల మీద పైకెగిరాడు.
11 యెహోవాను ఆవరించిన మహా దట్టమైన మేఘంలో ఆయన మరుగైయున్నాడు.
    దట్టమైన ఉరుము మేఘంలో ఆయన మరుగై యున్నాడు.
12 అప్పుడు, దేవుని ప్రకాశమానమైన వెలుగు మేఘాలనుండి బయలు వెడలినది.
    అంతట వడగండ్లు, మెరుపులు వచ్చినవి.
13 యెహోవా యొక్క స్వరం ఆకాశంలో గట్టిగా ఉరిమింది.
    సర్వోన్నతుడైన దేవుడు తన స్వరాన్ని వినిపించాడు. వడగండ్లు, మెరుపులు కలిగాయి.
14 యెహోవా తన బాణాలు వేయగా శత్రువు చెదరి పోయాడు,
    అనేకమైన ఆయన మెరుపు పిడుగులు వారిని ఓడించాయి.

15 యెహోవా, నీవు బలంగా మాట్లాడావు,
    మరియు నీవు నీ నోటినుండి[a] బలమైన గాలిని ఊదావు.
నీళ్లు వెనక్కు నెట్టివేయబడ్డాయి, సముద్రపు అడుగును మేము చూడగలిగాము.
    భూమి పునాదులను మేము చూడగలిగాము.

16 పై నుండి యెహోవా క్రిందికి అందుకొని నన్ను రక్షించాడు.
    నా కష్టాల్లోనుండి[b] ఆయన నన్ను బయటకు లాగాడు.
17 నా శత్రువులు నాకంటె బలవంతులు.
    ఆ మనుష్యులు నన్ను ద్వేషించారు. పైగా వారు నాకంటె చాలా బలం కలవారు. అయినను దేవుడు నన్ను రక్షించాడు.
18 నా కష్టకాలంలో ఆ మనుష్యులు నా మీద దాడి చేశారు.
    కాని యెహోవా నన్ను బలపర్చాడు.
19 యెహోవా నన్ను ప్రేమిస్తున్నాడు. కనుక ఆయన నన్ను కాపాడాడు.
    ఆయన నన్ను క్షేమ స్థలానికి తీసికొని వెళ్లాడు.
20 నేను నిర్దోషిని కనుక యెహోవా నాకు ప్రతి ఫలమిచ్చాడు.
    నేను ఏ తప్పు చేయలేదు. కనుక ఆయన నాకు తిరిగి చెల్లించాడు.
21 నేను యెహోవాను అనుసరించాను.
    నా దేవునికి విరుద్ధంగా నేను చెడు కార్యాలు చేయలేదు.
22 యెహోవా చట్టాలు, అన్నింటినీ నేను జ్ఞాపకం ఉంచుకున్నాను.
    ఆయన ఆదేశాలను నేను త్రోసివేయ లేదు.
23 ఆయన ఎదుట నేను నిర్దోషిగా ఉన్నాను.
    నన్ను నేను పాపమునుండి దూరం చేసుకొన్నాను.
24 నేను సరైనదాన్ని చేసినందుకు యెహోవా నాకు ప్రతిఫలమిచ్చాడు.
    నా క్రియలు దేవుని ఎదుట నిర్దోషమైనవి. అందుకే ఆయన నాకు మంచి చేస్తాడు.

25 యెహోవా, నమ్మదగిన మనుష్యులకు నీవు నమ్మదగినవాడవు.
    మరియు మంచి మనుష్యులకు నీవు మంచివాడవు.
26 యెహోవా, మంచివాళ్లకు, పవిత్రమైనవాళ్లకు నీవు మంచివాడవు, పవిత్రమైనవాడవు.
    కాని, గర్విష్ఠులను, టక్కరివాళ్లను నీవు అణచివేస్తావు.
27 యెహోవా, నీవు పేదలకు సహాయం చేస్తావు.
    కాని గర్విష్ఠులను నీవు ప్రాముఖ్యత లేని వారిగా చేస్తావు.
28 యెహోవా, నీవు నా దీపం వెలిగిస్తావు.
    నా దేవా, నా చీకటిని నీవు వెలుగుగా చేస్తావు.
29 యెహోవా, నీ సహాయంతో నేను సైన్య దళాలతో పరుగెత్తగలను.
    నీ సహాయంతో, నేను శత్రువు గోడలు ఎక్కగలను.

30 దేవుని మార్గాలు పవిత్రం, మంచివి. యెహోవా మాటలు సత్యం.
    ఆయనయందు విశ్వాసం ఉంచేవాళ్లను ఆయన భద్రంగా ఉంచుతాడు.
31 యెహోవా తప్ప నిజమైన దేవుడు ఒక్కడూ లేడు.
    మన దేవుడు తప్ప మరో బండ[c] లేదు.
32 దేవుడు నాకు బలం ఇస్తాడు.
    ఆయన నా జీవితాన్ని పావనం చేస్తాడు.
33 దేవుడు నా కాళ్లను లేడి కాళ్లవలె ఉంచుతాడు.
    ఆయన నన్ను స్థిరంగా ఉంచుతాడు.
    ఎత్తయిన బండలమీద పడకుండా ఆయన నన్ను కాపాడుతాడు.
34 యుద్ధంలో ఎలా పోరాడాలో దేవుడు నాకు నేర్పిస్తాడు.
    ఇత్తడి విల్లును ఎక్కు పెట్టుటకు నా చేతులకు ఆయన బలాన్ని ఇస్తాడు.

35 దేవా, నీ డాలుతో నన్ను కాపాడితివి.
    నీ కుడిచేతితో నన్ను బలపరుచుము.
    నీ సహాయం నన్ను గొప్పవానిగా చేసినది.
36 నా అడుగులకు నీవు విశాలమైన మార్గాన్నిచ్చావు.
    నా పాదాలు జారిపోలేదు.

37 నేను నా శత్రువులను తరిమి, వారిని పట్టుకొన్నాను.
    వారు నాశనం అయ్యేవరకు నేను తిరిగిరాలేదు.
38 నా శత్రువులను నేను ఓడిస్తాను. వారిలో ఒక్కరుకూడా తిరిగి లేవరు.
    నా శత్రువులు అందరూ నా పాదాల దగ్గర పడ్డారు.
39 దేవా, యుద్ధంలో నాకు బలం ప్రసాదించుము.
    నా శత్రువులంతా నా యెదుట పడిపోయేటట్టు చేయుము.
40 యెహోవా, నా శత్రువులను వెనుదిరిగేటట్లు చేశావు.
    నీ సహాయంవల్లనే నన్ను ద్వేషించే వారిని నేను నాశనం చేస్తాను.
41 నా శత్రువులు సహాయం కోసం అడిగారు,
    కాని ఎవ్వరూ వారికి సహాయం చేసేందుకు రాలేదు.
వారు యెహోవాకు కూడా మొరపెట్టారు.
    కాని ఆయన వారికి జవాబు ఇవ్వలేదు.
42 నా శత్రువులను నేను ధూళిగా నలగగొట్టాను.
    వారు గాలికి చెదరిపోయే దుమ్ములా ఉన్నారు. నేను వాళ్లను వీధుల బురదగా పారవేసాను.

43 నాకు వ్యతిరేకంగా పోరాడే మనుష్యుల నుండి నన్ను కాపాడావు.
    ఆ రాజ్యాలకు నన్ను నాయకునిగా చేయుము.
    నేను ఎరుగని ప్రజలు నాకు సేవ చేస్తారు.
44 ఆ మనుష్యులు నా గురించి విన్నప్పుడు విధేయులయ్యారు.
    ఇతర రాజ్యాల ప్రజలు నేనంటే భయపడ్డారు.
45 ఆ విదేశీ ప్రజలు నేనంటే భయపడ్డారు,
    కనుక వారు భయంతో వణుకుతూ సాష్టాంగపడ్డారు.
    వారు దాక్కొనే తమ స్థలాలనుండి బయటకు వచ్చారు.

46 యెహోవా సజీవంగా ఉన్నాడు.
    నా ఆశ్రయ దుర్గమైన వానిని నేను స్తుతిస్తాను. నా దేవుడు నన్ను రక్షిస్తాడు.
    అందుచేత ఆయనను స్తుతులతో పైకెత్తండి.
47 నాకోసం నా శత్రువులను శిక్షించాడు.
    ఆ ప్రజలను ఓడించేందుకు యెహోవా నాకు సహాయం చేసాడు.
48     యెహోవా, నీవే నా శత్రువుల నుండి నన్ను తప్పించావు.

కృ-రులైన వారి నుండి నీవు నన్ను రక్షించావు.
    నాకు విరుద్ధంగా నిలిచినవారిని ఓడించుటకు నీవు నాకు సహాయం చేశావు.
49 కనుక మనుష్యులందరి యెదుట యెహోవాను నేను స్తుతిస్తాను.
    నీ నామ కీర్తన గానము చేస్తాను.

50 యెహోవా ఏర్పాటు చేసుకొన్న రాజుకు, ఆయన గొప్ప విజయాలిచ్చాడు.
    ఆయన ఏర్పాటు చేసుకొన్న రాజుకు అనగా దావీదుకు,
    తన సంతానానికీ నిరంతరం ఆయన ఎంతో దయ చూపాడు.

ఆమోసు 4:6-13

“నిన్ను నా వద్దకు వచ్చేలా చేయటానికి నేను చాలా పనులు చేశాను. నేను, మీరు తినటానికి ఏమీ ఆహారం ఇవ్వలేదు. మీ నగరాలలో దేనిలోనూ ఆహారం ఇవ్వలేదు. అయినా నీవు నా వద్దకు తిరిగి రాలేదు. యెహోవా చెప్పేది ఇదే.

“నేను వర్షాన్ని కూడా నిలుపు చేశాను. పైగా అది పంట కోతకు మూడు నెలల ముందు సమయం. అందువల్ల పంటలు పండలేదు. పిమ్మట ఒక నగరంలో వర్షం కురిపించి, మరో నగరంలో వర్షం లేకుండా చేశాను. దేశంలో ఒక భాగంలో వర్షం పడింది. కాని దేశంలో మరొక ప్రాంతం వర్షాలు లేక పూర్తిగా ఎండిపోయింది. కావున రెండు మూడు నగరాల ప్రజలు తడబడుతూ నీళ్లకోసం మరొక నగరానికి వెళ్లారు. కాని అక్కడ ప్రతి ఒక్కరికీ సరిపోయేటంత నీరు లేదు. అయినా మీరు సహాయం కొరకు నా వద్దకు రాలేదు. యెహోవా చెప్పేది ఇదే.

“ఎండ వేడిమివల్ల, తెగుళ్లవల్ల మీ పంటలు పాడైపోయేలా చేశాను. మీ ఉద్యానవనాలను, ద్రాక్షా తోటలను నేను నాశనం చేశాను. మీ అంజూరపు చెట్లను, ఒలీవ చెట్లను మిడుతలు తినివేశాయి. కాని మీరు మాత్రం సహాయం కొరకు నా వద్దకు రాలేదు. యెహోవా చెప్పేది ఇదే.

10 “ఈజిప్టు విషయంలో చేసినట్లు నేను మీ మీదికి రోగాలను పంపించాను. మీ యువకులను నేను కత్తులతో సంహరించాను. మీ గుర్రాలను నేను తీసుకున్నాను. మీ స్థావరం కుళ్లిన శవాలతో దుర్గంధ పూరితమయ్యేలా చేశాను. కాని, మీరు సహాయం కొరకు నావద్దకు తిరిగి రాలేదు.” యెహోవా ఆ విషయాలు చెప్పాడు.

11 “సొదొమ, గొమొర్రా నగరాలను నేను నాశనం చేసినట్లు నేను నిన్ను నాశనం చేశాను. ఆ నగరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పొయ్యిలో నుండి లాగబడి కాలిన కట్టెలా మీరున్నారు. కాని, మీరు సహాయంకొరకు నా వద్దకు రాలేదు” అని యెహోవా చెపుతున్నాడు.

12 “కావున ఇశ్రాయేలూ, మీకు నేనీ విషయాలు కలుగజేస్తాను. ఇది మీకు నేను చేస్తాను. ఇశ్రాయేలూ, మీ దేవుని కలుసుకోటానికి సిద్ధమవ్వు.”

13 నేనెవరిని? పర్వతాలను ఏర్పాటు చేసింది నేనే.
    మీ మనస్సులను[a] సృష్టించింది నేనే.
    ఎలా మాట్లాడాలో ప్రజలకు నేర్పింది నేనే.
సంధ్యవేళను చీకటిగా మార్చేదీ నేనే. భూమిపైగల పర్వతాలపై నేను నడుస్తాను.
    ఇట్టి నేను ఎవరిని?
    సర్వశక్తిమంతుడగు దేవుడను. నా పేరు యెహోవా.

2 పేతురు 3:11-18

11 అన్నీ ఈ విధంగా నాశనమైపోతాయి కనుక దేవుని ప్రజలై పవిత్రంగా జీవించటం ఎంత అవసరమో గ్రహించండి. 12 దేవుని దినం రావాలని మీరు ఎదురు చూస్తున్నారు కనుక ఆ దినం త్వరలోనే రావాలని మీరు ఆశించాలి. ఆ రోజు వచ్చి ఆకాశాలను మంటలతో నాశనం చేస్తుంది. ఆ వేడికి పరమాణువులు కరిగి పోతాయి. 13 దేవుడు వాగ్దానం చేసిన క్రొత్త ఆకాశంలో క్రొత్త భూమిపై నీతి నివసిస్తుంది. వాటికోసమే మనం ఎదురు చూస్తున్నాం.

14 ప్రియ సోదరులారా! మీరు వీటికోసం ఎదురు చూస్తున్నారు గనుక మీలో ఏ దోషమూ, కళంకమూ లేకుండా ఉండేటట్లు అన్నివిధాల ప్రయత్నం చెయ్యండి. శాంతం వహించండి. 15 మన ప్రభువు యొక్క సహనము మనకు రక్షణను యిస్తుందని గ్రహించండి. దేవుడు యిచ్చిన విజ్ఞానంతో మన ప్రియమిత్రుడు పౌలు మీకు ఈ విషయాల్ని గురించి వ్రాసాడు. 16 అతడు వ్రాసిన ఉత్తరాలన్నీ యిదేవిధంగా వ్రాసాడు. వాటన్నిటిలోనూ ఈ విషయాల్ని గురించే మాట్లాడాడు. అతని ఉత్తరాల్లోని కొన్ని విషయాలు అర్థం చేసుకోవటానికి కష్టంగా ఉంటాయి. జ్ఞానం లేనివాళ్ళు, చపల చిత్తం గలవాళ్ళు యితర లేఖనాలపై తప్పుడు వ్యాఖ్యానం చేసినట్లే దీనిమీద కూడ తప్పడు వ్యాఖ్యానం చేస్తారు. ఇలా చేయటం వల్ల వాళ్ళు నాశనమైపోతారు.

17 అందువల్ల ప్రియమైన సోదరులారా! ఇప్పుడీ విషయాలు మీకు తెలుసు. కనుక జాగ్రత్తగా ఉండండి. నీతికి విరుద్ధంగా ప్రవర్తించే వ్యక్తుల తప్పుడు మాటలకు మోసపోకండి. మీలో వున్న స్థిరత్వాన్ని వదులుకోకండి. 18 మన ప్రభువు, రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు పట్ల మీకున్న కృతజ్ఞతను పెంచుకుంటూ, ఆయన్ని గురించి జ్ఞానంలో అభివృద్ధి చెందుతూ ఉండండి. ఆయనకి ఇప్పుడూ, చిరకాలం మహిమ కలుగుగాక! ఆమేన్.

మత్తయి 21:33-46

రైతుల ఉపమానం

(మార్కు 12:1-12; లూకా 20:9-19)

33 “ఇంకొక ఉపమానాన్ని వినండి. ఒక ఆసామి ఉండేవాడు. అతడు ఒక ద్రాక్షతోట నాటాడు. చుట్టూ ఒక గోడ కట్టించి ద్రాక్షరసాన్ని తీయటానికి ఒక గానుగను, తొట్టిని కట్టించాడు. కావలి కాయటానికి ఒక కంచె వేయించాడు. ఆ తర్వాత ఆ ద్రాక్షతోటను కొంతమంది రైతులకు కౌలుకిచ్చి ప్రయాణమై వెళ్ళిపోయాడు. 34 కోతకాలం కాగానే తన సేవకుల్ని ఆ రైతుల దగ్గరకు పంపి తన భాగం తీసుకు రమ్మన్నాడు.

35 “ఆ రైతులు, ఆ సేవకుల్ని పట్టుకొని వాళ్ళలో ఒకణ్ణి కొట్టారు. మరొకణ్ణి చంపారు. మూడవవాణ్ణి రాళ్ళతో కొట్టి చంపారు. 36 ఆ ఆసామి ఈ సారి మొదటి కన్నా యింకా ఎక్కువ మంది సేవకుల్ని పంపాడు. కాని ఆ రైతులు వాళ్ళ పట్ల కూడా అదే విధంగా ప్రవర్తించారు. 37 ఆ ఆసామి ‘నా కుమారుణ్ణి వాళ్ళు గౌరవించవచ్చు!’ అని అనుకొని చివరకు తన కుమారుణ్ణి వాళ్ళ దగ్గరకు పంపాడు.

38 “కాని ఆ రైతులు అతని కుమారుణ్ణి చూసి, ‘ఇతడు వంశోద్ధారకుడు. రండి! ఇతణ్ణి చంపేసి అతని ఆస్థిని తీసుకొందాం’ అని పరస్పరం మాట్లాడుకొన్నారు. 39 ఆ తర్వాత కుమారుణ్ణి పట్టుకొని చంపి ద్రాక్షతోటకవతల పారవేసారు.

40 “మరి ఆ ద్రాక్షతోట యజమాని తిరిగి వచ్చాక ఆ రైతుల్ని ఏమి చేస్తాడంటారు?”

41 వాళ్ళు, “ఆ దుష్టుల్ని ఘోరంగా చంపేస్తాడు. ఆ తదుపరి పంట కాలంలో తన భాగాన్ని తనకిచ్చే రైతులకు ఆ ద్రాక్షతోటను కౌలుకిస్తాడు” అని సమాధానం చెప్పారు.

42 యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “లేఖనాల్లో మీరీ విషయం ఎన్నడూ చదువలేదా?

‘ఇల్లు కట్టువాళ్ళు తృణీకరించిన రాయి ముఖ్యమైన రాయి అయింది.
ఇది ప్రభువు చేసాడు. ఆ రాయి మన కండ్లకు ఆశ్చర్యంగా కనబడుతుంది!’(A)

43 “అందువల్ల నేను చెప్పేదేమిటంటే దేవుడు తన రాజ్యాన్ని మీ నుండి తీసికొని, ఆ రాజ్యానికి తగిన విధంగా ప్రవర్తించే వాళ్ళకు యిస్తాడు. 44 ఈ బండ మీద పడ్డవాడు ముక్కలై పోతాడు. ఎవని మీద ఈ బండ పడ్తుందో అతడు నలిగి పోతాడు.”

45 ప్రధాన యాజకులు, పరిసయ్యులు యేసు చెప్పిన ఉపమానం విని ఆయన తమను గురించి మాట్లాడుతున్నట్టుగా గ్రహించారు. 46 వాళ్ళు ఆయన్ని బంధించటానికి మార్గాన్ని వెతికారు. కాని ప్రజలు ఆయన్ని ఒక ప్రవక్త అని అనుకొనే వాళ్ళు కనుక వాళ్ళు ప్రజల్ని చూసి భయపడి పోయారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International