Book of Common Prayer
సంగీత నాయకునికి: “శోషనీము” రాగం. కోరహు కుటుంబం రచించిన దైవ ధ్యానం మరియు ఒక ప్రేమగీతం.
45 రాజుకోసం నేను ఈ విషయాలు వ్రాస్తూ ఉండగా
అందమైన పదాలు నా మనస్సును నింపేస్తున్నాయి.
నైపుణ్యంగల రచయిత కలంనుండి వెలువడే మాటల్లా
నా నాలుక మీద మాటలు దొర్లిపోతున్నాయి.
2 నీవు అందరికంటె ఎంతో అందంగా ఉన్నావు!
నీ పెదవులనుండి దయ వెలువడుతుంది
కనుక దేవుడు నిన్ను శాశ్వతంగా ఆశీర్వదిస్తాడు.
3 నీవు ఖడ్గం ధరించు, యుద్ధ వీరునివలె, మహిమను, ఘనతను ధరించుము.
4 నీవు అద్భుతంగా కనబడుతున్నావు! వెళ్లి, నీతి న్యాయం కోసం పోరాటంలో గెలువుము.
అద్భుతకార్యాలు చేసేందుకు శక్తిగల నీ కుడి చేతిని ప్రయోగించుము.
5 నీ బాణాలు సిద్ధంగా ఉన్నాయి. అవి రాజు శత్రువుల హృదయాల్లోకి ప్రవేశిస్తాయి
అనేక మంది ప్రజలను నీవు ఓడిస్తావు.
6 దేవా, నీ సింహాసనం శాశ్వతంగా కొనసాగుతుంది!
నీ నీతి రాజదండము.
7 నీవు నీతిని ప్రేమిస్తావు, కీడును ద్వేషిస్తావు.
కనుక, నిన్ను నీ స్నేహితుల మీద రాజుగా
నీ దేవుడు కోరుకొన్నాడు.
8 నీ వస్త్రాలు గోపరసం, అగరు, లవంగ, పట్టావంటి కమ్మని సువాసనగా ఉన్నాయి.
నిన్ను సంతోషపరచుటకు దంతం పొదగబడిన భవనాల నుండి సంగీతం వస్తుంది.
9 నీవు ఘనపరచే స్త్రీలలో రాజకుమార్తెలున్నారు.
నీ పెండ్లి కుమార్తె ఓఫీరు బంగారంతో చేయబడిన కిరీటం ధరించి నీ చెంత నిలుస్తుంది.
10 కుమారీ, నా మాట వినుము.
నీ ప్రజలను, నీ తండ్రి కుటుంబాన్ని మరచిపొమ్ము.
11 రాజు నీ సౌందర్యాన్ని ప్రేమిస్తున్నాడు.
ఆయనే నీకు క్రొత్త భర్తగా ఉంటాడు.
నీవు ఆయన్ని ఘనపరుస్తావు.
12 తూరు పట్టణ ప్రజలు నీ కోసం కానుకలు తెస్తారు.
వారి ధనవంతులు నిన్ను కలుసుకోవాలని కోరుతారు.
13 రాజకుమారి రాజ గృహంలో బహు అందమైనది.
ఆమె వస్త్రం బంగారపు అల్లికగలది.
14 ఆమె అందమైన తన వస్త్రాలు ధరిస్తుంది. మరియు రాజు దగ్గరకు తీసుకొని రాబడుతుంది.
ఆమె వెనుక కన్యకల గుంపు కూడా రాజు దగ్గరకు తీసుకొని రాబడుతుంది.
15 సంతోషంతో నిండిపోయి వారు వస్తారు.
సంతోషంతో నిండిపోయి రాజభవనంలో వారు ప్రవేశిస్తారు.
16 రాజా, నీ తరువాత నీ కుమారులు పరిపాలిస్తారు.
దేశవ్యాప్తంగా నీవు వారిని రాజులుగా చేస్తావు.
17 నీ పేరును శాశ్వతంగా నేను ప్రసిద్ధి చేస్తాను.
శాశ్వతంగా, ఎల్లకాలం ప్రజలు నిన్ను స్తుతిస్తారు.
సంగీత నాయకునికి: కోరహు కుమారుల గీతం.
47 సర్వజనులారా, చప్పట్లు కొట్టండి.
సంతోషంగా దేవునికి కేకలు వేయండి.
2 మహోన్నతుడగు యెహోవా భీకరుడు.
భూలోకమంతటికీ ఆయన రాజు.
3 ఆయన ప్రజలను మనకు లోబరిచాడు.
ఆ రాజ్యాలను మన పాదాల క్రింద ఉంచాడు.
4 దేవుడు మన కోసం మన దేశాన్ని కోరుకున్నాడు.
యాకోబు కోసం అద్భుత దేశాన్ని ఆయన కోరుకున్నాడు. యాకోబు ఆయన ప్రేమకు పాత్రుడు.
5 బూర మ్రోగగానే, యుద్ధనాదం వినబడగానే
యెహోవా దేవుడు లేచాడు.
6 దేవునికి స్తుతులు పాడండి. స్తుతులు పాడండి.
మన రాజుకు స్తుతులు పాడండి. స్తుతులు పాడండి.
7 దేవుడు సర్వలోకానికి రాజు.
స్తుతిగీతాలు పాడండి.
8 దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద కూర్చున్నాడు.
దేవుడు సకల రాజ్యాలనూ పాలిస్తున్నాడు.
9 రాజ్యాల నాయకులు దేవుని ప్రజలతో సమావేశమయ్యారు.
దేవుని ప్రజలు అబ్రాహాము వంశస్థులు. వారి జనాంగమును దేవుడు కాపాడును.
నాయకులందరూ దేవునికి చెందినవారు.
దేవుడు మహోన్నతుడు.
కోరహు కుమారుల స్తుతి పాట.
48 యెహోవా గొప్పవాడు.
మన దేవుని పట్టణంలో, ఆయన పరిశుద్ధ పట్టణంలో స్తుతులకు ఆయన పాత్రుడు.
2 దేవుని పరిశుద్ధ పర్వతం అందమైనది, ఎత్తైనది.
అది భూమి అంతటికీ సంతోషాన్ని తెస్తుంది.
సీయోను పర్వతం దేవుని నిజమైన పర్వతం.[a]
అది మహారాజు పట్టణం.
3 ఇక్కడ ఆ పట్టణంలోని
భవనాలలో దేవుడు కోట అని పిలువబడుతున్నాడు.
4 ఒకప్పుడు రాజులు కొందరు సమావేశమయ్యారు.
వారు ఈ పట్టణంపై దాడి చేయాలని పథకం వేసారు.
వారంతా కలసి ముందుకు వచ్చారు.
5 ఆ రాజులు చూసారు. వారు ఆశ్చర్యపోయారు,
వారు బెదిరిపోయారు. మరియు వారంతా పారిపోయారు!
6 ఆ రాజులందరికీ భయం పట్టుకొంది.
ప్రసవ వేదన పడుతున్న స్త్రీలలా వారు వణికారు.
7 దేవా, బలమైన తూర్పుగాలితో
తర్షీషు ఓడలను బ్రద్దలు చేశావు.
8 మేము ఏమి విన్నామో, దాన్ని మహా శక్తిగల దేవుని పట్టణంలో
మన సర్వశక్తిమంతుడైన యెహోవా పట్టణంలో చూశాము.
దేవుడు ఆ పట్టణాన్ని శాశ్వతంగా బలపరుస్తాడు.
9 దేవా, నీ ప్రేమ, కనికరాలను గూర్చి మేము నీ ఆలయంలో జాగ్రత్తగా ఆలోచిస్తాము.
10 దేవా, నీవు ప్రఖ్యాతిగలవాడవు.
భూలోకమంతటా ప్రజలు నిన్ను స్తుతిస్తారు.
నీ కుడిచేయి నీతితో నిండియున్నది.
11 సీయోను పర్వతం సంతోషిస్తుంది.
మరియు యూదా నగరాలు ఆనందంగా ఉన్నాయి. దేవా, ఎందుకంటే నీవు మంచి తీర్పులు చేశావు.
12 సీయోను చుట్టూ తిరుగుతూ
ఆ పట్టణాన్ని చూడండి, గోపురాలు లెక్కించండి.
13 ఎత్తైన గోడలు చూడండి.
సీయోను రాజనగరుల ద్వారా వెళ్ళండి.
అప్పుడు తరువాత తరాలకు మీరు దాన్ని గూర్చి చెప్పగలుగుతారు.
14 ఈ విషయాలు దేవుడు ఎటువంటి వాడు అనేది మనకు తెలియజేస్తున్నాయి:
ఆయన ఎప్పటికీ మన దేవుడు, ఆయన ఎల్లప్పుడు మనలను కాపాడుతాడు.
5 ఆ కాలంలో ప్రవక్తలైన హగ్గయి,[a] ఇద్దో కొడుకు జెకర్యా[b] దేవుని పేరట ప్రవచించారు. యూదా, యెరూషలేములోని యూదులను వాళ్లు ప్రోత్సహించారు. 2 దానితో, షయల్తీయేలు కొడుకు జెరుబ్బాబెలు, యోజాదాకు కొడుకు యేషూవలు యెరూషలేములోని దేవాలయ నిర్మాణ కృషిని తిరిగి ప్రారంభించారు. దేవుని ప్రవక్తలందరూ వారితో ఉండి, ఆ పనికి తోడ్పడుతూ వచ్చారు. 3 ఆ కాలంలో యూఫ్రటీసునది పశ్చిమ ప్రాంతానికి తత్తెనైయు అధిపతి. తత్తెనైయు, షెతర్బోజ్నయి, వారి సహోద్యోగులు నిర్మాణ కృషి సాగిస్తున్న జెరుబ్బాబెలు, యేషూవ, తదితరుల వద్దకు వెళ్లి, “ఈ దేవాలయాన్ని పునర్నిర్మించి, దీన్ని సరికొత్తదానిగా రూపొందించడానికి మీకు ఎవరు అనుమతినిచ్చారు?” అని నిలదీశారు. 4 అంతేకాదు, వాళ్లు జెరుబ్బాబెలును, “ఈ భవనం పని చేస్తున్న వాళ్ల పేర్లు యేమిటి?” అని కూడా ప్రశ్నించారు.
5 అయితే, యూదా నాయకుల మీద దేవుని దృష్టివుంది. దర్యావేషు రాజుకి భవన నిర్మాతలు లేఖలు పంపుకున్నారు. రాజు సమాధానం పంపేదాకా, వాళ్లు పనిని నిలుపు చేయవలసిన అవసరం లేకపోయింది. వాళ్లు తమ నిర్మాణ కృషిని కొనసాగించారు.
6 యూఫ్రటీసు నది పశ్చిమ ప్రాంతాధిపతి అయిన తతైనైయు, షతర్బోజ్నయి, వారి ముఖ్య సహోద్యోగులు దర్యావేషు రాజుకి ఒక లేఖ పంపారు. 7 ఆ లేఖ నకలు ఇది:
దర్యావేషు రాజుకి,
శుభం!
8 దర్యావేషు రాజుకి మేము ఇందు మూలంగా తెలియజేసేది ఏమంటే, తమ ఆదేశం మేరకు యూదా రాజ్యంలో గొప్ప దేవుని ఆలయానికి మేము వెళ్లాము. యూదాలోని ప్రజలు ఆ ఆలయాన్ని పెద్దపెద్ద రాళ్లతో కడుతున్నారు. గోడల్లో వాళ్లు పెద్ద దూలాలు పరుస్తున్నారు ఎంతో శ్రద్ధగా పనిచేస్తున్నారు. వాళ్లు చాలా వేగంగా నిర్మాణం సాగిస్తున్నారు. త్వరలోనే పనిపూర్త వుతుంది.
9 వాళ్లు చేస్తున్న పనిని గురించి మేము వాళ్ల నాయకుల్ని కొన్ని ప్రశ్నలు అడిగాము. “ఈ దేవాలయాన్ని తిరిగి నిర్మించేందుకూ, కొత్తదానిగా దాన్ని రూపొందించేందుకూ మీకు ఎవరు అనుమతి ఇచ్చారు?” అని మేము ప్రశ్నించాము. 10 మేము వాళ్ల పేర్లు కూడా అడిగాము. వాళ్లెవరో మీరు తెలుసు కోగలిగేందుకు వీలుగా మేము వాళ్ల పేర్లు వ్రాసి పెట్టాలని అనుకున్నాము.
11 వాళ్లు మాకు ఇచ్చిన సమాధానం యిది:
“మేము భూ, పరలోకాల అధిపతియైన యెహోవా దేవుని సేవకులం. చాలా సంవత్సరాల క్రితం ఇశ్రాయేలు మహారాజొకడు నిర్మించి ముగించిన దేవాలయాన్ని మేమిప్పుడు తిరిగి నిర్మిస్తున్నాం. 12 కాని, మా పూర్వీకులు దేవునికి కోపం తెప్పించారు. ఆయన వారిని బబులోను రాజైన నెబుకద్నెజరుకు లోబరిచాడు. నెబుకద్నెజరు ఈ దేవాలయాన్ని నిర్మూలించాడు, ప్రజలను బలవంతాన బబులోనుకు బందీలుగా తీసుకుపోయాడు. 13 అయితే, కోరెషు రాజు దేవాలయం తిరిగి నిర్మింపబడాలని ఒక ప్రత్యేకాజ్ఞ జారీ చేశాడు. 14 కోరెషు గతంలో యెహోవా దేవాలయం నుంచి కొల్లగొట్టిన వెండి, బంగారు వస్తువులను బబులోనులోని అబద్ధపు దేవత ఆలయంనుంచి బయటికి తీయించాడు. నెబుకద్నెజరు గతంలో ఆ వస్తువులను యెరూషలేములోని ఆలయం నుంచి కొల్లగొట్టి, వాటిని బబులోను లోని తన అబద్ధపు దేవత దేవాలయంలో ఉంచాడు. ఇప్పుడు కోరెషు రాజు ఆ వెండి, బంగారు వస్తువులను షేష్బజ్జరుకు ఇచ్చాడు. కోరెషు షేష్బజ్జరును ప్రాంతీయాధికారిగా నియమించాడు.”
15 కోరెషు షేష్బజ్జరును ఇలా ఆదేశించాడు: “నువ్వీ వెండి, బంగారు వస్తువులను తీసుకుపోయి, వాటిని తిరిగి యెరూషలేములోని దేవాలయంలో పెట్టు. గతంలో ఉన్న చోటనే దేవాలయాన్ని తిరిగి నిర్మింప జేయి.”
16 షేష్బజ్జరు వచ్చి, యెరూషలేములోని దేవాలయానికి పునాదులు నిర్మించాడు. ఆనాటి నుంచి నేటిదాకా పని కొనసాగింది. అయితే, ఆ పని యింకా పూర్తి కాలేదు.
17 ఇప్పుడిక, తమకి సమ్మతమైతే, రాజుగారి ఆధికారిక, చారిత్రక పత్రాలను గాలించండి. యెరూషలేములో దేవాలయం నిర్మించుమని కోరెషు రాజు ఆజ్ఞ జారీ చేశాడన్న మాట నిజమేనేమో పరిశీలించుము. తర్వాత తమరీ విషయంలో తీసుకున్న నిర్ణయమేమిటో దయచేసి మాకొక లేఖద్వారా తెలియజేయండి.
యోహాను పరలోకాన్ని చూడటం
4 ఇది జరిగిన తర్వాత నేను కళ్ళెత్తి చూశాను. పరలోకంలో ఒక ద్వారం కనిపించింది. ఆ ద్వారము తెరుచుకొని ఉంది. బూర ఊదినట్లు యింతకు ముందు మాట్లాడిన స్వరం నాకు మళ్ళీ వినిపించింది. అది నాతో, “ఇలా మీదికి రా; దీని తర్వాత ఏమి జరుగుతుందో నీకు చూపిస్తాను” అని అంది. 2 నేను వెంటనే పరిశుద్ధాత్మ ఆధీనమయ్యాను. పరలోకంలో ఉన్న సింహాసనం నాముందు కనిపించింది. దాని మీద ఎవరో కూర్చొని ఉన్నారు. 3 దాని మీద కూర్చున్నవాడు సూర్యకాంతమణివలె, పద్మరాగమువలె వున్నాడు. ఆ సింహాసనం చుట్టూ మరకతమును పోలిన ఆకాశ ధనుస్సు ప్రకాశిస్తూ ఉంది.
4 దాని చుట్టూ యిరవై నాలుగు యితర సింహాసనాలు ఉన్నాయి. వాటి మీద యిరవై నాలుగు మంది పెద్దలు కూర్చొని ఉన్నారు. వాళ్ళు తెల్లని దుస్తులు ధరించి ఉన్నారు. వాళ్ళ తలలపై బంగారు కిరీటాలు ఉన్నాయి. 5 సింహాసనం నుండి మెరుపులువచ్చాయి. పెద్ద గర్జనలు ఉరుములు దాన్నుండి వినిపించాయి. ఆ సింహాసనం ముందు ఏడు దీపాలు దివ్యంగా వెలుగుతూ ఉన్నాయి. ఇవి దేవుని ఏడు ఆత్మలు. 6 గాజుతో కప్పిన సముద్రంలా కనిపించే ఒక గాజు సముద్రం ఆ సింహాసనం ముందు కనిపించింది. అది స్ఫటికంలా నిర్మలంగా ఉంది.
సింహాసనం మధ్య, చుట్టూ, అంటే ముందు, వెనుక నాలుగు ప్రాణులు ఉన్నాయి. వాటి దేహాలు ముందు, వెనుక కళ్ళతో కప్పబడి ఉన్నాయి. 7 మొదటి ప్రాణి ఒక సింహంలా, రెండవది ఒక ఎద్దులా, మూడవది ఒక మనిషి ముఖంలా, నాలుగవది ఎగిరే పెద్ద పక్షిలా ఉన్నాయి.[a] 8 ప్రతి ప్రాణికి ఆరు రెక్కలు ఉన్నాయి. వాటి శరీరాలపైన, క్రింద కళ్ళతో పూర్తిగా కప్పబడి ఉన్నాయి. రెక్కల క్రింద కళ్ళతో కప్పబడి ఉన్నాయి. రాత్రింబవళ్ళు అవి విడువక:
“భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉన్నవాడు, సర్వశక్తి సంపన్నుడును
ప్రభువునైన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు”
అని పాడుతూ ఉన్నాయి.
9 సింహాసనంపై కూర్చొన్నవానికి, చిరకాలం జీవించేవానికి, మహిమ, గౌరవము కలగాలని అంటూ ఈ ప్రాణులు తమ కృతజ్ఞతలు తెలుపుతూ పాడాయి. 10 అవి ఆ విధంగా పాడినప్పుడు ఆ యిరవై నాలుగు మంది పెద్దలు ఆ సింహాసనంపై కూర్చొన్నవానిముందు సాష్టాంగపడి చిరకాలం జీవించే ఆయన్ని స్తుతించారు. తమ కిరీటాల్ని సింహాసనం ముందువేసి,
11 “మా ప్రభూ! దైవమా!
నీవు తేజమును, గౌరవమును, శక్తిని పొందతగిన యోగ్యుడవు,
నీవు అన్నిటినీ సృష్టించావు.
అవి నీ యిష్టానుసారం సృష్టింపబడి జీవాన్ని పొందాయి”
అని అన్నారు.
రైతు విత్తనాలు చల్లుటను గురించిన ఉపమానం
(మార్కు 4:1-9; లూకా 8:4-8)
13 అదే రోజు యేసు ఇంటి నుండి వెళ్ళి సరస్సు ప్రక్కన కూర్చున్నాడు. 2 ఆయన చుట్టు పెద్ద ప్రజల గుంపు సమావేశమైంది. అందువల్ల ఆయన పడవనెక్కి కూర్చున్నాడు. ప్రజలు సరస్సు ఒడ్డున నిలుచున్నారు. 3 ఆయన వాళ్ళకు ఎన్నో విషయాలు ఉపమానాలు చెబుతూ బోధించాడు,
“ఒక రైతు విత్తనాలు చల్లటానికి వెళ్ళాడు. 4 అతడు విత్తనాలు చల్లుతుండగా కొన్ని విత్తనాలు దారి ప్రక్కన పడ్డాయి. పక్షులు వచ్చి వాటిని తినివేసాయి. 5 మరి కొన్ని విత్తనాలు మట్టి ఎక్కువగా లేని రాతి నేలపై పడ్డాయి. మట్టి ఎక్కువగా లేనందున అవి త్వరగా మొలకెత్తాయి. 6 కాని సూర్యోదయమయ్యాక ఆ మొక్కలు వాడి పొయ్యాయి. వాటివేర్లు పెరగనందువల్ల అవి ఎండిపొయ్యాయి. 7 మరి కొన్ని విత్తనాలు ముండ్ల మొక్కల మధ్య పడ్డాయి. ఈ ముళ్ళ మొక్కలు పెరిగి ధాన్యపు మొక్కల్ని అణిచి వేసాయి. 8 మరి కొన్ని విత్తనాలు సారవంతమైన నేలపై బడ్డాయి. వాటిలో కొన్ని నూరు రెట్ల పంటను, కొన్ని అరవై రెట్ల పంటను, కొన్ని ముప్పైరెట్ల పంటనిచ్చాయి. 9 వినేవాళ్లు వినండి!”
© 1997 Bible League International