Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 148-150

148 యెహోవాను స్తుతించండి!
పైన ఉన్న దూతలారా, ఆకాశంలో యెహోవాను స్తుతించండి!
సకల దూతలారా, యెహోవాను స్తుతించండి!
    ఆయన సర్వ సైనికులారా,[a] ఆయనను స్తుతించండి!
సూర్యచంద్రులారా, యెహోవాను స్తుతించండి.
    ఆకాశంలోని నక్షత్రాలూ, వెలుతురూ యెహోవాను స్తుతించండి!
మహా ఉన్నతమైన ఆకాశంలోని యెహోవాను స్తుతించండి.
    ఆకాశం పైగా ఉన్న జలములారా, ఆయనను స్తుతించండి.
యెహోవా నామాన్ని స్తుతించండి.
    ఎందుకనగా దేవుడు ఆజ్ఞ యివ్వగా ప్రతి ఒక్కటీ సృష్టించబడింది.
ఇవన్నీ శాశ్వతంగా కొనసాగేందుకు దేవుడు చేశాడు.
    ఎన్నటికి అంతంకాని న్యాయచట్టాలను దేవుడు చేశాడు.
భూమి మీద ఉన్న సమస్తమా. యెహోవాను స్తుతించు!
    మహా సముద్రాలలోని గొప్ప సముద్ర జంతువుల్లారా, యెహోవాను స్తుతించండి.
అగ్ని, వడగండ్లు, హిమము, ఆవిరి,
    తుఫాను, గాలులు అన్నింటినీ దేవుడు చేశాడు.
పర్వతాలను, కొండలను, ఫలవృక్షాలను,
    దేవదారు వృక్షాలను దేవుడు చేశాడు.
10 అడవి జంతువులను, పశువులను, పాకే ప్రాణులను, పక్షులను అన్నింటినీ దేవుడు చేశాడు.
11 భూమి మీద రాజ్యాలను రాజులను దేవుడు చేశాడు.
    నాయకులను, న్యాయాధిపతులను దేవుడు చేశాడు.
12 యువతీ యువకులను దేవుడు చేశాడు.
    వృద్ధులను, యవ్వనులను దేవుడు చేశాడు.
13 యెహోవా నామాన్ని స్తుతించండి!
    ఆయన నామాన్ని శాశ్వతంగా ఘనపర్చండి!
భూమిపైన, ఆకాశంలోను ఉన్న
    సమస్తం ఆయనను స్తుతించండి!
14 దేవుడు తన ప్రజలను బలవంతులుగా చేస్తాడు.
    దేవుని అనుచరులను మనుష్యులు పొగడుతారు.
ఎవరి పక్షంగా అయితే దేవుడు పోరాడుతున్నాడో ఆ ఇశ్రాయేలీయులను మనుష్యులు పొగడుతారు. యెహోవాను స్తుతించండి!

149 యెహోవాను స్తుతించండి.
యెహోవా చేసిన కొత్త సంగతులను గూర్చి ఒక కొత్త కీర్తన పాడండి!
    ఆయన అనుచరులు కూడుకొనే సమావేశంలో ఆయనకు స్తుతి పాడండి.
ఇశ్రాయేలును దేవుడు చేశాడు. ఇశ్రాయేలును యెహోవాతో కలిసి ఆనందించనివ్వండి.
    సీయోను మీది ప్రజలను వారి రాజుతో కూడా ఆనందించనివ్వండి.
ఆ ప్రజలు వారి తంబురాలు, స్వరమండలాలు వాయిస్తూ
    నాట్యమాడుతూ దేవుణ్ణి స్తుతించనివ్వండి.
యెహోవా తన ప్రజలను గూర్చి సంతోషిస్తున్నాడు.
    దేవుడు తన దీన ప్రజలకు ఒక అద్భుత క్రియ చేశాడు.
    ఆయన వారిని రక్షించాడు!
దేవుని అనుచరులారా, మీ విజయంలో ఆనందించండి.
    పడకలు ఎక్కిన తరువాత కూడ సంతోషించండి.

ప్రజలు దేవునికి గట్టిగా స్తుతులు చెల్లించెదరుగాక.
    ప్రజలు తమ చేతులలో వారి ఖడ్గాలు పట్టుకొని
వెళ్లి వారి శత్రువులను శిక్షించెదరుగాక.
    వారు వెళ్లి యితర ప్రజలను శిక్షించెదరుగాక.
ఆ రాజులకు, ప్రముఖులకు
    దేవుని ప్రజలు గొలుసులు వేస్తారు.
దేవుడు ఆజ్ఞాపించినట్టే దేవుని ప్రజలు వారి శత్రువులను శిక్షిస్తారు.
    దేవుని అనుచరులకు ఆయన ఆశ్చర్యకరుడు.

యెహోవాను స్తుతించండి!

150 యెహోవాను స్తుతించండి!
దేవుని ఆలయంలో ఆయనను స్తుతించండి!
    ఆకాశంలో ఆయన శక్తిని బట్టి ఆయనను స్తుతించండి!
ఆయన గొప్ప కార్యములను బట్టి ఆయనను స్తుతించండి!
    ఆయన గొప్పతనమంతటి కోసం ఆయనను స్తుతించండి!
బూరలతో, కొమ్ములతో ఆయనను స్తుతించండి!
    స్వరమండలాలతో, సితారాలతో ఆయనను స్తుతించండి!
తంబురలతో, నాట్యంతో దేవుని స్తుతించండి!
    తీగల వాయిద్యాలతో, పిల్లన గ్రోవితో ఆయనను స్తుతించండి!
పెద్ద తాళాలతో దేవుణ్ణి స్తుతించండి!
    పెద్దగా శబ్దం చేసే తాళాలతో ఆయనను స్తుతించండి!

సజీవంగా ఉన్న ప్రతీది యెహోవాను స్తుతించాలి!

యెహోవాను స్తుతించండి.

కీర్తనలు. 114-115

114 ఇశ్రాయేలు ఈజిప్టు విడిచిపెట్టాడు.
    యాకోబు (ఇశ్రాయేలు) ఆ విదేశాన్ని విడిచిపెట్టాడు.
ఆ కాలంలో యూదా దేవుని ప్రత్యేక ప్రజలయ్యారు.
    ఇశ్రాయేలు ఆయన రాజ్యం అయింది.
ఎర్ర సముద్రం యిది చూచి పారిపోయింది.
    యొర్దాను నది వెనుదిరిగి పరుగెత్తింది.
పర్వతాలు పొట్టేళ్లలా నాట్యం చేశాయి.
    కొండలు గొర్రెపిల్లల్లా నాట్యం చేశాయి.

ఎర్ర సముద్రమా, ఎందుకు పారిపోయావు?
    యొర్దాను నదీ, నీవెందుకు వెనుదిరిగి పరిగెత్తావు?
పర్వతాల్లారా, మీరెందుకు పొట్టేళ్లలా నాట్యం చేశారు?
    కొండలూ, మీరెందుకు గొర్రె పిల్లల్లా నాట్యం చేశారు?

యాకోబు దేవుడైన యెహోవా యెదుట భూమి కంపించింది.
బండ నుండి నీళ్లు ప్రవహించేలా చేసినవాడు యెహోవాయే.
    ఆ కఠిన శిల నుండి నీటి ఊట ప్రవహించునట్లు దేవుడే చేసాడు.

115 యెహోవా, ఏ ఘనతా మేము స్వీకరించకూడదు. ఘనత నీకే చెందుతుంది.
    నీ ప్రేమ, నమ్మకం మూలంగా ఘనత నీదే.
మా దేవుడు ఎక్కడ అని జనాంగాలు ఎందుకు ఆశ్చర్యపడాలి?
దేవుడు పరలోకంలో ఉన్నాడు, ఆయన కోరింది చేస్తాడు.
ఆ జనాంగాల “దేవుళ్లు” వెండి బంగారాలతో చేయబడ్డ విగ్రహాలే.
    ఎవరో ఒక మనిషి చేతులతో చేసిన విగ్రహాలే అవి.
ఆ విగ్రహాలకు నోళ్లున్నాయి కాని అవి మాట్లాడలేవు.
    వాటికి కళ్లున్నాయి కాని అవి చూడలేవు.
వాటికి చెవులున్నాయి కాని అవి వినలేవు.
    వాటికి ముక్కులున్నాయి కాని అవి వాసన చూడలేవు.
వాటికి చేతులు ఉన్నాయి కాని అవి తాకలేవు.
    వాటికి కాళ్లు ఉన్నాయి కాని అవి నడవలేవు.
    వాటికి గొంతుల్లోనుంచి ఏ శబ్దాలూ రావు.
ఆ విగ్రహాలను చేసేవారు. వాటిని నమ్ముకొనే వారు కూడ సరిగ్గా వాటివలె అవుతారు.

ఇశ్రాయేలూ, యెహోవాను నమ్ము.
    యెహోవా వారి బలము, ఆయన వారి డాలు.
10 అహరోను వంశస్థులు యెహోవాను నమ్ముతారు.
    యెహోవా వారి బలము, డాలు అయివున్నాడు.
11 యెహోవా అనుచరులు యెహోవాను నమ్ముకొంటారు.
    యెహోవా తన అనుచరులకు సహాయం చేసి కాపాడుతాడు.

12 యెహోవా మమ్మల్ని జ్ఞాపకం చేసికొంటాడు.
    యెహోవా మమ్మల్ని ఆశీర్వదిస్తాడు.
    యెహోవా ఇశ్రాయేలును ఆశీర్వదిస్తాడు.
    యెహోవా అహరోను వంశాన్ని ఆశీర్వదిస్తాడు.
13 యెహోవా పెద్దవారైనా, చిన్నవారైనా తన అనుచరులను ఆశీర్వదిస్తాడు.

14 యెహోవా మీ కుటుంబాలను పెద్దవిగా చేస్తాడని నేను ఆశిస్తున్నాను. ఆయన మీ పిల్లల కుటుంబాలను పెద్దవిగా చేస్తాడని నేను ఆశిస్తున్నాను.
15     యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు.
    ఆకాశాన్ని, భూమిని యెహోవా చేశాడు.
16 ఆకాశం యెహోవాకు చెందుతుంది.
    కాని భూమిని ఆయన మనుష్యులకు ఇచ్చాడు.
17 చనిపోయినవాళ్లు యెహోవాను స్తుతించరు.
    కింద సమాధిలో ఉన్న మనుష్యులు యెహోవాను స్తుతించరు.
18 అయితే మనం యెహోవాను స్తుతిస్తాం.
    మనం యిప్పటినుండి ఎప్పటికీ ఆయనను స్తుతిస్తాము!

యెహోవాను స్తుతించండి!

యెషయా 43:14-44:5

14 యెహోవా, ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు మిమ్మల్ని రక్షిస్తాడు. యెహోవా చెబుతున్నాడు, “నేను మీ కోసం సైన్యాలను బబులోనుకు పంపిస్తాను. అనేక మంది ప్రజలు బంధించబడతారు. ఆ కల్దీయుల ప్రజలు వారి స్వంత పడవల్లోనే తీసుకొనిపోబడతారు. (కల్దీ ప్రజలకు ఆ పడవలను గూర్చి చాలా గర్వం) 15 నేను యెహోవాను, మీ పరిశుద్ధుడ్ని. ఇశ్రాయేలును నేను సృష్టించాను. నేను మీ రాజును.”

దేవుడు తన ప్రజలను మరల రక్షిస్తాడు

16 యెహోవా సముద్రంలో మార్గాలు వేస్తాడు. కల్లోలిత జలాలలో గూడ ఆయన తన ప్రజలకు ఒక బాట వేస్తాడు. మరియు యెహోవా చెబుతున్నాడు, 17 “రథాలు, గుర్రాలు, సైన్యాలతో నాకు విరోధంగా యుద్ధం చేసేవారు ఓడించబడతారు. వాళ్లు మళ్లీ ఎన్నటికీ లేవరు. వారు నాశనం చేయబడతారు. క్రొవ్వువత్తి మంట ఆర్పినట్టుగా వారు ఆర్పివేయబడతారు. 18 కనుక మొదట్లో జరిగిన సంగతులను జ్ఞాపకం చేసుకోవద్దు. చాలా కాలం క్రిందట జరిగిన ఆ సంగతులను గూర్చి ఆలోచించవద్దు. 19 ఎందుకంటే నేను నూతన కార్యాలు చేస్తాను. ఇప్పుడు మీరు క్రొత్త మొక్కలా ఎదుగుతారు. ఇది సత్యమని మీకు గట్టిగా తెలుసు. నేను నిజంగానే అరణ్యంలో బాట వేస్తాను. నిజంగానే నేను ఎడారిలో నదులు ప్రవహింపజేస్తాను. 20 అడవి జంతువులు కూడ నాకు కృతజ్ఞత కలిగి ఉంటాయి. నిప్పుకోళ్లు, పెద్ద జంతువులు నన్ను ఘనపరుస్తాయి. అరణ్యంలో నేను నీళ్లను ప్రవహింప చేసినప్పుడు అవి నన్ను ఘనపరుస్తాయి. ఎడారిలో నేను నదులను ప్రవహింప జేసినప్పుడు అవి ఘనపరుస్తాయి. నేను ఏర్పరచుకొన్న నా ప్రజలకు నీళ్లు ఇవ్వటానికి నేను దానిని చేస్తాను. 21 వీరే నేను చేసిన మనుష్యులు. ఈ ప్రజలు నన్ను స్తుతించుటకు పాటలు పాడతారు.

22 “యాకోబూ, నీవు నాకు మొరపెట్టలేదు. ఎందుకంటే ఇశ్రాయేలూ, నీవు నాతో విసిగిపోయావు. 23 ప్రజలారా, మీరు మీ బలి అర్పణ గొర్రెలను నా దగ్గరకు తీసుకొని రాలేదు. మీరు నన్ను ఘనపర్చలేదు. మీరు నాకు బలులు అర్పించలేదు, మీరు నాకు బలులు ఇవ్వాలని నేను మిమ్మల్ని బలవంతం చేయలేదు. మీకు విసుగు కలిగేంత వరకు మీరు నాకు ధూపం వేయమని మిమ్మల్ని నేను బలవంతపెట్టలేదు. 24 కనుక మీరు నన్ను ఘనపర్చేందుకు అవసరమైన వస్తువులు కొనుటకు మీరు మీ డబ్బును ఉపయోగించలేదు. కానీ నేను మీ సేవకునిలా ఉండాలని మీరే నన్ను బలవంతం చేశారు. మీ చెడు క్రియలన్నీ నన్ను చాలా విసిగించే వరకు పాపం చేశారు.

25 “నేను, నేనే మీ పాపాలు తుడిచివేసే వాడ్ని. నా ఆనందం కోసం నేను దీన్ని చేస్తాను. నేను మీ పాపాలు జ్ఞాపకం చేసుకోను. 26 కానీ మీరు నన్ను జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం సమావేశంగా కలుసుకొని ఏది సరైనదో నిర్ణయించాలి. మీరు చేసిన వాటిని గూర్చి చెప్పి, మీదే సరిగ్గా ఉంది అని చూపించాలి. 27 మీ మొదటి తండ్రి పాపం చేశాడు. మీ న్యాయవాదులు నాకు విరోధమైన వాటిని చేశారు. 28 మీ పవిత్ర పాలకులను పవిత్రులు గాకుండా నేను చేస్తాను. యాకోబు సంపూర్తిగా నావాడయ్యేటట్టు నేను చేస్తాను. ఇశ్రాయేలుకు చెడుగులు సంభవిస్తాయి.

యెహోవా ఒక్కడు మాత్రమే దేవుడు

44 “యాకోబూ నీవు నా సేవకుడవు. నా మాట విను. ఇశ్రాయేలూ నేను నిన్ను ఏర్పాటు చేసుకొన్నాను. నేను చెప్పే సంగతులు విను. నేను యెహోవాను, నేనే నిన్ను సృజించాను. నీవు ఏమై యున్నావో అలా ఉండేందుకు నిన్ను సృజించిన వాడను నేనే. నీవు నీ తల్లి గర్భంలో ఉన్నప్పటినుంచి నేను నీకు సహాయం చేశాను. యాకోబూ, నా సేవకా, భయపడవద్దు. యెషూరూనూ[a] నిన్ను నేను ఏర్పాటు చేసుకొన్నాను.

“దాహంగా ఉన్న మనుష్యులకు నేనే నీళ్లు పోస్తాను. ఎండిన భూమిమీద నేనే కాలువలను ప్రవహింపజేస్తాను. నీ పిల్లల మీద నేనే నా ఆత్మను కుమ్మరిస్తాను. అది మీ కుటుంబం మీద పొర్లుతున్న ఒక నీటి ప్రవాహంలా ఉంటుంది. వారు ప్రపంచంలో ప్రజల మధ్య ఎదుగుతారు. నీటి కాలువల పక్కగా పెరిగే చెట్లలా ఉంటారు వారు.

“ఒక వ్యక్తి అంటాడు, ‘నేను యెహోవాకు చెందినవాడను’ అని, మరోవ్యక్తి ‘యాకోబు’ పేరు చెప్పుకొంటాడు. ఇంకొక వ్యక్తి ‘నేను యెహోవావాడను,’ అని తన పేరు వ్రాసుకొంటాడు. ఇంకొకరు ‘ఇశ్రాయేలు’ పేరు ప్రయోగిస్తాడు.”

హెబ్రీయులకు 6:17-7:10

17 దేవుడు తన వాగ్దానం విషయంలో తన ఉద్దేశ్యాన్ని మార్చుకోనని వాగ్దానం పొందిన వారసులకు స్పష్టం చేయాలనుకున్నాడు. అందువల్ల ఆ వాగ్దానాన్ని తన మీద ప్రమాణం చేసి దృఢపరిచాడు. 18 అందువల్ల ఈ “రెండూ” మార్పు చెందలేవు. వీటివిషయంలో దేవుడు అసత్యమాడలేడు.

తానివ్వబోయేవాటికోసం ఆశాభావంతో పరుగెత్తుతున్నవాళ్ళకు ప్రోత్సాహం కలగాలని ఈ ప్రమాణం చేశాడు. 19 భద్రతను, దృఢత్వాన్ని కలిగించే ఈ నిరీక్షణ మన ఆత్మలకు లంగరు లాంటిది. ఈ నిరీక్షణ తెరవెనుక లోపలి భాగంలో స్థిరముగా ప్రవేశించగలదు. 20 యేసు మన కోసం, మనకన్నా ముందు ఆ తెరలోపలికి వెళ్ళాడు. మెల్కీసెదెకు క్రమంలో యేసు కూడా శాశ్వతంగా ప్రధాన యాజకుడుగా ఉంటాడు.

మెల్కీసెదెకు

ఈ మెల్కీసెదెకు షాలేము రాజు, మరియు మహోన్నతుడైన దేవుని యాజకుడు. అబ్రాహాము రాజులను ఓడించి తిరిగి వస్తున్నప్పుడు మెల్కీసెదెకు అతన్ని కలుసుకొని ఆశీర్వదించాడు. అబ్రాహాము తాను జయించిన వాటిలో పదవవంతు మెల్కీసెదెకుకు యిచ్చాడు.

మొదటిదిగా “మెల్కీసెదెకు” అనే పదానికి నీతికి రాజు అనే అర్థం. రెండవదిగా “షాలేము రాజు” అను యితని పేరుకు శాంతికి రాజు అనే అర్థం కూడా వుంది. మెల్కీసెదెకు తల్లిదండ్రులెవరో మనకు తెలియదు. అతని పూర్వికులెవరో మనకు తెలియదు. అతని బాల్యాన్ని గురించి కాని, అంతిమ రోజుల్ని గురించి కాని మనకు తెలియదు. దేవుని కుమారునివలె అతడు కూడా చిరకాలం యాజకుడుగా ఉంటాడు.

మూల పురుషుడైన అబ్రాహాము కూడా తాను జయించినదానిలో పదవ వంతు అతనికిచ్చాడంటే, అతడు ఎంత గొప్పవాడో గ్రహించండి. ఇశ్రాయేలు ప్రజలు అబ్రాహాము వంశానికి చెందినవాళ్ళు, లేవి జాతికి చెందిన యాజకుల సోదరులు. అయినా ధర్మశాస్త్రంలో ఈ లేవి యాజకులు ప్రజలు ఆర్జించినదానిలో పదవవంతు సేకరించాలని ఉంది. మెల్కీసెదెకు లేవి జాతికి చెందినవాడు కాకపోయినా, అబ్రాహాము నుండి అతని ఆదాయంలో పదవవంతు సేకరించాడు. దేవుని వాగ్దానాలు పొందిన అతణ్ణి ఆశీర్వదించాడు. ఆశీర్వదించేవాడు, ఆశీర్వాదం పొందే వానికన్నా గొప్ప వాడవటంలో అనుమానం లేదు.

ఒకవైపు చనిపోయేవాళ్ళు పదవ వంతు సేకరిస్తున్నారు. మరొక వైపు చిరకాలం జీవిస్తాడని లేఖనాలు ప్రకటించిన మెల్కీసెదెకు పదవ వంతు సేకరిస్తున్నాడు. ఒక విధంగా చూస్తే పదవవంతు సేకరించే లేవి, అబ్రాహాము ద్వారా పదవవంతు చెల్లించాడని చెప్పుకోవచ్చు. 10 ఎందుకంటే, మెల్కీసెదెకు అబ్రాహామును కలుసుకొన్నప్పుడు లేవి యింకా జన్మించ లేదు. అతడు, తన మూల పురుషుడైన అబ్రాహాములోనే ఉన్నాడు.

యోహాను 4:27-42

27 అదే క్షణంలో ఆయన శిష్యులు తిరిగి వచ్చారు. ఆయనొక స్త్రీతో మాట్లాడటం చూసి ఆశ్చర్యపడ్డారు. కాని, “మీకేమి కావాలి?” అని కాని, లేక, “ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావు” అని కాని వాళ్ళు అడగలేదు.

28 ఆ స్త్రీ తన కడవనక్కడ వదిలి గ్రామంలోకి తిరిగి వెళ్ళిపోయింది. 29 ప్రజలతో, “రండి! నేను చేసిన వాటన్నిటీని చెప్పిన వ్యక్తిని చూడండి. ఈయనే క్రీస్తు అవును గదా” అని అన్నది. 30 వాళ్ళందరూ గ్రామంనుండి బయలుదేరి ఆయన దగ్గరకు వచ్చారు.

31 ఇంతలో ఆయన శిష్యులు, “రబ్బీ! భోజనం చెయ్యండి” అని వేడుకున్నారు.

32 కాని ఆయన వాళ్ళతో, “నా దగ్గర తినటానికి ఆహారం ఉంది. కాని ఆ ఆహారాన్ని గురించి మీకేమీ తెలియదు” అని అన్నాడు.

33 ఆయన శిష్యులు, “ఆయన కోసం ఎవరో భోజనం తెచ్చివుంటారు!” అని పరస్పరం మాట్లాడుకున్నారు.

34 యేసు, “నన్ను పంపిన వాని కోరిక తీర్చటం, ఆయన కార్యాన్ని పూర్తి చేయటమే, నా భోజనం. 35 ‘విత్తిన తర్వాత నాలుగు నెలల్లో పంట వస్తుంది!’ అని మీరంటున్నారు. కాని నేను చెప్పేదేమిటంటే కళ్ళు తెరచి పొలాల వైపు చూడండి. పంట కోయటానికి సిద్ధంగా ఉంది. 36 దాన్ని విత్తినవాడు, కోసేవాడు ఫలం పొందుతున్నారు. అనంత జీవితం కోసం, అతడు ఆ పంటను కోస్తున్నాడు. తద్వారా విత్తనం నాటినవాడు, పంట కోసే వాడు, యిద్దరూ ఆనందిస్తారు. 37 ‘విత్తనం ఒకడు నాటితె ఫలం ఇంకొకడు పొందుతాడు’ అన్న సామెత ఈ సందర్భంలో వర్తిస్తుంది. 38 మీరు కష్టపడి పని చెయ్యని పంట కోయటానికి మిమ్మల్ని పంపాను, దాని కోసం యితర్లు చాలా కష్టించి పని చేసారు. వాళ్ళ కష్టానికి మీరు ఫలం పొందుతున్నారు” అని చెప్పాడు.

39 ఆ పట్టణంలో ఉన్న సమరయ ప్రజలతో ఆ స్త్రీ, “నేను చేసినదంతా ఆయన చెప్పాడు” అని చెప్పింది. ఆ కారణంగా అనేకులు యేసును నమ్మారు. 40 అందువల్ల ఆ సమరయ ప్రజలాయన దగ్గరకు వెళ్ళి తమతో ఉండుమని వేడుకున్నారు. ఆయన వాళ్ళతో రెండు రోజులున్నాడు. 41 ఆయన చెప్పిన విషయాల వలన యింకా అనేకులు విశ్వాసులైయ్యారు.

42 ఆ సమరయ ప్రజలు ఆమెతో, “మొదట నీవు చెప్పిన విషయాలు విని ఆయన్ని విశ్వసించాము. కాని యిప్పుడు మేము ఆయన మాటలు స్వయంగా విన్నాము. కనుక ఆయన్ని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాము. ఆయన ప్రపంచాన్ని రక్షించటానికి వచ్చిన వాడని మాకు బాగ తెలిసిపోయింది” అని అన్నారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International