Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 46

సంగీత నాయకునికి: కోరహు కుమారుల అలామోతు రాగ గీతం.

46 దేవుడు మా ఆశ్రయం, మా శక్తి.
    ఆయన యందు, మాకు కష్ట కాలంలో ఎల్లప్పుడూ సహాయం దొరుకుతుంది.
అందుచేత భూమి కంపించినప్పుడు,
    మరియు పర్వతాలు సముద్రంలో పడినప్పుడు మేము భయపడము.
సముద్రాలు పొంగినను, చీకటితో నిండినను,
    భూమి, మరియు పర్వతాలు కంపించినను మేము భయపడము.

ఒక నది ఉంది. దాని కాలువలు దేవుని నివాసానికి,
    మహోన్నత దేవుని పరిశుద్ధ పట్టణానికి సంతోషం తెచ్చి పెడ్తాయి.
ఆ పట్టణంలో దేవుడు ఉన్నాడు. కనుక అది ఎన్నటికీ నాశనం చేయబడదు.
    సూర్యోదయానికి ముందే దేవుడు సహాయం చేస్తాడు.
రాజ్యాలు భయంతో వణకుతాయి.
    యెహోవా గద్దించగా ఆ రాజ్యాలు కూలిపోతాయి. భూమి పగిలిపోతుంది.
సర్వశక్తిమంతుడైన యెహోవా మనతో ఉన్నాడు.
    యాకోబు దేవుడు మనకు ఆశ్రయం.

యెహోవా చేసే మహత్తర కార్యాలు చూడండి.
    ఆ కార్యాలు భూమి మీద యెహోవాను ప్రసిద్ధి చేస్తాయి.
భూమి మీద ఎక్కడైనా సరే యుద్ధాలను యెహోవా ఆపివేయగలడు.
    సైనికుల విల్లులను, వారి ఈటెలను ఆయన విరుగగొట్టగలడు. రథాలను ఆయన అగ్నితో కాల్చివేయగలడు.

10 దేవుడు చెబుతున్నాడు, “మౌనంగా ఉండి, నేను దేవుణ్ణి అని తెలుసుకొనండి.
    రాజ్యాలతో నేను స్తుతించబడతాను.
    భూమిమీద మహిమపర్చబడతాను.”

11 సర్వశక్తిమంతుడైన యెహోవా మనతో ఉన్నాడు.
    యాకోబు దేవుడు మనకు ఆశ్రయం.

కీర్తనలు. 97

97 యెహోవా ఏలుతున్నాడు, భూమి సంతోషిస్తోంది.
    దూర దేశాలన్నీ సంతోషిస్తున్నాయి.
దట్టమైన చీకటి మేఘాలు యెహోవాను ఆవరించాయి.
    నీతి న్యాయాలు ఆయన రాజ్యాన్ని బలపరుస్తాయి.
యెహోవా ముందర అగ్ని బయలువెళ్తూ
    ఆయన శత్రువులను నాశనం చేస్తుంది.
ఆయన మెరుపు ఆకాశంలో తళుక్కుమంటుంది.
    ప్రజలు దాన్ని చూచి భయపడతారు.
యెహోవా ఎదుట పర్వతాలు మైనంలా కరగిపోతాయి.
    భూలోక ప్రభువు ఎదుట అవి కరిగిపోతాయి.
ఆకాశములారా, ఆయన మంచితనం గూర్చి చెప్పండి.
    ప్రతి మనిషీ దేవుని మహిమను చూచును గాక!

మనుష్యులు వారి విగ్రహాలను పూజిస్తారు.
    వారు వారి “దేవుళ్లను” గూర్చి అతిశయిస్తారు.
కాని ఆ ప్రజలు యిబ్బంది పడతారు.
    వారి “దేవుళ్లు” యెహోవాకు సాగిలపడి ఆయనను ఆరాధిస్తారు.
సీయోనూ, విని సంతోషించుము!
    యూదా పట్టణములారా, సంతోషించండి!
    ఎందుకంటే యెహోవా జ్ఞానముగల నిర్ణయాలు చేస్తాడు.
సర్వోన్నతుడవైన యెహోవా, నిజంగా నీవే భూమిని పాలించేవాడవు.
    ఇతర “దేవుళ్ల” కంటే నీవు చాలా మంచివాడవు.
10 యెహోవాను ప్రేమించే ప్రజలు దుర్మార్గాన్ని ద్వేషిస్తారు.
    కనుక దేవుడు తన అనుచరులను రక్షిస్తాడు. దేవుడు దుర్మార్గులనుండి తన ఆనుచరులను రక్షిస్తాడు.
11 మంచి మనుష్యుల మీద వెలుగు, సంతోషం ప్రకాశిస్తాయి.
12 మంచి మనుష్యులారా, యెహోవాయందు ఆనందించండి.
    ఆయన పవిత్ర నామాన్ని ఘనపరచండి.

కీర్తనలు. 96

96 యెహోవా చేసిన క్రొత్త కార్యాలను గూర్చి ఒక క్రొత్త కీర్తన పాడండి!
    సర్వలోకం యెహోవాకు కీర్తనలు పాడును గాక!
యెహోవాకు కీర్తన పాడండి. ఆయన నామాన్ని స్తుతించండి.
    శుభవార్త ప్రకటించండి. ఆయన ప్రతి రోజూ మనలను రక్షించుటను గూర్చి ప్రకటించండి.
దేవుడు నిజంగా ఆశ్చర్యకరుడని ఇతర ప్రజలతో చెప్పండి.
    దేవుడు చేసే అద్భుత కార్యాలను గూర్చి అన్నిచోట్లా ప్రజలకు చెప్పండి.
యెహోవా గొప్పవాడు, స్తుతికి పాత్రుడు.
    ఇతర “దేవుళ్లు” అందరికంటె ఆయన భీకరుడు.
ఇతర జనాల “దేవుళ్లంతా” కేవలం విగ్రహాలే.
    కాని యెహోవా ఆకాశాలను సృష్టించాడు.
ఆయన యెదుట అందమైన మహిమ ప్రకాశిస్తూ ఉంటుంది.
    దేవుని పవిత్ర ఆలయంలో బలం, సౌందర్యం ఉన్నాయి.
వంశములారా, రాజ్యములారా, యెహోవా మహిమకు
    స్తుతి కీర్తనలు పాడండి.
యెహోవా నామాన్ని స్తుతించండి.
    మీ కానుకలు తీసుకొని ఆలయానికి వెళ్లండి.
    యెహోవా అందమైన ఆలయంలో ఆయనను ఆరాధించండి!
భూమి మీద ప్రతి మనిషి ఆయన ముందు వణకాలి.
10     యెహోవా రాజు అని జనాలకు ప్రకటించండి!
కనుక ప్రపంచం నాశనం చేయబడదు.
    యెహోవా తన ప్రజలను న్యాయంగా పరిపాలిస్తాడు.
11 ఆకాశములారా, సంతోషించండి! భూమీ, ఆనందించుము!
    సముద్రమా, అందులోని సమస్తమా, సంతోషంతో ఘోషించుము!
12 పొలాల్లారా, వాటిలో పండే సమస్తమా సంతోషించండి!
    అరణ్యంలో వృక్షాల్లారా, పాడుతూ సంతోషించండి.
13 యెహోవా వస్తున్నాడు గనుక సంతోషంగా ఉండండి.
    ప్రపంచాన్ని పాలించుటకు[a] యెహోవా వస్తున్నాడు.
న్యాయంగా, ధర్మంగా ఆయన ప్రపంచాన్ని పాలిస్తాడు.

కీర్తనలు. 100

కృతజ్ఞత కీర్తన.

100 భూమీ, యెహోవాను గూర్చి పాడుము!
నీవు యెహోవాను సేవిస్తూ సంతోషంగా ఉండు!
    ఆనంద గీతాలతో యెహోవా ఎదుటికి రమ్ము.
యెహోవా దేవుడని తెలుసుకొనుము.
    ఆయనే మనలను సృజించాడు.
    మనం ఆయన ప్రజలము. మనము ఆయన గొర్రెలము.
కృతజ్ఞతా కీర్తనలతో యెహోవా పట్టణంలోనికి రండి.
    స్తుతి కీర్తనలతో ఆయన ఆలయంలోనికి రండి.
    ఆయనను గౌరవించండి. ఆయన నామాన్ని స్తుతించండి.
యెహోవా మంచివాడు.
    ఆయన ప్రేమ నిరంతరం ఉంటుంది.
    ఆయన్ని శాశ్వతంగా నమ్ము కోవచ్చు.

యెషయా 52:7-10

శుభవార్తతో కొండల మీదుగా ఒక వార్తాహరుడు రావటం ఎంతో అద్భుతంగా ఉంటుంది. “శాంతి ఉంది! మేము రక్షించబడ్డాం! మీ దేవుడే రాజు!” అని ఒక వార్తాహరుడు ప్రకటించగా వినటం అద్భుతం.

పట్టణపు కావలి వాళ్లు[a] కేకలు వేయటం మొదలు పెట్టారు.
    వాళ్లంతా కలిసి ఆనందిస్తున్నారు. ఎందుకు?
ఎందుకంటే, యెహోవా సీయోనుకు[b] తిరిగి రావటం వారిలో ప్రతి ఒక్కరూ చూస్తారు.

యెరూషలేమా, నాశనం చేయబడిన నీ కట్టడాలు మరల సంతోషిస్తాయి.
మీరంతా కలిసి ఆనందిస్తారు.
    ఎందుకంటే, యెరూషలేము మీద యెహోవా దయగలిగి ఉంటాడు. యెహోవా తన ప్రజలను విమోచిస్తాడు.
10 యెహోవా తన పవిత్ర శక్తిని సకల రాజ్యాలకు చూపిస్తాడు.
    మరియు దేవుడు తన ప్రజలను ఎలా రక్షిస్తాడో అది దూర దేశాలన్నీ చూస్తాయి.

ప్రకటన 21:22-27

22 ఆ పట్టణంలో నాకు మందిరం కనిపించలేదు. సర్వశక్తి సంపన్నుడు, ప్రభువు అయినటువంటి దేవుడు మరియు గొఱ్ఱెపిల్ల ఆ పట్టణానికి మందిరమై ఉన్నారు. 23 దేవుని తేజస్సు ఆ పట్టణానికి వెలుగునిస్తుంది. గొఱ్ఱెపిల్ల ఆ పట్టణానికి జ్యోతి కాబట్టి ఆ పట్టణానికి వెలుగునివ్వటానికి సూర్యచంద్రులు అవసరం లేదు.

24 జనులు ఆ వెలుగులో నడుస్తారు. ప్రపంచంలో ఉన్న రాజులు తమ ఘనతను ఆ పట్టణానికి తీసుకు వస్తారు. 25 ఆ పట్టణంలో రాత్రి అనేది ఉండదు. కనుక ఆ పట్టణం యొక్క ద్వారాలు ఎన్నటికీ మూయబడవు. 26 జనముల గౌరవము, వారి కీర్తి ఈ పట్టణానికి తేబడతాయి. 27 అపవిత్రమైనది ఆ పట్టణంలో ప్రవేశింపదు. అదే విధంగా అవమానకరమైన పనులు చేసేవాళ్ళు, మోసగాళ్ళు ఆ పట్టణంలోకి ప్రవేశించరు. గొఱ్ఱెపిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేర్లు వ్రాయబడ్డాయో వాళ్ళు మాత్రమే ప్రవేశించగలుగుతారు.

మత్తయి 12:14-21

14 కాని పరిసయ్యులు బయటికి వెళ్ళి, యేసును చంపటానికి పన్నాగం పన్నారు.

యేసు దేవునిచేత ఎన్నుకొనబడిన సేవకుడు

15 యేసు ఇది తెలుసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. చాలా మంది ఆయన్ని అనుసరించారు. ఆయన వాళ్ళ వ్యాధుల్ని నయం చేసాడు. 16 తనను గురించి ఎవ్వరికీ చెప్పవద్దని వాళ్ళను హెచ్చరించాడు. 17 యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన ఈ వాక్యాలు నిజం కావటానికి ఈ విధంగా జరిగింది:

18 “ఆయన నేనెన్నుకున్న
    నా సేవకుడు!
ఆయన పట్ల నాకు ప్రేమవుంది.
    ఆయన నా ఆత్మకు చాలా ఆనందం కలిగించాడు.
నా ఆత్మ ఆయన పైకి రప్పించుదును.
    ఆయన జనములకు న్యాయం చేకూరుతుందని ప్రకటిస్తాడు.
19 ఆయన పోట్లాడడు: కేకలు పెట్టడు,
    ఆయన ధ్వని వీధిలోని వాళ్ళకెవ్వరికి వినిపించదు.
20 న్యాయం చేకూరే వరకు నలిగిన రెల్లును ఆయన విరువడు.
    ఆరిపోతున్న దీపాన్ని ఆయన ఆర్పడు.
21 ఈయన పేరుమీద ఇతర జనాలకు నిరీక్షణ కలుగుతుంది.”(A)

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International