Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 93

93 యెహోవాయే రాజు!
    ప్రభావము, బలము ఆయన వస్త్రములవలె ధరించాడు.
కనుక ప్రపంచం నాశనం చేయబడదు.
దేవా, నీవూ, నీ రాజ్యమూ శాశ్వతంగా కొనసాగుతాయి.
యెహోవా, నదుల ధ్వని చాలా పెద్దగా ఉంది.
    ఎగిరిపడే అలలు చాలా పెద్దగా ధ్వనిస్తున్నాయి,
పెద్దగా లేస్తున్న సముద్రపు అలలు హోరెత్తుతున్నాయి, శక్తివంతంగా ఉన్నాయి.
    కాని పైన ఉన్న యెహోవా అంతకంటే శక్తిగలవాడు.
యెహోవా, నీ న్యాయవిధులు శాశ్వతంగా కొనసాగుతాయి.
    నీ పవిత్ర ఆలయం ఎల్లకాలం నిలిచి ఉంటుంది.

కీర్తనలు. 96

96 యెహోవా చేసిన క్రొత్త కార్యాలను గూర్చి ఒక క్రొత్త కీర్తన పాడండి!
    సర్వలోకం యెహోవాకు కీర్తనలు పాడును గాక!
యెహోవాకు కీర్తన పాడండి. ఆయన నామాన్ని స్తుతించండి.
    శుభవార్త ప్రకటించండి. ఆయన ప్రతి రోజూ మనలను రక్షించుటను గూర్చి ప్రకటించండి.
దేవుడు నిజంగా ఆశ్చర్యకరుడని ఇతర ప్రజలతో చెప్పండి.
    దేవుడు చేసే అద్భుత కార్యాలను గూర్చి అన్నిచోట్లా ప్రజలకు చెప్పండి.
యెహోవా గొప్పవాడు, స్తుతికి పాత్రుడు.
    ఇతర “దేవుళ్లు” అందరికంటె ఆయన భీకరుడు.
ఇతర జనాల “దేవుళ్లంతా” కేవలం విగ్రహాలే.
    కాని యెహోవా ఆకాశాలను సృష్టించాడు.
ఆయన యెదుట అందమైన మహిమ ప్రకాశిస్తూ ఉంటుంది.
    దేవుని పవిత్ర ఆలయంలో బలం, సౌందర్యం ఉన్నాయి.
వంశములారా, రాజ్యములారా, యెహోవా మహిమకు
    స్తుతి కీర్తనలు పాడండి.
యెహోవా నామాన్ని స్తుతించండి.
    మీ కానుకలు తీసుకొని ఆలయానికి వెళ్లండి.
    యెహోవా అందమైన ఆలయంలో ఆయనను ఆరాధించండి!
భూమి మీద ప్రతి మనిషి ఆయన ముందు వణకాలి.
10     యెహోవా రాజు అని జనాలకు ప్రకటించండి!
కనుక ప్రపంచం నాశనం చేయబడదు.
    యెహోవా తన ప్రజలను న్యాయంగా పరిపాలిస్తాడు.
11 ఆకాశములారా, సంతోషించండి! భూమీ, ఆనందించుము!
    సముద్రమా, అందులోని సమస్తమా, సంతోషంతో ఘోషించుము!
12 పొలాల్లారా, వాటిలో పండే సమస్తమా సంతోషించండి!
    అరణ్యంలో వృక్షాల్లారా, పాడుతూ సంతోషించండి.
13 యెహోవా వస్తున్నాడు గనుక సంతోషంగా ఉండండి.
    ప్రపంచాన్ని పాలించుటకు[a] యెహోవా వస్తున్నాడు.
న్యాయంగా, ధర్మంగా ఆయన ప్రపంచాన్ని పాలిస్తాడు.

కీర్తనలు. 34

దావీదు కీర్తన. అబీమెలెకు తనని పంపించి వేయాలని దావీదు వెర్రివానిలా నటించినప్పుడు అతడు దావీదును పంపించివేసినప్పటిది.

34 నేను యెహోవాను ఎల్లప్పుడూ స్తుతిస్తాను.
    ఆయన స్తుతి ఎల్లప్పుడూ నా పెదాల మీద ఉంటుంది.
దీన జనులారా, విని సంతోషించండి.
    నా ఆత్మ యెహోవాను గూర్చి ఘనంగా కీర్తిస్తుంది.
యెహోవా మహాత్మ్యం గూర్చి నాతో పాటు చెప్పండి.
    మనం ఆయన నామాన్ని కీర్తిద్దాం.
సహాయం కోసం నేను దేవుణ్ణి ఆశ్రయించాను. ఆయన విన్నాడు.
    నేను భయపడే వాటన్నింటి నుండి ఆయన నన్ను రక్షించాడు.
సహాయం కోసం దేవుని తట్టు చూడండి.
    మీరు స్వీకరించబడుతారు. సిగ్గుపడవద్దు.
ఈ దీనుడు సహాయంకోసం యెహోవాను వేడుకొన్నాడు.
    యెహోవా నా మొర విన్నాడు.
    నా కష్టాలన్నింటినుండి ఆయన నన్ను రక్షించాడు.
యెహోవాను వెంబడించే ప్రజల చుట్టూ ఆయన దూత కావలి ఉంటాడు.
    ఆ ప్రజలను యెహోవా దూత కాపాడి, వారికి బలాన్ని ఇస్తాడు.
యెహోవా ఎంత మంచివాడో రుచిచూచి తెలుసుకోండి.
    యెహోవా మీద ఆధారపడే వ్యక్తి ధన్యుడు.
యెహోవా పవిత్ర జనులు ఆయనను ఆరాధించాలి.
    ఆయన్ని అనుసరించే వారికి సురక్షిత స్థలం ఆయన తప్ప మరేదీలేదు.
10 యౌవనసింహాలు[a] బలహీనమై, ఆకలిగొంటాయి.
    అయితే సహాయం కోసం దేవుని ఆశ్రయించే వారికి ప్రతి మేలు కలుగుతుంది. మంచిదేదీ కొరతగా ఉండదు.
11 పిల్లలారా, నా మాట వినండి.
    యెహోవాను ఎలా సేవించాలో నేను నేర్పిస్తాను.
12 ఒక వ్యక్తి జీవితాన్ని ప్రేమిస్తోంటే,
    ఒక వ్యక్తి మంచి దీర్ఘకాల జీవితం జీవించాలనుకొంటే
13 అప్పుడు ఆ వ్యక్తి చెడ్డ మాటలు మాట్లాడకూడదు,
    ఆ వ్యక్తి అబద్ధాలు పలుకకూడదు,
14 చెడ్డ పనులు చేయటం చాలించండి. మంచి పనులు చేయండి.
    శాంతికోసం పని చేయండి. మీకు దొరికేంతవరకు శాంతికోసం వెంటాడండి.
15 మంచి మనుష్యులను యెహోవా కాపాడుతాడు.
    ఆయన వారి ప్రార్థనలు వింటాడు.
16 కాని చెడు కార్యాలు చేసే వారికి యెహోవా విరోధంగా ఉంటాడు.
    ఆయన వారిని పూర్తిగా నాశనం చేస్తాడు.

17 ప్రార్థించండి, యెహోవా మీ ప్రార్థన వింటాడు.
    ఆయన మిమ్మల్ని మీ కష్టాలన్నింటినుండి రక్షిస్తాడు.
18 గర్విష్ఠులు కాని మనుష్యులకు యెహోవా సమీపంగా ఉంటాడు.
    ఆత్మలో అణగిపోయిన మనుష్యులను ఆయన రక్షిస్తాడు.
19 మంచి మనుష్యులకు అనేక సమస్యలు ఉండవచ్చు.
    కాని ఆ మంచి మనుష్యులను వారి ప్రతి కష్టం నుండి యెహోవా రక్షిస్తాడు.
20 వారి ఎముకలన్నింటినీ యెహోవా కాపాడుతాడు.
    ఒక్క ఎముక కూడా విరువబడదు.
21 అయితే దుష్టులను కష్టాలు చంపేస్తాయి.
    చెడ్డవాళ్లు మంచి మనుష్యులను ద్వేషిస్తారు. కాని ఆ చెడ్డ వాళ్లు నాశనం చేయబడతారు.
22 యెహోవా తన సేవకులలో ప్రతి ఒక్కరి ఆత్మనూ రక్షిస్తాడు.
    తన మీద ఆధారపడే ప్రజలను నాశనం కానీయడు.

ఎస్తేరు 3:1-4:3

యూదుల వినాశనానికి హామాను పథకం

ఈ సంఘటనల తర్వాత అహష్వేరోషు మహారాజు హామానుకు గౌరవనీయ స్థానం ఇచ్చాడు. అగాగీయుడైన హామాను హమ్మెదాతా కొడుకు. మహారాజు హామానుకు ఉన్నత పదవి ఇచ్చి, అతన్ని మిగిలిన అధికారులందరికంటె ఉన్నత స్థానంలో ఉంచాడు. రాజభవన ద్వారం దగ్గర వుండే అధికారులందరూ హామానుకు మోకరిల్లి, నమస్కరించాలని మహారాజు ఆజ్ఞ జారీ చేశాడు. అధికారులందరూ ఈ ఆజ్ఞను పాటించేవారు. అయితే, మొర్దెకై మాత్రం మోకరిల్లేందుకూ, గౌరవాభివందనం చేసేందుకూ నిరాకరించాడు. అప్పుడు ద్వారం దగ్గరి ఉద్యోగులు మొర్దెకైని “హామాను ముందు మోకరిల్లాలన్న మహారాజు ఆజ్ఞను నువ్వెందుకు పాటించడం లేదు?” అని ప్రశ్నించారు.

ఆ రాజోద్యోగులు ప్రతిరోజూ మొర్దెకైతో ఈ విషయమై ప్రస్తావించేవారు. అయితే, హామాను ముందు మోకరిల్లాలన్న ఆజ్ఞను పాటించేందుకు మొర్దెకై తిరస్కరిస్తూ వచ్చాడు. దానితో, ఆ ఉద్యోగులు ఈ విషయాన్ని హామానుకు తెలియ జెప్పారు. మొర్దెకై విషయంలో హామాను ఏమి చేస్తాడో చూద్దామనుకున్నారు. తను యూదుడనన్న విషయాన్ని మొర్దెకై ఆ ఉద్యోగులకు చెప్పాడు. మొర్దెకై తన ముందు మోకరిల్లి, గౌరవాభివందనం చేసేందుకు నిరాకరించాడని విన్న హామాను చాలా కోపం చెందాడు. మొర్దెకై యూదుడు అన్న విషయం హామానుకు తెలిసింది. అయితే, ఒక్క మొర్దెకైని మాత్రమే చంపడం అతనికి తృప్తికరంగా కనిపించలేదు. మొర్దెకై జాతీయులందర్నీ, అంటే, అహష్వేరోషు సామ్రాజ్యంలోని రాజ్యాలన్నింట్లో గల యూదులందర్నీ సమూలంగా నాశనం చేసే మార్గం వెదక నారంభించాడు.

మహారాజు అహష్వేరోషు పాలనలో పన్నెండవ సంవత్సరం, నీసాను అనబడే మొదటి నెలలో హామాను తన కార్యక్రమానికి మంచి రోజును, నెలను ఎంచుకొనేందుకు చీటీలు వేశాడు. (ఆ రోజుల్లో ఈ చీటీలను “పూరు” అనేవారు). దాంట్లో అదారు అనబడే పన్నెండవ నెల ఎన్నిక చేయబడింది. అప్పుడిక హామాను అహష్వేరోషు మహారాజు దగ్గరకు వెళ్లి ఇలా అన్నాడు: “మహారాజా, మీ సామ్రాజ్యంలోని అన్ని సామంత రాజ్యాల్లోనూ చెదురుమదురుగా ఒక జాతివాళ్లు వున్నారు. వాళ్లు ఆ దేశాల ప్రజలతో కలిసివుండక వేరుగా వుంటారు. వాళ్ల ఆచార సంప్రదాయాలు మిగిలిన ప్రజల వాటికి భిన్నమైనవి. వాళ్లు మహారాజు శాసనాలను పాటించరు. వాళ్లను మీ సామ్రాజ్యంలో ఉండనివ్వడం క్షేమ దాయకం కాదు.

“మహారాజు మన్నిస్తే నాదొక సలహా. ఆ జాతి ప్రజలను హతమార్చేందుకు ఆజ్ఞ జారీ చెయ్యండి. ఇందుకయ్యే ఖర్చుకుగాను నేను 10,000 వెండి నాణ్యాలు రాజ్య ఖజానాలో జమకడతాను. ఈ కార్య క్రమాన్ని నిర్వహించేవారికి వేతనాలు చెల్లించేందుకు ఈ మొత్తాన్ని వినియోగించవచ్చు.”

10 మహారాజు రాజముద్రిక ఉన్న ఉంగరాన్ని తీసి హామానుకు ఇచ్చాడు. హామాను అగాగీయుడైన హమ్మెదాతా కొడుకు. హామాను యూదులకు బద్ధ శత్రువు. 11 మహారాజు హామానుతో ఇలా అన్నాడు, “ఆ సొమ్ము నీ దగ్గరే వుంచుకో. ఆ జాతివాళ్ల విషయంలో నువ్వేమి చెయ్యదలచుకున్నావో చెయ్యి.”

12 అటు తర్వాత మొదటి నెల 13వ రోజున మహారాజుగారి లేఖకులు పిలువనంపబడ్డారు. వాళ్లు హామాను ఆజ్ఞలన్నింటినీ ఒక్కొక్క దేశపు భాషాలిపిలో వ్రాశారు. వాళ్లు వాటిని ఆయా ప్రజాబృందాల భాషల్లో వ్రాశారు. వాళ్లు మహారాజు సామంతులకు, ఆయా ప్రాంతాల పాలకులకు ఆ తాఖీదులు పంపారు. వాళ్లు ఆ తాఖీదులను మహారాజు పేరిట, మహారాజు ముద్రికతో పంపారు.

13 వార్తాహరులు ఆయా సామంత దేశాలకు యీ తాఖీదు పత్రాలను తీసుకెళ్లారు. యూదులందర్నీ చంపి వేయాలి, ఆ జాతి మొత్తాన్ని సర్వనాశనం చేయాలి, యిదీ మహారాజు ఆజ్ఞ. అంటే, యూదులందరూ పిల్లపాపలూ, యువతీ యువకులూ, ముసలి, వయస్సులో వున్నవాళ్లు, వయస్సు మళ్లినవాళ్లు, ఒక్కరోజులో హతమార్చ బడాలన్నమాట. ఆ రోజు అదారు అనబడే 12వ నెలలో 13వ రోజు అవుతుంది. ఆ ఆజ్ఞలో మరో అంశం యూదులకు చెందిన వస్తువులన్నింటినీ తీసేసు కోవడం. ఈలాగున ఆ తాఖీదు పత్రాలలో వ్రాయబడియున్నది.

14 ఆ ఆజ్ఞల ప్రతులు రాజశాసనంగా అందరికీ పంపబడ్డాయి. ఈ తాఖీదును అన్ని సామంత రాజ్యాల్లోనూ శాసనంగా చెల్లుబడి చెయ్యాలి, దాన్ని సామ్రాజ్యంలో అన్ని జాతుల ప్రజలకీ ప్రకటించాలి. 15 రాజాజ్ఞ మేరకు వార్తాహరులు హుటాహుటిగా బయల్దేరారు. రాజధాని నగరం షూషనులో కూడా యీ తాఖీదు ప్రతులు పంచబడ్డాయి. మహారాజూ, హామానూ మద్యం సేవిస్తూ కూర్చుండగా, అటు షూషను నగరం గందరగోళంలో మునిగిపోయింది.

సహాయం చేయమని ఎస్తేరుకు మొర్దెకై నచ్చచెప్పటం

మొర్దకై జరిగిన సంగతంతా తెలుసుకున్నాడు. యూదులకు వ్యతిరేకంగా మహారాజు ఆజ్ఞలను గురించి విన్న మొర్దెకై తన బట్టలు చింపుకొని, తన నెత్తిమీద బూడిద పోసుకొని, విషాద సూచకమైన దుస్తులు ధరించి, నగరంలోకి పోయిగట్టిగా ఏడ్వ నారంభించాడు. కాని, మొర్దెకై రాజభవన ద్వారం వరకు మాత్రమే పోగలిగాడు. అయితే, విషాద సూచక దుస్తులు ధరించినవారెవరూ ఆ ద్వారంలో ప్రవేశించేందుకు అనుమతింపబడరు. రాజాజ్ఞ చేరిన ప్రతి సామంత రాజ్యంలోనూ యూదుల్లో విచారం అలుముకొంది. ఏడ్పులు చెలరేగాయి. వాళ్లు శోకాలు పెడుతూ, ఉపవాసాలుండసాగారు. చాలామంది యూదులు నెత్తిన బూడిద పోసుకొని, సంతాప సూచక దుస్తులు వేసుకొని నేలమీద పడి వున్నారు.

యాకోబు 1:19-27

వినటం, చెయ్యటం

19 నా ప్రియమైన సోదరులారా! ఈ విషయాల్ని తెలుసుకోండి: ప్రతి మనిషి వినటానికి సిద్ధంగా ఉండాలి. మాట్లాడే ముందు ఆలోచించాలి. కోపాన్ని అణచుకోవాలి. 20 ఎందుకంటే కోపం ద్వారా దేవుడు ఆశించే నీతి కలుగదు. 21 అందువల్ల దుర్మార్గాల్ని, అవినీతిని పూర్తిగా వదిలివెయ్యండి. మీలో నాటుకుపోయిన దైవసందేశాన్ని విధేయతతో ఆచరించండి. అది మీ ఆత్మల్ని రక్షించగలదు.

22 దైవసందేశం చెప్పినట్లు చెయ్యండి. దాన్ని విని కూడా మీరు ఏమీ చెయ్యలేకపోతే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొన్న వాళ్ళవుతారు. 23-24 దైవసందేశం విని అది చెప్పినట్లు చెయ్యని వాడు అద్దంలో తన ముఖం చూసుకొని తానేవిధంగా కనిపించాడో వెంటనే మరచిపోయే వ్యక్తిలాంటివాడు. 25 స్వేచ్ఛను కలిగించే పరిపూర్ణమైన ధర్మశాస్త్రాన్ని పరిశీలిస్తూ దాని ప్రకారం జీవించేవాడు క్రియచేస్తున్న వానిగా పరిగణింపబడతాడు. అలాంటివాడు విని మరచిపోయే రకం కాదు. అతడు చేస్తున్న ప్రతీ కార్యము ఫలించాలని దేవుడు అతణ్ణి దీవిస్తాడు.

దేవుణ్ణి ఆరాధించే సత్యమార్గం

26 తానొక విశ్వాసినని తలంచి తన నాలుకకు కళ్ళెం వేసుకోకపోతె తనకు తాను మోసం చేసుకొన్నవాడౌతాడు. అతని విశ్వాసం నిష్ప్రయోజనమౌతుంది. 27 అనాథుల్ని, వితంతువుల్ని కష్టాల్లో ఆదుకోవటం, ఈ ప్రపంచంలో ఉన్న చెడువల్ల మలినం కాకుండా ఉండటము, ఇదే మన తండ్రియైన దేవుడు అంగీకరించే నిజమైన భక్తి.

మత్తయి 6:1-6

యేసు ఇచ్చుటను గురించి బోధించటం

“జాగ్రత్త! మీరు చేసే నీతికార్యాలు ఇతర్లు చూసేలా చెయ్యకండి. అలా చేస్తే పరలోకంలో ఉన్న మీ తండ్రి మీకు ప్రతిఫలమివ్వడు.

“అందువల్ల మీరు దానం చేసినప్పుడు చాటింపు వేయించుకొని నలుగురికి తెలుపకండి. కపటులు సమాజాల్లో, వీధుల్లో, ప్రజలు గౌరవించాలని అలా చేస్తారు. ఇది సత్యం, వాళ్ళకు లభించవలసిన ప్రతి ఫలం అప్పుడే పూర్తిగా లభించింది. కాని, మీరు దానం చేసేటప్పుడు మీ కుడిచేయి ఏమి యిస్తుందో మీ ఎడమచేతికి తెలియనివ్వకండి. అప్పుడే మీ దానం గుప్తంగా ఉంటుంది. అప్పుడు, మీరు రహస్యంగా చేస్తున్నది చూసి మీ తండ్రి మీకు ప్రతిఫలం యిస్తాడు.

యేసు ప్రార్థన గురించి బోధించటం

(లూకా 11:2-4)

“మీరు ప్రార్థించేటప్పుడు కపటుల్లా ప్రార్థించకండి. వాళ్ళు సమాజమందిరాల్లో, వీధుల ప్రక్కన నిలుచొని నలుగురూ చూడాలని ప్రార్థిస్తారు. అది వాళ్ళకు ఆనందాన్నిస్తుంది. కాని ఇది సత్యం—వాళ్ళకు లభించవలసిన ఫలితం వాళ్ళకప్పుడే పూర్తిగా లభించింది. మీరు ప్రార్థించేటప్పుడు గదిలోకి వెళ్ళి తలుపు వేసికొని కనిపించని మీ తండ్రికి ప్రార్థించండి. అప్పుడు రహస్యంలో ఉండే మీ తండ్రి మీకు ప్రతిఫలం యిస్తాడు.

మత్తయి 6:16-18

యేసు ఉపవాసమును గురించి బోధించటం

16 “కపటులు ఉపవాసం చేసినప్పుడు ప్రజలు గమనించాలని తమ ముఖాలు నీరసంగా కనిపించేటట్లు చేసుకొంటారు. మీరు ఉపవాసం చేసినప్పుడు అలా చేయకండి. ఇది సత్యం, వాళ్ళు పొందవలసిన ఫలాన్ని పొందారు. యింకేమీ లభించదు. 17 మీరు ఉపవాసం చేసినప్పుడు తలకు నూనె రాసుకొని ముఖాన్ని కడుక్కొండి. 18 అలా చేస్తే, మీరు ఉపవాసం చేస్తున్నట్లు ప్రజలకు కనిపించదు. కాని కనిపించని మీ తండ్రికి మాత్రమే మీరు ఉపవాసం చేస్తున్నట్లు తెలుస్తుంది. అందువలన రహస్యంగా చూసే మీ తండ్రి మీకు ప్రతిఫలం యిస్తాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International