Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 119:145-176

ఖాఫ్

145 యెహోవా, నా హృదయపూర్తిగా నేను నీకు మొరపెడ్తున్నాను.
    నాకు జవాబు ఇమ్ము. నేను నీ ఆజ్ఞలకు విధేయుడను.
146 యెహోవా, నేను నీకు మొరపెట్టుతున్నాను. నన్ను రక్షించుము.
    నేను నీ ఒడంబడికకు విధేయుడనవుతాను.
147 యెహోవా, నిన్ను ప్రార్థించుటకు నేను వేకువనే మేల్కొన్నాను. నీ మాటకోసం నేను వేచియుంటాను.
    నీవు చెప్పేవాటియందు నేను నమ్మకముంచుతాను.
148 నీ వాక్యాన్ని ధ్యానించుటకు
    నేను చాలా రాత్రివరకు మెళకువగా ఉన్నాను.
149 నీవు దయతో నా మాట విను.
    యెహోవా, నీ న్యాయ శాస్త్రానుసారముగా నన్ను జీవింపనిమ్ము.
150 మనుష్యులు నాకు విరోధంగా కీడు పథకాలు వేస్తున్నారు.
    యెహోవా, ఆ మనుష్యులు నీ ఉపదేశాలను అనుసరించరు.
151 యెహోవా, నీవు నాకు సన్నిహితంగా ఉన్నావు.
    నీ ఆజ్ఞలు అన్నీ నమ్మదగినవి.
152 నీ ఉపదేశాలు శాశ్వతంగా కొనసాగుతాయని
    చాలా కాలం క్రిందట నీ ఒడంబడిక నుండి నేను నేర్చుకొన్నాను.

రేష్

153 యెహోవా, నా శ్రమను చూచి, నన్ను తప్పించుము.
    నీ ఉపదేశాలను నేను మరువలేదు.
154 యెహోవా, నాకోసం నా పోరాటం నీవు పోరాడి, నన్ను రక్షించుము.
    నీ వాగ్దానం ప్రకారం నన్ను జీవించనిమ్ము.
155 దుష్టులు జయించరు. ఎందుకంటే,
    వారు నీ న్యాయ చట్టాలను అనుసరించరు.
156 యెహోవా, నీవు చాలా దయగలవాడవు.
    నీవు చెప్పే సరియైన వాటిని చేసి, నన్ను జీవించనిమ్ము
157 నన్ను బాధించుటకు ప్రయత్నిస్తున్న శత్రువులు నాకు చాలామంది ఉన్నారు.
    కాని నేను మాత్రం నీ ఒడంబడికను అనుసరించటం ఆపివేయలేదు.
158 ఆ ద్రోహులను నేను చూస్తున్నాను.
    ఎందుకంటే యెహోవా, వారు నీ మాటకు విధేయులు కారు.
159 చూడుము, నీ ఆజ్ఞలకు విధేయుడనగుటకు నేను కష్టపడి ప్రయత్నిస్తాను.
    యెహోవా, నీ ప్రేమ అంతటితో నన్ను జీవించనిమ్ము.
160 యెహోవా, ఆది నుండి నీ మాటలు అన్నీ నమ్మదగినవి.
    నీ మంచి ధర్మశాస్త్రం శాశ్వతంగా నిలుస్తుంది.

షీన్

161 ఏ కారణం లేకుండానే బలమైన నాయకులు నా మీద దాడి చేశారు.
    కాని నేను మాత్రం నీ ధర్మశాస్త్రానికే భయపడి, దాన్ని గౌరవిస్తాను.
162 యెహోవా, అప్పుడే ఐశ్వర్యపు నిధి దొరకిన వానికి ఎంత సంతోషమో,
    నీ వాక్యం నన్ను అంత సంతోష పరుస్తుంది.
163 అబద్ధాలంటే నాకు అసహ్యం! నేను వాటిని తృణీకరిస్తాను.
    యెహోవా, నీ ఉపదేశాలు నాకు ఇష్టం.
164 నీ మంచి న్యాయ చట్టాలను బట్టి
    నేను రోజుకు ఏడుసార్లు నిన్ను స్తుతిస్తాను.
165 నీ ఉపదేశాలను ప్రేమించే మనుష్యులకు నిజమైన శాంతి లభిస్తుంది.
    ఆ మనుష్యులను ఏదీ పడగొట్టలేదు.
166 యెహోవా, నీవు నన్ను రక్షించాలని నేను కనిపెడ్తున్నాను.
    నేను నీ ఆజ్ఞలకు విధేయుడనయ్యాను.
167 నేను నీ ఒడంబడికను అనుసరించాను.
    యెహోవా, నీ న్యాయ చట్టాలు అంటే నాకు ఎంతో ప్రేమ.
168 నీ ఒడంబడికకు, నీ ఆజ్ఞలకు నేను విధేయుడనయ్యాను.
    యెహోవా, నేను చేసింది ప్రతిది నీకు తెలుసు.

తౌ

169 యెహోవా, నా సంతోష గీతం ఆలకించుము.
    నీ వాగ్దాన ప్రకారం నన్ను జ్ఞానం గలవానిగా చేయుము.
170 యెహోవా, నా ప్రార్థన వినుము.
    నీవు వాగ్దానం చేసినట్టే, నన్ను రక్షించుము.
171 నీవు నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించావు
    కనుక నేను స్తుతి గీతాలతో ఉప్పొంగిపోతాను.
172 నీ మాటలకు నన్ను జవాబు చెప్పనిమ్ము.
    నా పాట నన్ను పాడనిమ్ము. యెహోవా, నీ న్యాయచట్టాలన్నీ మంచివి.
173 నేను నీ ఆజ్ఞలను అనుసరించాలని నిర్ణయించుకొన్నాను
    గనుక నన్ను ఆదుకొని, నాకు సహాయం చేయుము.
174 యెహోవా, నీవు నన్ను రక్షించాలని నేను కోరుతున్నాను.
    కాని నీ ఉపదేశాలు నన్ను సంతోష పరుస్తాయి.
175 యెహోవా, నన్ను జీవించనిమ్ము. నిన్ను స్తుతించనిమ్ము.
    నీ న్యాయ చట్టాలు నాకు సహాయం చేయనిమ్ము.
176 నేను తప్పిపోయిన గొర్రెలా తిరిగాను.
    యెహోవా, నా కోసం వెదకుతూ రమ్ము.
నేను నీ సేవకుడను.
    మరియు నేను నీ ఆజ్ఞలను మరువలేదు.

కీర్తనలు. 128-130

యాత్ర కీర్తన.

128 యెహోవా అనుచరులందరూ సంతోషంగా ఉంటారు.
    ఆ ప్రజలు యెహోవా కోరిన విధంగా జీవిస్తారు.

నీవు వేటికోసం పని చేస్తావో వాటిలో ఆనందిస్తావు.
    ఎవ్వరూ వాటిని నీ వద్దనుండి తీసుకోలేరు. నీవు సంతోషంగా ఉంటావు. మంచి విషయాలు నీకు సంభవిస్తాయి.
ఇంట్లో నీ భార్య ఫలించే ద్రాక్షావల్లిలా ఉంటుంది.
    బల్లచుట్టూరా నీ పిల్లలు, నీవు నాటిన ఒలీవ మొక్కల్లా ఉంటారు.
యెహోవా తన అనుచరులను నిజంగా ఈ విధంగా ఆశీర్వదిస్తాడు.
యెహోవా సీయోనులోనుండి నిన్ను ఆశీర్వదిస్తాడని నేను ఆశిస్తున్నాను.
    నీవు నీ జీవిత కాలమంతా యెరూషలేములో ఆశీర్వాదాలు అనుభవిస్తావని నేను ఆశిస్తున్నాను.
నీవు నీ మనుమలను, మనుమరాండ్రను చూచేంతవరకు జీవిస్తావని నేను ఆశిస్తాను.

ఇశ్రాయేలులో శాంతి ఉండునుగాక.

యాత్ర కీర్తన.

129 నా జీవిత కాలమంతా నాకు ఎంతోమంది శత్రువులు.
    ఇశ్రాయేలూ, ఆ శత్రువులను గూర్చి మాకు చెప్పుము.
నా జీవిత కాలమంతా నాకు ఎంతో మంది శత్రువులు ఉన్నారు
    కాని వారు ఎన్నడూ జయించలేదు.
నా వీపుమీద లోతైన గాయాలు అయ్యేంతవరకు వారు నన్ను కొట్టారు.
    నాకు చాలా పెద్ద, లోతైన గాయాలు అయ్యాయి.
అయితే దయగల యెహోవా తాళ్ళను తెగకోసి
    ఆ దుర్మార్గులనుండి నన్ను విడుదల చేసాడు.
సీయోనును ద్వేషించిన మనుష్యులు ఓడించబడ్డారు.
వారు పోరాటం మానివేసి పారిపోయారు.
ఆ మనుష్యులు ఇంటి కప్పు మీద మొలిచిన గడ్డిలాంటి వాళ్లు.
    ఆ గడ్డి ఎదుగక ముందే వాడిపోతుంది.
పని వానికి ఆ గడ్డి గుప్పెడు కూడా దొరకదు.
    ధాన్యపు పన కట్టేందుకు కూడా అది సరిపోదు.
ఆ దుర్మార్గుల పక్కగా నడుస్తూ వెళ్లే మనుష్యులు, “యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక” అని చెప్పరు.
    “యెహోవా నామమున మేము మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాము” అని చెబుతూ మనుష్యులు వారిని ఏమీ అభినందించరు.

యాత్ర కీర్తన.

130 యెహోవా, నేను గొప్ప కష్టంలో ఉన్నాను.
    కనుక సహాయం కోసం నిన్ను పిలుస్తున్నాను.
నా ప్రభువా, నా మాట వినుము.
    సహాయం కోసం నేను చేస్తున్న మొర వినుము.
యెహోవా, మనుష్యులను వారి పాపాలన్నిటిని బట్టి నీవు శిక్షిస్తే
    ఒక్క మనిషి కూడా మిగలడు.
యెహోవా, నీ ప్రజలను క్షమించుము.
    అప్పుడు నిన్ను ఆరాధించుటకు మనుష్యులు ఉంటారు.

యెహోవా నాకు సహాయం చేయాలని నేను కనిపెడుతున్నాను.
    నా ఆత్మ ఆయన కోసం కనిపెడుతుంది.
    యెహోవా చెప్పేది నేను నమ్ముతున్నాను.
నా ప్రభువు కోసం నేను కనిపెడుతున్నాను.
    ఎప్పుడు తెల్లారుతుందా అని ఆశతో కనిపెడుతున్న కావలివాండ్లలా నేను ఉన్నాను.
ఇశ్రాయేలూ, యెహోవాను నమ్ముకో.
    నిజమైన ప్రేమ యెహోవా దగ్గర మాత్రమే కనబడుతుంది.
యెహోవా మనలను మరల, మరల రక్షిస్తాడు.
    మరియు యెహోవా ఇశ్రాయేలీయుల పాపాలు అన్నింటి విషయంలో వారిని క్షమిస్తాడు.

సంఖ్యాకాండము 22:41-23:12

41 ఆ మర్నాటి ఉదయం బాలాకు బామోతు బయలు పట్టణానికి బిలామును తీసుకుని వెళ్లాడు. ఆ పట్టణం నుండి వారు ఇశ్రాయేలు ప్రజలు వేసుకొన్న గుడారాలను కొంత చూడగలరు.

బిలాము మొదటి సందేశం

23 బిలాము “ఇక్కడ ఏడు బలిపీఠాలు కట్టండి. నాకోసం ఏడు ఎద్దులు, ఏడు పొట్టేళ్లు సిద్ధంచేయండి” అని చెప్పాడు. బిలాము అడిగినట్టే బాలాకు అవన్ని చేసాడు. అప్పుడు బాలాకు, బిలాము ఒక్కో బలిపీఠం మీద ఒక్కో పొట్టేలును, ఒక్కో ఎద్దును వధించారు.

అప్పుడు బిలాము, “ఈ బలిపీఠం దగ్గరగా ఉండు. నేను ఇంకో చోటికి వెళ్తాను. అప్పుడు యెహోవా నా దగ్గరకు వచ్చి నేను చెప్పాల్సింది ఏమిటో నాకు చెబుతాడు” అని బాలాకుతో చెప్పాడు. అప్పుడు బిలాము మరో ఉన్నత స్థలానికి వెళ్లిపోయాడు.

అక్కడ దేవుడు బిలాము దగ్గరకు వచ్చాడు. “ఏడు బలిపీఠాలు నేను సిద్ధం చేసాను. ఒక్కో బలిపీఠంమీద ఒక్కో ఎద్దును ఒక్కోపొట్టేలును బలిగా నేను వధించాను” అన్నాడు బిలాము.

అప్పుడు బిలాము ఏమి చెప్పాల్సిందీ యెహోవా అతనికి చెప్పాడు. అప్పుడు, “తిరిగి వెళ్లి, చెప్పమని నేను నీకు చెప్పిన విషయాలు బాలాకుతో చెప్పు” అన్నాడు యెహోవా.

కనుక బిలాము తిరిగి బాలాకు దగ్గరకు వెళ్లాడు. బాలాకు ఇంకా బలిపీఠం దగ్గరే నిలిచి ఉన్నాడు. మోయాబు నాయకులంతా వారితో నిలిచి ఉన్నారు. అప్పుడు బిలాము ఈ విషయాలు చెప్పాడు:

“తూర్పు కొండల్లో నుండి ఆరాము నుండి మోయాబు
    రాజైన బాలాకు నన్ను ఇక్కడకు తీసుకువచ్చాడు.
వచ్చి ఇశ్రాయేలు ప్రజలను శపించు!
    ‘వచ్చి నా పక్షంగా యాకోబును శపించు,
    వచ్చి ఇశ్రాయేలు ప్రజలను శపించు!’ అన్నాడు నాతో బాలాకు.
దేవుడు ఆ ప్రజలకు వ్యతిరేకంగా లేడు
    అందుచేత నేనుకూడ వారిని శపించలేను.
ఆ ప్రజల విషయమై యెహోవా చెడ్డ విషయాలను చెప్పలేదు
    అందుచేత నేను అలా చేయలేను.
కొండమీద నుండి నేను ఆ ప్రజలను చూస్తున్నాను.
    ఎత్తయిన కొండల నుండి నేను చూస్తున్నాను.
ఒంటరిగా బ్రతుకుతున్న ప్రజలను నేను చూస్తున్నాను,
    వాళ్లు మరో జనములో భాగంకారు యాకోబు ప్రజలను ఎవరు లెక్కించగలరు.
10 ఇసుక రేణువులకంటె ఎక్కువ ఉన్నారు యాకోబు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజల్లో నాలుగోవంతు మనుష్యుల్ని కూడ ఎవరూ లెక్కించలేరు. ఒక మంచి మనిషిగా నన్ను చావనివ్వండి ఆ మనుష్యులు మరణించినంత సంతోషంగా నన్ను మరణించనివ్వండి!”

11 బాలాకు బిలాముతో, “ఏమిటి నీవు నాకు చేసింది? నా శత్రువుల్ని శపించమని నేను నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాను. కానీ నీవు మాత్రం వాళ్లను ఆశీర్వదించావు” అన్నాడు.

12 కానీ బిలాము, “నేను చెప్పాల్సింది దేవుడు నాకు చెప్పిన విషయాలు మాత్రమే” అని జవాబిచ్చాడు.

రోమీయులకు 7:13-25

13 అలాగైతే, మరి ఆ మంచి ధర్మశాస్త్రం నాకు మరణాన్ని కలిగించిందా? ఎన్నటికి కాదు. ధర్మశాస్త్రాన్ని ఉపయోగించి పాపం నాకు మరణాన్ని కలిగించి తన నిజ స్వరూపాన్ని వ్యక్త పరిచింది. అందువల్ల ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞ ద్వారా పాపం ఇంకా గొప్ప పాపంగా కనిపించింది.

మనలోని యుద్ధం

14 ధర్మశాస్త్రం ఆధ్యాత్మికమైనదని మనకు తెలుసు. కాని నేను బలహీనమైన మనిషిని, పాపానికి బానిసగా అమ్ముడుపోయినవాణ్ణి. 15 నేనేం చేస్తున్నానో నాకు తెలియదు. నేను చెయ్యలనుకొన్నదాన్ని చెయ్యటంలేదు. దేన్ని ద్వేషిస్తున్నానో దాన్నే చేస్తున్నాను. 16 నేను వద్దనుకున్నదాన్నే చేస్తే ధర్మశాస్త్రం మంచిదని అంగీకరిస్తున్నాను. 17 నిజానికి చేస్తున్నది నేను కాదు. నాలో నివసిస్తున్న పాపం ఇలా చేస్తోంది. 18 నా శరీరంలో మంచి అనేది నివసించటం లేదని నాకు తెలుసు. మంచి చెయ్యాలనే కోరిక నాలో ఉంది కాని, అలా చెయ్యలేకపోతున్నాను. 19 చెయ్యాలనుకొన్న మంచిని నేను చెయ్యటం లేదు. దానికి మారుగా చెయ్యరాదనుకొన్న చెడును నేను చేస్తూ పోతున్నాను. 20 చెయ్యకూడదనుకొన్నదాన్ని నేను చేస్తున్నానంటే, దాన్ని చేస్తున్నది నేను కాదు. నాలో నివసిస్తున్న పాపమే అలా చేయిస్తోంది.

21 అందువల్ల, “నేను మంచి చెయ్యాలని అనుకొన్నప్పుడు చెడు నాతో అక్కడే ఉంటుంది” అనే ఈ నియమం నాలో పని చేస్తున్నట్లు గమనిస్తున్నాను. 22 నా అంతరాత్మ దేవుడిచ్చిన ధర్మశాస్త్ర విషయంలో ఆనందం పొందుతోంది. 23 కాని, నా అవయవాల్లో వేరొక నియమం పని చేస్తున్నట్లు గమనిస్తున్నాను. నన్ను పాపాత్మునిగా చేస్తున్న ఈ నియమం నా మెదడులో ఉన్న ధర్మశాస్త్రంతో పోరాడి నన్ను ఖైదీగా చేస్తోంది. 24 నేనంత దౌర్భాగ్యుణ్ణి! మరణం యొక్క ఆధీనంలో ఉన్న ఈ నా శరీరంనుండి నన్ను ఎవరు రక్షిస్తారు? 25 అందువల్ల మన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనం దేవునికి కృతజ్ఞతలు తెలుపుకొందాం.

స్వయంగా, బుద్ధి పూర్వకంగా నేను దేవుని ధర్మశాస్త్రానికి బానిసను. కాని నా శరీరం పాపాన్ని కలుగచేసే నియమానికి బానిస.

మత్తయి 21:33-46

రైతుల ఉపమానం

(మార్కు 12:1-12; లూకా 20:9-19)

33 “ఇంకొక ఉపమానాన్ని వినండి. ఒక ఆసామి ఉండేవాడు. అతడు ఒక ద్రాక్షతోట నాటాడు. చుట్టూ ఒక గోడ కట్టించి ద్రాక్షరసాన్ని తీయటానికి ఒక గానుగను, తొట్టిని కట్టించాడు. కావలి కాయటానికి ఒక కంచె వేయించాడు. ఆ తర్వాత ఆ ద్రాక్షతోటను కొంతమంది రైతులకు కౌలుకిచ్చి ప్రయాణమై వెళ్ళిపోయాడు. 34 కోతకాలం కాగానే తన సేవకుల్ని ఆ రైతుల దగ్గరకు పంపి తన భాగం తీసుకు రమ్మన్నాడు.

35 “ఆ రైతులు, ఆ సేవకుల్ని పట్టుకొని వాళ్ళలో ఒకణ్ణి కొట్టారు. మరొకణ్ణి చంపారు. మూడవవాణ్ణి రాళ్ళతో కొట్టి చంపారు. 36 ఆ ఆసామి ఈ సారి మొదటి కన్నా యింకా ఎక్కువ మంది సేవకుల్ని పంపాడు. కాని ఆ రైతులు వాళ్ళ పట్ల కూడా అదే విధంగా ప్రవర్తించారు. 37 ఆ ఆసామి ‘నా కుమారుణ్ణి వాళ్ళు గౌరవించవచ్చు!’ అని అనుకొని చివరకు తన కుమారుణ్ణి వాళ్ళ దగ్గరకు పంపాడు.

38 “కాని ఆ రైతులు అతని కుమారుణ్ణి చూసి, ‘ఇతడు వంశోద్ధారకుడు. రండి! ఇతణ్ణి చంపేసి అతని ఆస్థిని తీసుకొందాం’ అని పరస్పరం మాట్లాడుకొన్నారు. 39 ఆ తర్వాత కుమారుణ్ణి పట్టుకొని చంపి ద్రాక్షతోటకవతల పారవేసారు.

40 “మరి ఆ ద్రాక్షతోట యజమాని తిరిగి వచ్చాక ఆ రైతుల్ని ఏమి చేస్తాడంటారు?”

41 వాళ్ళు, “ఆ దుష్టుల్ని ఘోరంగా చంపేస్తాడు. ఆ తదుపరి పంట కాలంలో తన భాగాన్ని తనకిచ్చే రైతులకు ఆ ద్రాక్షతోటను కౌలుకిస్తాడు” అని సమాధానం చెప్పారు.

42 యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “లేఖనాల్లో మీరీ విషయం ఎన్నడూ చదువలేదా?

‘ఇల్లు కట్టువాళ్ళు తృణీకరించిన రాయి ముఖ్యమైన రాయి అయింది.
ఇది ప్రభువు చేసాడు. ఆ రాయి మన కండ్లకు ఆశ్చర్యంగా కనబడుతుంది!’(A)

43 “అందువల్ల నేను చెప్పేదేమిటంటే దేవుడు తన రాజ్యాన్ని మీ నుండి తీసికొని, ఆ రాజ్యానికి తగిన విధంగా ప్రవర్తించే వాళ్ళకు యిస్తాడు. 44 ఈ బండ మీద పడ్డవాడు ముక్కలై పోతాడు. ఎవని మీద ఈ బండ పడ్తుందో అతడు నలిగి పోతాడు.”

45 ప్రధాన యాజకులు, పరిసయ్యులు యేసు చెప్పిన ఉపమానం విని ఆయన తమను గురించి మాట్లాడుతున్నట్టుగా గ్రహించారు. 46 వాళ్ళు ఆయన్ని బంధించటానికి మార్గాన్ని వెతికారు. కాని ప్రజలు ఆయన్ని ఒక ప్రవక్త అని అనుకొనే వాళ్ళు కనుక వాళ్ళు ప్రజల్ని చూసి భయపడి పోయారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International