Revised Common Lectionary (Semicontinuous)
94 యెహోవా, నీవు మనుష్యులను శిక్షించే దేవుడవు.
నీవు వచ్చి మనుష్యులకు శిక్ష తెచ్చే దేవుడవు.
2 నీవు భూలోకమంతటికీ న్యాయమూర్తివి.
గర్విష్ఠులకు రావలసిన శిక్షతో వారిని శిక్షించుము.
3 యెహోవా, దుర్మార్గులు ఎన్నాళ్లవరకు తమ సరదా అనుభవిస్తారు?
యెహోవా, ఇంకెన్నాళ్లు?
4 ఆ నేరస్థులు వారు చేసిన చెడు విషయాలను గూర్చి
ఇంకెన్నాళ్లు అతిశయిస్తారు?
5 యెహోవా, ఆ మనుష్యులు నీ ప్రజలను బాధించారు.
నీ ప్రజలు శ్రమపడునట్లు వారు చేసారు.
6 మా దేశంలో నివసించే విధవరాండ్రను, పరదేశస్థులను ఆ దుర్మార్గులు చంపుతారు.
తల్లిదండ్రులు లేని పిల్లలను వారు చంపుతారు.
7 వారు ఆ చెడు కార్యాలు చేయటం యెహోవా చూడటం లేదని వారు చెబతారు.
జరుగుతున్న విషయాలను ఇశ్రాయేలీయుల దేవుడు గ్రహించడం లేదని వారు చెబుతారు.
8 దుర్మార్గులారా, మీరు బుద్ధిలేనివారు.
మీరు మీ పాఠం ఇంకెప్పుడు నేర్చుకొంటారు?
దుర్మార్గులారా, మీరు అవివేకులు
మీరు గ్రహించుటకు ప్రయత్నం చేయాలి.
9 దేవుడు మన చెవులను చేశాడు.
కనుక తప్పని సరిగా ఆయనకు చెవులు ఉంటాయి. జరిగే విషయాలను ఆయన వినగలడు.
దేవుడు మన కళ్లను చేశాడు. కనుక తప్పనిసరిగా ఆయనకు కళ్లు ఉంటాయి.
జరుగుతున్న సంగతులను ఆయన చూడగలడు.
10 ఆ ప్రజలను దేవుడే క్రమశిక్షణలో ఉంచుతాడు.
ప్రజలు చేయవలసిన వాటిని దేవుడే వారికి నేర్పిస్తాడు.
11 ప్రజలు తలచే విషయాలు దేవునికి తెలుసు.
ప్రజలు గాలి వీచినట్లుగా ఉంటారని దేవునికి తెలుసు.
12 యెహోవా శిక్షించినవాడు సంతోషంగా ఉంటాడు.
సరియైన జీవిత విధానాన్ని దేవుడు అతనికి నేర్పిస్తాడు.
13 దేవా, ఆ మనిషికి కష్టాలు వచ్చినప్పుడు అతడు మౌనంగా ఉండుటకు నీవు సహాయం చేస్తావు.
దుర్మార్గులు వారి సమాధిలో పాతిపెట్టబడేంత వరకు అతడు నెమ్మదిగా ఉండుటకు నీవు అతనికి సహాయం చేస్తావు.
14 యెహోవా తన ప్రజలను విడిచిపెట్టడు.
సహాయం చేయకుండా ఆయన తన ప్రజలను విడిచిపెట్టడు.
15 న్యాయాన్ని తోడుకొని ధర్మం తిరిగి వస్తుంది.
అప్పుడు మనుష్యులు మంచివాళ్లుగా, నిజాయితీగల వాళ్లుగా ఉంటారు.
16 దుర్మార్గులకు విరోధంగా పోరాడుటకు ఏ మనిషి నాకు సహాయం చేయలేదు.
చెడు కార్యాలు చేసే వారికి విరోధంగా పోరాడుటకు నాతో ఎవ్వరూ నిలువలేదు.
17 యెహోవా నాకు సహాయం చేసి ఉండకపోతే
నేను వెంటనే మరణ నిశ్శబ్దంలో నివసించే వాడిని.
18 నేను పడిపోవుటకు సిద్ధంగా ఉన్నట్టు నాకు తెలుసు.
కాని యెహోవా తన అనుచరుని బలపరిచాడు.
19 నేను చాలా చింతించి తల్లడిల్లిపోయాను.
కాని యెహోవా, నీవు నన్ను ఆదరించి సంతోషింప చేశావు.
20 దేవా, వక్ర న్యాయవాదులకు నీవు సహాయం చేయవు.
ఆ చెడ్డ న్యాయవాదులు ప్రజల జీవితాలను దుర్భరం చేయటానికే న్నాయచట్టాన్ని ఉపయోగిస్తారు.
21 ఆ న్యాయమూర్తులు మంచి మనుష్యులపై పడుతున్నారు.
అమాయక ప్రజలు దోషులని చెప్పి వారిని చంపుతారు.
22 అయితే పర్వతం మీద ఎత్తయిన నా క్షేమ స్థానం యెహోవాయే.
నా దుర్గమైన దేవుడు నా క్షేమస్థానం.
23 ఆ దుర్మార్గపు న్యాయవాదులు చేసిన చెడు పనులకోసం దేవుడు వారిని శిక్షిస్తాడు.
వారు పాపం చేశారు గనుక దేవుడు వారిని నాశనం చేస్తాడు.
మన యెహోవా దేవుడు ఆ దుర్మార్గపు న్యాయవాదులను నాశనం చేస్తాడు.
అనావృష్టి కపట ప్రవక్తలు
14 అనావృష్టి విషయమై ఇది యిర్మీయాకు యెహోవా పంపిన వర్తమానం:
2 “యూదా రాజ్యం చనిపోయిన వారికొరకు రోధిస్తుంది.
యూదా నగరాల ప్రజలు నానాటికీ బలహీనమౌతారు.
వారు నేలమీద పడతారు.
యెరూషలేము నుండి ఒక రోదన దేవుని వద్దకు వెళుతుంది.
3 ప్రజా నాయకులు వారి సేవకులను నీటికొరకు పంపుతారు.
సేవకులు జలాశయాల వద్దకు వెళతారు.
కాని వారికి నీరు దొరకదు.
సేవకులు ఖాళీ కూజాలతో తిరిగి వస్తారు.
దానితో వారు సిగ్గుపడి, కలత చెందుతారు.
అవమానంతో వారి తలలు బట్టతో కప్పుకుంటారు.
4 ఒక్కడు కూడా భూమిని దున్ని సాగుచేయడు
రాజ్యంలో వర్షం కురియదు.
రైతులు నిరాశతో క్రుంగి పోతారు.
వారు సిగ్గుతో తమ ముఖాలు కప్పుకుంటారు.
5 పొలంలో ఈనిన దుప్పి సహితం తన పిల్లను వదిలిపోతుంది.
పచ్చిక దొరకని కారణంగా అది అలా చేస్తుంది.
6 అడవి గాడిదలు వట్టి కొండలపైన నిలబడతాయి.
గుంటనక్కల్లా అవి గాలిని వాసన చూస్తాయి.
వాటి కంటికి ఆహారమే కన్పించదు.
ఎందువల్లనంటే వాటికి తినటానికి ఎక్కడా మొక్కలు లేవు.
7 “నా ప్రజలిలా నాకు మొరపెట్టుకుంటారు: జరిగిన విషయాలన్నిటికీ మా తప్పులే కారణమని మాకు తెలుసు.
మా పాపాల ఫలంగా మేమిప్పుడు కష్టాలనుభవిస్తున్నాము.
యెహోవా, నీ నామ ఘనత కొరకు ఏదో ఒకటి చేసి మాకు సహాయపడుము.
నిన్ను అనేక సార్లు మేము వదిలిపెట్టినట్లు మేము ఒప్పుకుంటున్నాము.
నీ పట్ల మేము పాపం చేశాము.
8 ఓ దేవా! ఇశ్రాయేలుకు నీవు ఆశాజ్యోతివి!
కష్ట కాలంలో ఇశ్రాయేలును ఆదుకొనేవాడవు నీవే.
అయినా ఇప్పుడి దేశంలో పరాయి వానిలా ప్రవర్తిస్తున్నావు.
ఒక్కరాత్రి ఉండిపోయే బాటసారిలా ఉన్నావు.
9 ఆకస్మికంగా దాడి చేయబడిన వ్యక్తిలా ఉన్నావు.
ఎవ్వరినీ రక్షించలేని అశక్తుడైన సైనికునిలా ఉన్నావు.
అయినా నీవు మాతో ఉన్నావు.
యెహోవా, నీ పేరుతో మేము పిలువబడుతూ ఉన్నాము. మమ్మల్ని నిస్సహాయులుగా వదిలి పెట్టవద్దు!”
10 యూదా ప్రజల విషయంలో యెహోవా ఇలా చెపుతున్నాడు: “యూదా ప్రజలు నన్ను వదిలి పెట్టటానికి ఇష్టపడ్తారు. వారు నన్ను వదిలి వెళ్లటంలో ఏమాత్రం వెనుకాడరు. కనుక ఇప్పుడు నేను వారిని అంగీకరించను. వారు చెసిన దుష్టకార్యాలను నేను గుర్తు పెట్టుకుంటాను. వారి పాపాలకు నేను వారిని శిక్షిస్తాను.”
17 “యిర్మీయా, యూదా ప్రజలకు
ఈ వర్తమానం అందజేయి.
‘నా కండ్లు కన్నీళ్ళతో నిండాయి. రాత్రింబవళ్లు నేను ఎల్లప్పుడూ విలపిస్తాను.
కన్యయగు నా కుమార్తె[a] కొరకు విలపిస్తాను. నా ప్రజలకొరకు నేను దుఃఖిస్తాను.
ఎందువల్లనంటే అన్యుడొకడు వారిని గాయపర్చినాడు; వారిని అణగద్రొక్కినాడు.
వారు తీవ్రంగా గాయపర్చబడినారు.
18 నేను పల్లెపట్టులకు వెళితే,
కత్తులతో సంహరింపబడినవారిని చూస్తాను.
నేను నగరానికి వెళితే
అక్కడ నేను తిండి లేక రోగగ్రస్థులైన వారిని చూస్తాను.
యాజకులు, ప్రవక్తలు వారెరుగని అన్యదేశానికి కొనిపోబడ్డారు.’”
19 యోహోవా, యూదా రాజ్యాన్ని నీవు పూర్తిగా విడనాడావా?
యెహోవా, సీయోనును నీవు ప్రేమించడం లేదా?
నీవు మమ్ములను గాయపర్చిన రీతి చూస్తే, మేము తిరిగి కోలుకొనలేమనిపిస్తున్నది.
నీవు ఆ పని ఎందుకు చేశావు?
మేము శాంతిని కోరుకుంటున్నాము.
కాని దాని వల్ల ఏమీ మంచి జరుగలేదు.
మేము స్వస్థపడే సమయం కొరకు ఎదురుచూశాము;
కాని భయము పుట్టుచున్నది.
20 యెహోవా, మేము చాలా దుర్మార్గులమని మాకు తెలుసు.
మా పూర్వీకులు చెడుపనులు చేసినట్లు మాకు తెలుసు.
అవును. మేము నీ పట్ల పాపం చేశాము.
21 యెహోవా, ఉన్నతమైన నీ నామము కొరకైనా మమ్మల్ని త్రోసివేయవద్దు!
దివ్యమైన నీ సింహాసనపు గౌరవాన్ని తగ్గించవద్దు.
మాతో నీవు చేసిన ఒడంబడికను గుర్తుంచుకోవాలి.
ఆ నిబంధనను మరువవద్దు.
22 అన్య దేవతల విగ్రహాలకు వర్షం కురిపించే శక్తిలేదు.
ఆకాశానికి వర్షాలను పంపే ప్రభావము లేదు.
నీవే మాకు దిక్కు
నీవే ఈ కార్యములన్నీ జరిపించేది.
పేతురు తనను నిరాకరిస్తాడని యేసు చెప్పటం
(మత్తయి 26:31-35; మార్కు 14:27-31; యోహాను 13:36-38)
31 “సీమోనూ! సీమోనూ! మిమ్మల్ని గోధుమలు చెరిగినట్లు చెరిగి పరీక్షించటానికి సైతాను అనుమతి పొందాడు. 32 కాని సీమోనూ! నీలో ఉన్న విశ్వాసం సన్నగిల్లరాదని నేను ప్రార్థించాను. నీ విశ్వాసం మళ్ళీ బలపడినప్పుడు నీ సోదరుల విశ్వాసాన్ని గట్టిపరుచు” అని అన్నాడు.
33 కాని సీమోను, “ప్రభూ! మీ వెంట కారాగారానికి రమ్మన్నా, చనిపొమ్మన్నా సిద్ధమే!” అని సమాధానం చెప్పాడు.
పేతురు యేసును ఎరుగుననుటకు భయపడటం
(మత్తయి 26:57-58, 69-75; మార్కు 14:53-54, 66-72; యోహాను 18:12-18, 25-27)
54 యేసును బంధించి ప్రధాన యాజకుని యింటికి తీసుకొని వెళ్ళారు. పేతురు కొంత దూరంలో ఉండి వాళ్ళను అనుసరించాడు. 55 వాళ్ళు పెరటి మధ్య చలిమంటలు వేసి చుట్టూరా కూర్చొన్నారు. పేతురు వచ్చి వాళ్ళతో సహా కూర్చున్నాడు. 56 ఒక పనిపిల్ల ఆ మంటల వెలుతురులో పేతురు అక్కడ కూర్చుని ఉండటం గమనించింది. దగ్గరకు వచ్చి అతణ్ణి చూస్తూ, “ఇతడు కూడా యేసుతో ఉన్నాడు” అని అనింది.
57 కాని పేతురు అది నిజంకాదంటూ, “ఆయనెవరో నాకు తెలియదు అమ్మాయి!” అని అన్నాడు. 58 కొంత సేపయ్యాక మరొకడు అతణ్ణి చూసి, “నీవు కూడా వాళ్ళలో ఒకడివి” అని అన్నాడు.
“నేను వాళ్ళలో ఒకణ్ణి కాదు” అని సమాధానం చెప్పాడు.
59 ఒక గంట తర్వాత యింకొకడు, “ఇతడు గలిలయ దేశస్థుడు. కనుక తప్పక అతనితో ఉన్నవాడే!” అని అన్నాడు.
60 “అయ్యా! మీరేం మాట్లాడుతున్నారో నాకు తెలియదు” అని పేతురు సమాధానం చెప్పాడు.
అతడీ మాటలంటుండగానే కోడి కూసింది. 61 ప్రభువు అటువైపు మళ్ళీ సూటిగా పేతురు వైపు చూశాడు. అప్పుడు ప్రభువు, “ఈ రోజు కోడి కూయక ముందే నేనెవరినో తెలియదని మూడుసార్లంటావు” అని అన్న మాటలు పేతురుకు జ్ఞాపకం వచ్చాయి. 62 పేతురు బయటకు వెళ్ళి భోరున ఏడ్చాడు.
© 1997 Bible League International