Revised Common Lectionary (Semicontinuous)
సంగీత నాయకునికి: కోరహు కుమారుల స్తుతి కీర్తన
85 యెహోవా, నీ దేశం మీద దయ చూపించుము.
యాకోబు ప్రజలు విదేశంలో ఖైదీలుగా ఉన్నారు. ఖైదీలను తిరిగి వారి దేశానికి తీసుకొని రమ్ము.
2 యెహోవా, నీ ప్రజలను క్షమించుము!
వారి పాపాలు తుడిచివేయుము.
3 యెహోవా, కోపంగాను,
ఆవేశంగాను ఉండవద్దు.
4 మా దేవా, రక్షకా, మా మీద కోపగించటం మానివేసి,
మమ్మల్ని మరల స్వీకరించు.
5 నీవు మామీద శాశ్వతంగా కోపగిస్తావా?
6 దయచేసి మమ్మల్ని మరల బ్రతికించుము!
నీ ప్రజలను సంతోషింపజేయుము.
7 యెహోవా, నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నట్టుగా మాకు చూపించుము.
మమ్మల్ని రక్షించుము.
8 దేవుడు చెప్పేది నేను వింటున్నాను.
తన ప్రజలకు శాంతి కలుగుతుందని యెహోవా చెబుతున్నాడు.
ఆయన అనుచరులు వారి అవివేక జీవిత విధానాలకు తిరిగి వెళ్లకపోతే వారికి శాంతి ఉంటుంది.
9 దేవుడు తన అనుచరులను త్వరలో రక్షిస్తాడు.
మేము త్వరలోనే మా దేశంలో గౌరవంగా బ్రతుకుతాము.
10 దేవుని నిజమైన ప్రేమ ఆయన అనుచరులకు లభిస్తుంది.
మంచితనం, శాంతి ఒకదానితో ఒకటి ముద్దు పెట్టుకొంటాయి.
11 భూమి మీద మనుష్యులు దేవునికి నమ్మకంగా ఉంటారు.
పరలోకపు దేవుడు వారికి మేలు అనుగ్రహిస్తాడు.
12 యెహోవా మనకు అనేకమైన మంచివాటిని ఇస్తాడు.
భూమి అనేక మంచి పంటలను ఇస్తుంది.
13 మంచితనం దేవునికి ముందర నడుస్తూ
ఆయన కోసం, దారి సిద్ధం చేస్తుంది.
11 “అప్పుడు యూదా ప్రజలు మరియు ఇశ్రాయేలు ప్రజలు సమావేశపరచబడతారు. వారు ఒక పాలకుని తమకోసం ఏర్పాటు చేసుకొంటారు. మరియు వారి రాజ్యం ఆ దేశం పట్టజాలనంత పెద్దదిగా ఉంటుంది! యెజ్రెయేలు దినం నిజంగా గొప్పగా ఉంటుంది.
2 “అప్పుడు మీరు మీ సోదరులతో ‘మీరు నా ప్రజలు’ అనియు, మీ స్వంతవారితో ‘ఆయన మీ యెడల కరుణ చూపించాడు’ అని చెబుతారు.
2 “మీ తల్లితో గట్టిగా వాదించండి, ఎందుకంటే ఆమె నా భార్య కాదు! నేను ఆమె భర్తను కాను! వేశ్యలాగ ఉండటం మానుకోమని ఆమెతో చెప్పండి. ఆమె స్తనాల మధ్య నుండి ఆమె విటులను తొలగించి వేయమని ఆమెతో చెప్పండి. 3 ఆమె తన వ్యభిచారం మానుకోవటానికి నిరాకరిస్తే నేను ఆమె వస్త్రాలు తీసివేసి దిగంబరిగా చేస్తాను. ఆమెను, ఆమె పుట్టిన రోజున ఉన్నట్టుగానే చేస్తాను. నేను ఆమె ప్రజలను తొలగించివేస్తాను. ఆమె ఎండిపోయిన ఖాళీ ఎడారిలాగ ఉంటుంది. దాహంతో నేను ఆమెను చంపివేస్తాను. 4 ఆమె పిల్లల మీద నేను జాలిపడను. ఎందుకంటే వారు వ్యభిచార సంతానం కనుక. 5 వారి తల్లి ఒక వేశ్యలాగ ప్రవర్తించింది. వారి తల్లి, ఆమె చేసిన పనుల విషయంలో సిగ్గుపడాలి. ఆమె, ‘నేను నా విటుల దగ్గరకు వెళ్తాను, నా విటులు నాకు భోజనపానాలు ఇస్తారు. వారు ఉన్ని మరియు మేలు రకపు సన్నని వస్త్రాలు ఇస్తారు. ద్రాక్షామద్యం, ఒలీవనూనె వారు నాకు ఇస్తారు’ అని చెప్పింది.
6 “అందుచేత, యెహోవానైన నేను మీ (ఇశ్రాయేలు) మార్గాన్ని ముళ్లతో అడ్డువేస్తాను. నేను ఒక గోడ కట్టిస్తాను. అప్పుడు తన దారులను ఆమె తెలుసుకోలేక పోతుంది. 7 ఆమె తన విటుల వెనుక పరుగులెత్తుతుంది కానీ ఆమె వారిని కలుసుకోలేక పోతుంది. ఆమె తన విటుల కోసం వెదుకుతుంది. కాని ఆమె వారిని కనుగొనలేక పోతుంది. అప్పుడు ఆమె, ‘నేను నా మొదటి భర్త (దేవుడు) దగ్గరకు వెళ్తాను. నేను ఆయనతో ఉన్నప్పుడు నా జీవితం బాగా ఉండింది. ఇప్పటికంటే నా జీవితం అప్పుడే మేలు’ అని అంటుంది. 8 “ధాన్యం, ద్రాక్షారసం, నూనె ఇచ్చేవాడను నేనే అని ఆమె (ఇశ్రాయేలు)కు తెలియదు. నేను ఆమెకు వెండి బంగారాలు ఇంకా ఇంకా ఎక్కువగా ఇస్తూ పోయాను. కాని బయలు విగ్రహాలు చేయుటకు ఇశ్రాయేలీయులు ఈ వెండి బంగారాలు ఉపయోగించారు. 9 కనుక నేను (యెహోవాను) తిరిగి వస్తాను. నా ధాన్యం కోతకు సిద్ధంగా ఉన్నప్పుడు నేను దానిని తీసివేసుకొంటాను. ద్రాక్షలు సిద్ధంగా ఉన్న సమయంలో నా ద్రాక్షారసం నేను తీసివేసుకొంటాను. నా ఉన్ని, మేలురకపు వస్త్రాలు నేను తీసివేసుకొంటాను. ఆమె తన నగ్న శరీరాన్ని కప్పుకునేందుకు వీటిని నేను ఆమెకు ఇచ్చాను. 10 కాని ఇప్పుడు నేను ఆమెను నగ్నంగా చేస్తాను. ఆమె ప్రేమికులు ఆమె నగ్నత్వాన్ని చూస్తారు. నా శక్తినుండి ఆమెను ఎవ్వరూ తప్పించలేరు. 11 నేను (దేవుడు) ఆమె సరదానంతా తీసివేస్తాను. ఆమె పండుగ రోజులను, ఆమె అమావాస్య విందులను, ఆమె విశ్రాంతి దినాలను, ప్రత్యేక విందులను నేను నిలిపి వేస్తాను. 12 ఆమె ద్రాక్షావల్లులను, అంజూరపు చెట్లను నేను నాశనం చేస్తాను. ‘నా విటులు వీటిని నాకు ఇచ్చారు’ అని ఆమె చెప్పింది. కాని ఆమె తోటలను నేను మార్చివేస్తాను. అవి భయంకరమైన అడవులుగా మారిపోతాయి. అడవి మృగాలు వచ్చి ఆ మొక్కలను తింటాయి.
13 “ఆమె బయలు[a] దేవతలను సేవించింది. కనుక ఆమెను నేను శిక్షిస్తాను. బయలు దేవతలకు ఆమె ధూపం వేసింది. ఆమె వస్త్రాలు ధరించి, నగలు, ముక్కుకమ్మి పెట్టుకొంది. అప్పుడు ఆమె తన విటుల దగ్గరకు వెళ్లి, నన్ను మరచిపోయింది. యెహోవా ఇలాగున చెపుతున్నాడు.
14 “కనుక నేను (యెహోవా) ఆమెతో ప్రేమగా మాట్లాడతాను. ఆమెను ఎడారిలోకి నడిపించి, ఆమెతో నేను మృదువుగా మాట్లాడతాను. 15 అక్కడ ద్రాక్షాతోటలను ఆమెకు ఇస్తాను. ఆకోరు (శ్రమగల)లోయను ఒక నిరీక్షణ ద్వారంగా చేస్తాను. అప్పుడు తన యౌవన దశలో ఈజిప్టు దేశం నుండి బయటకు వచ్చినప్పుడు చెప్పినట్టుగా ఆమె జవాబు చెపుతుంది.
యేసుని శిష్యులు ఆయన శక్తిని చూడటం
(మత్తయి 8:23-27; మార్కు 4:35-41)
22 ఒక రోజు యేసు, ఆయన శిష్యులు పడవలో ఉండగా, “సముద్రం అవతలి ఒడ్డుకు వెళ్దాం” అని అన్నాడు. అందువల్ల వాళ్ళు ప్రయాణమయ్యారు. 23 ప్రయాణం సాగిస్తుండగా యేసు నిద్రపొయ్యాడు. అకస్మాత్తుగా పెనుగాలి ఆ సముద్రం మీదుగా వీచింది. నీళ్ళు పడవలోకి రావటం మొదలు పెట్టాయి. వాళ్ళందరూ పెద్ద ప్రమాదంలో చిక్కుకొని పొయ్యారు. 24 శిష్యులు యేసును నిద్ర లేపుతూ, “ప్రభూ! ప్రభూ! మనము మునిగి పోతున్నాం!” అని అన్నారు.
ఆయన లేచి గాలిని, నీళ్ళను ఆగమని గద్దించాడు. పెనుగాలి ఆగిపోయింది. 25 “యేసు, మీ విశ్వాసం ఏమైంది?” అని తన శిష్యుల్ని అడిగాడు.
వాళ్ళు భయంతో ఆశ్చర్యంగా, “ఆయన ఎంత గొప్పవాడు! నీళ్ళను, గాలిని కూడా ఆజ్ఞాపిస్తున్నాడే! అవి విధేయతతో ఆయన ఆజ్ఞను పాటిస్తున్నాయే!” అని పరస్పరం మాట్లాడుకున్నారు.
© 1997 Bible League International