Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 39

సంగీత నాయకునికి, యెదూతూనునకు: దావీదు కీర్తన.

39 “నేను జాగ్రత్తగా నడచుకొంటాను.
    నా నాలుకతో నన్ను పాపం చేయనివ్వను” అని నేను అన్నాను.
    నేను దుర్మార్గులకు సమీపంగా ఉన్నప్పుడు నేను నా నోరు మూసుకొంటాను.[a]

మాట్లాడుటకు నేను తిరస్కరించాను.
    నేనేమి చెప్పలేదు.
    కాని నేను నిజంగా తల్లడిల్లిపోయాను.
నాకు కోపం వచ్చింది.
    దీని విషయం నేను తలంచిన కొలది నాకు మరింత కోపం వచ్చింది.
    కనుక నేను ఏదో అన్నాను.

యెహోవా, నాకు ఏమి జరుగుతుందో చెప్పుము.
    నేను ఎన్నాళ్లు జీవిస్తానో నాకు చెప్పుము.
    నిజానికి నా జీవితం ఎంత కొద్దిపాటిదో నాకు చెప్పుము.
యెహోవా, నీవు నాకు కొద్దికాలం జీవితం మాత్రమే ఇచ్చావు.
    నా జీవితం నీ ఎదుట శూన్యం.
ప్రతి మనిషి యొక్క జీవితం ఒక మేఘంలాంటిది మాత్రమే. ఏ మనిషి శాశ్వతంగా జీవించడు.

మేము జీవించే జీవితం అద్దంలోని ప్రతిబింబం వంటిది.
    మా ప్రయాసలన్నియు వ్యర్థము. మేము సామగ్రి సమకూర్చుకొంటూనే ఉంటాము.
    కాని ఆ సామగ్రి ఎవరికి దొరుకుతుందో మాకు తెలియదు.

కనుక ప్రభూ, నాకు ఏమి ఆశ ఉంది?
    నీవే నా ఆశ.
యెహోవా, నేను చేసిన చెడు కార్యాలనుండి నీవు నన్ను రక్షిస్తావు.
    దేవునియందు నమ్మకము లేనివానిలా, వెర్రివాడిలా నన్ను యితరులు చూడకుండా నీవు చేస్తావు.
నేను నా నోరు తెరవను.
    నేను ఏమీ చెప్పను.
    యెహోవా, నీవు చేయవలసింది చేశావు.
10 దేవా, నన్ను శిక్షించటం మానివేయుము.
    నీ శిక్షవల్ల నేను అలసిపోయాను.
11 యెహోవా, తప్పు చేసినవారిని నీవు శిక్షించుము. ప్రజలు జీవించాల్సిన సరైన విధానాన్ని నీవు అలా నేర్పిస్తావు.
    వారికి ప్రియమైన దాన్ని చిమ్మటవలె నీవు నాశనం చేస్తావు.
    మా జీవితాలు అంతలోనే మాయమయ్యే మేఘంలా ఉన్నాయి.

12 యెహోవా, నా ప్రార్థన ఆలకించుము.
    నేను నీకు మొరపెట్టే మాటలు వినుము.
    నా కన్నీళ్లు తెలియనట్లు ఉండవద్దు.
నేను దాటిపోతున్న ఒక అతిథిని.
    నా పూర్వీకులందరిలాగే నేను కూడా ఒక బాటసారిని.
13 యెహోవా, నా వైపు చూడకుము. నేను చనిపోక ముందు నన్ను సంతోషంగా ఉండనిమ్ము.
    కొంచెంకాలంలో నేను ఉండకుండా పోతాను.

యెహెజ్కేలు 17:1-10

గ్రద్ద మరియు ద్రాక్ష

17 తరువాత యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఇలా అన్నాడు, “నరపుత్రుడా! ఇశ్రాయేలు వంశానికి ఈ కథ వినిపించు. దాని అర్థమేమిటో వారినడుగు. వారికి ఇలా చెప్పు:

“‘పెను రెక్కల గ్రద్ద ఒకటి లెబానోనుకు వచ్చింది.
    మచ్చలుగల ఈకలు ఆ గ్రద్దకు మెండుగా ఉన్నాయి.
ఆ పక్షిరాజు ఆ పెద్ద దేవదారు వృక్షపు (లెబానోను) తల తుంచివేసింది.
    తెంచిన కొమ్మను కనానులోని వ్యాపారస్తుల దేశంలో నాటింది.
కనాను నుండి పిదప కొన్ని విత్తనాల (ప్రజల)ను ఆ గ్రద్ద తీసుకుంది.
    సారవంతమైన భూమిలో వాటిని నాటింది. అది వాటిని మంచి నదీతీరాన నాటింది.
ఆ విత్తనం మొలకెత్తి ద్రాక్షా చెట్టయ్యింది.
    అది మంచి ద్రాక్షాలత.
ఆ మొక్క ఎత్తుగా లేదు.
    అయినా అది ఎక్కువ విస్తీర్ణంలో పాకింది.
అది కొమ్మలు తొడిగింది.
    చిన్న కొమ్మలు చాలా పొడుగ్గా పెరిగాయి.
మరో పెద్ద రెక్కల గ్రద్ద ద్రాక్షా మొక్కను చూసింది.
    ఆ గ్రద్దకు చాలా ఈకలు ఉన్నాయి.
ఈ క్రొత్త గ్రద్ద తనను సంరక్షించాలని ఆ ద్రాక్షాలత కోరింది.
    అందువల్ల తన వేళ్లు గ్రద్ద వైపు పెరిగేలా చేసింది ఆ మొక్క.
దాని కొమ్మలు ఆ గ్రద్ద వైపుకే విస్తరించాయి.
    అది నాటబడిన పొలాన్ని అధిగమించింది.
దాని కొమ్మలు ప్రాకాయి.
    తనకు నీళ్లు పోయమని ద్రాక్షాచెట్టు క్రొత్త గ్రద్దను కోరింది.
సారవంతమైన భూమిలో నాటబడింది ద్రాక్షామొక్క. మంచి నీటివనరు వున్నచోట నాట బడింది.
    దాని కొమ్మలు బాగా పెరిగి, కాపు కాయవలసి ఉంది.
    అది ఎంతో మేలురకం ద్రాక్షాలత అయివుండేది.’”

నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
“మరి ఆ మొక్క విజయం సాధిస్తుందని మీరనుకుంటున్నారా?
    లేదు! ఆ క్రొత్త గ్రద్ద మొక్కను భూమినుండి పెరికివేస్తుంది.
మొక్క వేళ్లను గ్రద్ద నరికివేస్తుంది. వున్న కాయలన్నీ అదే తినేస్తుంది.
    క్రొత్త ఆకులన్నీ ఎండి రాలిపోతాయి.
మొక్క చాలా బలహీనమవుతుంది.
    మొక్కను వేళ్లతో లాగివేయటానికి అది గట్టి ఆయుధాలు పట్టటం గాని, బలమైన సైన్య సహాయాన్ని గాని తీసుకోదు.
10 అది నాటబడిన చోట మొక్క పెరుగుతుందా?
    లేదు! వేడి తూర్పు గాలులు వీస్తాయి. దానితో మొక్క వాడి, చనిపోతుంది.
    అది నాటిన దగ్గరే చనిపోతుంది.”

రోమీయులకు 2:12-16

12 ధర్మశాస్త్రము లేని పాపులు ధర్మశాస్త్రము లేకుండానే నశించిపోతారు. అలాగే ధర్మశాస్త్రం ఉండి కూడా పాపం చేసినవాళ్ళపై దేవుడు ధర్మ శాస్త్రానుసారం తీర్పు చెపుతాడు. 13 ఎందుకంటే, ధర్మశాస్త్రాన్ని విన్నంత మాత్రాన దేవుని దృష్టిలో నీతిమంతులు కాలేరు. కాని ధర్మశాస్త్రంలో ఉన్న నియమాల్ని విధేయతతో ఆచరించేవాళ్ళను దేవుడు నీతిమంతులుగా పరిగణిస్తాడు.

14 యూదులుకానివాళ్ళకు ధర్మశాస్త్రం లేదు. కాని వాళ్ళు సహజంగా ధర్మశాస్త్రం చెప్పినట్లు నడుచుకొంటే వాళ్ళకు ధర్మశాస్త్రం లేకపోయినా, వాళ్ళు నడుచుకునే పద్ధతే ఒక ధర్మశాస్త్రం అవుతుంది. 15 వాళ్ళ ప్రవర్తన ధర్మశాస్త్ర నియమాలు వాళ్ళ హృదయాలపై వ్రాయబడినట్లు చూపిస్తుంది. ఇది నిజమని వాళ్ళ అంతరాత్మలు కూడా చెపుతున్నాయి. వాళ్ళు కొన్నిసార్లు సమర్థించుకొంటూ, మరి కొన్నిసార్లు నిందించుకొంటూ, తమలోతాము వాదించుకుంటూ ఉంటారు.

16 ఆ రోజు దేవుడు మానవుల రహస్య ఆలోచనలపై యేసు క్రీస్తు ద్వారా తీర్పు చెపుతాడు. నేను ప్రజలకు అందించే సువార్త ఈ విషయాన్ని తెలియజేస్తుంది.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International