Revised Common Lectionary (Semicontinuous)
మరియ పాడిన భక్తి గీతం
46 మరియ ఈ విధంగా అన్నది:
47 “నా ఆత్మ ప్రభువును కొలిచింది.
దేవుడు చేసిన ఈ మంచికి నా మనస్సు ఆనందం పొందింది. ఆయనే నా రక్షకుడు.
48 దీనురాల్ని నేను!
ఆయన దాసీని నేను, నన్ను కరుణించాడు!
ఇకనుండి అందరూ
నన్ను ధన్యురాలంటారు!
49 దేవుడు సర్వశక్తి సంపన్నుడు.
ఆయన నాకు ఎంతో మంచి చేశాడు! ఆయన నామం పవిత్రం!
50 తనంటే భయపడే వాళ్ళపై తరతరాలు దయ చూపుతాడు.
51 తన బలమైన హస్తాన్ని జాపి
గర్వించే వాళ్ళను వాళ్ళ ఆలోచనల్ని అణిచి వేస్తాడు.
52 రాజుల్ని, వాళ్ళ సింహాసనాల నుండి దింపి వేస్తాడు.
దీనులకు గొప్ప స్థానాలిస్తాడు.
53 పేదవాళ్ళ అవసరాలన్నీ తీరుస్తాడు.
ధనవంతుల్ని వట్టి చేతుల్తో పంపేస్తాడు.
54 తరతరాల నుండి మన పూర్వీకులతో, అబ్రాహాముతో,
అతని సంతతితో చెప్పినట్లు
55 దేవుని ఇష్టానుసారం జీవించిన ఇశ్రాయేలు ప్రజలకు సహాయం చేశాడు. మరవకుండా వాళ్ళపై దయ చూపాడు.”
యెరూషలేమునుండి న్యాయం రావటం
4 చివరి రోజులలో ఇలా జరుగుతుంది.
పర్వతాలన్నిటిలో దేవుడైన యెహోవా ఆలయమున్న పర్వతం మిక్కిలి ప్రాముఖ్యంగలది అవుతుంది.
అది కొండలన్నిటిలో ఉన్నతంగా చేయబడుతుంది.
అన్యదేశాల ప్రజలు దానివద్దకు ప్రవాహంలా వస్తారు.
2 అనేక దేశాలవారు వచ్చి ఇలా అంటారు:
“రండి, మనం యెహోవా పర్వతంమీదికి వెళదాం!
యాకోబు దేవుని ఆలయానికి వెళదాం!
యెహోవా తన ధర్మాన్ని మనకు నేర్పుతాడు.
ఆయన మార్గంలో మనం నడుద్దాం.”
ఎందువల్లనంటే దేవుని బోధలు సీయోనునుండి వస్తాయి.
యెహోవా వాక్కు యెరూషలేమునుండి వస్తుంది!
3 యెహోవా అనేక జనుల మధ్య తీర్పు తీర్చుతాడు.
బహు దూరానగల బలమైన దేశాల ప్రజలకు ఆయన తీర్పు ఇస్తాడు.
అప్పుడు వారు తమ కత్తులను సాగగొట్టి వాటిని నాగలికర్రులుగా చేస్తారు.
ఆ జనులు తమ ఈటెలను సాగగొట్టి చెట్లను నరికే పనిముట్లుగా చేస్తారు.
జనులు ఒకరితో ఒకరు కత్తులతో యుద్ధం చేయటం మాని వేస్తారు.
వారిక ఎన్నడూ యుద్ధ వ్యూహాలను అధ్యయనం చేయరు!
4 లేదు, ప్రతి ఒక్కడూ తన ద్రాక్షాచెట్లక్రింద,
అంజూరపు చెట్లక్రింద కూర్చుంటాడు.
వారిని ఎవ్వరూ భయపడేలా చేయరు!
ఎందువల్లనంటే సర్వశక్తిమంతుడైన యెహోవా ఇది చెప్పాడు!
5 అన్యదేశాల ప్రజలు తమతమ దేవుళ్లను అనుసరిస్తారు.
కానీ మనం మాత్రం మన దేవుడైన యెహోవా నామాన్ని సదా స్మరించుకుంటాం!
మనము క్రీస్తులో ఒకటిగా ఉన్నాము
11 మీరు యూదులుగా పుట్టలేదు. కనుక యూదులు మిమ్మల్ని “సున్నతి చేయించుకోనివాళ్ళు” అని అంటారు. తాము సున్నతి పొందినవాళ్ళైనందుకు వాళ్ళు గర్విస్తూవుంటారు. వీళ్ళ సున్నతి శారీరకమైనది. ఆత్మవల్ల పొందింది కాదు. ఇది మీరు జ్ఞాపకం ఉంచుకోండి. 12 అంతేకాక ఒకప్పుడు మీరు క్రీస్తుతో కాక విడిగా ఉండేవాళ్ళు. ఇశ్రాయేలు దేశంలో మీకు పౌరసత్వం లేదు. దేవుడు వాగ్దానం చేసిన ఒడంబడికలో మీకు భాగం లేదు. మీరు రక్షణ లభిస్తుందన్న ఆశలేకుండా, ఈ ప్రపంచంలో దేవుడనేవాడు లేకుండా జీవించారు. ఇది కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోండి. 13 కాని ఒకప్పుడు దూరంగా ఉన్న మీరు క్రీస్తు రక్తం వల్ల దేవునికి దగ్గర అయ్యారు.
14 మనకు సంధి కలిగించిన వ్యక్తి క్రీస్తు. ఆయన యిద్దరినీ ఒకటిగా చేసి ద్వేషమనే అడ్డుగోడను నిర్మూలించాడు. 15 ధర్మశాస్త్రాన్ని, అందులో చెప్పిన ఆజ్ఞల్ని, నియమాల్ని తన ప్రాణం అర్పించి రద్దు చేసాడు. ఇద్దరినీ కలిపి తనలో ఒక క్రొత్త మనిషిని సృష్టించి శాంతి స్థాపించాలని ఆయన ఉద్దేశ్యం. 16 ఈ విధంగా సిలువ ద్వారా వాళ్ళ మధ్య ఉన్న ద్వేషాన్ని నిర్మూలించి ఒకటిగా ఉన్న ఆ క్రొత్త మనిషికి, దేవునికి సంధి కుదర్చాలని ఆయన ఉద్దేశ్యం. 17 క్రీస్తు వచ్చి దూరంగా ఉన్న మీకు, మరియు దగ్గరగా ఉన్న వాళ్ళకు శాంతి సువార్తను ప్రకటించాడు. 18 ఆయన కారణంగా మన యిద్దరికి, తండ్రి దగ్గరకు ఒక ఆత్మ ద్వారా వెళ్ళే అవకాశం కలిగింది.
19 అందువల్ల మీరిక మీదట పరులు కారు. పరదేశీయులు కారు. పవిత్రులతో కలిసి జీవిస్తున్న తోటి పౌరులు. దేవుని కుటుంబానికి చెందిన సభ్యులు. 20 మీరు కూడా అపొస్తలులు, ప్రవక్తలు వేసిన పునాదిపై కట్టబడ్డారు. క్రీస్తు దానికి ప్రధానమైన మూలరాయి. 21 ఆయనవల్ల ఈ ఇల్లు సక్రమంగా నిర్మింపబడి అభివృద్ధి చెందుతుంది. అది ప్రభువు పవిత్ర దేవాలయము. 22 ఆయనలో ఐక్యత పొందిన మిమ్మల్ని కూడా యితర్లతో చేర్చి ఈ ఇల్లు నిర్మింపబడుతుంది. ఈ యింటిలో దేవుని ఆత్మ నివసిస్తాడు.
© 1997 Bible League International