Revised Common Lectionary (Semicontinuous)
113 యెహోవాను స్తుతించండి!
యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించండి!
యెహోవా నామాన్ని స్తుతించండి.
2 ఇప్పుడు, ఎల్లప్పుడూ, యెహోవా నామము స్తుతించబడాలని నేను కోరుతున్నాను.
3 తూర్పున ఉదయించే సూర్యుడి దగ్గర్నుండి,
సూర్యుడు అస్తమించే స్థలం వరకు యెహోవా నామం స్తుతించబడాలని నేను కోరుతున్నాను.
4 యెహోవా జనాలన్నింటికంటె ఉన్నతమైనవాడు.
ఆయన మహిమ ఆకాశాలంత ఉన్నతం.
5 ఏ మనిషి మన యెహోవా దేవునిలా ఉండడు.
దేవుడు పరలోకంలో ఉన్నతంగా కూర్చుంటాడు.
6 ఆకాశాలను, భూమిని దేవుడు చూడాలంటే
ఆయన తప్పక కిందికి చూడాలి.
7 దేవుడు పేదవారిని దుమ్ములో నుండి పైకి లేపుతాడు.
భిక్షగాళ్లను చెత్తకుండీలో నుండి బయటకు తీస్తాడు.
8 ఆ మనుష్యులను దేవుడు ప్రముఖులుగా చేస్తాడు.
ఆ మనుష్యులను దేవుడు ప్రముఖ నాయకులుగా చేస్తాడు.
9 ఒక స్త్రీకి పిల్లలు లేకపోవచ్చును.
కాని దేవుడు ఆమెకు పిల్లలను ఇచ్చి ఆమెను సంతోషపరుస్తాడు.
యెహోవాను స్తుతించండి!
28 అప్పుడు రిబ్కా పరుగెత్తి వెళ్లి తన ఇంటివారికి ఈ సంగతులన్నీ చెప్పింది. 29-30 రిబ్కాకు ఒక సోదరుడు ఉన్నాడు. అతని పేరు లాబాను. ఆ మనిషి తనతో చెప్పిన విషయాలు రిబ్కా చెప్పింది. లాబాను ఆమె మాటలు వింటున్నాడు. ఎప్పుడైతే తన సోదరి చేతులకు ఉంగరం, గాజులు లాబాను చూశాడో, అప్పుడు బావి దగ్గరకు అతడు పరుగెత్తాడు. అక్కడ ఆ మనిషి బావి దగ్గర ఒంటెల ప్రక్కగా నిలబడి ఉన్నాడు. 31 “అయ్యా, తమరికి లోనికి సుస్వాగతం. మీరలా ఇక్కడే బయట నిలబడి ఉండనక్కర్లేదు. మీ ఒంటెలకు స్థలం, మీరు పండుకొనేందుకు గది నేను సిద్ధం చేశాను” అని లాబాను చెప్పాడు.
32 కనుక అబ్రాహాము సేవకుడు ఆ ఇంటిలో ప్రవేశించాడు. ఒంటెల పనిలో అతనికి లాబాను సహాయం చేసి, అతని ఒంటెలకు గడ్డి వేశాడు. అతను, అతనితో ఉన్న మనుష్యులకు కాళ్లు కడుక్కొనేందుకు నీళ్లు ఇచ్చాడు. 33 తర్వాత లాబాను అతనికి భోజనం పెట్టాడు. అయితే ఆ సేవకుడు తినకుండా నిరాకరించాడు. “నేను ఎందుకు వచ్చానో మీతో చెప్పకుండా నేను భోజనం చేయను” అన్నాడు అతను.
కనుక లాబాను, “అలాగైతే మాతో చెప్పు మరి” అన్నాడు.
రిబ్కా కోసం సంప్రదింపు
34 ఆ సేవకుడు చెప్పింది ఇది: “నేను అబ్రాహాము సేవకుడను. 35 అన్ని విషయాల్లోను యెహోవా నా యజమానిని ఎంతో గొప్పగా ఆశీర్వదించాడు. నా యజమాని మహా ఘనుడయ్యాడు. గొర్రెల మందలు, పశువుల మందలు విస్తారంగా యెహోవా అబ్రాహాముకు ఇచ్చాడు. అబ్రాహాముకు వెండి బంగారాలు విస్తారంగా ఉన్నాయి. చాలా మంది ఆడ, మగ సేవకులు ఉన్నారు. ఒంటెలు, గాడిదలు చాలా ఉన్నాయి. 36 నా యజమాని భార్య శారా. ఆమె చాలా వృద్ధాప్యంలో ఒక కుమారుని కన్నది. నా యజమాని తన ఆస్తి సర్వం ఆ కుమారునికి ఇచ్చాడు. 37 నేను ఒక వాగ్దానం చేయాలని నా యజమాని నన్ను బలవంతం చేశాడు. నా యజమాని ‘నా కుమారుణ్ణి కనాను అమ్మాయిల్లో ఎవర్నీ చేసుకోనివ్వగూడదు. మనం ఆ ప్రజల మధ్య నివసిస్తున్నాం కాని కనాను అమ్మాయిల్నెవరినీ అతడు చేసుకోవటం నాకు ఇష్టం లేదు. 38 కనుక నీవు నా తండ్రి దేశానికి వెళ్తానని వాగ్దానం చేయాలి. నా వంశం వారి దగ్గరకు వెళ్లి, నా కుమారుని కోసం భార్యను కుదుర్చు’ అని నాతో చెప్పాడు. 39 ‘ఒక వేళ ఆ స్త్రీ నాతో కలిసి ఈ దేశానికి రాదేమో’ అని నేను నా యజమానితో అన్నాను. 40 అయితే నా యజమాని నాతో ఇలా చెప్పాడు, ‘నేను యెహోవాను సేవిస్తాను, యెహోవా తన దూతను నీతో కూడ పంపి నీకు సహాయం చేస్తాడు. అక్కడి ప్రజలలో నా కుమారుని కోసం భార్యను నీవు కనుక్కొంటావు. 41 కాని నీవు నా తండ్రి దేశం వెళ్లాక, నా కుమారుని కోసం భార్యను ఇచ్చేందుకు వారు నిరాకరిస్తే, అప్పుడు ఈ ప్రమాణ బాధ్యత నీకు ఉండదు.’
42 “ఈ వేళ నేను ఈ బావి దగ్గరకు వచ్చి అన్నాను: ‘నా యజమాని అబ్రాహాము దేవుడవైన యెహోవా, దయతో నా ప్రయాణం విజయవంతం చేయి.
యేసు తన స్వగ్రామానికి వెళ్ళటం
(మత్తయి 13:53-58; మార్కు 6:1-6)
16 ఆ తర్వాత తాను పెరిగిన నజరేతు గ్రామానికి వెళ్ళాడు. ఒక విశ్రాంతి రోజున అలవాటు ప్రకారం సమాజమందిరానికి వెళ్ళి, చదవటానికి నిలుచున్నాడు. 17 అక్కడున్న వాళ్ళు, ప్రవక్త యెషయా గ్రంథాన్ని ఆయన చేతికి ఇచ్చారు. ఆయన ఆ గ్రంథములో ఈ వాక్యాలున్న పుటను తెరిచి చదవటం మొదలు పెట్టాడు:
18 “ప్రభువు నన్నభిషేకించి పేదవాళ్ళకు
నన్ను సువార్త ప్రకటించుమన్నాడు.
అందుకే ప్రభువు ఆత్మ నాలో ఉన్నాడు.
బంధితులకు స్వేచ్ఛ ప్రకటించుమని,
గుడ్డివారికి చూపు కలిగించాలని,
హింసింపబడే వారికి విడుదల కలిగించాలని, నన్ను పంపాడు.
19 ప్రభువు ‘తాను దయ చూపే సంవత్సరం’ ప్రకటించుమని నన్ను పంపాడు.”(A)
20 ఆ తదుపరి యేసు గ్రంథం మూసేసి దాన్ని తెచ్చిన వానికి యిచ్చి కూర్చున్నాడు. సమాజ మందిరంలో ఉన్నవాళ్ళందరి కళ్ళు ఆయనపై ఉన్నాయి. 21 ఆయన వాళ్ళతో, “ఈ రోజు గ్రంథములో వ్రాయబడిన ఈ వాక్యాలు మీరు వింటుండగానే నెరవేరాయి” అని అన్నాడు.
22 అంతా ఆయన్ని మెచ్చుకున్నారు. అంతే కాక ఆయన నోటినుండి వచ్చిన ఆ చక్కటి మాటలు విని అందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళు, “ఈయన యోసేపు కుమారుడు కదా!” అని అన్నారు.
23 యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “‘వైద్యుడా! నిన్ను నీవు నయం చేసుకో!’ అన్న సామెత మీరు నాకు చెబుతారని తెలుసు. పైగా మీరు, ‘కపెర్నహూములో చేసిన మహాత్యాల్ని గురించి మేము విన్నాము. వాటిని యిక్కడ నీ స్వగ్రామంలో కూడా చెయ్యి!’ అని అంటారని నాకు తెలుసు. 24 ఇది నిజం. ఏ ప్రవక్తనూ అతని స్వగ్రామపు ప్రజలు అంగీకరించలేదు.
25 “ఏలీయా కాలంలో ఇశ్రాయేలు దేశంలో చాలామంది వితంతువులుండినారని ఖచ్చితంగా చెప్పగలను. ఆ కాలంలో మూడున్నర సంవత్సరాలు వర్షాలు కురియలేదు. దేశమంతటా తీవ్రమైన కరువు వ్యాపించి ఉంది. 26 సీదోను రాష్ట్రంలోని సారెపతు అనే గ్రామంలో ఒక వితంతువు ఉండేది. దేవుడు ఏలీయాను ఆమె దగ్గరకు తప్పమరెవ్వరి దగ్గరకు పంపలేదు.
27 “ప్రవక్త ఎలీషా[a] కాలంలో ఇశ్రాయేలు దేశంలో చాలా మంది కుష్టురోగులుండే[b] వాళ్ళు. కాని సిరియ దేశానికి చెందిన నయమాను అనేవాణ్ణి తప్ప దేవుడు వీళ్ళలో ఒక్కరిని కూడా నయం చేయలేదు.”
28 సమాజ మందిరములో వున్న వాళ్ళందరికి యిది విని ఆయనపై చాలా కోపం వచ్చింది. 29 వాళ్ళు లేచి ఆయన్ని గ్రామం నుండి వెళ్ళగొట్టారు. ఆ గ్రామం కొండ మీద ఉంది. వాళ్ళు ఆయన్ని క్రిందికి త్రోయాలని కొండ చివరకు తీసుకు వెళ్ళారు. 30 కాని ఆయన వాళ్ళ మధ్యనుండి నడిచి తన దారిన తాను వెళ్ళి పోయాడు.
© 1997 Bible League International