Revised Common Lectionary (Semicontinuous)
కళ్లము దగ్గర రూతు, బోయజు
3 రూతు అత్త నయోమి, “చూడు బిడ్డా, ఒకవేళ నీ కోసం నేనొక మంచి భర్తను చూస్తే బాగుంటుందేమో, అది నీకు క్షేమం. 2 (ఒక వేళ బోయజే తగినవాడేమో) బోయజు మనకు చాలా దగ్గర బంధువు. అతని దగ్గర పనిచేసే స్త్రీలతో నీవూ పని చేసావు. ఈ రోజు రాత్రి అతడు కళ్లము దగ్గర పని చేస్తాడు. 3 నీవు పోయి స్నానం చేసి బట్టలు కట్టుకో, మంచి బట్టలు కట్టుకొని కళ్లము దగ్గరకు వెళ్లు, అయితే, బోయజు భోజనము చెయ్యటము అయ్యేంత వరకు అతనికి కనబడకు. 4 అతడు భోజనము చేసిన తర్వాత పండుకొని విశ్రాంతి తీసుకుంటాడు. అతను ఎక్కడ పండుకుంటాడో గమనిస్తూ ఉండు. అక్కడికి వెళ్లి, అతని కాళ్లమీదున్న దుప్పటి తొలగించి, అక్కడే అతని దగ్గరే పండుకో. అప్పుడు నీవేమి చేయాలో (పెళ్లి గూర్చి) అతనే నీకు చెప్తాడు.”
5 “నీవు చెప్పినట్టే చేస్తా” అని జవాబిచ్చింది రూతు.
13 బోయజు రూతును పెళ్లి చేసుకున్నాడు. యెహోవా ఆమెను గర్భవతిని కానిచ్చినప్పుడు ఆమె ఒక కుమారుని కన్నది. 14 ఆ ఊరిలో స్త్రీలు నయోమితో,
“నిన్ను ఆదుకొనేందుకు ఇతడిని (బోయజును) ఇచ్చిన యెహోవాని స్తుతించు.
అతడు ఇశ్రాయేలులో ప్రఖ్యాతి నొందును గాక! అనిరి. మరియు వారు,
15 అతడే నీకు బలాన్ని యిచ్చి,
నీ వృద్ధాప్యంలో నిన్ను కాపాడును గాక!
నీ కోడలు వల్ల ఇదంతా జరిగింది.
ఆమె నీ కోసం ఈ పిల్లవానిని కన్నది.
ఆమెకు నీవంటే చాలా ప్రేమ.
ఈమె ఏడుగురు కుమారులను కంటే నీకు మేలు.”
అని అనిరి.
16 నయోమి పిల్లవాడ్ని తీసుకొని, చేతుల్లో ఎత్తుకొని ఆడించింది. 17 ఆ స్త్రీలు, “ఈ పిల్లవాడు నయోమి కోసమే పుట్టాడు” అన్నారు. ఇరుగు పొరుగువారు ఆతనికి ఓబేదు అని పేరు పెట్టారు. ఓబేదు యెష్షయికి తండ్రి. యెష్షయి రాజైన దావీదుకు తండ్రి.
సొలొమోను యాత్ర కీర్తన.
127 ఇల్లు కట్టేవాడు యెహోవా కాకపోయినట్లయితే
కట్టేవాడు తన పనిని వ్యర్థంగా చేస్తున్నట్టు.
పట్టణాన్ని కాపలా కాసేవాడు యెహోవా కాకపోతే
కాపలావాళ్లు వారి సమయం వృధా చేసుకొంటున్నట్టే.
2 నీవు వేకువనే లేవటం, చాలా ఆలస్యంగా పనిచేయటం కేవలం నీవు తినే ఆహారం కోసమే అయితే
నీవు నీ సమయం వృధా చేనుకొంటున్నట్టే.
దేవుడు తనకు ప్రియమైనవాళ్ల విషయం శ్రద్ధ తీసుకొంటాడు.
వారు నిద్రపోతున్నప్పుడు కూడా ఆయన శ్రద్ధ తీసుకొంటాడు.
3 పిల్లలు యెహోవానుండి లభించే కానుక.
వారు తల్లి గర్భమునుండి వచ్చే బహుమానం.
4 యువకుని కుమారులు, సైనికుని బాణాల సంచిలోని బాణాల్లాంటివారు.
5 తన బాణాల సంచిని కుమారులతో నింపుకొనే వాడు చాలా సంతోషంగా ఉంటాడు.
ఆ మనిషి ఎన్నటికీ ఓడించబడడు. బహిరంగ స్థలాల్లో[a] అతని కుమారులు అతని శత్రువులనుండి అతణ్ణి కాపాడుతారు.
24 భూమ్నీదవున్న ఈ పవిత్ర స్థానం నిజమైన దానికి ప్రతిరూపం మాత్రమే. క్రీస్తు మానవుడు నిర్మించిన ఈ పవిత్ర స్థానాన్ని కాదు ప్రవేశించింది. ఆయన మనకోసం పరలోకంలో ఉన్న దేవుని యొద్దకు వెళ్ళాడు.
25 ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరం పశువుల రక్తంతో అతి పవిత్ర స్థానాన్ని ప్రవేశించినట్లు, ఆయన తనను తాను పదే పదే బలిగా సమర్పించుకోవటానికి పరలోకానికి వెళ్ళలేదు. 26 అలా అర్పించి ఉంటే ప్రపంచం సృష్టింప బడినప్పటి నుండి క్రీస్తు ఎన్నోసార్లు మరణించ వలసి వచ్చేది. కాని, ప్రస్తుతం యుగాల అంతంలో తనను తాను ఒకే ఒకసారి బలిగా అర్పించుకుని పాపపరిహారం చెయ్యాలని ప్రత్యక్ష్యమయ్యాడు.
27 ప్రతి ఒక్కడూ, ఒక్కసారే మరణించాలి. తర్వాత దేవుని తీర్పుకు గురి అవ్వాలి. వాళ్ళపై తీర్పు చెబుతాడు. 28 అందువల్ల, అనేకుల పాపపరిహారం కోసం క్రీస్తు ఒకసారి మాత్రమే తనను తాను బలిగా అర్పించుకున్నాడు. ఆయన రెండవసారి ప్రత్యక్ష్యమౌతాడు. పాపం మోయటానికి కాదు తనకోసం కాచుకొని ఉన్నవాళ్లకు రక్షణ కలిగించటానికి ప్రత్యక్ష్యమౌతాడు.
యేసు శాస్త్రులను విమర్శించటం
(మత్తయి 23:6-7; లూకా 11:43; 20:45-47)
38 యేసు యింకా ఎన్నో విషయాలు బోధిస్తూ ఈ విధంగా అన్నాడు: “శాస్త్రుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు పొడుగాటి దుస్తులు ధరించి నడవాలని, సంతల్లో ప్రజలు తమకు నమస్కరించాలని కోరుతూ ఉంటారు. 39 వాళ్ళు సమాజాల్లో ముఖ్య స్థానాలను, విందుల్లో గౌరవప్రదమైన స్థానాలను ఆక్రమించాలని ఆశిస్తూ ఉంటారు. 40 వాళ్ళు వితంతువుల యిండ్లను దోచుకుంటూ, పైకి మాత్రం గంటల తరబడి ప్రార్థిస్తూవుంటారు. అలాంటి వాళ్ళను దేవుడు అతితీవ్రంగా శిక్షిస్తాడు.”
నిజమైన కానుక
(లూకా 21:1-4)
41 ఒక రోజు యేసు, మందిరంలో కానుకలు వేసే పెట్టెకు ఎదురుగా కూర్చొని ఉన్నాడు. ప్రజలు ఆ పెట్టెలో డబ్బును వేయటం ఆయన గమనించాడు. ధనవంతులు చాలామంది పెద్ద పెద్ద మొత్తాల్ని ఆ పెట్టెలో వేసారు. 42 కాని ఒక పేద వితంతువు వచ్చి రెండు రాగి నాణెములను ఆ పెట్టెలో వేసింది.
43 యేసు తన శిష్యులను దగ్గరకు పిలిచి, “ఇది నిజం. ఈ పేద వితంతువు ఆ పెట్టెలో అందరికన్నా ఎక్కువ డబ్బు వేసింది. 44 మిగతా వాళ్ళు తాము దాచుకొన్న ధనంలో కొంత భాగం మాత్రమే వేసారు. కాని ఆమె పేదదైనా తన దగ్గరున్నదంతా వేసింది” అని అన్నాడు.
© 1997 Bible League International