Revised Common Lectionary (Semicontinuous)
బేత్
9 యువకుడు పవిత్ర జీవితం ఎలా జీవించగలడు?
నీ ఆజ్ఞలను అనుసరించుట ద్వారానే.
10 నేను నా హృదయపూర్తిగా దేవుని సేవించుటకు ప్రయత్నిస్తాను.
దేవా, నీ ఆజ్ఞలకు విధేయుడనవుటకు నాకు సహాయం చేయుము.
11 నీ ఉపదేశాలను నేను చాలా జాగ్రత్తగా ధ్యానం చేసి నా హృదయంలో భద్రపరచుకొంటాను.
ఎందుకంటే, నేను నీకు విరోధంగా పాపం చేయను
12 యెహోవా, నీకే స్తుతి.
నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము.
13 జ్ఞానంగల నీ నిర్ణయాలను గూర్చి నేను మాట్లాడుతాను.
14 ఒకడు గొప్ప ఐశ్వర్యంలో ఆనందించేలా
నేను నీ ఆజ్ఞలు అనుసరించటంలో ఆనందిస్తాను.
15 నీ నియమాలను నేను చర్చిస్తాను.
నీ జీవిత విధానం నేను అనుసరిస్తాను.
16 నీ న్యాయ చట్టాలలో నేను ఆనందిస్తాను.
నీ మాటలు నేను మరచిపోను.
యెహోవా ప్రజలను ప్రోత్సహించటం
2 దేవుడైన యెహోవా వాక్కు ఏడవనెల ఇరవై ఒకటో రోజున హగ్గయికి వినవచ్చింది. ఆ వాక్కు ఇలా చెప్పింది: 2 ఇప్పుడు షయల్తీయేలు కుమారుడు, యూదారాజ్య పాలనాధికారి అయిన జెరుబ్బాబెలుతోను, యెహోజాదాకు కుమారుడు, ప్రధాన యాజకుడు అయిన యెహోషువాతోను, మరియు జనులందరితోను మాట్లాడి ఇలా చెప్పు: 3 “ఈ ఆలయంయొక్క గత వైభవాన్ని చూసినవారు మీలో ఎవ్వరు మిగిలారు? ఇప్పుడు మీకు ఇది ఎలా కనిపిస్తు ఉంది? చాలా సంవత్సరాలక్రితం ఉన్న ఆలయంతో పోల్చిచూస్తే, మీ కండ్లకు ఇప్పటిది ఎందుకూ పనికిరానిదిగా ఉన్నట్లు అనిపిస్తూవుందా?” 4 కాని ఇప్పుడు యెహోవా చెపుతున్నాడు, “జెరుబ్బాబెలూ! అధైర్యపడవద్దు. యెహోజాదాకు కుమారుడు, ప్రధాన యాజకడవునైన యెహోషువా! అధైర్యపడవద్దు. ఈ దేశనివాసులైన మీరందరు అధైర్యపడవద్దు అని యెహోవా చెపుతున్నాడు. ఈ పనిని కొనసాగించండి, ఎందుకంటే, నేను మీతో ఉన్నాను అని సర్వశక్తిమంతుడైన ప్రభువు ఈ విషయాలు చెప్పాడు!
5 “మీరు ఈజిప్టులోనుండి బయటికి వచ్చినప్పుడు నేను మీతో చేసిన ఒడంబడిక ప్రకారం, నా ఆత్మ మీ మధ్య ఉంది. భయపడవద్దు! 6 ఎందువల్లనంటే సర్యశక్తిమంతుడైన యెహోవా ఇది చెపుతున్నాడు! ‘కొద్ది వ్యవధిలో మరొక్కసారి పరలోకాలను, భూమిని, సముద్రాన్ని, ఎండిన నేలను కంపించేలా చేస్తాను. 7 దేశాలన్నింటినీ కుదిపివేస్తాను. వారంతా, వివిధ దేశాలలోవున్న ధనసంపదతో వస్తారు. అప్పుడు ఈ ఆలయాన్ని మహిమతో నింపుతాను.’ సర్వశక్తిమంతుడైన యెహోవా ఇది చెపుతున్నాడు. 8 ‘వెండి నాది. బంగారంనాది.’ సర్వశక్తిమంతుడైన యెహోవా ఇది చెపుతున్నాడు. 9 ‘ఈ ప్రస్తుత ఆలయంయొక్క మహిమ మొదటి ఆలయ మహిమకంటె ఇనుమడించి ఉంటుంది.’ సర్వశక్తిమంతుడైన యెహోవా ఇది చెపుతున్నాడు. ‘మరియు ఈ ప్రదేశంలో నేను శాంతి నెలకొల్పుతాను అని’ సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు!”
20 మళ్లీ తొమ్మిదవనెల, ఇరవై నాలుగవరోజు రెండవ సారి దేవుడైన యెహోవా వాక్కు హగ్గయికి వినవచ్చింది. ఆ వాక్కు ఇలా చెప్పింది: 21 “జెరుబ్బాబెలుకు చెప్పు: పరలోకాన్ని, భూమిని కదుపుతాను. 22 రాజ్యాల సింహాసనాలను తల్లక్రిందులు చేస్తాను. ఆ ఇతర రాజ్యాలవారిని నాశనం చేస్తాను. రథాలను, వాటిమీద ఉన్నవారిని పడదోస్తాను. గుర్రాలు, రౌతులు కూలిపోతారు. ఆ సైన్యాలు ప్రస్తుతం మిత్రులు. కానివాళ్లు ఒకరికొకరు ప్రతికూలులై, కత్తులతో ఒకరినొకరు పొడుచుకొని చంపుకొంటారు.” 23 సర్వశక్తిమంతుడైన యెహోవా ఇది చెపుతున్నాడు. “షయల్తీయేలు కుమారుడవు, నా సేవకుడవునైన జెరుబ్బాబెలూ, నిన్ను నేను ఎన్నుకొన్నాను. దేవుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు. ఆ సమయాన నేను నిన్నొక ముద్ర వేసే ఉంగరంగా[a] చేస్తాను. (ఈ పనులు నేను చేశానని మీరే ఋజువు.)”
సర్వశక్తిమంతుడైన యెహోవా ఇది చెపుతున్నాడు.
34 ప్రజలు, “మేము ధర్మశాస్త్రం ద్వారా ‘క్రీస్తు’ చిరకాలం ఉంటాడని విన్నాము. అలాంటప్పుడు మనుష్యకుమారుణ్ణి దేవుడు పైకెత్తుతాడని ఎట్లా అనగలుగుతున్నావు? ఈ మనుష్యకుమారుడెవరు?” అని అన్నారు.
35 అప్పుడు యేసు వాళ్ళతో, “వెలుగు మీకోసం యింకా కొంత కాలం మాత్రమే ఉంటుంది. చీకటి రాకముందే, అంటే వెలుగు ఉండగానే ప్రయాణం సాగించండి. చీకట్లో నడిచే వ్యక్తికి తానెక్కడికి వెళుతున్నాడో తెలియదు. 36 వెలుగు ఉన్నప్పుడే దాన్ని విశ్వసించండి. అప్పుడు మీరు వెలుగు యొక్క సంతానంగా లెక్కింపబడతారు” అని అన్నాడు. యేసు మాట్లాడటం ముగించాక వాళ్ళకు కనిపించకుండా ఉండాలని దూరంగా వెళ్ళిపోయాడు.
యూదులు నిరాకరించటం
37 యేసు ఇన్ని మహాత్కార్యాలు వాళ్ళ సమక్షంలో చేసినా వాళ్ళలో ఆయన పట్ల విశ్వసం కలుగలేదు. 38 ప్రవక్త యెషయా చెప్పిన ఈ వాక్యాలు నిజం కావటానికి యిలా జరిగింది:
“ప్రభూ! మా సందేశం ఎవరు విశ్వసించారు?
ప్రభువు తన శక్తిని ఎవరికి చూపాడు?”(A)
39 అందుచేత వాళ్ళు విశ్వసించలేక పోయారు. ఈ విషయాన్ని యెషయా ప్రవక్త మరొక చోట చెప్పినది నెరవేరునట్లు యిలా జరిగింది:
40 “ప్రభువు వాళ్ళ కళ్ళు కప్పి,
వాళ్ళ హృదయాలు మూసి వేశాడు.
వాళ్ళు చూడరాదని, వాళ్ళు అర్థం చేసుకోరాదని ఆయన ఉద్దేశ్యం.
అలా చేయకపోతే వాళ్ళు నా వైపు మళ్లుతారు
వాళ్ళకు నేను నయం చేయవలసివస్తుంది.”(B)
41 యెషయా యేసు మహిమను చూసాడు. కనుకనే ఆయన్ని గురించి ఆ విధంగా మాట్లాడాడు.
42 ఈ పరిస్థితుల్లో కూడా యూదుల నాయకుల్లో కొందరు యేసును విశ్వసించారు. కాని పరిసయ్యులు తమను సమాజం నుండి బహిష్కరిస్తారనే భయం వల్ల ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పలేదు. 43 ఎందుకంటే, వీళ్ళకు దేవుని మెప్పుకన్నా ప్రజల పొగడ్తలంటే ఎక్కవ యిష్టం.
యేసు బోధ జనులకు తీర్పు తీర్చును
44 యేసు, “నన్ను విశ్వసించేవాడు, నన్నే కాక నన్ను పంపిన వానియందు కూడా విశ్వసిస్తాడు. 45 అతడు నన్ను చూసేటప్పుడు నన్ను పంపిన వానిని చూస్తున్నట్లే! 46 నేను ఈ ప్రపంచంలోకి వెలుగ్గా వచ్చాను! ఎందుకంటే నన్ను విశ్వసించేవాడు చీకటిలో ఉండ కూడదని. అందుచేత నేను చెప్పే మాటలన్నీ తండ్రీ నాతో చెప్పుమని ఇచ్చిన మాటలే.
47 “ఎవడైనను నా మాటలు విని వాటిని అనుసరించని వానికి నేను తీర్పు తీర్చను. ఎందుకంటే నేను ఈ ప్రపంచానికి తీర్పు తీర్చటానికి రాలేదు, కాని నేను రక్షించటానికి వచ్చాను. 48 నన్ను, నా మాటల్ని ఇష్టపడక వ్యతిరేకించేవానిపై ఒక న్యాయాధిపతి ఉన్నాడు. నేను పలికిన మాటయే చివరి దినమున వానికి తీర్పుతీరుస్తుంది. 49 నేను నా యిష్ట ప్రకారం మాట్లాడలేదు, గాని నా తండ్రి ఏమి చెప్పుమని నాకు ఆజ్ఞాపించాడో అలాగే చెప్పాను. 50 ఆయన ఆజ్ఞ నిత్య జీవానికి నడిపిస్తుందని నాకు తెలుసు. అందుచేత నేను చెప్పే మాటలన్నీ తండ్రి నాతో చెప్పుమని ఇచ్చిన మాటలే” అని అన్నాడు.
© 1997 Bible League International