Revised Common Lectionary (Semicontinuous)
యెహోవా స్వాతంత్య్ర సందేశం
61 యెహోవా సేవకుడు చెబుతున్నాడు, నా ప్రభువు యెహోవా తన ఆత్మను నాలో ఉంచాడు. కొన్ని ప్రత్యేకమైన పనులు చేయటానికి యెహోవా నన్ను ఏర్పరచుకొన్నాడు. పేద ప్రజలకు శుభవార్త ప్రకటించుటకు, దుఃఖంలో ఉన్న మనుష్యులను ఓదార్చుటకు, స్వాతంత్య్రంలేని ప్రజలకు స్వాతంత్య్రం ప్రకటించుటకు, బలహీన ప్రజలకు నూతన బలం ఇచ్చేందుకు, 2 యెహోవా తన దయ చూపించే సమయాన్ని ప్రకటించేందుకు; దుష్టులను మన దేవుడు శిక్షించే సమయాన్ని ప్రకటించేందుకు; దుఃఖంలో ఉన్న వాళ్లను ఆదరించేందుకు; 3 దుఃఖంలో ఉన్న సీయోను వాసులకు గౌరవం చేకూర్చేందుకు (ఇప్పుడు వారికి బూడిద మాత్రమే ఉంది); సీయోను ప్రజలకు ఆనందతైలం ఇచ్చుటకు (ఇప్పుడు వారికి దుఃఖం మాత్రమే ఉంది); సీయోను ప్రజలకు దేవుని స్తుతిగీతాలు ఇచ్చుటకు (ఇప్పుడు వారికి దుఃఖం మాత్రమే ఉంది;) “మంచి వృక్షాలు” అని ఆ ప్రజలకు పేరు పెట్టుటకు; “యెహోవా అద్భుత చెట్టు” అని వారికి పేరు పెట్టుటకు.
4 పాడు చేయబడిన పాత పట్టణాలు ఆ సమయంలో మరల నిర్మించబడతాయి. ఆ పట్టణాలు మొదట్లో ఉన్నట్టే మరల నూతనంగా చేయబడతాయి. ఎన్నెన్నో సంవత్సరాలుగా పాడు చేయబడిన ఆ పట్టణాలు క్రొత్తవాటిలా చేయబడతాయి.
8 ఎందుకు ఇలా జరగుతుంది? ఎందుకంటె, నేను యెహోవాను గనుక, న్యాయం అంటే నాకు ఇష్టం గనుక. దొంగతనం, సమస్త చెడుగు నాకు అసహ్యం. కనుక ప్రజలకు తగిన శిక్ష నేను ఇస్తాను. నా ప్రజలతో శాశ్వతంగా నేను ఒక ఒడంబడిక చేసుకొన్నాను. 9 అన్ని రాజ్యాలలో ప్రతి ఒక్కరూ నా ప్రజలను తెలుసుకొంటారు. నా దేశం పిల్లలను ప్రతి ఒక్కరు తెలుసుకొంటారు. యెహోవా వారిని ఆశీర్వదించునని, వారిని చూచే ప్రతి వ్యక్తికి తెలుస్తుంది.
దేవుని సేవకుడు రక్షణను, తీసుకొనివస్తాడు
10 యెహోవా నన్ను ఎంతో ఎంతో సంతోషింపజేస్తాడు.
నా దేవునియందు నేను సంపూర్ణంగా సంతోషిస్తున్నాను.
రక్షణ వస్త్రాలతో యెహోవా నన్ను కప్పాడు.
ఆ వస్త్రాలు ఒకడు తన పెండ్లికి ధరించే వస్త్రాల్లా ఉన్నాయి.
దయ అనే పైబట్టతో యెహోవా నన్ను కప్పాడు.
ఈ పైబట్ట ఒక స్త్రీ తన పెండ్లికి ధరించే అందమైన వస్త్రాల్లా ఉంది.
11 భూమి మొక్కలను మొలిపిస్తుంది.
ప్రజలు తోటలో విత్తనాలు చల్లుతారు. ఆ తోట ఆ విత్తనాలను ఎదిగింపజేస్తుంది.
అదే విధంగా యెహోవా దయను ఎదిగింప జేస్తాడు. సకల రాజ్యాలలో యెహోవా స్తుతిని ఎదిగింప జేస్తాడు.
యాత్ర కీర్తన.
126 యెహోవా మమ్మల్ని దేశ బహిష్కరణ నుండి
తిరిగి వెనుకకు తీసుకొని వచ్చినప్పుడు అది ఒక కలలా ఉంది!
2 మేము నవ్వుకుంటున్నాము.
మరియు మేము అకస్మాత్తుగా సంతోషగానాలు పాడటం మొదలుపెట్టేవాళ్లము.
“దేవుడు ఇశ్రాయేలు ప్రజల కొరకు గొప్ప కార్యాలు చేశాడు.”
3 ఇతర రాజ్యాల ప్రజలు దాన్ని గూర్చి చెప్పుకొన్నారు. “ఇశ్రాయేలు ప్రజల కోసం యెహోవా మాకు ఆశ్చర్యకరమైన పనులు చేశాడు” అని ఆ ప్రజలు చెప్పారు. మేము చాలా ఆనందంగా ఉన్నాము!
4 యెహోవా మేము ఖైదీలముగా ఉన్నాము.
ఇప్పుడు ఎడారిని వికసింప చేసే నీటి ప్రవాహంలా మమ్మల్ని తిరిగి స్వతంత్రులుగా చేయుము.
5 విత్తనాలు నాటేటప్పుడు ఒకడు దుఃఖముగా ఉండవచ్చు,
కాని పంట కూర్చుకొనేటప్పుడు సంతోషంగా ఉంటాడు.
6 అతడు బయట పొలాల్లోనికి విత్తనం మోసికొని పోవునప్పుడు ఏడ్వవచ్చు,
కాని పంటను ఇంటికి తెచ్చునప్పుడు అతడు సంతోషిస్తాడు.
మరియ పాడిన భక్తి గీతం
46 మరియ ఈ విధంగా అన్నది:
47 “నా ఆత్మ ప్రభువును కొలిచింది.
దేవుడు చేసిన ఈ మంచికి నా మనస్సు ఆనందం పొందింది. ఆయనే నా రక్షకుడు.
48 దీనురాల్ని నేను!
ఆయన దాసీని నేను, నన్ను కరుణించాడు!
ఇకనుండి అందరూ
నన్ను ధన్యురాలంటారు!
49 దేవుడు సర్వశక్తి సంపన్నుడు.
ఆయన నాకు ఎంతో మంచి చేశాడు! ఆయన నామం పవిత్రం!
50 తనంటే భయపడే వాళ్ళపై తరతరాలు దయ చూపుతాడు.
51 తన బలమైన హస్తాన్ని జాపి
గర్వించే వాళ్ళను వాళ్ళ ఆలోచనల్ని అణిచి వేస్తాడు.
52 రాజుల్ని, వాళ్ళ సింహాసనాల నుండి దింపి వేస్తాడు.
దీనులకు గొప్ప స్థానాలిస్తాడు.
53 పేదవాళ్ళ అవసరాలన్నీ తీరుస్తాడు.
ధనవంతుల్ని వట్టి చేతుల్తో పంపేస్తాడు.
54 తరతరాల నుండి మన పూర్వీకులతో, అబ్రాహాముతో,
అతని సంతతితో చెప్పినట్లు
55 దేవుని ఇష్టానుసారం జీవించిన ఇశ్రాయేలు ప్రజలకు సహాయం చేశాడు. మరవకుండా వాళ్ళపై దయ చూపాడు.”
16 ఎప్పుడూ ఆనందంగా వుండండి. విడువకుండా ప్రార్థించండి. 17 దైవ నియమాన్ని తప్పక పాటించండి. 18 అన్ని వేళలా దేవునికి కృతజ్ఞతతో ఉండండి. యేసు క్రీస్తు వల్ల కలిగిన జీవితంలో మీరు ఈ విధంగా ఉండాలని దేవుని కోరిక.
19 ఆత్మ వెలిగించిన జ్యోతిని ఆర్పివేయకండి. 20 ప్రవక్తలు చెప్పినవాటిని తూలనాడకండి. 21 అన్నిటినీ పరీక్షించండి. మంచిని విడువకండి. 22 చెడుకు దూరంగా ఉండండి.
23 శాంతిని ప్రసాదించే ఆ దేవుడు మిమ్మల్ని పూర్తిగా పవిత్రం చెయ్యనీయండి. మన యేసు క్రీస్తు ప్రభువు వచ్చేరోజు, మీ అంతరాత్మ, ప్రాణం, దేహం ఏ అపకీర్తి లేకుండా ఉండుగాక! 24 మిమ్మల్ని పిలిచేవాడు విశ్వసింపదగ్గవాడు. ఆయన మేము కోరింది తప్పక చేస్తాడు.
6 దేవుడు ఒక వ్యక్తిని పంపాడు. అతని పేరు యోహాను. 7 తన ద్వారా మానవులు వెలుగును గురించి విని, విశ్వసించాలని అతడు ఆ వెలుగును గురించి చెప్పటానికి వచ్చాడు. 8 అతడు ఆ వెలుగు కాదు. ఆ వెలుగును గురించి చెప్పటానికి వచ్చిన సాక్షి మాత్రమే అతడు.
బాప్తిస్మము నిచ్చిన యోహాను యొక్క సందేశము
(మత్తయి 3:1-12; మార్కు 1:1-8; లూకా 3:1-9, 15-17)
19 యోహానును అడిగి, అతడెవరన్న విషయం కనుక్కురావటానికి, యెరూషలేములోని యూదులు యాజకులను లేవీయులను[a] అతని దగ్గరకు పంపారు. 20 యోహాను సమాధానం చెప్పటానికి నిరాకరించలేదు. పైగా ఏదీ దాచకుండా స్పష్టంగా సమాధానం చెప్పాడు. యోహాను, “నేను క్రీస్తును[b] కాదు!” అని చెప్పాడు.
21 వాళ్ళు అతణ్ణి, “మరి నీవెవరు? ఏలీయావా?” అని అడిగారు.
అతడు, “కాదు” అని అన్నాడు.
వాళ్ళు, “ప్రవక్తవా?” అని అడిగారు.
అతడు, “కాదు” అని అన్నాడు.
22 చివరకు వాళ్ళు, “మరి నీవెవరవు? మమ్మల్ని పంపిన వాళ్ళకు చెప్పటానికి మాకో సమాధానం చెప్పండి. మమ్మల్ని పంపిన వాళ్ళకు చెప్పటానికి నీ గురించి నీవేమని చెప్పుచున్నావు?” అని అడిగారు.
23 యోహాను యిలా సమాధానం చెప్పాడు:
“ప్రభువు కోసం చక్కటి మార్గం వేయుమని ఎడారి ప్రాంతాల్లో
ఒక స్వరం ఎలుగెత్తి పలికింది.”(A)
ఇవి యెషయా ప్రవక్త అన్న మాటలు.
24 వీళ్ళను పంపింది పరిసయ్యులు. 25 వాళ్ళు మరొక ప్రశ్న వేస్తూ, “నీవు క్రీస్తువు కానంటున్నావు, ఏలీయావుకానంటున్నావు, ప్రవక్తవుకానంటున్నావు. అటువంటప్పుడు నీవు ప్రజలకు బాప్తిస్మము ఎందుకిస్తున్నావు?” అని అడిగారు.
26 యోహాను సమాధానం చెబుతూ, “నేను నీళ్ళ ద్వారా బాప్తిస్మము యిస్తున్నాను. కాని మీరెరుగని వాడొకాయన మీ మధ్య ఉన్నాడు. 27 నా తర్వాత రానున్నవాడు ఆయనే. ఆయన చెప్పులు విప్పటానికి కూడా నేను తగను” అని అన్నాడు.
28 ఈ సంఘటనలన్నీ బేతనియ గ్రామంలో జరిగాయి. అది యోహాను బాప్తిస్మము ఇచ్చిన యొర్దాను నదికి అవతల వైపున ఉంది.
© 1997 Bible League International