Revised Common Lectionary (Semicontinuous)
ఇశ్రాయేలు శిక్ష ముగుస్తుంది
40 మీ దేవుడు చెబుతున్నాడు,
“ఆదరించండి, నా ప్రజలను ఆదరించండి!
2 యెరూషలేముతో దయగా మాట్లాడండి.
‘నీ సేవాసమయం అయిపోయింది
నీ పాపాలకు విలువ నీవు చెల్లించావు’ అని యెరూషలేముతో చెప్పండి
యెరూషలేము చేసిన ప్రతి పాపానికి రెండేసి సార్లు యెహోవా యెరూషలేమును శిక్షించాడు.”
3 వినండి! ఒక మనిషి గట్టిగా ఎడారిలో బోధిస్తున్న శబ్దం మీరు వినగలరు.
“యెహోవా మార్గాన్ని సిద్ధం చేయండి.
ఎడారిలో మన దేవుని కోసం తిన్ననిదైన ఒక రాజమార్గాన్ని వేయండి.
4 ప్రతి లోయనూ పూడ్చండి
ప్రతి పర్వతాన్ని కొండను చదును చేయండి.
వంకర మార్గాలను చక్కగా చేయండి.
కరకు నేలను సమనేలగా చేయండి.
5 అప్పుడు యెహోవా మహిమ కనబడుతుంది
మనుష్యులందరూ కలిసి యెహోవా మహిమను చూస్తారు.
సాక్షాత్తూ యెహోవాయే ఈ సంగతులు చెప్పాడు కనుక ఇది జరుగుతుంది.”
6 ఒక స్వరం పలికింది, “మాట్లాడు” అని.
కనుక ఆ మనిషి అన్నాడు, “నేనేమి చెప్పను?”
ఆ స్వరం అంది, “ఇలా చెప్పు: మనుష్యులు అందరూ గడ్డిలా ఉన్నారు.
మనుష్యుల మంచి తనం క్రొత్త గడ్డి పరకలా ఉంది.
7 యెహోవా నుండి ఒక బలమైన గాలి గడ్డిమీద వీస్తుంది.
ఆ గడ్డి ఎండిపోయి, చస్తుంది.
సత్యం ఏమిటంటే: మనుష్యులంతా గడ్డి.
8 గడ్డి చచ్చిపోయి ఎండిపోతుంది.
కానీ మన దేవుని మాటలు శాశ్వతంగా నిలిచి ఉంటాయి.”
రక్షణః దేవుని శుభ వార్త
9 సీయోనూ, నీవు చెప్పాల్సిన శుభవార్త ఉంది.
ఎత్తయిన పర్వతం మీదకు ఎక్కి గట్టిగా ప్రకటించు.
యెరూషలేమూ, నీవు చెప్పాల్సిన శుభవార్త ఉంది.
భయపడవద్దు. గట్టిగా మాట్లాడు.
యూదా పట్టణాలన్నింటికి ఈ విషయాలు చెప్పు:
“చూడు, ఇదిగో మీ దేవుడు!
10 చూడు, యెహోవా, నా ప్రభువు శక్తితో వస్తున్నాడు.
మనుష్యులందరినీ పాలించుటకు ఆయన తన శక్తిని ప్రయోగిస్తాడు.
యెహోవా తన ప్రజలకు ప్రతిఫలం తెస్తాడు.
వారి జీతం యెహోవా దగ్గర ఉంది.
11 గొర్రెల కాపరి తన గొర్రెలను నడిపించినట్టు యెహోవా తన ప్రజలను నడిపిస్తాడు.
యెహోవా తన హస్తాన్ని (శక్తిని) ఉపయోగించి తన గొర్రెలను ఒక చోట చేరుస్తాడు.
గొర్రెపిల్లలను యెహోవా పట్టుకొని వాటిని ఆయన తన చేతుల్లో ఎత్తుకొంటాడు. వాటి తల్లులు ఆయన చెంత నడుస్తాయి.”
సంగీత నాయకునికి: కోరహు కుమారుల స్తుతి కీర్తన
85 యెహోవా, నీ దేశం మీద దయ చూపించుము.
యాకోబు ప్రజలు విదేశంలో ఖైదీలుగా ఉన్నారు. ఖైదీలను తిరిగి వారి దేశానికి తీసుకొని రమ్ము.
2 యెహోవా, నీ ప్రజలను క్షమించుము!
వారి పాపాలు తుడిచివేయుము.
8 దేవుడు చెప్పేది నేను వింటున్నాను.
తన ప్రజలకు శాంతి కలుగుతుందని యెహోవా చెబుతున్నాడు.
ఆయన అనుచరులు వారి అవివేక జీవిత విధానాలకు తిరిగి వెళ్లకపోతే వారికి శాంతి ఉంటుంది.
9 దేవుడు తన అనుచరులను త్వరలో రక్షిస్తాడు.
మేము త్వరలోనే మా దేశంలో గౌరవంగా బ్రతుకుతాము.
10 దేవుని నిజమైన ప్రేమ ఆయన అనుచరులకు లభిస్తుంది.
మంచితనం, శాంతి ఒకదానితో ఒకటి ముద్దు పెట్టుకొంటాయి.
11 భూమి మీద మనుష్యులు దేవునికి నమ్మకంగా ఉంటారు.
పరలోకపు దేవుడు వారికి మేలు అనుగ్రహిస్తాడు.
12 యెహోవా మనకు అనేకమైన మంచివాటిని ఇస్తాడు.
భూమి అనేక మంచి పంటలను ఇస్తుంది.
13 మంచితనం దేవునికి ముందర నడుస్తూ
ఆయన కోసం, దారి సిద్ధం చేస్తుంది.
8 కాని ప్రియమైన సోదరులారా! ఈ విషయాన్ని మరచిపోకండి. ప్రభువుకు ఒక రోజు వెయ్యి సంవత్సరాలుగాను, వెయ్యి సంవత్సరాలు ఒక రోజుగాను ఉంటాయి[a] 9 ప్రభువు ఆలస్యం చేస్తున్నాడని కొందరు అనుకుంటారు. కాని, ఆయన తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవటంలో ఆలస్యం చెయ్యడు. ఎవ్వరూ నాశనం కాకూడదని, అందరూ మారుమనస్సు పొందాలని ఆయన ఉద్దేశ్యం. అందుకే ఆయన మీపట్ల సహనం వహిస్తున్నాడు.
10 కాని ప్రభువు రానున్న దినం ఒక దొంగలా వస్తుంది. ఆ రోజు ఆకాశాలు గర్జిస్తూ మాయమైపోతాయి. ఆకాశాల్లో ఉన్నవన్నీ మంటల్లో కాలి నాశనమై పోతాయి. పృథ్వి, దానిలో ఉన్న సమస్త వస్తువులూ కాలిపోతాయి. 11 అన్నీ ఈ విధంగా నాశనమైపోతాయి కనుక దేవుని ప్రజలై పవిత్రంగా జీవించటం ఎంత అవసరమో గ్రహించండి. 12 దేవుని దినం రావాలని మీరు ఎదురు చూస్తున్నారు కనుక ఆ దినం త్వరలోనే రావాలని మీరు ఆశించాలి. ఆ రోజు వచ్చి ఆకాశాలను మంటలతో నాశనం చేస్తుంది. ఆ వేడికి పరమాణువులు కరిగి పోతాయి. 13 దేవుడు వాగ్దానం చేసిన క్రొత్త ఆకాశంలో క్రొత్త భూమిపై నీతి నివసిస్తుంది. వాటికోసమే మనం ఎదురు చూస్తున్నాం.
14 ప్రియ సోదరులారా! మీరు వీటికోసం ఎదురు చూస్తున్నారు గనుక మీలో ఏ దోషమూ, కళంకమూ లేకుండా ఉండేటట్లు అన్నివిధాల ప్రయత్నం చెయ్యండి. శాంతం వహించండి. 15 మన ప్రభువు యొక్క సహనము మనకు రక్షణను యిస్తుందని గ్రహించండి. దేవుడు యిచ్చిన విజ్ఞానంతో మన ప్రియమిత్రుడు పౌలు మీకు ఈ విషయాల్ని గురించి వ్రాసాడు.
యోహాను బోధించటం
(మత్తయి 3:1-12; లూకా 3:1-9, 15-17; యోహాను 1:19-28)
1 దేవుని కుమారుడైన[a] యేసు క్రీస్తును గురించి సువార్త ప్రారంభం. 2 యెషయా ప్రవక్త వ్రాసిన గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది:
“ఇతడు నా దూత. ఇతణ్ణి నీకన్నా ముందు పంపుతాను,
ఇతడు నీ కోసం దారి సిద్ధం చేస్తాడు.”(A)
3 “‘ప్రభువు మార్గాన్ని సిద్ధం చేయుము,
అతని కోసం చక్కటిదారుల్ని, వేయుము’
అని అరణ్య ప్రాంతంలో ఒక వ్యక్తి కేక వేయుచున్నాడు.”(B)
4 కనుక యోహాను ప్రజలకు ఎడారి ప్రాంతంలో బాప్తిస్మమిచ్చాడు. పాపపరిహారార్థం మారుమనస్సు పొందటం, బాప్తిస్మము పొందటం అవసరమని వాళ్ళకు ప్రకటించాడు. 5 యూదయ దేశంలోని ప్రజలు, యెరూషలేములోని ప్రజలు అతని దగ్గరకు వెళ్ళారు. తాము చేసిన పాపాలను చెప్పుకొన్నారు. అతడు వాళ్ళకు యొర్దాను నదిలో బాప్తిస్మం[b] ఇచ్చాడు.
6 యోహాను ఒంటె వెంట్రుకలతో చేసిన దుస్తుల్ని వేసుకొనేవాడు. నడుముకు తోలుదట్టి కట్టుకొనేవాడు. మిడుతల్ని, అడవి తేనెను తింటూ జీవించేవాడు.
7 అతడు ప్రకటించిన సందేశం ఇది, “నా తర్వాత నాకన్నా శక్తివంతుడైన వాడు వస్తాడు. నేను వంగి అతని చెప్పులు విప్పే అర్హత కూడా నాకు లేదు. 8 నేను మీకు నీళ్ళతో బాప్తిస్మము యిస్తున్నాను. కాని ఆయన మీకు పవిత్రాత్మతో బాప్తిస్మమిస్తాడు.”
© 1997 Bible League International