Revised Common Lectionary (Semicontinuous)
ఇస్సాకు కుటుంబం
19 ఇస్సాకు కుటుంబం చరిత్ర ఇది. అబ్రాహాముకు ఇస్సాకు అనే కుమారుడు ఉన్నాడు. 20 ఇస్సాకు వయస్సు 40 సంవత్సరాలు ఉన్నప్పుడు రిబ్కాను అతడు వివాహం చేసుకొన్నాడు. రిబ్కా పద్దనరాముకు చెందినది. ఆమె బెతూయేలు కుమార్తె, అరామీయుడగు లాబానుకు సోదరి. 21 ఇస్సాకు భార్యకు పిల్లలు పుట్టలేదు. కనుక ఇస్సాకు తన భార్య కోసం ప్రార్థించాడు. ఇస్సాకు ప్రార్థన యెహోవా విన్నాడు. రిబ్కాను గర్భవతిని కానిచ్చాడు.
22 రిబ్కా గర్భవతిగా ఉన్నప్పుడు, ఆమె గర్భంలో కవల పిల్లలు పెనుగులాడారు. రిబ్కా యెహోవాను ప్రార్థించి, “ఎందుకు నాకు ఇలా జరిగింది?” అని అడిగింది. 23 ఆమెతో యెహోవా చెప్పాడు:
“నీ గర్భంలో రెండు
జనాంగాలు ఉన్నాయి.
రెండు వంశాల పాలకులు నీలోనుండి పుడతారు.
కాని వారు విభజించబడతారు.
ఒక కుమారుడు మరో కుమారుని కంటే బలవంతుడుగా ఉంటాడు.
పెద్ద కుమారుడు చిన్న కుమారుని సేవిస్తాడు.”
24 తగిన సమయం రాగానే రిబ్కా కవల పిల్లల్ని కన్నది. 25 మొదటి శిశువు ఎరుపు. వాని చర్మం బొచ్చు అంగీలా ఉంది. కనుక వానికి ఏశావు[a] అని పేరు పెట్టబడింది. 26 రెండవ శిశువు పుట్టినప్పుడు వాడు ఏశావు మడిమను గట్టిగా పట్టుకొని ఉన్నాడు. కనుక ఆ శిశువుకు యాకోబు[b] అని పేరు పెట్టబడింది. యాకోబు, ఏశావు పుట్టినప్పుడు ఇస్సాకు వయస్సు 60 సంవత్సరాలు.
27 అబ్బాయిలు పెద్దవాళ్లయ్యారు. ఏశావు నిపుణతగల వేటగాడయ్యాడు. బయట పొలాల్లో ఉండటం అంటే అతనికి చాలా ఇష్టం. అయితే యాకోబు నెమ్మదిపరుడు. అతను తన గుడారంలోనే ఉన్నాడు. 28 ఇస్సాకు ఏశావును చాలా ప్రేమించాడు. ఏశావు వేటాడిన జంతువులను తినటం అతనికి ఇష్టం. కాని రిబ్కాకు యాకోబు మీద ప్రేమ.
29 ఒకసారి ఏశావు వేటనుండి తిరిగి వచ్చాడు. అతను అలసిపోయి, ఆకలితో బలహీనంగా ఉన్నాడు. యాకోబు వంట పాత్రలో చిక్కుడుకాయలు వండుతున్నాడు. 30 కనుక ఏశావు, “నేను ఆకలితో నీరసం అయిపోయాను. ఆ ఎర్రటి చిక్కుడు కాయలు నాకు కొంచెం పెట్టు” అని యాకోబును అడిగాడు. (అందుకే ప్రజలు అతణ్ణి ఎదోం[c] అని పిలిచేవాళ్లు.)
31 అయితే యాకోబు, “నీ జ్యేష్ఠత్వపు జన్మ హక్కుల్ని ఈ వేళ నాకు అమ్మివేయాలి” అన్నాడు.
32 ఏశావు “నేను ఆకలితో దాదాపు చచ్చాను. నేను చనిపోతే, నా తండ్రి ఐశ్వర్యాలన్నీ నాకు సహాయపడవు. కనుక నా వాటా నీకు ఇచ్చేస్తాను” అన్నాడు.
33 కానీ యాకోబు, “దాన్ని నాకు ఇస్తానని ముందు ప్రమాణం చేయాలి” అన్నాడు. కనుక ఏశావు యాకోబుకు ప్రమాణం చేశాడు. తన తండ్రి ఐశ్వర్యంలో తన వాటాను ఏశావు యాకోబుకు అమ్మివేశాడు. 34 అప్పుడు యాకోబు రొట్టె, భోజనం ఏశావుకు ఇచ్చాడు. ఏశావు తిని, త్రాగి వెళ్లిపోయాడు. కనుక ఏశావు తన జ్యేష్ఠత్వపు హక్కులను లక్ష్యపెట్ట లేదని వ్యక్తం చేశాడు.
నూన్
105 యెహోవా, నీ వాక్యాలు
నా బాటను వెలిగించే దీపాల్లా ఉన్నాయి.
106 నీ న్యాయ చట్టాలు మంచివి.
నేను వాటికి విధేయుడనవుతానని వాగ్దానం చేస్తున్నాను. మరియు నా వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాను.
107 యెహోవా, నేను చాలాకాలం శ్రమ అనుభవించాను.
దయచేసి ఆజ్ఞయిచ్చి, నన్ను మరల జీవించనిమ్ము!
108 యెహోవా, నా స్తుతి అంగీకరించు.
నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము.
109 నా జీవితం ఎల్లప్పుడూ ప్రమాదంలోనే ఉంది.
కాని యెహోవా, నేను నీ ఉపదేశాలు మరచిపోలేదు.
110 దుర్మార్గులు నన్ను ఉచ్చులో పట్టాలని ప్రయత్నించారు
కాని నేను నీ ఆజ్ఞలకు అవిధేయుడను కాలేదు.
111 యెహోవా, శాశ్వతంగా నేను నీ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తాను.
అది నన్ను ఎంతో సంతోషింపజేస్తుంది.
112 నీ ఆజ్ఞలు అన్నిటికీ విధేయుడనగుటకు
నేను ఎల్లప్పుడూ కష్టపడి ప్రయత్నిస్తాను.
ఆత్మ ద్వారా జీవము
8 అందువల్ల, ప్రస్తుతం యేసు క్రీస్తులో ఐక్యత పొంది జీవిస్తున్న వాళ్ళకు దేవుడు శిక్ష విధించడు. 2 దేవుని ఆత్మ మనం యేసు క్రీస్తుతో ఐక్యత పొందటంవల్ల మనలో జీవాన్ని కలుగచేశాడు. ఆ ఆత్మ యొక్క నియమం మన పాపానికి, మరణానికి చెందిన నియమం నుండి నాకు విముక్తి కలిగించింది. 3 ధర్మశాస్త్రం అన్నీ చెయ్యలేక పోయింది. పాపస్వభావం దాన్ని బలహీనంచేసింది. అందువల్ల దేవుడు తన కుమారుణ్ణి పాపాలు చేసే మానవుని రూపంలో పాపాలకు బలిగా పంపాడు. ఆయన వచ్చి మానవునిలో ఉన్న పాపాలకు శిక్ష విధించాడు. 4 ధర్మశాస్త్రం ఆదేశించిన నీతికార్యాలు మన ద్వారా జరగాలని ఆయన ఉద్దేశ్యం. మనము పాపస్వభావంతో జీవించటంలేదు. పరిశుద్ధాత్మ చెప్పినట్లు జీవిస్తున్నాము.
5 ప్రాపంచికంగా జీవించేవాళ్ళ మనస్సు ప్రాపంచిక విషయాలకు లోనై వుంటుంది. కాని దేవుని ఆత్మ చెప్పినట్లు జీవించేవాళ్ళ మనస్సు ఆ ఆత్మకు సంబంధించిన విషయాలకు లోనై ఉంటుంది. 6 ప్రాపంచిక విషయాలకు లోనవటంవల్ల మరణం సంభవిస్తుంది. కాని పరిశుద్ధాత్మకు లోనవటంవల్ల జీవం. శాంతం లభిస్తాయి. 7 ఎందుకంటే, ప్రాపంచిక విషయాలకు లోనైనవాని మనస్సు దేవుణ్ణి ద్వేషిస్తుంది. అలాంటి మనస్సు దేవుని ధర్మశాస్త్రానికి ఆధీనమై ఉండదు. ఉండజాలదు. 8 ప్రాపంచికంగా జీవించేవాళ్ళు దేవుని మెప్పుపొందలేరు.
9 దేవుని ఆత్మ మీలో నిజంగా నివసిస్తున్నట్లైతే, మీరు ఈ లోక సంబంధంగా జీవించటంలేదన్నమాట. అంటే మీరు ఆత్మీయంగా జీవిస్తున్నారన్నమాట. క్రీస్తు యొక్క ఆత్మ తనలో లేనివాడు క్రీస్తుకు చెందడు. 10 ఒకవేళ క్రీస్తు మీలో జీవిస్తున్నట్లైతే పాపం కారణంగా మీ శరీరం చనిపోయినా మీలో వున్న దేవుడు మిమ్మల్ని నీతిమంతులుగా చేసాడు కనుక, ఆయన ఆత్మ మీకు జీవాన్నిస్తాడు. 11 మరణించిన యేసును దేవుడు లేపినాడు. దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నట్లైతే, నశించిపోయే మీ దేహాలకు ఆయన జీవం పోస్తాడు. మృతి నుండి యేసును లేపినవాడు దేవుడే కావున మీలో నివసిస్తున్న ఆయన ఆత్మద్వారా దేవుడు మీ శరీరాలను జీవింపచేస్తాడు.
రైతు విత్తనాలు చల్లుటను గురించిన ఉపమానం
(మార్కు 4:1-9; లూకా 8:4-8)
13 అదే రోజు యేసు ఇంటి నుండి వెళ్ళి సరస్సు ప్రక్కన కూర్చున్నాడు. 2 ఆయన చుట్టు పెద్ద ప్రజల గుంపు సమావేశమైంది. అందువల్ల ఆయన పడవనెక్కి కూర్చున్నాడు. ప్రజలు సరస్సు ఒడ్డున నిలుచున్నారు. 3 ఆయన వాళ్ళకు ఎన్నో విషయాలు ఉపమానాలు చెబుతూ బోధించాడు,
“ఒక రైతు విత్తనాలు చల్లటానికి వెళ్ళాడు. 4 అతడు విత్తనాలు చల్లుతుండగా కొన్ని విత్తనాలు దారి ప్రక్కన పడ్డాయి. పక్షులు వచ్చి వాటిని తినివేసాయి. 5 మరి కొన్ని విత్తనాలు మట్టి ఎక్కువగా లేని రాతి నేలపై పడ్డాయి. మట్టి ఎక్కువగా లేనందున అవి త్వరగా మొలకెత్తాయి. 6 కాని సూర్యోదయమయ్యాక ఆ మొక్కలు వాడి పొయ్యాయి. వాటివేర్లు పెరగనందువల్ల అవి ఎండిపొయ్యాయి. 7 మరి కొన్ని విత్తనాలు ముండ్ల మొక్కల మధ్య పడ్డాయి. ఈ ముళ్ళ మొక్కలు పెరిగి ధాన్యపు మొక్కల్ని అణిచి వేసాయి. 8 మరి కొన్ని విత్తనాలు సారవంతమైన నేలపై బడ్డాయి. వాటిలో కొన్ని నూరు రెట్ల పంటను, కొన్ని అరవై రెట్ల పంటను, కొన్ని ముప్పైరెట్ల పంటనిచ్చాయి. 9 వినేవాళ్లు వినండి!”
యేసు విత్తనము యొక్క ఉపమానమును వివరించటం
(మార్కు 4:13-20; లూకా 8:11-15)
18 “మరి విత్తనాన్ని చల్లే రైతు ఉపమానాన్ని గురించి వినండి.
19 “కొందరు దేవుని రాజ్యాన్ని గురించి వింటారు. కాని అర్థం చేసుకోరు. అలాంటి హృదయాల్లో నాటబడిన దైవ సందేశాన్ని సైతాను తీసుకు వెళ్తాడు. వీళ్ళను రహదారి ప్రక్కనపడిన విత్తనాలతో పోల్చవచ్చు.
20 “దైవ సందేశాన్ని విని వెంటనే ఆనందంగా అంగీకరించే వాళ్ళను రాతి నేలపైబడ్డ విత్తనాలతో పోల్చవచ్చు. 21 అలాంటి విత్తనాలకు వేర్లు ఉండవు. కనుక అవి చాలాకాలం బ్రతుకవు. సందేశం వలన కష్టాలుకాని హింసలు కాని సంభవించినప్పుడు వాళ్ళు వెంటనే దాన్ని వదలి వేస్తారు.
22 “దైవ సందేశాన్ని విని జీవితంలోని కష్టాలకు, ధనంవలన కలిగే మోసానికి ఉక్కిరి బిక్కిరై, నిష్పలులై పోయే వాళ్ళను ముళ్ళ మొక్కల్లో పడిన విత్తనాలతో పోల్చవచ్చు.
23 “దైవ సందేశాన్ని విని దాన్ని అర్ధం చేసుకొనే వాళ్ళను సారవంతమైన భూమిలో పడ్డ విత్తనాలతో పోల్చవచ్చు. వాటిలో కొన్ని నూరురెట్లు పంటను, కొన్ని అరవై రెట్లు పంటను, కొన్ని ముప్పైరెట్లు పంటను యిస్తాయి.”
© 1997 Bible League International