Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 35:11-28

11 ఒక సాక్షి సమూహం నాకు హాని చేయాలని తలుస్తున్నది.
    ఆ మనుష్యులు నన్ను ప్రశ్నలు అడుగుతారు. వాళ్లు దేనిని గూర్చి మాట్లాడుకొంటున్నారో నాకు తెలియదు.
12 నేను మంచి పనులు మాత్రమే చేశాను.
    కాని ఆ మనుష్యులు నాకు చెడ్డవాటినే చేస్తారు. వారు నా ప్రాణం తీయుటకు పొంచియుంటారు.
13 ఆ మనుష్యులు రోగులుగా ఉన్నప్పుడు నేను వారిని గూర్చి విచారించాను.
    ఉపవాసం ఉండుట ద్వారా నా విచారం వ్యక్తం చేశాను.
    నా ప్రార్థనకు జవాబు లేకుండా పోయింది.
14 ఆ మనుష్యుల కోసం విచార సూచక వస్త్రాలు నేను ధరించాను. ఆ మనుష్యులను నా స్నేహితులుగా, లేక నా సోదరులుగా నేను భావించాను.
    ఒకని తల్లి చనిపోయినందుకు ఏడుస్తున్న మనిషిలా నేను దుఃఖించాను. ఆ మనుష్యులకు నా విచారాన్ని తెలియజేసేందుకు నేను నల్లని వస్త్రాలు ధరించాను. దుఃఖంతో నేను నా తల వంచుకొని నడిచాను.
15 అయితే నేను ఒక తప్పు చేసినప్పుడు ఆ మనుష్యులే నన్ను చూసి నవ్వారు.
    ఆ మనుష్యులు నిజంగా స్నేహితులు కారు.
కొందరు నా చుట్టూరా చేరి, నా మీద పడ్డారు.
    వాళ్లను నేను కనీసం ఎరుగను.
16 వాళ్లు దుర్భాషలు మాట్లాడి, నన్ను హేళన చేసారు.
    ఆ మనుష్యులు పళ్లు కొరికి నా మీద కోపం చూపారు.

17 నా ప్రభువా, ఎన్నాళ్లు ఇలా చెడు కార్యాలు జరుగుతూండటం చూస్తూ ఉంటావు?
    ఆ మనుష్యులు నన్ను నాశనం చేయాలని చూస్తున్నారు. యెహోవా, నా ప్రాణాన్ని రక్షించుము.
    ఆ దుర్మార్గుల బారి నుండి నా ప్రియ జీవితాన్ని రక్షించుము. వాళ్లు సింహాల్లా ఉన్నారు.

18 యెహోవా, మహా సమాజంలో నేను నిన్ను స్తుతిస్తాను.
    నేను పెద్ద సమూహంతో ఉన్నప్పుడు నిన్ను స్తుతిస్తాను.
19 అబద్ధాలు పలికే నా శత్రువులు నవ్వుకోవటం కొనసాగదు.
    నా శత్రువులు వారి రహస్య పథకాల నిమిత్తం తప్పక శిక్షించబడతారు.
20 నా శత్రువులు నిజంగా శాంతికోసం ప్రయత్నాలు చేయటంలేదు.
    శాంతియుతంగా ఉన్న ప్రజలకు చెడుపు చేయాలని వారు రహస్యంగా పథకాలు వేస్తున్నారు.
21 నన్ను గూర్చి నా శత్రువులు చెడు విషయాలు చెబుతున్నారు.
    వారు అబద్ధాలు పలుకుతూ, “ఆహా, నీవేమి చేస్తున్నావో మాకు తెలుసులే అంటారు.”
22 యెహోవా, జరుగుతున్నది ఏమిటో నీకు తప్పక తెలుసు.
    కనుక మౌనంగా ఉండవద్దు.
    నన్ను విడిచిపెట్ట వద్దు.
23 యెహోవా, మేలుకో! లెమ్ము!
    నా దేవా, నా యెహోవా నా పక్షంగా పోరాడి నాకు న్యాయం చేకూర్చుము.
24 యెహోవా, నా దేవా, నీ న్యాయంతో నాకు తీర్పు తీర్చుము.
    ఆ మనుష్యులను నన్ను చూచి నవ్వనీయ వద్దు.
25 “ఆహా! మాకు కావాల్సింది మాకు దొరికి పోయింది” అని ప్రజలు చెప్పుకోకుండా చేయుము.
    “యెహోవా, మేము అతణ్ణి నాశనం చేశాము” అని వాళ్లు చెప్పుకోకుండా చేయుము.
26 నా శత్రువులు అందరూ నిరాశచెంది, ఒక్కుమ్మడిగా సిగ్గుపడేలా చేయుము.
    నాకు కీడు జరిగినప్పుడు ఆ మనుష్యులు సంతోషించారు.
తాము నాకంటె మేలైనవారము అని వారు తలంచారు.
    కనుక ఆ మనుష్యుల్ని అవమానంతోను, సిగ్గుతోను నింపి వేయుము.
27 నీతిని ప్రేమించే మనుష్యులారా,
    మీరు సంతోషించండి.
ఎల్లప్పుడూ ఈ మాటలు చెప్పండి: “యెహోవా గొప్పవాడు. ఆయన తన సేవకునికి ఉత్తమమైనదాన్ని కోరుతాడు.”

28 యెహోవా, నీవు ఎంత మంచివాడివో ప్రజలకు చెబుతాను.
    నేను ప్రతి దినము స్తుతిస్తాను.

నిర్గమకాండము 35:1-29

సబ్బాతు నియమాలు

35 ఇశ్రాయేలు ప్రజలందర్నీ మోషే సమావేశ పర్చాడు. మోషే వారితో చెప్పాడు: “మీరు చేయాలని యెహోవా ఆజ్ఞాపించిన విషయాలు నేను మీకు చెబుతాను.

“పని చేయడానికి ఆరు రోజులున్నాయి. అయితే ఏడో రోజు మీకు చాల ప్రత్యేకమైన విశ్రాంతి రోజు. ఆ ప్రత్యేక దినాన విశ్రాంతి తీసుకోవడంవల్ల మీరు యెహోవాను ఘనపరుస్తారు. ఏడో రోజున పనిచేసే వ్యక్తిని చంపెయ్యాలి. సబ్బాతు రోజున మీరు నివసించే స్థలాల్లో నిప్పు కూడ రాజబెట్టకూడదు.”

పవిత్ర గుడారము కొరకు వస్తువులు

ఇశ్రాయేలు ప్రజలందరితో మోషే ఇలా చెప్పాడు: “యెహోవా ఆజ్ఞాపించినది ఇదే. యెహోవా కోసం ప్రత్యేక కానుకలు సమకూర్చండి. మీరు ఏమి ఇస్తారో మీలో ప్రతి ఒక్కరూ మీ హృదయంలో తీర్మానం చేసుకోవాలి. అప్పుడు ఆ కానుక యెహోవా కోసం తీసుకుని రావాలి. బంగారం, వెండి, ఇత్తడి. నీలం, ధూమ్ర వర్ణం, ఎరుపు బట్ట, శ్రేష్ఠమైన సన్నటి బట్ట, మేక బొచ్చు. ఎరుపు రంగు వేసిన గొర్రె తోళ్లు, మంచి చర్మాలు, తుమ్మ కర్ర, దీపాల కోసం ఒలీవ నూనె, అభిషేక తైలం కోసం పరిమళ ద్రవ్యాలు, సువాసన ధూపంకోసం పరిమళ ద్రవ్యాలు, లేతపచ్చ రాళ్లు, యితర నగలు కానుకలుగా తీసుకు రావాలి. యాజకులు ధరించే ఏఫోదు, న్యాయ తీర్పు పైవస్త్రం మీద ఈ రాళ్లు, నగలు అమర్చబడుతాయి.

10 “నైపుణ్యంగల వాళ్లందరూ యెహోవా ఆజ్ఞాపించిన వీటన్నింటినీ చేయాలి. (యెహోవా ఆజ్ఞాపించిన వస్తువులు ఇవి): 11 పవిత్ర గుడారం, దాని బయటి గుడారం, దాని కప్పు, కొక్కీలు, చట్రాలు, అడ్డకర్రలు, స్తంభాలు, దిమ్మలు, 12 ఒడంబడిక పవిత్ర పెట్టె, దాని కర్రలు, పెట్టెను మూసే దాని మూత, పెట్టె ఉండే చోటును కప్పి ఉంచే తెర 13 బల్ల, దాని కర్రలు, బల్ల మీద వస్తువులన్నీ, బల్ల మీద ఉండే ప్రత్యేక రొట్టె, 14 వెలుగు కోసం ఉపయోగించే దీప స్తంభం, దీప స్తంభానికి సంబంధించిన వస్తువులన్నీను, దీపాలు, దీపానికి నూనె, 15 ధూపం వేసేందుకు బలిపీఠం, దాని కర్రలు, అభిషేక తైలం, సువాసన గల ధూపద్రవ్యాలు, పవిత్ర గుడారం, ప్రవేశం దగ్గర ద్వారాన్ని కప్పి ఉంచే తెర, 16 అర్పణలు దహించే బలిపీఠం, దాని ఇత్తడి రేకు, కర్రలు, బలిపీఠం దగ్గర ఉపయోగించే అన్ని వస్తువులు, గంగాళం, దాని పీట, 17 ఆవరణపు తెరలు, వాటి కర్రలు, దిమ్మలు, ఆవరణ ద్వారపు తెర 18 గుడారం, ఆవరణ గుడారం పట్టి ఉంచే మేకులు, మేకులకు కట్టే తాళ్లు, 19 పరిశుద్ధ స్థలంలో యాజకులు ధరించే ప్రత్యేక నేత వస్త్రాలు. యాజకుడైన అహరోను, అతని కుమారులు ధరించాల్సిన ప్రత్యేక వస్త్రాలు ఇవి. వాళ్లు యాజకులుగా సేవ చేసేటప్పుడు ఈ వస్త్రాలు ధరిస్తారు.”

ప్రజల మహా గొప్ప అర్పణ

20 అప్పుడు ప్రజలంతా మోషే దగ్గర్నుంచి వెళ్లిపోయారు. 21 ఇవ్వాలి అనుకొన్న ప్రజలంతా వచ్చి యెహోవాకు కానుక తెచ్చారు. సన్నిధి గుడారం, గుడారంలోని సమస్త సామగ్రి, ప్రత్యేక వస్త్రాలు చేసేందుకు ఈ కానుకలు ఉపయోగించబడ్డాయి. 22 ఇవ్వాలనుకున్న స్త్రీ పురుషులంతా అన్ని రకాల బంగారు వస్తువులు తెచ్చారు. ముక్కుకమ్ములు, చెవిపోగులు, ఉంగరాలు, ఇతర బంగారు వస్తువులు వారు తీసుకు వచ్చారు. వాళ్లంతా వారి బంగారాన్ని యెహోవాకు ఇచ్చారు. ఇది యెహోవాకు ప్రత్యేక అర్పణ.

23 నాణ్యమైన బట్ట, నీలం, ధూమ్రవర్ణం, ఎరుపు బట్ట ఉన్న ప్రతి వ్యక్తీ వాటిని యెహోవా కోసం తెచ్చాడు. మేక బొచ్చు, లేక ఎరుపు రంగు వేయబడ్డ గొర్రె చర్మాలు లేక నాణ్యమైన తోలు ఉన్నవారు ఎవరైనా సరే వాటిని యెహోవా కోసం తెచ్చారు. 24 వెండిని లేక ఇత్తడి ఇవ్వాలనుకున్న ప్రతి వ్యక్తి వచ్చి, దానిని యెహోవాకు కానుకగా తెచ్చారు. తుమ్మకర్ర ఉన్న ప్రతి వ్యక్తీ వచ్చి, దానిని యెహోవాకు కానుకగా ఇచ్చాడు. 25 నిపుణతగల ప్రతి స్త్రీ నాణ్యమైన బట్ట, నీలం, ధూమ్ర వర్ణం, ఎరుపు బట్ట తయారు చేసింది. 26 సహాయం చేయాలనుకొన్న నైపుణ్యంగల స్త్రీలంతా మేక వెంట్రుకలతో వస్త్రాలు తయారు చేసారు.

27 పెద్దలు లేతపచ్చలు, ప్రశస్తమైన ఇతర రాళ్లు తెచ్చారు. యాజకుని ఏఫోదు, న్యాయతీర్పు పైవస్త్రం మీద ఈ రాళ్లు రత్నాలు అమర్చబడ్డాయి. 28 సుగంధ ద్రవ్యాలు, ఒలీవ నూనె కూడ ప్రజలు తెచ్చారు. సువాసనగల పరిమళ ద్రవ్యం, అభిషేక తైలం, దీపాల నూనె కోసం ఉపయోగించబడ్డాయి.

29 సహాయం చేయాలనుకొన్న ఇశ్రాయేలు ప్రజలంతా యెహవాకు కానుకలు తెచ్చారు. ఈ కానుకలు ఉచితం, మరియు ప్రజలు ఇవ్వాలనుకొన్నారు గనుక వాటిని ఇచ్చారు. మోషేకు, ప్రజలకు యెహోవా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం చేసేందుకు ఈ కానుకలు ఉపయోగించబడ్డాయి.

అపొస్తలుల కార్యములు 10:9-23

మరుసటి రోజు వాళ్ళు యొప్పేను సమీపించారు. అప్పుడు మధ్యాహ్నం పన్నెండు గంటలు. అదే సమయంలో పేతురు ప్రార్థించటానికి మిద్దె మీదికి వెళ్ళాడు. 10 పేతురుకు ఆకలి వేసింది. ఏదైనా తినాలనుకొన్నాడు. అతని కోసం ఇంటివారు వంట సిద్ధం చేస్తుండగా అతనికి దర్శనం కలిగింది. 11 ఆ దర్శనంలో ఆకాశం తెరుచుకొని ఏదో క్రిందికి దిగి రావటం చూశాడు. అది ఒక పెద్ద దుప్పటిలా ఉంది. ఎవరో దాని నాలుగు మూలలు పట్టుకొని క్రిందికి దింపుతున్నట్లు అది భూమ్మీదికి దిగింది. 12 అందులో నాలుగు కాళ్ళున్న అన్ని రకాల జంతువులు, ప్రాకే ప్రాణులు, గాలిలో ఎగిరే పక్షులు ఉన్నాయి. 13 ఒక స్వరం, “పేతురూ, లే! వాటిని చంపి తిను” అని అన్నది.

14 పేతురు, “ప్రభూ! నేనలా చెయ్యలేను. అధమమైన దాన్ని, పరిశుభ్రంగా లేనిదాన్ని నేను ఎన్నడూ తినలేదు” అని సమాధానం చెప్పాడు.

15 ఆ స్వరం రెండవసారి, “దేవుడు పవిత్రం చేసినవాటిని అపవిత్రం అనకు” అని అన్నది. 16 ఇలా మూడు సార్లు జరిగిన వెంటనే అది ఆకాశానికి తీసుకు వెళ్ళబడింది. 17 పేతురు ఈ దివ్య దర్శనానికి అర్థం తెలియక దాన్ని గురించి ఆశ్చర్యంతో ఆలోచిస్తున్నాడు.

ఇంతలో కొర్నేలీ పంపిన మనుష్యులు సీమోను యిల్లు ఎక్కడుందో కనుక్కొని అతని యింటి ముందు ఆగారు. 18 “పేతురు అని పిలుస్తారే, ఆ సీమోను యిక్కడ అతిథిగా ఉంటున్నాడా?” అని యింటి వాళ్ళను అడిగారు.

19 దివ్య దర్శనాన్ని గురించి పేతురు యింకా ఆలోచిస్తుండగా దేవుని ఆత్మ అతనితో, “ఇదిగో! ముగ్గురు వ్యక్తులు నీ కోసం వెతుకుతున్నారు. 20 లేచి క్రిందికి వెళ్ళు. వాళ్ళను పంపింది నేనే. కనుక వాళ్ళ వెంట వెళ్ళటానికి కొంచెం కూడా సంకోచపడకు” అని చెప్పాడు. 21 పేతురు క్రిందికి వెళ్ళి వాళ్ళతో, “ఇదిగో! మీరు చూస్తున్నది నా కొరకే! ఎందుకొచ్చారు!” అని అడిగాడు.

22 వాళ్ళు, “మేము కొర్నేలీ అనే శతాధిపతి దగ్గర్నుండి వచ్చాము. అతడు మంచివాడు. దేవుని పట్ల భయభక్తులు కలవాడు. యూదులందరు అతణ్ణి గౌరవిస్తారు. మిమ్మల్ని తన యింటికి ఆహ్వానించి మీరు చెప్పింది వినవలెనని పవిత్రమైన దేవదూత అతనితో చెప్పాడు” అని సమాధానం చెప్పారు. పేతురు వాళ్ళను యింట్లోకి రమ్మని పిలిచి ఆ రాత్రికి అక్కడే ఉండమన్నాడు.

23 మరుసటి రోజు పేతురు వాళ్ళతో ప్రయాణమయ్యాడు. యొప్పేలోని కొందరు సోదరులు కూడా అతని వెంట వెళ్ళారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International