Revised Common Lectionary (Semicontinuous)
ఆసాపు స్తుతి గీతం.
83 దేవా, మౌనంగా ఉండవద్దు!
నీ చెవులు మూసికోవద్దు!
దేవా, దయచేసి ఊరుకోవద్దు.
2 దేవా, నీ శత్రువులు నీకు వ్యతిరేకంగా పథకాలు వేస్తున్నారు.
నీ శత్రువులు త్వరలోనే దాడి చేస్తారు.
3 నీ ప్రజలకు వ్యతిరేకంగా వారు రహస్య పథకాలు వేస్తారు.
నీవు ప్రేమించే ప్రజలకు విరోధంగా నీ శత్రువులు పథకాలను చర్చిస్తున్నారు.
4 “ఆ మనుష్యులను పూర్తిగా నాశనం చేద్దాం. రమ్ము.
అప్పుడు ‘ఇశ్రాయేలు’ అనే పేరు తిరిగి ఎవ్వరూ జ్ఞాపకంచేసుకోరు,” అని శత్రువులు చెబుతున్నారు.
5 దేవా, నీకు విరోధంగా పోరాడేందుకు నీవు మాతో చేసిన
ఒడంబడికకు విరోధంగా పోరాడేందుకు ఆ ప్రజలంతా ఏకమయ్యారు.
6-7 ఆ శత్రువులు మనకు విరోధంగా పోరాడేందుకు ఏకమయ్యారు. ఎదోము, ఇష్మాయేలు ప్రజలు; మోయాబు, హగ్రీ సంతతివారు;
గెబలువారు; అమ్మోను, అమాలేకీ ప్రజలు;
ఫిలిష్తీ ప్రజలు; తూరులో నివసించే ప్రజలంతా మనతో పోరాడుటకు ఏకమయ్యారు.
8 అష్షూరు సైన్యం లోతు వంశస్థులతో చేరి,
వారంతా నిజంగా బలముగలవారయ్యారు.
9 దేవా, మిద్యానును నీవు ఓడించినట్టు, కీషోను నది దగ్గర సీసెరాను,
యాబీనును నీవు ఓడించినట్టు శత్రువును ఓడించుము.
10 ఫన్దోరు వద్ద నీవు వారిని ఓడించావు.
వారి దేహాలు నేల మీద కుళ్లిపోయాయి.
11 దేవా, శత్రువుల నాయకులను ఓడించుము. ఓరేబుకు, జెయేబుకు నీవు చేసిన వాటిని వారికి చేయుము.
జెబహు, సల్మున్నా అనేవారికి నీవు చేసిన వాటిని వారికి చేయుము.
12 దేవా, మేము నీ దేశం విడిచేందుకు
ఆ ప్రజలు మమ్మల్ని బలవంత పెట్టాలని అనుకొన్నారు.
13 గాలికి చెదరిపోయే కలుపు మొక్కవలె[a] ఆ ప్రజలను చేయుము.
గాలి చెదరగొట్టు గడ్డిలా ఆ ప్రజలను చేయుము.
14 అగ్ని అడవిని నాశనం చేసినట్టు
కారుచిచ్చు కొండలను తగులబెట్టునట్లు శత్రువును నాశనం చేయుము.
15 దేవా, తుఫానుకు ధూళి ఎగిరిపోవునట్లు ఆ ప్రజలను తరిమివేయుము.
సుడిగాలిలా వారిని కంపింపజేసి, విసరివేయుము.
16 దేవా, వారి ముఖాలను సిగ్గుతో కప్పుము.
అప్పుడు వారు నీ నామం ఆరాధించాలని కోరుతారు.
17 దేవా, ఆ ప్రజలు శాశ్వతంగా భయపడి సిగ్గుపడునట్లు చేయుము.
వారిని అవమానించి, నాశనం చేయుము.
18 అప్పుడు నీవే దేవుడవు అని ఆ ప్రజలు తెలుసుకొంటారు.
నీ పేరు యెహోవా అని వారు తెలుసుకొంటారు.
నీవే లోకమంతటిపై మహోన్నతుడవైన దేవుడవు
అని వారు తెలుసుకొంటారు.
5 అప్పడు నేను మీ దగ్గరకు వస్తాను. మరియు సరైనది నేను చేస్తాను. ప్రజలు చేసిన చెడుకార్యాలను గూర్చి న్యాయమూర్తితో చెప్పటానికి సిద్ధంగా ఉన్న మనిషిలా నేను ఉంటాను. కొంతమంది మాయమంత్రాలు చేస్తారు. కొంతమంది వ్యభిచార పాపం చేస్తారు. కొంతమంది బూటకపు వాగ్దానాలు చేస్తారు. కొంతమంది తమ పనివారిని మోసం చేస్తారు. వారు వాగ్దానం చేసిన డబ్బును వారు చెల్లించరు. విధవలకు, అనాథ బాలబాలికలకు ప్రజలు సహాయం చేయరు. విదేశీయులకు ప్రజలు సహాయం చేయరు. ప్రజలు నన్ను గౌరవించరు!” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
దేవుని దగ్గర దొంగిలించటం
6 “నేను యెహోవాను, నేను మారను. మీరు యాకోబు పిల్లలు, మరియు మీరు పూర్తిగా నాశనం చేయబడలేదు. 7 కానీ మీరు ఎన్నడూ నా ఆజ్ఞలకు విధేయులు కాలేదు. చివరికి మీ వూర్వీకులు కూడా నన్ను అనుసరించటం మానివేశారు. తిరిగి నా దగ్గరకు రండి, నేను తిరిగి మీ దగ్గరకు వస్తాను.” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
“మేము ఎలా తిరిగి వెనుకకు రాగలం?” అని మీరు అంటారు.
8 దేవుని దగ్గర వస్తువులు దొంగిలించటం మానివేయండి! మనుష్యులు దేవుని దగ్గ ర వస్తువులు దొంగిలించకూడదు. కానీ మీరు నా దగ్గర వస్తువులు దొంగిలించారు!
“నీ దగ్గర మేము ఏమి దొంగిలించాం?” అని మీరు అంటారు.
“మీ సంపాదనలో పదోవంతు మీరు నాకు ఇచ్చి ఉండాల్సింది. మీరు నాకు ప్రత్యేక కానుకలు ఇచ్చి ఉండాల్సింది. కానీ మీరు నాకు వాటిని ఇవ్వలేదు. 9 ఈ విధంగా మీ రాజ్యం మొత్తం, అందరూ నా దగ్గర దొంగిలించారు. కనుక మీకు చెడు విషయాలు సంభవిస్తున్నాయి.” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు.
10 సర్వశక్తిమంతుడైన యెహోవా అంటున్నాడు, “ఈ పరీక్షలో ప్రయత్నించండి. మీకు ఉన్నవాటిలో పదో భాగం నా దగ్గరకు తీసికొని రండి. వాటిని ధనాగారంలో ఉంచండి. నా మందిరానికి ఆహారం తీసికొనిరండి. నన్ను పరీక్షించండి! మీరు ఆ పనులు చేస్తే, అప్పుడు నేను నిజంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఆకాశంనుండి వర్షం కురిసినట్టు, మంచి మంచి విషయాలు మీకు లభిస్తాయి. మీకు సమస్తం, కావలసిన దానికంటె ఎక్కువగా ఉంటాయి. 11 నేను చీడ పురుగులు మీ పంటలను తినివేయనియ్యను. మీ ద్రాక్షావల్లులు అన్నీ ద్రాక్షాపండ్లు ఫలిస్తాయి.” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
12 “ఇతర రాజ్యాల ప్రజలు మీ యెడ దయగలిగి ఉంటారు. నిజంగా మీకు ఒక అద్భుత దేశం ఉంటుంది.” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
యేసు పక్షవాత రోగిని నయం చేయటం
(మత్తయి 9:1-8; లూకా 5:17-26)
2 కొద్ది రోజుల తర్వాత యేసు మళ్ళీ కపెర్నహూము పట్టణానికి వెళ్ళాడు. ఆయన ఇంటికి వచ్చాడన్న వార్త ప్రజలకు తెలిసింది. 2 చాలా మంది ప్రజలు సమావేశం అవటం వల్ల స్థలం చాలలేదు. తలుపు అవతల కూడా స్థలం లేకపోయింది. యేసు వాళ్ళకు ఉపదేశిస్తూ ఉన్నాడు. 3 ఇంతలో నలుగురు మనుష్యులు ఒక పక్షవాత రోగిని మోసికొని అక్కడికి తీసుకు వచ్చారు. 4 చాలామంది ప్రజలుండటం వల్ల రోగిని యేసు ముందుకు తీసుకు రాలేకపోయారు. అందువల్ల వాళ్ళు యేసు వున్న గది పైకప్పు తెరచి, ఆ పక్షవాత రోగిని, అతడు పడుకొని ఉన్న చాపతో సహా ఆ సందు ద్వారా యేసు ముందుకు దించారు. 5 యేసు వాళ్ళ విశ్వాసాన్ని చూసి పక్షవాత రోగితో, “కుమారుడా! నీ పాపాలు క్షమించబడ్డాయి!” అని అన్నాడు.
6 అక్కడే కూర్చొని ఉన్న కొందరు శాస్త్రులు తమలో తాము ఈ విధంగా అనుకొన్నారు. 7 “ఇతడెందుకు ఈ విధంగా అంటున్నాడు? ఇది దైవ దూషణ కాదా? దేవుడు తప్ప వేరెవ్వరు పాపాల్ని క్షమించగలరు?” అని అనుకొన్నారు.
8 వాళ్ళు తమ మనస్సులో ఈ విధంగా ఆలోచిస్తున్నారని యేసు మనస్సు తక్షణమే గ్రహించింది. ఆయన వాళ్ళతో, “మీరు దీన్ని గురించి ఆ విధంగా ఎందుకు ఆలోచిస్తున్నారు? 9 ఏది సులభం? పక్షవాత రోగితో, ‘నీ పాపాలు క్షమించబడ్డాయి!’ అని అనటం సులభమా లేక, ‘నీ చాప తీసుకొని నడిచి వెళ్ళు!’ అని అనటం సులభమా? 10 భూలోకంలో పాపాలు క్షమించే అధికారం మనుష్య కుమారునికి ఉందని మీరు తెలుసుకోవాలి!” అని అంటూ, పక్షవాత రోగితో, 11 “నేను చెబుతున్నాను, లేచి నీ చాప తీసుకొని యింటికి వెళ్ళు!” అని అన్నాడు.
12 వెంటనే ఆ పక్షవాత రోగి లేచి నిలబడి తన చాప తీసుకొని అందరూ చూస్తుండగా నడుస్తూ వెళ్ళి పోయాడు. ఇది చూసి అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు. “మేము ఇలాంటిది ఎన్నడూ చూడలేదు!” అని అంటూ దేవుణ్ణి స్తుతించారు.
© 1997 Bible League International