Revised Common Lectionary (Semicontinuous)
సబ్బాతుకోసం స్తుతి కీర్తన.
92 యెహోవాను స్తుతించుట మంచిది.
సర్వోన్నతుడైన దేవా, నీ నామాన్ని కీర్తించుట మంచిది.
2 ఉదయం నీ ప్రేమను గూర్చి పాడటం,
రాత్రివేళ నీ నమ్మకత్వాన్ని గూర్చి పాడటం మంచిది.
3 దేవా, పదితంత్రుల వాయిద్యాలను స్వరమండల ములను నీ కోసం వాయించటం మంచిది.
సితారా మీద నీ కోసం సంగీతనాదం చేయటం మంచిది.
4 యెహోవా, నీవు చేసిన పనుల మూలంగా నిజంగా నీవు మమ్మల్ని సంతోషింపచేస్తావు.
నీవు చేసిన వాటిని గూర్చి మేము సంతోషంగా పాడుకొంటాం.
12 నీతిమంతులు ఖర్జూరపు చెట్టులా అభివృద్ధి చెందుతారు.
వారు లెబానోనులోని దేవదారు వృక్షంలా పెరుగుతారు.
13 మంచి మనుష్యులు యెహోవా ఆలయంలో నాటబడిన మొక్కలవలె బలంగా ఉంటారు.
వారు మన దేవుని ఆలయంలో బలంగా ఎదుగుతారు.
14 వారు వృద్ధులైన తరువాత కూడా ఫలిస్తూనే ఉంటారు.
వారు ఆరోగ్యంగా ఉన్న పచ్చని మొక్కల్లా వుంటారు.
15 యెహోవా మంచివాడని నేను చెబుతున్నాను.
ఆయనే నా బండ.
ఆయనలో అవినీతి లేదు.
8 ఇప్పుడు, ప్రజలందరూ చూడగలిగేట్టు దీనిని ఒక పలక మీద వ్రాయి. దీనిని ఒక గ్రంథంలో వ్రాయి. చివరి దినాలకోసం దీనిని వ్రాయి. అది ఎప్పుడో భవిష్యత్తులో చాలాకాలం తర్వాత.
9 తల్లిదండ్రులకు విధేయులు కాని పిల్లల్లా ఉన్నారు ఈ ప్రజలు. వారు అబద్ధాలు చెప్పి, యెహోవా ఉపదేశాలు ఆలకించేందుకు నిరాకరిస్తారు. 10 వారు ప్రవక్తలతో చెబుతారు: “మేము చేయాల్సిన వాటిని గూర్చి దర్శనాలు చూడకండి. మాతో సత్యం చెప్పకండి. మాకు చక్కని విషయాలు చెప్పి, మాకు హాయి కలిగించండి. మాకోసం మంచి వాటినే చూడండి. 11 నిజంగానే జరిగే వాటిని చూడటం మానేయండి. మా దారిలోంచి తప్పుకోండి. ఇశ్రాయేలీయుల పరిశుద్ధుని గూర్చి మాకు చెప్పటం చాలించండి.”
యూదా సహాయం కేవలం దేవుని నుంచి వస్తుంది
12 ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు (దేవుడు) చెబుతున్నాడు: “యెహోవా నుండి వచ్చిన ఈ సందేశాన్ని అంగీకరించటానికి మీరు నిరాకరించారు. మీ సహాయం కోసం మీరు పోరాటం మీద, అబద్ధాల మీద ఆధారపడాలని కోరుకొంటున్నారు. 13 ఈ విషయాల్లో మీరు దోషులు గనుక మీరు బీటలు వారిన గోడల్లా ఉన్నారు. ఆ గోడ పడిపోయి చిన్న చిన్న ముక్కలైపోతుంది. 14 ఆ ముక్కలు పనికిమాలినవి. ఆ ముక్కలు మంటల్లోంచి ఒక నిప్పుకణం తెచ్చేందుకు పనికిరావు, చెరువులోంచి నీళ్లు తెచ్చేందుకు పనికిరావు.”
15 “మీరు తిరిగి నా దగ్గరకు వస్తే మీరు రక్షించబడుతారు. మీరు నన్ను విశ్వసిస్తే, మీకు ఉన్న ఒకే బలం మీకు వస్తుంది. అయితే మీరు మౌనంగా ఉండాలి” అంటున్నాడు ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు, యెహోవా, నా ప్రభువు.
కానీ అలా చేయటం మీకు ఇష్టం లేదు. 16 మీరు “మేము ఎక్కి పారిపోయేందుకు మాకు గుర్రాలు అవసరం” అంటారు. అది నిజమే, మీరు గుర్రాల మీద పారిపోతారు. కానీ శత్రువు మిమ్మల్ని తరుముతాడు. మరియు మీ గుర్రాలకంటె మీ శత్రువు వేగం ఎక్కువ. 17 ఒక శత్రువు బెదిరిస్తే, మీ వాళ్లు వేయిమంది పారిపోతారు. శత్రువులు అయిదుగురు బెదిరిస్తే, మీరు మొత్తం వారినుండి పారిపోతారు. మీ సైన్యంలో మిగిలేదల్లా, ఏదో ఒక కొండమీద జెండా కర్ర మాత్రమే.
16 “మీ విశ్వాసం చెదిరిపోకూడదని ఈ విషయాలన్నీ మీకు చెప్పాను. 2 వాళ్ళు మిమ్మల్ని సమాజ మందిరాల నుండి వెలి వేస్తారు. నిజం చెప్పాలంటే, మిమ్మల్ని చంపితే దేవుని సేవ చేసిన దానితో సమానంగా భావించే కాలం వస్తుంది. 3 వాళ్ళకు నా గురించి కాని, తండ్రిని గురించి కాని, తెలియదు కనుక అలా చేస్తారు. 4 ఆ సమయం వచ్చినప్పుడు నేను హెచ్చరించినట్లు మీకు జ్ఞాపకం ఉండాలని ఈ విషయం చెపుతున్నాను. ఇన్నాళ్ళు మీతో ఉన్నాను. కనుక మీకీ విషయం మొదట చెప్పలేదు.
© 1997 Bible League International