Revised Common Lectionary (Semicontinuous)
ప్రతిదానికి ఒక తరుణం
3 ప్రతిదానికి సరైన సమయం ఒకటుంది. ఈ భూమి మీద ప్రతీది సరైన సమయంలో సంభవిస్తుంది.
2 పుట్టేందుకొక సమయం వుంది,
చనిపోయేందుకొక సమయం వుంది.
మొక్కలు నాటేందుకొక సమయం వుంది,
మొక్కలు పెరికేందుకొక సమయం వుంది.
3 చంపేందుకొక సమయం వుంది,
గాయం మాన్పేందుకొక సమయం వుంది.
నిర్మూలించేందుకొక సమయం వుంది,
నిర్మించేందుకొక సమయం వుంది.
4 ఏడ్చేందుకొక సమయం వుంది,
నవ్వేందుకొక సమయం వుంది.
దుఃఖించేందుకొక సమయం వుంది.
సంతోషంతో నాట్య మాడేందుకొక సమయం వుంది.
5 ఆయుధాలు పడవేసేందుకొక సమయం వుంది,
వాటిని తిరిగి చేపట్టేందుకొక సమయం వుంది.
ఒకరిని కౌగిలించు కొనేందుకొక సమయం వుంది,
ఆ కౌగిలిని సడలించేందుకొక సమయం ఉంది.[a]
6 దేన్నయినా వెదికేందుకొక సమయం వుంది,
అది పోగొట్టుకొనేందుకొక సమయం వుంది.
వస్తువులు పదిలపర్చు కొనే సమయం వుంది,
వాటిని పారవేసే సమయం వుంది.
7 వస్త్రం చింపేందుకొక సమయం వుంది,
దాన్ని కుట్టేందుకొక సమయం వుంది.
మౌనానికొక సమయం వుంది.
మాట్లాడేందు కొక సమయం వుంది.
8 ప్రేమించేందుకొక సమయం వుంది,
ద్వేషించేందుకొక సమయం వుంది.
సమరానికొక సమయం వుంది,
శాంతికొక సమయం వుంది.
దేవుడు తన జగత్తుని అదుపు చేస్తాడు
9 మనిషి చేసే కష్ట భూయిష్టమైన పనికిగాను అతనికి నిజంగా ఏమైనా లభిస్తుందా? (లేదు!) 10 చేసేందుకు దేవుడు మనకిచ్చే కష్ట భూయిష్టమైన పనులన్నీ ఏమిటో నేను గుర్తించాను. 11 తన జగత్తును గురించి ఆలోచించే సామర్థ్యాన్ని దేవుడు మనకి యిచ్చాడు.[b] అయితే దేవుడు చేసే వాటన్నింటినీ మనం ఎన్నడూ పూర్తిగా తెలుసు కోలేము. అయితేనేమి, దేవుడు అన్ని పనుల్నీ సరిగ్గా సరైన సమయంలోనే చేస్తాడు.
12 తాము బతికినంత కాలము సంతోషంగా ఉండటం, తనివితీరా సుఖాలు అనుభవించడం ఇవి మనుష్యులు చేయవలసిన అత్యుత్తమమైన పని అన్న విషయం నేను గ్రహించాను. 13 ప్రతి మనిషి తినాలి, తాగాలి, తాను చేసే పనిని ఆహ్లాదంగా చెయ్యాలి ఇది దేవుడు కోరుకునేది. ఇవి దేవుడిచ్చిన వరాలు.
సంగీత నాయకునికి: గితీత్ రాగం. దావీదు కీర్తన.
8 యెహోవా నా ప్రభువా! నీ పేరు భూమి అంతా ప్రసిద్ధి పొందింది.
2 పరలోకమంతా నీ కీర్తి బాలురు, చంటి పిల్లల నోళ్లనుండి వెలికి వస్తున్నది.
నీ శత్రువుల నోరు మూయించడానికి నీవు యిలా చేస్తావు.
3 యెహోవా, నీవు నీ చేతులతో చేసిన ఆకాశాలవైపు నేను చూస్తున్నాను.
నీవు సృష్టించిన చంద్ర నక్షత్రాలను నేను చూచి ఆశ్చర్య పడుతున్నాను.
4 మానవుడు ఎందుకు నీకు అంత ప్రాముఖ్యుడు?
నీవు వానిని ఎందుకు జ్ఞాపకం చేసుకొంటావు?
మానవమాత్రుడు నీకెందుకు అంత ముఖ్యం?
నీవు వానిని గమనించటం ఎందుకు?
5 అయితే మానవుడు నీకు ముఖ్యం.
వానిని నీవు దాదాపు దేవుని అంతటి వానిగా చేశావు.
మరియు మహిమా ఘనతలు నీవు వానికి కిరీటంగా ధరింప జేసావు.
6 నీవు చేసిన సమస్తము మీద మనుష్యునికి అధికారమిచ్చియున్నావు.
ప్రతిదానిని నీవు వాని అధీనంలో ఉంచావు.
7 గొర్రెలు, పశువులు, అడవి మృగాలు అన్నింటిమీద ప్రజలు ఏలుబడి చేస్తారు.
8 ఆకాశంలోని పక్షుల మీద, మహా సముద్రంలో ఈదుచుండే
చేపల మీద వారు ఏలుబడి చేస్తారు.
9 మా దేవా, యెహోవా భూలోమంతటిలో కెల్లా నీ నామము మహా అద్భుతమైనది!
క్రొత్త యెరూషలేము
21 ఆ తర్వాత నేను ఒక క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని[a] చూసాను. మొదటి ఆకాశం, మొదటి భూమి అదృశ్యమయ్యాయి. ఇప్పుడు సముద్రము లేదు. 2 నేను పరిశుద్ధ పట్టణమైన క్రొత్త యెరూషలేము పరలోకం నుండి దిగిరావటం చూసాను. అది దేవుని నుండి, పెళ్ళి కుమారుని కోసం పెళ్ళికూతురిలా అలంకరించుకొని దిగి వచ్చింది.
3 సింహాసనం నుండి ఒక స్వరం బిగ్గరగా, “ఇక నుండి దేవుడు మానవులతో ఉంటాడు. వాళ్ళతో నివసిస్తాడు. వాళ్ళు ఆయన ప్రజలు; ఆయన వాళ్ళ దేవుడై వాళ్ళతో స్వయంగా ఉంటాడు. 4 వాళ్ళ కళ్ళ నుండి కారిన ప్రతి కన్నీటి బొట్టును తుడిచివేస్తాడు. పాత సంగతులు గతించిపోయాయి. కనుక యిక మీదట చావుండదు. దుఃఖం ఉండదు. విలాపం ఉండదు, బాధ వుండదు” అని అన్నది.
5 సింహాసనంపై కూర్చొన్నవాడు, “నేను ప్రతి వస్తువును క్రొత్తగా చేస్తాను” అని అన్నాడు. “ఇవి విశ్వసింప దగినవి, సత్యం, కనుక యివి వ్రాయి” అని అన్నాడు.
6 ఆయన నాతో, “అంతా సమాప్తమైంది. అల్ఫా (ఆది), ఓమెగా (అంతం) నేనే. మొదటివాణ్ణి, చివరివాణ్ణి నేనే. దాహంతోవున్నవానికి ఊటనుండి జీవజలాన్ని ఉచితంగా ఇస్తాను.
మనుష్యకుమారుడు అందరికి తీర్పు తీర్చటం
31 “తేజోవంతుడైన మనుష్యకుమారుడు తన దేవదూతలతో కలసి వస్తాడు. వచ్చి తేజోవంతమైన తన సింహాసనంపై కూర్చుంటాడు. 32 ప్రజలందర్ని సమావేశ పరచి గొఱ్ఱెల కాపరి మేకల్లో నుండి గొఱ్ఱెల్ని వేరు చేసినట్లు వాళ్ళను వేరుచేస్తాడు. 33 తదుపరి కొందరిని తన కుడి వైపున, కొందరిని తన ఎడమ వైపున ఉంచుతాడు.
34 “అప్పుడా రాజు తన కుడి వైపునున్న వాళ్ళతో, ‘రండి! నా తండ్రి ఆశీర్వాదాలను మీరు పొందారు. మీ రాజ్యాన్ని తీసుకొండి. ప్రపంచం సృష్టింపబడినప్పుడే ఈ రాజ్యాన్ని దేవుడు మీకోసం ఉంచాడు. 35 ఎందుకంటే, నేను ఆకలితో ఉన్నప్పుడు మీరు నాకు భోజనం పెట్టారు. దాహం వేసినప్పుడు మీరు నాకు నీళ్ళిచ్చారు. పరదేశీయునిగా మీ దగ్గరకు వచ్చినప్పుడు నాకు ఆతిథ్యమిచ్చారు. 36 దుస్తులు కావలసి వచ్చినప్పుడు మీరు నాకు దుస్తులిచ్చారు. జబ్బుతో ఉన్నప్పుడు మీరు నాకు సేవ చేసారు. నేను కారాగారంలో ఉన్నప్పుడు వచ్చి పలకరించారు’ అని అంటాడు.
37 “అప్పుడు నీతిమంతులు, ‘ప్రభూ! మీరు ఆకలితో ఉండగా మేము ఎప్పుడు మీకు భోజనం పెట్టాము? మీరు దాహంతో ఉండగా మీకు నీళ్ళెప్పుడిచ్చాము? 38 మీరు పరదేశీయునిగా ఎప్పుడు వచ్చారు? మిమ్మల్ని ఎప్పుడు ఆహ్వానించాము? మీకు దుస్తులు ఎప్పుడు కావలసివచ్చింది? దుస్తులు మీకు ఎప్పుడిచ్చాము? 39 మీరు అనారోగ్యంగా ఉన్నప్పుడు మేము ఎప్పుడు చూసాము? మీరు కారాగారంలో ఎప్పుడువున్నారు? మిమ్మల్ని చూడటానికి ఎప్పుడు వచ్చాము?’ అని అడుగుతారు.
40 “ఆ రాజు, ‘ఇది సత్యం. హీన స్థితిలో ఉన్న నా సోదరులకు మీరు చేసిన ప్రతి సహాయాన్ని నాకు చేసినట్టుగా పరిగణిస్తాను’ అని సమాధానం చెబుతాడు.
41 “ఆ తర్వాత ఆ రాజు తన ఎడమ వైపునున్న వాళ్ళతో, ‘శాపగ్రస్తులారా! వెళ్ళి పొండి! సైతాను కొరకు, వాని దూతలకొరకు సిద్ధం చేయబడిన శాశ్వతమైన మంటల్లో పడండి. 42 ఎందుకంటే, నేను ఆకలితో ఉన్నప్పుడు మీరు నాకు భోజనం పెట్టలేదు. దాహం వేసినప్పుడు మీరు నాకు నీళ్ళివ్వలేదు. 43 నేను పరదేశీయునిగా వచ్చినప్పుడు మీరు నన్ను ఆహ్వానించలేదు. నాకు దుస్తులు కావలసి వచ్చినప్పుడు మీరు దుస్తుల్ని యివ్వలేదు. నేను జబ్బుతో కారాగారంలో ఉన్నప్పుడు మీరు నాకు సేవ చేయలేదు’ అని అంటాడు.
44 “అప్పుడు వాళ్ళు కూడా, ‘ప్రభూ! మీరు ఆకలిగావున్నప్పుడు గాని, లేక దాహంతో ఉన్నప్పుడు కాని, లేక పరదేశీయునిగా కాని, లేక జబ్బుతో ఉన్న వానిగా కాని లేక చెరసాలలో ఉన్నట్టుకాని ఎప్పుడు చూసాము? అలా చూసి కూడా మీకు ఎప్పుడు సహాయం చెయ్యలేదు?’ అని అంటారు.
45 “ఆయన, ‘ఇది సత్యం. హీనస్థితిలో ఉన్నవానికి మీరు సహాయం చెయ్యలేదు. కనుక నాకు సహాయం చెయ్యనట్లే’ అని చెబుతాడు.
46 “వాళ్ళు వెళ్ళి శాశ్వతంగా శిక్షను అనుభవిస్తారు. కాని నీతిమంతులు అనంత జీవితం పొందుతారు.”
© 1997 Bible League International