Revised Common Lectionary (Semicontinuous)
సంగీత నాయకునికి: కోరహు కుమారుల అలామోతు రాగ గీతం.
46 దేవుడు మా ఆశ్రయం, మా శక్తి.
ఆయన యందు, మాకు కష్ట కాలంలో ఎల్లప్పుడూ సహాయం దొరుకుతుంది.
2 అందుచేత భూమి కంపించినప్పుడు,
మరియు పర్వతాలు సముద్రంలో పడినప్పుడు మేము భయపడము.
3 సముద్రాలు పొంగినను, చీకటితో నిండినను,
భూమి, మరియు పర్వతాలు కంపించినను మేము భయపడము.
4 ఒక నది ఉంది. దాని కాలువలు దేవుని నివాసానికి,
మహోన్నత దేవుని పరిశుద్ధ పట్టణానికి సంతోషం తెచ్చి పెడ్తాయి.
5 ఆ పట్టణంలో దేవుడు ఉన్నాడు. కనుక అది ఎన్నటికీ నాశనం చేయబడదు.
సూర్యోదయానికి ముందే దేవుడు సహాయం చేస్తాడు.
6 రాజ్యాలు భయంతో వణకుతాయి.
యెహోవా గద్దించగా ఆ రాజ్యాలు కూలిపోతాయి. భూమి పగిలిపోతుంది.
7 సర్వశక్తిమంతుడైన యెహోవా మనతో ఉన్నాడు.
యాకోబు దేవుడు మనకు ఆశ్రయం.
8 యెహోవా చేసే మహత్తర కార్యాలు చూడండి.
ఆ కార్యాలు భూమి మీద యెహోవాను ప్రసిద్ధి చేస్తాయి.
9 భూమి మీద ఎక్కడైనా సరే యుద్ధాలను యెహోవా ఆపివేయగలడు.
సైనికుల విల్లులను, వారి ఈటెలను ఆయన విరుగగొట్టగలడు. రథాలను ఆయన అగ్నితో కాల్చివేయగలడు.
10 దేవుడు చెబుతున్నాడు, “మౌనంగా ఉండి, నేను దేవుణ్ణి అని తెలుసుకొనండి.
రాజ్యాలతో నేను స్తుతించబడతాను.
భూమిమీద మహిమపర్చబడతాను.”
11 సర్వశక్తిమంతుడైన యెహోవా మనతో ఉన్నాడు.
యాకోబు దేవుడు మనకు ఆశ్రయం.
మొదటి మనిషి, ఏదెను తోట
4 ఇదే భూమి, ఆకాశం చరిత్ర. భూమిని, ఆకాశాన్ని దేవుడు చేసినప్పుడు జరిగిన సంగతుల విషయం ఇది. 5 భూమి మీద మొక్కలు ఏమీ లేవు. పొలాల్లో ఏమీ పెరగటం లేదు. అప్పటికి యింకా ఎక్కడా మొక్కలు మొలవలేదు. అప్పటికి భూమిమీద యింకా వర్షం యెహోవా కురిపించలేదు. మొక్కలను గూర్చి జాగ్రత్త తీసుకొనే ఏ మనిషి అప్పటికి లేడు.
6 భూమి నుండి ఆవిరి ఉబికి నేల అంతటిని తడిపింది. 7 అప్పుడు యెహోవా దేవుడు నేలనుండి మట్టి తీసుకొని మనిషిని చేశాడు. మనిషి నాసికా రంధ్రాలలో జీవ వాయువును దేవుడు ఊదగా మనిషి సజీవుడు అయ్యాడు. 8 అప్పుడు తూర్పున ఏదెను అను చోట ఒక తోటను యెహోవా వేశాడు. యెహోవా దేవుడు తాను చేసిన మనిషిని ఆ తోటలో ఉంచాడు. 9 అప్పుడు చూచుటకు అందంగా కనబడే చెట్లన్నింటినీ, మరియు ఆహారానికి మంచివైన చెట్లు అన్నింటినీ భూమి పుట్టించునట్లు దేవుడు చేశాడు. జీవ వృక్షమును, మంచి చెడుల తెలివిని ఇచ్చే వృక్షమును ఆ తోట మధ్యలో ఉన్నాయి.
10 ఏదెనులో నుండి ఒక నది ప్రవహిస్తూ ఆ తోటకు నీటిని ఇస్తుంది. ఆ నది పాయలై నాలుగు చిన్న నదులయింది. 11 మొదటి నది పేరు పీషోను. ఇది హవీలా దేశం అంతటా ప్రవహించే నది. 12 (ఆ దేశంలో బంగారం ఉంది, ఆ బంగారం చాలా మంచిది. ఆ దేశంలో బోళం, గోమేధికము కూడా ఉన్నాయి). 13 రెండవ నది పేరు గీహోను. ఆ నది కూషు దేశమంతటా ప్రవహిస్తుంది. 14 మూడో నది పేరు హిద్దెకెలు. ఆ నది అష్షూరు తూర్పు దిక్కున ప్రవహిస్తుంది. నాలుగో నది యూఫ్రటీసు.
15 మనిషిని ఏదెను తోటలో యెహోవా దేవుడు ఉంచాడు. మొక్కలు నాటి తోటనుగూర్చి శ్రద్ధ తీసుకోవడం మనిషి పని. 16 యెహోవా దేవుడు మనిషికి ఈ ఆజ్ఞ యిచ్చాడు: “ఈ తోటలోని ఏ చెట్టు ఫలమునైనా నీవు తినవచ్చు. 17 అయితే మంచి, చెడ్డల తెలివిని ఇచ్చే చెట్టు ఫలమును నీవు తినకూడదు. ఆ చెట్టు పండు నీవు తిన్న రోజున తప్పక చస్తావు.”
మొదటి స్త్రీ
18 అప్పుడు యెహోవా దేవుడు, “పురుషుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. అతనికి సాటియైన సహకారిణిని నేను చేస్తాను. మరియు ఆ సహకారిణి అతనికి సహాయం చేస్తుంది” అనుకొన్నాడు.
19 పొలాల్లోని ప్రతి జంతువును, గాలిలోని ప్రతి పక్షిని నేలనుండి యెహోవా దేవుడు చేశాడు. ఈ జంతువులన్నింటిని యెహోవా దేవుడు మనిషి దగ్గరకు రప్పించాడు, మనిషి ప్రతిదానికి పేరు పెట్టాడు. 20 సాధు జంతువులన్నింటికీ, ఆకాశ పక్షులన్నింటికి, అడవి క్రూర జంతువులన్నింటికి మనిషి పేర్లు పెట్టాడు. ఎన్నెన్నో జంతువుల్ని, పక్షుల్ని మనిషి చూశాడు. అయితే తనకు సరిపోయే సహాయంగా ఏదీ అతనికి కనబడలేదు. 21 అందుచేత ఆ పురుషుడు గాఢనిద్ర పోయేటట్లు చేశాడు యెహోవా దేవుడు. అతడు నిద్రపోతూ ఉండగా, అతని శరీరంలోని ప్రక్క ఎముకలలో ఒకదాన్ని తీశాడు. ప్రక్క ఎముకను తీసిన చోటును అతని మాంసముతో యెహోవా దేవుడు పూడ్చి వేశాడు. 22 స్త్రీని చేసేందుకు, అతని ప్రక్క ఎముకను యెహోవా దేవుడు ఉపయోగించాడు. అప్పుడు ఆ స్త్రీని ఆ పురుషుని దగ్గరకు యెహోవా దేవుడు తీసుకొని వచ్చాడు. 23 అప్పుడు ఆ పురుషుడు ఇలా అన్నాడు:
“ఇప్పుడు, ఇది నావంటి మనిషే.
ఆమె ఎముక నా ఎముకల్లోనుంచి వచ్చింది.
ఆమె శరీరం నా శరీరంలోనుంచి వచ్చింది.
ఆమె నరునిలోనుండి తీయబడింది
గనుక ఆమెను నారి అంటాను.”
24 ఇందువల్ల పురుషుడు తన తండ్రిని, తల్లిని విడిచి, తన భార్యను హత్తుకొంటాడు. వాళ్లిద్దరు ఏకమవుతారు.
25 ఆ తోటలో ఆ పురుషుడు, అతని భార్యా నగ్నంగా ఉన్నారు. కాని వారికి సిగ్గు తెలియదు.
6 ఇశ్రాయేలు జాతికి చెందిన వాళ్ళందర్ని దేవుడు తన ప్రజలుగా ఎన్నుకోలేదు. కాబట్టి దేవుని మాట పరాజయం పొందిందని మనమనకూడదు. 7 లేక అబ్రాహాము సంతానమందరూ నిజంగా అబ్రాహాము సంతానమని మనమనలేము. కాని ఈ విషయంపై ఈ విధంగా వ్రాయబడి ఉంది: “ఇస్సాకు వల్ల మాత్రమే నీ సంతానం గుర్తింపబడుతుంది.”(A) 8 ఇంకొక రీతిగా చెప్పాలంటే అబ్రాహాముకు ప్రకృతి సహజంగా జన్మించినంత మాత్రాన దేవుని సంతానంగా పరిగణింపబడరు. కాని దేవుని వాగ్దానం మూలంగా అతనికి కలిగిన సంతానం అబ్రాహాము సంతానంగా పరిగణింపబడుతుంది. 9 ఈ వాగ్దానం ఈ విధంగా వ్రాయబడి ఉంది: “నియమిత సమయానికి నేను తిరిగి వస్తాను, శారాకు పుత్రుడు జన్మిస్తాడు.”(B)
10 అంతేకాదు. రిబ్కాకు, మన మూలపురుషుడైన ఇస్సాకు ద్వారా ఇద్దరు పుత్రులు కలిగారు. 11-12 కాని దేవుడు ఒక్కణ్ణే ఎన్నుకోవాలని, తద్వారా తన ఉద్దేశ్యం సంపూర్ణంగా నెరవేరాలని, రిబ్కాతో, “పెద్దవాడు, చిన్నవానికి సేవ చేస్తాడు”(C) అని అన్నాడు. అప్పటికింకా ఈ కవలలు జన్మించలేదు కనుక వాళ్ళు మంచి, చెడు, చేసే ప్రశ్నే రాదు. అంటే దేవుడు తన ఇష్ట ప్రకారం పిలిచాడు. కాని, ఈ పిలుపు వాళ్ళు చేసిన పనులపై ఆధారపడలేదన్న మాట. 13 ఈ విషయంపై ఈ విధంగా వ్రాయబడి ఉంది: “నేను యాకోబును ప్రేమించాను, కాని ఏశావును ద్వేషించాను.”(D)
© 1997 Bible League International