Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 94

94 యెహోవా, నీవు మనుష్యులను శిక్షించే దేవుడవు.
    నీవు వచ్చి మనుష్యులకు శిక్ష తెచ్చే దేవుడవు.
నీవు భూలోకమంతటికీ న్యాయమూర్తివి.
    గర్విష్ఠులకు రావలసిన శిక్షతో వారిని శిక్షించుము.
యెహోవా, దుర్మార్గులు ఎన్నాళ్లవరకు తమ సరదా అనుభవిస్తారు?
    యెహోవా, ఇంకెన్నాళ్లు?
ఆ నేరస్థులు వారు చేసిన చెడు విషయాలను గూర్చి
    ఇంకెన్నాళ్లు అతిశయిస్తారు?
యెహోవా, ఆ మనుష్యులు నీ ప్రజలను బాధించారు.
    నీ ప్రజలు శ్రమపడునట్లు వారు చేసారు.
మా దేశంలో నివసించే విధవరాండ్రను, పరదేశస్థులను ఆ దుర్మార్గులు చంపుతారు.
    తల్లిదండ్రులు లేని పిల్లలను వారు చంపుతారు.
వారు ఆ చెడు కార్యాలు చేయటం యెహోవా చూడటం లేదని వారు చెబతారు.
    జరుగుతున్న విషయాలను ఇశ్రాయేలీయుల దేవుడు గ్రహించడం లేదని వారు చెబుతారు.

దుర్మార్గులారా, మీరు బుద్ధిలేనివారు.
    మీరు మీ పాఠం ఇంకెప్పుడు నేర్చుకొంటారు?
దుర్మార్గులారా, మీరు అవివేకులు
    మీరు గ్రహించుటకు ప్రయత్నం చేయాలి.
దేవుడు మన చెవులను చేశాడు.
    కనుక తప్పని సరిగా ఆయనకు చెవులు ఉంటాయి. జరిగే విషయాలను ఆయన వినగలడు.
దేవుడు మన కళ్లను చేశాడు. కనుక తప్పనిసరిగా ఆయనకు కళ్లు ఉంటాయి.
    జరుగుతున్న సంగతులను ఆయన చూడగలడు.
10 ఆ ప్రజలను దేవుడే క్రమశిక్షణలో ఉంచుతాడు.
    ప్రజలు చేయవలసిన వాటిని దేవుడే వారికి నేర్పిస్తాడు.
11 ప్రజలు తలచే విషయాలు దేవునికి తెలుసు.
    ప్రజలు గాలి వీచినట్లుగా ఉంటారని దేవునికి తెలుసు.

12 యెహోవా శిక్షించినవాడు సంతోషంగా ఉంటాడు.
    సరియైన జీవిత విధానాన్ని దేవుడు అతనికి నేర్పిస్తాడు.
13 దేవా, ఆ మనిషికి కష్టాలు వచ్చినప్పుడు అతడు మౌనంగా ఉండుటకు నీవు సహాయం చేస్తావు.
    దుర్మార్గులు వారి సమాధిలో పాతిపెట్టబడేంత వరకు అతడు నెమ్మదిగా ఉండుటకు నీవు అతనికి సహాయం చేస్తావు.
14 యెహోవా తన ప్రజలను విడిచిపెట్టడు.
    సహాయం చేయకుండా ఆయన తన ప్రజలను విడిచిపెట్టడు.
15 న్యాయాన్ని తోడుకొని ధర్మం తిరిగి వస్తుంది.
    అప్పుడు మనుష్యులు మంచివాళ్లుగా, నిజాయితీగల వాళ్లుగా ఉంటారు.

16 దుర్మార్గులకు విరోధంగా పోరాడుటకు ఏ మనిషి నాకు సహాయం చేయలేదు.
    చెడు కార్యాలు చేసే వారికి విరోధంగా పోరాడుటకు నాతో ఎవ్వరూ నిలువలేదు.
17 యెహోవా నాకు సహాయం చేసి ఉండకపోతే
    నేను వెంటనే మరణ నిశ్శబ్దంలో నివసించే వాడిని.
18 నేను పడిపోవుటకు సిద్ధంగా ఉన్నట్టు నాకు తెలుసు.
    కాని యెహోవా తన అనుచరుని బలపరిచాడు.
19 నేను చాలా చింతించి తల్లడిల్లిపోయాను.
    కాని యెహోవా, నీవు నన్ను ఆదరించి సంతోషింప చేశావు.

20 దేవా, వక్ర న్యాయవాదులకు నీవు సహాయం చేయవు.
    ఆ చెడ్డ న్యాయవాదులు ప్రజల జీవితాలను దుర్భరం చేయటానికే న్నాయచట్టాన్ని ఉపయోగిస్తారు.
21 ఆ న్యాయమూర్తులు మంచి మనుష్యులపై పడుతున్నారు.
    అమాయక ప్రజలు దోషులని చెప్పి వారిని చంపుతారు.
22 అయితే పర్వతం మీద ఎత్తయిన నా క్షేమ స్థానం యెహోవాయే.
    నా దుర్గమైన దేవుడు నా క్షేమస్థానం.
23 ఆ దుర్మార్గపు న్యాయవాదులు చేసిన చెడు పనులకోసం దేవుడు వారిని శిక్షిస్తాడు.
    వారు పాపం చేశారు గనుక దేవుడు వారిని నాశనం చేస్తాడు.
    మన యెహోవా దేవుడు ఆ దుర్మార్గపు న్యాయవాదులను నాశనం చేస్తాడు.

రూతు 4:7-22

(పూర్వము ఇశ్రాయేలులో ప్రజలు ఆస్తి కొన్నా, విడిపించినా ఒకడు తన చెప్పు తీసి అవతల వ్యక్తికి ఇచ్చేవాడు. క్రయ విక్రయాలకు అది వారి రుజువు). “కనుక ఆ భూమిని నీవే కొనుక్కో” అన్నాడు ఆ దగ్గరి బంధువు. తర్వాత ఆ దగ్గరి బంధువు తన చెప్పుతీసి దానిని బోయజుకు ఇచ్చాడు.

అప్పుడు బోయజు పెద్దలతోను, ప్రజలందరితోను చెప్పాడు. “ఎలీమెలెకు, కిలియోను, మహ్లూనులకు చెందిన దానినంతటినీ నయోమి దగ్గరనుండి నేను కొంటున్నాను. దానికి నేడు మీరే సాక్షులు. 10 నా భార్యగా ఉండేందుకు రూతును కూడా నేను తీసుకొంటున్నాను. చనిపోయినవాని ఆస్తి అతని కుటుంబానికే ఉండాలని నేను ఇలా చేస్తున్నాను. ఈ విధంగా చేయటంవల్ల చనిపోయిన వాని పేరు అతని దేశానికి, కుటుంబానికి దూరముకాకుండా ఉంటుంది. ఈ వేళ మీరంతా దీనికి సాక్షులు.”

11 పట్టణద్వారము దగ్గర ఉన్న పెద్దలు, ప్రజలు దీనికి సాక్షులు.

“ఈ స్త్రీ నీ ఇంటికి వచ్చేస్తుంది యెహోవా
    ఈమెను రాహేలు,
లేయా వలె చేయునుగాక!
    రాహేలు, లేయాలు ఇశ్రాయేలు వంశ పుత్రదాతలు. ఎఫ్రాతాలో
నీవు శక్తిమంతుడవు అవుదువు గాక.
    బెత్లెహేములో నీవు ప్రఖ్యాత పురుషుడవవుదువు గాక!
12 తామారు యూదా కుమారుడు పెరెసును కన్నది
    అతని కుటుంబం చాలా గొప్పది
అలాగే రూతు ద్వారా అనేక మంది పిల్లలను యెహోవా నీకు ప్రసాదించును గాక!
    నీ కుటుంబము కూడ అతని కుటుంబంలాగే గౌరవప్రదమవును గాక!”

13 బోయజు రూతును పెళ్లి చేసుకున్నాడు. యెహోవా ఆమెను గర్భవతిని కానిచ్చినప్పుడు ఆమె ఒక కుమారుని కన్నది. 14 ఆ ఊరిలో స్త్రీలు నయోమితో,

“నిన్ను ఆదుకొనేందుకు ఇతడిని (బోయజును) ఇచ్చిన యెహోవాని స్తుతించు.
    అతడు ఇశ్రాయేలులో ప్రఖ్యాతి నొందును గాక! అనిరి. మరియు వారు,
15 అతడే నీకు బలాన్ని యిచ్చి,
    నీ వృద్ధాప్యంలో నిన్ను కాపాడును గాక!
నీ కోడలు వల్ల ఇదంతా జరిగింది.
    ఆమె నీ కోసం ఈ పిల్లవానిని కన్నది.
ఆమెకు నీవంటే చాలా ప్రేమ.
    ఈమె ఏడుగురు కుమారులను కంటే నీకు మేలు.”

అని అనిరి.

16 నయోమి పిల్లవాడ్ని తీసుకొని, చేతుల్లో ఎత్తుకొని ఆడించింది. 17 ఆ స్త్రీలు, “ఈ పిల్లవాడు నయోమి కోసమే పుట్టాడు” అన్నారు. ఇరుగు పొరుగువారు ఆతనికి ఓబేదు అని పేరు పెట్టారు. ఓబేదు యెష్షయికి తండ్రి. యెష్షయి రాజైన దావీదుకు తండ్రి.

రూతు, బోయజు కుటుంబము

18 పెరెసు కుటుంబ చరిత్ర ఇది.

పెరెసు హెస్రోనుకు తండ్రి.

19 హెస్రోను రాముకు తండ్రి.

రాము అమ్మి నాదాబుకు తండ్రి.

20 అమ్మినాదాబు నయసోనుకు తండ్రి.

నయసోను శల్మానుకు తండ్రి.

21 శల్మాను బోయజుకు తండ్రి.

బోయజు ఓబేదుకు తండ్రి.

22 ఓబేదు యెష్షయికి తండ్రి.

యెష్షయి దావీదుకు తండ్రి.

లూకా 4:16-30

యేసు తన స్వగ్రామానికి వెళ్ళటం

(మత్తయి 13:53-58; మార్కు 6:1-6)

16 ఆ తర్వాత తాను పెరిగిన నజరేతు గ్రామానికి వెళ్ళాడు. ఒక విశ్రాంతి రోజున అలవాటు ప్రకారం సమాజమందిరానికి వెళ్ళి, చదవటానికి నిలుచున్నాడు. 17 అక్కడున్న వాళ్ళు, ప్రవక్త యెషయా గ్రంథాన్ని ఆయన చేతికి ఇచ్చారు. ఆయన ఆ గ్రంథములో ఈ వాక్యాలున్న పుటను తెరిచి చదవటం మొదలు పెట్టాడు:

18 “ప్రభువు నన్నభిషేకించి పేదవాళ్ళకు
    నన్ను సువార్త ప్రకటించుమన్నాడు.
అందుకే ప్రభువు ఆత్మ నాలో ఉన్నాడు.
బంధితులకు స్వేచ్ఛ ప్రకటించుమని,
    గుడ్డివారికి చూపు కలిగించాలని,
హింసింపబడే వారికి విడుదల కలిగించాలని, నన్ను పంపాడు.
19     ప్రభువు ‘తాను దయ చూపే సంవత్సరం’ ప్రకటించుమని నన్ను పంపాడు.”(A)

20 ఆ తదుపరి యేసు గ్రంథం మూసేసి దాన్ని తెచ్చిన వానికి యిచ్చి కూర్చున్నాడు. సమాజ మందిరంలో ఉన్నవాళ్ళందరి కళ్ళు ఆయనపై ఉన్నాయి. 21 ఆయన వాళ్ళతో, “ఈ రోజు గ్రంథములో వ్రాయబడిన ఈ వాక్యాలు మీరు వింటుండగానే నెరవేరాయి” అని అన్నాడు.

22 అంతా ఆయన్ని మెచ్చుకున్నారు. అంతే కాక ఆయన నోటినుండి వచ్చిన ఆ చక్కటి మాటలు విని అందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళు, “ఈయన యోసేపు కుమారుడు కదా!” అని అన్నారు.

23 యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “‘వైద్యుడా! నిన్ను నీవు నయం చేసుకో!’ అన్న సామెత మీరు నాకు చెబుతారని తెలుసు. పైగా మీరు, ‘కపెర్నహూములో చేసిన మహాత్యాల్ని గురించి మేము విన్నాము. వాటిని యిక్కడ నీ స్వగ్రామంలో కూడా చెయ్యి!’ అని అంటారని నాకు తెలుసు. 24 ఇది నిజం. ఏ ప్రవక్తనూ అతని స్వగ్రామపు ప్రజలు అంగీకరించలేదు.

25 “ఏలీయా కాలంలో ఇశ్రాయేలు దేశంలో చాలామంది వితంతువులుండినారని ఖచ్చితంగా చెప్పగలను. ఆ కాలంలో మూడున్నర సంవత్సరాలు వర్షాలు కురియలేదు. దేశమంతటా తీవ్రమైన కరువు వ్యాపించి ఉంది. 26 సీదోను రాష్ట్రంలోని సారెపతు అనే గ్రామంలో ఒక వితంతువు ఉండేది. దేవుడు ఏలీయాను ఆమె దగ్గరకు తప్పమరెవ్వరి దగ్గరకు పంపలేదు.

27 “ప్రవక్త ఎలీషా[a] కాలంలో ఇశ్రాయేలు దేశంలో చాలా మంది కుష్టురోగులుండే[b] వాళ్ళు. కాని సిరియ దేశానికి చెందిన నయమాను అనేవాణ్ణి తప్ప దేవుడు వీళ్ళలో ఒక్కరిని కూడా నయం చేయలేదు.”

28 సమాజ మందిరములో వున్న వాళ్ళందరికి యిది విని ఆయనపై చాలా కోపం వచ్చింది. 29 వాళ్ళు లేచి ఆయన్ని గ్రామం నుండి వెళ్ళగొట్టారు. ఆ గ్రామం కొండ మీద ఉంది. వాళ్ళు ఆయన్ని క్రిందికి త్రోయాలని కొండ చివరకు తీసుకు వెళ్ళారు. 30 కాని ఆయన వాళ్ళ మధ్యనుండి నడిచి తన దారిన తాను వెళ్ళి పోయాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International