Revised Common Lectionary (Complementary)
గీమెల్
17 నీ సేవకుడనైన నాకు మేలుగా నుండుము.
తద్వారా నేను జీవించగలను. నేను నీ ఆజ్ఞలకు విధేయుడను అవుతాను.
18 యెహోవా, నా కళ్లు తెరువుము, అప్పుడు నేను నీ ఉపదేశములను అనుసరించి
నీవు చేసిన ఆశ్చర్యకార్యాలను గూర్చి చదువుతాను.
19 ఈ దేశంలో నేను పరాయివాణ్ణి.
యెహోవా, నీ ఉపదేశాలు నాకు దాచిపెట్టకుము.
20 నేను ఎంతసేపూ నీ నిర్ణయాలను గూర్చి
చదవాలని కోరుతున్నాను.
21 యెహోవా, గర్వించే ప్రజలను నీవు గద్దిస్తావు.
ఆ గర్విష్ఠులకు కీడులే సంభవిస్తాయి.
నీ అజ్ఞలకు విధేయులవుటకు వారు నిరాకరిస్తారు.
22 నన్ను సిగ్గుపడనియ్యకు, ఇబ్బంది పడనియ్యకు.
నేను నీ ఒడంబడికకు విధేయుడనయ్యాను.
23 నాయకులు కూడ నన్ను గూర్చి చెడు విషయాలు చెప్పారు.
అయితే యెహోవా, నేను నీ సేవకుడను; మరియు నేను నీ న్యాయ చట్టాలు చదువుతాను.
24 నీ ధర్మశాస్త్రమే నాకు శ్రేష్ఠమైన స్నేహితుడు.
అది నాకు మంచి సలహా ఇస్తుంది.
దేవుని వాగ్దానం
33 యెహోవా నుండి సందేశం రెండవసారి యిర్మీయాకు వచ్చింది. యిర్మీయా ఇంకను రక్షక భటుని ఆవరణలో బందీయైయున్నాడు. 2 యెహోవా భూమిని సృష్టించాడు. ఆయన దానిని సురక్షితంగా ఉంచుతాడు. ఆ సృష్టికర్త పేరే యెహోవా! యెహోవా ఇలా అంటున్నాడు: 3 “ఓ యూదా, నన్ను ప్రార్థించు. నేను నీకు జవాబిస్తాను. నేను నీకు అతి ముఖ్యమైన రహస్యాలను తెలియజేస్తాను. అవి నీవు ముందెన్నడు విని ఎరుగవు. 4 యెహోవా ఇశ్రాయేలీయుల దేవుడు. యెరూషలేములోని ఇండ్ల విషయం, యూదా రాజుల భవనాల గురించి యెహోవా ఈ విషయాలు తెలియజేస్తున్నాడు శత్రువు ఆ ఇండ్లను నేల మట్టం చేస్తాడు. శత్రువు నగర గోడల చుట్టూ పై వరకు దిమ్మలు నిర్మిస్తాడు. శత్రువు కత్తి పట్టి ఈ నగరాల ప్రజలతో యుద్ధం చేస్తాడు.
5 “యెరూషలేము నగరంలో ప్రజలు చాలా చెడు కార్యాలు చేశారు. వారి పట్ల నేను చాలా కోపంగా ఉన్నాను. నేను ఈ పట్టణానికి విముఖుడనైనాను. కావున వారిలో చాలా మందిని చంపివేస్తాను. కల్దీయుల సైన్యం యెరూషలేముతో యుద్ధానికి వస్తుంది. యెరూషలేము నగరంలోని ఇండ్లలో అనేక మంది శవాలు పడి ఉంటాయి.
6 “కాని ఆ నగరంలోని ప్రజలను నేను స్వస్థపరచి వారికి ఉపశమనం కలుగజేస్తాను. వారు శాంతి, రక్షణ కలిగి ఉండేలా చేస్తాను. 7 యూదాను, ఇశ్రాయేలును గతంలో మాదిరిగా మిక్కిలి బలపడేలా చేస్తాను. 8 వారు నాకు విరోధంగా పాపం చేశారు కాని నేను ఆ పాపాన్ని కడిగి వేస్తాను. నాకు విరోధంగా వారు పోరాడారు కాని వారిని క్షమిస్తాను. 9 అప్పుడు యెరూషలేము ఒక అద్భుతమైన స్థలంగా మారి పోతుంది. ప్రజలు సంతోషంగా ఉంటారు. ఇతర దేశాల ప్రజలు దిగ్భ్రాంతులవుతారు. మరియు నేను ఇశ్రాయేలీయులకు కలుగజేసే క్షేమాన్ని విశ్రాంతిని చూచి వణకుతారు. అనేక మంచి పనులు జరగడం గురించి వారు విన్నప్పుడు ఇది జరుగుతుంది. ఇతర రాష్ట్రాల వారు నేను ఇశ్రాయేలుకు అనుగ్రహించిన మంచి వాటిని గురించి వింటారు.
10 “ప్రజలారా మీరిలా అంటున్నారు, ‘మా దేశం వట్టి ఎడారి అయిపోయింది. మనుష్యులు గాని, జంతుజాలం గాని ఏదీ ఇక్కడ నివసించటం లేదు.’ యెరూషలేము వీధులలోను, యూదా పట్టణాలలోను ఇప్పుడు ప్రశాంతత నెలకొన్నది. కాని త్వరలో అక్కడ సందడి ఏర్పడుతుంది. 11 అక్కడ తిరిగి సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. వధూవరుల వేడుకలు నెలకొంటాయి. దేవాలయానికి కానుకలు తెచ్చే జన సందోహాల సందడి వినిపిస్తుంది. ‘సర్వశక్తిమంతుడయిన యెహోవాకు జయగీతం పాడండి! యెహోవా దయామయుడు. ఆయన కరుణ శాశ్వతంగా మనకు లభిస్తుంది!’ అని ప్రజలు అంటారు. యూదాకు నేను మళ్లీ మంచి పనులు చేస్తాను. గనుక ప్రజలా మాటలు చెపుతారు. అప్పుడు యూదా తన పూర్వ వైభవం తిరిగి నెలకొంటుంది.” ఇదే యెహోవా వాక్కు.
ఇద్దరు గ్రుడ్డి వాళ్ళకు చూపురావటం
(మార్కు 10:46-52; లూకా 18:35-43)
29 యేసు, ఆయన శిష్యులు యెరికో పట్టణం నుండి బయలు దేరి వెళ్తూండగా చాలా మంది ప్రజలు ఆయన్ని అనుసరించారు. 30 దారి ప్రక్కన కూర్చొన్న ఇద్దరు గ్రుడ్డివాళ్ళు యేసు ఆ దారిన వస్తున్నాడని విని, “మమ్మల్ని కరుణించు దావీదు కుమారుడా!” అని బిగ్గరగా అన్నారు.
31 ప్రజలు వాళ్ళను నిశ్శబ్దంగా వుండమని గద్దించారు. కాని ఆ గ్రుడ్డివాళ్ళు యింకా బిగ్గరగా, “ప్రభూ! దావీదు కుమారుడా! మాపై దయ చూపు!” అని అన్నారు.
32 యేసు ఆగి ఆ గ్రుడ్డివాళ్ళను పిలిచి, “ఏం చెయ్యమంటారు?” అని అడిగాడు.
33 “ప్రభూ! మాకు చూపుకావాలి!” అని వాళ్ళు సమాధానం చెప్పారు.
34 యేసుకు వాళ్ళపై దయ కలిగి వాళ్ళ కళ్ళను తాకాడు. వెంటనే వాళ్ళకు చూపు వచ్చింది. వాళ్ళు ఆయన్ని అనుసరించారు.
© 1997 Bible League International