Revised Common Lectionary (Complementary)
12 “సబ్బాతు రోజుకు ప్రత్యేక ప్రాముఖ్యతను ఇచ్చేందుకు జ్ఞాపకం ఉంచుకోవాలి. వారం లోని ఇతర దినాలకంటే విశ్రాంతి దినాన్ని వేరుగా ఉంచమని మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞ యిచ్చాడు. 13 మొదటి ఆరు రోజులు మీ పని చేసుకొనేందుకు. 14 అయితే ఏడో రోజు మీ దేవుడైన యెహోవా గౌరవార్థం విశ్రాంతి రోజు అవుతుంది. కనుక విశ్రాంతి రోజున ఏ వ్యక్తీ పనిచేయకూడదు. అంటే మీరు, మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ ఆడ, మగ బానిసలు, మీ ఆవులు, మీ గాడిదలు, ఏ ఇతర జంతువులు, మీ పట్టణాల్లో నివసిస్తున్న విదేశీయులు, మీ బానిసలు కూడ మీవలెనే విశ్రాంతి తీసుకోగలగాలి. 15 ఈజిప్టులో ఉన్నప్పుడు మీరూ బానిసలే అని మరచిపోవద్దు. మీ దేవుడైన యెహోవా తన మహా శక్తితో ఈజిప్టునుండి మిమ్మల్ని బయటకు తీసుకొని వచ్చాడు. ఆయన మిమ్మల్ని స్వతంత్రులుగా చేసాడు. అందుచేతనే ఎల్లప్పుడూ సబ్బాతు రోజును ఒక ప్రత్యేక రోజుగా ఆచరించాలని మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపిస్తున్నాడు.
సంగీత నాయకునికి: గిత్తీత్ రాగం. ఆసాపు కీర్తన.
81 సంతోషించండి, మన బలమైన దేవునికి గానం చేయండి.
ఇశ్రాయేలీయుల దేవునికి సంతోషంతో కేకలు వేయండి.
2 సంగీతం ప్రారంభించండి.
గిలక తప్పెట వాయించండి.
స్వరమండలం, సితారాలను శ్రావ్యంగా వాయించండి.
3 నెలవంకనాడు గొర్రెపోతు కొమ్ము ఊదండి.
పౌర్ణమినాడు[a] గొర్రెపోతు కొమ్ము ఊదండి. ఆనాడే మన పండుగ ఆరంభం.
4 అది ఇశ్రాయేలు ప్రజలకు న్యాయచట్టం.
ఆ ఆదేశాన్ని యాకోబుకు దేవుడు ఇచ్చాడు.
5 ఈజిప్టునుండి యోసేపును[b] దేవుడు తీసుకొనిపోయిన సమయంలో
దేవుడు వారితో ఈ ఒడంబడిక చేసాడు.
ఈజిప్టులో నేను గ్రహించని భాష విన్నాను.
6 దేవుడు ఇలా చెబుతున్నాడు: “మీ భుజంమీద నుండి బరువు నేను దింపాను.
నేను మీ మోతగంప పడవేయనిచ్చాను.
7 మీరు కష్టంలో ఉన్నప్పుడు మీరు సహాయం కోసం వేడుకొన్నారు. నేను మిమ్మల్ని స్వతంత్రుల్ని చేశాను.
తుఫాను మేఘాలలో దాగుకొని నేను మీకు జవాబు ఇచ్చాను.
నీళ్ల వద్ద నేను మిమ్మల్ని పరీక్షించాను.”
8 “నా ప్రజలారా, నా మాట వినండి. నా ఒడంబడిక[c] నేను మీకు యిస్తాను.
ఇశ్రాయేలూ, నీవు దయచేసి నా మాట వినాలి!
9 విదేశీయులు పూజించే తప్పుడు దేవుళ్ళను
ఎవరినీ ఆరాధించవద్దు.
10 నేను యెహోవాను, నేనే మీ దేవుడను.
మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకొని వచ్చిన దేవుడను నేనే.
ఇశ్రాయేలూ, నీ నోరు తెరువు,
నేను దానిని నింపుతాను.
5 మమ్మల్ని మేము ప్రకటించుకోము. యేసు క్రీస్తు ప్రభువని ప్రకటిస్తాము. యేసు కొరకు మేము మీ సేవకులమని ప్రకటిస్తాము. 6 “చీకటి నుండి వెలుగు ప్రకాశించనీ!”[a] అని అన్న దేవుడు తన వెలుగు మా హృదయాల్లో వెలిగించాడు. క్రీస్తు ముఖంలో దేవుని మహిమ ప్రకాశిస్తోంది. ఆ మహిమలో ఉన్న జ్ఞానాన్ని మాలో ప్రకాశింప చేసాడు.
7 దేవుడు ఇచ్చిన ఈ ఐశ్వర్యం మాములు మట్టికుండల్లో దాగివుంది. మేమే ఆ కుండలము. దీనివల్ల ఈ శక్తి మాది కాదని, దేవునిదని స్పష్టంగా తెలుస్తోంది. 8 మా చుట్టూ కష్టాలు ఉన్నాయి. కాని మేము ఆ కష్టాలకు నలిగిపోలేదు. మాకు అవమానాలు కలిగాయి. కాని మేము వాటివల్ల దిగులుపడలేదు. 9 మేము హింసించబడుతున్నాము కాని, మేము దిక్కులేనివాళ్ళము కాము. మేము క్రింద పడ్డాము కాని నశించిపోలేదు. 10 మేము అన్ని వేళలా యేసు మరణాన్ని మోసుకొని తిరుగుతూ ఉంటాము. “ఆయన” జీవితం మా జీవితాల ద్వారా వ్యక్తం కావాలని మా ఉద్దేశ్యం. 11 బ్రతికి ఉన్న మేము యేసుకోసం మా జీవితాలను మరణానికి అప్పగిస్తూ ఉంటాము. ఆయన జీవితం మా భౌతిక దేహాల్లో వ్యక్తం కావాలని మా ఉద్దేశ్యం. 12 కనుక ఆయన మరణం మాలో పనిచేస్తోంది. ఆయన జీవితం మీలో పని చేస్తోంది.
యేసు విశ్రాంతి రోజుకు ప్రభువు
(మత్తయి 12:1-8; లూకా 6:1-5)
23 ఒక విశ్రాంతి రోజు యేసు పొలాల ద్వారా వెళ్తూవున్నాడు. ఆయన శిష్యులు కూడా ఆయన వెంటే ఉన్నారు. వాళ్ళు తినటానికి కొన్ని దాన్యపు కంకుల్ని త్రుంచారు. 24 పరిసయ్యులు ఆయనతో, “అదిగో చూడండి! వాళ్ళు విశ్రాంతి రోజు చేయకూడని పని ఎందుకు చేస్తున్నారు?” అని అడిగారు.
25 యేసు, “దావీదు, అతని అనుచరులు ఆకలితో ఉన్నప్పుడు వాళ్ళకు ఆహారం కావలసివచ్చింది. అప్పుడు దావీదు ఏం చేసాడో మీరు ఎన్నడూ చదవలేదా? 26 అబ్యాతారు ప్రధానయాజకుడుగా ఉన్న కాలంలో దావీదు దేవాలయంలోకి ప్రవేశించి దేవుని సముఖమున పెట్టిన రొట్టె తీసుకొని, తానుతిని, తన సహచరులకు కూడా కొంత యిచ్చాడు. ఈ రొట్టెను యాజకులు తప్ప యితరులు తినకూడదు” అని అన్నాడు.
27 యేసు వాళ్ళతో మళ్ళీ ఈ విధంగా అన్నాడు: “విశ్రాంతి రోజు మానవుని కోసం సృష్టింపబడింది. కాని మానవుడు విశ్రాంతి రోజు కోసం సృష్టింపబడలేదు. 28 అందువల్ల మనుష్యకుమారునికి విశ్రాంతి రోజుపై కూడా అధికారం ఉంది.”
విశ్రాంతి రోజు యేసు నయం చేయటం
(మత్తయి 12:9-14; లూకా 6:6-11)
3 ఒక రోజు యేసు సమాజ మందిరానికి వెళ్ళాడు. అక్కడ చెయ్యి ఎండిపోయిన వాడొకడు ఉన్నాడు. 2 అక్కడున్న వాళ్ళలో కొందరు, యేసు ఆ చేయి ఎండిపోయిన వానికి విశ్రాంతి రోజు నయం చేస్తాడేమో చూడాలని జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు. అలా చేస్తే ఆయనపై నేరం మోపాలని వాళ్ళ ఉద్దేశ్యం. 3 యేసు ఆ చేయిపడిపోయిన వానితో, “అందరి ముందుకి వచ్చి నిలుచో” అని అన్నాడు.
4 అప్పుడు యేసు అక్కడున్న వాళ్ళతో, “విశ్రాంతి రోజున మంచి చెయ్యటం ధర్మమా? లేక చెడు చేయటం ధర్మమా? ప్రాణాన్ని రక్షించటం ధర్మమా లేక చంపటం ధర్మమా?” అని అన్నాడు. కాని దానికి వాళ్ళు ఏ సమాధానమూ చెప్పలేదు.
5 ఆయన కోపంతో చుట్టూ చూసాడు. వాళ్ళవి కఠిన హృదయాలైనందుకు ఎంతో దుఃఖిస్తూ, ఆ చేయి ఎండిపోయిన వానితో, “నీ చేయి చాపు” అని అన్నాడు. వాడు చేయి చాపాడు. వెంటనే అతని చేయి పూర్తిగా నయమైపోయింది. 6 ఆ తర్వాత పరిసయ్యులు బయటికి వెళ్ళి, హేరోదీయులతో కలిసి యేసును చంపాలని కుట్రపన్నటం మొదలు పెట్టారు.
© 1997 Bible League International