Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: దావీదు కీర్తన.
20 నీకు కష్టాలు కలిగినప్పుడు సహాయంకోసం నీవు చేసే ప్రార్థనకు యెహోవా నీకు జవాబు ఇచ్చును గాక.
యాకోబు దేవుడు నీ పేరును ప్రసిద్ధి చేయును గాక.[a]
2 దేవుడు తన పవిత్ర స్థలం నుండి నీకు సహాయం పంపించునుగాక.
సీయోను[b] నుండి ఆయన నిన్ను బలపర్చునుగాక!
3 నీవు అర్పించిన కానుకలు అన్నింటినీ దేవుడు జ్ఞాపకం చేసుకొనునుగాక.
నీ బలి అర్పణలు అన్నింటిని ఆయన స్వీకరించును గాక.
4 నీకు నిజంగా కావల్సిన వాటిని దేవుడు నీకు అనుగ్రహించును గాక.
నీ పథకాలన్నింటినీ ఆయన నెరవేర్చును గాక.
5 దేవుడు నీకు జయము నిచ్చినప్పుడు మనం సంతోషించుదుముగాక.
దేవుని నామమునకు స్తోత్రము కలుగును గాక.
నీవు అడిగినది అంతా యెహోవా నీకు అనుగ్రహించును గాక.
6 ఇప్పుడు, యెహోవా ఏర్పాటు చేసుకొన్న రాజుకు ఆయనే సహాయం చేస్తాడని నాకు తెలుసు.
దేవుడు తన పవిత్ర పరలోకంలో నుండి, ఆయన ఏర్పాటు చేసుకొన్న రాజుకు జవాబు ఇచ్చాడు.
ఆ రాజును రక్షించుటకు దేవుడు. తన మహత్తర శక్తిని ప్రయోగించాడు.
7 కొందరు మనుష్యులు వారి రథాలను నమ్ముకొంటారు. మరికొందరు వారి గుర్రాలను నమ్ముకొంటారు.
కాని మనం మన దేవుడైన యెహోవాను నమ్ముకొంటాము.
8 ఆ మనుష్యులు ఓడించబడ్డారు, వారు యుద్ధంలో మరణించారు.
కాని మనం గెలిచాము! మనం విజయులముగా నిలిచాము!
9 దేవుడు రాజును రక్షించును గాక!
మేము సహాయము కొరకు పిలుచునప్పుడు మాకు ఉత్తర మిమ్ము.
మేఘం—అగ్ని స్థంబాలు
15 పవిత్ర గుడారం (ఒడంబడిక గుడారం) నిలబెట్టిన రోజున ఒక మేఘం దానిమీద నిలిచింది. రాత్రి పూట ఆ మేఘం అగ్నిలా కనబడింది. 16 ఆ మేఘం రాత్రి అంతా పవిత్ర గుడారం మీదే నిలిచి ఉంది. 17 ఆ మేఘం పవిత్ర గుడారం మీద నుండి కదలినప్పుడు ఇశ్రాయేలీయులు దానిని వెంబడించారు. ఆ మేఘం ఆగిపోయినప్పుడు, అక్కడే ఇశ్రాయేలు ప్రజలు గుడారాలు వేసుకొన్నారు. 18 ఇశ్రాయేలు ప్రజలను ఈ విధంగా సాగిపొమ్మని యెహోవా ఆజ్ఞాపించాడు అలాగే వారు గుడారాలు వేసే స్థలం విషయంకూడా. ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఇదే. మేఘం పవిత్రగుడారం మీద నిలిచి ఉండగా, ప్రజలు ఆ చోటనే నివాసం కొనసాగించారు. 19 కొన్నిసార్లు చాలకాలంగా పవిత్ర గుడారంమీదనే ఆ మేఘం నిలిచిపోయేది. ఇశ్రాయేలీయులు యెహోవాకు విధేయులై ముందుకు కదల్లేదు. 20 కొన్నిసార్లు కొద్ది రోజులవరకు మాత్రమే మేఘం పవిత్ర గుడారంమీద నిలిచేది. ప్రజలు యెహోవా ఆజ్ఞకు విధేయులయ్యారు. మేఘం కదిలినప్పుడు వారు ఆ మేఘాన్ని వెంబడించారు. 21 కొన్నిసార్లు ఆ మేఘము రాత్రి మాత్రమే నిలిచి ఉండేది. ఆ మర్నాడు మేఘము కదలగానే, ప్రజలుకూడా వారి సామగ్రి కూర్చుకొని వెంబడించారు. పగలుకాని రాత్రికాని మేఘము కదిలితే అప్పుడు ప్రజలుకూడా బయల్దేరారు. 22 రెండు రోజులుకానీ, ఒక నెలకానీ, ఒక సంవత్సరంకానీ ఆ మేఘము పవిత్ర గుడారంమీద నిలిచిన ప్రజలు యెహోవాకు విధేయులవుతూనే ఉన్నారు. తర్వాత మేఘము తన స్థానంనుండి లేచి బయల్దేరితే, ప్రజలు కూడ బయల్దేరారు. 23 కనుక ప్రజలు యెహోవా ఆజ్ఞకు విధేయులయ్యారు. యెహోవా వారికి చూపించిన చోట వారు గుడారాలు వేసారు. మరల బయల్దేరమని యెహోవా ఆజ్ఞాపించగానే వారు బయల్దేరారు, మేఘాన్ని వెంబడించారు. యెహోవా ఆజ్ఞకు ప్రజలు లోబడ్డారు. ఇది మోషే ద్వారా ఆయన వారికి ఇచ్చిన ఆజ్ఞ.
యోహాను పరలోకాన్ని చూడటం
4 ఇది జరిగిన తర్వాత నేను కళ్ళెత్తి చూశాను. పరలోకంలో ఒక ద్వారం కనిపించింది. ఆ ద్వారము తెరుచుకొని ఉంది. బూర ఊదినట్లు యింతకు ముందు మాట్లాడిన స్వరం నాకు మళ్ళీ వినిపించింది. అది నాతో, “ఇలా మీదికి రా; దీని తర్వాత ఏమి జరుగుతుందో నీకు చూపిస్తాను” అని అంది. 2 నేను వెంటనే పరిశుద్ధాత్మ ఆధీనమయ్యాను. పరలోకంలో ఉన్న సింహాసనం నాముందు కనిపించింది. దాని మీద ఎవరో కూర్చొని ఉన్నారు. 3 దాని మీద కూర్చున్నవాడు సూర్యకాంతమణివలె, పద్మరాగమువలె వున్నాడు. ఆ సింహాసనం చుట్టూ మరకతమును పోలిన ఆకాశ ధనుస్సు ప్రకాశిస్తూ ఉంది.
4 దాని చుట్టూ యిరవై నాలుగు యితర సింహాసనాలు ఉన్నాయి. వాటి మీద యిరవై నాలుగు మంది పెద్దలు కూర్చొని ఉన్నారు. వాళ్ళు తెల్లని దుస్తులు ధరించి ఉన్నారు. వాళ్ళ తలలపై బంగారు కిరీటాలు ఉన్నాయి. 5 సింహాసనం నుండి మెరుపులువచ్చాయి. పెద్ద గర్జనలు ఉరుములు దాన్నుండి వినిపించాయి. ఆ సింహాసనం ముందు ఏడు దీపాలు దివ్యంగా వెలుగుతూ ఉన్నాయి. ఇవి దేవుని ఏడు ఆత్మలు. 6 గాజుతో కప్పిన సముద్రంలా కనిపించే ఒక గాజు సముద్రం ఆ సింహాసనం ముందు కనిపించింది. అది స్ఫటికంలా నిర్మలంగా ఉంది.
సింహాసనం మధ్య, చుట్టూ, అంటే ముందు, వెనుక నాలుగు ప్రాణులు ఉన్నాయి. వాటి దేహాలు ముందు, వెనుక కళ్ళతో కప్పబడి ఉన్నాయి. 7 మొదటి ప్రాణి ఒక సింహంలా, రెండవది ఒక ఎద్దులా, మూడవది ఒక మనిషి ముఖంలా, నాలుగవది ఎగిరే పెద్ద పక్షిలా ఉన్నాయి.[a] 8 ప్రతి ప్రాణికి ఆరు రెక్కలు ఉన్నాయి. వాటి శరీరాలపైన, క్రింద కళ్ళతో పూర్తిగా కప్పబడి ఉన్నాయి. రెక్కల క్రింద కళ్ళతో కప్పబడి ఉన్నాయి. రాత్రింబవళ్ళు అవి విడువక:
“భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉన్నవాడు, సర్వశక్తి సంపన్నుడును
ప్రభువునైన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు”
అని పాడుతూ ఉన్నాయి.
© 1997 Bible League International