Revised Common Lectionary (Complementary)
95 రండి, మనం యెహోవాను స్తుతించుదాము.
మన రక్షణ కొండైన ప్రభువుకు సంతోషగానం చేద్దాము.
2 యెహోవాకు మనం కృతజ్ఞతా కీర్తనలు పాడుదాము.
సంతోష గీతాలు మనం ఆయనకు పాడుదాము.
3 ఎందుకంటే ఆయన మహా గొప్ప దేవుడు గనుక.
ఆయన యితర “దేవుళ్లందరినీ” పాలించే మహా రాజు.
4 లోతైన గుహలు, ఎత్తయిన పర్వతాలు యెహోవాకు చెందుతాయి.
5 మహా సముద్రమూ ఆయనదే. ఆయనే దాన్ని సృష్టించాడు.
దేవుడు తన స్వహస్తాలతో పొడినేలను చేశాడు.
6 రండి, మనం సాగిలపడి ఆయనను ఆరాధించుదాము.
మనలను సృష్టించిన దేవున్ని మనం స్తుతిద్దాము.
7 ఆయన మన దేవుడు,
మనం ఆయన ప్రజలము.
మనం ఆయన స్వరం వింటే నేడు మనం ఆయన గొర్రెలము.
8 దేవుడు చెబుతున్నాడు, “మెరీబా[a] దగ్గర మీరు ఉన్నట్టుగా
అరణ్యంలో మస్సా దగ్గర మీరు ఉన్నట్టుగా మొండిగా ఉండకండి.
9 మీ పూర్వీకులు నన్ను శోధించారు. వారు నన్ను పరీక్షించారు.
కాని అప్పుడు నేను ఏమి చేయగలిగానో వారు చూశారు.
10 ఆ ప్రజలతో 40 సంవత్సరాలు నేను సహనంగా ఉన్నాను.
వారు నమ్మకస్థులు కారని నాకు తెలుసు.
ఆ ప్రజలు నా ఉపదేశాలు అనుసరించటానికి నిరాకరించారు.
11 అందుచేత నాకు కోపం వచ్చి,
‘వారు నా విశ్రాంతి దేశంలో ప్రవేశించరు అని ప్రమాణం చేశాను.’”
ఇశ్రాయేలుకు దావీదు రాజవటం
11 ఇశ్రాయేలు ప్రజానీకం హెబ్రోను పట్టణంలో దావీదు వద్దకు వెళ్లారు. వారు దావీదుతో ఇలా అన్నారు: “మేము నీ రక్త మాంసాలను పంచుకు పుట్టిన వాళ్లం (బంధువులం). 2 గతంలో మమ్మల్ని నీవు యుద్ధంలో నడిపించావు. సౌలు రాజుగా వున్నప్పటికీ మమ్మల్ని నడిపిన వాడవు నీవే! యెహోవా నీతో, ‘దావీదూ, ఇశ్రాయేలీయులైన నా ప్రజల కాపరివి నీవే. నా ప్రజలకు నీవు నాయకుడివవుతావు’ అని అన్నాడు.”
3 ఇశ్రాయేలు పెద్దలంతా హెబ్రోను పట్టణంలో దావీదు రాజువద్దకు వచ్చారు. యెహోవా సన్నిధిలో ఆ పెద్దలతో దావీదు ఒక ఒడంబడిక చేసుకొన్నాడు. పెద్దలు దావీదు తలమీద నూనె పోసి అభిషిక్తుని చేశారు. ఆ పని దావీదు ఇశ్రాయేలు రాజు అయినట్లు తెలుపుతుంది. ఇది జరుగుతుందని యెహోవా మాటయిచ్చాడు. ఈ వాగ్దానం యెహోవా సమూయేలు ద్వారా చేశాడు.
దావీదు యెరూషలేమును జయించటం
4 దావీదు, ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి యెరూషలేముకు వెళ్లారు. ఆ కాలంలో యెరూషలేము “యెబూసు” అని పిలువబడేది. ఆ నగరంలో నివసించే ప్రజలంతా యెబూసీయులనబడేవారు. ఆ నగరవాసులు 5 దావీదుతో, “నీవు మా నగర ప్రవేశం చేయకూడదు” అని అన్నారు. అయినప్పటికి దావీదు ఆ ప్రజలను ఓడించాడు. సీయోను కొండ[a] మీది కోటను దావీదు వశం చేసుకొన్నాడు. ఈ ప్రదేశమే దావీదు నగరమని పిలువబడింది.
6 “మీలో ఎవరు సైన్యాన్ని యెబూసీయుల మీదికి విజయవంతంగా నడిపిస్తారో అతడు నా సైన్యానికంతటికి ముఖ్య అధిపతి అవుతాడు” అని దావీదు ప్రకటించాడు. అది విని యోవాబు దండయాత్రకు నాయకత్వం వహించి నిర్వహించాడు. యోవాబు తండ్రిపేరు సెరూయా. యోవాబు సైన్యాధిపతయ్యాడు.
7 దావీదు తన నివాసం కోటలో ఏర్పరచుకొన్నాడు. అందువల్ల దానికి దావీదు నగరం అని పేరు వచ్చింది. 8 కోట చుట్టూ దావీదు నగరాన్ని నిర్మించాడు. మిల్లో[b] నుండి బయటి ప్రాకారం వరకు అతడు నగరాన్ని నిర్మించాడు. యోవాబు ఆ నగరంలో ఇతర ప్రాంతాలను అభివృద్ధి చేయించాడు. 9 రోజురోజుకు దావీదు గొప్పతనం పెరుగుతూ వచ్చింది. సైన్యాలకు అధిపతియైన యెహోవా దావీదుకు తోడైయున్నాడు.
13 పెద్దల్లో ఒకడు నాతో, “తెల్లటి దుస్తులు వేసుకొన్న వాళ్ళెవరు? ఎక్కడి నుండి వచ్చారు?” అని అడిగాడు.
14 “అయ్యా! మీకే తెలియాలి!” అని నేను సమాధానం చెప్పాను.
“మహా శ్రమలనుండి వచ్చినవాళ్ళు వీళ్ళే. తమ దుస్తుల్ని గొఱ్ఱెపిల్ల రక్తంలో ఉతికి శుభ్రం చేసుకొన్నారు. 15 అందువల్ల వాళ్ళు దేవుని సింహాసనం ముందున్నారు. రాత్రింబగళ్ళు ఆయన మందిరంలో ఉండి ఆయన సేవ చేస్తారు. ఆ సింహాసనంపై కూర్చొన్నవాడు వాళ్ళందరిపై తన గుడారం కప్పుతాడు. 16 వాళ్ళకిక మీదట ఆకలి కలుగదు. దాహం కలుగదు. సూర్యుడు తన ఎండతో వాళ్ళను మాడ్చడు. వాళ్ళకు ఏ వేడీ తగులదు. 17 సింహాసనంపై కూర్చొన్న గొఱ్ఱెపిల్ల వాళ్ళ కాపరిగా ఉంటాడు. ఆయన సజీవమైన నీటి ఊటల దగ్గరకు వాళ్ళను పిలుచుకు వెళతాడు. దేవుడు వాళ్ళ కళ్ళనుండి కారే ప్రతి కన్నీటి బొట్టును తుడిచి వేస్తాడు.”
© 1997 Bible League International