Revised Common Lectionary (Complementary)
పేతురు వాక్యోపదేశం
34-35 పేతురు ఇలా చెప్పటం మొదలు పెట్టాడు: “దేవుడు పక్షపాతం చూపడని, తానంటే భయభక్తులున్న వాళ్ళను, నిజాయితీ పరుల్ని వాళ్ళు ఏ దేశస్థులైనా అంగీకరిస్తాడని యిప్పుడు నాకు బాగా తెలిసింది. 36 ఈ సందేశాన్ని దేవుడు ఇశ్రాయేలు వంశీయులకు అందించాడు. దేవుడు మనకందరికి ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా శాంతి లభిస్తుందనే శుభవార్తను ప్రకటించాడు.
37 “యోహాను బోధించిన బాప్తిస్మమును ప్రజలు పొందాక గలిలయలో ఒక సంగతి ప్రారంభమైంది. ఆ సంగతిని గురించిన ప్రకటనలు యూదయ ప్రాంతం అంతా వ్యాపించాయి. ఇది మీకంతా తెలుసు. 38 నజరేతు నివాసి యేసును దేవుడు పవిత్రాత్మతో అభిషేకించాడు. అద్భుతమైన శక్తి యిచ్చాడు. దేవుడు ఆయనతో ఉండటం వల్ల యేసు ప్రజలకు మేలు చేస్తూ అన్ని ప్రాంతాలు పర్యటించాడు. సాతాను పీడవలన బాధపడ్తున్న వాళ్ళకు నయం చేసాడు. ఈ విషయాలన్నీ మీకు తెలుసు.
39 “యెరూషలేము, యూదయ దేశంలో ఉన్న మిగతా ప్రాంతాల్లో ఆయన చేసిన ప్రతి పనిని మేము కళ్ళారా చూసాము. వాళ్ళు ఆయన్ని మ్రానుతో చేసిన సిలువకు మేకులు కొట్టి చంపారు. 40 కాని మూడవ రోజున దేవుడు ఆయన్ని బ్రతికించాడు. ఆయన ప్రజలకు కనిపించాలని దేవుని ఉద్దేశ్యం. 41 అందరూ ఆయన్ని చూడలేదు. ఇదివరకే దేవుడు ఎన్నుకొన్న కొందరు మాత్రం చూసారు. మేమే ఆ సాక్షులం. ఆయన బ్రతికి వచ్చాక మేమంతా ఆయనతో కలిసి భోజనం చేసాం.
42 “ఆయన అందరికి న్యాయాధిపతి. అంటే బ్రతికి ఉన్నవాళ్ళకు, పునర్జీవం పొందనున్న వాళ్ళకు. ఈ పదవిని దేవుడు ఆయనకిచ్చాడు. దీన్ని గురించి ప్రజల ముందు సాక్ష్యం చెప్పమని, సువార్తను ప్రకటించమని ఆయన మాకు ఆజ్ఞాపించాడు. 43 యేసును నమ్మినవాళ్ళు తమ పాపాలకు ఆయన ద్వారా క్షమాపణ పొందుతారని ప్రవక్తలందరు చెప్పారు.”
తన సేవకులకు, దేవుని విందు
6 ఆ కాలంలో, సర్వశక్తిమంతుడైన యెహోవా ప్రజలందరికీ ఈ కొండ మీద విందు చేస్తాడు. ఆ విందులో శ్రేష్ఠమైన భోజనాలు, ద్రాక్షరసాలు ఉంటాయి. మాంసం లేతగా బాగుంటుంది.
7 కానీ ఇప్పుడు రాజ్యాలన్నింటినీ, ప్రజలనూ కప్పి వేసే ముసుగు ఉంది. ఈ ముసుగు “మరణం” అని పిలువబడుతుంది 8 కానీ మరణం శాశ్వతంగా నాశనం చేయబడుతుంది మరియు నా ప్రభువు యెహోవా ప్రతి ఒక్కరి చెంపల మీదా ప్రతీ కన్నీటి బొట్టునూ తుడిచి వేస్తాడు. గతంలో ఆయన ప్రజలు అందరూ విచారంగా ఉన్నారు. అయితే దేవుడు ఆ విచారాన్ని భూమి మీద నుండి తీసి వేస్తాడు. ఇలా జరుగుతుంది అని యెహోవా చెప్పాడు గనుక ఇదంతా జరుగుతుంది.
9 ఆ సమయంలో ప్రజలు అంటారు,
“ఇదిగో మన దేవుడు ఇక్కడ ఉన్నాడు.
మనం కనిపెడ్తున్నవాడు ఈయనే.
మనల్ని రక్షించటానికి ఈయన వచ్చాడు.
మనం మన యెహోవా కోసం కనిపెడుతున్నాం.
అందుచేత యెహోవా మనలను రక్షించినప్పుడు మనం ఆనందించి, సంతోషంగా ఉందాం.”
118 యెహోవా దేవుడు గనుక ఆయనకు కృతజ్ఞత తెలపండి.
నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది.
2 “నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది”
అని ఇశ్రాయేలూ, నీవు చెప్పుము.
14 యెహోవా నా బలం, నా విజయ గీతం!
యెహోవా నన్ను రక్షిస్తాడు!
15 మంచివాళ్ల ఇండ్లలో విజయ ఉత్సవం మీరు వినగలరు.
యెహోవా తన మహా శక్తిని మరల చూపించాడు.
16 యెహోవా చేతులు విజయంతో పైకి ఎత్తబడ్డాయి.
యెహోవా తన మహా శక్తిని మరల చూపించాడు.
17 నేను జీవిస్తాను! కాని మరణించను.
మరియు యెహోవా చేసిన వాటిని గూర్చి నేను చెబుతాను.
18 యెహోవా నన్ను శిక్షించాడు,
కాని ఆయన నన్ను చావనియ్య లేదు.
19 మంచి గుమ్మములారా, నా కోసం తెరచుకోండి,
నేను లోనికి వచ్చి యెహోవాను ఆరాధిస్తాను.
20 అవి యెహోవా గుమ్మాలు.
ఆ గుమ్మాలలో నుండి మంచివాళ్లు మాత్రమే వెళ్లగలరు.
21 యెహోవా, నా ప్రార్థనకు జవాబు ఇచ్చినందుకు నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
నన్ను రక్షించినందుకు నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
22 ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి
మూలరాయి అయ్యింది.
23 ఇలా జరుగునట్లు యెహోవా చేశాడు.
అది ఆశ్చర్యంగా ఉందని అనుకొంటున్నాము.
24 ఈ వేళ యెహోవా చేసిన రోజు.
ఈ వేళ మనం ఆనందించి సంతోషంగా ఉందాము!
క్రీస్తు బ్రతికి రావటం
15 సోదరులారా! నేను మీకు ప్రకటించిన సువార్తను విని దాన్ని సంపూర్ణంగా విశ్వసించారు. దాన్ని మీకు మళ్ళీ జ్ఞాపకం చెయ్యాలని నా ఉద్దేశ్యం. 2 నేను బోధించిన సువార్తను మీరు విడవకుండా అనుసరిస్తే అది మీకు రక్షణ కలిగిస్తుంది. లేనట్లయితే మీ విశ్వాసం వృధా అయిపోతుంది.
3 నేను పొందినదాన్ని మీకు మొదట అందించాను. లేఖనాల్లో వ్రాయబడిన విధంగా క్రీస్తు మన పాపాల నిమిత్తం మరణించాడు. 4 లేఖనాల్లో వ్రాయబడిన విధంగా ఆయన పాతిపెట్టబడి మూడవ రోజున బ్రతికింపబడ్డాడు. 5 పేతురుకు కనిపించాడు. ఆ తదుపరి పన్నెండు మందికి కనిపించాడు. 6 ఒకేసారి ఐదు వందల మందికి కనిపించాడు. వాళ్ళలో చాలా మంది ఇంకా జీవించివున్నారు. కొందరు మాత్రమే చనిపొయ్యారు. 7 ఆ తర్వాత ఆయన యాకోబుకు కనిపించాడు. అపొస్తలులందరికీ కనిపించాడు. 8 చివరకు అయోగ్యుడనైన నాకు కూడా కనిపించాడు.
9 ఎందుకంటే, అపొస్తలుల్లో నేను అధముణ్ణి. దేవుని సంఘాన్ని హింసించిన వాణ్ణి. కనుక అపొస్తలుడనని అనిపించుకోవటానికి కూడా అర్హుణ్ణి కాను. 10 కాని దేవుని దయవల్ల ఈ స్థాయిలో ఉన్నాను. ఆయన దయ వృథా కాలేదు. నేను వాళ్ళందరికన్నా కష్టించి పని చేసాను. ఇది నిజానికి నేను చెయ్యలేదు. దేవుని దయ నాతో ఈ పని చేయించింది. 11 నేను బోధించినా లేక వాళ్ళు బోధించినా మేమంతా ఒకటే బోధించాము. మీరు దాన్ని విశ్వసించారు.
పేతురు వాక్యోపదేశం
34-35 పేతురు ఇలా చెప్పటం మొదలు పెట్టాడు: “దేవుడు పక్షపాతం చూపడని, తానంటే భయభక్తులున్న వాళ్ళను, నిజాయితీ పరుల్ని వాళ్ళు ఏ దేశస్థులైనా అంగీకరిస్తాడని యిప్పుడు నాకు బాగా తెలిసింది. 36 ఈ సందేశాన్ని దేవుడు ఇశ్రాయేలు వంశీయులకు అందించాడు. దేవుడు మనకందరికి ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా శాంతి లభిస్తుందనే శుభవార్తను ప్రకటించాడు.
37 “యోహాను బోధించిన బాప్తిస్మమును ప్రజలు పొందాక గలిలయలో ఒక సంగతి ప్రారంభమైంది. ఆ సంగతిని గురించిన ప్రకటనలు యూదయ ప్రాంతం అంతా వ్యాపించాయి. ఇది మీకంతా తెలుసు. 38 నజరేతు నివాసి యేసును దేవుడు పవిత్రాత్మతో అభిషేకించాడు. అద్భుతమైన శక్తి యిచ్చాడు. దేవుడు ఆయనతో ఉండటం వల్ల యేసు ప్రజలకు మేలు చేస్తూ అన్ని ప్రాంతాలు పర్యటించాడు. సాతాను పీడవలన బాధపడ్తున్న వాళ్ళకు నయం చేసాడు. ఈ విషయాలన్నీ మీకు తెలుసు.
39 “యెరూషలేము, యూదయ దేశంలో ఉన్న మిగతా ప్రాంతాల్లో ఆయన చేసిన ప్రతి పనిని మేము కళ్ళారా చూసాము. వాళ్ళు ఆయన్ని మ్రానుతో చేసిన సిలువకు మేకులు కొట్టి చంపారు. 40 కాని మూడవ రోజున దేవుడు ఆయన్ని బ్రతికించాడు. ఆయన ప్రజలకు కనిపించాలని దేవుని ఉద్దేశ్యం. 41 అందరూ ఆయన్ని చూడలేదు. ఇదివరకే దేవుడు ఎన్నుకొన్న కొందరు మాత్రం చూసారు. మేమే ఆ సాక్షులం. ఆయన బ్రతికి వచ్చాక మేమంతా ఆయనతో కలిసి భోజనం చేసాం.
42 “ఆయన అందరికి న్యాయాధిపతి. అంటే బ్రతికి ఉన్నవాళ్ళకు, పునర్జీవం పొందనున్న వాళ్ళకు. ఈ పదవిని దేవుడు ఆయనకిచ్చాడు. దీన్ని గురించి ప్రజల ముందు సాక్ష్యం చెప్పమని, సువార్తను ప్రకటించమని ఆయన మాకు ఆజ్ఞాపించాడు. 43 యేసును నమ్మినవాళ్ళు తమ పాపాలకు ఆయన ద్వారా క్షమాపణ పొందుతారని ప్రవక్తలందరు చెప్పారు.”
యేసు బ్రతికి రావటం
(మత్తయి 28:1-10; మార్కు 16:1-8; లూకా 24:1-12)
20 ఆ రోజు ఆదివారం. “మగ్దలేనే” కు చెందిన మరియ చీకటి ఉండగా లేచి ఆ సమాధి దగ్గరకు వెళ్ళింది. దాని ద్వారానికి ఉన్న రాయి తీసి వేయబడి ఉండటం గమనించింది. 2 అందువల్ల ఆమె సీమోను పేతురు దగ్గరకు, యేసు ప్రేమించిన యింకొక శిష్యుని దగ్గరకు పరుగెత్తుకొంటూ వెళ్ళి, వాళ్ళతో, “ఎవరో ప్రభువును సమాధి నుండి తీసుకు వెళ్ళారు. ఎక్కడ ఉంచారో తెలియదు” అని అన్నది.
3 పేతురు, ఆ యింకొక శిష్యుడు సమాధి చూడటానికి బయలుదేరి వెళ్ళారు. 4 వాళ్ళు కలిసి పరుగెత్తుకుంటూ వెళ్లారు కాని, ఆ యింకొక శిష్యుడు పేతురు కన్నా ముందు పరుగెత్తి సమాధిని మొదట చేరుకున్నాడు. 5 అతడు తొంగి లోపల చూసాడు. అక్కడ పడివున్న నారబట్టలు అతనికి కనిపించాయి. కాని అతడు లోపలికి వెళ్ళలేదు.
6 అతని వెనుక వస్తున్న పేతురు వచ్చి సమాధిలోకి వెళ్ళాడు. అక్కడ పడి ఉన్న బట్టల్ని చూసాడు. 7 వాటినే కాక యేసు తల చుట్టూ చుట్టబడిన వస్త్రాన్ని కూడా చూసాడు. మడత పెట్టబడిన తల వస్త్రం నారబట్టలతో కాక వేరుగా ఉంచబడి ఉంది. 8 సమాధి దగ్గరకు ముందు వెళ్ళిన శిష్యుడు కూడా తర్వాత లోపలికి వెళ్ళాడు. ఆ దృశ్యం చూసి విశ్వసించాడు. 9 (యేసు బ్రతికి వస్తాడని లేఖనాల్లో వ్రాయబడిన విషయం వాళ్ళకు యింకా అర్థంకాలేదు.)
మగ్దలేనే మరియకు యేసు కనిపించటం
(మార్కు 16:9-11)
10 ఆ తర్వాత శిష్యులు తమ తమ యిండ్లకు వెళ్ళిపొయ్యారు. 11 కాని, మరియ సమాధి బయట దుఃఖిస్తూ నిలుచొని ఉంది. ఆమె దుఃఖం ఆగలేదు. సమాధిలోకి తొంగి చూసింది. 12 తెల్లటి దుస్తుల్లో ఉన్న యిద్దరు దేవదూతలు అక్కడ కూర్చొని ఉండటం ఆమె గమనించింది. యేసు దేహాన్ని ఉంచిన చోట ఒక దేవదూత తల వైపు, మరొక దేవదూత కాళ్ళ వైపు కూర్చొని ఉన్నారు.
13 వాళ్ళామెను, “ఎందుకు దఃఖిస్తున్నావమ్మా?” అని అడిగారు.
ఆమె, “వాళ్ళు నా ప్రభువును తీసుకు వెళ్ళారు. ఆయన్ని ఎక్కడ ఉంచారో నాకు తెలియదు” అని అన్నది. 14 అలా అన్నాక వెనక్కు తిరిగింది. అక్కడ యేసు నిలుచొని ఉండటం చూసింది. కాని ఆయనే “యేసు” అని ఆమె గుర్తించలేదు.
15 ఆయన, “ఎందుకు విలపిస్తున్నావమ్మా! ఎవరి కోసం చూస్తున్నావు?” అని అడిగాడు.
అతడొక తోటమాలి అనుకొని, “అయ్యా మీరాయన్ని ఎత్తుకుపోయి ఉంటే ఎక్కడ ఉంచారో చెప్పండి. నేను వెళ్ళి తెచ్చుకుంటాను” అని అన్నది.
16 యేసు ఆమెను “మరియా” అని పిలిచాడు.
ఆమె ఆయన వైపు చూసి హీబ్రూ భాషలో “రబ్బూనీ!” అని అన్నది. రబ్బూనీ అంటే బోధకుడు అని అర్థం.
17 యేసు, “నేనింకా తండ్రి దగ్గరకు వెళ్ళలేదు కనుక నన్ను తాకవద్దు. నా సోదరుల దగ్గరకు వెళ్ళి నాకు, మీకు తండ్రి, దేవుడు అయినటువంటివాని దగ్గరకు వెళ్తున్నానని చెప్పు” అని అన్నాడు.
18 మగ్దలేనే మరియ శిష్యుల దగ్గరకు వెళ్ళింది. తాను ప్రభువును చూసిన వార్త, ప్రభువు తనకు చెప్పిన సందేశము, వాళ్ళతో చెప్పింది.
యేసు బ్రతికి రావటం
(మత్తయి 28:1-8; లూకా 24:1-12; యోహాను 20:1-10)
16 విశ్రాంతి రోజు[a] ముగియగానే, మగ్దలేనే మరియ, యాకోబు తల్లి మరియ మరియు సలోమే యేసు దేహానికి పూయటానికి సుగంధ ద్రవ్యాలు కొన్నారు. 2 ఆదివారం ఉదయం సూర్యోదయం అవుతుండగా వాళ్ళు సమాధి దగ్గరకు వెళ్ళాలని బయలుదేరారు. 3 “ఇంతకూ సమాధికి అడ్డంగా ఉన్న రాయిని ఎవరు తీస్తారు?” అని పరస్పరం దారిలో మాట్లాడుకొన్నారు.
4 వాళ్ళు కళ్ళెత్తి సమాధి వైపు చూసారు. ఆ పెద్దరాయి దొర్లిపోయి ఉంది. 5 వాళ్ళు సమాధిలోకి ప్రవేశించారు. అక్కడ దానికి కుడి వైపు ఒక యువకుడు తెల్లటి దుస్తులు ధరించి ఉండటం చూసారు. వాళ్ళకు భయం వేసింది.
6 ఆ యువకుడు, “భయపడకండి, సిలువకు వేయబడిన నజరేతు యేసు కోసం చూస్తున్నారా? ఆయన యిక్కడ లేడు. ఆయన బ్రతికి వచ్చి వెళ్ళిపొయ్యాడు. ఆయన్ని పడుకోబెట్టిన స్థలం చూడండి. 7 కాని మీరు వెళ్ళి శిష్యులతో, ముఖ్యంగా పేతురుతో ఈ విధంగా చెప్పండి: ‘యేసు మీకు ముందే గలిలయకు వెళ్తున్నాడు. ఆయన ముందే చెప్పినట్లు, మీరు ఆయన్ని అక్కడ చూస్తారు.’”
8 ఆ స్త్రీలు దిగ్భ్రాంతి చెంది వణుకుతూ ఆ సమాధినుండి పరుగెత్తి పోయారు. భయంవల్ల వాళ్ళు ఎవరికీ ఏమీ చెప్పలేదు.[b]
© 1997 Bible League International