లూకా 24:1-12
Telugu Holy Bible: Easy-to-Read Version
యేసు బ్రతికి రావటం
(మత్తయి 28:1-10; మార్కు 16:1-8; యోహాను 20:1-10)
24 ఆదివారం తెల్లవారుఝామున ఆ స్త్రీలు తాము సిద్ధం చేసిన సుగంధ ద్రవ్యాలను తీసుకొని సమాధి దగ్గరకు వెళ్ళారు. 2 సమాధికి ఉన్న రాయి త్రోసి వేయబడి ఉండటం గమనించి లోపలికి వెళ్ళి చూసారు. 3 అక్కడ వాళ్ళకు యేసు ప్రభువు దేహం కనిపించ లేదు. 4 దీన్ని గురించి వాళ్ళింకా ఆశ్చర్యపడుతుండగా అకస్మాత్తుగా యిద్దరు వ్యక్తులు ప్రత్యక్షమై వాళ్ళ ప్రక్కన నిలుచున్నారు. వాళ్ళ దుస్తులు మెరుపువలె మెరుస్తూ ఉన్నాయి. 5 భయంతో ఆ స్త్రీలు ముఖాల్ని వంచుకొన్నారు.
ఆ దేవదూతలు, “మీరు బ్రతికి ఉన్నవాని కోసం చనిపోయిన వాళ్ళ మధ్య ఎందుకు వెతుకుతున్నారు? 6-7 ఆయన బ్రతికి, యిక్కడినుండి వెళ్లిపోయాడు. ఆయన మీతో కలిసి గలిలయలో ఉన్నప్పుడు, ‘మనుష్యకుమారుడు పాపాత్ములకు అప్పగింపబడాలి; సిలువ మీద చంపబడాలి. మూడవ రోజు బ్రతికి రావాలి!’ అని అన్న విషయం మీకు జ్ఞాపకం లేదా!” అని అన్నారు. 8 అప్పుడు వాళ్ళకు ఆయన మాటలు జ్ఞాపకం వచ్చాయి.
9-10 మగ్దలేనే మరియ, యోహాన్న, యాకోబుల తల్లి మరియ, మరియు మిగతా స్త్రీలు సమాధినుండి వెళ్ళి ఈ విషయాలు ఆ పదకొండుగురికి, మిగతా వాళ్ళకు చెప్పారు. 11 ఆ స్త్రీల మాటలకు అర్థం లేదనుకొని శిష్యులు వాళ్ళ మాటలు నమ్మలేదు. 12 అయినా పేతురు లేచి ఆ సమాధి దగ్గరకు పరుగెత్తాడు. లోనికి తొంగి చూసి, కట్టబడిన వస్త్రాలు అక్కడ పడివుండటం గమనించాడు. ఏమి జరిగి ఉంటుందా? అని ఆశ్చర్యపడ్తూ వెళ్ళిపోయాడు.
Read full chapter© 1997 Bible League International