Revised Common Lectionary (Complementary)
దావీదు కీర్తన.
35 యెహోవా, నా పోరాటాలు పోరాడుము
నా యుద్ధాలు పోరాడుము.
2 యెహోవా, కేడెము, డాలు పట్టుకొని,
లేచి, నాకు సహాయం చేయుము.
3 ఈటె, బరిసె తీసుకొని
నన్ను తరుముతున్న వారితో పోరాడుము.
“నేను నిన్ను రక్షిస్తాను” అని, యెహోవా, నా ఆత్మతో చెప్పుము,
4 కొందరు మనుష్యులు నన్ను చంపాలని చూస్తున్నారు.
ఆ ప్రజలు నిరాశచెంది, సిగ్గుపడేలా చేయుము.
వారు మళ్లుకొని పారిపోయేట్టు చేయుము.
ఆ మనుష్యులు నాకు హాని చేయాలని తలస్తున్నారు.
వారిని ఇబ్బంది పెట్టుము.
5 ఆ మనుష్యుల్ని గాలికి ఎగిరిపోయే పొట్టులా చేయుము.
యెహోవా దూత వారిని తరిమేలా చేయుము.
6 యెహోవా, వారి మార్గం చీకటిగాను, జారిపోయేటట్టుగాను చేయుము.
యెహోవా దూత వారిని తరుమును గాక!
7 నేనేమీ తప్పు చేయలేదు. కాని ఆ మనుష్యులు నన్ను ఉచ్చులో వేసి చంపాలని ప్రయత్నించారు.
నేను తప్పు ఏమీ చేయలేదు. కాని వారు నన్ను పట్టుకోవాలని ప్రయత్నించారు.
8 కనుక యెహోవా, ఆ మనుష్యులను వారి ఉచ్చులలోనే పడనిమ్ము.
వారి స్వంత ఉచ్చులలో వారినే తొట్రిల్లి పడనిమ్ము.
తెలియని ఆపద ఏదైనా వారిని పట్టుకోనిమ్ము.
9 అంతట నేను యెహోవాయందు ఆనందిస్తాను.
ఆయన నన్ను రక్షించినప్పుడు నేను సంతోషంగా ఉంటాను.
10 “యెహోవా, నీ వంటివాడు ఒక్కడూ లేడు.
యెహోవా, బలవంతుల నుండి పేదవారిని నీవు రక్షిస్తావు.
దోచుకొనువారినుండి నిస్సహాయులను పేదవారిని నీవు రక్షిస్తావు”
అని నా పూర్ణ వ్యక్తిత్వంతో నేను చెబుతాను.
బబులోనులో బంధీలకు ఉత్తరం
29 బబులోనులో బందీలుగా[a] వున్న యూదులకు యిర్మీయా ఒక లేఖ పంపాడు. బబులోనులో ఉంటున్న పెద్దలకు (నాయకులు), యాజకులకు, ప్రవక్తలకు, తదితర ప్రజలకు అతడు దానిని పంపాడు. వీరంతా నెబుకద్నెజరుచే యెరూషలేము నుండి బబులోనుకు తీసుకొని రాబడినవారే. 2 (రాజైన యెకోన్యా, రాణియగు అతని తల్లి, యూదా, యెరూషలేముల అధికారులు, నాయకులు, వడ్రంగులు, లోహపు పనివారు మొదలైన వారంతా యెరూషలేము నుండి తీసుకొని పోబడీన పిమ్మట ఈ లేఖ పంపబడింది) 3 బబులోనులోని రాజైన నెబుకద్నెజరు వద్దకు ఎల్యాశాను, గెమర్యా అనే వారిని యూదా రాజైన సిద్కియా పంపాడు. ఎల్యాశా అనువాడు షాఫాను కుమారుడు. యిర్మీయా తన లేఖను బబులోనుకు తీసుకొని వెళ్లటానికి వారిద్దరికీ ఇచ్చాడు. ఆ లేఖలో యిలా వ్రాయబడివుంది.
4 ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడు అయిన యోహోవా యెరూషలేము నుండి బబులోనుకు తాను బందీలుగా పంపిన ప్రజలందరి నుద్దేశించి ఈ విషయాలు చెపుతున్నాడు. 5 “మీరు ఇండ్లు కట్టుకొని వాటిలో నివసించండి. ఆ రాజ్యంలో స్థిరపడండీ. తోటలను పెంచి, మీరు పండించిన పండ్లను తినండి. 6 వివాహాలు చేసుకొని సంతానవంతులై వర్ధిల్లండి. మీ కుమారులకు కూడ వధువులను వెదకండి. మీ కుమార్తెలకు వివాహాది శుభకార్యాలు చేయండి. వారు కూడ తమ సంతానాన్ని అభివృద్ధి చేసుకొనే నిమిత్తం మీరలా చేయండి. మీ సంతానాన్ని విస్తరింపజేసి పెంచి బబులోనులో మీరు బాగా వ్యాపించండి. మీ సంఖ్యా బలం తగ్గిపోకూడదు. 7 నేను మిమ్ములను పంపిన నగరానికి మీరంతా మంచి పనులు చేయండి. మీరు నివసిస్తున్న నగర శ్రేయస్సుకు మీరు ప్రార్థనలు చేయండి. ఎందువల్లనంటే, ఆ నగరంలో శాంతి నెలకొంటే మీకూ శాంతి లభిస్తుంది.” 8 ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడు అయిన యెహోవా చెప్పేదేమనగా “మీ ప్రవక్తల, మంత్ర విద్యలు చేసే వారి యొక్క మోసంలో మీరు పడకండి. వారు కనిన కలలను మీరు వినవద్దు. 9 వారు అబద్ధాలను బోధిస్తున్నారు. వారు చెప్పే వర్తమానం నానుండి వచ్చినదేనని అంటున్నారు! కాని నేను పంపలేదు!” ఇదే యెహోవా వాక్కు.
10 యెహోవా ఇంకా ఇలా చెపుతున్నాడు: “బబులోను డెబ్బయి సంవత్సరాల పాటు బలమైన రాజ్యంగా ఉంటుంది. ఆ తరువాత బబులోనులో నివసిస్తున్న మీ వద్ధకు వస్తాను. మిమ్మల్ని తిరిగి యెరూషలేముకు తీసుకొని వస్తానని నేను మీకిచ్చిన నా మంచి వాగ్దానాన్ని నేను నెరవేర్చుతాను. 11 ఇది నేనెందుకు చెపుతున్నానంటే మీ అభివృద్ధి కొరకు వేసిన నా ప్రణాళికలన్నీ నాకు తెలుసు.” ఇది యెహోవా నుండి వచ్చిన సందేశం “మీ సంక్షేమం కొరకు నాకు ఎన్నోమంచి ఆలోచనలున్నాయి. మీకు కీడు చేయాలని నేనెన్నడూ ఆలోచించను. మీకు ఆశను, మంచి భవిష్యత్తును కలుగజేయటానికి వ్యూహరచన చేస్తాను. 12 అప్పుడు మీరు నా పేరున నన్ను పిలుస్తారు. మీరు నాదరి చేరి, నన్ను ప్రార్థిస్తారు. నేను మీ ప్రార్థన ఆలకిస్తాను. 13 మీరు నా కొరకు అన్వేషిస్తారు. మీరు మీ హృదయ పూర్వకంగా నా కొరకు వెదకితే, మీరు నన్ను కనుగొంటారు. 14 మీరు నన్ను కనుగొనేలా నేనే చేస్తాను.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది. “పైగా నేను మీకు బంధ విముక్తి కలుగజేసి తిరిగి తీసుకొని వస్తాను. నేనే మిమ్మల్ని ఈ స్థలం వదిలి పెట్టి పోయేలా వత్తిడి చేశాను. కాని మిమ్మల్ని ఏ దేశాలకు, ఏ ప్రాంతాలకు నేను పంపియున్నానో ఆయా ప్రాంతాలనుండి మిమ్మల్నందరినీ నేను తిరిగి కూడదీస్తాను.” ఇదే యెహోవా వాక్కు “మరియు మిమ్మల్ని ఈ ప్రదేశానికి తీసుకొని వస్తాను.”
యేసు ఒక మనుష్యుని దయ్యాలనుండి విడిపించటం
(మత్తయి 8:28-34; లూకా 8:26-39)
5 వాళ్ళు సముద్రం దాటి గెరాసేనుల ప్రాంతానికి వెళ్ళారు. 2 యేసు పడవ నుండి క్రిందికి దిగగానే దయ్యం పట్టిన వాడొకడు స్మశానం నుండి ఆయన దగ్గరకు వచ్చాడు. 3 వాడు స్మశానంలో నివసిస్తుండే వాడు. ఇనుప గొలుసులతో కట్టినా వాణ్ణి ఎవ్వరూ పట్టి ఉంచలేక పోయారు. 4 వాని చేతుల్ని, కాళ్ళను ఎన్నోసార్లు యినుప గొలుసులతో కట్టివేసే వాళ్ళు. కానివాడు ఆ గొలుసుల్ని తెంపి, కాళ్ళకు వేసిన యినుప కడ్డీలను విరిచి వేసేవాడు. వాణ్ణి అణచగలశక్తి ఎవ్వరికి లేదు. 5 వాడు స్మశానంలో సమాధుల దగ్గర, కొండల మీదా, రాత్రింబగళ్ళు బిగ్గరగా ఏడుస్తూ తిరుగుతూ ఉండేవాడు. రాళ్ళతో తన శరీరాన్ని గాయపరుచుకొనేవాడు.
6 వాడు యేసును దూరంనుండి చూసి పరుగెత్తి వెళ్ళి ఆయన ముందు మోకరిల్లాడు. 7 “యేసూ! మహోన్నతుడైన దేవుని కుమారుడా! మాజోలికి రావద్దయ్యా! మమ్మల్ని హింసించనని దేవుని మీద ప్రమాణంతో చెప్పండి” అని వాడు బిగ్గరగా అరుస్తూ ప్రాధేయ పడ్డాడు. 8 ఎందుకంటే ఒక్క క్షణం క్రితం యేసు వానితో, “ఓ! దయ్యమా! ఆ మనిషి నుండి బయటకు రా!” అని అన్నాడు.
9 యేసు వాణ్ణి, “నీ పేరేమి?” అని అడిగాడు.
“నా పేరు ‘పటాలం’.[a] మా గుంపు చాలా పెద్దది” అని ఆ మనిషి సమాధానం చెప్పాడు. 10 వానిలోని దయ్యాలు యేసుతో, తమను ఆ ప్రాంతం నుండి పంపివేయవద్దని దీనంగా ఎన్నోసార్లు వేడుకొన్నాయి.
11 ఆ కొండ ప్రక్కన ఒక పెద్ద పందుల గుంపు మేస్తూవుంది. 12 ఆ దయ్యాలు యేసుతో, “మమ్మల్ని ఆ పందుల్లోకి పంపండి. వాటిలో ప్రవేశించటానికి అనుమతివ్వండి” అని అన్నాయి. 13 యేసు వాటికి అనుమతి యిచ్చాడు. దయ్యాలు వాని నుండి వెలుపలికి వచ్చి పందుల్లోకి ప్రవేశించాయి. రెండువేల దాకా ఉన్న ఆ పందుల గుంపు వాలుగా ఉన్న కొండమీద నుండి వేగంగా పరుగెత్తుకొనిపోయి సరస్సున పడి మునిగిపొయ్యాయి.
14 ఆ పందుల్ని కాస్తున్న వాళ్ళు పారిపోయి పట్టణంలో, పల్లెప్రాంతాల్లో, ఈ సంఘటనను గురించి చెప్పారు. ప్రజలు జరిగినదాన్ని చూడాలని వచ్చారు. 15 వాళ్ళు యేసు దగ్గరకు వచ్చి అక్కడి దయ్యాల పటాలం పట్టినవాడు దుస్తులు వెసుకొని సక్రమమైన బుద్ధితో, కూర్చొని ఉండటం గమనించారు. వాళ్ళకు భయం వేసింది. 16 జరిగిన దాన్ని పూర్తిగా చూసిన వాళ్ళు, దయ్యాలు పట్టిన వానికి జరిగిన దాన్ని గురించి, పందుల్ని గురించి వాళ్ళకందరికి చెప్పారు. 17 వాళ్ళు యేసును తమ ప్రాంతాన్ని వదిలి వెళ్ళమని వేడుకొన్నారు.
18 యేసు పడవనెక్కుతుండగా దయ్యం పట్టిన వాడు వెంటవస్తానని బ్రతిమలాడాడు. 19 యేసు దానికి అంగీకరించలేదు. అతనితో, “ఇంటికి వెళ్ళి ప్రభువు నీకు ఎంత సహాయం చేశాడో, నీపై ఎంత కరుణ చూపాడో నీ కుటుంబం లోని వాళ్ళతో చెప్పు” అని అన్నాడు.
20 అతడు వెళ్ళి దెకపొలిలో[b] యేసు తనకోసం చేసినదంతా చెప్పాడు. అందరూ చాలా ఆశ్చర్యపడ్డారు.
© 1997 Bible League International